Apple PodcastsSpotifyGoogle Podcasts

‘నేతి గారెలు’ – కథ, కథానేపధ్యం!

హర్షణీయంలో ఈ ఎపిసోడ్లో మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘నేతి గారెలు ’. ఇది వారి ‘మనూళ్ళల్లో మా కథలు ’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది.

ఈ ఎపిసోడ్లో ప్రత్యేకత, ఆడియో చివరన కథా నేపధ్యాన్ని ఇనాక్ గారు స్వయంగా మనకు వివరించటం.

సంకలనంలోని కథలన్నీ ఆయన బాల్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా, వారు రాసినవి.

కథలన్నీ కూడా డెబ్బయి ఏళ్ల క్రిందటి గ్రామీణ జీవితాన్ని వివరిస్తూ, అప్పుడున్న సామాజిక పరిస్థితిని మనకు కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తాయి.

తమ రచనను హర్షణీయం ద్వారా అందించడానికి అనుమతినిచ్చినందుకు, కథా నేపధ్యం , హర్షణీయం శ్రోతలకు అందించినందుకు ఆచార్య ఇనాక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

డిసెంబర్ నెలలో వారి ఇంటర్వ్యూ ‘హర్షణీయం’ ద్వారామీరు వినవచ్చు. అప్పుడు మరిన్ని వివరాలు వారి రచనా జీవితాన్ని గురించి తెలుసుకోవచ్చు.

‘మన ఊళ్ళల్లో మా కథలు’ కథాసంపుటి ప్రతులకు సంప్రదించండి –

జ్యోతి గ్రంథమాల

4-282, యన్ యస్ నగర్

మీర్ పేట్, హైదరాబాద్ – 500 097.

ఫోన్: 94402 43433

నేతి గారెలు:

మా వూరు వేజండ్ల. అప్పట్లో గుంటూరు తాలూకాలో, ఇప్పుడు చేబ్రోలు  మండలంలో ఉంది. మా వూరు రెండు భాగాలు. రైలు కట్టకవతల ఊరు, ఇవతల పల్లె. పల్లె వాళ్ళల్లో కొందరు, ఊరివాళ్ళ ఇళ్ళల్లో జీతగాళ్ళు.

గమిని శ్రీరామయ్య గారింట్లో మా నాయన పెద్ద జీతగాడు. పొద్దు పొడవక ముందు ఇల్లొదిలి వెళ్ళేవాడు. పొద్దుమునిగాకే వచ్చేవాడు.

నాకప్పుడు ఎనిమిదేళ్ళు, చెల్లెలికి నాలుగు, తమ్ముడికి కొన్ని నెలలు. మా నాయన్ని చూసిన రోజు మాకు పండగ..

నేనప్పుడు మాపల్లె బడిలో మూళ్ళోకొచ్చా. తెలుగు వాచకం కొత్త వాసనింకా పోలా. 

అప్పుడు శ్రీరామయ్యగారి చిన్నజీతగాడు పెదోడై, పెళ్ళె వెళ్ళిపోయేడు. గొడ్డుగాసే బుడ్డో డొకడు, మా దొరగారికి కావలసి వచ్చేడు. ‘మీ బుడ్డాణ్ణి మా గొడ్డకాడ బెట్టరా’ అని దొరగారు మా నాయనతో అన్నాడు. మా నాయన ‘సరే’ నన్నాడు

మన పెద్దోణ్ణి  దొరగారి గొడ్డ  గాయటానికి పంపుదా’మన్నాడు మా నాయన మా అమ్మతో.

మా అమ్మ వద్దంది. ‘సదూకోనీయ్’ అని అంది. అట్టా కాదన్నాడు మా నాయన. మా అమ్మ ‘అదిగాదు’ అంది. మా నాయన మొండికి తిరిగాడు. మా అమ్మ తండుకేసి కూసుంది. ‘నా మాటపోద్ది” అన్నాడు మా నాయన. “ఆడి సదూ సెడుద్ది” అంది మా అమ్మ. ఆళ్ళూ ఈళ్ళూ పోగయ్యారు, సర్దుబాటు చేశారు.

ఎప్పటికయినా కూలో నాలో చేసుకు బతకాల్సినోళ్ళమేగా. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే సేరనీ’ అన్నారు.

ఆడగూతురు, అమ్మ ఏం జేసుద్ది? పెనిమిటిని కాదంటదా? అన్నలమాట పెడచెవిని పెడతదా? ఏడుస్తూ కళ్ళు తుడుసుకొంది.

