‘అహింస’ దాదా హయత్ గారి కథ!

‘అహింస’ దాదా హయత్ గారి ‘మురళి ఊదే పాపడు’ అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణనీ, పొందికైన పదాల కూర్పునీ మనం చూడొచ్చు.

కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు.

ఈ పుస్తకం కొనాలంటే, ఈ లింకుపై క్లిక్ చెయ్యండి –

http://bit.ly/2Ok88yb

అహింస:

అది మోకాలి మీదికి పాకింది. అది  ఒకసారి గంభీరంగా తన స్థితి గతులు’ పరీక్షించుకొని ప్రమాద మేమీ లేదన్నట్లు మళ్ళీ కదిలి ముందుకు సాగింది ఆ నల్లటి గండుచీమ.

నిద్రమత్తు కళ్ళతో దాన్నే స్తబ్దుగా చూస్తున్నాడు చంటి. అంతవరకూ ఓపిగ్గా దాన్ని గమనిస్తూ వచ్చాక దానిమీద హఠాత్తుగా ఆసక్తిపోయి విసుగుపుట్టేసి బొటనవేలికి మధ్యవేలును సంధించి లాగి ఒక్కటి తగిలించాడు. గండుచీమ ఎగిరి నేలమీదపడి సర్దుకొని నిలబడి దొరికి పోయినట్టు తికమకగా ఎటు పారిపోవాలని కాస్సేపు దిక్కులు చూసి వెనక్కి తిరిగి పలాయనం చిత్తగించింది.

ఒక మోకాలి మీద గెడ్డం ఆన్చి నిర్లక్ష్యంగా పారిపోతున్న దాన్ని గమనిస్తూ దిగుల్లో పడిపోయాడు చంటి. ఆరోజు బడికి వెళ్ళాలంటేనే నీరసం ముంచు కొచ్చేస్తోంది. ఏం చేయాలో తోచక జేబు తడుముకొని ఇన్ని బలపాలూ చాక్ పీసులూ బయటికి తీశారు. అవి ఎప్పుడూ తన జేబులో వుండాల్సిందే–రాత్రిపూట కూడా. ఎవ్వర్నీ తీయనియ్యడు.

ఓ చాక్వసుతో అరుగుమీద ఓ ‘సున్నాగీసి. మధ్యలో నిలువుగా గీతగీసి చెవులు పెట్టి. పొడుగ్గా రెండు జడలు పెట్టి కింద రాశాడు. ‘అమ్మ’. చంటి బళ్ళోచేరి రెండునెల్లే అయింది. కాని, అంతకు ముందే వాళ్ళమ్మ దగ్గర అక్షరాలన్నీ నేర్చేశాడు. అమ్మపక్కనే నాన్నని గీసి పీచు జుట్టు పెట్టాడు. తర్వాత గంభీరంగా తన సొంత సామర్థ్యాన్ని పరీక్షించుకొని తృప్తిగా చూసి కాస్త వెనక్కి జరిగి కింద మరోబొమ్మ గీశాడు.. ‘టీచర్’.

ఈలోపల అమ్మబయటికొచ్చి కొడుకు చిత్రకళాకౌశలాన్ని తిలకించి నవ్వి, “బొమ్మలు గీస్తూ కూచున్నావా చంటీ? బడికిపోవూ? మొహం కడుక్కొని స్నానం చేద్దూగాన్రా ,” అని కొడుకుని లేవదీసింది.

మొహమ్మీది కొచ్చిన చింపిరి జుట్టుని వెనక్కి తోసుకొని, “అమ్మా, మా టీచర్ చూడవే – బావుంది కదూ?” కళ్ళు మెరిపించి వేలితో చూపిస్తూ అన్నాడు చంటి.

“ఆఁ ఆఁ చాలా బావుంది. బడికి వేళ కాదూ? రా”

చంటికి అరుగు దిగాలనిపించలేదు. బిక్కమొహం వేసుకొని దిగి అమ్మ వెంట వెళ్ళాడు.

స్నానం చేయించుకొని, తల దువ్వించుకొని అమ్మవెంట వంట గది లోనికి వెళ్ళాడు చంటి.

