అల్లం శేషగిరి రావు గారి ‘చీకటి’ – కథ, కథాపరిచయం.

(*కథను ప్రచురించడానికి తమ అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.)

రచయిత అల్లం శేషగిరి రావు గారి గురించి ( 1934 – 2000) –

‘చీకటి’ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది.

‘రచన’ మాసపత్రిక లో 1995 లో ప్రచురింపబడ్డ ఈ కథ, ఆయన ఆఖరి రచన.

పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.

బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.

ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.

అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.

కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం , భావుకత్వం మనల్ని కట్టి పడేస్తాయి.

1981 లో ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది.

కథ- స్థూలంగా:

చిమ్మ చీకట్లో, బాతుల వేటకు బయల్దేరతారు, విభిన్నమైన జీవితాలూ, వ్యక్తిత్వాలూ వుండే ఇద్దరు, వేరు వేరుగా. కెప్టెన్ వర్మ వినోదం వెతుక్కుంటూ, నక్కలోడు డిబిరిగాడు ఆహారం వెతుక్కుంటూ.

చెరువుకి గట్టున మంచె మీద వర్మ గారూ, నీళ్ళల్లో కింద, డిబిరిగాడు కూర్చుంటారు, ఒకరి ఉనికిని ఇంకొకరు గ్రహించకుండా.

వర్మ గారి తుపాకీ గురి తప్పదు కానీ , ఆ అలజడి డిబిరి గాడి నోటి దగ్గరి కూడుని లాగేస్తుంది.

మళ్ళీ పక్షులొస్తాయి, వేటాడొచ్చు, అని అక్కడే వేచి చూసే, ఆ ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురు పడతారు.

డిబిరిగాడి ఆహ్వానాన్ని , అయిష్టంగానే మన్నించిన వర్మ , చలి కాచుకుంటూ వాడి కెదురుగా, మంట వెలుగులో కూర్చుంటాడు.

ఇద్దరి మధ్యా సంభాషణ మొదలౌతుంది. తన వేట వల్ల డిబిరిగాడికి జరిగిన నష్టాన్ని తెలుసుకుని, విచారిస్తాడు వర్మ.

చుట్టూ వుండే అందమైన చీకటీ , నక్షత్రాలను చూసి తన చిదానందస్వరూపాన్ని ప్రదర్శిస్తాడు డిబిరిగాడు అంత ఇబ్బందిలోనూ.

కొన్నిగంటలు వాళ్లిద్దరూ అలా గడుపుతారు.

వర్మ తాను వెతికే వినోదం గురించి మరిచిపొయ్యి, డిబిరి గాడి జీవితం గురించి తెలుసుకొని విషాదంలో మునిగిపోతాడు. అలానే ఆహారం కోసం వెతికే డిబిరిగాడికి చివరిదాకా అది చేతికి అందదు.

కానీ వాళ్లిద్దరూ కలిసి గడిపిన ఆ కొద్ది సమయం – వర్మకి ఒక అమూల్యమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. ఒంటరి డిబిరి గాడికి, ఒక స్నేహపూరితమైన అనుభవం మిగులుతుంది.

జీవనంలో ఎంత వైరుధ్యం వున్నా, జీవితాలు దగ్గర అవ్వొచ్చు అని నిరూపిస్తారు, తన కథనం ద్వారా శేషగిరి రావు గారు.

నేపధ్యం:

శేషగిరి రావు గారికి వున్న వేట అనుభవం, ఆయన పరిశీలనా శక్తీ ఈ కథలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సంచారజాతుల జీవితాలూ, అనేక సామాజిక మార్పుల వల్ల , వాళ్ళ జీవనంలో జరుగుతున్న విధ్వసం ,వాటిని దగ్గరగా చూసి రచయిత పడిన వేదనా ఈ కథకు మూలం.

కథను అలెన్ పాటెన్ అనే ఆఫ్రికన్ రచయిత రచించిన ‘Cry the Beloved country’ అనే నవల లోని కొన్ని వాక్యాలను, ఉదహరిస్తూ ప్రారంభిస్తారు రచయిత.

ఆ నవలలో కూడా –

నల్ల జాతీయుడైన ఒక ప్రీస్ట్ , తన గ్రామం నుంచీ జొహాన్నెస్ బర్గ్ కి వలస వచ్చిన కొడుకును వెతుక్కుంటూ వస్తాడు. అలానే ధనికుడైన అయిన ఒక శ్వేత జాతీయుడు, ఆచూకీ తెలీకుండా పోయిన తన కొడుకు గురించి అదే నగరానికి బయలుదేరతాడు.

వీరిద్దరూ ఒకరికి ఒకరు తటస్థ పడతారు.

కథ చివరలో , వారిద్దరికీ వెతుకుతున్నది దొరకక, విషాదం మిగిలినా, ఇద్దరూ దగ్గరవడం జరుగుతుంది.

ఆ నవలలో జాతి దురహంకారం, నల్లవారి జీవనాధారాలు వారి నుంచి దూరం కావడం, గ్రామాల నుంచి నగరాలకు వలస , వాటి వల్లే కలిగే దుష్ఫలితాలు వీటన్నిటి గురించీ విస్తృతమైన చర్చను చూడొచ్చు.

చీకటి – కథా వివరం:

చీకటిని , చెరువు దగ్గరి వాతావరణాన్ని చక్కగా వర్ణిస్తూ పాఠకుణ్ణి కట్టిపడేస్తారు రచయిత.

‘తొలిసంధ్య ముందు కమ్ముకునే చిక్కటి చీకటి’ అంటూ అన్యాపదేశంగా ముగింపును తెలియజేస్తారు.

చీకటిని కథంతా కూడా బ్యాక్ డ్రాప్ గా, మెటాఫరికల్ గా వాడడం జరుగుతుంది.

రెండు ముఖ్యపాత్రల మధ్య వుండే వైరుధ్యాన్ని కథంతా చూపిస్తారు రచయిత.

ఇద్దరి జీవన విధానాలూ వేరు. జీవితాన్ని చూసే పద్ధతి వేరు.

వాళ్లిద్దరూ వేటాడే పద్ధతీ, ఉపయోగించే తుపాకులూ, వేరు. ఒకరు నాటు తుపాకీ వాడితే, ఇంకొకరు బ్రాండెడ్ తుపాకీ (అమెరికన్ కౌబోయ్స్ , నేటివ్ అమెరికన్స్ ని చంపడానికి విరివిగా వాడిన గ్రీనర్స్ డబల్ బారెల్ గన్ )

వర్మ గారు హంటింగ్ డాగ్ ను తోడు తీసుకవస్తే, గుడ్డి కొంగను చంకన పెట్టుకు వస్తాడు డిబిరి గాడు.

చూడ్డానికి , వినడానికి మొరటుగా వున్నా డిబిరిగాడి వేట పద్దతుల ఎఫెక్టివ్ నెస్ , కెప్టెన్ ని అచ్చెరువొందేటట్టు చేస్తుంది.

ఎదుటి వర్గాన్ని దారిలోకి తెచ్చుకునే ఫిఫ్త్ కాలమ్ లాంటి వార్ టెక్నిక్ ను గుర్తు వచ్చేటట్టు చేస్తాడు వర్మకి డిబిరిగాడు.

కథలో డిబిరిగాడి పట్ల వర్మ లో వుండే భావాలు , అయిష్టతతో మొదలై , ఆసక్తి , సానుభూతి, విషాదం, వీటన్నిటినీ దాటుకొని, స్నేహంలోకి పూర్తి రూపాంతరం చెందుతాయి.

ఈ పరిణామక్రమాన్ని చాలా సొగసుగా అందిస్తారు రచయిత కథనం ద్వారా.

వర్మలో వచ్చే మార్పు, తన సిగరెట్ డిబిరి గాడికి ఇవ్వడం తో మొదలై, సిగరెట్ వాడి నోటికి అందించి వెలిగించడంతో ముందుకెళ్లి , డిబిరిగాడిచ్చిన బీడీ వర్మ కాల్చడంతో పూర్తవుతుంది.

చీకట్లో వెలిగించిన చిరు దీపం , కాలుతున్న బీడీ నించి వచ్చే వెలుతురన్నట్టు కథను అందంగా ముగిస్తారు రచయిత.

చీకటి -పూర్తి కథ:

“Who indeed knows the secret of the earthly pilgrimage? Who indeed knows why there can be comfort in a world of desolation?.”   Thus contemplated Umfundisi, a Zulu parson – 

“Cry. The beloved Country” ALAN PATTON

చీకటి …….

డక్ షూటింగ్… 

బాతుల వేటకి కెప్టెన్ వర్మ బయలు దేరాడు. రిటైరయిన వర్మ విడోవర్. ఊరవతల పెద్ద బంగళా ఉంది. అందులో పూర్వం దొరలుండేవారు. వయస్సు మళ్లినా దిట్టంగా ఉన్నాడు. ఒక్క కొడుకూ విదేశాల్లో చదువుకొంటున్నాడు. ఇద్దరు పనిమనుషులు..

“నాకు మహావృక్షాలంటే మహా ఇష్టం. అవి ముసలి చెట్ల యుంటే మరీ ఇష్టం. అవి  చాలా తరాల నుంచి వాటి మీద గూళ్లు కట్టుకున్న ఎన్నో జాతుల పక్షుల్ని, ఈ బంగళాలో కాపురమున్న విభిన్న సంస్కృతుల మనుషుల్ని చూసుంటాయి. నేను ఈజీ ఛైలో వరండా మీద కూర్చుని పైపు కాల్చు కుంటూ వాటన్నిటినీ ఆ ముసలి చెట్లలో చూడగలను. 

“ నాకుఇంట్యూటివ్ నాలెడ్జ్ ఉంది. పూలమొక్కలంటారా? నో… ఫిమినైన్.” అని అప్పు డప్పుడూ విజిటర్స్ కి బంగళా ఆవరణలో ఉన్న పెద్ద పెద్ద చెట్లని చూపిస్తూ చెబుతుంటాడు. ” 

పైపు- పోయెట్రీ-విస్కీ-సోడా అతనికి ఇష్టం. విక్టర్ హ్యూగో అభిమాని. అతనికున్న వ్యసనం ఒక్కటే!

వేట – ముఖ్యంగా డక్ షూటింగ్. “గ్రీనర్స్” డబుల్ బేరల్ షాట్ గన్ భుజానికి తగిలించు కొని హంటింగ్ సూట్లో బంగళామెట్లు దిగాడు. గదిలో నౌఖరు లైటు ఆర్పేశాడు. చుట్టూ చీకటి – ఎటు చూసినా చీకటి. తొలి సంధ్యముందు విస్తరించుకునే చిక్కని చీకటి. దూరం గా కొండల్లో నుంచి వచ్చిన గాలుల్లో ఊపిరి పోసుకుంటున్న చీకటి. 

ఆవరణలో ముసలి మఱిచెట్టు మీద రాబందుల రెక్కల చప్పుడు. 

“ఆగ్లీ- బట్ గ్రేస్ ఫుల్ బర్డ్ – విశాలమైన రెక్కలు . గూని నడకలో హుందాతనం. ”

పొయెటిక్ గా నెమరు వేసుకుంటూ సన్నగా ఈలలు వేశాడు. భౌ| భౌ! – యజమాని ఈలకి రిట్రీవర్ డాగ్ పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ల దగ్గర మూలుగుతూ, కాళ్ల చుట్టూ తిరుగుతోంది.

“ కమాన్ – కమాన్ లెటజ్ గో” అని దాన్ని నిమిరాడు. ఉండుండి చలికి ఒళ్ళు దులపరించుకుంటోంది. 

యజమాని- కుక్క; వేటకి బయలుదేరారు. యజమాని తుపాకీతో వేటాడిన బాతుల్ని ఈదు కుంటూ నీట్లో నుంచి ఒడ్డుకి తెస్తుంది- హంటింగ్ డాగ్. దాని పేరు సీజర్. 

చీకట్లో ఇద్దరూ నడుస్తున్నారు. పొలాల్నీ తాటి తో పుల్నీ దాటుకుంటూ కాలవ గట్టు ఎక్కారు. కాలువగట్టు మీద రెండు నీడలు నడుస్తున్నట్లున్నాయి. గట్టు దిగి మొగలి పెండెల్లో నుంచి “తంపర” వైపు నడుస్తున్నారు. తంపర, తామర తీగలతోనూ, నాచుతోనూ, తుంగుబుర్ల తోనూ, బురదతోనూ సుదీర్ఘంగా వ్యాపించిన సరస్సులా ఉంటుంది. బురద గుమ్ములు ఎక్కువ. నీటి లోతు మెడ దాటదు. అక్కడ నావల్ని గెడలతో తోస్తూ చేపల వేట చేస్తారు. నీటి పిట్టల జాతితో తంపర కార్తీక మాసంలో కిలకిల లాడుతుంటుంది. బాతులు మందలు మందలుగా విదేశాలనుంచి వలస వచ్చి దిగుతుంటాయి. 

వర్మ, చలిలో హంటింగ్ సూట్లో వెచ్చగా వణుకుతున్నాడు. సీజర్ చలికి తుమ్ము తున్న ప్పుడల్లా చీకట్లో తన మిలిటరీ చూపుల్లో మందలిస్తున్నాడు. చీకట్లో సహితం యజమాని కదలికల్ని, చూపుల్ని తీక్షణంగానూ, నిశితంగానూ పసిగట్టే అనుభవం గల వేట కుక్క సీజర్.. 

ఇద్దరూ నడుస్తున్నారు. పొలాల్లో నక్కల మంద ఊళలు వేస్తోంది. ఎండ్రపీతల్ని పంట పొలాల్లో నక్కలు వేటాడుతున్నాయి . తంపర దగ్గరౌతోంది. చలిలో మంచు కూడా కలిసింది. ఉండుండి మొగలి డొంకల్లో నుంచి గాలి తెరలు రివ్వున వీస్తున్నాయి. 

నిశ్శబ్దం – ……. 

“క్రాంక్- క్రాంక్” – ఆకాశం మీద రెండు అరుపులు. వర్మ ఆగి ఆకాశం వైపు చూశాడు. కుక్క కూడా ఆకాశం వైపు చూసి మూలిగింది. అర్థం దాని యజమానికి మాత్రమే తెలుసు. నక్షత్రాలు పరచుకున్న నల్లటి ఆకాశం మీద చాలా ఎత్తున పాలపుంతని దాటుకుంటూ బాతుల మంద ఎగురుకుంటూ పోతోంది. “క్రాంక్’ – మళ్లీ మరో బాతు బొంగురు అరుపు. చుక్కల వెలుగు లో నల్లటి బాతుల మంద. వాటి రెక్కల చప్పుడు స్పష్టాస్పష్టంగా రంయ్ మని గాలి తెర వీస్తూ పోయి నట్లు వినబడుతోంది – తంపర్లో దిగుతాయి. 

