Apple PodcastsSpotifyGoogle Podcasts

సి.రామచంద్ర రావు గారి ‘ఏనుగుల రాయి’!

సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ ‘వేలుపిళ్లై’ అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు.

**************************************

‘ఏనుగుల రాయి’:

కొత్త దొర వైఖరి ఇంకా తంగముత్తుకి అంతుపట్టలేదు.

దొరలు తన కేమీ కొత్తగాదు. ఇరవై ఏళ్ళనుంచీ ‘ప్రోస్పెక్ట్ టీ ఎస్టేటు, కండక్టరుగా పని చేస్తున్నాడు. ఇప్పటికి ఎనమండుగురు మేనేజర్లనైనా చూశాడు. అంతా తెల్లదొరలే. అయితే వాళ్ళంతా ఒకెత్తు, సిమ్మన్సు దొర ఒకెత్తు. వచ్చి ఇంకా పట్టుమని పదిరోజులై నా కాలేదు, అప్పుడే ఎస్టేటంతా చెడ తిరిగేశాడు. అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వచ్చే ఏడా ది టీ నాటబోయే స్థలం కోసం ఇప్పటినుంచీ వెతుకుతున్నాడు.

మునుపటి దొరలంతా వచ్చిన నెలా రెండు నెలలకి కాని కార్యరంగంలో దూకేవారు కారు. నెల్లాళ్ళు బదిలీ అయిన దొర నుంచి ఎస్టేటు వ్యవహారాలు తెలుసుకోడంలోనూ, ఛార్జి పుచ్చుకోడంలోనూ గడిచిపోయేవి.. తరవాత కొన్నాళ్ళు ఇరుగు పొరుగు మేనేజర్లని కలుసుకోడం, క్లబ్బులకి వెళ్ళిరావడం, పార్టీలూ, డాన్సులూ, ఆ పైన అలసట తీర్చుకోడం. సిమ్మన్సు దొరకివేమీ పట్టినట్టులేదు. 

నోట్లో ఒక ‘పైప్’ ఉంటే చాలు . ఎండనక, వాననక ఎంతపనైనా చేసుకుపోతాడు. దొర పని సమయంలో పైపు కాల్చడం తంగముత్తుకి నచ్చలేదు. ఇంతకు ముందున్న దొరలుఎస్టేటులో పని తనిఖీ చెయ్యడానికి వచ్చినప్పుడు సిగరెట్టు పైపు మొదలైనవేవీ కాల్చేవారు కాదు. ఒక రిద్దరు అలా చెయ్యడం తప్పని చెప్పినట్లు కూడా తంగముత్తుకి జ్ఞాపకం. సిమ్మన్సు దొర అన్ని టిలోనూ వ్యతిరేక మే. ఎస్టేటు కూలీలని నవ్వుతూ పలకరిస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ గోడు వింటాడు, సానుభూతి చూపిస్తాడు. కండక్టర్లతోనూ కులాసాగా కబుర్లు చెబుతాడు. 

పాతదొరలు ఎప్పుడూ తంగముత్తుతో కాని, తన అసిస్టెంటుతో కాని ఎస్టేటు వ్యవహారాలు తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. సిమ్మన్సు దొర కలుపుగోరుతనం తంగముత్తుని కలవర పెట్టింది. ఇలా వుంటే కూలీలనీ, కండక్టర్లనీ అదుపులో పెట్టగలడా? తంగముత్తు అలవాటులేని ప్రతి విషయాన్నీ అనుమానంగా చూస్తాడు. కొత్త దొర ప్రవర్తన అతనికి సంతోషం కలిగించినప్పటికీ తనలో జీర్ణించిపోయిన పాత దొరల సంప్రదాయంతో సంఘర్షణపడి అతన్ని దీర్ఘాలోచనలో ముంచింది.

“కొత్తగా నాటిన టీ ఇక్కణ్ణుంచి ప్రారంభమవుతుందనుకుంటాను?”

దొర ప్రశ్న వెనక నడుస్తున్న తంగముత్తుని తిరిగి పరిసరాల్లోకి. లాగింది.

“ఔను, సార్!”

తంగముత్తు కుడి చెయ్యి అనుకోకుండా ఖాకీ టోపీమీదికి పోయింది. ఎక్కువ అణుకువ ప్రదర్శించేటప్పుడు కొంచెం వంగి టోపీ చివరిని కుడిచేతి ముని వేళ్ళతో ముందుకు వంచి వదిలేయడం అతనికి అలవాటు.

“ఎప్పుడు నాటారు?” సిమ్మన్సు దొర అడిగాడు . 

“పోయిన ఏడాది సార్!” 

“ఎన్ని ఎకరాలు” 

“ఇరవై సార్!” 

“ఒచ్చే ఏడాది ఎన్ని ఎకరాలు నాటడానికి పర్మిట్ వుంది?” 

“ఇరవై అయిదు సార్!”

కొంతదూరం ఇద్దరూ మాట్లాడకుండా నడిచిపోయారు. 

ముందు దొర, వెనక తంగ ముత్తూ 

ఒకరు తెలుపూ, ఇంకొకరు నలుపూ, 

దొర నోట్లో పైపు వుంది, నడక ఠీవిగా వుంది. మాటల్లో దర్పం వుంది.

తంగముత్తు నడక నమ్రత ఉట్టిపడుతూ వుంది. 

దొర నోట్లో నుంచి ఏమాట ఊడిపడుతుందోనని ఆదుర్దాగా కని పెట్టుకుని వున్నాడు. ఇద్దరూ తెల్లచొక్కా, ఖాకీలాగూ, మోకాళ్ళవరకు ఖాకీ మేజోళ్ళూ సాదాలకి ఇనప మేకులు కొట్టిన బూట్లూ తొడుక్కున్నారు. ఎండకి నెత్తిమీద గట్టి ఖాకీ టోపీ పెట్టుకొన్నారు.

రోడ్డు ఇంకా బాగా పడలేదు. చాలామటుకు ఎస్టేటులో రోడ్లు తారు వేసినవే. మిగతావి తారువి కాక పోయినా బాగా కంకరతో దిమిశా కొట్టివేసినవి. ఈ రోడ్డు గత సంవత్సరంలో అడవి నరికి టీ నాటినప్పుడు వేసింది. ఇప్పుడు మనుషులు నడవడానికి, అడివి నరికినప్పుడు సేకరించిన కలపనీ, పుల్లల్నీ ఫేక్టరీకి – చేరవేసే లారీలూ, ట్రాక్టర్లూ పోడానికి సదుపాయంగానే వుంది. ఇంకా మేనేజర్లూ, అసిస్టెంట్ మేనేజర్లూ కార్లు తీసుకుపోవడానికి అనువుగా లేదు. 

