తిలక్ గారి ‘దేవుణ్ణి చూసిన మనిషి’

తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.

తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.

ఇప్పుడు వినబోయే కథ ‘దేవుణ్ణి చూసిన మనిషి’ – ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.

తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి, హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

ఈ పుస్తకం మీరు కోనేటందుకు కావలసిన వివరాలు , ఇదే వెబ్ పేజీ లో ఇవ్వటం జరిగింది.

కథ:

గవరయ్య పెళ్ళాం లేచిపోయిందన్న వార్త ఊరు ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకుముందు రోజునే చైనా ఇండియా సరిహద్దులలో దురాక్రమణ చేసిందనీ, యుద్ధం జరుగుతూన్నదనీ వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మరచిపోయారు కూడా. ఆడది లేచిపోవడంలోని విశిష్టతని ఈ వూరువారొక్కరే గుర్తించారా అనిపిస్తుంది. యింత తెలుగు దేశంలోనూ!

రోడ్ల కూడలిలో, కాఫీ హోటలులో (ఆవూళ్ళో ఒకటే వుంది) పొలంగట్లనీ, పంచాయితీ బిల్డింగ్ దగ్గరా పురుషులూ; పెరటి గోడల దగ్గరా, బావులూ, నీలాటి రేవుల దగ్గరా ఆడవాళ్ళూ ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వట్టి లేచిపోవడమే అయితే యింత సంచలనం కలిగించకపోను; అందులోనూ ఎందుకూ పనికిరాని ఎదురింటి అరుగుమీది మిషన్ కుట్టుపనివాడితో లేచిపోవడమే మరీ విడ్డూరంగా వుంది. ఇంతకన్న మరో ఏ పెద్దమనిషితో లేచిపోయినా యింత అప్రదిష్ట ఉండకపోనని వూళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువకులు గవరయ్య భార్య తమని నిష్కారణంగా అవమానించినట్టూ అన్యాయం చేసినట్టూ బాధపడ్డారు.

“వాడిలో ఏం చూసి లేచిపోయిందత్తా” అని మూడోసారి అడిగింది తన అత్తని ఒక పడుచు తన కుతూహలం ఆపుకోలేక.

“పోనీ నువ్వే వాడితో లేచి పోకపోయావూ నీకు తెలిసొచ్చును” అంది అత్తగారు విసుగుతో, కోపంతో.

“గవరయ్యకి బాగా శాస్త్రి అయింది” అని ఏకగ్రీవంగా ఆబాల గోపాలమూ తీర్మానించారు. 

గవరయ్యను చూసి జాలిపడినవాడూ సానుభూతి తెలిపినవాడూ ఒక్కడు లేడు.

గవరయ్య అంటే ఆ వూళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఎగుడుదిగుడుగా వుంటాడు. మొహంమీద స్ఫోటకం మచ్చలు, పెదాలు లావుగా

మోటుగా వుంటాయి. కనుబొమ్మలు గుబురుగా గొంగళీ పురుగులు అతికించినట్లు వుంటాయి. ఊరికి శివారున వున్న పెద్ద పెంకుటింటి లోగిలిలో గవరయ్య వుంటాడు.

“నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని” అన్నాడు కన్నులరమూసి అవధాని. అవధాని ఆ వూళ్ళో ధర్మకర్త.

మునసబు చలపతి, కరణం నరసింహమూ తల వూపారు. దాంతో మరికాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యంలాంటి పై వాక్యానికీ వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త.

“వేణుగోపాలస్వామి వూరికే పోనిస్తాడా? ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇంక ఈ రెండో ఆవిడ చావుకన్న ఘోరమైన పని చేసి వూరుకుంది. ఒక్క ధర్మకార్యం చేశాడా? ఒక్క మంచిమాట చెవిని పెట్టాడా?”

మున్సబు చలపతి చేతికర్రను నేలమీద తాటించి అన్నాడు “ఒక్కరిని దగ్గరకు రానిచ్చాడా? కర్కోటకుడండీ యీ గురవయ్య. ఎంత అహం, ఎంత పొగరు….”

“పాపపు సొమ్మండీ పాపిష్టి ఆర్జితం! దాని ఫలితం వూరికే పోతుందా? మొన్న కుర్రాళ్ళందరూ వెళ్ళి భజన చందాకి ఒక్క రూపాయి _ ఒబ్బు రూపాయి యిమ్మంటే తరిమి కొట్టాడుట…” అన్నాడు కరణం.

గవరయ్య యిరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళవాడు ఈ వూరొచ్చాడు. ఈ వూళ్ళో అతనికో మేనత్త వుంది. తల్లీ తండ్రి లేని అతను యీ మేనత్త దగ్గరకు వచ్చిపడ్డాడు. వస్తూనే కొంత డబ్బుకూడా తీసుకుని వచ్చాడు. ఈ వూరికి రెండు మైళ్ళ దూరంలోనే టౌను వుంది. రోజూ ఉదయమే టౌన్ కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగొచ్చేవాడు. కొన్నాళ్ళకి తోళ్ళ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ “హరీ హరీ” అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో యిది చాలా పాపమనీ బెడిసికొడుతూందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ మాట్లాడలేదు. కొందరు చొరవచేసి గవరయ్యతో జంతు చర్మ విక్రయం మంచిది కాదని చెప్పారు.

“జంతువులేం ఖర్మ మనుషుల తోలునే అమ్ముతాను. మరీ పల్చన కాబట్టి పనికి రాదు కాని” అని సమాధానమిచ్చాడట గవరయ్య.

గవరయ్య ఒంటెత్తుమనిషి. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. అసలు గవరయ్య నవ్వడం ఎవరూ చూడలేదు. అదేకాక గవరయ్యకి “పాపం” ‘పుణ్యం” అని భేదాలు వున్నట్టు కూడా తెలియదు.

ఈ యిరవై ఏళ్ళలోనూ అతను లక్ష రూపాయలకి పైగా సంపాదించాడని ప్రతీతి. ఊళ్ళో పెద్దలు – ఉదారులూ ధర్మపరులూ కాబట్టి, అతని పాప వ్యాపారాన్ని క్షమించి అతని శ్రేయస్సు కోరి అతని ఆముష్మిక సుఖం కోసం దానధర్మాలు చేయమనీ, గుడి మండపం కట్టించమనీ, పాఠశాల బిల్డింగ్ కి చందా యిమ్మనమనీ, సప్తాహాలు చేయించమనీ చెవిలో యిల్లు కట్టుకుని చెప్పారు.

గవరయ్య గుండ్రంగా లోతుగా వున్న కళ్ళని కుంచించి మోటైన పెదాలమధ్య చుట్టని నొక్కి పెట్టి, విసుగ్గా, విసురుగా “నేనొక్క కానీ యివ్వను, పోయి మీ అబ్బతో చెప్పుకోండి” అనేవాడు. మంచి లేదు, మర్యాదా లేదు వీడికి అనుకున్నారు వాళ్ళందరూ పరోక్షంగా. అతనికి లక్ష రూపాయలుండడంవల్ల అతని ఎదురుగా అలా అనలేదు. వాళ్ళు సహజంగా జ్ఞానులు కాబట్టి.