పొయ్యి వెలిగించి, గిన్నె పెట్టి ఉప్మాకోసం పోపువేసి తిరగ. పెడుతున్న అమ్మకొంగు లాగుతూ వగలు పోసాగాడు.

“అబ్బ, వుండరా! ఉప్మా కానీ”

అమ్మభుజం మీద గెడ్డం ఆన్చి గారంగా “అమ్మా” అని పిలిచాడు.

చీర కొంగుని గుప్పిట బలంగా బిగించి మళ్ళీ పిలిచాడు “అమ్మా”

“ఏమిట్రా?”

“ఈరోజు ….”

“ఊఁ”.

“స్కూలోద్దే”.

చేస్తున్న పనాపి కొడుకు మొహంలోకి నేరుగా చూసి “ఏం?” అంది.

చంటి జవాబివ్వలేదు. అమ్మ మళ్ళీ పన్లో పడింది.

“అమ్మా”

“మీ నాన్నగార్నడుగు ”.

చంటి మొహం వేలాడేసుకొని నిల బడ్డాడు. కాస్సేపాగి మళ్ళీ కొంగు లాగాడు

“ఊఁ….”

అమ్మ చంటి చేతుల్లోంచి కొంగులాగేసింది.

చంటి ఖిన్నుడై పోయాడు. అమ్మ నిరసనకు మొహవైతే చిన్నబోయింది గాని, బడికి మాత్రం వెళ్ళాలన్లేదు.

బిక్క మొహంవేసుకొని కాస్సేపలాగే నిలబడ్డాడు. తర్వాత అమ్మ భుజం మీద చెయ్యేశాడు.

కాస్సేపూరుకొని ఒక చేత్తో భుజంమీది ” కొడుకు చేతిని నొక్కి పట్టి తలతిప్పి లాలనగా చూసి “అలాగేలే, ఇంట్లో కూచుని చదువుకో” అంది.

చంటి మొహం వికసించింది. లావులావు బుగ్గల్ని నవ్వుతో మరింతలావు చేసి వంటగదిలోంచి బయటికి పరిగెత్తి నాన్నగారి ముందు “హాయ్ హాయ్” అని గెంతులేస్తుంటే పేపరు చదువుతున్న నాన్నగారు “ఏమిట్రా?” అన్నారు కొడుకుని మురిపెంగా చూస్తూ.

గెంతడం ఆ పేసి కుర్చీ కోడు పట్టుకు నిలబడి, “నాన్న అమ్మేం, స్కూలుకెళ్ళొద్దంది ” అన్నాడు సిగ్గుగా. .

నాన్నగారు విస్మయంగా చూసి, “ఎందుకు?” అనడిగారు.

చంటికేం చెప్పాలో అర్ధం కాలేదు. ఆలోచన్లో పడ్డట్టు మొహం పెట్టాడు.

నాన్నగారు వంటగదిలోకి కేకేసి, “చంటిగాణ్ణి స్కూలు కెళ్లాద్దన్నావట?” అన్నారు.

“ఆఁ లోపల్నుంచి సమాధానం.

“ఎందుకూ?”

“రేపెళ్తాడులెండి”

అయోమయంతో లేచి లోనికెళ్ళారు నాన్నగారు. చంటి నేరస్తుడిలా వున్న చోటునే నిలబడ్డాడు. ఈయన స్కూలు కెళ్ళమనడుగదా? ‘

“ఎందుకనెళ్ళోద్దన్నావ్?” అడిగారు నాన్నగారు.

“వాడు నిన్న ఆదివారమంతా గెంతీ గెంతీ ఈ రోజు బడికెళ్ళడానికి బద్దకిస్తున్నాడు. ఎప్పుడూ ఇలా అడగలేదు. స్కూలికి పోనన్నాడు-సర్లేమ్మన్నాను.”

“అలా ఎందుకన్నావ్? చదువు దగ్గరేం గారాలు?”

“పోన్లెండీ. రేపు వెళ్తాడు. రెండు నెల్లేగా బళ్ళోచేరి.”