ఆ మేనేజరూ, కండక్టరూ రావడం చూసి, రోడ్డుకి రెండువైపులా కొండవాలుమీద వున్న కూలీలు పనివేగం హెచ్చించారు. మేస్త్రీలు గొంతు చించుకుని బాగా పని చెయ్యమని కూలీలని హెచ్చరించడం మొదలు పెట్టారు. వంగి పనిచేస్తున్న కూలీలూ, మేస్త్రీలూ అప్పుడప్పుడు తల ఎత్తి దొరకీ, కండక్టరుకీ సలాములు పెట్టారు.

దొర బుర్ర పంకించి అందుకున్నాడు. దొర పక్కని ఉండడంవల్ల కండక్టరు యధాప్రకారం తిరుగు సలాం పెట్టి వారిని పలుకరించలేదు.

“నిరుడు నాటిన చెట్లు బాగానే వస్తున్నట్టున్నాయి” సిమ్మన్సు దొర అన్నాడు.

“అవును సార్!” 

“నేల సారవంతమైందిలా వుంది.”

 “అవును సార్!”

“కొండవాలు అంత నిటారుగా కూడా లేదు. ఆడ కూలీలు టీ ఆకులు తుంపడానికి కష్టపడి ఎక్కి దిగనక్కర్లేదు.”

“అవును సార్!”

ఎంతో అవసరం వుంటే గాని మేనేజర్ల ప్రశ్నలకి అంతకంటే ఎక్కువ జవాబు చెప్పే అలవాటు లేదు తంగముత్తుకి. 

మేనేజరుకి నవ్వొచ్చింది.

“ఇంకా కొండ ఎన్ని ఎకరాలుంటుంది.” 

“వంద వుండొచ్చు సార్!” 

“అంతా మన కంపెనీదేనా?” 

“అవును సార్!”

మెక్ నాటన్ టీ కంపెనీకి ఏనమలై కొండల్లో ఏడు ఎస్టేట్లున్నాయి. ఒక్కొక్క ఎస్టేటు విస్తీర్ణం వెయ్యి ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల వరకూ వుంది. అయితే ఎస్టేటుకి చెందిన అన్ని ఎకరాల్లోనూ టీ నాటి లేదు. ఒక్కొక్క ఎస్టేటుకి అయిదువందల నుంచి వెయ్యీ పన్నెండు వందల ఎకరాలదాకా పంటనిస్తున్న టీ వుంది. మిగతాది అడవి. ఈ అడవిని ఏడాదికీ, రెండేళ్ళకీ ఇరవై ముప్పై ఎకరాల చొప్పున నరికి టీ పాతుతారు. అది ఏడెనిమిది ఏళ్ళల్లో పెద్దదయి రెండాకులూ, ఒక మొగ్గా చొప్పున తురమడానికి సిద్ధంగా వుంటుంది. ‘ప్రోస్పెక్టు  ఎస్టేటు’ కి పై ఏడాది ఇరవై అయిదు ఎకరాల అడవి కొట్టి టీ పాతడానికి పర్మిట్ వుంది. ఎస్టేటుకి చెందిన ఎనిమిది వందల ఎకరాల అడవిలో ఇరవై అయిదు ఎకరాల గడ్డని ఎక్కడ ఎన్నుకుంటే బాగుంటుందో పరిశీలించడానికే మేనేజరూ, కండక్టరూ బయలుదేరారు.

“ఈ కొండ ఇంకా వంద ఎకరాలుంటుం దంటున్నావు కాబట్టి ఈసారి కొండకి అటువైపు అడివి నరికి టీ వేస్తే బాగుంటుంది” అన్నాడు సిమ్మన్సు దొర.

తంగముత్తు ‘అవును సార్ !’ అనలేదు. “కాని,కాని……..” అని నసిగాడు.

“నీ అభ్యంతరం ఏమిటి?” అని అడిగాడు దొర.

 “ఏమీలేదు సార్ ! కాని………” “ఏమిటో చెప్పు” రెట్టించాడు సిమ్మన్సు దొర.

“ఈ కొండమీద టీ నర్సరీ పెంచడం కుదరదు సార్ !” అన్నాడు తంగముత్తు.

అడివి నరికి టీ మొక్కలు పాతడానికి ఒక ఏడాది ముందునుంచీ టీ నర్సరీలు సాకుతూ రావాలి. చల్లని పందిర్ల కింద మెత్తటి ఇసుక లో టీ విత్తనాలు పాతుతారు. పాతిన రెండు మూడు వారాల్లో అవి పగిలి చిన్న మొలకలు బయల్దేరతాయి. అప్పుడు వాటిని తీసి తొమ్మిది అంగుళాలు  పొడుగూ, మూడు అంగుళాల వెడల్పూ వున్న వెదురుబుట్టల్లో పాతుతారు. అవి అయిదారు అంగుళాల ఎత్తు పెరిగిన తర్వాత పద్దెనిమిది అంగుళాల బుట్టల్లోకి మారుస్తారు. వర్షాకాలం ప్రారంభం లో వాటిని కొత్తగా అడివి నరికి బాగు చేసిన భూమిలో పాతుతారు. ఇలా మొక్కల్ని పాతే ముందు సాకుతూ రావడానికి చదునైన  నేలా, మంచి నీటి వసతి కావాలి.  ఈ నర్సరీలు మొక్కల్ని పాతబోయే స్థలానికి ఎంత దగ్గరలో వుంటే అంత మంచిది. లేకపోతే ఒక టొకటిగా బుట్టల్ని మోసుకుపోవడం విపరీతమైన ఖర్చు. అక్కడ నర్సరీ పెంచడం కుదరదని చెప్పినప్పుడు తంగముత్తు బుర్రలో యివన్ని మెదిలాయి .

. “ఎంచేత? కొండకి ఆ వైపు నీటివసతి లేదా?” అని అడిగాడు సిమ్మన్సు దొర.

“ఒక్కచోట వుంది సార్ !”

 “అక్కడే భూమి చదునుచేస్తే సరిపోతుందిగా.

 “అది కాదు సార్ !”

 “ఇంకేమిటి?”

“అది టీ నాటడానికి మంచి స్థలం అని పదేళ్ళ క్రితమే స్టీవెన్స్ దొర నిర్ణయించి నర్సరీ ఏర్పాటు చేశారు సార్?”

“అయితే ఎందుకు వదిలేశారు?”

“అక్కడ ఏనుగులరాయి వుంది సార్ ! అప్పుడప్పుడూ ఏనుగులు వచ్చి పోతూ వుంటాయి”. 

“అడవి కొట్టేస్తే ఆవే దూరంగా పోతాయి .”

“నిజమే సార్ ! కాని ఆ స్థలంలో నర్సరీ ఉండనివ్వమని ఏనుగులు పంతం బట్టాయి సార్!”

“నాన్సెన్స్.”

 “నిజమే సార్!” 

