Apple PodcastsSpotifyGoogle Podcasts

‘జాన్ పాల్ చేసిన బీరువా కథ’

మనం చాలా ప్రేమించే మనుషులు మనకు దూరం అయితే,, మన అస్తిత్వానికి అర్థం లేకుండా పోయినట్టు అన్పిస్తుంది. చుట్టూ వున్న ప్రపంచం అర్థరహితంగా అనిపిస్తుంది. సుప్రసిద్ధ రచయిత్రి వసుంధరాదేవి రాసిన ఈ’జాన్ పాల్ చేసిన బీరువా కథ’, తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది.

కథకు ముందు మాటనందించిన శ్రీ మధురాంతకం నరేంద్ర గారికి కృతజ్ఞతలు

ఈ కథను అరసం వారు ప్రచురించిన ‘ఆర్.వసుంధరాదేవి కథలు’ అనే పుస్తకంలో చదవొచ్చు.

ఈ పుస్తకం కొనాలంటే – https://www.anandbooks.com/R-Vasundhara-Devi

**********************************************************************************************

“టేపులో నీ పాట తీసేసి కొత్త పాట, జానీ మేరా నామ్ లోది. మంచిది పెట్టేశాడు. అన్న…” పాప చెప్పింది.

గబగబా ముందు హాల్లోకి వెళ్ళాను. రేడియోలో వస్తున్న పాటని చాలా శ్రద్దగా టేప్ రికార్డర్‌లో రికార్డు చేసుకుంటున్నాడు బాబు.

“ఎందుకని నా పాట తీసేశావ్?” అనడిగాను. 

“ఇష్” అన్నాడు నావేపు చూడకుండానే.

రికార్డింగ్ అయ్యాక “మంచిపాట నాశనం చేసేశావమ్మా, రికార్డు చేసుకుంటున్నప్పుడు మాట్లాడేశావ్” అన్నాడు.

నాపాట పోగొట్టి ఇంకా పైగాను! 

“అది పాతపాట. ఎవరిగ్గావాలి?” అన్నాడు.

“నాకు కావాలి. అందుకేగదా రికార్డు చేసుకున్నాను. అది తియ్యొద్దని చెప్పానుకదా!” అన్నాను.

“అమ్మా అది రికార్డు చేసి సంవత్సరం అయింది. ఒక్కనాడు కూడా నీయంతట నీవు దాన్ని పెట్టుకొని వినలేదు. అది టేపులోవుంటే నీకేం, లేకుంటే నీకేం?… మంచిపాట వస్తున్నది. తొందరలో దాని మీద పెట్టేశాను” అన్నాడు.

 అంతటితో ఆ సంభాషణ అయిపోయిందని తాను కొత్తగా పెట్టుకున్న పాటలు వింటూ కూర్చున్నాడు.

ఆ పాట పోయింది. ఇహరాదు. వాదించి లాభమేమిటి?

నా పాట పోయినందుకు నాలో నిరాశ, ఎదో విలువైనది పోగొట్టుకున్నానన్న బాధ. ఆ పాట ఉన్నా నేను పెట్టుకోను. ఎప్పుడైనా ఎవరైనా వరుసలో పెడితే వినడమే. అది ఎవరికీ అక్కర్లేని పాతపాట. నాకు కావలసిన పాట. కావలసినదైనా నేను పెట్టుకోని పాట. అది ఆ టేపులోవుంటే నాకేదో తృప్తి. ఇప్పుడు అది పోయినందుకు బాధ.

ఎందుకో ఆ పాట నాకు కావాలి. నాకు ఇష్టమైందని కాదు. కాని నాకు కావలిసింది. ఎందుకో అర్థం కాకపోయినా నాకు చాలా ముఖ్యమైనది.

‘ఆడేపాడే పసివాడ…. అది ఏ సినిమాలోదో, ఎవరు పాడినదో, దానిలో భావమేమిటో నాకు గుర్తులేదు. నాకు అక్కర్లేదు. ఆ పాట వింటూంటే నాలో, సంచలనం రేగుతుంది. ఉధృతంగా ఎగిరిపడుతున్న అలలతో, తుఫానునాటి సముద్రంలాగా అయిపోతుంది మనసు.