నాన్నగారు ముందుగదిలోని కెళ్ళిపోయి చంటివైపు చూడకుండా సీరియస్ గా పేపర్లో పడ్డారు.

చంటి అక్కడే నాన్నగారి మొహంలోకి చూసి చూసి బిడియంగా అక్కణ్ణించి కదిలి వెళ్ళిపోయి మళ్ళీ అరుగుమీద కూచోని దిగుల్లో పడ్డాడు. నాన్నగారికి క్కోపమొచ్చినట్టుంది.

ఇందాకా గీచిన బొమ్మలు చెరిపేశాడు.

ఎండవాలు కాస్త ఎక్కువయ్యే వేళకి లేచి ఇంట్లో చాపమీద కూచొని హోం వర్క్ చేస్తున్న అక్క దగ్గరకెళ్ళి “అక్కా, కేరం బోర్డాడు కుందామా?” అడిగాడు. కుతూహలంగా.

“హోంవర్క్ చేసుకొని న్కూలు కెళ్లాల్సుంటే నీతో కేరమ్సాడుకొంటూ కూచోమ్మంటావా?”

పేపర్లోంచి నాన్నగారు, “ఏం నిన్నంతా ఏంజేశావ్?” అడిగారు.

అక్క తల పైకెత్తి చూసి, “చేసుకోలేదు’ ‘ అని నవ్వేసి మళ్ళీ చివరిలెక్క చెయ్య డంలో మునిగి పోయింది.

చంటి బాసింపట్టేసుక్కూచొని బుద్ధిగా అక్క చేస్తున్న పనివైపు చూస్తూ చదవడానికి ప్రయత్నించాడు. అసలేం అర్థంకాలేదు. విసుగుపుట్టి లేచి పెరట్లో కి వెళ్ళాడు. బంతిపూవు మీద కూచొని సీతాకోక చిలకొకటి కనిపించింది. చప్పుడు చెయ్యకుండా వెళ్ళి పట్టుకోబోయాడు. సీతాకోకచిలక ఎగిరిపోయి మరోచోట వాలింది. చంటి మళ్ళీ పట్టబోయాడు. అది ఆకాశంలోకి లేచి పెరటి గోడ దాటి ఎగిరిపోయింది. చంటి నిరాశపడిపోయి ఇంకేమన్నా సీతాకోక చిలకలున్నాయా అని చూశాడు. లేవు-ఇంకొంచెం ముందు వచ్చుంటే వుండేవి.

చంటి బంతిపూలు కోద్దామా అని ఆలోచించాడు. అమ్మ తిడుతుంది. నేలమీదికి చూశాడు. పెరటిగోడ మొదట్లో గడ్డిపూలున్నాయి. వెళ్ళి ఒక్కోటి ఒక్కోటీ కోస్తుంటే వానపామోకటి బద్దకంగా కదుల్తూ కనిపించింది. చంటి అటూ ఇటూ చూసి ఓ ఎండుపుల్ల నేరి వానపాముని కదిలించాడు. అది కాస్త వేగంగా కదిలి ఓ గడ్డి మొక్క పక్కన చిన్నబొరియలోనికి దూరి పోయింది. ఎండు పుల్లతో బొరియ లోకి గుచ్చాడు. వానపాము బయటికి రాలేదు. గడ్డి మొక్కపట్టి పీకాడు. బొరియ

పెద్దదైంది. గాని వానపాము మాత్రం రాలేదు. అయితే బలంగా వీకేసరికి గడ్డిమొక్క వేళ్ళతో సహా ఊడోచ్చి చంటివెనక్కి చిత్తడిలోకి పడ్డాడు.

ఛీ ఛీ బురదైపోయింది.

“ఒరెయ్ చంటి, ఉప్మాతిందూగాన్రా !’ లోపల్నుంచి అమ్మ కేకేసింది.