నన్ను పొద్దున్నే నిద్రలేసి, రెక్క పట్టుకొని లాక్కెళ్ళేడు మా నాయన ఊళ్ళోకి, దొరగారి సావిట్లోకి, గొడ్లకాడికి. నాకేడుపు ఆగలేదు.

సదూకుంటా’ నన్నాను. ‘ఏడిసేవులే!” అన్నాడు మా నాయన. ఏడుస్తానే ఉన్నాను. పలకా బలపం, తెలుగువాచకం, ఎక్కాల పుస్తకం, సంచీ ఏడుస్తున్నట్టు అనిపించింది.

పొదున్నే లేవాలి. ఊళ్ళోకి పోవాలి. గొడ్డకాడి కసువు పేడ వేరువేరుగా తీయాలి. అవన్నీ  ఊడవాలి అప్పుడు బూసిమ్మ బువ్వ బెట్టుద్ది. ఆనక గొడ్డు దోలుకు పోవాలి. బూసిమ్మకూ, నాకూ, మంచిమాలిమి

ఆమె మాట్లాడకుండా బువ్వ పెట్టదు. నేను మాట్లాడకుండా తినకూడదు. బూసిమ్మ అంటే శ్రీరామయ్యగారి భార్య. దొడ్డ ఇల్లాలు. పెట్టు పోతల్లో పెద్దసేయి. ఎముకల్లేని సేయి. ఆమెకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు రాధాకృష్ణయ్య. కమ్యూనిష్టని పెద్ద పేరు. పెళ్ళయింది.

రెండో దొర రాఘవయ్య. పెళ్ళీడు కొచ్చేడు. పెద్ద పెడసరపు యవ్వారం. మంచోడే! మూడో ఆయన రాజయ్య. గుంటూరు బళ్ళో సదూలు సదువుతున్నాడని గొప్ప పేరు. ఆ ముగ్గురిలో ఎవురూ గొడ్డు గాయరు. రాజయ్య నాకంటే నాలుగేళ్ళు పెద్దాడు. సదూకొంటున్నాడు. ఉన్నోడుగా, గొడ్డుగాయడు. నేను బడికి పోతున్నా, లేనోణ్ణిగా గొడ్డుగాయాలి. అందుకే జీతానికి కుదిరా.

బువ్వకాడ బూసిమ్మకూ, నాకూ ఒకటే తంతు. ‘ఎందుకురా మొడ్డుకుమల్లె అట్టా నిలబడ్డా, గిన్నె దెచ్చుకోకా?” అనేది. గిన్నె దెచ్చుకొని కూసుంటే ‘నోరు లేదా మూగ సన్నాసీ అడగవేం?” అనేది. ‘బూసిమ్మా! బువ్వ బెట్టవమ్మా!” అనేవాణ్ణి. ‘ఏందిరా సచ్చినోడా బూతులు దిడతన్నా?’ అనేది.

శ్రీరామయ్యగారు కలగజేసుకొని ‘ఆడేడ బూతులు దిట్టేడు దొరసానీ!’ అనేవాడు. ‘మరి ఆడా కూత కూయడే?” అనేది.

అప్పుడు, ‘దొరసానీ! బువ్వబెట్టు’ అనేవాణ్ణి. ‘ఏందిరా ముదనష్టపోడా ఆ అరుపులు, ఆగలేవా?’ అంటూ గిన్నెలో కూడు కుమ్మరించేది. ‘తినూ! దిక్కులు జూతావేం?” అని కసిరేది. ‘కూరెయ్యవా’ అంటే ఎక్కళ్ళేని కూడా, కూరా, కుమ్మూ,

నీ ఎదానే కొడతంటిని. ఎందుకెయ్యనూ?” అని ఏసేది. ‘ఆవగాయో, ఊరగాయో, పప్పో, రసమో ఏసి ఏం కడుపురా నీది, ఎంత దిన్నా నిండదు. ఏమేసినా వొద్దనవూ’ అని నవ్వేది.

నాకు వళ్ళు మండేది. ఏంజేయను? పెట్టేది ఆమె. తినేది నేను. ఆమె ఏం పెట్టినా తినాలి. ఏమన్నా పడాలి.

‘నువ్వు దిన్నట్టుగాదు, గొడ్డను కడుపునిండా మేపుకురా’ అనేది. నేను తలూ వాణ్ణి. ‘మొద్దు ముండా కొడకా, నోరు లేదా, ఊ అనవూ, ఆ అనవూ’ అనేది. నేను ‘అట్టాగేలే’ అంటా గొడ్డు దోలుకు పోయేవాణ్ణి.