….ఎంతో ఆశించినదాన్ని పొందలేక విషాదభరితమైన జీవితం కల ఒక అమ్మాయి. ఆనందానికి ప్రతిరూపంగా కనిపించిన పసివాణ్ణి చూచి, ఎంతో ఆనందంతో పాడుతుంది. ఆ పాట. పాట అయిపోయేసరికి పిల్లవాడు దుర్మరణం పాలౌతాడు. మళ్ళీ  కటిక చీకటిలాంటి విషాదం ఆవరిస్తుంది…

ఆనందానికి విషాదానికీ గల సరిహద్దులో, రెండూ ఒకటయ్యేచోట ఆ పాట. పాట వింటూంటే ఆనందమూ, దాని వెనుకనే పొంచివున్న విషాదమూ రెండూ ఒక్కసారిగా తీవ్రమౌతాయి. ఊపిరి సలుపనివ్వకుండా పెరిగి పెరిగి… ఉక్కిరిబిక్కిరై నలిగిపోతుంది. గుండె.

ఆ పాత పాట నాకు యిష్టమని కాదు. నేను నా అంతట ఎప్పుడూ దాన్ని  పెట్టుకోను. కాని నాలోనే అందరాని లోతుల్లో ఉండే సత్యానికి ప్రతినిధిగా అది అక్కడ ఉండటం చాలా ముఖ్యం….

మనిషి మనసు చిత్రమైనది. ఆ పాట అక్కడ ఉన్నన్నాళ్ళూ నేను దాని గురించి తలచలేదు. కాని అది చెరిగిపోయేసరికి దాని గురించి యింతగా ఆలోచించుకున్నాను. అది మాటల్లేని మూగరాగమై నాలో నిలిచిపోయింది….

ఇంట్లో ఇంకో బీరువా ఉంటే నాకు ముఖ్యమైనవి పిల్లల చేతుల్లో పడకుండా భద్రంగా దాచుకోవచ్చును. 

కావలసినవి జారిపోకుండా, మాసిపోకుండా, చెరిగిపోకుండా, పోకుండా దాచుకోగలను.

ఈ యింట్లో నాకు ఓ బీరువా చాలా అవసరం!

*********************

‘జాన్‌పాల్ బలే టక్కరివాడమ్మా”

మా యింట్లో పనులు చేసి వెళ్తుండే పనివాళ్లు ముగ్గురూ ఒక్కరకంగానే చెప్పారు, జాన్ గురించి. ఆ విషయం నాకూ కొంచెం అనుభవమే. కాని ‘తెలియని దేవతకన్నా తెలిసిన దయ్యం మేలు’ అన్న సామెత ననుసరించి నడుస్తుంది నా బుద్ధి.

బీరువాను రెడీమేడ్ గా కొనాలంటే పాతిక మైళ్ళవతల ఉన్న పట్నం వెళ్లి కావలసిన సైజులో ఆర్డరిచ్చి రావాలి. షాపువాళ్లు యిప్పుడిస్తాం, అప్పుడిస్తాం అంటుంటే అక్కడకు నాలుగుసార్లు వెళ్ళాలి. తర్వాత జాగ్రత్తగా పాక్ చేయించి దెబ్బ తగలకుండా బస్సుమీదనో లారీ మీదనో తీసుకురావాలి. ఇంతా చేశాక వాళ్లు రెండోరకం కొయ్యవేసిన చక్కగా పాలిష్ చేసి, ఘనంగా వార్నిష్ చేసి మసిపూసి చేసిన మారేడుకాయలాంటిది అంటగడితే ఎలాగా? చెక్క క్వాలిటీ మనం సరిగా కనుక్కోగలమా?

అద్దంలా మెరిసే అందమైన బీరువా కావాలి. కాని దానికోసం ఎక్కువ యాతన పడడానికి ఓపికలేదు.

అటువంటి సమయంలో జ్ఞాపకం వచ్చాడు జాన్‌పాల్.

