‘ఆవు పులి మరి కొన్ని కథలు’ – డాక్టర్ వి .చంద్రశేఖర్ రావు : కథాపరిచయం

“The dream reveals the reality which conception lags behind, that is the horror of life and the terror of art” – Franz Kafka (1883-1924)

కథ స్థూలంగా:

కథలో పాత్రధారులు, భార్య , భర్త , ఓ ఐదేళ్ల కూతురు.

కథంతా ఫస్ట్ పెర్సన్ నేరేషన్ లో ఉంటుంది.

భార్య ఒక పెయింటర్.

ప్రతివిషయాన్నీ వ్యాపార దృక్పధం తో చూసే భర్తా, అతనితో ఆమె గడిపే అసంతృప్తికర జీవితం, ఇంటలెక్చువల్స్ గా పిలవబడే వాళ్లు, సిస్టమాటిక్ గా సమాజంలో సృష్టించే విధ్వసం, వీటినన్నిటినీ గురించీ చెప్తూ కథలోకి తీసుకు వెళతారు రచయిత.

సడన్ గా ప్రధాన పాత్ర , మనిషి రూపం లోంచి జంతురూపం లోకి మారుతోంది అనే సూచన పాఠకుడిలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది..

ఈ విధంగా మనల్ని కట్టేసి, చెప్పదలుచుకున్న విషయం తీవ్రత మనకు తగిలేలా చేస్తారు రచయిత.

తన ఐదేళ్ల కూతురికి , ఒక ఆవు పులి కథ ద్వారా (కథలో ఇంకో కథను సృష్టించి) తన అనుభవాన్ని , అర్థమయ్యేటట్టు గా అందజేయడం , కథకు చక్కని ముగింపు.

ఇంకొన్ని వివరాలు:

‘స్పర్శ’ అనే రికరింగ్ థీమ్, వేరు వేరు అర్థాలు వచ్చేటట్టుగా, రచయిత చాలా అందంగా వాడుకుంటారు కథలో.

ఇలాంటి ఒక సంక్లిష్టమైన కథాంశాన్ని తీసుకుని , పాఠకుణ్ణి కథ చివరిదాకా చదివించి, మంచి అనుభూతికి గురిచేయడం తో , చంద్రశేఖర్ రావు గారి రచనా ప్రతిభ మనకు అర్థం అవుతుంది.

‘ఐడెంటిటీ క్రైసిస్’ తో వున్న ఒక పాత్ర ద్వారా , సమాజంలో వున్న సమస్యల గాఢత గురించి పాఠకుడికి వివరిస్తూ కథను ముందుకు తీసుక వెళ్లడం అనేది , ఈయన రాసిన మిగతా కథల్లో కూడా కొన్నిట్లో, మనం చూడొచ్చు.

కథలో భర్త పాత్ర చెకొస్లవేకియన్ రచయిత ‘కాఫ్కా’ రాసిన ఒక కథను ప్రస్తావనకు తెస్తుంది. కాఫ్కా రాసిన ఆ సుప్రసిద్ధ కథ పేరు ‘మెటామార్ఫసిస్’ (Metamorphosis) http://bit.ly/3qOe2Wa .

కాఫ్కా కథ లోని కొన్ని అంశాలు మాత్రమే తీసుకుని , అద్భుతమైన కథను తాను అల్లుకున్నారు చంద్రశేఖర్ రావు గారు.

మెటమార్ఫాసిస్ కథ లో , ‘గ్రెగర్ సాంసా’ అనే యువకుడు ఒక రోజు పొద్దున్న లేచేటప్పటికి ఒక కీటకం (Beetle) గా మారిపోతాడు. కథ అక్కడితో ప్రారంభం అవుతుంది.

తన తండ్రి పట్ల , ఉద్యోగం పట్ల అతనికి తీవ్ర అసంతృప్తి ఉంటుంది. తానున్న గదిలో బందీ అయిపోతాడు సాంసా ఆ కీటక రూపం లోనే . రూపం మారిపోయిన తర్వాత కూడా తన వుద్యోగం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తాను రోజూ మనిషి గా చేసే పనులన్నీ , చెయ్యడానికి ప్రయత్నిస్తాడు, ఆసంబద్ధంగా.

ఒక తీవ్రమైన అంశాన్నో లేక మానసిక స్థితినో పాఠకుడికి తెలియజేయడానికి , ఒక అసంబద్ధమైన పరిస్థితిని క్రియేట్ చేసి పాఠకుడిలో ఆసక్తిని రేకెత్తించే , ఈ టెక్నిక్ కాఫ్కా రాసిన చాలా కథల్లో మనం చూడొచ్చు.

