మా బస్సు బాగోతాలు

“ఒరే ఎంకా ! యెందాకరా ఒకటే లగెత్తుతుండావు?”

“ఉండరా! సుబ్బా! పడవెళ్లి పోతుందిరా! నేను నీతో యవ్వారం పెట్టుకుంటే కుదరదు. గెండారం దాకా పోవాలా” అంటూ ఎంకడు హడావిడి పడిపోతాడు. 

“మా ఉప్పలపాటి గురుంచి ఏమన్నా మీకు ఉప్పు వుండి వుంటే మీరే తెగ ఆశ్చర్య పోవాల! ఉప్పలపాటి కి గెండారానికి మధ్య పిల్లకాల్వ కూడా లేదు, ఈ ఎంకడు ఎలా పడవెక్కుతాడు అని”

అయితే మీకు బొత్తిగా మా ఉప్పలపాటి వాళ్ళ ఎకసెక్కాలు బొత్తిగా తెలీవన్న మాట.

ముందు వెనక కర్వ్డ్ రూఫ్ తో ఒక ఇన్వర్టెడ్ పడవలాగా వుండే బస్సుకు మా వాళ్ళెట్టుకున్న ముద్దు పేరు. 

అలాగే పొట్టిగా, ముందు ఎనకా ఓ గొడ్డలెట్టేసి నరికేసి, ఎత్తు ఎక్కువ పొడవు తక్కువగా వుండే బస్సు పేరు అగ్గిపెట్టి. 

“మావ! అగ్గిపెట్టెలో వచ్చానా! ఆ సూలం సచ్చినోడు ఎత్తెత్తి నూకేలా! తోలి నా నడుము ఇరగ నూకేసినాడనుకో” అని చాలా ముద్దు గా చెప్పుకుంటారు మావోళ్లు . 

అలాగే వెంగమాంబా, బాల భాస్కర్, పాలబండి, తపాలా బండి, గోపాలయ్య బండి లాటి ఎన్నెనో పేర్లు ఆ బస్సులకు. ఒక్కో బస్సు ఒక్కో రంగు, ఒక్కో డిజైన్, ఒక్కో హారన్, ఒక్కో వైభోగం. డ్రైవర్, కండక్టర్ తోపాటు బస్సు ఆగగానే రేడియేటర్ లో నీళ్లు పోయడానికి, ఎక్కే మెట్ల మీద నిలబడి పక్క రేకు మీద బాదుతూ రైట్ రైట్ అంటూ అరుస్తూ ఒక క్లీనర్.

 బస్సు కిట కిట లాడుతుండగా ఎనక తలుపు మీద రైట్ రైట్ అని బాది, నేల మీదకి దూకి బసుతో పాటు పరిగెత్తి ముందు తలుపు దగ్గర బస్సులోపలకి గెంతి మరలా రైట్ రైట్ అంటూ ఆడు చేసే హడావిడి మాకయితే భలే ఉండేది. వీళ్ళ ముగ్గురు మీద వూళ్ళ మధ్యలో ఎక్కి చెకింగ్ అంటూ నానా హడావుడి చేసి, మూటలకు టిక్కెట్లు కొట్టలేదని కండక్టర్ మీద యుద్ధం చేసి ఊళ్ళ మధ్యలోనే చక్క దిగి పోయే చెకింగ్ ఒకడు. 

మాలో ఒక గుస గుస ఉండేది, ఆ చెకింగ్ కి వీళ్ళ ముగ్గురూ ఎందుకంత బయపడతారో అని. ఎందుకంటే ఈ చెకింగ్ లు ఎక్కువగా బస్సు ఓనర్ల కీప్ ల తమ్ముళ్ళో, అన్నలో లేక కొడుకులో

మాలాటి పిల్లకాయలకి, ఇంతకు ముందు చూడని బస్సు ఎంత డొక్కు దైనా కొత్త బస్సే. అది వచ్చి మా మూలగడ దగ్గర ఆగితే దాన్ని శల్య పరీక్ష చేసి అందరం కలిసి నామకరణం చేయాల్సిందే . కొత్త బస్సుని చూసిన సందడే వేరు. 