ఇదివరలో ఒకసారి పుస్తకాల షెల్పులు తయారు చెయ్యడానికి ఒచ్చినప్పుడు ఎన్నాళ్ళ బట్టో మా యింట్లో వుంటున్న బుక్ కేస్ను  చూసి 

“ఇది. ఇంగ్లండులో దొరికే, పియానోలు చేసే వాల్నట్ కొయ్యతో చేసింది…అమ్మో! ఇదిక్కడ దొరికేదిగాదు…అమ్మా, ఇది ఫారిన్ చెక్క!’ అన్నాడు. 

ఆ మాటలంటుంటే జాన్ మొహంలో కనిపించిన గాంభీర్యాన్ని, గౌరవభావాన్ని చూచి ఆ బుక్కేస్ గొప్పదనాన్ని ఊహించుకున్నాను. అల్లాగే ఒక పాత. బీరువాను చూడగానే ‘ఇది బర్మాటేకులో ఒకటోరకం’ అని చెబుతూ టేకుల్లో ఎన్నిరకాలో, వాటి చరిత్రలగురించి ఒక ఉపన్యాసంలాంటిది ఇచ్చాడు. కొయ్యల్లో ఇన్ని రకాలున్నాయని నాకు ఇది వరకు తెలియదు. జాన్ మీద చాలా గౌరవం కలిగింది నాకు. అద్దంలో మెరిసే అందమైన బీరువాను ఒకటోరకం టేకుతో తయారు చెయ్యగల సామర్థ్యం జాన్ కు  ఉన్నది అనుకున్నాను.

కాని ఈ జాన్ తో  ఇతరవిధాలైన చిక్కులు వస్తాయి. ఇదివరలో బుక్ రాక్లు  చేసినప్పుడు పట్నంవెళ్ళి సామాన్లు తెస్తానని కొయ్యలు మేకులూ అంటూ,  రెట్టింపుధరలు వేసిన దొంగబిల్లులు తెచ్చి డబ్బు తీసుకున్నాడు. 

అవి ఫ్లయివుడ్ షీట్లు కనుక, వాటి ధరలు వేరుగా కనుక్కోగా, మోసం బయటపడింది. జాన్ అప్పటికే డబ్బు తీసుకున్నాడు. మళ్లీ పిలిపించి అడిగాము. కొట్లవాళ్ళ మోసాలను గురించి చిన్న ఉపన్యాసం చాలా ‘ఇన్ఫర్మేటివ్’గా ఉండేది. ఒకటి ఇచ్చాడు. 

వడ్రంగిపనికి సంబంధించిన ఏ విషయం మీద మాట్లాడవలసి వచ్చినా ఇటువంటి మంచి ఉపన్యాసాలు ఇస్తాడు. అవి విన్న తర్వాత జాన్ మీదా, వడ్రంగి పనిమీదా కలిగిన గౌరవభావంతో నోరు మెదపలేము.

పల్లెటూళ్ళలో ఏ పని జరగాలన్నా ఒక భగీరథ ప్రయత్నం కావాలి. ఒక ఇల్లు కట్టించుకోవాలంటే బేలుదారీలు, వడ్రంగులు, పెయింట్లు వేసే వాళ్ళు అంటూ అన్ని రకాలైన పనివాళ్ళకీ పనులు జరుగుతున్నంతకాలమూ ఇంట్లోనే భోజనాలు పెట్టాలి. 

కరెంటు వేయించుకోవాలంటే వైరింగు చేసేవాళ్లకూ అంతే. ఏదైనా వస్తువు చేయించాలంటే వడ్రంగులకూ అంతే. ఆఖరుకు బట్టలు కుట్టే టైలర్లకు కూడా అంతే. వాళ్ళ భోజనాలకు గడిచిపోగా, పనిచేసినన్ని రోజులకు కూలిడబ్బులు చేతబట్టుకొని ఇళ్ళకు వెళ్తారు. వాళ్ళు పనిని సాగదీసి, ఇంకో వారం రోజులు గడిపే తత్వంలో వుంటారు.  .. మన పనిచేసే వాళ్ళు మనింట్లో భోజనం చెయ్యడం, తృప్తిగా పనిచెయ్యడం న్యాయమే కావచ్చును. 