మొహమంతా చిన్నబుచ్చుకొని లోనికొచ్చిన చంటిని చూసి

“చీ…చీగాడిదా, ఇందాకే కదరా స్నానంచేశావ్,” అని బుగ్గగిల్లి లాక్కెళ్ళి చొక్కాలాగూ తీసేసి నీళ్ళ గదిలో చంటి కాళ్ళూ చేతులూ కడిగింది.

చంటికి బుగ్గ మంట పెట్టింది. కళ్ళల్లోకి నీళ్ళిచ్చాయి. రోషమొచ్చింది.

అమ్మ లోపలికి తీసుకెళ్ళి వేరే బట్టలేసి ఉప్మాపెట్టింది.

చంటి ఉప్మా తిని వీథి గుమ్మం దగ్గర నిలబడ్డాడు.

పక్కింటి హరిగాడు పలకా పుస్తకం పట్టుకొచ్చి “ఏరా కిరణ్’ బడికి రావా?” అనడిగాడు.

చంటి ఫోజుగా తల పై కెగరేసి లేదన్నట్టు తలూపాడు.

“ఏం?”

“మా అమ్మొద్దంది ”.

హరికి అర్థం కాలేదు.

“దేనికి?”

“నేనే పోనన్నాను.”

“అసలు స్కూలుకే రావా?”

“వస్తాను, ఈ రోజు రాను.”

“మరి మీ అమ్మ కొట్టదా?”

“మా అమ్మ కొట్టదుగా” అన్నాడు చంటి గర్వంగా.

హరి వెళ్ళిపోయాడు. చంటి ఇంకాసేపు అక్కడే నిలబడి ఇంట్లో కొచ్చాడు.

తెలుగు వాచకం’ ముందేసుక్కూచుని బొమ్మలు చూడ్డం మొదలెట్టాడు. కాస్సేపటికి అక్క స్కూలు కెళ్ళిపోయింది. బట్టలేసుకొని నాన్నగారు పదింటికి ఆఫీసు కెళ్ళిపోయారు. పుస్తకం పక్కన పడేసి విసుగ్గా హాల్లో కొచ్చాడు చంటి.

ఆదివారానికి మామూలు రోజుకీ తేడా అప్పుడు తెలిసింది. కేరమ్స్, బంతాట ఆడటానికి అక్కలేదు. స్కూలుకెళ్ళి పోయింది. ఒళ్ళో కూచోబెట్టుకొని కథలు చెప్పడానికి, మురిపించడానికి నాన్నగారు లేరు. ఇల్లంతా బోసిపోయి మూగగా కనిపించింది.

నాన్నగారి కుర్చీ ఖాళీగా కనబడితే దిగులుగా వెళ్ళి కూచుని బల్లమీదున్న లావుపాటి పుస్తకాన్ని ఒళ్ళో పెట్టుకొని పేజీలు తిప్పడం మొదలెట్టాడు లోపల బొమ్మలేం లేవు.

చంటికి ఒకసారి నాన్న చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. నాన్న ఈ పుస్తకం చదువుతుంటే “ఏవిఁట్నాన్నా అది?” అనడిగాడు తను.

“నా పుస్తకం నాన్నా”

“ఏముంటుందందులో?”

“ఆఫీసుమాటలుంటాయి”

“ఓ” అని అర్థమైపోయినట్టు కళ్ళు మెరిపించాడు.

“ఎంత పెద్ద పుస్తకమో?” అన్నాడు తను మళ్ళీ.

నాన్నగారు నవ్వి, “నువ్వూ రోజు స్కూలుకెళ్ళి బాగా చదూకుంటే ఇంతకంటే పెద్ద పుస్తకాలు చదివేస్తావు నాన్నా” అన్నారు. తనకు భలే సంతోషమేసింది.

ఈ విషయం గుర్తుకురాగానే హాయిగా నవ్వుకొంటూ కుర్చీ వెనక్కి వాలి ఆలోచన్లో పడ్డాడు .

తను స్కూలు కెల్తాడు. బాగా చదూకుంటాడు. నాన్నగారిలా పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివి పారేస్తాడు. ఒళ్ళోని పుస్తకం అపురూపంగా కనిపించి దాన్ని ప్రేమగా నిమిరి జాగ్రత్తగా బల్లమీద పెట్టాడు .