సిమ్మన్సు దొర ఒక క్షణం ఆలోచించాడు. “పద , ఆ ఏనుగులరాతిని చూద్దాం” అన్నాడు.

చుట్టూ ‘పెరిగిన గుబురుని రెండు చేతులో తప్పించుకుంటూ అడివిలో కాలిబాట మీద మేనేజరూ, కండక్టరూ ప్రయాణం సాగించారు. అరమైలు నడిచిన తర్వాత పదేళ్ళ క్రితం చెట్లుకొట్టి బాగుచేసిన ఒక ఎకరం నేల కనబడింది. ఈ పదేళ్ళలో చిన్న చిన్న మొక్కలూ, గడ్డి పెరిగి ఆ చదును చేసిన ఆ పాత నర్సరీ స్థలాన్ని కప్పివేశాయి. ఇంకా వెదురు పందిళ్ళ తాలూకు కొన్ని కర్రలూ, తాళ్ళూ చూచాయగా కనిపిస్తు న్నాయి. అప్పుడప్పుడు ఏనుగులు తీసుకువచ్చి తిని పారేసిన వెదురు ముక్కలూ, ఆకులూ, కందగడ్డలూ చిందర వందరగా చిమ్మి వున్నాయి. చుట్టుపక్కల ఏనుగు లద్దెలు తాటికాయల్లాగా పడివున్నాయి.

నర్సరీకి పదిగజాల దూరంలో ఒక పెద్ద రాయి రెండు ముక్క లుగా బద్దలయి విడిపోయి వుంది.

“అదే సార్ ! ఏనుగుల రాయి” అన్నాడు తంగముత్తు.

దొరకి జరిగిన విషయం సవిస్తరంగా వినాలని కుతూహలంగా వుంది. కాని పని సమయంలో మూఢనమ్మకాల గురించి కండక్టరుతో చర్చించడం అంత ఆదర్శప్రాయమైన పని కాదేమో ననిపించింది. నిజానికి ఇది ఎ స్టేటు పనికి సంబంధించిందేనని సమాధానపరుచుకున్నాడు.

“అసలేం జరిగింది?”

కాల్చేసిన నుసిని బయటికి తీసెయ్యడానికి పైపుని పక్కనున్న చెట్టు మొదలుమీద కొడుతూ దొర అడిగాడు; 

తంగముత్తు గొంతు సవరించుకున్నాడు.

కడకరైకీ, ఏనుగులకీ అవినాభావ సంబంధం. నిజానికి కాడా జాతికంతకీ ఏనుగులు చిరపరిచితులే; లక్ష ఎకరాల అడివిలో అవిచ్ఛిన్నంగా తిరుగాడే ఏనుగుల మందలకీ గవర్న మెంటు అనుమతించిన అయిదు వందల ఎకరాల్లో సారవంతమైన ఎకరం రెండెకరాలకోసం వెతుకులాడే కాడా గుంపులకీ ఆయువుపట్టులు ఆడవిలోపారే సెలయేళ్ళు. ఎక్కడెక్కడ తిరిగివచ్చినా ఏనుగూ కాడా సెల యేళ్ళ పక్కనే ఉనికి ఏర్పాటు చేసుకోవాలి. 

ఇద్దరూ రోజుకి ఎన్నో సార్లు తటస్థపడుతూంటారు. ఒకరంటే ఒకరికి భయం, అనుమానం లేవు; కాడాకి ఏనుగు పవిత్రమైంది. ఏనుగు బలం, సాహసం, ఠీవీ, అందం; కాడాలో ఆశ్చర్యం; సంభ్రమం; నమ్రత, భ క్తి కలిగిస్తాయి. అందుకు ప్రతి చిహ్నంగా ఏనుగు కాడా జోలికి పోదు.

వందగజాల దూరంలో కాడా నడిచిపోతుంటే చూసి చూడనట్టు ఊరు కుంటుంది.

కాడాలందరికీ ఏనుగులు ఆరాధ్యాలయితే కడకరై కి సన్నిహిత స్నేహితులయ్యాయి. ఊహ వచ్చినప్పటినుంచీ అవి అతన్ని సమ్మోహితుణ్ణి చేశాయి. ఆకులతోనూ, గడ్డితోనూ వేసిన గుడిసెల్లో రాత్రిళ్ళు తల్లీ తండ్రీ మధ్య పడుకుని ఏనుగుల గురించే ఆలోచించేవాడు. నక్క కూతల మధ్య అడివిపంది అరుపుల్లో, కోతి కిచకిచల్లో, ఏనుగు ఘీంకారం వినిపించినప్పుడు అతనికి ప్రాణం లేచివచ్చేది. ఏనుగుల కథలు చెప్పమని తల్లినీ; తండ్రినీ వేధించేవాడు. 

కడక రై తాతముత్తాతలు ధైర్యసాహసాలకి ప్రసిద్ధికెక్కారు. అతని తాత ఎన్నోసార్లు మదపుటేనుగు భయం నుంచి కాడా జాతిని రక్షించాడు. ఒకసారి అడవిలో గడ్డి కోసుకుని వస్తున్న కాడా స్త్రీని మదపుటేనుగు తరుముతుంటే అడ్డుపడ్డాడు. ఏనుగుకి కోపం రెచ్చిపోయింది. స్త్రీని వదిలేసి అతనిమీద కసి తీర్చుకోడానికి ఉపక్రమించింది. 

ఎంతో సేపు ఏనుగు వెనకాలే దాక్కుని తప్పించుకోడానికి ప్రయత్నించాడతను. ఏనుగు మెడ బొద్దుగా పొట్టిగా వుంటుంది. వెనక నున్న మనిషిని మెడ తిప్పి చూడలేదు. కానీ మదపుటేనుగు బుద్ది చాలా సూక్ష్మమైంది. ఒకే వైపు గిరగిరా తిరిగి అతన్ని తొండంతో పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నదల్లా ఈసారి రెండోవైపుకి తిరిగింది. 

కడకరై  తాతకి ప్రళయం ఎదురైంది. 

అతను మాత్రం ఏం తక్కువ వాడు కాదు. వెంటనే ఏనుగు కాళ్ళ మధ్య దూరి తోక పట్టుకున్నాడు. ఏనుగు ఎంత ప్రయత్నించినా విదిలించలేకపోయింది. ఆతని పట్టుకి  జంతువు కి చక్కలిగింతలు పెట్టింది. ఒకే భయంతో అది అడవిలోకి పరుగు తీసింది. సమయం కని పెట్టి అతను పట్టు వదిలేసి, నేల మీద కూలబడ్డాడు. మళ్ళీ మదపు టేనుగు ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించలేదు.

