Apple PodcastsSpotifyGoogle Podcasts

‘ద్రణేవుడు’ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ

హర్షణీయంలో మీరు వినబోతున్న కథ పేరు ‘ద్రణేవుడు ‘ . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ‘ పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ‘ అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన వేలూరి కౌండిన్య గారికి కృతజ్ఞతలు.

ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన సుబ్బరామయ్య గారు , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా.

1938 సంవత్సరంలో గుంటూరు లో జన్మించిన ఆయన తన జీవిత కాలంలో 350కి పైగా కథలు , 8 నవలలు రాసారు. ఆయన రచనలు ఎన్నో ఇంగ్లీష్ , రష్యన్ తదితర భాషల్లోకి అనువదించబడ్డాయి. ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డు తో బాటు ఆయన రచనలు ఎన్నో పురస్కారాలు అందుకున్నాయి.

ఈ పుస్తకం కొనడానికి , లింక్ పై క్లిక్ చెయ్యండి – http://bit.ly/3qJcYCz

ద్రణేవుడు:

సమాచార విస్పోటం అనీ, పోటీ అనీ అనేక నామధేయాలతో ఆధునిక యుగం,  విషయ పరిజ్ఞానం ప్రధాన లక్షణంగా శోభిల్లుతున్నది. ఎవడికి ఎక్కువ వివరాలు తెలుసునో జ్ఞాని కింద లెక్క. రకరకాల టెస్టులు, క్విజ్జులూ,, కెబిసిలు ఇవన్నీ యువతరం సమాచార సేకరణ సామర్ధ్యాన్ని గురించే. నాలుగు పేపర్లు తిరగేసినవాడు సాయంకాలం నలుగురి ముందు నాలుగు విషయాలు ఉగ్గడిస్తే వాణ్ణి జ్ఞాని అనేస్తారు. 

మనసును అత్యవసర పరిజ్ఞానంతో కాక, అత్యవసర విషయ పరిజ్ఞానంతో కూడా నింపడం, అట్లా కొందరి కంటే కొన్ని ఎక్కువ విషయాలు తెలిసి జ్ఞాపకముంచుకున్న వాణ్ణి బిరుదులతో గౌరవించడం జరుగుతున్నది. వాడెవడో అంత బతుకూ బతికి ఇంగువంటే ఏమిటో తెలుసుకోకుండా, తెలుసుకునే అవకాశం లేకుండగానే దాటిపోయాడు.

ఇక ఈ మనిషి మరో విచిత్రం . రైల్లో తారసపడ్డాడు.

 “నిన్నేనయ్యా అడుగుతున్నది?” అన్నాడాయన రెండోసారి పెద్దగా.

అంతకుముందు వేరొక రైలు దడదడ మని శబ్దం చేస్తూ వెళ్తుంటే ఈయన అన్నదేమీ నాకు వినిపించలేదు.

ఇప్పుడు “ఏమిటి?” అని అడిగాను.

ఆయనకు అరవై ఏళ్లు దాటే వుంటాయి. జుట్టు బాగా తెల్లబడి చెంపలు పెరిగి వున్నాయి.

“చూడు! నువ్వు చాలా చదివి వుంటావు కదా. ద్రణేవుడు అనే పేరు, పాత్ర ఎక్కడైనా తగిలిందా? పురాణాల్లో కాని కథల్లో కాని… ఎక్కడైనా….”

నేను లేదంటూ తల అడ్డంగా వూపాను.

 “అలాగా?” అన్నాడాయన నిరాశగా.

తర్వాత తన ఎదురుగా కిటికీ పక్కన కూర్చుని ఏదో చదువుకుంటున్న నడివయస్సు వ్యక్తిని కూడా ఇదే ప్రశ్న అడిగి అతడు లేదనగానే హతాశుడై నిట్టూర్చి నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు.

రైలెక్కినప్పుటినుంచి చూస్తున్నాను…. ఈ మనిషి వాలకం చిత్రంగా వుంది. ఒక పొడుగాటి లావాటి పుస్తకం వొళ్లో పెట్టుకుని వుండి వుండి అందులో ఏదో రాస్తున్నాడు. రైలు ఆగిన ప్రతి స్టేషను పేరు ఇంగ్లీషు తెలుగు రెండు భాషల్లోనూ వరసగా రాసి పెట్టుకుంటున్నాడు. 