గుండెలురకలేస్తూండగా అమ్మదగ్గరికి పరిగెత్తాడు. “అమ్మా….అమ్మా. నేనేం, నాన్నారిలా పెద్ద పే….ద్ద పుస్తకాలన్నీ’ చదివేస్తాను పెద్దయ్యి” అన్నాడు ఉత్సాహంగా.

“ఊహూఁ ” అందమ్మ నిరాసక్తత చూపుతూ.

“ఇంతింత పెద్ద పుస్తకాలు….” రెండు అరచేతుల నడుమ గొప్ప ఖాళీని చూపుతూ అన్నాడు.

“ఎలా? నువ్వు సరిగ్గా బడికెళ్ళవుగా?” ‘చంటి ఉత్సాహం నీరుగారి పోయింది. ఖిన్నుడై వెళ్ళిపోతున్న కొడుకుని చూసి నవ్వుకొంది. అమ్మ.

చంటి పెరట్లోని కొచ్చాడు. బాగా ఎండ కాసింది. అడుకోవాలనిపించలేదు. ఇంట్లో కొచ్చేశాడు. మళ్ళీ వెళ్ళి నాన్నగారి కుర్చీలో కూర్చున్నాడు.

హరిగాడేం చేస్తున్నాడో? నిన్న హరిగాడితో తనెంత ఆడుకున్నాడో?

హరి గుర్తుకొచ్చేసరికి చంటికి స్కూలు గుర్తుకొచ్చింది. స్కూలుతోపాటు టీచర్ గుర్తుకొచ్చింది.

టీచరంటే చంటికి భలే ఇష్టం. ఎన్నెన్నో కథలు చెబుతుంది–కొట్టనే కొట్టదు. .

నల్లటి టీచర్ మొహాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు చంటి. ఆవిడ మొహానికి మందంగా పూసుకొనే పౌడరూ, నుదుట ఎర్రటి తిలకం బొట్టు, కళ్ళకు పెద్ద పెద్ద కళదాలు, వొదులుగా వేసుకొనే జడ. చేతిలో బెత్తం. ఇంకా బల్లమీది డస్టరూ, చాక్ పీసులూ బ్లాక్ బోర్డూ అన్నీ గుర్తుకొచ్చాయి. టీచరెవ్వర్నీ కొట్టదు. బెత్తం మాత్రం చేతిలో ఊతంగా ఊగుతూనే ఉండాలి.

చంటికి తన డెస్కు గుర్తుకొచ్చింది. ఖాళీగా వుండి వుంటుంది. చెప్పలేనంతగా దిగులేసింది.

లేచి ఇంట్లోంచి బయటి కెళ్ళాడు. బయట దూరంగా రోడ్డు పక్కన ఓ చెట్టు మొదట్లో కొంతమంది చింపిరిషిల్లలు గోళీలాడుతున్నారు. వెళ్ళి కుతూహలంగా చూస్తూ నిలబడ్డాడు. చంటికి గోళీలాడ్డం రాదు. వాళ్లలో ఒకడు ఎడంచేత్తో గోళీలు విసిరి కుడిచేత్తో కొట్టడానికి ఒక కన్నుమూసి, తెరిచిన రెండో కంటి చివరకు మునివేళ్లతో గోళీని పట్టుకొని గురిచూస్తూ చేతిని ముందుకీ వెనక్కీ ఆడిస్తూ వుంటే భలేతమాషాగా అనిపించింది. చంటి చూస్తూండగానే వాళ్ళలో వాళ్ళకి కొట్లాట మొదలయ్యింది. రెండో వాడు మొదటివాణ్ణి తిడుతూ ఎడంచేత్తో వెనక్కి తోశాడు.

మొదటివాడు ముందుకు లంఘించి రెండోవాడ్ని చంకలో ఇరికించుకొంటే వాడు మొదటివాణ్ణి మోచేత్తో పొత్తికడుపులోకి గుచ్చాడు.