కాని ఏ పని జరగాలన్నా ఇంత ప్రయత్నం కావలిసి రావడం పట్నాలనుండి వచ్చినవాళ్ళకు విసుగ్గా ఉంటుంది. డబ్బు పారేస్తే పని జరగటం, వస్తువు ఇంటికి రావడం అన్న పద్ధతికాదు ఇక్కడ. ఇది ఒక పాతపద్ధతి. వస్తువుకి, అది చేసే వారి మంచి చెడ్డలకీ గల అవినాభావ సంబంధాన్ని గుర్తించితీరాలి..

మా వారు ఇక్కడ కొత్తగా పెట్టిన చక్కెరమిల్లులో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరారు. అందువలన ఈ పల్లెటూరికి వొచ్చాం మేము. ఊళ్ళో మరో ముగ్గురు వడ్రంగులు ఉన్నారు. కాని అందరిలోకీ జాన్ కి  పని బాగా చేతనవునని…జాన్, ఇతరులు కూడా చెపుతూవుంటారు. మిల్లులో ఏవైనా కొయ్యపనులు జరగాల్సినప్పుడు జాన్ ని పిలుస్తారు. ఇది ఒకరకంగా జాన్ కి  సహాయం చెయ్యడమే. ఆ సంబంధంవలన ఇదివరలో ఒకసారి వచ్చి బుక్ రాక్స్  చేశాడు.

“అమ్మో, అయ్యగారింట్లో భోజనం పెట్టమని నేనడుగుతానా! వూళ్ళో  నాకు ఇల్లుంది. వంట చేసుకుంటాను… కూలి కూడా అయ్యగారి దగ్గర ఒక్క రూపాయి తక్కువే తీసుకుంటాను” అన్నాడు జాన్. 

పెద్దాచిన్నా బాగా ఎరిగినవాడు. పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉండటం నేర్చినవాడు. కొయ్యలూ వగైరాలు తేవడంలోనూ, కూలిలోనూ కూడా.  ఎక్కు వ డబ్బు తీసుకున్నాడంటే అది వేరే మాట. వాళ్ళూ బతకాలిగద…

అన్ని విషయాలూ ఆలోచించిన మీదట జాన్ కు  కబురుపెట్టాను. మిల్లులో పనులు చేస్తూనే ఉంటాడు అడపాదడపా. కనుక మనల్ని చిక్కున పెట్టడు లెమ్మనుకున్నాను.

పొట్టిగా దిట్టంగా చామననలుపులో ఉంటాడు జాన్. అరవై దగ్గరగా వయస్సయినా నలభైకి మించినట్లు కనబడడు. మొహం, ఎదురురొమ్మూ , చేతులూ, కాళ్ళూ అన్నీ వేటికవి బలంగా ధృడంగా కనిపిస్తాయి. పై వరుసలో ముందుపళ్ళు రెండు లేవుగాని మిగతా పళ్ళు రాళ్ళ మాదిరి గట్టిగా ఉన్నాయి. ఎత్తయిన నుదుటి క్రింద లోతుల్లో కనిపించే కళ్లు నల్లగా ఉండి ఎప్పుడూ చురుగ్గా చూస్తుంటాయి. రూపం, మాటతీరు

అన్ని ప్రత్యేకంగా ఉండటాన జాన్ని ఒకసారి చూస్తే ఎవరూ మరచిపోలేరు. 

జాన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే…బలశాలి. మాటలో, చేతలో, చూపులో | అన్నిట్లోనూ బలం. అదీ జాన్ అంటే!

నిజం చెప్పాలంటే జానన్ను చూస్తే కొద్దిగా భయం నాకు. దుర్బలులకు శక్తిని చూసినప్పుడు కలిగే భయం. స్థూలంగా చూస్తే దానికి వేరే కారణం లేదు మరి! 