చీకట్లోనే మాటులోకి చేరుకోవాలి – గబగబా మళ్లీ నడక ప్రారంభించారు….. 

********************************

చీకటి…….. 

పిట్టల వేటకి బయలుదేరాడు నక్కలోడు.

వాడి పేరు డిబిరిగాడు. చేతిలో నాటు తుపాకీ. భుజానికి తగిలించిన పాత మురికి కాకీ సంచి. పిట్టల వలతో చీకట్లో తంపరవైపు నడుస్తున్నాడు. ఎడమ చంకలో యజమానితో వేటకి బయలు దేరిన పెంపుడు కొంగ కూడా ఉంది. పెద్ద జాతి కొంగ – నత్త గొట్టు. దాన్ని చంకలో అదిమి పట్టుకొ నున్నాడు. 

డిబిరిగాడి నివాసం పోలీసు స్టేషన్ దగ్గర మైదానంలో మజ్జి చెట్టు. దానికి కట్టిన తారు గుడ్డ కిందే రాత్రి పడుకుంటాడు. ఒక్క డిబిరిగాడే కాదు. సంచార జాతోళ్లు అంతా అలానే ఉంటారు. రోజూ సాయంకాలం పోలీసు స్టేషన్లో హాజరు వెయ్యించుకోవాలి. రాత్రి ఎప్పుడు పిలిచినా హాజరు కొవాలి. చెట్ల కింద పడుకుంటారు. పగటి పూట పూసలూ, పిన్నులూ, ఎఱ్ఱ పూసల దండలూ, చర్మాలూ రోడ్డు పక్కన అమ్ముకుంటుంటారు. 

చీకటి పడిన తర్వాత ఇంత ఉడకబెట్టుకు తిని పోలీసుల్ని బ్రతిమిలాడుకొని వేటకి బయలుదేరుతారు. వేటాడిన చెవుల పిల్లుల్నీ, నక్కల్నీ, వలలో  పడిన పావురాల్నీ, కొంగల్నీ, కౌజా పిట్టల్నీ ఉదయాన్ని ఊర్లో అమ్ముతారు. వాళ్లే చర్మం ఒలిచి, వెంట్రుకలు దూసి అమ్ముతారు. పోలీసులకి కూడా పిట్టమాంసం చేసి ఇస్తుంటారు. అయినా ఊర్లో ఎక్కడ దొంగతనం జరిగినా వాళ్ళను అనుమానం మీద పోలీసు స్టేషన్ కి లాక్కెళ్తుంటారు. నక్క 

మాంసాన్నీ, పిల్లుల్నీ కొల్చుకు తింటూ వాటి చర్మాల్ని అమ్ముకుంటారు. అందుకే వాళ్ళని – “నక్క లోళ్లని ‘ పిలుస్తారు. “ నత్తగొట్టోళ్ళు” అనీ, “పూసలోళ్లు’ నీ కూడా పిలుస్తారు. ఒక్కొక్క ప్రాంతం లో ఒక్కొక్క పేరున పిలుస్తారు.. 

డిబిరిగాడి దగ్గర పెంపుడు కొంగ ఎప్పుడూ పక్కనే ఉంటుంది. ఊర్లో ఫుట్ పాత్ మీద పూసలు అమ్ముతున్నప్పుడు కూడా వాడి పక్కనే మేసుకొంటూ ఉంటుంది. నత్తగుల్లల్నీ, చిన్న చేపల్నీ దానికి మేపుతుంటాడు. అది ఎగిరిపోదు. బాగా మచ్చిక అయిపోయింది. ఆకలిగా ఉంటే నేలమీద ముక్కుతో పొడుస్తూ డిబిరిగాడి వైపు గుడ్డిగా చూస్తూంటుంది. నడుస్తున్నప్పుడు ఎప్పుడూ చంకలోనే దాన్ని పట్టుకొని తిప్పుతుంటాడు. 

డిబిరిగాడు నడుచుకుంటూ ఊరవతలికి వచ్చాడు. దూరంగా పోలీసు స్టేషన్లో లైటు మసగ్గా కనిపిస్తోంది. ఊర్లో అప్పుడప్పుడు కుక్కల అరుపులు. 

డిబిరి గాడికి  గోచీ తప్పా ఒంటిమీద మరేమీ లేదు. వయసు అరవై దాటి ఉండొచ్చు. 

సిగముడి, కణితి మీద కాల్చిన మచ్చ, చెవి రింగుల బరువుకి సాగి వేలాడుతున్న చెవి తమ్మెలు, చేతి మీద పులి పచ్చ బొట్టు. సరైన తిండి లేక ముడుచుకొని పోయిన కండలు, జ్ఞానం తెలిసినప్పటినుంచీ పోలీసు స్టేషన్లో తిన్న లాఠీ దెబ్బలతో కదుం కట్టి గట్టి పడిపో యున్నాయి. వాడి శరీరం ఎండా వానలకి, చలి గాలులకి, ఆరుబయట జీవితానికి, బాగా అలవాటు పడిపోయింది. 

వాడొక్కడే కాదు, ఆ సంచార జాతులన్నీ యిలానే జీవిస్తుంటాయి. ఈ రోజూ యీ ఊరు; మరో రోజా మరో ఊరు. తల్లి ఒక ఊరిలోను, తాత పాముకాటుకి మరో ఊరిలోను, తండ్రి దిక్కుమాలిన చావు మరో దగ్గర – అలా వారి చావులూ బ్రతుకులూ దిక్కుమాలినవే! అడవిలో సంచ రించే జంతువుల్లా జనారణ్యంలో సంచరిస్తూ ఎక్కడో, ఎప్పుడో అనామకులుగా రాలిపోతారు. అనుభవిస్తున్నది దరిద్రమని వాళ్ళకి తెలియదు. వాళ్ల శరీరం లాగే వాళ్ళ జీవితాలు  కూడా దరిద్రానికి అలవాటు పడిపోయాయి. 

చీకట్లో నల్లటి తాటి తోపుల్లో నుంచి ఊరవతల శ్మశానం దాటుతున్నాడు. అక్కడ దేవులాడు తున్న నక్క డిబిరిగాడి లికిడి విని పొదల్లో నుంచి పారిపోయింది. చీకట్లో చలిగాలి డిబిరిగాడి మోటు శరీరాన్ని గరుకుగా తాకుతోంది. చంకలో కొంగ గింజా కుంటుంటే “థూ- నీయమ్మ. ” అని ఒక చరుపు చరిచాడు. చీకట్లో అది కేరుమని అరిచింది. 

పొద్దెక్కడానికి ఇంకా చాలా టైముంది. డిబిరిగాడు తంపరవైపు నడుస్తున్నాడు. చీకట్లో వల పన్నాలి. సంచీలో నుంచి నాటు సారా సీసా తీసి డగ్ డగ మని గుటకలేస్తూ సగం తాగి మూత బిగిం చాడు. ఒళ్ళు వేడెక్కింది. బీడీ వెలిగించాడు. అడ్డ దారిన చెరువు గట్టు మీద ఏపుగా పెరిగిన నల్లటి చెట్ల మధ్య నుంచి బరువెక్కిన చిక్కటి నీడలా గబగబా నడుచుకుంటూ వెళ్తున్నాడు. తంపర గాలి రివ్వున వీస్తోంది. గాలిలో తామరాకుల వాసనకి డిబిరిగాడి చేతిలోని కొంగ కూడా చీకట్లో నుంచి గుడ్డిగా తంపరవైపు చూస్తూ మెడ నిక్కించి రెక్కలు సర్దుకుంటోంది. 

డిబిరిగాడు తంపర దగ్గరౌతున్న కొద్దీ మరింత వేగంగా నడుస్తున్నాడు. 

నీలాకాశం చీకటితో స్నానం చేసినట్లు స్వచ్ఛంగా ఉందిచుక్కలు అక్కడక్కడ చలిలో వణుకుతున్నాయి. 

తంపర ఒడ్డున మొగలి డొంకల మధ్యలో, ముందే ఏర్పరిచిన అరప మీద కేప్టెన్ వర్మ, సీజర్ కూర్చున్నారు. తూటాలు నిండిన జోడు గుళ్ల తుపాకీ పక్కన ఉంది. మొగలి పొదల్లో నుంచి అరప మీద కూర్చున్న వర్మకి విశాలంగా పరుచుకున్న తంపర చీకట్లో మసగ్గా కనిపిస్తోంది. ఆవలి వైపు సరుగుడు తోటల్లో నుంచి గాలులు వీస్తున్నాయి. తంపర మీద నిశ్శబ్దం ఆవరించుకొనుంది. వర్మ ఆకాశంవైపు, నీటివైపు కళ్ళు పొడుచుకు చూస్తున్నాడు. చీకటి మరింత చిక్కగా పేరుకొంటోంది. సీజర్, చలికి వర్మకి మరింత దగ్గరగా తోసుకుంటూ వెచ్చగా ముడుచుకొంటోంది. 

దూరంగా నీటిలో తుంగ గడ్డి గుబుర్లలో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. వర్మ పరికించి చూస్తున్నాడు. నల్లటి గుబుర్ల మధ్యలో ఏదో దీపం కదులుతున్నట్లుంది. గడ్డిలో వెలుగు ఉండుండి కనిపిస్తూ మళ్లీ కనుమరుగౌతోంది. 

అలా చూస్తున్న వర్మకి రివ్వున శబ్దం వినిపించింది. చెట్లలో నుంచి వీస్తున్న గాలిలా లేదు. ఆకాశం మీద నుంచి దిగుతున్న మెత్తని గాలిలా ఉంది. బాతుల మంద తంపర్లో దిగబోతోంది. చుక్కల కాంతిలో బాతుల మంద మరింత స్పష్టంగా కనిపిస్తోంది. – “క్యాంక్’ – మందలోని బాతు సన్నగా అరిచింది. ఆ అరుపుకి సమాధానంగా వర్మ కూర్చున్న అరపకి కాస్త దూరంలో తంపర్లోనుంచి బాతులు (“ క్యాక్, క్యాంక్,… బాక్” మని అరుస్తున్నాయి. వాటి రుపులతో అంత వరకు ఆవరించుకున్న నిశ్శబ్దం చిట్లిపోతోంది. బాతుల మంద బాగా కిందికి దిగి నీటి మీద వాలడానికి చక్కర్లు కొడుతున్నాయి. అలా రెండు మూడు రౌండ్లు కొట్టి నీటిలో దిగడానికి రంయ్ మంటూ వర్మ కూర్చున్న అరపదాటుతుండగా... అరప మీద నుంచి చీకట్లో రెండు మెరుపులు ధన్.. ధన్... రైట్ అండ్ లెఫ్ట్ బేరల్సు లో నుంచి తుపాకీ నిప్పులు కక్కింది. 

ఆ శబ్దం క్షణం సేపు  నీటి మీద ప్రతి ద్వనించి నీరసిస్తూ దూరమై పోతూ గాలి హోరులో కలిసిపోయింది. థప్ – థప్ థప్-మని మంటి ముద్దల్లా చచ్చిన బాతులు, మందలో నుంచి తెగి నీట్లో పడ్డాయి. గింగురులు తిరుగుతూ రెక్కలు కొట్టుకుంటూ దెబ్బతిన్న బాతులు నీటిలో పడి చీకట్లో ఎగరలేక కొట్టుకుంటు న్నాయి. కార్డయిట్ పొగలేని వాసన గాలిలో తేలుతోంది. ఒడ్డున కప్పలు టప టప మని నీట్లో గెంతేసి ఈదు కుంటూ దాక్కుంటున్నాయి. 

సీజర్ మెరుపు వేగంతో తుపాకీ పేలీ పేలగనే అరప దూకి చీకట్లో దూసుకుంటూ నీట్లో దిగింది. మోర పైకెత్తి వాసన పసిగడుతూ యీదుకుంటూ పడిన బాతుల్ని పట్టుకుని ఒడ్డుకి తెచ్చే ప్రయత్నం లో ఉంది. చీకట్లో నాచు తీగల్లో కుక్క చిక్కు కుంటుందేమోనని వర్మ అరప మీది నుంచి ఈలలు వేసి పిలిచేస్తున్నాడు. కుక్క కోసం ఆందోనగా వుంది. నీట్లో కుక్క ఈదుకుంటూ డైవ్ చేస్తున్న చప్పుడు. అలా పావుగంట గడిచింది. వచ్చిన బాతుల్ని నోట కరచుకుంటూ ఒడ్డు ఎక్కింది. చిన్న పరుగుతో అరప దగ్గరికి వచ్చి వాటిని పడేసి యజమానిని రమ్మన్నట్లు ముద్దుగా మొరిగింది. ఆయాసపడిపోతూ తడిసిన ఒంటిని విదిలించుకుంటూ తుమ్ముతోంది. వర్మ అరప దిగి కుక్కని ఆప్యాయంగా నిమురుతూ ది తెచ్చిన బాతుల్ని పట్టుకున్నాడు. మూడు చచ్చిన బాతులు, మిగతావి నీటిలో బుడగేసి తప్పించుకుపోయాయి. 

బాతుల్ని సంచీలో పెట్టి భుజానికి తగిలించుకున్నాడు. తుపాకీలో ఖాళీ తూటాలు తీసి కొత్తవి పెట్టి రిలాక్సింగ్ గా అగ్గిపుల్ల గీసి సిగరెట్టు వెలిగించాడు. ఆ తమకంలో వెనకనుంచి వస్తున్న పరద  పిట్టల మందని గమనించలేదు. కుక్క రెగా ఆకాశంవైపు చూస్తూ పరుగెత్తింది. వర్మ వెనక్కి తిరిగి తుపాకీ సర్దుకునే లోపల మొత్తం వరదల మంద రివ్వున వెనక్కి తిరిగి గాలిలా దూసుకుంటూ  బెదురుగా అరుస్తూ పారిపోయింది. వర్మ తుపాకీ దించి కనీసం మూడు బాతులు పడినందుకు సంతోషంగా సిగరెట్టు కాల్చుకుంటూ కుక్కని వెంటేసుకొని తంపర గట్టు మీద నడుస్తున్నాడు. ఇంకా బాగా చీకటిగానే ఉంది. బాతులు దిగే సమయం మించి పోలేదు. ఇంకా ఛాన్సు వుంది. 