మెటమార్ఫాసిస్ ప్రేరణగా వచ్చిన ఇంకో కథ:

కాఫ్కా ‘మెటామార్ఫసిస్’కథకు ఎక్సటెన్షన్ గా వచ్చిన ఇంకో కథ జపనీస్ రచయిత ‘హరూకి మురకామి’ రాసిన ‘Samsa in Love’ – (http://bit.ly/2KH601Y)

ఈ కథ ఇన్ సెక్ట్ రూపం లో వున్న ‘Samsa’ మనిషిగా మారడంతో మొదలౌతుంది. ఆ తర్వాత ‘ Samsa’ మనిషి రూపానికి అలవాటు పడే క్రమం, ఒక యువతితో పరిచయం పెంచుకోడం ఇవన్నీ చాలా ఇంటరెస్టింగ్ గా చిత్రీకరించారు మురకామి ఆ కథలో.

చంద్రశేఖర్ రావు గారు, మురకామీ ఇద్దరూ, కాఫ్కా రాసిన ఒకే కథను ప్రేరణామాత్రంగా తీసుకొని , తమ తమ పద్ధతుల్లో విభిన్నంగా , మనిషి అస్తిత్వ వేదన (Kafkaesque – https://bit.ly/2M3Hk4p) పై రెండు గొప్ప కథలు రచించారు.

కాఫ్కా ‘మెటమార్ఫాసిస్’ కథ ని 1912 లో రాయడం జరిగింది.( కథా ప్రారంభం లోనే ‘Samsa’ తాను కీటకం గా మారిపొయ్యినట్టు గుర్తిస్తాడు.)

2002 లో చంద్రశేఖర్ రావు గారి రాసిన ‘ఆవు పులి మరి కొన్ని కథలు’ , ‘ మెటమార్ఫాసిస్ కి ప్రీక్వెల్ గా మనం చూస్తే, (ప్రధాన పాత్రధారి ఒక జంతువుగా మారే క్రమాన్ని చూపిస్తూ )

2013 లో మురకామీ రాసిన ‘Samsa in love’ ‘మెటమార్ఫాసిస్’ కి సీక్వెల్ గా (అదే జంతువు మనిషి గా మారడం కథాంశంగా) మనం చూడవచ్చు.

రచయిత గురించి:

ఈ కథ డాక్టర్ చంద్రశేఖర్ రావు గారి, ‘చిట్టచివరి రేడియో నాటకం – డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు కథలు అనే కథాసంపుటం లోనిది.

1959 లో ప్రకాశం జిల్లాలో జన్మించిన డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారు , ఒక విలక్షణమైన కథకులు. ఆయన కథలన్నిటిలో తీవ్రమైన సామాజిక స్పృహ, చుట్టూ మారుతూ వున్న పరిస్థితులూ, వాటి వల్ల వ్యక్తులలో తలెత్తే సంఘర్షణా, ముఖ్యాంశాలుగా ఉంటాయి.

సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే , సాహిత్యం కంటే ఉపయోగపడే వస్తువు లేదు అని గట్టిగా నమ్మిన మనిషి.

మెడిసిన్ చదివిన చంద్రశేఖర్ రావు గారు , రైల్వేస్ లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 2017 లో పదవీ విరమణ చేశారు.

1990లో రచనా రంగంలో అడుగుపెట్టిన ఆయన 2017 సంవత్సరం దాకా కథలూ , నవలలూ రచించారు.

అనేకానేక పురస్కారాలను అందుకున్న ఆయన నాలుగు కథా సంపుటాలు, 3 నవలలు తెలుగు పాఠకులకు అందించారు. ‘ రచయితల రచయిత’ గా పేరు పొందారు. తెలుగు కథ ని వున్నత స్థాయి లో నిలబెట్టిన కథకుల్లో చంద్రశేఖర్ రావు గారు ముందు వరసలో వుంటారు.

చంద్రశేఖర్ రావు గారి పుస్తకాలు కొనడానికి :

ఆయన కథా సంపుటాలు రెండు మాత్రమే ఇప్పుడు మనకు లభ్యం అవుతున్నాయి.

  1. ‘ముగింపుకు ముందు’- ఆయన ప్రచురించని కథలతో – (http://bit.ly/3c7DBNZ). ఇదే పుస్తకంలో శ్రీ బి.తిరుపతిరావు గారు చంద్రశేఖర్ గారి రచనా శైలిపై రాసిన చక్కని ముందుమాటను మనం చదవొచ్చు.
  2. ‘చిట్టచివరి రేడియో నాటకం – డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు కథలు’ – ఈ పుస్తకం కోసం ‘విశాలాంధ్ర విజయవాడ’ – రాజు గారిని 9840034033 లో సంప్రదించండి.

చంద్రశేఖర్ రావు గారు తెలుగు కథన రీతులపై 2015 లో చేసిన ప్రసంగాన్ని ఈ లింక్ ద్వారా వినవచ్చు. (https://bit.ly/2M2IsFB)

Leave a Reply