గవరయ్య మేనత్తగారింటికి చేరిన కొద్ది రోజులలోనే మొదటి భార్యను తీసుకొచ్చాడు. ఆ భార్య నెక్కడికీ పంపేవాడు కాడు. పొరుగిళ్ళకు కూడా వెళ్ళేది కాదు. మేనత్తా, భార్యా, గవరయ్యా – ముగ్గురూ మూడు దెయ్యాలలా వుండేవారు. ఒక పుకారు కూడా వూళ్ళో వుండేది. గవరయ్య పెళ్ళాన్ని ఏదో భూతం ఆవహిస్తూంటుందనీ,

ఊళ్లో ఎవరికి తెలియకుండా అందరూ నిద్రపోయే అర్ధరాత్రివేళ భూతవైద్యుడెవడో వచ్చి ప్రయోగాలు చేస్తాడనీ ధూపాలు వేస్తాడనీ చెప్పుకుంటూంటారు. ఇంత వంటరిగా సంఘ జీవితంలో కలవకుండా వీళ్ళెలా వుంటున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కొంతకాలానికి గవరయ్య పుట్టిన వూరునుండి వచ్చానని చెప్పుకుంటూ కొన్నాళ్ళు ఆ వూరిలో ఒక గాజుల వర్తకుడు తిరుగుతుండేవాడు. అతడు గవరయ్యను గురించిన భోగట్టా అందజేశారు.

గవరయ్య తండ్రి చాలా దుర్మార్గుడట. జూదమూ, తాగుడూ రెండింటినీ సమపాళంగా అభ్యసించి ప్రాక్టీసు చేశాడుట. తల్లి రోగిష్టిదై మంచాన పడి ఉండేది. అందువలన గవరయ్య తండ్రి పొరుగూళ్లో ఒకావిడని వుంచుకొన్నాట్ట. గవరయ్య చిన్నతనంలో తల్లి సంరక్షణ ఏమీ ఎరగనివాడు. తండ్రికున్న చెడ్డపేరువలన గవరయ్యతో ఎవరూ కలిసేవారు కాదు.

ఆఖరికి ఆ వూరి బళ్ళో కూడా చేరనివ్వలేదు. ఆ స్కూలు స్థాపించినాయన అక్కడ పేరొందిన భూస్వామి. ఆ భూస్వామితో గవరయ్య తండ్రికి ఎడతెగని వైరం. భూస్వామి పలుకుబడీ దైవభక్తి వున్నవాడు. ప్రతిఏటా సుబ్బరాయుడి షష్టి ఉత్సవాలూ అన్న సంతర్పణా చేయించేవాడు. గవరయ్య తండ్రి రౌడీ ముఠాతో చేరి ఆ వుత్సవాలలో గలభా చేయించేవాడు. ఒకానొక ప్రాణావసర సమయంలో గవరయ్య తండ్రి చేత యిచ్చిన దానికన్న రెండు రెట్లుకి తనఖా వ్రాయించుకొని వున్న భూమి కాస్తా అన్యాయంగా కాజేశాడని గవరయ్య తండ్రి ఆరోపణ.

కాని వూళ్లో పెద్దలు ఒక రౌడీ మాటల్ని నమ్మేటంత అవివేకులు కారు. అదే కాక వాళ్ళు చాటుమాటుగా వడ్డీ వ్యాపారం ఆ భూస్వామి పద్ధతిమీదే చేస్తున్నారు కాబట్టి పెద్దమనిషీ పరమ భక్తుడూ అయిన భూస్వామి యిలాంటి అక్రమం చేస్తాడని కలలో కూడా ప్రజాస్వామ్యం నమ్మదలచుకోలేదు.

గవరయ్య ఒంటరితనాన్ని చూసి బాధపడి తండ్రి ఒక కుక్క పిల్లనీ, రెండు పిల్లిపిల్లల్నీ తెచ్చి యిచ్చి వాటితో ఆడుకోమనేవాడు. “మనుషుల కంటె యివే నయం” అనేవాడు రోగిష్టి అయిన భార్యతో.

గవరయ్య బాల్యమంతా కుక్కలతో, చెట్లతో, గోడలతో ఆడుకుంటూ గడిపాడు. కొన్నాళ్ళకి రోగిష్టి తల్లి చచ్చిపోయింది. ఆమె చనిపోవడంతో గవరయ్య తండ్రి దుండగా లెక్కువైపోయాయి. గవరయ్య తండ్రికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమె జబ్బుకోసం చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడీమెకు చివరి రోజుల్లో వైద్యసహాయం చేయించలేక పోవడం భూస్వామి అక్రమం వల్లనేనని ఆలోచించిన గవరయ్య తండ్రి మరీ పెట్రేగిపోయాడు. భూస్వామి పాలేరు పొలంలోంచి వస్తూండగా ఎవరో వాడి తల రెండు చెక్కలయ్యేట్టు యినుపకడ్డీతో కొట్టారు.

భూస్వామి తన అనుమానమంతా గవరయ్య తండ్రి మీద ఉందన్నాడు. గవరయ్య తండ్రిని అరెస్టు చేశారు. కేసు మోపారు. ఊళ్ళో అందరూ బలమైన సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు స్వయంగా చూసినా చూడకపోయినా, భక్తిపరుడైన భూస్వామి ఆజ్ఞల్ని దైవాజ్ఞగా శిరసావహించారు. గవరయ్య తండ్రికి యావజ్జీవశిక్ష పడింది.

తండ్రి ఆఖరిమాటగా కొడుకుతో ‘ఎవర్నీ నమ్మకు. నీ కాళ్ళమీద నువ్వు నుంచో, ఈ మనుషులందరూ దొంగ వెధవలు, విషసర్పాలు’ అని చెప్పి మరీ పోలీసులతో వెళ్ళాడు.

తల్లిలేని, తండ్రిలేని గవరయ్య ఆ యింట్లో బెంబేలెత్తిపోయాడు. బెంగతో రెండు రోజులు తిండి తిప్పలు లేక యింట్లో మూలగా కూర్చుని పధ్నాలుగేళ్ళ గవరయ్య హోరుమని ఏడ్చాడు. ఎవరూ ఆ ఛాయలకి రాలేదు. పలకరించలేదు. రౌడీ, హంతకుడూ అయిన తండ్రి దుర్గుణాలు వీడికి సంక్రమించి ఉంటాయనీ, వీడెకెంత దూరంలో వుంటే అంత మంచిదని ఆ వూళ్ళో మంచివాళ్ళందరూ అనుకున్నారు కాబోలు. గవరయ్యకి జ్వరం వచ్చింది. మందులేదు, మాకులేదు. జ్వరం స్ఫోటకంలోకి మారింది. ఆ యింట్లోంచి రాత్రుళ్ళు “అమ్మా చచ్చిపోతున్నానేవ్’ అనే కేకలు వినవచ్చేవి భయంకరంగా దీనంగా.

మశూచి అని తెలియగానే ఆ పొలిమేరలలో కూడా జనం నడవటం మానివేశారు.

“ఈ కొడుకు కూడా పోతే వూరికి పీడా వదలిపోతుం” దన్నారు కొందరు.

ఇలా వుండగా ఒక రోజు సాయంత్రం ఒక గుర్రబ్బండీ గవరయ్య ఇంటిముందాగింది. దానిలోనుంచి నలభై ఏళ్ళ స్త్రీ దిగింది. ఒంటినిండా నగలున్నాయి. మనిషి బలంగా పొడుగ్గా వుంది. చెంపలదగ్గరైనా జుట్టు నెరవలేదు. ఆ వీధి వీధంతా వింతగా ఆమెకేసి చూస్తూ నించున్నారు. కాని ఆమె పక్కకి కూడా చూడకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయింది. నౌకరు పెట్టెలన్నిటినీ లోపల పెట్టి తలుపులు దభాల్న వేసేశాడు.