కాసేపాగి మళ్లీ  –

“అంతా బాగానే వుంది. ఈ ద్రణేవుడెవరో ఎక్కడివాడో వివరాలేమాత్రం తెలిసి చావడం లేదు. ఎందరినో అడిగాను. ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. వివరం ఎప్పటికైనా తెలుస్తుందో లేదో….” అన్నాడు.

“ఎప్పుడో ఒకప్పుడు తెలియకపోదులెండి. ఎవరో ఒకరు చెప్పకపోరు” అన్నాను ఏమీ తోచనివాడిలా.

“పదేళ్ల నుంచి తెలియని విషయం ఎప్పుడు తెలుస్తుందో… అసలు తెలియనే తెలియదో”అంటూ నిట్టూర్చాడు.

నేను చాలా సేపటి నుంచి మధనపడుతున్నాను. ‘ఈ మనిషి ఎవరా?” అని. 

 మనసు లోపలి పొరలలో ఎక్కడో ఒక మూల ఈ వ్యక్తి వివరాలు భద్రంగానే వున్నాయి. అయితే స్పష్టంగా ఉపరితలానికి రావడంలేదు. –

“ఇలా రైల్వేస్టేషన్ల పేర్లూ ఇంకా ఏవేవో విషయాలు రాస్తున్నారు కదా ఈ పుస్తకంలో…. ఎందుకీ వివరాలన్నీ?” అని అడిగాను. –

ఆయన కళ్లలో మెరుపు. “ఎందుకేమిటి? ఇదంతా నాలెడ్జి… ఇన్ఫర్మేషన్… ముందు తరాలవారికి అందించాల్సిన బాధ్యత మనదే కదా. మన తాత ముత్తాతలు ‘తమకెందుకులెమ్మ’ని ఊరుకుని వుంటే మనకివ్వాళ ఇంత ఇన్ఫర్మేషన్ దొరికేదా? ఇన్ని విషయాలు తెలిసేవా? సమాచారం, విషయపరిజ్ఞానం వుంటేనే మనిషి మనిషవుతాడు. లేకపోతే మా ఫ్రెండులాగా అతి చిన్న విషయం కూడా తెలియకుండా చచ్చిపోతాడు. పదేళ్ల కిందట మావాడొకడు ఇంగువ అంటే ఏమిటో తెలియకుండానే చచ్చిపోయాడు. అప్పటినుంచి నేను ఇట్లా విసుగనేది లేకుండా విషయ సేకరణ చేస్తున్నాను. అదీ యిదీ అని ఏమీ లేదు. చూసినదీ విన్నదీ అంతా. రికార్డు చేసి పెట్టడమే”

ఇప్పుడు నా మనసులో మెరుపు మెరిసినట్టయింది. చాలా ఏళ్ల క్రిందట సంగతి… మాఇంటి పక్కన నడివయసు దాటిన ఒక వ్యక్తి గుండెజబ్బుతో బాధపడి రెండు మూడు రోజులు అపస్మారక స్థితిలో వుండి చివరకు పోయాడు. అప్పుడీయన అక్కడికి వచ్చాడు.

మనిషి పోగానే హతాశుడై వెనువెంటనే తిరిగి వెళ్లిపోయాడు. ఇప్పుడు సరిగ్గా చూస్తుంటే పోలికలు బయటపడటం మొదలై ఆ వ్యక్తి ఇతడే అని నిర్ధారించుకున్నాను. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత రైల్లో తారసపడ్డాడు. చేతిలో పొడవాటి పుస్తకంతో..

ఆయన మళ్లీ నా వైపు తిరిగి ‘ఈ ద్రణేవుడనేవాడు ఎవడో నాకు తెలియదు. ఎప్పుటివాడో ఎక్కడివాడో తెలియదు. ఎందరినో అడిగాను. ఎవరూ చెప్పలేకపోయారు” అన్నాడు దిగులుగా.

“అసలా పేరు గలవాడు ఎవరూ లేరేమో” అన్నాను నేను. 

“కాదు… వుండే ఉంటాడు. మనకి తెలియనంతమాత్రంలో లేడని నిర్ణయిస్తే ఎలా?

తెలుసుకోవాలి. దానికి వేరే మంత్రం ఏమీలేదు.  కనపడిన వారినల్లా అడుగుతూపోవడమే”.