నీటి మీద పొగ మంచు మెల్ల మెల్లగా లేస్తోంది. దూరాన కొండల మీది నుంచి దిగిన మంచు కూడా గాలితో కలసి ముసురుకొస్తోంది. చూస్తుండగనే అంతా తెల్లటి మంచు మయం. చీకటితో తడిసిన మంచు మెత్తగా నడుస్తున్న వర్మకి రాసుకొంటూ చుట్టేస్తోంది. చలిలో ఒణుకుతున్నాడు. దూరంగా తంపర గట్టు మీద మంచు లోంచి ఏదో వెలుగు కనిపిస్తోంది. మంచులో తడుస్తూ వెలుగు వైపు నడుస్తున్నాడు. అది చలి మంట . డిబిరిగాడు చలి కాగుతున్నాడు. 

వర్మని దూరంలోనే చూసి లేచి నిలబడ్డాడు. మంట వెలుగులో డిబిరిగాడి ఆకారం పొగమంచు లో ఊగుతున్న నల్లటి నీడలా చీకట్లో కనిపిస్తోంది. 

 “దండాలు దొరా. ఇసక మంచు . ఒళ్లు కొంచెం ఏడెక్కనీ. కూకో. ‘ ‘ అని గోచీ గట్టిగా బిగించుకొని కూర్చున్నాడు. 

అపరిచితుడు, అందులోనూ అనాగరికుడు తనని అలా పలకరించడం ఇష్టం లేకపోయినా బాగా చలిగా ఉంది. ఉదయాన్నే మరోసారి డక్ షూటింగ్ అవకాశం కూడా వుంది. అయిష్టంగా కూర్చున్నాడు. 

డిబిరిగాడు వర్మని పెద్దగా పట్టనట్లు వాడి మానాన వాడు చలికాచుకుంటున్నాడు. చేతులు మంటల మీద పెట్టి రాసుకుంటున్నాడు. ఉండుండి మోకాలి మీద అరిచేత్తో కొట్టుకొని రుద్దుకుంటు న్నాడు. పక్కనే ఉన్న లాంతరు ఒత్తి బాగా దించేశాడు. కిరసనాయిలు ఎంతుందో ఊపి చూశాడు. అలా చాలా సేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. 

వర్మకి డిబిరిగాడు చాలా విచిత్రంగా కనిపించాడు. పొట్టికాదు, అంత పొడపూ కాదు. ముదురు తున్న వయస్సుతో శరీరం చిక్కినా, ఒడిలిపోలేదు. చీపి కళ్ళు మాత్రం అడవి జంతువు కళ్ళలా తీక్షణం గానూ, పరిశీలనగానూ కదులుతున్నాయి. ముఖంలో ఫ్లూయిడ్ ఎక్స్ ప్రెషన్. మంట వెలుగులో అప్పుడప్పుడు వాడి జిడ్డు తేరిన చెక్కిళ్లు ఎగిరిపడుతున్నాయి. 

తుంగడ్డి గుబుర్లు, గాలి వీచినపుడల్లా బుడగలు కక్కుతూన్న జంయ్ మనే ధ్వని. వర్మ ఏమీ తోచక డిబిరిగాడిని మాటల్లోకి దించాడు.

“నీది ఏ ఊరు?” 

“ఊఁ?” అని తంపర మీదికి పరధ్యానంగా చూశాడు. 

దూరంగా ఏదో గచ్చకాయలు గుటక వేస్తున్నట్లు పెద్ద పక్షి చప్పుడు చేసింది. 

“గూడబాతు . చేపల్నిగాగలో గొగలిస్తోంది ” అన్నాడు డిబిరిగాడు. 

తప తప మని పెద్ద రెక్కలతో నీళ్ల మీద కొట్టుకొంటూ ఎగిరి పోయి దూరంగా జమ్ము దుబ్బుల్లో వాలింది. 

“ పెలికన్! ” అన్నాడు వర్మ 

“ఊఁ…. అని వర్మ అంతకు ముందు వేసిన ప్రశ్నకి సమాధానంగా “ నక్కలోణ్ణి ” అన్నాడు

ఏ ఊరు?”

“ అన్నీ ఊళ్లూ తిరుగుతుంటాం. ఎక్కడుంటే అదే మా ఊరు.. ఈ భూమంతా మాదే”. అని ముడుకుల మీద చలికి చరుచుకుంటూ వర్మవైపు చూడకుండానే పక పక నవ్వి తుంచేసినట్టు ఆ పేశాడు-

నిశ్శబ్దం.

ఆ నవ్వు ఆనందంగానూ లేదు-వెకిలిగానూ లేదు- అదోలా అనిర్వచనీయంగా ఇన్ కొహెరెంట్ గా వుంది. 

“ఇక్కడ ఈ రాత్రప్పుడు ఏం చేస్తున్నావు?” 

“ఏటకి వచ్చాను. లాంతరు నెత్తినెట్టుకొని నీటిలో బురదలో, తుంగల్లో, నాచులో చాలా సేపు తిరిగాను..” 

”లాంతరా! ” ఆశ్చర్యంగా అడిగాడు వర్మ. డిబిరిగాడు కూడా వర్మవైపు ఆశ్చర్యంగా చూశాడు. 

“దీపం ఎలుతుర్లో ఏట దొరా! లాంతరు లైటుకి పిట్టలు ఎగిరొచ్చి వాల్తాయి. మచ్చల పిట్టలు. రెక్కల మీద, వీపు మీద చుక్కలుంటాయి. 

ఆ జాతి పిట్టలు ఇక్కడివి కావు.. చలికి ఎక్కడి నుంచో ఎగురుకొస్తాయ. ఈ ఏడు ఇక్కదిగుతున్నాయి. నిన్ననే చూశాను. ఈరోజా లాంతరు తెచ్చాను. చీకట్లో నేను కనిపించను. నీట్లోనే ఉంటాను. నా బుర్రమీద లాంతరు మాత్రం కని పిస్తుంది. లాంతరు దగ్గర వాలగానే కింది నుంచి నీట్లో నుంచి గబుక్కున లాగేయాలి. పక్క పిట్ట కూడా పోల్చుకోకూడదు. ఈ ఏటకి మంచి చేతి వాటం కొవాలి- ఈ ఏటను చిన్నప్పుడు మా బాబు దగ్గర నేర్చుకున్నాను- కాళ్లని, రెక్కల్ని, పీకని ఒకేసారి చప్పుడు కాకుండా పట్టుకుని నీళ్ళ కిందకి లాగేసి బుట్టలో దూర్చేయాలి.” 

“పిట్టలు దొరికాయా?” 

”రెండు మూడు దీపం ఎలుతుర్లో చెక్కర్లు కొట్టాయి. నా చెంపకి కూడా వాటి రెక్కలు రాసు కెల్లాయి.. చారల పిట్టలు దొరుకుతాయని సంతోషపడిపోయాను కాని..” 

“కానీ?” 

“కానీ.. నువ్వు దూరంగా జోడు నల్లీల తుపాకి పేల్చావు. ఆ శబ్దానికి అవి పారిపోయాయి. మరి దిగవు! ” అని అర్ధం కాని నవ్వు మళ్లీ నవ్వాడు.

కళ్లలో మాత్రం నీ ఏటతో నా ఏటకి దెబ్బ కొట్టేశా వనే నిస్పృహ వర్మకి కనిపించినట్టయింది. చీకట్లో అరప మీద నుంచి తుంగ గుబుర్లో కనిపించిన వెలుగు డిబిరిగాడి లాంతరని ఇపుడర్ధమయింది.

కొంచెం గిల్టీగా మనస్సు చివుక్కు మంది. తలదించుకొని పక్కనున్న ఎండుటాకుల్ని అప్రయత్నంగా రిపోతున్న మంటల్లోకి వేస్తున్నాడు. మళ్లీ నిశ్శబ్దం . మంటల్లో ఆకులు చిట్లుతున్నాయి. 

“ నువ్వు వేట చేస్తున్న సంగతి  నాకు తెలీదు . అయామ్ సారీ ” అని చెబుదామనుకుని తల పైకెత్తాడు. 

డిబిరిగాడు సంచీలో నుంచి నాటుసారా సీసా తీసి గడ గడ తాగేస్తుంటే వాడి గొంతుముడి కిందికీ పైకీ కొట్టుకోడం ఎగిసిన ఆకులమంట వెలుగులో కనిపిస్తోంది. సీసా దించి తుపుక్కున ఉమ్మి చేత్తో మూతిని రాసుకున్నాడు. 

ముఖం మీద కండరాలు ఎరుపెక్కి వణుకుతున్నాయి. కణతల కింద నరం చూస్తుండగనే ఉబ్బెక్కింది. గట్టిగా ఒగిర్చాడు. ఊపిరి భారంగా పీలుస్తున్నాడు.. ఆకాశం వైపు చూస్తున్నాడు. శుక్రుడు ఉయించాడు. మరో చంద్రుడిలా, నక్షత్రం కాంతి చిమ్ముతోంది. శుక్రుడు లోనించి ఉండుండి గంగులు మారుతున్నాయి. ఆకాశం కొత్త కాంతిని సంత రించుకొంటోంది.  డిబిగిగాడు తదేక ధ్యానంతో ఆ నక్షత్రాన్ని చూస్తున్నాడు. ముఖ విచిత్రానుభూతితో కాంతివంత మౌతోంది. ఈ మాటు పెదాల మీద నవ్వు అస్పష్టంగా లేదు. సారా నిషాలో మత్తెక్కిన ఎర్రటి కన్నుల్లో కామం పొంగులు కక్కుతోంది

ఒక్కసారి వేట సంగతి మర్చిపోయినట్లు మాట తుంచేసి గతంలోకి గంతేసినట్లు  “ దొరా… అటు సూడు.. ఆ చుక్క.. రంగులు మారుస్తోంది. రంకు చుక్క!” అని కట్టతెంచుకున్న ఉద్వేగంతో ఆ చీకట్లో కంగున అరిచాడు.

ఎగూపిరి-ఆనందం- అవధులు దాటుతున్న మద పిచ్చి నవ్వు. “ఆ చుక్కని చూస్తే ఆడదానికీ, అడివిలో పులికీ దూలెక్కి పోద్ది. కత్తిలాంటి కసి దీనియమ్మ…” 

“లస్క్ ఠపక్!” అని గెంతుతున్నాడు.

 మంట వెలుగులో చెవి రింగులు ఉండుండి తళుక్కుమంటున్నాయి. అదేదో భాషలో అరుచుకుంటూ, 

గొణుక్కుంటూ పిక్కల్నీ తొడల్నీ చరుచుకుంటూ కసి కసిగా నవ్వుకుంటూ భూమ్మీదపడి ముడుచుకొని మంట చుట్టూ దొర్లుతున్నాడు. వాడి వింత చేష్టలకి వింత అరుపులకి వంత పాడుతున్నట్లు సీజర్ కూడా అరుపు లంకించుకుంది. 

కుక్క అరుపుకి డిబిరిగాడు లేచి నించు న్నాడు. తడిసిన గుఱ్ఱంలా ఒళ్లు విదిలించుకుని, డుగులు తడబడుతూ, మెల్లగా తూలుకుంటూ నాటుసారా కంపు కొడుతూ దగ్గరగా వచ్చి వర్మ రెండు జబ్బలూ పట్టుకొని సరదాగా ఊపాడు. 

మందు ఎక్కువైపోయిందనుకున్నాడు మనస్సులో వర్మ. .

“రెండు సీసాకాయిల్ని ఎత్తగలను. కొంచెం వేడెక్కింది , అంతే ” అని వర్మ మనస్సులోని ఉద్దేశాన్ని క్షణంలో పసిగట్టినట్లు అన్నాడు.

 “ఆ చుక్కని చూస్తుంటే గుర్తుకొచ్చింది .. లంజి కూతురు.. ఏం ఫిటింగు దొరా..” ని వర్మ వైపు బూతుగా చూసి కన్ను కొట్టాడు. 

“పెళ్లామా?”

“ఊహు.. నేను…. ఉంచుకున్నాను. ఛత్- ఛత్- కాదు, అదే నన్ను ఉంచుకుంది.. మా జాతిది కాదు. అది పెద్ద జాతిధం. సంచారి తెగదే. మొగుడొదిలేసింది. సోది చెప్పుకుంటూ ఊర్లంట తిరుగుతుండేది.. నా పక్క చెట్టుకిందే ఒండుకునేది. మాకు మెల్లగా ఇలాకా కుదిరింది.. తగులు కున్నాం.. అప్పటి నుంచీ సచ్చిందాకా ఇద్దరం కలిసే ఊర్లు తిరిగాం. పగలంతా సోది చెప్పి గుంట నాకొడుకులికి  పెట్ట మందు అమ్మి చాలా బియ్యం , డబ్బులు తెచ్చేది. నేను ఏట చేసి పిట్టల్ని, ఉడత చర్మాల్ని అమ్మి ఇంతో కొంతో తెచ్చేవోణ్ణి.  రాత్రి కాగానే పూటుగా తాగి పిట్ట మాంసం తిని చెట్టుకింద కౌగలించుకు పడుకుండేవోళ్లం. తింగరి లంజ-ఒకొక్కసారి కస్సు బుస్సు మనేది. ఒకరోజు అడిగాను కదా నువ్వు అమ్ముతున్న ‘“ పెట్ట మందు” ఏంటీ అని. చెప్పాను కదు సారూ తింగరిది- పొగరు మోదీ. అబద్దమాడదు. నిజం చెప్పదు. ఆ గుండని ఏ ఆడదాని మీద జల్లితే అది ఫిటింగులో పడిపోద్దట దొరా. అదేటో నాకు నమ్మకం కుదరలేదు. ఒరోజు దానికి తెలీకుండానే దాని బుట్టలోంచి గుండ తీసి దానిమీదే జల్లినా. అంతే దొరా. మంచి ఎన్నెల కాస్తోంది. అర్ధరాత్రి. ఎండాకాలం. తా గీసి పడుకున్నాం . ఆ మగతలో ఏదో నీడ కదిలి నట్లయింది. ఇంకేటి; అది నా పక్కన లేదు. ఎదురుగా నిల్చోనుంది. ఒంటిమీద గుడ్డలేదు. ఎన్నెట్లో దాని సంకా, సన్నూ పిటపిట లాడిపోతున్నాయి. అది కూడా తాగేసుందేమో! అది ఊపిరి తీస్తుంటే దాని బొడ్డూ, తొడలూ ఎగురుతున్నాయి.. ఉండలేకపోయాను దొరా! నాకు ఎర్రెత్తిపోయింది. నేను కూడా గుడ్డలు ఊడదీసి ఇసిరి పారేసి అమాంతంగా దానిమీద పడి పట్టుకోబోయాను….  అసలే తింగరి లంజ – తన్నరాని చోట తన్నేసింది. 