నౌకరు ద్వారా ఆమె గవరయ్య తండ్రికి యిలాకా ఉన్న ఆవిడనీ, ఆరునెలలు పుణ్యక్షేత్రాలు సేవించి రెండు రోజుల క్రితమే తిరిగి వచ్చిందనీ, గవరయ్య తండ్రికి యావజ్జీవశిక్ష పడడమూ కొడుకు దిక్కులేని వాడై ఉండడమూ తెలిసి యెకాయెకిని సామాన్లు పట్టించుకుని ఆ వూరు వచ్చేసిందని తెలిసింది. అంతే, నాటినుండీ గవరయ్య ఆమె సంరక్షణలో పెరిగాడు. జబ్బునుంచి కోలుకున్న గవరయ్య మరీ వికృతంగా వున్నా ఆమె లక్ష్యం చేయలేదు. తండ్రితో సంబంధమున్నంత మాత్రాన ఈ చాతకాని వికారపు కొడుకు బాధ్యత తీసుకోవడంలోని అవివేకాన్ని ఒకరిద్దరు చొరవగల స్త్రీలు ఆమెకి చెప్పిచూశారు. కానీ ఎవర్నీ లక్ష్యం చేయని గుణం ఆమెలో వుంది. కొన్నాళ్ళకి ఒక పిల్లని వెతికి తెచ్చి గవరయ్యకి పెళ్ళి చేసింది. గవరయ్య ఇరవయ్యోయేట ఆమె మరణించే ముందు గవరయ్యకి తన నగలూ, పదివేల రూపాయల నగదూ యిచ్చివేసింది.

తర్వాత అతనీ వూరిలో మేనత్త ఇంటికి రావడం, తోళ్ళ వ్యాపారం చేయడమూ, ఏడెనిమిదేళ్ళకు మొదటి భార్య పోవడమూ ఊళ్ళో అందరికీ తెలిసినదే. ఈ చరిత్ర అంతా గాజుల వర్తకుడి ముఖతః విన్న తర్వాత గవరయ్య అంటే ఉన్న వాళ్ళ అసహ్యభావం యీసారి తార్కికమైన ఆధారంతో మరింత గట్టిపడింది. తండ్రి దుర్మార్గుడు, హంతకుడు, వీడు చిన్నతనం నుండి పిల్లులతో కుక్కలతో కలిసి జంతు లక్షణాలు అలవరచుకున్నాడు. పైగా వీడి పెంపకం ఒక చెడిన స్త్రీ చేత, ఇంతటి అమానుషుడు వచ్చీ వచ్చి తమ వూళ్ళో పడ్డాడనే బాధ ఒక వైపున పీడించింది నలుగుర్నీ.

అయినా అవధాని మొదలైన పెద్దలు మొదట నిరాశ చెందలేదు గవరయ్య దుర్మార్గుడు నిజమే. వికృత రూపుడు _ అదీ నిజమే _ పిసినిగొట్టు, ఎవరికీ కానీ రాల్చడు – ఒప్పుకున్నాం – ఒంటెత్తు మనిషి, సభ్యత లేనివాడు. అందరికీ తెలుసును; అయితేనేం ధవవంతుడు. ఆ ధనాన్ని సత్కార్యాలకు ఉపయోగించేటట్టు చేస్తే అతనికీ, పెద్దలకీ ముక్తి వుంది. ఇంత ఉదారాశయంతో ఎన్నోవిధాల ఎన్నోసార్లు గవరయ్యని కదిపి చూశారు. వేణుగోపాలస్వామి ఉత్సవాలన్నారు. మండపం కట్టించాలన్నారు. ఒకవైపు ఒరిగిన ప్రాకారం బాగుచేయించా లన్నారు. దేనికీ గవరయ్య లొంగిరాలేదు. చివరికి గుళ్ళోకివచ్చిదైవ దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోమన్నారు. అది ఖర్చులేని పని. ఎప్పటికైనా గవరయ్య రాతిగుండెలలో భక్తి విత్తనం నాటుకుంటుందని వాళ్ళ ఆశ. కాని ఏనాడు గవరయ్య గుడి చాయలకి కూడా రాలేదు.

ఒక తోటివాడు నాస్తికుడై పాపియై పోతూంటే ఊరుకోలేని మంచితనం వలన, కార్యదీక్షవలన ఊరిపెద్ద లతని మీద బహిష్కరణాస్త్రం ప్రయోగించారు.

కానీ అదేమి పనిచేయలేదు. ఎందుకంటే గవరయ్య ఊరినే బహిష్కరించాడు మొదటినుండీ. చాకలీ, కోమటీ, మంగలీ అతనికి చాటుచాటుగా వాళ్ళ వాళ్ళ సేవలందించడం మానలేదు కూడా. నిక్కచ్చిగా వాళ్ళందరికీ జీతాలిస్తాడేమో గవరయ్య బేరాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళెవరూ ఇష్టపడలేదు.

మొదటి భార్య కాలుజారి నూతిలోపడి మరణించినప్పుడు అవధానీ తదితరులూ గవరయ్యని పరామర్శించారు. ఇదంతా కర్మఫలితమనీ, యిప్పటికేనామేలుకోమని హెచ్చరించారు. కాని గవరయ్య ఖాతరు చేయలేదు. పైగా ఏడాదిలో తనకన్న పదిహేనేళ్ళు చిన్నదైన ఒక పిల్లను పెళ్ళి చేసుకుని యింటికి తీసుకొచ్చాడు. ఆ పిల్ల అందం ఎటున్నా ఫ్యాషన్ గా అలంకరించుకునేది. ఆమెని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసేవాడని గవరయ్యని గురించి అనుకునేవారు. అయితే ఆమె అయినా ఇల్లుదాటి యీవలికి వచ్చేది కాదు. ఎవరేనా కుతూహలం కొలదీ వెళ్ళి పలకరిస్తే కబుర్లు సరదాగా చెప్పేది. ఎవరైనా గవరయ్య రూపాన్ని గురించిగాని, వయస్సు గురించిగాని వ్యంగ్యంగా హేళనచేస్తే “ఆయన చాలా మంచివారు” అనేదిట. నాలుగు రోజుల కొకసారి ప్రక్క టౌన్ కి బండి మీద వెళ్ళి సినిమా చూసి వచ్చేదిట. గవరయ్య తన నిబంధనల్ని ఈ భార్య విషయంలో సడలించాడని ఆశ్చర్యపోయారు. కానీ ఆ సడలింపు కూడా కొంతవరకే. ఆ యింటిలో వున్నవాళ్ళు అలాగ మనుషులకి, వూళ్ళో జరిగే సంఘటనలకి దూరంగా వుండవలసిందే.