కడకరై తండ్రికి ఏనుగులంటే ఎంతో అభిమానం. అతని పడుచుదనంలో జరిగిన సంగతి. అప్పుడు తన గుడిసెకి నాలుగయిదు వందల గజాల దూరంలో చెరువు వుండేది. అందులో స్నానం చెయ్యడానికి, నీళ్ళు తాగడానికి ఏనుగులు వేసం కాలంలో వస్తూ వుండేవి. అతను ఎత్తయిన చెట్టుకొమ్మల్లో దాక్కుని చూసి ఆనందించేవాడు. ఏనుగులకి నర వాసన పసిగట్టడం పుట్టుకతో వచ్చిన విద్యే అయినా, మనిషి కనిపించకుండా దాక్కుని వుంటే కళ్ళలో కనుక్కునేటంత ప్రజ్ఞ లేదు. ఒకనాడు ఆ గుంపులో మగ ఏనుగు కణతల కింది రంధ్రంలో నుంచి చమురు కారడం చూశాడతను. వెంటనే ఏనుగు మదించిందనీ. ‘మస్త్ ‘ వుందనీ గ్రహించాడు. మగ ఏనుగులు అప్పుడప్పుడూ ‘మస్త్’లో వుంటాయి.

అప్పుడు అవి ఉగ్రరూపం ధరించి, కనుచూపు మేరలో సర్వం ధ్వంసం చేస్తాయి. మనిషి కనిపిస్తే రక్తపు ముద్దగా తొక్కి తాండవమాడతాయి. మనుష్యులను చంపిన మదపు టేనుగులని కాల్చి చంపడానికి ప్రభుత్వం ప్రయత్నం జరుపుతుంది. ఈ ఏనుగు మదించి, అడవిలో పుల్లలు కొట్టుకోడానికి వెళ్ళిన ఇద్దరు ముగ్గురు మనుషులని చంపిందని వినగానే దానిని చంపినవాళ్ళకి బహుమానం ప్రకటించింది గవర్నమెంటు. 

ఈ వార్త కడక్కరై  తండ్రినెంత గానో బాధ పెట్టింది. ‘మస్త్ ’ కలకాలం వుండబోదనీ, అది తగ్గిన తరువాత ఏనుగు ఎప్పటిలాగా సాధువుగా మారిపోతుందనీ అతనికి తెలుసు. కొన్ని రోజులు పరిసరాల్లో జాగ్రత్తగా మసలితే పోయేదానికి నిండుప్రాణిని చంపడం అతని మనస్సుని క్షోభ పెట్టింది. 

అయితే, ప్రభుత్వం శాసిస్తే అడ్డు తగలగల వాళ్ళెవరు? అతనికొక ఉపాయం తట్టింది. మదపుటేనుగు తిరిగే స్థలంలో పెద్ద గొయ్యి తీసి, దానిమీద పచ్చని ఆకులూ , కొమ్మలూ కప్పి పెట్టాడు . గొయ్యిమీద మనిషి పరుగెత్తడానికి వీలుగా సన్నటి చెక్క వంతెనలాగావేసి, గొయ్యి కి ఇవతలపక్క  వంద గజాల దూరంలో నుంచుని డప్పులు వాయించాడు. చప్పుడు విని మదపుటేనుగు ఉరకలు వేసుకుంటూ వచ్చింది. అతనిమీద ఉరికి తొండంతో మెలి పెట్టడానికి వెంటాడింది. అతను కర్ర వంతెన మీదగా పరిగెత్తి గొయ్యి అవతలి పక్క చేరిపోయాడు.

తరుముకువస్తున్న ఏనుగు గోతిలో పడిపోయింది. ఏనుగుది అంత స్థూలకాయం అయినా మనిషితో సమానంగా పరిగెత్తగలదు. ఒక్కొక్కప్పుడు ఓడించనూ గలదు. అయినా దాని ప్రాణం కాపాడ్డంకోసం ఆ మాత్రం సాహసించడం అవసరం అనిపించిందతనికి. 

తరవాత పది రోజులూ నల్లమందు పడేసీ, మంచినీళ్ళు పోసీ కడకరై  తండ్రి దాన్ని ‘మస్త్ ‘లో నుంచి తొలగించాడు. 

అంత ఉగ్ర స్వరూపం అతి సాధువుగా మారిపోయింది. అప్పుడు అది బయటకి రావడానికి పట్టుగా పెద్ద పెద్ద దుంగలు గోతిలోకి దొర్లించాడు.

ఇటువంటివే ఎన్నో కథలు. వింటూంటే కడకరై  ఒళ్ళు గగుర్పొడిచేది. ఏనుగులంటే విపరీతమైన ప్రేమ అతన్ని ఆవరించేది. వాటిని మననం చేసుకుంటూ నిద్రపోయేవాడు.

ఏడాది చివర తల్లీ, తండ్రి తక్కిన గుంపుతో బాటు చోటు మార వలసి వచ్చినప్పుడు కడకరై గుండెలు వేగంగా కొట్టుకునేవి. 

కొత్త చోట ఏనుగులుంటాయా? వాటి ఘీంకారం వినిపిస్తుందా? 

కాడాలు  నివసించడానికి గవర్నమెంటు ఏనమలై కొండల్లో పదిహేడువందల ఎకరాల అడివి ప్రత్యేకించింది. 

అందులో కలపకొట్టి “అమ్మడానికీ, ఏనుగుల్నీ , నల్లకోతుల్ని పట్టడానికి వీల్లేదు కాని, వంటచెరుకు సేకరించుకోవచ్చు. పశువుల మేతకి గడ్డి కోసుకోవచ్చు. పెద్దపులినీ, సాంబార్ నీ  వేటాడవచ్చు. అడివి మేకనీ, దుప్పినీ, పందిని పట్టి తినొచ్చు. ఇంతేకాకుండా ఆ పదిహేడు వందల ఎకరాల్లో అయిదువందల ఎకరాల్ని ఛేదించి సేద్యం చేసుకోవచ్చు. 

కాడా గుంపులు ఏడాదికి నాలుగూ అయిదూ ఎకరాల చొప్పున అడవి నరికి రాగులూ, జొన్నలూ, కాయగూరలూ పండిస్తారు. ఏడాది చివర ఆ స్థలం వదిలిపెట్టి వారికి కేటాయించబడిన ప్రాంతం లో కొత్త స్థలం కోసం వెతుక్కుంటూ పోతారు. 

సాధారణంగా పాత చోటుకి తిరిగి పది హేనేళ్ళవరకూరారు. ఇలా తిరగడంలో ఎప్పుడు ఏనుగులు చేరువలో లేని ప్రదేశానికి చేరవలసి వస్తుందోనని కడకరై బాధ.

కడకరై  కొంచెం పెద్దవాడయి ఏడెనిమిది సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి గుడిసె చుట్టుపక్కల చిట్టడవిలో ఏనుగుల గుంపులకోసం వెతకడం ప్రారంభించాడు. ఏనుగులు. అరమైలు దూరంలో వుండగానే ఘీంకారం, వెదురుబొంగులు విరిగిన ఫెళ ఫెళలూ వినిపించేవి. 