చంటికి భయమేసి ఇంట్లోకి దూరిపోయి పెరట్లో కెళ్ళాడు. మూడు రాళ్ళనేరి తనూ గోళీలాట మొదలెట్టాడు. ఎండలో చురుకుపాలు చాలా పెరిగింది. ఒంటరిగా ఆడినంతసేపాడి రాళ్ళు పారేసి ఇంట్లోకొచ్చాడు.

అమ్మ బియ్యం చెరుగుతోంది. దగ్గరకెళ్లి, “అమ్మా తాయిలం చెయ్యవూ” అనడిగాడు.

“రోజూ తాయిలమెక్కణ్ణించి తెచ్చేదిరా నిన్న తిన్డేదూ?”

“ఊఁహూ. చెయ్యి”

“ఊఁహూఁ నిన్నంటే అక్క కూడా వుండిందికదా?”

“అక్క మళ్ళా తింటుందిలే”

“ఊఁ, బావుంది నువ్వు స్కూలు కెళ్ళనపుడల్లా తాయిలాలు చేసి పెట్టాలా?

అది వారం పూటంటే అందరూ వుంటారు, అందరూ తింటారు. మళ్ళీ ఆదివారం చేస్తాలే.”

ఉక్రోషంగా చంటి అక్కణుంచి వెళ్ళి పోయాడు.

ఇప్పుడు పూర్తిగా ఒంటరితనం కనిపిస్తోంది. ఆడుకోవడానికెవరూ లేరు. వెళ్ళి కేరంబోర్డు ముందేసుకొని ఒక్కడే ఆడ్డం మొదలెట్టాడు. ఇట్నుంచటు కొట్టి స్ట్రైకర్ ని కొట్టి అవతలి కెళ్ళి తెచ్చుకోవాలంటే చిరాకేసింది. బోర్డు నెత్త కుండా ఎక్కడి కాయిన్లక్కడే పడేసి లేచిపోయాడు.

బయటికొచ్చి చూశాడు. గోళీలాడుకునే పిల్లల్లేరు.

మళ్ళీ ఇంట్లోనికొచ్చి అమ్మ దగ్గరికెళ్ళి, “అమ్మా కథ చెప్పు” అన్నాడు.

“పన్లు చేసుకొంటుంటే కథలు కావాల్సొచ్చాయా? పనుంది పో”..

అక్కడే కూచుని అమ్మ బియ్యం క చెరగడం చూస్తూ మెల్లగా జరిగి ఒళ్ళో తలదాచుకోబోయాడు. తోసేసింది.

అప్పుడొచ్చిందేడుపు. లేచి నిలబడి కాళ్ళు నేలకేసి కొట్టి ఏడుస్తూ వెళ్ళి చాపమీద పడుకున్నాడు. మళ్ళీ అమ్మొచ్చి పిలిచే వరకూ అక్కడే వున్నాడు.

“అన్నం వండాను తినవా?” ,

“నేను తినను ఫో”

“మా చంటి కదూ? రామ్మా.”

“ఊహూఁ .”

“మా అమ్మకదూ రామ్మా.” గడ్డాన్ని చేరిన అమ్మ చేతిని తోసేశాడు.

“రావా?’“తాయిలం ‘వద్దా?”

చటుక్కున లేచి కూచున్నాడు. “తాయిలమా?”

“తిందూగాన్రా ”.

“ఊహూఁ ” బెట్టు చేశాడు

“నాకేం. ఇక్కడే పడుకో” అని అమ్మ వెళ్ళిపోతుంటే ఇంకా బతిమాలనందు క్కోపఁవొచ్చిందిగాని తాయిలం కోసం, ఝామ్మని లేచి వెంట పరిగెత్తాడు.

చంటి భోంచేశాక ఆఫీసునుంచి ప్యూనొచ్చాడు. నాన్నగారికి. అక్కకూ అతను , కేరియర్స్ పట్టుకెళ్లాడు.

“సిన్నయ్యగోరు స్కూలు కెల్లేదులా వుంది.”

“వెళ్ళడు ఫో నీకేం”! తన్నాలన్నంత కోపఁవొచ్చింది చంటికి.