ఈ ధోరణి  ఇంకా కొనసాగేదేమో గాని దిగవలసిన స్టేషను సమీపించడం వల్ల నేను హడావిడిగా లేచి పైనున్న సంచి అందుకుని,  దిగేందుకు ఉద్యుక్తుణ్ణయినాను. అంతలో ఆయన కూడా లేచి పెన్ను ముడిచి జేబులో వుంచుకుని,  పుస్తకం మూసి, చంకలో పెటుకుని రైలు దిగేందుకు సన్నద్ధుడయ్యాడు.

. ఆశ్చర్యమేమంటే ఆయన స్టేషను బయట కూడా నా వెంటనే నడిచాడు. దగ్గర యిల్లు కావడం వల్ల నేను నడక సాగిస్తే తనూ నా వెంటనే  కాకపోతే పక్కనే నడిచాడు. నడుస్తున్నంత సేపూ మాట్లాడుతూనే ఉన్నాడు.

తర్వాత మా వీధిలోనే ముందుగా ఒక యింటిముందు ఆగి “ఇదే మా యిల్లు. మా అబ్బాయి యిల్లు. నేను ఇప్పుడే వొస్తున్నానిక్కడికి. మా వూరు వదిలి వొచ్చేస్తున్నాను. ఇక్కడే వుంటానిక. నా సామాన్లు – అంటే ఎక్కువ భాగం నా పుస్తకాలు – నిన్ననే వచ్చాయి ఇక్కడికి” అన్నాడు.

‘వివేకానంద మీ అబ్బాయా? మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాము. మా యిల్లు వీధి చివర” అన్నాను. నేనూ.

“మంచిది. అప్పుడప్పుడు వొస్తూవుండు” అంటూ ఆయన గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు.

ఆఫీసులో మరునాడు వివేకానంద పలుకరించాడు. మాటల సందర్భంలో నా రెలు ప్రయాణం,,  అతని తండ్రి పరిచయం ప్రసక్తి తెచ్చాను. 

కొన్ని క్షణాలు ఆగి “మా ఊళోనే వుండేవారు ఇంతకుముందు. అక్కడే వుంటానని మొండికేసి ఇన్నాళ్లు గడిపాడు. అక్కడే మట్టి అయిపోతానని గోల చేసేవాడు. ఇన్నాళ్లు సరే అన్నాము. కాని ఇప్పుడిక అక్కడి పొలంతో పాటు ఇల్లూ, వాకిలీ అన్నీ అమ్మేయవలసి వచ్చింది. ఇప్పుడైనా అయిష్టంగానే కదిలి వచ్చాడు” అని చెప్పాడు.

ఆనాడు వివేకానంద ఇంటిమీదుగా వస్తుండగా వరండాలో నిలబడి వుండి ఆయన పిలిచారు. ఆ

పిలుపులో ఎంతో ఆప్యాయత, ఆర్థత. లోపలికి వెళ్లాను. నన్ను తనవెంట లోపలి గదిలోకి తీసుకెళ్లాడు. గది అంతా మసక వెలుతురు. లోపలి కిటికీ పక్కన ఓ చిన్న బల్ల, స్టూలు వున్నాయంతే. గోడవారగా ఒక పక్క మంచం… ఇక మిగిలిన గది అంతా కిందా పైనా అంతటా కాగితాలు, పుస్తకాల కట్టలు. పెద్ద కవిలె కట్టల్లాంటి పుస్తకాలు. బొత్తులు బొత్తులుగా కట్టలు కట్టలుగా ఎక్కడబడితే అక్కడ కాగితాలు. 

అంతటా ఆ వాసన.

“ఇదంతా… నా శ్రమ ఫలితం” అన్నాడాయన.

“పాతికేళ్లు నుంచి నేను నిరంతరం సేకరించిన అమూల్య సమాచార భాండాగారం. ఇక్కడ నీకేం కావలిస్తే అది దొరుకుతుంది. బిట్రగుంట స్టేషనుకు అటూ ఇటూ వున్న స్టేషన్లు ఏవి అని నీకు అనుమానం వచ్చిందనుకో… అదుగో, ఆ మూల ఉన్న కాగితాల కట్టలో వెదికితే దొరుకుతుంది. జీలకర్ర ఏ రకమైన పదార్ధమో తెలుసుకోవాలనుకో… లేకపోతే కలరావుండలు ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలనుకో!  ఇదుగో ఈ పక్క ఎక్కడో ఒక పుస్తకంలో ఆ వివరం దొరుకుతుంది. ఎవరికైనా తుత్తునాగం అంటే ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తే కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే కాస్త శ్రమపడి వెదుక్కోవాలి. అంతే…” ఇలా సాగింది. ఆయన ధోరణి. 