ఎదురింటి అరుగుమీద వున్న మిషన్ కుట్టువాడితో యీమెకి లేచిపోవడందాకా యింత చనువు ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు. కాని ఈ దుస్సంఘటనతో మున్సబూ, కరణమూ, తదితరులూ మహదానందం పొందారు. కటికి చీకట్లో వాళ్ళకి మళ్ళీ ఆశాకిరణం గోచరించింది. ఇనుం వేడెక్కినప్పుడేసాగగొట్టాలన్నారు. నలుగురూ కలసి ఒక రోజున గవరయ్య యింటికి వెళ్ళారు. ఇల్లు చాలా పెద్దది. మండువాలోగిలి, ఇంటిచుట్టూ పెద్దదొడ్డి; వెనకాల గడ్డివామూ, దూడల పాకా, చెట్లు, చేమలూ వున్నాయి. ఆపైన యింకేమీ ఇళ్ళు లేవు. అన్నీ పొలాలే, మేనత్త వున్న చిన్న లోగిలిని క్రమ క్రమంగా పెంచే యింత యింటిని చేశాడు గవరయ్య.

ఆ ఇల్లు అన్ని ఇళ్ళలా వుండదు. కలకల లాడుతున్నట్టు వుండదు. ఏదో భయంకరమైన ఏకాంతం ఆ ఇంట్లో పేరుకున్నట్టు వుంటుంది.

రాత్రిళ్ళు దెయ్యాలు గదిలోంచి గదిలోకి వంకర కాళ్ళతో తిరిగి తిరిగి పగటివేళ అటకమీదా, చూరు మూలల్లోను దాక్కున్నట్టు వుంటుంది. పలుకుబడీ, స్తోమతూ సహజంగా ధైర్యమూ వున్న ఆ నలుగురికి ఆ ఇంట్లో అడుగు పెడుతూంటే కొంచెం బెదురుగా వుందన్న మాట నిజం.

గోడకు చేరబడి కళ్ళు మూసుకుని వున్నాడు గవరయ్య. బనీనులోంచి అతని బలిష్టమైన రొమ్మూ , కండలూ మశూచికపు గుంటలతో గాట్లు తిన్న తుమ్మబాదుల్లా వున్నాయి. అడుగులు చప్పుడు విని కళ్ళు తెరచి చూశాడు. కళ్ళు ఎర్రజీరలతో తాగినవాడి కళ్ళలా వున్నాయి. అవధానీ, మున్సబూ, కరణమూ, మరొక పెద్దమనిషీ తేరి చూస్తున్న గవరయ్యకి దగ్గరగా వున్న బల్లమీద కూర్చున్నారు. గవరయ్య యేమన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూశాడు.

“నీకు రావలసిన కష్టం కాదోయ్ గవరయ్యా. నిమ్మకు నీరోసినట్టు వుండే స్వభావం నీది. ఒకరిజోలీ కొంఠీ అక్కర్లేదు. విషయం తెలియగానే ‘అరే! పాపం’ అని మనస్సు కొట్టుకులాడి పోయిందంటే నమ్ము” అన్నాడు కరణం.

గవరయ్య మాట్లాడలేదు. అలాగే చూస్తున్నాడు.

పన్నులు కట్టడంలో కానీ, పాలేళ్ళకి జీతాలివ్వడంలో కానీ _ తన ధర్మం తాను టైముకి నెరవేర్చుకునేవాడు. ఒకరి సొమ్ము ఎప్పుడూ తన దగ్గర వుంచుకోలేదు. సుబ్బయ్యగాడికి సాలు తిరక్కముందే ధాన్యం కొలిచి యిచ్చేశాట్ట గవరయ్య. “వాడు తెగ చెప్పుకోవడమే __మా కామందు మహదొడ్డమనిషీ అని…” అన్నాడు మున్సబు,

గవరయ్య అలాగే చూస్తున్నాడు. అతను వీరి మాటలు వింటున్నాడో లేదో తెలియదు.

“కాని ఒక్కమాట గవరయ్య బాబూ!” మందంగా, గంభీరంగా, అందులోనే ఒక విశేషమైన దయా, మృదుత్వాన్నీ కలిపి వాచా చమత్కారియైన అవధాని ధర్మకర్తృత్వపు హోదాతో పలికాడు. “భగవంతుడి ఆసరా లేకుండా ఎటువంటివాడూ యీ సంసార సాగరాన్ని సుఖంగా దాటలేడనుకో. నువ్వా ఉత్తముడివి. ముక్కుకి సూటిగా పోయేవాడివి. అయితేనేం; నీ వ్యాపారం వుంది చూడు _ అది కేవలం ధర్మవిరుద్ధమని శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. అయితే కలియుగంలో కొన్ని మినహాయింపులు చేశారు మనుషులు. అందుకని ఫరవాలేదు. కాని ఒక్కటి చెప్పారు _ ఏమైనా ఆ భగవంతుని స్మరించడం మానకుండావుంటే అన్ని కష్టాలూ మంచులా విడిపోతాయి. ఫలం, పుష్పం, పత్రం, తోయమ్ _ అన్నారు _ భగవానుడు అల్పసంతోషి….”

క్రమంగా అందరి మొహాలలోనూ విజయాన్ని సూచించే నవ్వు అలముకొంది. ఎప్పుడూ కసురుకొని విసుక్కునే గవరయ్య యీ వేళ మౌనంగా వున్నాడు. అభేద్య మనుకున్న కోట గోడకు పగులు ఏర్పడింది. ఇంక మెల్లమెల్లగా గవరయ్యని మార్చివేయవచ్చుననే భావం వారిలో ఏర్పడింది. అందరూ లేచారు, వెళ్ళివస్తామన్నారు. కాని గవరయ్య అలాగే శిలాప్రతిమలా కళ్ళప్పచెప్పి చూస్తూ కూర్చున్నాడు.

ఒక ఏడాది గడిచింది. అప్పుడప్పుడు కరణము, మున్సబూ వగైరాలు గవరయ్య ఇంటికి వచ్చి పోతున్నారు. గవరయ్యని దైవ దర్శనానికని, హరికథకనీ, మరొకటని చెప్పి పిలుచుకు వెళుతున్నారు. ఊళ్ళోవాళ్ళూ కూడా గవరయ్య వీధిలో వెళుతూంటే నమస్కారాలు పెడుతున్నారు. గవరయ్య మాత్రం ఏమీ మాట్లాడడు. మంత్రించిన వాడిలా ఆ దేవాలయంలో కానీ, హరికథలో కానీ కూచుంటాడు. సగంలో ఒక్కొక్కసారి చటుక్కున లేచి వెళ్ళిపోతాడు.

పెద్దలు తలపంకించి ‘రాక్షసముండాకొడుకు, ఒక్కరోజులో మారతాడా’ అనేవారు.

“మారకేం చేస్తాడు? సంఘాన్నీ, ధర్మాన్ని కాదని ఎక్కడికి పోతాడోయ్ వీడు” అనేవాడు అవధాని.

వేణుగోపాలస్వామి గుడి ప్రాకారం పూర్తిగా పడిపోయేటట్టు వుంది. ఇంక జాగుచేస్తే లాభం లేదనుకున్నారు వూళ్ళో పెద్దలు. పాతిక వేలైనా వుంటేగాని యీ పని జరగదు. అంత మొత్తాన్ని ఒక్క గవరయ్య తప్ప యివ్వగలిగినవాడు మరొకడు లేడన్నారు. ఈ యేడాదిలోనూ గవరయ్య చాలా లాభాలు సంపాదించాడు. తోళ్ళ వ్యాపారం అలా వుండగా, పట్టణంలో నూనెమిల్లులో ముప్పాతికవాటా కొన్నాడు. ఒక్క వేరుశనగ నూనెలోనే ఒక లకారం వచ్చిందని వూరంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఈ అభివృద్ధికి కారణం అతనిలో పొడచూపిన దైవభక్తి అనివాళ్ళనుకోవడమే కాకుండా అతడు ఏమరిపోతాడేమోనని అతనివద్ద మరిమరీ పనికట్టుకు చెప్పేవారు. ఒక మంచి రోజున మున్సబూ, కరణమూ, ధర్మకర్తా యింకా వూళ్ళో మోతుబరులూ, అందరూ కలిసి గవరయ్య యింటికి వెళ్ళి ప్రాకారోద్దరణను గురించి చెప్పారు. అతనే పూనుకోవాలన్నారు.