“అమ్మో” అని నొప్పితో కిరకిరలాడుతూ తొడల మద్దిన పట్టుకొని గింజా కుపోతూ దాని చుట్టూ గెంతాను.

“నక్క లంజికొడకా, నా మందు నాకే పెద్దావురా పిచ్చి లంజి కొడకా…ఆ మందుకి నాకు దూలెక్కిం దనుకుంటున్నావా? కాకుల్ని చంపి, దాని పీకా కాళ్ళు కోసేసి ఈకలు దూసేసి పావురాలు బొచ్చు  అంటించేసి పావురాలని అమ్మేస్తుంటే జనం కొనీయడం లేదురా? అలాగే నా మందూనూ. నక్కల నా కొడకా; నువ్వెంత మాయలంజకొడుకువో-మొగుడొదిలేసినాన్ని మరినేనెంత కేటు లంజనో; పోల్చుకోలేకపోయావురా! నా మందుకి నాకే దురదెక్కి గుడ్డలిప్పీసానను కుంటున్నావ్.  కాదురా, నా కొడకా- అటుచూడు – ఆ చుక్కని చూడు. అది మారుస్తున్న రంగులు చూడు” అంటూ మీది నుంచి కింది దాకా దాని ఒళ్లంతా వెన్నెల్లో ఆ చుక్క మెరువులో చూపిస్తూ ముందుకొచ్చింది.

 నాకు కసెక్కిపోయింది. అమాంతంగా దాని జుత్తు పట్టుకొని దాని ళ్లలోకి చూశాను. ఎరుపెక్కిన కళ్లు ఆ చుక్క వెలుగులో మరింత ఎర్రగా పొంగిపోతున్నాయి. కైపెక్కిన గాడిదలా దాన్ని ఒక్క తన్ను తన్నాను. 

” అమ్మలంజకొడకా” అని నక్కలా మీద పడి భుజం కొరికేసింది.

దాన్ని జాతు పట్టుకొని భూమ్మీద గొరగొర ఈడ్చుకుంటూ తన్నుకుంటూ చెట్టు దగ్గరకి ఈడ్చుకొచ్చాను. 

అలా చాలా సేపు తన్నుకున్నాం. కొట్టుకున్నాం. కొరుక్కున్నాం. కుమ్ములాడుకున్నాం. తరువాత దొరా! అప్పుడందుకొంది మజా! ఫిటింగులో దిగిపోయాం. ఫిటింగ్.. లంజికి ఫిటింగులో కూడా తింగరితనమే.. మామూలు ఫిటింగ్ కాదు దొరా ఓహ్! దానిది గొప్ప పొగరుమోతు ఫిటింగ్! – లంజ మీదికి ఎక్కిపోయి చఫక్ చఫక్ మని పెట్టని పుంజెక్కి కుమ్మేసి నట్లు కుమ్మేసింది. గస్కీ మీద గస్కీ.. స్కీ. గొప్ప ఫిటింగ్ దొరా! అదీ, ఆ చుక్కలోని మజా” అని చీకట్లో చెయ్యి జాపుతూ సుదూరంగా  ఆకాశంలో తళుక్కుమంటున్న శుక్ర నక్షత్రాన్ని చూపించాడు. డిబిరిగాడు అలా చెబుతున్నంత సేపూ ఒంటి మీద తెలివిలేనట్లుగా పూనకంలా ఉన్నట్లు చెప్పుకుపోయాడు. 

“సంవత్సరం తిరక్కుండానే ఎర్రి నక్క కరిచేసింది. నక్కలాగ అరిచి అరిచి చెట్టు కింద చచ్చి పోయింది” అని చీకట్లోకి చూస్తూ చెబుతున్నప్పుడు ఏదో బాధని గుటకేస్తూ చెబుతున్న ట్లనిపించింది. 

నిశ్శబ్దం..

 “దాని జాతోళ్లు గాని, మా జాతోల్లుగాని రాలేదు దొరా- నేనే దాని శవాన్ని భుజాని కెత్తుకెళ్లాను. దాని నోట్లోంచి సొంగలు కారుతున్నాయి. రవతల చెరువు గట్టు కింద గొయ్యి తవ్వి దాన్ని నా చేతుల్తోనే కప్పెట్టేశాను.. లంజికూతురు..! ఆ రాత్రి చెట్టు కింద దాని బుట్ట ఎదికాను. సవరాలు, ఫిట్టింగ్ మందు పొట్లాలు, పాత చీరలు వే మిగిలిపోయాయి. అది నన్నోదిలేసి ఎలిపోయింది…” అని అప్రయత్నంగా అది చేతి మీద పొడిచిన పులిపచ్చ బొట్టుని చేత్తో రాసుకుంటూ చీకట్లోకి చూస్తూ చెబుతున్నాడు.  ‘అలా కునుకు పట్టేసింది. నిద్దట్లో పక్కని చెయ్యేసా-ఎపుడూ బరువుగా తగిలేది. ఇపుడు నేదు. ఆ జాగా ఖాళీ చేసి వెళ్లిపోయింది. చెరువు గట్టు దగ్గర దూరంగా పెద్ద నక్క అరిచింది అరుపు. గతుక్కుమని పోయాను..కంగారెత్తిపోయాను. నా ఆడదాని పీనుగుని, ఇన్నాళ్లూ నా పక్కన తొంగున్నదాన్ని గోతిలో నుంచి నక్కలు లాగేస్తున్నాయేమో.. పీక్కు తింటున్నాయేమో!!. తుపాకీ పట్టుకొని తుప్పల్ని, డొంకల్ని దాటుకుంటూ ఆ చీకట్లో పరుగెత్తుకుంటూ చెరువు గట్టు దగ్గరికి పరుగెత్తాను. దాని గోతి దగ్గర నక్కలు చీకట్లో కాట్లాడుకుంటున్నాయి. నా లికిడి ఇని పారిపోయాయి. అప్పటికే గొయ్యి సగం తవ్వేశాయి. గోతిలో నుంచి దాని చెయ్యి నిటారుగా బయటకు తన్ను కొచ్చింది. చీకట్లో నన్ను పిలుస్తున్నట్లు అనిపించింది. సారూ! దాని గోతి దగ్గరే గుండేసి కొట్టేసు కుని సచ్చిపోవాలనిపించింది…” గొయ్యి చేతుల్తోనే తవ్వి మరింత పెద్దది చేసి; దాంట్లో దాని చెయ్యిని, శవాన్ని లోతుగా కుక్కాను. దాని ముఖం ఉబ్బిపోయింది. కుక్కుతున్నప్పుడు దాని ముక్కంనోటంట నీళ్ళు బొళ బోళమని తన్నుకొచ్చాయి… పసరు కంపు.. అలా నా ఆడదాన్ని మళ్లీ కప్పెట్టేశాను. తెల్లవార్లూ తుపాకీ పట్టుకొని గోతి కాడ కాపలా కాశాను.అప్పుడప్పుడు తుప్పల మధ్య నక్కల కళ్లు మెరుస్తుండేవి”.

తెల తెలవారుతుందనగా దూరంగా దుమ్ములగొండు అరిచింది.

విషాద చరిత్ర వింటూ చుట్టూ చీకటి కూడా చచ్చుబడిపోయినట్లు అనిపించింది వర్మకి. 

నిశ్శబ్దం..

డిబిరిగాడిది, వాడి జీవితంలానే భాష కూడా వేరు. సంచార జాతి. అన్ని ఏసలా కలగాపులగం. అరవం, ఉరుదూ ముక్కలు, అక్కడక్కడ ఇంగ్లీష్ చమక్కులు వాడి జీవిత దర్పణంలా ప్రతిబింబిస్తున్నాయి.

ఆ నిశ్శబ్దంలో డిబిరిగాడి మాటల్ని తనకి అర్ధమయ్యే భాషలో అనువదించు కుని మనస్సుతో అర్ధం చేసుకుంటున్నాడు వర్మ. 

భాషా సంకెళ్ళని తెంచుకొని రెండు మనస్సులు మాట్లాడు కొంటున్నాయి. కెప్టెన్ వర్మకి కళ్లు చెమరుస్తున్నాయి. చీకట్లో నాచు మీద కోక్కొక్కొ అని ముసలి కొంగ దగ్గింది. డిటిరి గాడు చెవులు రిక్కించి విన్నాడు.

“దీనియమ్మ , వస్తానుండు దొరా! ” అని నేల మీది నుంచి నీట్లోకి దిగుతున్న మొసలిలా గట్టు మీద నుంచి తూలుకుంటూ బురదలో జారు కుంటూ తంపర్లో దిగిపోయి ఈదుకుంటూ చీకట్లో మాయమయ్యాడు. 

మంచు బాగా కురుస్తోంది. నక్షత్రాలు మంచు పొగల్లో నుంచి ఒక్కొక్కటి మసక బారి వెల వెల బోతూ నీరసించి పోయి రంగు మారుతున్న కాశంలోకి ఇంకిపోతున్నాయి. 

దూరంగా వేగు చుక్క మాత్రం గుతోంది. నీళ్ళలో అలజడి , కెప్టెన్ వర్మ ఒడ్డున మంటకి మరింత దగ్గరగా వచ్చాడు. డిబిరిగాడి సంచీ పక్కనే వాడి తుపాకీ కూడా ఉంది. నీడలో దాన్ని వర్మ ఇంతకు ముందు గమనించలేదు. వేటగాడు వర్మ తుపాకీ చూడ గానే ఉత్సాహంతో దాన్ని తీసి పరిశీలనగా చూశాడు. పాతబడిన నాటు తుపాకీ . అందు లోనూ దట్టింపు తుపాకీ , వాడకంలో ఉండటం వల్ల బాగా పాతదైనా జంగు పట్టక పనిచేస్తోంది. ఖాళీ తుపాకీని సరదాగా భుజానికి ఆనించాడు. బాలెన్స్ సరిగా లేదు. సర్దుకుంటూ మంట వెలుగు ల బేరల్ మీది నుంచి చీకటిలో కి గురి చూస్తూ విశాలమైన తంపర మీద గురిసారిస్తూ మెల్లగా తిప్పు తున్నాడు. నీట్లో అలజడి . తుపాకి గురిలో నల్లటి నీడ నీట్లో నుంచి లేచింది. 

డిబిరి గాడు బుదలోంచి నాచును తొక్కుకుంటూ గట్టెక్కుతున్నాడు. వాడి భుజం మీద తడిసిన వల. చంకలో నత్తగొట్టు. లిలో వణికి పోకుండా ఉన్నా గబ గబా అంగలేసుకుంటూ వేడికి మంట దగ్గరకి వచ్చి కూర్చున్నాడు వలని వక్కన పెట్టి నత్త గొట్టుని దగ్గరే ఎత్తివడేశాడు. ఆది పడిన దగ్గరే కదలకుండా మంట వేడిలోకి చెవిటి చూపులు చూస్తోంది. డిబిరిగా కు ఒంటిమీద కారుతున్న బురద నీటితో మంటలోకి దూరి పోతున్నట్ల కూర్చున్నాడు. తుపాకీ చేత్తో పుచ్చుకునే జేబులోంచి సిగరెట్టు తీసి “ఇంద, కాల్చు” మని ఇచ్చాడు వర్మ. డి బిరి గాడు మంటమీదినుంచి పక్కకి వంగి కాలుతున్న కట్టెపుల్లతో సిగరెట్టు కాల్చు కున్నాడు. మంట వేడికి ముఖం చిట్లించుకుని పొగకి దగ్గుతున్నాడు. 

“సారూ, అది మర్డరీ తుపాకీ “.. అని సిగరెట్టుని బీడీలా కాల్చుతూ అన్నాడు. 

వర్మకి షాక్ కొట్టినట్లు అయింది. ఉలిక్కి పడి తుపాకీని డిబిరిగాడికి అందించేశాడు. “

“రెండు రోజుల్నుంచీ చూస్తున్నాను. ఇది బాగా బెదురెక్కిపోయింది. అరుపులో బెదురు. దీని యమ్మ దీనికే టొచ్చిందో అరవకుండా ఉండినా బాగుణ్ణు, గొంతులో సైతాన్ పట్టినట్లు దగ్గుతుంది. దీని అరుపు ఆలకించగానే ఆమడ దూరాన్నుంచే నత్తగొట్లు బెంబేలెత్తిపోయి దికుండా పారిపోతున్నాయి!” 

దేన్ని గురించి ఈ విషయం మాట్లాడుతున్నాడో వర్మకి అర్ధంకాక డిబిరిగాడి వైపు చూశాడు. 

“ఇందాక దగ్గిందే , ముసలి దగ్గు. ఈ కొంలంజిదే. బెదురు కూత. ఈ అరుపు వింటే వచ్చిన పిట్ట కూడా రాదని వలనీ, దాన్నీ తెచ్చేశాను. ” 

“ఈ నత్త గొట్టుని పెంచుతున్నావా?” 

“నత్త గొట్లని పట్టడానికి పగలే వలెయ్యాలి. రాత్రిళ్ళు నత్త గొట్లు చెట్ల మీదుంటాయి. పగలు తంపర్లలోనూ, చెరువుల్లోనూ, ఒడ్లంటా, పొలాల్లోనూ దిగుతాయి. అక్కడే వలేసి, దీన్ని వల మీద పెట్టి ఉంచుతాం. దీన్ని చూసి అక్కడ కూడా మేతుందని అవి కూడా వచ్చి వల్లో చిక్కడిపోతాయి. గాని దీనియమ్మ దీని అరుపు మారిపోయింది. బెదురు.. బెదురు..” అని దబాలున దాన్ని ఒక్క బాదు బాదాడు. 

అది నోరు జాపి ‘కేర్’ మని బాధగా కసిగా అరిచింది. దాని నాలిక ఎర్రటి పేలికలా వెలుగులో మెరిసి మూసుకుపోయింది. ముక్కుతో భూమ్మీద పొడుస్తోంది. 

“నత్త గొట్లు రాత్రిళ్ళు రావు కదా; మరి రాత్రివలేశావు?” చేత్తో వారిస్తున్నట్లు మాటల్ని ఆపాడు

ముడుకులు మీద కొట్టుకున్నాడు. 