తనను చూస్తే అవి పారిపోతాయని అతనికి తెలుసు.

జాగ్రత్తగా చెట్టు చాటునో, రాయిచాటునో నక్కి గంటల తరబడి తనివితీరా చూసేవాడు. చూసినకొద్దీ వాటి గాంభీర్యం. అమాయకత్వం అతణ్ణి పరవశం చేసేవి. దగ్గరకి వెళ్ళి తొండంమీద అప్యాయంగా నిమరాలనీ, మంచి పళ్ళూ కందమూలాలూ తినిపించాలనీ అశగా వుండేది. అయితే ఆ వయస్సులో అతను సాహసించలేక పోయాడు.

ఈ విషయం గుంపులో పొక్కిపోయింది. తల్లిదండ్రుల చెవిన కూడా పడింది. కడకరై తండ్రికి ఏనుగులంటే ఎంత మక్కువైనా అంత చిన్న వయసులో కొడుకు అడవులు గాలిస్తుంటే భయం వేసింది. ‘మస్త్’ లో వున్న ఏనుగులు, పెద్దపులులు, ఏడుపందులు, కొండచిలువలు దేని వాతబడ్డా ఆశ వదలుకోవలసిందే కద! 

అతను కొడుకుమీద ఒక కన్ను వేసి వుంచాడు. పగలల్లా కడకరై  పొలంలో పని చెయ్యాలి. రాత్రి కొడుక్కి నిద్రపట్టేవరకూ పక్కలో వేసుకుని కథలు చెప్పుతాడు. కునుకు పట్టిన తర్వాత గుడిసె  మూలలో వున్న వేరే పక్కలో వేస్తాడు.

అయితే, తల్లీ తండ్రీ కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా నిద్రలో మునిగి పోయేసరికి కడకరై ఒక నిద్రతీసి ఏనుగుల్ని కలుసుకోడానికి సిద్ధంగా వుండేవాడు. 

మొదట్లో ఏనుగులకోసం మైళ్ళు మైళ్ళు తిరగవలసి వచ్చింది. ఏనుగుల అలవాట్లు తండ్రి చెప్పిన కథల వల్ల కడకరైకి చూచాయగా తెలుసు. రోజుకి సరిపడే ఆరువందల పౌన్ల ఆకులూ, అలములూ సంగ్రహించుకోడానికి ఒక్కొక్క ఏనుగూ కనీసం పదిమైళ్ళ  అడవయినా గాలించాలి, ఏనుగులతోపాటు పదిమైళ్ళ ప్రయాణానికి సిద్ధపడి వెళ్ళే వాడు

కడకరైదూరంగా ఏనుగుల చప్పుళ్ళు వినిపించేవి. ధ్వనిబట్టి దూరాన్ని లెక్కకట్టడం కాడాలకి ఉగ్గుపాలతో నేర్పిన విద్య. కడకరై ఏనుగుల గుంపుల ఉనికి అంచనా వేసేవాడు. ఏనుగులు నడచిన దారి చక్కని రహదారిలాగా వుంటుంది. అయితే ఆ దారి ఎప్పుడు వేసిందీ కనుక్కో డానికి రోడ్డుపక్కని చెట్టుకొమ్మల్ని పరీక్షించేవాడు. అప్పుడే విరిగిన కొమ్మలు ఏనుగుల గుంవు ఆ దారిన వెళ్ళిన దానికి గుర్తు. దారిలో పెద్ద పెద్ద గడ్డలుగా పడివున్న ఏనుగు లద్దెల్ని కాలితో తన్నే వాడు. అవి విడిపోయి పొగలు గక్కుతూ కాలికి వేడితగిలితే అప్పుడే వేసినట్టు గుర్తు. 

ఈ ఆధారాలతో కడక్క ఏనుగులున్న చోటుకి చేరుకునేవాడు. ఎంతో కాలం ఇలా కష్ట పడవలసిన అవసరం లేకపోయింది కడకరైకి. అర్థరాత్రివరకూ అడవిలో తిరిగి కొన్ని గంటలు విశ్రమించడానికి ఏనుగులరాయి దగ్గరకి చేరుకునేవి ఏనుగులగుంపు. 

ఏనుగులరాయి గురించి చాలా విన్నాడు కడకరై. పెద్దరాయి, మూడువైపులా నేలలోకి పాతుకునిపోయి ఒకవైపు మనిషి పాకి వెళ్ళగలిగినంత ఎత్తులో, పది అడుగుల వెడల్పున ఖాళీ వుంది. రెండు మూడడుగులు పాకి లోపలికి వెళితే ఇద్దరు ముగ్గురు మనుష్యులు కూర్చోగలిగినంత స్థలం రాయి దొలిచి ఏర్పాటు చేసినట్టుంది. ఈ రాయి ఎన్నో కాడా జీవితాలు రక్షించిందని ప్రతీతి. కాడాలు దగ్గర్లో వున్న పల్లెకో పట్టణానికో కిరసనాయిలు, నూనె, పంచదార కొనుక్కోడానికి వెళ్ళి తిరిగి వస్తుంటే ఎప్పుడైనాచీకటి పడిపోతుంది. వెన్నెల రాత్రుళ్ళయితే పరవాలేదు. చీకటి రాత్రుళ్ళల్లో నల్లని ఏనుగు చర్మం గుర్తుపట్టడం కష్టం. ఎప్పుడు ‘మస్త్’ లో వున్న ఏనుగు తటస్థపడుతుందో చెప్పలేం. 

అటువంటి సమయంలో కాడాలు రాతి కింద దూరి దాక్కుంటారు. ఏనుగులు పసిగట్టి దగ్గిరకి వచ్చినా లోపల మనిషికి భయంలేదు. కొండ గుహలోలాగా నిశ్చింతగా కూర్చోవచ్చు. అయితే, కొండ గుహకి ఏనుగు ప్రవేశించగలిగి నంత ద్వారం వుండవచ్చు. ఈ రాతిలో ప్రవేశించడానికి రెండడుగుల ఖాళీ కంటే ఎక్కువ లేదు. బైట జంతుభయంవల్ల ఎక్కువ సేపు లోపలే  వుండి పోవలసిన పరిస్థితి ఏర్పడితే వంట చేసుకోడానికి, చలిమంట వేసుకోడానికి మూడు రాళ్ళూ, కొన్ని ఎండుపుల్లలూ రాతిలోపల ఎప్పుడూ భద్రపరిచి వుంచుతారు కాడాలు.

మొదట ఏనుగులరాయిని చూసినప్పుడు గుర్తు పట్టలేదు కడకరై.