శ్రీరామయ్యగారికి ఒక ఆవు. రెండెడ్లు, రెండు దున్నలు, నాలుగు పాడి బర్రెలు, రెండు సూడివి ఉండేవి. ఎడు, దున్నలు చేసే పని నాకు లేదు. పాడి బర్రెల దూడలు నాలుగూ పెయ్యలే! బర్రెల్ని దూడల్ని వేరు చేయటం నాకిష్టంకాదు. దూడలు నడవలేవు. సావిట్లోనే కట్టేసేవాళ్ళు. వేళా పాళా లేకుండా దూళ్ళు పాలు తాగేతే ఇంకా ఏమన్నా ఉందా? బూసిమ్మకు పాలు, పెరుగు, పేడ అమ్ముద్దని పెద్ద కీర్తి.

బరిగొడ్డ పాలు దూడలు తాగేతే నాపనయి పోయిందే! అదేం చిత్రమోగానీ, ఏ బర్రె దగ్గరికి దాని దూడే చేరేది. పొద్దెక్కక ముందే గొడ్డు దోలుకుపోవాలి. గొడ్డుమేత మేసేచోటు, రైలుకట్ట రెండు పక్కలా ఏటవాలుగా ఉన్న తావు. బళ్ళకట్ట నుంచి ఒకటో తూముదాకా ఉన్న గడ్డికి శ్రీరామయ్య గారు హక్కుదారు.

గొడ్డు రైలుకట్ట కటూఇటూ మేస్తూ, కట్ట దాటేటప్పుడు రైలోస్తే సావు. అదొక్కటే జాగరతగా ఉండాల్సిన పని.

గడ్డి ఒత్తుగా పెరిగేది. నవనవలాడతూ ఉండేది. మంచుబొట్లు మెరుస్తుంటే చూడ ముచ్చటగా ఉండేది. గొడ్డు మలసబడ మేసేవి. ఎండాకాలం ఆ మేత గొడ్డపాలిట వరమే! ఎంతమేసినా తరిగేది కాదు.

బరిగొడ్డు ఆశబోతువి. ఎంత తిన్నా ఆటికి ఆకలి తీరదు. కసాబిసా కలేసి, మెలేసి, నమిలేసి, పడుకొని నెమరేసేవి. బుద్ధిపుడితే కుంటల్లో నీళ్ళు తాగేవి. కడుపు నిండితే కట్టవారని కాళ్ళార జాపేవి. ఎంతలెగొట్టినా లేసేవి కావు. పొద్దు ఏటోలుతున్నప్పుడు అయ్యే లేచి ఇంటితోవ పట్టేవి. ఆటి నడక సోకే సోకు!

తోవలో దేవళ్ళ చెరువులో దిగి. మునిగి, తేలి, నీళ్ళు తాగి, పుక్కిలించి, తోకతో వీపును బాదుకొని, ఆడుకొనేవి. బుద్ధి పుట్టినప్పుడు లేచి ఒడ్డెక్కేవి. అటుపోయేదాన్ని ఇటు మల్లేసి, గుంపుగట్టి, ఊళ్ళోకి సావిట్లోకి తోలుకొచ్చేవాణ్ణి.

వాటిని గాటికాడ తలుగులకు కట్టిసి, ముందింత గడ్డేసి, వామి ముందు కుందుకూర్చునేవాణ్ణి. బూసిమ్మ వచ్చి పాలు పిండుకు పోయేది.

దూడల్ని జూత్తూంటే నాకు ఉసూరుమనిపించేంది.

పొద్దు పడమట మునుగుతున్నప్పుడు, గినె బువ్వబెట్టవమ్మా’ అనేవాణ్ణి. ఏందిరా సచ్చినోడా, బూతులు తిడతన్నావనేది. 

ఇది జీతగాడి దినచర్య.

ఎడ్లను, దున్నల్ని పెద్ద జీతగాడో,  దొరలో, తోలుకుపోయి పొలాల్లో మేపేవాళ్ళు  

గొడ్డను తోలుకుపొయ్యేటప్పుడో,  తోలుకొచ్చేటప్పుడో, నడవలేకో, ఉబలాటం వల్లనో, నాకు నాలుగుర్లా, బరిగొడ్డు మీద స్వారీ చేయాలని బుద్ధిపుట్టేది.