నేను బొమ్మలాగా కూర్చుండిపోయాను.

అంతలో వివేకానంద నా అదృష్టం కొద్దీ వచ్చాడు లోపలికి. 

వచ్చీ రావడంతోనే “మా ఆవిడ చెప్పింది మీరు వచ్చారనీ, మా నాన్న మిమ్మల్ని లోపలికి తీసుకొచార నీనూ…లేవండి… పదండి ముందు గదిలోకి వెళ్లాం…” అంటూ ‘నాన్నా! ఏవిటీ పద్ధతి? ఇంటికొచ్చిన వాళ్లందర్నీ మీ చాదస్తంతో విసిగించి బాధపెడితే ఎలా?” అని విసుక్కుంటూ  నన్ను ముందు గదిలోకి తీసుకువెళ్లి రక్షించాడు.

“ఇదీ ఆయన వరుస, ఏళ్ల తరబడి అనవసరమైన చెత్త పోగు చేశాడు. ఇప్పుడిక ఈ రబ్బిష్ అంతా ఎక్కించడానికి కంప్యూటర్ కావాలంటున్నాడు” అన్నాడు వివేకానంద. 

కాఫీ తెస్తానని లోపలికి వెళ్లాడు. ఆయన వదలలేదు. మళ్లీ ముందు గదిలోకి వచ్చి నాతో “అన్నట్టు ఈ ద్రణేవుడితోనే వొచ్చిందయ్యా చిక్కంతా….వాడెవడో తేలడం లేదయ్యా. నువ్వు కూడా నీకు తెలిసిన వాళ్లని వాకబు చేసి చూడు” అన్నాడు.

నేను తల ఊపాను. కాని ప్రశ్న మహా భూతంవలె నా మనసులోకి దూరడం గమనించలేదు. 

మరునాడు ఆఫీసు క్యాంటీనులో కాఫీ తాగుతూ వుంటే మా స్టాఫ్ లో పెద్ద – రామేశంగారు వొచ్చి నా ఎదురుగా కూర్చుని ‘. ఏమయ్యా బాగున్నావా” అని పలకరించాడు.

“బాగున్నా” అంటూనే వున్నట్టుండి “గురూజీ! ద్రణేవుడనే వాడెక్కడైనా తగిలాడా మీకు? పురాణాల్లో కాని, భారత భగవతాల్లో కాని ఎక్కడైనా సరే” అని అడిగాను.

“ఎవరూ?” అని రెట్టించాడాయన. “ద్రణేవుడు”

“అలాంటి పేరు ఎక్కడా తగల్లేదే. అయినా మనకు తెలిసిందెంత? మనం చదివిందెంత? ఎక్కడైనా అటువంటి వాడున్నాడేమో కనుక్కుందాం”అన్నాడాయన.

ఆ సాయంకాలం ఇంటికి తిరిగొస్తూ చూశాను. మా ఇంటి ప్రహరి పక్కన రాళ్ల మీద కూర్చుని మా బావమరిదీ మరో నలుగురు భావి భారత పౌరులు కూర్చుని వుండి తమలో తాము ఏదో తర్జనభర్జనలు పడతున్నారు. కొన్ని క్షణాలు ఆగి విన్నాను. అంతా ఆ క్రిందిటి దినం విడుదలై అమోఘంగా అత్యంత విజయవంతంగా జైత్రయాత్ర సాగిస్తూ వసూళ్లలో స్టేట్ రికార్డులు కంట్రీ రికార్డులు బద్దలు కొడుతున్న, వారి అభిమాన హీరో నటించిన ‘అబ్బా వుండండి మీరు మరినూ’ అనే సినిమా గురించిన వివరాలు. కలెక్షన్లు  వగైరాలు.

నేను ఊరుకోక “ఏమిట్రా అబ్బాయిలు మీరు చదువులు మానేసి ఆటలూ మానేసి మాటాడుకునే విషయాలు ఇవేనా? ఇట్లాంటి పనికిమాలిన వ్యర్థ విషయాలు తప్పు మీకేమీలేవా  మాట్లాడుకునేందుకు?” అన్నాను చొరవగా..

వాళు ఎటు వాళ్లు అటు చెదిరిపోయినట్టు పోయి నేను లోపలికి వెళ్లగానే మరో మూల మీటింగ్ పెట్టారు.