అడివంతా తిప్పి చివరకి ప్రతి రాత్రీ తనని ఏనుగులు అక్కడికి తీసుకు వెళ్ళేసరికి అనుమానం కలిగింది. ఎన్నో రోజులు రాయి వెనకాలే నక్కి చూశాడు. రాతిచుట్టూ ప్రదేశాన్ని చక్కగా చదునుచేసుకున్నాయి ఏనుగులు. అక్కడ పడుకుని కూడా తెచ్చుకున్న కొద్ది ఆకుల్నీ, రెమ్మల్నీ సావకాశంగా తొండంతో మెలిపెట్టి నోట్లో తోసుకునేవి. 

ఆడ ఏనుగులు చిన్న పిల్లలకి పాలు గుడిపేవి. పిల్లలు తొండం నోటికి అడ్డం రాకుండా పైకి యెత్తి పెట్టి నోటితో పొదుగుని కరచి పెట్టుకుని తాగేవి. తిండి అయిన తర్వాత ఏనుగులు ఆడుకునేవి. ఒక్కొక్కప్పుడు పోట్లాడుకునేవి. కొన్ని ప్రేమకలాపం సాగించేవి. ఎక్కువ అలిసిపోయినప్పుడు : రాతికి ఆనుకుని శరీరాన్ని తోముకునేవి. చూసినకొద్దీ కడకరై  ముగ్ధుడై పోయేవాడు.

రోజులు గడిచిన కొద్దీ కడకరై  దూరం నుంచి చూసి ఆనందించడంతో తృప్తి పొందలేక పోయాడు. అతనికి ఏనుగుల మీద అభిమానం, నమ్మకం ఎక్కువయ్యాయి. ఒక రోజున ఏనుగులు రాక ముందే రాతిలో దూరి పడుకున్నాడు. మనిషి లోపల ఉన్నట్టు వాసనవల్ల గ్రహించి తొండం లోపల చొప్పించడానికి ప్రయత్నించాయి ఏనుగులు. కాని తొండం ఎంతో లోపలికి పోలేదు. రాతిలో కడకరైకి ఒకపక్క భయం, ఒక పక్క ఆవేశం? 

ఏనుగులు! చేతికందేటంత దూరంలో ఏనుగులు. తనేం చేస్తున్నదీ తనకే తెలియలేదు. రాత్రి తినడానికి తెచ్చుకున్న చెరుకుముక్కలూ, అరటి పళ్ళూ లోపలికి చాచిన తొండాలకి అందిచ్చాడు.

వాటిని ఏనుగులు నోట్లో పెట్టుకుంటుంటే కడకరై ఒళ్ళు మరిచిపోయాడు. అప్పట్నించీ రోజూ ఏదో ఒకటి ఏనుగులు తినడానికి తీసుకువెళ్ళేవాడు. ఏనుగులకీ, అతనికీ మధ్య ఇలా ప్రారంభమైన మైత్రి కొంతకాలానికి ఎడతెగని స్నేహంగా పరిణమించింది. 

గుంపులో ప్రతి ఏనుగునీ కడకరై గుర్తుపట్టగలడు . ప్రతిదానినీ పేరు పెట్టి పిలిచేవాడు. పొమ్మన్నన్, మైలన్ , కులకడా, వీంబన్ , ఆనకట్టయ్, కరుప్పాయి, లచ్మి, ఇంకా ఎన్నో పేర్లు. 

ఇప్పుడు తను రాతికింద దాక్కోవలసిన అవసరం లేదు. రాతి మీదకెక్కి ఒక్కొక్క ఏనుగునీ పేరు పెట్టి పిలిచి కొబ్బరి ఆకులూ, వెదురు ఆకులూ, అరటిపళ్ళూ, రాగులూ, చోళ్ళూ ఏవి దొరికితే అవి పెట్టేవాడు. ఏనుగులు ఆప్యాయంగా అందుకుని తినేవి.

కడకరై కి పన్నెండో యేడు వచ్చేవరకూ తల్లి, తండ్రితో గుడిసె లోనే పడుకునేవాడు. పెద్దవాళ్ళు నిద్రపోయిన తర్వాత గుడిసె విడిచి పెట్టి ఏనుగుల రాయి దగ్గిరకి పోయి తిరిగి తెల్లవారక ముందే వచ్చి పక్కలో పడుకునేవాడు. పన్నెండో యేడు రావడంతో అతను మొగవాళ్ళ సత్రవకి వెళ్ళవలసి వచ్చింది. 

కాడాల్లో  పన్నెండేళ్ళకి మించిన పిల్లలు తల్లీ, తండ్రి గుడిసెలో పడుకోడానికి వీల్లేదు. ఆ వయసువాళ్ళు రాత్రిళ్ళు పడుకోడానికి గుంపుకి రెండు సత్రవలుంటాయి. 

ఒకటి మొగవాళ్ళకి, రెండవది ఆడపిల్లలకి. 

పెళ్ళి అయ్యేవరకూ వాళ్ళు అక్కడే పడుకోవాలి. సత్రవ నడపడానికి, పిల్లల యోగక్షేమాలు చూడడానికీ, హద్దులో వుంచడానికి ముసలి పెద్దలు ఆడవారి సత్రానికి అవ్వా, మొగవారి సత్రానికి తాతా సత్రంలోనే పడుకుంటారు. 

పిల్లలు రాత్రిళ్ళు సత్రం విడిచి పోకూడదనే ఆంక్ష కఠినంగా పాటిస్తారు కాదాలు. అయినప్పటికీ అప్పుడప్పుడూ మగపిల్లలు తాత కళ్ళుకప్పి ఆడపిల్లల సత్రంలో ప్రియురాళ్ళని కలుసుకోడానికి వెళ్ళడంలాంటివి జరుగుతూనే వుంటాయి. 

కడకరై కి వర్షాకాలం అంతా సత్రం జీవితం బాధ అనిపించలేదు. వర్షాకాలంలో ఏనుగులు కొండల కింద వున్న కీల్ పొల్లాచికి వెళ్ళిపోతాయి. వేసంకాలం సమీపిస్తుందనగా ఎండ వేడి భరించలేక నాలుగయిదు వేల అడుగుల ఎత్తు కొండల్లోవున్న ఏనుగుల రాయి ప్రాంతాలకి జేరుకుంటాయి. ఈ ఆరు. నెలల్లో కడకరై ఒక్క రాత్రి కూడా ఏనుగుల్ని చూడకుండా గడపలేడు. 

జనవరి నెల ప్రారంభంలో ఏనుగుల ఘీంకారం వినిపించినప్పుడు మగత నిద్రలో వున్న కడకరై  ఒళ్ళు గగుర్పొడిచింది. లేచి సత్రం తాత కంటబడకుండా బయటపడ్డాడు. ‘ఆనకట్టె’కి చెరుకుముక్కలంటే ఎంతో ఇష్టం. ‘వీంబన్ ‘ కి కొబ్బరికాయలుంటే ఇంకేమీ అక్కర్లేదు. ఇప్పుడవన్నీ ఎక్కణ్ణుంచి తెస్తాడు? తండ్రి ఎకరన్నర పొలంలోకి వెళ్ళి, పున్న చెట్టు కొమ్మల్లో అరవై అడుగుల ఎత్తున ఆకులూ కొమ్మలతో పదిలంగా చేసిన గాదిలోనుంచి రాగులూ, చోళ్ళూ, అరిటిపళ్ళూ బయటికితీసి పంచెలో భద్రపరుచుకుని ఏనుగులరాయి దగ్గిరకి ప్రయాణమయ్యాడు.