“ రాత్రంతా నా పక్కనే ఎందుకని వలేసి పెట్టాను. ఒక్కొక్కసారి దీని అరుపుకి తెల్లారి పోయిం దనుకుని చుక్క వెలుగులో కొంగలు, నత్త గొట్లు, అరుపు వైపు గురుకుంటూ దిగిపోతాయి. గాని సాధారణంగా రావు.  గాని, సారూ; తుంగ గుబుర్లలో గూళ్ళుకట్టుకున్న కొండంగోళ్ళు. దాసరి కోళ్ళు అనుమానం గా బయటికొచ్చి అరుపు వైపు ఈదుకుంటూ చీకట్లో కానుకోలేక వలలో చిక్కడిపోతాయి. పదలు కూడా ఈ అరుపుకి అప్పుడప్పుడు దిగిపోతాయి. గాని దొరా ఇందాక మంచి పరదల మందని నువ్వు బెదరగొట్టేశావు … నువ్వు…. పరదల్ని…. “

నేనా”?…

 “నువ్వు అరప దిగి అగ్గిపుల్ల గీసి సిగరెట్టు ఎలిగించలేదూ?”

“ అవును , వెలిగించాను!” 

“ అగ్గిపుల్ల ఎలుగులో నీ తుపాకీ గొట్టాలు జిగేల్ మని మెరిసాయి. ఇంత దూరంలో నాకే కనిపిం చింది. బాగా నున్నగా మెరుగెక్కున్నాయోమో జిగ్ మన్నాయి. చీకట్లో ఆ మెరుపుకి దిగ బోతున్న పరదల మంద బెదిరిపోయి అరుసు కుంటూ గిర్రున వెనక్కి తిరిగిపారిపోయింది.” 

డిబిరిగాడికి వేటలో గల నిశిత పరిశీలనా శక్తికి ఆశ్చర్యపడిపోయాడు వర్మ. 

“ఈ నత్త గొట్టుకి రెక్కలు కత్తిరించేశావా?” 

డిబిరిగాడు అదోమాదిరిగా వర్మ వైపు చూస్తూ ఎడమ చేత్తో చటుక్కున నత్తగొట్టుని పట్టుకొని దాని రెక్కల్ని సాగదీసి మంట మీద ఎత్తిపట్టుకున్నాడు. వేడికి అది కాళ్ళు కొట్టుకుని గింజుకుంది. అలా దాని పెద్ద రెక్కల్ని చూపించి మళ్లీ నేల మీద దబ్బున పడేశాడు. అది కోడిలా రెక్కలు రెండు సార్లు కొట్టుకుని పడిన చోటనే నిటారుగా నిల్చుని మంటల్లో కాలుతున్న చితుకుల చిటపటల్ని వింటోంది. 

“మరి ది ఎగిరిపోదా?”

 “దానికి చూపులేదు, కళ్ళు కనిపించవు ”

” గుడ్డిదా? దాని కళ్లు పొడిచేశావేంటి?” దుర్దాగా అడిగాడు వర్మ. 

“ లేదు. కనపడకుండా దాని కంటి రెప్పల్ని దారంతో కుట్టేశాను. ది ఎలుతురు చూడలేదు. పిట్టని మచ్చిక చేసుకోవాలంటే ముందు దానికి చూపులేకుండా చేసేయాల.” 

డిబిరిగాడు చెబుతున్నది ఆశ్చర్యంగా వింటున్నాడు వర్మ. 

ఏ జాతి పిట్టల్ని పట్టుకోవాలనుకుంటే ఆ జాతి పిట్టనే  మచ్చిక చేసుకోవాలి. ముందుగా దానికి చూపు లేకుండా చేసేయాలి. వలేసి దాని మీద పెట్టాల. దాన్ని చూసి ఆ జాతి పిట్టలన్నీ భయం లేకుండా దాని గ్గర దిగిపోయి వలలో తగులుకొని చిక్క డిపోతాయి. మచ్చిక చేసిన పెంపుడు పిట్ట వెలుతురు చూడకూడదు. చూస్తే ఎగిరిపోయి దాని జాతి మందలో కలిసిపోద్ది. చూపులేని పిట్టతో చూపున్న పిట్టల్ని వలేసి పట్టుకోవడం. అదే ఈ వేటలో తమాషా”. 

అంతవరకు ఆశక్తికరంగానూ, ఆశ్చర్యంగానూ వింటున్న వర్మ ఇప్పుడు డిటిరీగాడు చెప్పిన దాన్ని లోతుగా లోచిస్తున్నాడు. హంటింగ్ టాక్టిక్స్ తో పాటు వాడు చెప్పిన దాంట్లో గల ఫిఫ్ట్ కాలమ్ శ్రాటజీని, పొలిటికల్ ఇండాక్ట్రినేషన్ని తన మిలిటరీ మేధస్సుతో విశ్లేషించుకుంటున్నాడు కెప్టెన్ వర్మ. 

డిబిరిగాడు మంట సెగకి వంటిమీద ఎండిపోయిన బురదని బకురుకుంటూ దులుపుకుంటు న్నాడు. తంపర్లో దూరంగా బార్.. బార్.. మని వెదురు గొట్టంలో నుంచి అరుస్తున్నట్లు గూడ బాతు అరుస్తోంది. 

సారూ! నా తుపాకీ ఇందాక గురి చూస్తున్నావు-ఎలాగుంది ? బాగానే కొడాది కాని కుందా మాత్రం గాడితన్ను తన్నీస్తుంది. అటు పేలడం ఇటు కుందా జెబ్బకి గుద్దెయ్యడం, గుద్ది గుద్ది నా జబ్బ కదుంకట్టిపోయింది !” అని వాడి కాలర్ టోను క్రింద వేలు పెట్టి నొక్కి చూపించాడు. 

 అక్కడ కండ కదుంకట్టి ఎండిపోయిన నల్లటి మాంసం ముద్ద అంటించినట్లు బైటకి తోసుకొ నొచ్చుంది. 

డిబిరిగాడు నిలబడి, తుపాకి గుర్రం ఎత్తి గొట్టంలో నుంచి కాలిన మందుగుండు నుసి నిప్పిల్లో నుంచి పోడానికి గట్టిగా నోటితో ఊదుతున్నాడు. 

“ అది మర్డర్ తుపాకీ అన్నావు కదా ఇందాక…. మర్డర్ చేశావా?”

డిబిరిగాడు భళ్ళున నవ్వబోయి ఆపుకున్నాడు. గారబట్టిన వళ్ళుతో గిగిలిస్తున్నట్టు గుసగుసమున నవ్వాడు.

‘నేను కాదు. నా తండ్రి… నా బాబు. ఈ తుపాకీతో ఒకే దెబ్బకి ఒకణ్ణి కూనీ చేశాడు అని ఆ తుపాకీని రెండు చేతుల్తో పట్టుకొని మొదటిసారిగా ఆ తుపాకీని చూసినట్లు తనివితీగా చూశాడు..

క్కసారి ముఖం మీద నుంచి నీడ దాటినట్లు ముఖ కవళికలు మారిపోయాయి. పెదాలు ఆవేశంగా కదులుతున్నాయి. దవడలు గట్టి పడి బిగుసుకుంటున్నాయి. భారంగా  చలిమంటదగ్గరచతికిలపడ్డాడు. మంటల వెలుగులో నిప్పుకణికల్లా ప్రతిఫలిస్తున్న వాడి కళ్ల చూపులు విశాలంగా పరుచుకున్న చీకటిలో నుంచి చొచ్చుకుపోతూ గతాన్ని చూస్తున్నాయి. 

డిబిరిగాడు గతాన్ని చెపుతున్నాడు. 

‘‘సాలా కాలం క్రిందట …. అప్పుడు తెల్ల దొరలుండేవోళ్ళు… నేను చిన్నోడ్ని… ఇప్పుడైనా నా వయ సెంతో నాకు తెలీదు. ఎన్నేళ్ళంటే సెప్పలేను. మాకు పుట్టుకలు గుర్తుండవు. సావులు మాత్రమే గుర్తుంటాయి. నా తండ్రి సావు, నా ఆడదాని సావు ఇప్పటికి గుర్రే, .. అదేదో ఊరు… పోలీసు ఠాణా పక్కన మైదానంలో మా జాతోల్లందరూ చెట్ల కింద తారు గుడ్డలు కట్టుకొని వుండే వాళ్ళం. నేను, నా బాబు వండుకునే వాళ్ళం. మా అమ్మ అమ్మోరు పడి ఎప్పుడో సచ్చి పోయిందంట. నా కసలు గుర్తె లేదు. ఏటొడ్డున పడేసిన మా అమ్మ శవాన్ని రాబందులు  పీక్కుతిన్నాయట… మాబాబు చాలా విచారంగా చెప్పేవాడు. 

క రోజు ఏటికెళ్ళిన మా బాబు చీకటి పడ్డా ఇంటికి రాలేదు. పిట్టల్ని పట్టడానికి వలే తీసి కెళ్ళాడు. తుపాకీ తీసుకెళ్ళలేదు. అడవి పందులకి పటాసు కాయలు పెట్టి పొలాల్లో రాత్రి కాసుక్కూర్చున్నా డేమో అనుకున్నాను. ఆ మరుసటి రోజు సూర్యుడు నెత్తిమీద కొచ్చినా రాలేదు.  నేను బెంబేలెత్తి పోయాను

ఇంతలో పక్కనున్న మావోడు వచ్చి, “ ఏట్రా డిబిరిగా | ఏంచేస్తున్నావ్?.. నీ బాబుని నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్లో కుళ్ళబొడిచేస్తున్నారు ” అన్నాడు. 

“ఎందుకూ ?” అన్నాను. 

“దొంగతనం చేశాడట. మాకూ పిలిపించి కొట్టి వదిలేశారు. నీ బాబు మీద ఇంకా అనుమానం తీరలేదు. మొన్న ఈ ఊరు షావుకారి ఇంట్లో దొంగతనం జరిగిందట. బంగారం పోయిందట ఎక్కడ దాచావని గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. ” 

క్షణం సేపు ఆగి కళ్లు మూసుకున్నాడు. నుదిటి మీద చిటికెలు వేసుకున్నాడు. తేరుకొని చెవి సందుల్లోంచి బీడి తీసి ముట్టించాడు. గట్టిగా దమ్ములాగి తిరిగి చెప్పడం మొదలెట్టాడు.. 

“మాకు పోలీసోళ్ళతో దెబ్బలు తినడం చిన్నప్పటి నుంచీ మామూలే.! ఎక్కడ దొంతనం జరిగినా మమ్మల్నే పట్టుకొని తంతారు. మా జాతోళ్ళం దొంతనం చెయ్యం. దొంతనాలు చేసే జాతులు కూడా ఉన్నాయట! వాళ్ళతో పాటే మమ్మల్ని దొంగల కింద జమకట్టేసి కొట్లో తోసేసి  మక్కలు ఇరగ తంతారు. మేము మాత్రం దొంగతనం చేయం. ఏట చేస్తాం. ఉంటే తింటాం. లేకపోతే ఆకలితో వస్తుంటాం. చచ్చినా అడుక్కోం ... గానీ సారూ నా జీవితంలో గతిలేక ఒకే ఒక్కసారి అడుక్కున్నాను. ఊ… ఆ సంగతి తర్వాత చెబుతానులే సారూ” 

అంటూ గెడ్డాన్ని చేత్తో బక్కురుకుంటూ తల పైకెత్తి శూన్యంలోంచి ఆకాశం మీదికి వెర్రిగా చూశాడు. 

మంచు పలచబడుతోంది. చీకటిలో చిక్కదనం తగ్గుతోంది

“నేను కంగారెత్తిపోయి పోలీస్ స్టేషన్ కి పరుగెత్తాను. అక్కడ దొరకాళ్ళు మీద పడి మా బాబుని ఒదిలేమన్నాను. ఇలా అన్నానో లేదో ఆపక్కనే వున్న పోలీసు బాబు, “ఈడు ఆడి కొడుకే సార్. ఇప్పుడు ఆడు చెప్పేస్తాడు- ఛల్ నా కొడకా” అని పిల్లి పిల్లను చెవి పట్టుకొని ఎత్తికెళ్ళినట్లు నా  జాత్తుపట్టు కొని ఎత్తి గొరగొరా ఈడ్చుకుంటూ కొట్లో తోసేశారు దొరా… దొరా!! … ” 

“దొరా! ” అని గావుకేక పెట్టాడు. 

చుట్టూ ఆవరించుకున్న నిశ్శబ్దంలో చీకటి అద్దం గళ్ళున పగిలి నట్లైంది. వర్మ ఆ కేకకి నిశ్చేష్టుడైపోయి వింటున్నాడు. బాధతో అరిచిన అడవి మృగంలా వుంది ఆ కేక. డిటిరిగాడు ఒళ్ళో వున్న తుపాకీ మీద తల పెట్టి కళ్లు మూసుకున్నాడు. అలా మూసు కున్న కళ్ళకి గతంలోని ఒక భయంకర దృశ్యం కన్పించింది. అలా కళ్ళు మూసుకునే చెబు తున్నాడు… 

“దొరా! నా తండ్రిని రెండు చేతులూ చాచి కట్టేసి దూలానికి వేళాడదీసేరు. గోచీ తప్ప వంటి మీద గుడ్డలేదు. కాళ్ళు కట్టేసున్నాయి. కొట్లో చీకటి చీకటిగా వుంది. లాంతరు వెలుగులో చూసే సరికి నాకళ్ళు తిరిగిపోయాయి. దబ్.. దట్… ఫట్… దబా దబ్ … లాఠీ దెబ్బలు. వంటి నిండా దెబ్బలు. అక్కడక్కడ చర్మం చిట్లి రక్తం ముద్దకట్టేసింది. గావుకేకలు – కాళ్ళు తన్నుకోలేక గింజు కుంటున్నాడు. దెబ్బలు ఆగడం లేదు. 

““చెప్పరా? బంగారం ఎక్కడ దాచావో”

“బాబూ… నాకు తెలీదు….” ” నోటిలో మాట నోట్లోనే వుంది మళ్ళీ దెబ్బలు, కేకలు, బొబ్బలు నోట్లో నుంచి రక్తం చొంగలా కారుతోంది. 

“ఆపు- ఇప్పుడు చెపుతాడు వాడు క్కడ దాచాడో – చూసుకో. ఇదిగోరా నీ కొడుకు. నీ ఎదుటే ఈడ్నీ కొట్టి సం పేస్తాం… ఏంట్రా చెప్పవా? ధనముని నాబుర్ర గోడకేసి కొట్టేశారు. నేను పడిపోయాను. గుండెల మీద, కడుపు లోనూ బూట్లతో కుమ్మేస్తున్నారు. లాఠీలతో కుళ్ళ బొడి చేస్తున్నారు”. 