ఎలిమెంటరీ స్కూల్ పిల్లకాయలయితే ఎప్పుడెప్పుడు పెద్దయి పోయి అర్జెంటు గా పడవనో, అగ్గిపెట్టెనో లేక కొత్త బస్సునో ఎక్కి పెదపుత్తేడు ఉన్నత పాఠశాల లో చదివెయ్యాలనే ఉబలాటం. మా లాటి అల్రెడీకే పెద్దోళ్ళయిపోయిన పిల్లకాయలకి రోజుకో కొత్త బస్సు రావాలనే ఆత్రం. 

అలాగే ఒక్కో బసుకి ఒక్కో ఫ్యాన్ ఫేర్, ఎన్నైనా చెప్పెండె హె అగ్గిపెట్టిపోయినట్టు పడవ వెళ్లగలదా అనే పందేలు. పడవలో వుండే ఆ వయ్యారం అగ్గిపెట్టెలో ఎక్కడుందిరా అనే సౌందర్యోపాసకులు తక్కువ లేరు మా వూర్లో. 

ఈ బస్సులు వాటి పంచువాలిటీ తెగ పాటించేవి. వాటి టైం దాటి లేట్ గా వచ్చేయంటే, అవి మా వూరు కొచ్చి రిటర్న్ అయ్యే టైం లో తరవాత వచ్చే బస్సోడు అడ్డం పెట్టేసే వాడు, నా కలెక్షన్ అంతా నువ్వెత్తుకు పోతున్నావని. ఆ అడ్డం పెట్టుకోవటం కొన్ని గంటలు లేక కొన్ని పూటలుండేవి. మా పిల్లకాయలకి పండగే బస్సులు అలా అడ్డం పెట్టుకోవటం. ఒక జాతరలాగా వెళ్లి చూసొచ్చే వాళ్ళం. ఆ అడ్డం పెట్టుకొనే ప్రదేశం లో సోడా బండ్లుకూడా వెలిసేవి. 

ఇలా మా అందాలు, ఆనందాలు, హడావుడీలు సాగిపోతుండగా, రూట్స్ అన్నీ జాతీయమై, ఎర్ర బస్సులు రావటం మొదలెట్టాయి. 

పాల బండి ఎర్ర బండే , తపాలా బండి ఎర్ర బండే, ఏదొచ్చినా ఎర్రబండే. క్రమంగా మా వాళ్ళు ఆరు గంటల బండి, ఎనిమిది గంటల బండి, పది గంటల బండి అని చెప్పుకోవటం మొదలెట్టారు. 

రంగుల్లేవు, డిజైన్ లేవు, సోకుల్లేవు, “మీ సామానులకు బస్సువారు జవాబు దారి కాదు”, “లైట్ ఆపి సెల్ఫ్ కొట్టుము” లాటి ముసి ముసి నవ్వులు కురిపించే వాక్యాలు లేవు. 

మాకెందుకో అర్థం అయ్యేది కాదు ఆ ఎర్ర బస్సులు వస్తే ఒకదాని ముడ్డి వెనక ఒకటి వచ్చేవి, రాకపోతే అస్సలు వచ్చేవి కాదు. అడ్డం పెట్టుకొనే కంపిటీషన్ మేమెప్పుడూ చూడలా మా కళ్ళతో. 

క్రమంగా మేము ఎప్పుడొస్తాయో తెలియని ఎర్ర బస్సుల్ని నమ్ముకోవటం మానేశాము. వాటి స్థానే మా వూరిక్కూడా, షేర్ ఆటోలు రావటం మొదలెట్టాయి, పసుపు బాడీ మీద నల్లని టాప్ ల తో, డబ డబ శబ్దాలతో, ఒకే మాదిరిగా.

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్టు రంగు రంగులుగా వుండే ప్రైవేట్ బస్సులు రావటం మానేసాక మా ఉప్పలపాటి దారి కళే పోయిందబ్బా.

కథను –

‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
(Harshaneeyam on Gaana app)

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam
(Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5
(Harshaneeyam on Apple. Podcast)

హర్ష కథలు:

సభ్యత్వం నమోదు:

648followers
623Followers
96Subscribers
645Comments
230Loves
100 
54 
72subscribe

Leave a Reply

అతిధి దర్శనాలు

అధ్యాయాలు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

ధన్యవాదములు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

648followers
623Followers
96Subscribers
645Comments
230Loves
100 
54 
72subscribe
హర్షణీయం

FREE
VIEW