కడకరై  రాత్రిళ్ళు సత్రం విడిచి వెళుతున్న విషయం అట్టే కాలం దాగలేదు. ఆడ సత్రంలో అమ్మాయిలకోసం వెళుతున్నాడని నింద మోపారు. పంచాయితీ ఏర్పాటు చేసి శిక్ష వెయ్యాలన్నారు. తను ఏ అమ్మాయికోసమూ వెళ్ళడం లేదన్నాడు కడకరై. 

కాని ఎక్కడికి వెళుతున్నాడో చెప్పలేదు. చెపితే ఆటంకాలు పెడతారని అతని భయం. ఆడ సత్రంలో ఎవరిని  కలుసుకోడానికి వెళుతున్నదీ నిరూపించలేక పోవడంవల్ల అతన్ని దండించ లేదు. కాని కొందరు పెద్దలు రాత్రిళ్ళు పొదల్లో పొంచి అతను ఎక్కడికి వెళ్ళుతున్నదీ కని పెట్టడానికి ఉపక్రమించారు. దానితో రహస్యం బయటపడిపోయింది. పెద్దలు ఇంత పిచ్చి కూడదన్నారు. తల్లి, తండ్రి నయానా, భయానా వారింప చూశారు. బయట స్నేహితులు ఘీంకరించి పిలుస్తుంటే ఎంత ప్రయత్నించినా కడకరై  సత్రంలో నిద్రపోలేక పోయాడు. కడకరై తండ్రికి పరిస్థితి అర్థమైంది. కొడుకు స్వేచ్చని అరికట్టి ప్రయోజనం లేదని పెద్దలకి నచ్చచెప్పి ఒప్పించాడు.

ఈ వేసంగికి కడక, ఏనుగులరాయి దగ్గిరకి వెళ్ళగానే కళ్ళ నీళ్ళు తిరిగాయి. అక్కడ ఏనుగులు లేవు. అవి చదును చేసుకున్న స్థలం లేదు. దట్టమైన అరణ్యం లేదు. అడవి కొట్టి మేక్నాటన్ టీ కంపెనీ అక్కడ నర్సరీ ఏర్పాటు చేసింది. చల్లని ఆకుపందిళ్ళ కింద నవ నవ లాడే టీ నారు. ఆ నారుని అడవి మృగాలు తొక్కి పాడు చెయ్యకుండా చుట్టూ కొయ్యలకి కొట్టిన ముళ్ళతీగ. ముళ్ళతీగకి ఆనుకుని ఏనుగులరాయి. 

ఏనుగులరాయి పేరుకి మాత్రమే అక్కడ పడివుంది. ఏనుగులకి చిక్క కుండా మనిషి లోపల దూరి దాక్కో డానికి ఇంక అది పనికిరాదు. రాయిలో దూరే సన్నటి ద్వారాన్ని టీ కంపెనీ తాపీ మేస్త్రీలు వెడల్పు చేసి పగల గొట్టిన రాతిముక్కలతో నర్సరీ అంచులు కట్టారు. ఇప్పుడు రాతి లోపల ఇద్దరు కూర్చోడానికే కాదు – అరడజను మంది పడుకోడానికి స్థలం వుంది. ద్వారం దగ్గిర రాతిముక్కల్ని పగలగొట్టి తీసెయ్యడంవల్ల రాయి బలం తగ్గిపోయి, మధ్యలో పెద్ద బీటవేసి కొద్దిగా ముందుకి వాలింది. కడకరై కి దుఃఖం పెల్లుబికి వచ్చింది. 

సంబాళించుకుని విచారించవలసిన పని లేదనుకున్నాడు. ఏనుగులరాయి ఎలా పోతేనేం? ఇంక దాని ఉపయోగం లేదు. అడివి నరికి మనిషి పనిచెయ్యడం మొదలు పెట్టాక ఏనుగులు ఆ పరిసరాలకి రావు. ఇంక ఏనుగులు రావు. ఆనకట్టె, వీంబన్, మైలన్, కరుప్పాయీ అక్కడికి రావు. కడకరై కి తిరిగి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చేసింది. మొలకి చాలీ చాలకుండా కట్టుకున్న పంచే చెంగుతో కళ్ళు, మొహం తుడుచుకున్నాడు. 

ఏనుగుల కోసం తెచ్చిన కొబ్బరికాయలూ, అర టిపళ్ళూ రాయి దగ్గర పెట్టి స్నేహితుల్ని వెతకడానికి బయల్దేరాడు. ఎంతో దూరం వెళ్ళకుండానే కడకరైకి ఏనుగుల జాడ కనిపిం చింది. తన్నికలుసుకోడానికి రాతి సమీపానికి వచ్చి నరికిన అడివిని చూసి పారిపోయాయన్నమాట. దగ్గరలోనే వున్న సెలయేటికి పోయి వుంటాయి. కడకరై  ఏటి ఒడ్డుకి పరిగెత్తాడు. ఏనుగులు స్నానం చేస్తు న్నాయి

కొత్త పరిసరాల్లో కడకరైకి స్నేహితుల మీద నమ్మకం కొంచెం సడలినట్టయింది. దగ్గిరకి వెళ్ళడమా, మానడమా అని తటపటాయించాడు. చెట్టుచాటున నక్కి మృదువుగా కూనిరాగం తీశాడు.

 “కూ.లా.కాడా… ” 

తొండంతో నీళ్ళు వీపుమీద చిమ్ముకుంటున్న కులకడా వెనక్కి తిరిగి, చేటచెవులు రిక్కించి చూసింది. కడకరై  మొహం వికసించింది. మళ్ళీ పాడాడు. 

“వీంబాన్ ” వీంబన్ పాట వచ్చిన వైపు ఒక అడుగు ముందు కేసి వచ్చింది. కడకరై అనుమానం ఇప్పుడు తీరిపోయింది. ఎక్కడున్నా అవి తన స్నేహితులే. చెట్టుచాటునుంచి వచ్చి ఏనుగుల ముందర నిలబడ్డాడు. కడకరై, ఏనుగులు ఏదో మూగ భాష లో కూడ పలుక్కున్నారు. అంతా ఏనుగులరాయి దగ్గర చేరుకున్నారు. ఎంత రూపు మారి పోయినా ఏనుగుల రాయి మీద మమకారం కడకరైని వదలలేదు. తమ స్నేహం మొదలయింది అక్కడ. పెంపొందింది అక్కడ. 