”నీ పేరు చిరస్థాయి అయిపోతుంది. గవరయ్యా! నీ పేరు మీదుగా రోజూ పూజాపునస్కారాలు జరిపిస్తాం” అనీ చెప్పారు.

“దేవుడికి అసలు గుడెందుకు? ఆ గుడి చుట్టూ గోడెందుకు?” అన్నాడు గవరయ్య చుట్ట చివరని నోట్లో నములుతూ.

“అపచారం! అపచారం!” అని లెంపలువాయించుకున్నాడు కరణం.

ధర్మకర్త కరణానికి కన్ను గీటాడు. ‘గవరయ్య వేసిన ప్రశ్న సామాన్యమైనది కాదు. తత్వవేత్తల్నీ, మహర్షుల్నీ కూడా ముప్పు తిప్పలు పెట్టిన జటిల ప్రశ్న అది. అయితే గవరయ్యలో మనకి తెలీకుండానే గొప్ప సాధన జరుగుతోంది. నాలుగు రోజులు మనం ఓపిక పడితే గవరయ్య వంటి పెద్దమనిషి తన ప్రశ్నకి తనే జవాబు పొందుతాడు. భగవదనుగ్రహం నేరుగా ఒక్కసారి రాదోయ్. అంచెలంచెలుగా వస్తుంది. అలాగ వచ్చిన రోజున గవరయ్య ఏది – మన గవరయ్యే వచ్చి “ఇదిగో అవధానిగారూ, ఈ పదివేలు దగ్గరుంచండి – ప్రాకారం కట్టించెయ్యండి” అని అనడూ?”

గవరయ్య ఎప్పుడూ చెయ్యనివాడు అవధానికి నమస్కారం చేశాడు. “సెలవు తీసుకోండి. నాకు పనుంది. టౌనుకెళ్ళాలి” అని అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. అవధాని ఆశ్చర్యపడ్డాడు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు.

“అవధానీ జయించావోయ్. తల వంచి నీకు నమస్కరించాడు కూడా! వీణ్ణి తగలెయ్యా __మారుతున్నాడు, మారిపోతున్నాడు” అన్నాడు కరణం హుషారుగా.

“ఈ వర్షాకాలం వెళ్ళేసరికి – నే చెబుతున్నాగా _ పాతికవేలూ మన ముందు పడేస్తాడు. ఆ ప్రాకారంతోపాటు మన యిళ్ళకి ప్రహరీ గోడలు లేస్తాయి!” అన్నాడు మీసాల్లో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మున్సబు.

వర్షాకాలం రానే వచ్చింది. రావడంలో మంచి వూతంగా, కోపంగా బలంగా వచ్చింది. కుంభవృష్టిగా వర్షం, దట్టమైన మేఘాలతో నల్లబడిన ఆకాశంమెరుపులూ, వురుములూ ప్రకృతి పెళ్ళిపందిరిలా హడావిడిగా వుంది. రోడ్లు బురదైనా కుచ్చెళ్ళ నెత్తిపట్టుకొని ఆడవాళ్ళు, అందులో కొత్తగా పెళ్ళయిన వధువులు సరదాగా పేరంటాలకి వెడుతూ వస్తున్నారు. రైతాంగం అంతా పొలంపనుల్లో పడిపోయారు. మున్సబు పెళ్ళానికి కీళ్ళు నొప్పులూ, అవధాని కూతురికి వేవిళ్ళూ అయినా గ్రామం వుమ్మడి సౌఖ్యానికి అవేమీ ఆటంకంగా లేవు. కరణం విధవ చెల్లెలు కిటికీలోంచి ఎదురింటికి చుట్టంచూపుగా వచ్చిన బస్తీ అబ్బాయికేసి అదే పనిగా చూస్తూ చెయ్యి వూపుతున్నా షార్టుసైటూ మబ్బునీడలూ మూలాన అతనికి ఆ సిగ్నల్స్ కనబడటం లేదు. ఎండైనా వానైనా గ్రామం శివార్లలో వున్న కూలీ, నాలీ జనం, మురికిగుంటలూ పందులూ, జబ్బులూ అన్నీసక్రమంగానే వున్నాయి. పంచాయితీవాళ్ళు కట్టించిన లైబ్రరీ బిల్డింగులో పేకాట నిరంతరం సాగుతోంది.

ఇలాంటి చల్లని సుఖమైన వాతావరణంలో పిడుగులాంటి వార్త చటుక్కున ఊరంతటినీ దద్దరిల్ల చేసింది. మున్సబూ, ఒకరిద్దరు పెద్దలూ మున్సబు యింటి అరుగుమీద కూర్చుని శాలువ కప్పుకొని వెచ్చగా చుట్టలు కాలుస్తూ ఆధ్యాత్మిక గోష్టి సలుపుకుంటున్నారు. ఆ సమయంలో పానకాలు అక్కడికి పరిగెత్తుకుని వచ్చాడు. వాడి కళ్ళల్లో విపరీతమైన కంగారు ఉంది. వాడి వాలకం చూస్తే వాడి వెనకాలే భూకంపమో, వరదో గ్రామానికి వచ్చినట్టుంది.

“ఏంరా! ఏం జరిగిందిరా?” అన్నాడు మున్సబు.

“అదొచ్చిందండీ తిరిగివచ్చిందండీ” అన్నాడు పానకాలు.

రెజ్లల్ల క్రితం మున్సబుగారి గిత్తదూడ కట్టు తప్పించుకొని పారిపోయింది. మున్సబు చిరునవ్వుతో “అయితే యింకేం నేవచ్చి చూస్తాలే. కొకొట్టాంలో కట్టెయ్” అన్నాడు.

“గిత్తకాదు బాబూ! గవరయ్య పెళ్ళాం!” అన్నాడు పానకాలు మెల్లగా.

అందరూ చటుక్కున నిటారుగా కూర్చుని “ఆఁ ఆఁ ఏమన్నావ్!” అన్నారు ఏకకంఠంతో. పానకాలు చెప్పిన వివరణ యిది.

రాత్రి చాలా పొద్దుపోయాక పట్నంలో రెండో ఆట సినీమా చూసివస్తూన్న బట్టలకొట్టు నరసింహం వూరు సమీపించే వేళకి రోడ్డుకి పక్కగా చెట్లనీడలో ఎవరో కదులుతూండడం చూశాడు. అతనికి దెయ్యమేమో అని అనుమానం భయమూ కలిగి గుండెలు దడదడలాడాయి.