మీదికెక్కటం మొదట్లో నాకు చేతనయ్యేది కాదు. ఎగిరి ఎక్కేంత ఎత్తులేను అందుకని బర్రె ఎనక్కాళ్ళ మీద కాళ్ళు పెట్టి తోక పట్టుకొని పైకెక్కి వీపు మీద మునేవాణ్ణి. బర్రె నడుస్తున్నప్పుడు పడతానని భయవేసి, వాటేసుకొని, వీపు మీద పడుకొనేవాణ్ణి. కొంత సులువు తెలిశాక కొమ్ములు పట్టుకొని కూర్చునేవాణ్ణి. వీలు చిక్కాక కుదురుగా కూర్చోసాగా.

బర్రె నడక ఊపుకు నా నడుం ఊపుకు పొంతన కుదిరాక ఏం పట్టుకొనే పనిలేదు. దీవిగా కూర్చునేవాణ్ణి, దిక్కులు చూస్తూ దర్జా వెలగబెట్టేవాణ్ణి. ఇక బర్రెలగెత్తినా భయం లేదు. ఒక్కోసారి లగెత్తమని నేనే దాన్ని డొక్కల్లో తన్నేవాణ్ణి.

గుర్రం మీద రాజకుమారుడు వెళ్ళే కథలు గుర్తుకు వచ్చినప్పుడు నేనే రాజ – కుమారుణ్ణని, నా బర్రె పంచకళ్యాణి గుర్రమని దిక్కులు చూసేవాణ్ణి.

ఇదే ఏనుగు, ఇదే అంబారి, నేనే మహారాజునని, నా గొడ్డే నా సైన్యమని, మీసం తిప్పేవాణ్ణి. లేని మీసం! తిమ్మిరి దిగేసరికి గొడ్డు మేతకొంగేవి. లేకపోతే సావిట్లోకి చేరేవి.

మహారాజునీ, యువరాజునీ, అయిన నేను అంతటితో జీతగాణ్ణి అయి పోయేవాణ్ణి.

ఒకసారి నేను సూడి దాన్నెక్కి వస్తుంటే మా నాయన చూశాడు. లగెత్తుకొచ్చి, బర్రెనాపి, నన్ను దింపి నెత్తిమీదొకటేసి, ‘నీకు సూడిదే దొరికిందిరా సన్నాసి’ అన్నాడు. పిచ్చి ముఖంతో చూస్తుంటే అది సూడిదిరా గాడిద’ అన్నాడు. ‘అంటే?’ అని నేనడిగితే ‘నీ తలకాయ’ అని మొట్టికాయ వేశాడు. ఏమైనా అడిగితే తిడతాడు, కాదంటే కొడతాడు. ఎందుకొచ్చిన గోల అని అడగటం మానేశాను.

ఒక పాడి బర్రె నన్ను ప్రేమగా చూసేది. దాని దూడననుకొనేదో ఏమో నా వళ్ళు నాకేది. కొమ్ము విసిరేది కాదు. ఎత్తుకొంటా రా’ అన్నట్లు చూసేది.

చెయేతే కూసునేది. ఎక్కికూసుంటే లేచేది, బయలుదేరేది. బర్రె కూడా తలే! | దాని ముద్దూ మురిపం దానిది.

ఒకరోజు నాకు జొరమొచ్చి జీతానికి పోలేదు. తంబళ్ళ మాధవయ్య గారు మాతర్లిచ్చి, పత్తేం చెప్పేడు.

‘రొండురోజులు బువ్వ పెట్టొద్దు, మజ్జిగ చాలు’ అన్నాడు. మా అమ్మము కాడే కూసుంది. కుండలో కూడు పెట్టుకు తింటానేమోనని అమ్మకు అనుమానం అని నాకు సందేహం కలిగింది.

‘నీకు బయిమొద్దు! దొంగ కూడు తినను’ అన్నా. అమ్మ నమ్మింది. వాటేసుకొంది. ఏడ్చింది. ‘నువ్వు నా బంగారు కొండవురా’ అంది. ఆ సాయంత్రానికి జొరం తగ్గింది.

‘ఏడీ సచ్చినోడు?’ అంటూ బూసిమ్మ ఊరొదిలి, ఇల్లొదిలి, పల్లెలోకి, మా యింటికి వచ్చింది.

మా అమ్మ ముక్కాల పీటవేస్తే కూసుంది. ‘ఈ ముదనష్టపోడికేమయింది?? అని అడిగింది.