“బాబోయ్ అన్నాను. అమ్మోయ్ అన్నాను. ఒకొక్క అరుపుకి ఒక్కొక్క దెబ్బ. క్రితం రాత్రి తిన్నది కక్కేసుకున్నాను. ఉచ్చేసుకున్నాను.  జత్తులో నుంచి కారిన నెత్తురు పెదాలకి ఉప్పగా గుల్తోంది.” నా అరుపులకి మా బాబు గెద్దకి రెక్కలు ఇరిసేసి దాని ఎదురుగానే దాని పిల్లని చుట్టుముట్టేసి సంవేస్తున్న బావురు పిల్లుల్ని చూసి అరుస్తున్నట్లు కోపంగా పీండ్రించుకుంటూ దూలానికి గింజాకు పోతున్నాడు. 

. “దొరా, సలు ఎందుకు కొడుతున్నారో నాకు తెలీదు! నేనేం చేశాను? అంతా నాకు అయో మయంగా అనిపించింది.. అంతా చీకట్లు కమ్ముతున్నాయి. నా ఒంటి మీద దెబ్బలు వినిపిస్తున్నాయి. కాని బాధ తెలియడం లేదు. మగత కమ్మేస్తోంది. మగతలో చివరిసారిగా విన్న మాటలు. 

“ఆపండి.. ఆడ్ని ఒదిలెయ్యండి. నేను నిజం చెబుతాను” అని కిరకిర లాడిపోతున్న మా బాబు గొంతు. 

నవ్వులు

“నాకు స్పృహ తప్పిపోయింది.” 

తెలివి వచ్చేటప్పటికి పోలీసు కొట్లో మా మూలుగులు . కంపు, రొచ్చు, పక్కనే అన్నం, 

నీళ్ళు. మా బాబు నీళ్ళతో నా ముఖం కడిగాడు. 

“ ఏడ్చి ఏడ్చి తడా రిపోయినట్లు ఆడి కళ్ళు గాజూ కళ్ళలా వున్నాయి  తినండి నా కొడకల్లారా! తిని, ఎల్లి ; ఒంటికి కాపడం పెట్టుకుని పడుకొండి. రాత్రి పారిపో గలరు,  జాగ్రత్త ! రాత్రంతా మావోడు నీ డేరా దగ్గర కాపలా ఉంటాడు. తెల్లారగానే నేనే వస్తాను. బంగారం ఎక్కడ దాచావో.. పాతి పెట్టావో చూపుదువుగాని”- అని నన్ను పట్టుకుని ఈడ్చుకెళ్ళి బాదిన పోలీసు బాబు దమాయించి చెప్పాడు. 

దెబ్బలతో ఒళ్ళు పచ్చి పుండులా వుందేమో అన్నం తినాన్నా తినలేపోయాను. అన్నం ముద్దల్ని చేత్తో పట్టుకోలేకపోతున్నాం. వేళ్లు వాచిపోయున్నాయి. సలుపులు, కడుపులో ఆకలి మాడ్చేస్తుందేమో తినలేక తినలేక ఇంత తిని నీళ్ళు తాగాం . 

”మరేం ఫర్వాలేదు. ఈళ్ళెక్కడికి పారిపోరు. ఈ కొట్లోనే ఉంచితే మొండి నా కొడుకులు మొండికేసి అసలు చెప్పడం మానేసి నాకు తెలీదు అని మళ్ళీ మొదటికొస్తారు. మనం వదిలేసినట్లు నమ్మకం కలిగించాలి. అప్పుడు పూర్తి నిజం చెప్పేస్తారు…. కొంచెం నిఘా ఉంచు రాత్రంతా-” అని పక్క గదిలో ఇంకో పోలీసుతో గుసగుసలాడడం కొట్లో నుంచి బయటికి వస్తున్న నాకు వినిపించింది.. 

“ఒరే, మేమెంత పోలీసోళ్ళమైనా, మా డ్యూటీలో ఎంత కొట్టినా మేమూ మనుషుల మేరా! మాకూ కనికరం ఉంటుంది. టీ తాగుతాంట్రా?” 

ఒద్దన్నట్లు తలూపి. నేనూ మా బాబు కొట్లో నుంచి బయటకొచ్చాం. ఒళ్ళు తూలిపోతోంది. అప్పటికే చీకటి పడింది. చెట్టు కింద కొచ్చాం. నేనే లాంతరు ఎలిగించాను. మా తండ్రి పెదాల్లో నుంచి కారుతున్న నెత్తురుని చేత్తో ఒత్తుకుంటున్నాడు. కాపడానికి వేడి నీళ్ళు పెట్టనా- అన్నాను. ఒద్దన్నాడు.  

ఎండాకాలం చల్ల గాలి వీస్తోంది. 

“బాబా, నువ్వు దొంగతనం చేశావా? – అని అడిగాను.

 దానికి సమాధానంగా నా జుత్తుని నిమురు తూ- నువ్వు పడుకో- అన్నాడు. నాకు నిద్రపట్టేసింది. ఒకటి రెండుసార్లు తెలివి వచ్చి చూసేసరికి నా బాబు నా పక్కనే కూర్చుని నా ముఖంలోకి చూస్తున్నాడు. తెల్లవారుజాము మగత 

నిద్రలో నా కాళ్లు పడుతున్నట్లు కూడా అనిపించింది. ఆడు రాత్రంతా పడుకోలేదు. 

“తెల్లారి నేను లేచేసరికి ఆడు దో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. రాత్రంతా నిద్రలేమితోనూ అంతకు ముందు తిన్న దెబ్బలతోనూ బాగా అలసి పోయినట్లున్నాడు. ముఖం కమిలిపోయి నిప్పుల్లో కాలీ కాలని కర్ర పెండలం దుంప రంగులో ఉబ్బిపోయింది. ఏంరా, టీ తాగావా? – అని రెండు గ్లాసులతో టీ తెచ్చాడు మాకు తెలీకుండా కాపలా కాస్తున్న పోలీసు. మా బాబు వాడివైపు ఎగాదిగా చూసి రెండు గ్లాసులూ అందుకున్నాడు. ఇద్దరం టీ తాగాం”.

“సూర్యుడు ఉదయించాడు. డేరాలోకి చొచ్చుకువస్తున్న సూర్యకాంతిని వాచిపోయిన చీపి కళ్ళతో మా బాబు చూస్తున్నాడు. వాడి చూపుకి అడ్డంగా నీడలా; నన్ను ఈడ్చుకెళ్ళిన పోలీసు వచ్చాడు. 

“ఏంట్రా? వెళ్లామా? – ఇంకా టీకావాలా?” – అన్నాడు పోలీస్. 

ఆడ్ని కూడా మా బాబు కింద నుంచి మీదకి చూశాడు. లేచి నుంచున్నాడు. ఒళ్ళు బద్దకంగా విదిలించుకున్నాడు. పోలీసుని చూసిన మా బాబు ఎప్పుడూ లేనిది మెత్తగా నవ్వాడు. పెదాలు నవ్వుతున్నాయి. కళ్ళు మాత్రం క్రూరంగా చూస్తున్నాయి. అంతే-మెరుపు వేగంతో పక్కనున్న తుపాకీ అందుకున్నాడు. 

“ ధూమ్... నాటు తుపాకీ గుళ్ళను కక్కింది- పోలీసు ఆమడ దూరాన డేరా నుంచి ఎగిరి పడ్డాడు . 

“రాత్రి ఒకటికి రెండు బార్లు మందు పోసి గుళ్ళు దట్టించి ఉంచిన తుపాకీ సూర్యోదయాన వాడి గుండెల్ని చీల్చేస్తూ గర్జించింది. ఆ శబ్దానికి చెట్ల మీద కాకులు అర్చుకుంటూ మంద మందలు గా ఎగురుతున్నాయి.. పోలీసు శవం నెత్తుటి మడుగులో పడి వుంది. ఖలేజా బయటకు వచ్చే సుంది. చుట్టుపక్కల వారంతా గుమికూడి తోసుకుంటూ ఆ శవాన్ని చూస్తున్నారు. నాటు తుపాకీ మందు వాసన గాలిలో తేలుతోంది. మా తండ్రి దగ్గరకి ఎవరూ రాలేకపోతున్నారు. చేతిలో ఇంకా పొగలు కక్కుతున్న తుపాకీ వుంది. ఆలా తుపాకీతో మరి వెనక్కి తిరిగి చూడకుండా అందరు చూస్తుండగా నడుచు కొంటూ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాడు-

“ దొరా! నిన్న నేను దొంగతనం చేసానని ఒప్పించాడే అది పచ్చి అబద్ధం. నేను దొంగతనం చేయలేదు. ఇప్పుడు నేను ఖూనీ చేశాను. ఇది పచ్చి నిజం. నేను చంపాను. అందుకే చంపిన తుపాకితోనే లొంగిపోతున్నాను. ఇదుగో తుపాకీ-ఇంకా వేడిగానే వుంది. పొగలు కక్కు తోంది”ని పోలీస్ ఇన్ స్పెక్టర్ బాబు ముందు మా బాబు లొంగిపోయాడు. 

““మా బాబుని మూసేశారు. ఎక్కడో జైలుకి తీసుకెళ్ళిపోయారు. నేను ఒంటరి వాడ్ని అయి పోయాను”- అంటూ నిట్టూరుస్తూ కధ ముగించినట్లు లేచి నించున్నాడు డిబిరిగాడు.

 తుపాకీ గొట్టం లోంచి మరొక్కసారి గాలి ఊదాడు. సంచీలోంచి వెతికి చిన్న డబ్బీ తీసి అందులో నుంచి తుపాకీ మందు గొట్టంలో పోసి కాయితాలు కూరి దట్టిస్తున్నాడు… అలా దట్టిస్తూనే మళ్ళీ మొదలు పెట్టాడు . 

“నాకు మర్డర్ కేసులో సాచ్చిగా ఏశారు. కేసు పైసలా అయ్యేదాకా ఆ ఊరు కదలొద్దు అని కట్టడి చేశారు. రోజూ పోలీస్ స్టేషన్లో హాజరీ ఏయించుకోవాల. కొత్తలో పిచ్చిగా అటూ ఇటూ తిరిగాను. మా వోళ్ళు ఇంత అంబలి పోసేవాళ్ళు. సంచార జాతోళ్ళం కదా, వాళ్ళు కూడా ఊరు విడిచి పెట్టి వెళ్ళిపోయారు. నేను బతకాలి కదా! నాకు అప్పటికి తుపాకీ ఏట తెలియదు… వలేసి పిట్టల్ని పట్టి ఊరులో అమ్ముకునే వాడ్ని”. 

మరో డబ్బా తీసి అందులోని సీసపు రవ్వల్ని తుపాకీ గొట్టంలోకి పోసి కాయితం మడిచి ఇనుప రాడ్డుతో సద్దుతున్నాడు. దట్టించలేదు… “సారూ! రవ్వలు నింపిన తర్వాత దట్టించకూడదు. మందు మీద కూరుతూ సద్దాలి. తుపాకి పేలగానే రవ్వలు జల్లి డిలా విడిపోవాల.. ఎక్కువ పిట్టలు పడతాయి” – అంటూ నాటు తుపాకీలోని టెక్నిక్ ని కెప్టెన్ వర్మతో చెపుతున్నాడు. తుపాకీల సంగతి తెలిసిన వర్మ ఆ నాటు తుపాకీ బాలిస్టిక్స్ గురించి ఆసక్తికరంగా వినడం లేదు. ఆనాటు మనిషి జీవితంలోకి అన్వేషిస్తున్నాడు. 

“నాలుగైదు సార్లు కోర్టుకు తిప్పారు. అబద్దమాడకూడదని పోలీసులు బెదిరించేవారు. కోర్టు లో ఏదో ప్రమాణకం కూడా చేయించావోరు. – నేను ఎందుకు అబద్దమాడుతాను సారూ! నేను కళ్ళారా మా బాబు పోలీసును చంపడం చూశాను. మా బాబే చంపేశాడని చెప్పాను”. 

“ బోనులోంచి మా బాబు- ఒకే దెబ్బతో పైసలా చేసేశాను- అని ఉడుం బుసకొట్టినట్టు బుస కొట్టీవోడు. మా బాబుని కలిసేవాడ్ని. సింహంలాంటి వోడు బక్క చిక్కిపోయాడు. గానీ డీలా పడిపో లేదు. నువ్వు నాకోసం బెంగెట్టేసుకోకు. తిరిగొచ్చేస్తాను

బాగా ఏటచెయ్యి… బాగా తిను వంటి నిండా కండలు పెరగాలి. బలంగా వుండాలి. దెబ్బలు తిని తట్టుకోడానికి బలం కావాలి. – మనవి దెబ్బలు తింటూ బ్రతికే బ్రతుకులు.. నికల్సిన ప్రతిసారీ చెపుతుండేవోడు. మాటలు చెపుతున్నప్పుడు మాటలు తడబడేవి. పెదాలు వణికేవి. కళ్లు కరకరమని చూస్తుండేవి”. సంచీలోంచి కేపు తీసి నిప్పిల్ కి అమర్చి గుర్రం ఎత్తి జబ్బకి ఆనిస్తూ చీకట్లోకి గురిచూస్తూ … 

“ఆ తర్వాత ఆడికి ఏదో పెద్ద జైలులోకి మార్చేసారట” తుపాకి దించేసి పక్కన పెట్టి మంట దగ్గరగా వచ్చి కాళ్లతో ఎగతోసి కూర్చున్నాడు. పక్కనున్న మరిన్ని ఎండుటాకుల్ని దానిమీద వడే శాడు. నిప్పుల మీద అవి కర కర మంటూ భగ్గున మండుతున్నాయి. 

“చాలా రోజులు ఆడి సంగతే తెలీరాలేదు. చాలా చాలా రోజులు గడిచిపోయాయి. ఆరోజా నేను రోడ్డుపక్కన ఉడుం మాంసం వంతులేసి అమ్ముతున్నాను. ఒక కానిస్టేబుల్ బాబు వచ్చి ఓరీ ఇక్కడున్నావబ్రా. నీ చెట్టు దగ్గచూశాను. రేపు ప్రొద్దుట నీ బాబుకి సెంట్రల్ జైలులో ఉరి తీస్తారట-కావాలంటే వెళ్ళి చూసుకో- అని చెప్పి ఎలిపోయాడు. 