అక్కడికి కాస్త దూరంలో పాకలో పడుకున్న పానకాలుని కంగారుగా లేపాడు. ఇద్దరూ వచ్చి చూశారు, రేగినజుట్టూ నల్లని మాసినబట్టలూ, నడవలేక ఒక్కొక్క అడుగువేసే ఆడకూతుర్ని చూశారు. ఆమె చేతిలో చిన్నమూట వుంది. ఎవరా అని దగ్గర్నుంచి చూశారు. పోల్చలేకపోయారు. పలకరించారు. ఆమె మాట్లాడలేదు. ఆమె నడక వేగం హెచ్చించింది. వీళ్ళిద్దరూ అంతదూరంనుంచే ఆమెను అనుసరించారు. ఆమె పొలాలమ్మటే వెళ్ళి గవరయ్య యింటి పెరటి నానుకున్న పాకలోకి వెళ్ళింది. ఆ పాక గవరయ్య ఇంటి పెరటికీ, పొలాలకీ మధ్యగావుంది. పాకలో కర్రపేళ్ళూ, పాతసీనారేకు డబ్బాలూ లాంటి చెత్తాచెదారం అంతా వుంది. గవరయ్యను లేపి చెపుదామంటే యింత రాత్రివేళ లేపితే తంతాడని భయం వేసింది.

మళ్ళీ యిప్పుడా సంగతి జ్ఞాపకం వచ్చి పాకవైపు వెళ్ళి చూశాడు. ఎవరోకాదు ఆ ఆడమనిషి __ గవరయ్య పెళ్ళామే! కడుపు చాలా ఎత్తుగా వుంది. నెలలు నిండినట్టున్నాయి. గడ్డిమీద పడుకుని మూలుగుతూవుంది.

“ఈ సంగతి గవరయ్యకు తెలుసునంటావా _” అన్నాడు మున్సబు.

“తెల్లుబాబూ. తెల్లారగట్లనే లేచి టౌనుకెళ్ళిపోతాడుగా గవరయ్య” అన్నాడు పానకాలు.

మున్సబు తొందరగా లేచాడు. చెప్పులు వేసుకుని బయల్దేరాడు అవధాని ఇంటికి. దారి పొడుగునా అందరూ పలకరిస్తున్నారు.

“ఏం మున్సబూ, గవరయ్య పెళ్ళాం తిరిగొచ్చిందటగా, ఈవూరూ, ఈ మడుసులూ, ఏమైపోతున్నారు బాబూ. మంచీ, చెడ్డా, పున్నెంపాపం అన్ని మట్టి కొట్టుకుపోతన్నయ్యా! లేచిపోయి కడుపులు సేసుకొన్నాళ్ళని మళ్ళీ ఏలుకుంటానంటే ఊళ్ళో పిల్లలు రెచ్చిపోరటయ్యా! ఏమొచ్చింది బాబూ ఈ ఊరికీ, పెద్దలకీ!” అంది అరవై ఏళ్ళు దాటిన ఒకావిడ అరుగుమీద నుంచుని. అవధాని యింటికి వెళ్ళేలోపుగానే మున్సబుకి తెలిసిపోయింది. ఊరంతా గవరయ్య పెళ్ళాం గురించి మాట్లాడుకుంటున్నారని. అవధాని చాలా చిరాగ్గా, కోపంలో వున్నాడు.

“మీకు తెలుసా” అన్నాడు మున్సబు మెట్లెక్కుతూ.

“ఆబాలగోపాలానికీ తెలుసును! మునసబుగిరీ చేస్తున్న నీకే తెలవదు. ఎంత ధైర్యంవుండి ఆ పాపిష్టిది యీ వూరొచ్చిందట! ధర్మభయం, దైవభయం ఎక్కడైనా ఉన్నాయా అని!”

కాసేపట్లో కరణమూ, వూరి పెద్దలూ అందరూ అక్కడ సమావేశమయ్యారు. గవరయ్య తక్షణం ఆ చెడిపోయిన దాన్ని తరిమేస్తాడో లేక తనే వూరినుంచి వెళ్ళిపోతాడో తేల్చుకోవాలన్నారు. ఆ రోజు ఉదయమే మాలగూడెంలో ఎవడికో కలరా తగిలిందనీ దానికి కారణం యీ పాపిష్టిది వూళ్లో అడుగు పెట్టడమే అనీ ఒకరన్నారు.

అవధాని పెద్దక్కగారు తలుపురెక్క ఓరగా తీసి ఇలా అంది. “మేమందరం సిగ్గుతో చచ్చిపోతున్నాం. ఇలా బరి తెగించినవాళ్ళు వూళ్లోవుంటే సంసారులగతి ఏమవుతుంది ఆలోచించండి అన్నయ్యా. మమ్మల్ని వూళ్ళో వుండమంటారో లేందే గంగలో దూకమంటారో చెప్పండి.”

“ఇంతకీ గవరయ్య యింట్లో లేడుగా. రాగానే పెద్దలు మీరు వెళ్ళి చెప్పండి! మీ మాట వినకుండా వుంటాడా, ఏమైనా చెప్పండి అవధాని గారూ! గవరయ్య యిదివరకటివాడు కాదు. పాపం పుణ్యం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. దైవభక్తి, అంతకన్నా మీరంటే భక్తి కలిగున్నాడిప్పుడు” అన్నాడు ఊళ్లోకి పెద్ద కామందైన శేషగిరి.

“గవరయ్యమీద ఇంకా ఎన్ని ఆశలు పెట్టుకున్నాం!” అన్నాడు మున్సబు నిట్టూరుస్తూ గుడి ప్రాకారాన్నీ, పాతికవేలనీ తలచుకొని.

‘గవరయ్య మేనత్త వుందికదా! ఆవిడేం చేస్తుంది. ఊరుకుందా?” అన్నాడు కరణం.

“ఏం మేనత్తలే బాబూ. ఖాయిలాపడి మంచాన అంటుకుపోయి వుంది పాపం. బాగా ముసిల్దయిపోయింది” అన్నాడొకడు.

కనుచీకటి పడేవేళకి గవరయ్య యింటిముందు సైకిలు దిగాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే అవధానీ, కరణం, మునసబునీ చూశాడు. కనుబొమలు పైకెత్తి ప్రశ్నార్థకంగా తల ఆడించాడు. అవధాని అంతా చెప్పాడు. గవరయ్య కళ్ళు ఎర్రబడ్డాయి. అతని లావాటి పెదవులు వణికాయి.

గబగబా వెళ్ళి మూలనున్న గునపం చేత్తో పైకి ఎత్తాడు.

అవధాని కంగారుగా “వొద్దు వొద్దు. అంతపని అక్కర్లేదు గవరయ్య బాబూ, నీ ధర్మనిష్ట తెలియదా? ఇప్పుడు మళ్ళీ ఖూనీకేసు ఒకటా! నీ పీకేకాక మా పీకలమీదికి కూడా వస్తుంది. దాన్ని యింట్లోంచి తోలేసెయ్యి చాలు” అన్నాడు.

గవరయ్య అతని మాటలు వినిపించుకోలేదు. పెద్ద పెద్ద అంగలువేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో అక్కడ వుండటం తమకే ముప్పని గ్రహించిన ఆ పెద్దలు ముగ్గురూ అక్కడనుంచి జారుకున్నారు. గవరయ్య పాకలోకి వెళ్ళాడు. అక్కడ జీబురుగా, చీకటి చీకటిగా వుంది. పాత సామానుతో, దుమ్ముతో నిండివుంది, గవరయ్య పరకాయించి చూశాడు. ఒక పక్కగా నేలమీద వెలికలా పడుకున్న పెళ్ళాన్ని చూశాడు. దగ్గరగా వెళ్ళి గునపం పైకెత్తాడు. ఇంతలో ఏదో సంశయం కలిగింది. “ఇది చచ్చిందా? బతికేవుందా” అనుకున్నాడు. మోకాళ్ళమీద వంగి మొహంలోకి చూశాడు. పీక్కుపోయి పాలిపోయింది మొహం. ఎండి అట్టలు కట్టిన జుట్టు అసహ్యంగా నేలమీద భుజాలచుట్టూ పరచుకొనివుంది. దీనంగా మృత్యు విహ్వలగా, భయంకరంగా, అసహ్యంగా వుంది ఆమె మొహం.