నేను లోపలికి వచ్చి కూర్చుని ఆలోచనలో పడ్డాను. నేను మాత్రం ఈ కొద్దీ రోజులుగా చేస్తున్నదేమిటి? వివేకానంద తండ్రి రైల్లో పరిచయమైనప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను ? ఆయన ఆ ద్రణేవుడనే వాడొక్కణ్ణి నా నెత్తిన కూర్చోబెడితే నేను వెర్రివాడిలాగా నాకు కనిపించిన వాళ్లందరిని అడుగుతూ చేస్తున్నదేమిటి? 

ఆయన చెప్పిన విషయ సేకరణ,  సమాచార సేకరణ అనేది ఒక పెద్ద వెర్రి. ఆయన ఆ పనికిమాలిన విషయాన్ని బురలో కెక్కించి నా మనసు పాడుచేసి నన్నింతకాలంగా వ్యరుణ్ణి చేశాడు. ఇకనైనా జాగ్రత్తపడాలి అనుకున్నాను.

కాని ఒక పనికిమాలిన వెర్రి విషయం మనసులో పడకూడదే గాని అది మనలను తేలిగ్గా వొదులుతుందా?

సాయంత్రం కుమారస్వామి కనిపించి “మొన్న ఎప్పుడో ద్రణేవుడనే వాణ్ణి గురించి వాకబుచేశావుకదా” అన్నాడు.

“అవును. ఏమైనా తెలిసిందా” అని అడిగాను ఆత్రంగా.

అతడు అనవసరంగా నవ్వుతూ “లేదు తెలియలేదు. నేను ఒకరిద్దర్ని అడిగి చూశాను కూడా. అందరూ తెలియదనే అన్నారు” అని ఇంకా అనవసరంగా నవ్వుతూనే వెళ్లిపోయాడు.

నేను తెలివితక్కువవాడిలా నుదురు రుద్దుకుంటూ నిలబడిపోయాను.

మరుసటి రోజు మధ్యాహ్నం మూడుగంటల వేళ ఆఫీసులో ఫోను మోగింది. 

ప్యూను “వివేకానందగారూ! మీకు ఫోను” అన్నాడు.

వివేకానంద లేచి వెళ్లి ఫోన్లో మాట్లాడుతూ వుండగా చూశాను. బాగా కంగారు పడుతున్నాడు. బహశా ఏదో ఇబ్బంది కలిగించే విషయమే అయివుండాలనుకున్నాను. అతడు ఫోను పెట్టేసి వస్తూ వుంటే “ఏమిటి?” అని అడిగాను. 

అతడు నుదురు తుడుచుకుంటూ “మా నాన్న పడిపోయాట్ట. వెళ్తున్నాను రామేశంగారికి చెప్పు” అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు. 

ఆఫీసు పని ముగించుకుని ఆదరాబాదరా బయలుదేరి వివేకానంద ఇంటి ముందుకు వచ్చాను. వరండాలో కొంత అలజడి. కొందరు ఆడవాళ్లు కూర్చుని వున్నారు. వివేకానంద లోపల ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. 

ముసలాయన మనలో లేడు. కళ్లు అరమోడ్పులుగా వున్నాయి. నేను వెళ్లి ఆయన మంచం పక్కనే నిలబడ్డాను.

అంతలో ఆయన కళ్లు తెరిచాడు. నన్ను చూడగానే విచిత్రంగా నవ్వాడు. ఆ తర్వాత నన్ను దగ్గరకి రమ్మని కళ్లతో సైగ చేశాడు. నేను ముందుకు వంగి చెవి అప్పజెప్పాను. ఆయన లోగొంతుకతో మాట్లాడాడు.

“ద్రణేవుడు… వాణ్ణి గురించి సంవత్సరాల తరబడి గొడవ పెట్టానా? ఏమో మరి… వాడొకడున్నాడని నాకనిపించడం లేదయ్యా. బహుశా వుండి వుండడు. అంతా నా భ్రమ అనిపిస్తున్నదిప్పుడు. అవును… అంతే”

ఆయన అలా మాట్లాడుతూ వుండగానే కంఠస్వరం క్రమంగా మందగించింది.

ఆయన కళ్లు మూతలుపడ్డాయి.

***************************************************************

‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

హర్షణీయం కు సబ్ స్క్రైబ్ చెయ్యడానికి -harshaneeyam@gmail.com కు మెయిల్ లేదా ‘77807 43545 ‘ అనే నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించండి

Leave a Reply