“ఉరి.. ఉరి.. ఉరికంబం-నా బాబు– — ఒళ్ళంతా గజగజ లాడిపోయింది సారూ!” అంటు న్నప్పుడు వాడి శరీరం, మంట వేడిలో కమిలిపోయి, కాలిపోయే ముందు పొగలో మెలికలు తిరిగి పోతున్న ఆకులా ముడుచుకుపోతోంది

“పెద్ద జైలు చాలా దూరం అన్నారు. బస్సులో ఎళ్ళాలట. ఆరోజుల్లో బస్సులు కూడా ఎక్కువ లేవు. బస్సెక్కడానికి నాదగ్గర డబ్బులు లేవు. ఉడుం మాంసం అమ్మిన బేడ డబ్బులు ఉన్నాయి. ఏం చేతును!… దిక్కుతోచడం లేదు- సారూ! అడుక్కున్నాను.. నేను చెప్పాను కదా, నా జీవితంలో అడుక్కొన్నది ఒకే ఒక్క సారని… కనిపించిన అందర్ని అడుక్కున్నాను. కాళ్ళు పట్టుకున్నాను. ‘ఎందు’ కన్నారు. నా బాబుకి ఉరితీస్తారు. – నా బాబు కూనీ చేశాడన్నాను. ‘ మర్డర్ చేసినోడికి ఉరి తీసేయక మెడలో దండ వేస్తారా?’ అన్నారు. ఈడి బాబు కూనీ చేశాడట- ఈడు ఖూనీ కోరోడి కొడుకు. అసలు వీళ్ళ జాతోళ్ళు దొంగతనాలు, కూలీలు చేసే జాతోళ్ళట! ఈడూ  ఖూనీలు చేసినోడులాగే వున్నాడు. ఉరి తీసిన ఈడి బాబుకి చూడ్డానికి డబ్బులు కావాలట? – ఎగతాలి చేశారు. చీరించుకున్నారు. విసుక్కుంటూ తప్పుకుపోయారు. ఒకళ్ళద్దరు జాలి పడి కానీ పరక ఎత్తెత్తి నాచేతిలో పడేసి పోయారు. మొత్తం పావలా మించలేదు. ఆ డబ్బుతో వెనక్కి  చూడకుండా బస్సు దగ్గరకి పరుగెత్తాను. అదికూడా ఎల్లిపోయింది”. 

***************

నడినెత్తిన సూర్యుడు చుర్రుమంటున్నాడు. డిబిరిగాడికి ఆకలి . వికారంగా వుంది

జోరుగా నడిస్తే మరుసటి రోజు పెద్ద జైలు దగ్గరికి వెళ్ళుచ్చునన్నారు. పరుగులాంటి నడక లంకించుకున్నాడు. ఊరు దాటిపోయాడు. పరుగెత్తుతున్నాడు. నడుస్తున్నాడు. చీకటి పడిపోయింది. ఆ రాత్రంతా పరుగెత్తుకుంటూ, నడుచుకుంటూ చుక్కలని చూస్తూ టైమ్ లెక్కెట్టుకుంటున్నాడు. రాను రాను ఆకాశం మబ్బు పట్టింది. టైం తెలియడం లేదు. వర్షం- వర్షంలోనే పరుగు, నడక, ఆయాసం, ఆకలి, బెంగ, భయం అలా వర్షంలో తడుస్తూనే పరుగెత్తుకుంటూ రెండు మూడు చిన్న పల్లెలు దాటాడు. వర్షం తగ్గిపోయింది. ఒగుడిసె దగ్గర ఆగి ఒగరుస్తూ మంచినీరు అడిగాడు. దోసిట్లో కుక్క లా కతుకుతూ తాగాడు- పట్టణం ఎందూరం- అన్నాడు- ఇదే దారి, ఇంకా దూరం అన్నారు. మళ్ళీ నడక, పరుగు, నడ, పరుగు. తెలతెలవారుతోంది. కోళ్లు కూస్తున్నాయి. తెల్లా రిపోయింది. వెలుగు బాగా వచ్చేసింది. పరుగు ఆ పేశాడు. దొంఅని పట్టుకుంటారేమోనని భయమేసింది. గబ గబా నడుచుకుంటూ పట్టణంలోకి వచ్చేసాడు. వాకబు చేసుకుంటూ జైలు దగ్గరకు వచ్చాడు. 

బాగా పొద్దెక్కిపోయింది. వళ్ళు తూలిపోతోంది. డిబిరిగాడు జైలు గేటు దగ్గర నుంచున్నాడు. మర్రి చెట్టు మీద గబ్బిలాలు అరుస్తున్నాయి. గేటు తలుపులోంచి జైలు వార్డెన్లు అటు ఇటు తొందర తొందరగా వస్తూ పోతున్నారు. కొందరు తెల్ల బట్ట లోళ్ళు , ఒక తెల్లదొర గేటులోంచి బైటకు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళకి జైలు పోలీసులు  సెల్యూట్ చేశారు. వాళ్ళ చేతిలో ఏవో కాయితాలు కూడా ఉన్నాయి. “ బాబూ . ..” అంటూ బెంగగా ఒక వార్డెన్ ని పలక రించాడు. 

“ఏం కావాలిరా, గుంటనాకొడకా; పొద్దునే?” అని విసుక్కున్నాడు. 

“నా బాబుకి ఈ రోజూ ఉరిసిచ్చని కబురెట్టారు.. 

వార్డెన్ వాడి కళ్ళలోకి చూసి పరధ్యానంగా తలదించుకున్నాడు. మరిద్దరు వార్డెన్లు వచ్చారు. “ఇంత లస్యమైందేంటి ..? తెల్లవారుజామునే ఉరి తీసేసారు.” 

“ఉరి తీసేసారా ? సచ్చిపోయాడా- సచ్చిపోడూ? – ఉరితీసినోడు సవ్వకుండా బతికుంటాడా సారూ! అలా అప్పుడు ఎందుకు అడిగానో నాకు తెలీదు. బుర్రలో ఎర్రెక్కిపోయినట్లైంది. ” 

డిబిరిగాడిని గేటు తలుపులోంచి చేయి పట్టుకు దాటించి లోనికి తీసుకెళ్ళారు. వాడు నడుస్తు న్నాడే గాని ఒంటిమీద తెలివిలేదు. అరుగుమీద కూర్చోబెట్టారు. డిబిరిగాడికి నెత్తురులోంచి మెల్ల మెల్లగా మంచు పాకురుకుంటూ తెర తెరలుగా నసాళానికి గుద్దుతున్నట్లు అనిపించింది. మెడ మీద తలకాయ పట్టుతప్పినట్లు గజ గజా వణికిపోతోంది. ఎవరో టీ తెచ్చి తాగించారు. కొంచెం సర్దు కున్నాడు. చుట్టూ కొంచెం సేపు వెర్రివాడిలా అర్ధంకాని చూపులు చూశాడు

వార్డెన్ విస్తరాకులో రెండు జొన్న రొట్టెలు ఎదురుగా పెట్టి- తిను – అని ఒక బీడి కూడా అందిం చాడు. ఆ రొట్టెల వైపు డిబిరిగాడు ఆగానూ చూడలేదు, కలి గాను చూడలేదు. అర్థం లేనట్టు చూస్తుండగానే … 

“ నీ బాబు నీకివ్వమని చెప్పాడు. ” ““మా బాబా? నాకివ్వమన్నాడా?కుదిపి వేసినట్లు లేచి కూర్చున్నాడు.  

“ఉరి తీసేముందు నీ ఆఖరి కోరిక ఏమన్నా వుంటే చెప్పుకోమన్నారు జైలరు. – నాకొడుకు రాలేదా? – అన్నాడు- కబురు పెట్టాం. ఇంకా రాలేదు. ఏమైనా తింటావా? – అని అడిగాం.  జొన్న రొట్టెలు ” అన్నాడు. 

జొన్న రొట్టెలు తెప్పించాం

 “టైం అయిపోతోంది. ఆకులో రొట్టెల్ని చూస్తూ – బాబూ, నాకొడుకు ఇంకా రాలేదూ? రాలేదు గానీ వస్తాడు. రాత్రంతా తిండిలేక కడుపు నక నక లాడిపోతూ పరుగెత్తుకుంటూ వస్తాడు..  

ఆకలితో కర కర లాడిపోతుంటాడు. అసలే ఆడు ఆకలి గొట్టాడు. ఆకలితో వుంటాడు. ఈ రొట్టెల్ని వాడికి య్యండి బాబూ కడుపు నిండా తింటాడు. ఆకలితో వుంటాడు బాబూ, ఒక బీడీ ఇప్పించండి బాబూ- అని బీడీని గబ గబా రెండు దమ్ముల్లో ఊదేశాడు. బాబూ, మరొక బీడి! ఇది నా కొడుక్కి నేనిచ్చానని ఇవ్వండి బాబు. ఆడికి బీడీలంటే మాయిష్టం. ఇక నాకు ఏ కోరికా లేదు- అంటూ ఉరి కంబం ఎక్కిపోయాడు. 

చివరి సారిగా నీ కోసం ద్వారం వైపు చూశాడు. ముసుగు తొడిగేశాం. టైం అయిపోయింది. ఉరి తీసేసాం.

“నా బాబు ఏడ్చేడా? ఉరి కొయ్య మీద గింజుకున్నాడా?” అని వార్డెన్ చేతులు పట్టుకొని వల వలా ఏడ్చాడు. 

అలా డిబిరి గాడు చెబుతున్న వాడి దీనగాధకి మరింత హైలెట్ చేస్తున్నట్లు నక్కలు ఆకాశం వైపు మోరలెత్తి ఏడుస్తున్నాయి. 

“ఆడు చావుకి జడిసి ఏడవ లేదు సారూ. ఆడికి సావంటే భయం లేదు. నామీద భ్రమతో, నేను ఆకలితో చచ్చిపోతాననే బెంగతో, వంటరిగాడ్ని అయిపోతాననే బాధతో ఏడుస్తూ ఉరి కొయ్య మీద గింజుకొని వుంటాడు….” అని చెబుతున్నప్పుడు డిబిరిగాడి శరీరంలోంచి వాడి ఆత్మ వేరె పోయి కంటి ముందే చీకట్లో విల విలా తన్నుకున్నట్లైంది. వర్మ డిబిరిగాడి భుజం మీద చేయి  వేసి ఓదార్పు గా తడుతూ సిగరెట్టు తీసి వాడి నోటికి అందించి వెలిగించాడు. 

“ఆ సాయంకాలం మా బాబు శవాన్ని , జైలు తోటివోళ్ళు పక్కనే స్మశానంలో పాతి పెట్టేశారు. నేను కూడా వాళ్ళతో మరింత లోతుగా గొయ్యి తవ్వి మా బాబు శవాన్ని ఎండాకాలం ఆవిర్లు చిమ్ము తున్న గోతిలో కప్పెట్టేశాను. అందరూ వెళ్ళిపోయారు. చీకటి పడింది. ఆడు నా కోసం ఉంచిన రొట్టెల్ని ఆడి గోతికాడే కూర్చుని తిన్నాను. ఆడిచ్చిన బీడీ కాల్చుకుంటూ చీకట్లో కూర్చున్నాను.  తెలతెల వారుతుందనగా లేచి మా ఊరు బయలుదేరాను.” 

డిబిరిగాడు యాంత్రికంగా పొగ వదులుతూ తూర్పున వెలుగు దేరుతున్న ఆకాశం వైపు చూస్తు న్నాడు. చల్లగాలులు వీచటం మొదలెట్టాయి. తంపర మీద ముసురుకున్న మంచు కరిగిపోతూ గాలి లో తేలుతూ శూన్యం లోకి కలసి పోతోంది. ఆకాశం గచ్చకాయ రంగుతో జిడ్డు తేరుతోంది

”నేను పెద్దయ్యాక మా బాబు తుపాకీ నాకు ఇచ్చేస్తారని పోలీస్ స్టేషన్లో చెప్పారు. వలేసి ఏట చేసుకుంటూ ఎన్నెన్నో ఊర్లు తిరిగాను. తిరిగి తిరిగి గుర్తుకొచ్చి మళ్ళీ ఆ ఊరొచ్చాను. అప్పటికి నాకు మీసాలు, గడ్డాలు వచ్చాయి. తెల్లదొరల రోజుల్లో మా సంచారోళ్ళకి ఏట చేసుకు బతకడానికి నైసెన్లు ఇచ్చివోరు. ఏటేటో కాగితాల మీద నా నిసానీలు పొటిగి రాపు తీసుకుని  మా అయ్య తుపాకి నాకు ఇచ్చేసారు”. అని సిగరెట్టు కాలుస్తూ లేచి నుంచున్నాడు.

***************************

అప్పటికే తంపర మీద వెలుగు పర్చుకుంటోంది. ఆ వెలుగులో మెల్ల మెల్లగా తుంగ గుబుర్లు, రెల్లు దుబ్బులు, నాచు తీలు ఒక్కొక్కటీ ఫోకలోకి వస్తున్నాయి. 

డిబిరిగాడు తంపర వైపు కలయచూస్తున్నాడు. నీటి పిట్టలు అరుస్తున్నాయి. సరుగుడు తోటలో జీడిమామిడి చెట్టు మీంచి  కోయిల కూస్తోంది. తెరతెరలుగా గాలి వీస్తోంది. ఏదో వాసన పసిగట్టుతున్నట్టు పదే పదే ముక్కు పుటాలు ఎగరేస్తూ గాలిలో వాసన చూస్తున్నాడు డిబిరిగాడు. బాతులు రెక్కలు కొట్టుకుంటూ నీటిలో ఒకదాన్నొకటి తరుముకుంటూ అరుస్తూ గోల చేస్తు న్నాయి. . 

“సారూ! వర్షం వస్తాది. పెంటి బాతులు పెట్టల్ని తొక్కడానికి అరుచుకుంటూ ఎలా గోల చేస్తు న్నాయో విను. వర్షం వస్తాది దొరా, వర్షం వాసన చూడు 1 ” అని మళ్ళీ ముక్కు పుటాల్ని ఎగరేస్తు న్నాడు. 

గాలి తెర రంయ్ మని వీచింది. తుంగ గుబుర్లలోంచి నాచు మీద ఒరుసుకొస్తున్న ఆ గాలిలో ముదర పసర వాసనతోపాటు చినుకులకి తడిసిన మట్టి వాసన వర్మ ముక్కుకి ఘాటుగా తగు స్తోంది. వర్మ ఆశ్చర్యకరంగాను, ఆసక్తికరంగాను ఆకాశం వైపు చూశాడు. స్వచ్ఛమైన వినీ లాకాశం సుదూరంగా నల్లటి మబ్బు మరక. 