చకచకా లెక్కలు వేశాడు జాన్. అంతా ఒక వందరూపాయలకు సామాను తెస్తే టేకు బీరువా యీ సైజుది తయారు చెయ్యొచ్చునట. పట్నంలో షాపునుంచీ ప్లైవుడ్  బీరువా యీ సైజుది నాలుగువందలకు తెచ్చారు. పక్కింటివాళ్ళు. అట్లాగని జాన్ తో నేను అనలేదు. 

‘రోజ్ వుడ్ అయితే ఎక్కువ ఖరీదవుతుందా?” అనడిగాను. 

“లేదు. రెండూ ఒకటే” నన్నాడు. 

“తక్కువరకం సరుకు తెస్తాడేమో, లేకుంటే ఇంత చవగ్గా ఎలా వస్తుందీ” అనుకున్నాను. 

“మంచిరకం టేకు తేవాల”న్నాను. 

‘అయ్యగారికి ఎట్లాంటివి తేవాలో నాకు తెలియదా? అంటూ తాను పట్నంలో పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఎన్నెన్ని వస్తువులు చేసింది, వాటిని చూచి వాళ్ళు ఎంతెంత ఆశ్చర్యపడిందీ, మెచ్చుకున్నదీ అంతా చెప్పాడు.

జాన్ క్రిష్టియన్ మిషనరీల దగ్గర పెరిగాడు. పని నేర్చుకున్నాడు. ఒక ఇంగ్లీష్ దొరగారు…పీటర్స్ దొరగారు..దయతో అన్ని పనులు నేర్పించారు. జాన్కు  ఎంతో సహాయం చేశారు. ఆయన దయవల్ల ఎట్లాంటి వస్తువైనా చెయ్యగల నేర్పు అబ్బింది జాన్ కు . 

“ఒరే, ముండాకొడకా, సరిగ్గా చెయ్యకపోతే తంతాను” అన్నాట్ట కలెక్టరుగారు. ధైర్యంగా చేస్తానన్నాడు జాన్. పెద్దవాళ్ళను మెప్పించాలని జాన్ పట్టుదల. రోల్ టాప్ డెస్క్ చెయ్యాలి. ఆ పట్నంలో ఎవరికీ చేతగాని పని అది. అలాటిదాన్ని ఇదివరలో పీటర్  దొరగారి దగ్గర చూచివున్నాడు జాన్. అందుకే ధైర్యం చేసి ఒప్పుకున్నాడు. చేశాడు. కలెక్టరుగారు ‘సెభాష్’ అన్నారు.

ఇంకోసారి ఒక పెద్ద డాక్టరుగారికి అసుపత్రిలో ఉపయోగించే ఒక వస్తువు చేయించవలసిన పనిబడింది. ఆ వస్తువును పై దేశాల్నుంచీ తెప్పించాలంటే చాలా ఆలస్యమూ, ఖర్చూను. అందువలన జాన్ను పిలిపించి చెప్పారు. 

జాన్ ఆలోచన చేశాడు. ఒకరకంగా ఊహించుకున్నాడు. దాన్ని చేశాడు. తప్పు అయింది. పారేశాడు. మళ్లీ చేశాడు. డాక్టరుగారు సరిగ్గానే ఉందన్నారు. ఇహ ఒక అద్దం బిగించాలి దానికి. అది ఎట్లా బిగించాలో చెప్పారు డాక్టరుగారు. 

కాని తాను దగ్గర ఉన్నప్పుడే బిగించాలనీ తొందరగా వొస్తానని చెప్పి వెళ్లారు. ఎంత సేపు చూచినా ఆయన రాలేదు. పని పూర్తి చేసుకుని డబ్బు తీసుకుని వెళ్ళాలని జాన్ ఆదుర్దా. డాక్టరుగారు చెప్పిన ప్రకారంగానే ఆయన రాకుండానే బిగించేశాడు. 

డాక్టరుగారు ఇంటికొచ్చారు. పనయిపోయింది, డబ్బులివ్వమని చెప్పుకున్నాడు జాన్. డాక్టరుగారికి కోపం మండిపోయింది. 