“చిట్టీ” అని పిలిచాడు గట్టిగా. భుజాలు పట్టుకుని కుదిపాడు. చిట్టి కళ్ళు తెరిచింది. గవరయ్యను ఆనవాలు కట్టింది. ఆమె కన్నులమ్మట నీళ్ళు కారుతున్నాయి.

వణకుతున్న తన రెండు చేతులనీ పైకెత్తి నమస్కరించింది. “నన్నేం చేయకు. నేను వెళ్ళిపోతాను” అంది నీరసంగా.

తన తల్లి చచ్చిపోయే ముందు యిలాగే తన తండ్రికి చేతులెత్తి దణ్ణం పెడుతూ దీనంగా చూడటం జ్ఞాపకమొచ్చింది గవరయ్యకు. మళ్ళీ చిట్టి చేతులు రెండూ కిందకు వేలాడిపోయాయి.

కాసేపు అలాగే కూచుని ఏమనుకున్నాడో లేచి లోపలికి వెళ్ళి ఒక చెంబుతో నీళ్ళూ, ఓ గిన్నెనిండా అన్నమూ తీసుకువచ్చాడు. “చిట్టీ” అన్నాడు.

చిట్టి కళ్ళు తెరిచింది. “లే, ఈ అన్నం తిను. తెల్లారగానే వెళ్ళిపో. నీ మొహం నాకు చూపించకు తెలిసిందా” అన్నాడు. చిట్టి తల వూపింది.

గవరయ్య లేచి నుంచుని “తెల్లవారేక యీ పాకలో కనిపించేవా నీకు చావు తప్పదు” అని యింట్లోకి వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి గవరయ్యకి అన్నం సహించలేదు. అతనికి కాళ్ళకింద మంటలు పెట్టినట్లుంది. అవతల ఆకాశంమీద మబ్బులు దట్టంగా పట్టాయి. గాలి రివ్వుమని చెట్ల ఆకుల్లోంచి చప్పుడు చేసుకుంటూ ఇంటి చూరును తాకి వెర్రిగాఅరుస్తూ వెనక్కి తిరిగి పోతోంది. పక్కమీద దొర్లుతూన్న గవరయ్యకి కునుకుపట్టింది. గవరయ్యకి భయంకరమైన కల వచ్చింది. తన తండ్రిని, తల్లిని ఒక స్తంభానికి కట్టి చుట్టూ మంటలు పెట్టారు. ఆ మంట పెట్టినవాళ్ళు అవధానిలాగ, కరణంలాగ, మునసబులాగ కనిపించారు.

తల్లీ తండ్రీ “బాబోయ్, బాబోయ్” అని అరుస్తున్నారు. తల్లి తండ్రీ ఎర్రగా నల్లగా బూడిదగా కాలిపోయారు. ఆ బూడిదలోంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. ఆ వ్యక్తి గబగబా అడుగు లేసుకుంటూ తన పెరట్లో పాకవైపు వెళ్ళాడు. ఆ వ్యక్తికి ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో చక్రం, నుదుట నామాలూ వున్నాయి. గుళ్ళో తను చూసిన వేణుగోపాలస్వామి విగ్రహంలా వున్నాడు. వేణుగోపాలస్వామి కళ్ళమ్మట నీళ్ళు కారుతున్నాయి. దేవుడేడుస్తున్నాడు.

చిట్టి పక్కలో వున్న పిల్లవాణ్ణి చేతులతో తీసుకొని “నీకేం భయం లేదు. నేనున్నానుగా” అని చిట్టిని ఓదారుస్తున్నాడు. ఇంతలో మండుతున్న కాగడాలు పట్టుకొని ఊళ్ళో జనం కేకలు వేసుకుంటూ వచ్చి పాకను అంటించేస్తున్నారు. పాక నలువైపులా భగ్గుమని అంటుకుంది. జ్వాలలు మిన్ను ముడుతున్నాయి. దేవుడు మంటల్లో కాలిపోతున్నాడు. చిట్టి కాలిపోతోంది. నోరెరుగని చిట్టి పిల్లాడు కాలిపోతున్నాడు.

ఉలిక్కిపడి లేచాడు. గవరయ్య. అతని నుదురంతా చమటతో తడిసిపోయింది. కిటికీ తలుపులు గాలికి కొట్టుకుంటున్నాయి. హోరుమని గాలివాన, ఉరుములూ, అంతా భయంకరంగా వుంది. గవరయ్య మొహం తుడుచుకున్నాడు. పక్కనున్న కూజాలోని ఒక గ్లాసుడు మంచినీళ్ళు గడగడా తాగాడు. చీకటిలోంచి బయటకు చూశాడు. వానతో కలిసిన చీకటి, నల్లని విషంలాగా ఆకాశం మీంచి కారుతోన్నట్లు, నల్లని పాపం సముద్రంలా పొంగుతూన్నట్టు వుంది. ఆ భయంకరమైన చీకటిలో యీ మనుషులు, ఇళ్ళూ, వాకిళ్ళూ, భయాలూ, కోర్కెలూ, అన్ని అబద్ధంలా కనిపించాయి.

ప్రకృతియొక్క ప్రచండ తాండవంలో ఏదో సత్యం కొరడాతో చెళ్ళున కొట్టినట్లు అర్థమయినట్లు అనిపించింది. ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో వేణుగోపాలస్వామి గోపురాగ్రం మెరిసింది. గవరయ్య మనసు లోతులలో ఏదో మెరిసింది. గవరయ్య దగ్గాడు. లాంతరు పట్టుకొని పెరట్లో కెళ్ళాడు. పెరడు చాలా పెద్దది. వర్షంలో తడుస్తూ గాలివూపుకి తట్టుకుంటూ పాక దగ్గరకు వెళ్ళాడు. పాకలోంచి కీచుగా, గట్టిగా మూలుగులు వినబడుతున్నాయి. లోపలకు వెళ్ళాడు. బాధతో వలయం తిరిగిపోతోంది చిట్టి. చూడలేక దీపం అక్కడ పెట్టి బయటకు వచ్చి నిలుచున్నాడు. అలా వర్షంలో చలిగాలిలో ఎంతసేపు నుంచున్నాడో తెలీనే తెలీదు. ఇంతలో ఒక మెరుపు మెరిసింది. దగ్గర్లోనే ఎక్కడో పిడుగుపడిన భయంకరమైన చప్పుడు.

“బాబోయ్” అని అరిచింది చిట్టి. గవరయ్య ఒక్క నిముషం సేపు నిశ్చేష్టుడయ్యాడు.

ఇంతలో “కేర్ కేర్” మని ఏడుపు వినిపించింది. కఠినమైన అసహ్యమైన గవరయ్య మొహం మీద లావాటి పెదవుల సందులనుంచి వచ్చిన చిరునవ్వు తాలూకు వెలుగు అలుముకొంది. గవరయ్య అంత వర్షంలోనూ అంత చీకటిలోనూ మెరుపుల సహాయంతో వూళ్ళో మంత్రసాని కోసం పరుగెత్తుకెళ్ళాడు.