తూర్పున ఆకాశం మీద వెలుగు, పసుపుదేరుతూ; కరిగించిన బంగారపు రంగు మైనపు పూత లా చిక్కబడుతోంది. పచ్చటి వెలుగు గాలిలో కలిసి నీటి మీద తేలుతూ, తామరాకుల మీద రాసు కుంటూ ఆకుపచ్చటి గడ్డి గుబుర్లలో నుంచి వెలుగు పాకురుకుంటూ దాటుతుండగానే మళ్లీ ఆకాశం రంగు మార్చింది. నారింజ రంగు పారదర్శక పల్చటి కాంతి చిక్కటి పచ్చదనంతో పెనవేసు కొంటోంది. ఆవర్ణ కాంతుల పరిష్వంగంలో నుంచి సూర్యోదయ మయింది. నిండు సూర్యుడు మెల్లగా నులి వెచ్చగా ఆకాశం మీదికి తోసుకొస్తున్నాడు. తంపర మీద పక్షి సంతతి సూర్యోదయంతో కిలకిలలాడుతున్నాయి. వర్మ, డిబిరిగాడు చూస్తున్నారు.. 

“ బార్… బక్ … గొగ్గా…” మని తుంగ దుబ్బుల్లో నుంచి గూడకొంగ రెక్కలు కొట్టు కుంటూ లేచింది. 

డిబిరిగాడు చటాలున తుపాకీ ఎత్తి దాని గమనంతో పాటే గురి సారిస్తున్నాడు. మెడ సాగదీసకుంటూ, వెనక్కాళ్ళు చాచి గాలిలో రెక్కలు కొట్టుకుంటూ అపుడే లేచిన సూర్యుడికి అడ్డంగా నల్లగా దాటబోతోంది. తుపాకీ గురి వెంటాడుతోంది. ” ధూమ్ “డిబిరిగాడి తుపాకి పేలింది. దెబ్బకి రప్ మని దూదిపింజె పిట్లిపోయినట్లు గుప్పెడు వెంట్రుకలు గాలిలో మెరుస్తూ తేలు తున్నాయి. గాలిలోనే చచ్చిన గూడ కొంగ నిండుగా లేస్తున్న ఎర్రటిసూర్యబింబం నేపథ్యంలో విరిగిపడిన చీకటి పెళ్ళలా బరువుగా దబ్బున నీటిలో పడిపోయింది

పిట్ట నీటిలో పడీ పడడంతో అంతవరకు వర్మ పక్కనే నిల్చున్న సీజర్ ఒళ్ళు విదిలించుకొంటూ గట్టు దిగి పట్టుకురావడానికి ఒడ్డంబట పరుగు లంకించుకుంది. దూరంగా నీటి మధ్యలో వచ్చిన గూడ కొంగ తేలుతోంది. 

డిబిరిగాడు గట్టిగా అరిచాడు .“సారూ, సారూ! దాన్ని పట్టుకోండి . అక్కడ బురద గుమ్ములు, ఊబులు ఉన్నాయి… అందులో దిగబడి సచ్చిపోద్ది… పరుగెట్టి పట్టుకోండి…. పిట్ట ఎలాగూ దక్కదు. ఇదికూడా కూరుకుపోతాది”. 

“ సీజర్, సీజర్; స్టాప్, స్టాప్ ఐసే! కమాన్, కమ్ హియర్! నో, నో!” అని అరుస్తూ వర్మ కుక్కని పట్టుకోవడానికి పరుగెత్తాడు.

అలా ఒడ్డు వెంట పరుగెత్తి పరుగెత్తి ఇక నీట్లో దిగబోతున్న కుక్కని చఠాలున తోక పట్టుకు బయటకు లాగాడు. అది విదిలించుకుని జాపోస్తోంది. పెనుగు లాడుతోంది. దాని మెడ మీది జూలును గట్టిగా పట్టుకుని అదుపు చేస్తూ మొరాయిస్తున్న దాన్ని ఎలాగైతేనేం సముదాయిస్తూ నడిపించుకు తీసుకువస్తున్నాడు. 

రాను రాను గాలి ఎక్కువౌతోంది. వెలుగు మసకబారింది. ఆకాశం వైపు చూశాడు. సూర్యుడి మీద మబ్బు తెర పాకుతోంది. ఆకాశం మబ్బు పట్టింది. సరుగుడు చెట్లలో నుంచి ఆకాశం మీద నల్లటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి. గాలిలో తేమ వాసన. తంపర్లో తామరాకులు రెప రెప కొట్టుకుంటు న్నాయి. ఈ వర్షపు రాకను ఎప్పుడో పసిగట్టిన డిబిరిగాడి ప్రకృతి వాతావరణ పరి జ్ఞానికి మనస్సులో అభినందించుకుంటూ కుక్కని నడిపించుకుంటూ గట్టెక్కాడు. 

అక్కడ దృశ్యాన్ని చూసి వర్మ గుండే జల్లుమంది. షాక్ అయిపోయాడు. తెగి వేలాడుతున్న మెడ తో రక్తంలో రెక్కలు కొట్టుకుంటూ గింజా కుంటున్న నత్త గొట్టు. చాకుకి అంటిన రక్తాన్ని సంచీకి తుడుస్తున్న డిబిరిగాడు. . 

“వాట్! చంపేశావా?”

 “ఇది మరి ఏటకు పనికి రాదు దొరా... గొంతుకలో బెదురు అరుపు … సఫా చేసేశాను!” 

“ఇన్నాళ్ళు పెంచి ఇప్పుడు చంపేస్తావా?” అసహ్యించుకున్నాడు వర్మ. “ కోడిని పెంచి కోసుకొని తినవా సారూ?” కత్తిని సంచిలో పెడుతూ ఎదురు ప్రశ్న వేశాడు డిటిరిగాడు. 

వర్మ సమాధానం చెప్పలేకపోయాడు. తను వేసిన ప్రశ్న తనకే రీబౌన్స్ అయిన బంతిలా ముఖానికి గుద్దింది. 

“చంపడం పాపం… పెంచి… కత్తితో పీక కోసీడం…పాపం! ఇన్ హ్యూమన్! ” నీళ్ళు నములుతూ, నసుగుతూ, గొణుక్కుంటూ… డిబిరిగాడి ప్రశ్నకి సమాధానం లేక, చెప్పలేక చీదరించు ఉంటున్నాడు వర్మ. 

నత్త గొట్టు రెక్కలు కొట్టుకోవడం ఆగిపోయింది. ప్రాణం పోయింది. 

“పాపమా, సారూ? నీ సంచిలో బాతుల్ని నువ్వు తుపాకీతో సం పనేదా?… నేను కత్తితో పీక్కోసి సంపేశాను. అంతే | అదీ సంపడమే, ఇదీ సంపడమే! అలా అయితే నీది పాపమే. నీకొక న్యాయం, నాకొక న్యాయమున్నా? ఇదేటి సారూ.. నువ్వు కులాసాకీ, జల్సాకీ, గొప్పకీ ఏట సేస్తావు. నేను పొట్ట కోసం ఏట సేస్తాను. ఏటలేకపోతే మేం బ్రతకలేం. ఆకలితో సవ్వాల . ది పాపం సారూ?” అని నవ్వుకుంటూ భుజానికి సంచీ తగిలించుకున్నాడు. ఆ నవ్వు వర్మ గుండెల్ని కెలికేస్తోంది..  

ఆకాశం మేఘావృతమౌతోంది. మెరుస్తోంది. దూరంగా చెట్లలోంచి దాటుకొస్తున్న చినుకుల చప్పుడు. 

“ఈరోజా ఏట లేదు. నీ తుపాకీ శబ్దానికి పిట్టలు దిగలేదు. కొట్టిన పిట్ట ఊబుల్లో పడి పోయింది. వర్షం కూడా వచ్చేస్తుంది. మరి ఏట ఉండదు. ఈ రోజు దీనినే తిని పొట్ట నింపుకోవాల. లేకపోతే వస్తుండాల….. ఆకలి… ..మరి ఈ పాపం ఎవరిది సారూ? అని పొట్ట మీద కొట్టుకుంటూ పాపం….. పుణ్యం…” అని పగలబడి నవ్వుతున్నాడు. 

వర్మ గుండె అవమానంతో, సిగ్గుతో బీటలు వారుతోంది. వును ఎవరిది పాపం? డిబిరిగాడు జీవిత సత్యాన్ని పొరలు పొరలుగా ఒలిచి చెబుతున్న వేదాంతిలా అనిపించాడు. నిశ్చేష్టుడై అలా నవ్వుతున్న డిబిరిగాడి వైపు చూస్తూ ఉండిపోయాడు. 

రెండు పెద్ద పెద్ద చినుకులు వర్మ ముఖం మీద తట్టిలేపినట్లు పడ్డాయి. డిబిరిగాడి నవ్వు సడన్ గా ఆగిపోయింది. 

“సారూ వర్షం వచ్చేసింది. బయలుదేరు . తడిసిపోతావు ” అని క్షణం సేపు ఆగాడు. నవ్వాడు. 

 ఆ నవ్వు మునుపటి నవ్వులా లేదు. ఆప్యాయంగా ఉంది. 

“సారూ మనిద్దరం ఏటగాళ్ళం. చీకట్లో కలుసుకున్నాం. నా కధ నీకు చెప్పాను. ఇద్దరం సొంగాతులయ్యాం . నేస్తం సారూ!.. దిల్ మిలాయించిపోయింది. దిల్ మిలాయించు సారూ” అంటూ వర్మను కౌగలించుకున్నాడు. 

వాళ్ళిద్దరినీ వర్షం తెర కప్పేసింది. ఇద్దరి వేటగాళ్ళు గుండె చప్పుళ్లు ఒకదానితో ఒకటి ప్రతిధ్వని స్తున్నాయి. 

ఆకాశం మీద మెరుపు – తంపర నీటిలో జిగ్ మని మెరిసింది. 

“సారూ! పద సారూ!” అని తుపాకీ తీసుకుని వర్షంలో తడుస్తూ సలాం చేస్తున్నట్లు వంగి “వస్తాను సారూ, బయలుదేరు! ” అని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి తుపాకి దించి సంచీలోంచి ఒక బీడి తీసి “వర్షం .. కులాసాగా ఉంటాది. .. కాల్చు సారూ!” అని తుపాకి తీసుకొని మరి   వెనక్కి తిరిగి చూడ కుండా గట్టు దిగి వర్షంలో తుప్పల్లోంచి, పొలాల్లోంచి పరుగెత్తుకుంటూ వెళ్ళి పోతున్నాడు. చచ్చిన నత్త గొట్టు చేతిలో తలక్రిందులుగా వేలాడుతోంది

లా కనుమరుగయ్యే వరకు డిబిరిగాడ్ని చూస్తూ వర్షంలో నిలబడిపోయాడు వర్మ. 

వర్షానికి సీజర్ కుంద్ కుంగ్ మని అరిచింది. వర్మ తేరుకుని కుక్కతో వర్షంలో తడుచుకుంటూ గబ గబా ఇంటిముఖం పట్టాడుబైట వర్షం మరింత ఉధృతమవుతోంది. కెప్టెన్ వర్మ తడిసిన బట్టలు మార్చుకుని గాలికి తలుపులు, కిటికీలు మూసుకుని కుర్చీలో కూర్చున్నాడు. 

కరెంటు పోయింది. టేబుల్ మీద కొవ్వొత్తి వెలుగుతోంది. 

డిబిరిగాడి విషాద జీవిత చిత్రం మనసులో టి వి స్క్రీన్ మీద ఘోస్ట్ ఇమేజెలా కదలాడు తోంది. 

కొడుకు ఆకలి తీర్చడానికి ఉరికంబం ఎక్కబోయే తండ్రి ఆరాటం. 

 తీర్చుకోడానికి పెంచిన పిట్టని గొంతుక కోసిన డిబిరిగాడి కరుకు తనం. 

“… మరి ఈ పాపం ఎవరిది సారూ?? ” బుల్లెట్ షాట్ లాంటి శేష ప్రశ్నతో క్లోజప్ లో ఫ్రీజ్ అవు తున్న డిబిరిగాడి ఘోస్ట్ ఇమేజీ .. 

గాలికి భళ్ళున కిటికీ తెర్చుకుని కొట్టుకుంటోంది. కొవ్వొత్తి గిల గిల తన్నుకుని ఆ రిపోయింది. .. బయట వర్షపు హోరు. 

చీకటి

 కెప్టెన్ వర్మ చేతిలో కాలుస్తున్న డిబిరిగాడి బీడి తప్ప అంతా చీకటి… 

దూరంగా కొండల్లో ఉరుముతోంది. 

చీకటి… 

***************************************************************************************************************************************************************************************

అల్లం శేషగిరి రావు గారి మిగతా రచనల వివరాలు :

పల్లవి పబ్లికేషన్స్ వెంకట నారాయణ గారు , ఫిబ్రవరి మొదటి వారంలో ‘అల్లం శేషగిరిరావు సమగ్ర కథా సంకలనం’ తీసుకవస్తున్నారు.

మొబైల్ : ‘98661 15655’ ద్వారా ఆయన్ను సంప్రదించి , మీ కాపీ రిజర్వు చేసుకోవచ్చు.

చదువుకోడానికి ఇంకొన్ని :

1. వేట నేపధ్యం గా వచ్చిన ఇతర తెలుగు సంకలనాలు –

a.పూసపాటి కృష్ణం రాజు గారి కథలు – అరసం వారి ప్రచురణ (https://www.telugubooks.in/products/poosapati-krishnamraju-kathalu?_pos=1&_sid=f800f613e&_ss=r)

b. కె ఎన్ వై పతంజలి గారి వేట కథలు – పతంజలి సాహిత్యం – మనసు ఫౌండేషన్ వారి ప్రచురణ.(https://www.telugubooks.in/products/patanjali-sahityam-1?_pos=2&_sid=cc7a4803b&_ss=r)

2. cry the beloved country – A novel
https://www.amazon.in/Cry-Beloved-Country-Vintage-Classics/dp/0099766817/ref=sr_1_1?dchild=1&keywords=cry+the+beloved+country&qid=1610176720&sr=8-1

3. Oblique narration – A story technique (https://www.bachelorandmaster.com/britishandamericanfiction/narrative-technique-in-heart-of-darkness.html#.X_la3-kzYWo)

4.Fifth column strategy – Military tactics (https://en.wikipedia.org/wiki/Fifth_column)

Leave a Reply