‘యేందిన్నావురా యదవ జొరం తెచ్చుకొన్నావు’ అంది. ‘నువ్వు బెట్టే పెట్టుకి జొరం రాదా బూసిమ్మా’ అన్నా. బూసిమ్మ నవ్వింది. ‘యేం బెట్టేవే ఈడికి?” అని మా అమ్మనడిగింది. ‘నేనేం బెట్టలా’ అంది మా అమ్మ .

“నేతి గారెలు జేశా, ఈ కడుపాత్ర పోడికి పెట్టకుండా తినబుద్దికాలా, ఎంత వొద్దిగా తింటాడే సన్నాసోడు. తింటున్నప్పుడు ఎంత ముద్దొస్తాడో ఈ దొంగముండా కొడుకు. ఆడికి బెట్టు’ అని జలమసిలేరి దబరా నిండా ఉన్న నేతిగారెలు మూతదీసి చూపించింది. నేతివాసన గుప్పుమంది.

‘పత్తేం దొరసానీ’ అంది అమ్మ

ఏరా సన్నాసీ నీ నోట్లో శని ఉందా? ఏడువ్! పోనీ ఒకటి తినిసావ్!” అని నడుం పట్టుకొని లేసి, పోయొత్తానే’ అంది వెళుతూ. ‘బిడ్డ జాగరత’ ఆవటాని హెచ్చరించింది.

బూసిమ్మ కూడా తల్లే! అమ్మ కూడా అమ్మే!

‘నేతి గారెలురా, పోనీ ! ఒకటి తింటావా?” అని అమ్మ అడిగింది. ‘పత్తేం గదే! వద్దులే ! బతికుంటే బోలెడు దినొచ్చు’ అన్నా. 

మా అమ్మ నా బుగ్గలు పుడికి కళ్ళు తుడుచుకొంది. ముద్దు పెట్టుకొంది.

రాత్రి అమ్మా, నాయనా, చెల్లెలు నేతి గారెలు తింటుంటే, నేను వాసన తింటూ నిద్రపోయేను.

***BGM credits:Kanmani Anbodu Kadhalan Piano Cover – Jingleman Cover #11 (https://www.youtube.com/watch?v=LSolsKyf6Vs)

“‘నేతి గారెలు’ – కథ, కథానేపధ్యం!” కి 9 స్పందనలు

 1. నేతి గారె లాంటి చక్కని కథను ఇవ్వడమే కాకుండా తన అనుభవాలను, తనకు చాల నచ్చిన విషయాలను వివరించిన ఇనాక్ గారికి నా ధన్యవాదాలు.

  ఇటువంటి గొప్ప రచనలు అందించారు మీరు చాలా థాంక్స్!!

  1. ధన్యవాదాలు సర్. ఇంక మీదట, కథలపై ఆయా రచయితల వివరణను ఆడియో ద్వారా మీకందించే ప్రయత్నాన్ని కొనసాగిస్తాము.

   1. కమ్మని నేతి గారెల్లాంటి కథను పరిచయం చేసిన హర్షణీయం కు ధన్యవాదాలు. తెలుగు సాహిత్యాన్ని కాపాడుతున్న ఇనాక్ వంటి మహనీయులకు మనపూర్వక నమస్కారములు.
    C. L.Raju

   2. Thank you Raju Garu.

 2. పల్లె ప్రాంతాల్లోని ఆనాటి సామాజిక పరిస్థితుల ను ప్రతిబింబిస్తూ చేసిన చక్కటి కధ. రచయిత కు ప్రచురించిన మీకు ధన్యవాదాలు.

 3. ఆచార్య గారి కమ్మనైన వేతిగారెలను కేవలం రచనాస్వాదన ద్వారానే కాకుండా తన వాచికంతో రుచిని మరింత పెంచిన అనిల్ గారికి ప్రత్యేక అభినందనలు.
  మాండలికాన్ని సునాయాసంగా ఆకళింపు చేసుకుని పాత్రల నడుమ జరుగుతున్న సంభాషణలను తదనుగుణంగా పలికించి కధకు ఎంతో ఊతనిచ్చారు.

  ఇక ఇనాక్ గారు తన కధను కధలా మాత్రమే చెప్పక మన ముందు జరిగే అన్నీ విషయాలను ఎంతో సూక్ష్మంగా వివరించారు. ఇష్టం లేని జీతగాడి పని చేస్తూ కోరుకున్న చదువు లేక విలవిల్లాడిన పిల్లవాడితో ఆ విలువ ఎంత ముఖ్యమో చెప్పించడం చాలా బాగుంది.

  పల్లెదనాన్ని అందులోని జీవన శైలిని అద్భుతంగా రచించారు ఆచార్య 🙏

Leave a Reply