ఉదయం ఎనిమిది గంటలయింది. గవరయ్య ఇంటి వరండాలో అవధాని, కరణం, శేషగిరి, మున్సబూ అందరూ కూర్చుని వున్నారు. వర్షంతగ్గి లేత ఎండకాస్తోంది. ఆ ఎండల్లో రాత్రంతా తడిసిన చెట్ల ఆకులూ, గవరయ్య యింటిమీద వాలిన కాకి నల్లని రెక్కలూ మెరుస్తున్నాయి. అవధానీ, మున్సబూ, వాళ్ళ మొహాలు మాత్రం మెరవటం లేదు. నిరాశాహతమైన వారి కళ్ళలో కోపం సుళ్ళు తిరుగుతోంది. గుమ్మం అవతల వాళ్ళ వెనకాలే వచ్చిన వెట్టివాడూ, ఒకరిద్దరు నౌకర్లూ తమరేం చెప్పినా చెప్పేస్తా మన్నట్టుగా విధేయతా, పట్టుదల మూర్తీభవించినట్లు చేతులు కట్టుకు నుంచున్నారు.

కాసేపటికి ఇంట్లోంచి గవరయ్య వచ్చాడు. నడుస్తున్న ఇనుప గళారులా వున్నాడు. చిన్న కళ్ళు కుంచించి సూటిగా, నిర్లక్ష్యంగా వాళ్ళకేసి చూశాడు.

అవధాని భీకరంగా కంఠం మార్చి “ఇలా చేస్తావనుకోలేదు గవరయ్యా! ఇంకా పెద్దమనిషి అనుకున్నాను. చెడిపోయిన దాన్ని ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టుకుంటావా? ఎవడివల్లో పుట్టిన కొడుకుని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటావా? నీకు సిగ్గూ, అభిమానమూ రెండూ లేక పోవడమే కాదు, పాపం, మహాపాపం, ఘోరపాపం చేశావు. దేముడింక నిన్ను క్షమించి సహించి వూరుకుంటాడా?” అన్నాడు గుక్క తిప్పుకోకుండా.

గవరయ్య తాపీగా గోడ కానుకుని కూర్చున్నాడు. బొడ్లోంచి పొగాకుకాడ తీసి చుట్టబెడుతూ “నాకు దేవుడే చెప్పాడు” అన్నాడు.

“ఏం చెప్పాడు?” అవధాని. “ఆ పిల్లాణ్ణి నేను పెంచుకుంటాను. ఆపిల్ల ఇంట్లో పడివుంటుంది” అన్నాడు గవరయ్య.

“లేచిపోయిందాన్ని ఏలుకుంటావా?” అన్నాడు శేషగిరి తన చెవుల్ని తాను నమ్మలేక!

“ఏలుకోడం సిగతరగ – నాకంటే సగం చిన్నదాన్ని పెళ్ళి చేసుకుంటే లేచిపోక ఏం చేస్తది. ఇపుడు పొమ్మంటే ఎక్కడికి పోతది. తిండీ బట్టా యిస్తే కుర్రాణ్ని సాకుతూ యిక్కడే పడివుంటుంది” అన్నాడు గవరయ్య.

అవధాని వికటాట్టహాసం చేశాడు. “దేవుడు చెప్పాడా నీకు? ఏ దేవుడయ్యా! రంకు దేవుడా? మహా తపస్సు చేసిన వాళ్ళకి దిక్కులేదు కాని…”

“నాకు దేవుడు కనిపించాడు. నేను దేవుణ్ని చూశాను.” అన్నాడు మొండిగా గవరయ్య. అపుడతని కళ్ళు మెరిసాయి.

“ఇప్పుడైనా దాన్నీ, ఆ పిల్లాణ్ణి ఎక్కడికేనా పంపించేసెయ్. ఇంతటి అన్యాయాన్ని మేము ఒప్పుకోం” అన్నాడు కరణం.

“నిన్ను గుడిచాయలకుకూడా రానివ్వం” అన్నాడు అవధాని. “ఊరు వూరంతా ఏకమవుతుంది గవరయ్యా! మంచిగా చెబితే వినడంలేదు నువ్వు. మేమంతా చేతులు కట్టుక్కూర్చోలేదు జాగ్రత్త” అన్నాడు మున్సబు.

ఒక్కసారి గవరయ్య లేచాడు. గోడవారనే వున్న గునపం తీశాడు. “ఎవడ్రా! నాయాల నామీద కొచ్చే వాడెవడ్రా. నేనొకరి సొమ్ము తిన్నానా. అసలు మిమ్మల్నిక్కడకు రమ్మన్నానా? నువ్వెవడివయ్యా నాకు నీతులు చెప్పడానికి? నా యవ్వారంలో జోక్యం చేసుకుంటే ఒక్క ఏటుకి తెగేస్తాను. రమ్మను ఎవడొస్తాడో” అని అరిచాడు.

అతని వొళ్ళు ఆవేశంతో వూగిపోయింది. అతను పేలుతున్న అగ్ని పర్వతంలా వున్నాడు. అతని ఆకారం, అతని రౌద్రం చూసేసరికి వెట్టివాడు భయపడిపోయి నోరావలించాడు. అవధాని లేచాడు. తక్కిన వాళ్ళందరూ కూడా లేచారు.

“అయితే దాన్ని వదలవన్న మాట” అన్నాడు అవధాని.

“వదల్ను” అన్నాడు గురవయ్య.

“అయితే నిన్ను వెలేస్తున్నాం. చాకలి, మంగలి రానేరారు సరికదా నీ పొలంపనులకి, పాలేరు తనానికి ఎవరొస్తారో చూస్తాను” అన్నాడు అవధాని.

మున్సబు వెట్టివాడి కేసి చూసి “ఈవేళ వూళ్ళో టముకు వెయ్యరా” అన్నాడు.

గవరయ్య ఉగ్రంగా వురిమిచూసి “పొండయ్యా పెద్దమనుషులూ. ఇలాంటి యెదవూళ్ళో వుండమన్నా వుండను. నా పిల్లాణ్ణి యీ యెదవల మధ్య తిరగనివ్వను. థూ!” అని కాండ్రించి వుమ్మేశాడు, వెళ్ళిపోయే అవధాన్నీ బృందాన్ని చూస్తూ.

వారంరోజులు తిరిగేసరికి గవరయ్య ఇల్లు తాళంవేసి వుంది. గవరయ్య టౌనులో ఇల్లు కొన్నాడనీ, ఇక్కడ వూళ్ళో ఇల్లూ, పొలమూ అమ్మకం పెట్టేడనీ తెలిసింది.

(జ్యోతి, 1964)

పుస్తక ప్రచురణ వివరాలు:

ఈ పుస్తకం, నవచేతన పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది.

ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

*Intro- outro BGM credits: Envanile | Jingleman (https://www.youtube.com/watch?v=fyM41M0n3lI)

“తిలక్ గారి ‘దేవుణ్ణి చూసిన మనిషి’” కి 2 స్పందనలు

  1. comment section , we need to repeatedly login, in your website.

    1. ram గారు. ఇప్పుడు చేంజ్ చేసాము సర్.మీ వర్డుప్రెస్సు లేదా ఇతర బ్లాగింగ్ అకౌంట్ ID తో ఇప్పుడు కామెంట్స్ , వేరే లాగిన్ లేకుండా చెయ్యొచ్చు.

Leave a Reply