అక్కడ జేరగానే అతని మనస్సు ఉప్పొంగిపోయింది. 

ఈ మర్నాడు పొద్దున్న మెక్ నాటన్ టీ కంపెనీ కూలీలు పనిచెయ్య డానికి నర్సరీ దగ్గిరకిపోయి ఏనుగులవల్ల కలిగిన నష్టం చూశారు. టీ నారు పాడవలేదు కాని ఏనుగులరాయికి ఆనుకొని వేసిన ముళ్ళతీగలూ, కొయ్యముక్కలూ ధ్వంసం అయిపోయాయి. వెంటనే కంపెనీ వాటిని బాగుచేయించింది. మళ్ళా మర్నాడు అదే కథ. 

ఈసారి కంపెనీ తీగని బాగుచేయించడంకో ఊరుకోలేదు. రాత్రి నలుగురు కూలీల్ని కాపలా పెట్టింది.

కడకరైకి మళ్ళీ సమస్య ఎదురైంది. 

కూలీలు నర్సరీ చుట్టూ పెద్ద పెద్ద మంటలు వేసుకొని కూర్చున్నారు. 

మంటల్ని చూస్తే ఏనుగులకి భయం. పరిసరప్రాంతాల్లో కనిపించవు. 

విధిలేక కడకరై యేటి దగ్గిర కలుసుకునేవాడు. యేటిదగ్గిర కలుసుకున్నా, రాయిదగ్గిర కలుసు కున్నా అవే ఏనుగులు. 

అయినా అతని మనస్సంతా ఏనుగులరాయిమీదే వుండేది. ఆ రాతిగుహలో కూర్చుని కులకడాకి ఆకులు పళ్ళు తినిపిస్తే లచ్మి తొండానికి ఆకులు అందిస్తే అతని మనస్సు తృప్తిగా వుంటుంది .

వారంరోజులు రాత్రికాపలా పెట్టిన తర్వాత ఏనుగుల భయం పోయిందని మెక్ నాటన్ కంపెనీ ఉపేక్ష చేసింది. 

రాత్రి ఇంటిదగ్గర భోజనంచేసి యేటిదగ్గిర ఏనుగులకి పళ్ళు తీసుకువెళ్ళుతున్న కడకరై రాయిదగ్గిర కాపలా కూలీలు లేకపోడం గమనించాడు. 

వీంబన్ , ఆనకటై .అని ఉద్రేకంగా అరుచుకుంటూ యేటిదగ్గిరకి పరుగెత్తాడు.

కొంత సేపటికి స్నేహితులంతా మళ్ళీ ఏనుగులరాయి దగ్గర జేరు కొన్నారు.

కడకరై  మధురస్మృతుల్లో మైమరిచిపోయాడు. పూర్వంలాగా రాతి లోపల కూర్చుని ఏనుగులకి పళ్ళు అందించాడు. . ఏనుగులు సంతోషంతో మిన్నుముట్టేలా ఘీంకరించాయి; 

విలాసాల్లో మునిగిపోయాయి. అంతా కోలాహలంగా వుంది.

అంత సంతోషం ఎంతో సేపు నిలబడలేదు. ఏనుగులు ఆడి ఆడి రాతికి శరీరాన్ని రుద్దుకోడం ప్రారంభించాయి. పూర్వం రాయి బలంగా వుండి వాటి తాకిడికి ఆగేది, ఇప్పుడు బీట వారి  పడిపోవడానికి సిద్ధంగా వుండి నిలబడలేక పోయింది.

ముందుకి వాలివున్న భాగం బ్రహ్మాండమైన చప్పుడుతో కూలి పోయి లోపలవున్న కడకరైని ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

కడకరై ఒక్క అరువు అరిచాడు. 

మరుక్షణం రక్తపుముద్దగా మారిపోయాడు.

జరిగిన సంగతి ఏనుగులు గ్రహించాయి. వెర్రి ఆవేశం వాటిని ఆవహించింది. 

చుట్టుప్రక్కల వున్న నర్సరీని సర్వనాశనం చేసేశాయి. పందిళ్ళని పీకి ముక్కలు ముక్కలు చేశాయి. టీ మొక్కల్ని ఆనవాలు పట్టలేనంతగా తొక్కేశాయి. ముళ్ళతీగని దారపు వుండలాగా చుట్టి దూరంగా విసిరికొట్టేయి. నర్సరీ అంచులకి ఉపయోగించిన రాళ్ళని  ఇసుక రేణువులుగా నలిపేశాయి. విడి పడిపోయిన రాతిని దొర్లించి కడకరైని బయటికి లాగాయి.

మర్నాడు పొద్దున్న నర్సరీ లోపలికి వెళ్ళిన కూలీలు కడకరైని, మోసుకుపోతున్న ఏనుగులమందని చూసి భయపడి పారిపోయారు.

మళ్ళీ నర్సరీ వెయ్యడానికి కంపెనీ పదిసార్లయినా ప్రయత్నిం చింది. ప్రతిసారీ ఏనుగులు మందలు మందలుగా వచ్చి రూపులేకుండా చేసిపోయాయి. రాత్రిళ్ళు మంటలు వేసుకుని కూలీలు కాపలా వుండేవారు. మంటలారిపోయేవరకూ వుండి నర్సరీని దొమ్మీ చేసేవి ఏనుగులు.  ఒక్కొక్కప్పుడు పట్టపగలే దాడిచే సేవి. 

పగబట్టిన ఏనుగులతో పోట్లాడటం వృధా ప్రయాస అని స్టీవెన్సు దొర నర్సరీని ఇంకొకచోటికి మార్చేశాడు.

తంగముత్తు చెప్పడం పూర్తిచేశాడు. 

సిమ్మన్సు దొర సందిగ్దావస్థ లో పడ్డాడు. ఆయన నాగరికత ఇదంతా మూఢవిశ్వాసమేమోనని కలవర పెట్టింది. మనస్సు నమ్మమని ప్రోత్సహించింది. నెమ్మదిగా జేబులోనుంచి పొగాకు తీసి పైపులో కూరుకుని అగ్గిపుల్ల గీసి అంటిం చాడు. “ఇంక మనం కథలు చెప్పుకోడం మానేసి కొంచెం పనిచేస్తే బాగుంటుందేమో. ఎంతలేదన్నా కం పెనీ జీతంరాళ్ళు ఇస్తూంది కద!” అని నవ్వాడు.

“ఔను సార్ !” అన్నాడు తంగముత్తు.

***************************************

“సి.రామచంద్ర రావు గారి ‘ఏనుగుల రాయి’!” కి 2 స్పందనలు

  1. Fantastic and Heart touching story, just like drinking fresh natural water at water falls instead of coke in a restaurant

Leave a Reply