“హబ్బో హబ్బో సిన్నయ్యగారి కెంత కోపం!” ఉడికించాడు.

రోషంగా వెళ్ళి చాపమీద పడుకున్నాడు. చంటికి మళ్ళీ స్కూలు గుర్తుకొచ్చింది. గుంపులు గుంపులుగా పిల్లలు, తెలుగు వాచకం పట్టుకొన్న టీచరు చాలా ప్రియంగా కనిపించారు. స్కూలుమీద అనుకోని ప్రేమ ముంచుకొచ్చేసింది.

అలాగే పడుకొని నిద్రపోయాడు చంటి.

సాయంత్రం నాలుగున్నరకు నిద్రలేచి కాస్సేపు అటూఇటూ తిరిగి వీధిగుమ్మం దగ్గరికెళ్ళి నిలబడితే హరిగాడు స్కూలు నుంచి ఇంటికొస్తూ కనిపించాడు

“ఒరే కిరణ్, నువ్వు రాలేదురా, టీచర్ భలే కథ చెప్పింది.”

ఉత్సాహంగా ముందుకు వంగి, “ఏం కథరా” అడిగాడు చంటి.

“జింకా నక్కా కథ.”

“ఒరే ఒరే నాకు చెప్పరా.”

“తర్వాత చెప్తారా, టీచర్ నువ్వు రాలేదేమంది. నువ్వు చెడిపోతున్నా వన్జెప్పింది.”

చంటి గుండె దిగజారిపోయింది.

“ఒరే, ఈ రోజు కేశవం మాస్టారు మాఅందరిచేతా కబడీ ఆడించారు వాళ్ళ క్లాసువాళ్ళకీ, మనకూ”

“ఎవరు గెలిచారా?”

“మనమే.”

చంటిగుండె గర్వంతో నిండిపోయింది. హరి వెళ్ళిపోయాక చంటి దిగాలుగా ఇంట్లో కెళ్ళాడు.

సాయంత్రం నాన్నా అక్క వచ్చేశాక బాగా ఆడుకున్నాడు. ఊరికే నాన్న దగ్గర్నుంచక్క దగ్గరికీ, అక్క దగ్గర్నుంచి నాన్న దగ్గరకీ తిరిగాడు.

ఆ రోజు రాత్రి పడుకోబోయేముందు “అమ్మా, జింకా నక్కా కథేంటే?” అనడిగాడు చంటి.

“ఏ జింకా నక్కా?”

“ నాకేం తెలుసు. మా టీచర్’ చెప్పిందట. హరిగాడన్నాడు.”

“అదా” అని అమ్మ చెప్పడం మొదలెట్టింది. “అనగనగా ఓ అడవిలో ఓ జింక వుండేదట. ఓ నక్క దాన్ని చూసి, ఎలాగైనా తినేద్దామని దాంతో స్నేహం చేసిందట….

చంటి ఒళ్ళంతా చెవులు చేసుకొని కథ విన్నాడు.

కథ విపరీతంగా నచ్చేసింది. బాగా పొద్దుపోయాక అమ్మ గుండెల్లో వెచ్చగా మొహం దాచేసుకొని ఏవో ఆలోచనల్లో పడిపోయినవాడల్లా ఉన్నట్టుండి తల పైకెత్తి “అమ్మా-రేపు తొందరగా నిద్రలేపాలి” అన్నాడు.

కళ్ళు మూసుకు పడుకున్న అమ్మ కళ్ళు తెరచి చూసి “దేనికి అనడిగింది.

“స్కూలు కెళ్ళడానికి” అనేసి మళ్ళీ గుండెల్లో దాగిపోయాడు చంటి. .

‘Harshaneeyam’ Powered by HIndenburg

“‘అహింస’ దాదా హయత్ గారి కథ!” కి 8 స్పందనలు

  1. అహింస చాలా చక్కని కథ. మన చిన్నతనం ని బాగా గుర్తు తెస్తుంది. చంటి కారెక్టర్ చాలా relatable. దాదా గారికి ఒక మంచి కథని అందించి నందుకు చాల Thanks.

Leave a Reply