“నిన్నెవరు బిగించమన్నారురా రాస్కెల్! నేను రాకుండా బిగించవద్దనలేదా?’ అంటూ చెయ్యిచాచి మొహం మీదకొట్టారు”

ముందుపళ్ళు రెండూ రాలిపడ్డాయి. జాన్ బయటికెళ్ళి రక్తం వూసివచ్చాడు. డాక్టరుగారు వస్తువు చూసుకున్నారు. సరిగ్గానే చేశాడు. జాన్. డబ్బులిచ్చి పంపేశారు. ఇప్పుడా డాక్టరుగారు పనిలో లేరు. ఎప్పుడైనా పట్నం వెళ్ళినప్పుడు కనబడితే అప్పుడు విషయం జ్ఞాపకం చేస్తూ పలకరిస్తారు… 

ఈ తీరులో జాన్ సొంతంగా ఊహతో వస్తువులు తయారుచేసి పెద్దలను మెప్పించిన వృత్తాంతాలు చెప్పాడు. పెద్దవాళ్లు కొట్టడంలోనూ మెచ్చుకోవడంలోనూ కూడా కుక్కను చూచినట్లు చూడడం  నాకు నచ్చలేదు. కాని మా బీరువా చెయ్యడానికి తగినవాడని తెలిసిపోయింది.

ఆయన ఆఫీసునుండి రాగానే బీరువా చేయించడానికి జాన్ను పిలిసి చెప్పాను. జాన్ ఆయనకు వివరాలన్నీ చెప్పాడు. ఒకటోరకం టేకు బీరువా. 

ముందుగా కొయ్యలు నూటయాభై రూపాయిలకి తేవాలి. కూలి డబ్బుల మాట  అడగడు.

 “అయ్యగారి ఇష్టం. పదిరూపాయిలిస్తే పదే తీసుకుంటాడు…”

“ఇందాక కొయ్యలు నూరురూపాయిలకు చాలన్నావే”అన్నాను.

“అయ్యగారి దగ్గర  కరెక్టుగా చెప్పాలి కదమ్మా. తర్వాత పొరపాటు రాకూడదు. పెద్ద దొరల దగ్గర  ఎట్లా  ఉండాలి?’ అంటూ నన్ను మందలించాడు. 

అది నిజమే. ఇప్పటి లెక్కలి బట్టి  బీరువా ధర నూరు దగ్గర కాకుండా రెండునూర్లు అయేట్లుంది. కాని మంచిచెక్క చూసి తెచ్చి జాగ్రత్తగా ఇంట్లో చేస్తాడు. ఎట్లయినా షాపు వాళ్ళ దగ్గర కొన్నదానికంటే ధర తక్కువే పడుతున్నది గదా!

నూట తొంభై రూపాయలకు బిల్లుతో కొయ్యలు తెచ్చి కట్ట యింట్లో పడేశాడు జాన్. తర్వాత నాలుగు రోజులు అంతులేడు.

ఇంతకూ పని చేస్తాడో లేదో, వూరికే కొయ్యలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామే  అనిపించింది. 

మా పనివాడు కొయ్యల్ని చూచి “కొయ్య ముళ్ళుగా వున్నది. అంత మంచిగా లేదు” అన్నాడు. 

ఇంతా చేసి నిగనిగ మెరిసే అందమైన బీరువా రాదా ఏమిటి? నాకు చాలా కోపం వచ్చింది. ఈయనేమో ఏ సంగతీ పట్టించుకోరు!

నాలుగుసార్లు పిలిపించగా జాన్ వచ్చాడు. 

“అమ్మా ఫర్నీచరు షాపులవాళ్లు ఎక్కువగా కొంటారుగనుక వాళ్లని మంచి కొయ్యలు ఏరుకోనిస్తారు గాని నాబోటివాళ్లు ఒక్క బీరువాకు కొంటే ఏరుకోనివ్వరు. చెయ్యి పెట్టనివ్వరు. అయినా యివి దొరగారి కోసమని చెప్పి బలవంతాన రెండు మూడు మంచికొయ్యలు ఏరివేశాను…. ఆ ముళ్లూ అవీ తోపడంలో పోతై. కనపడవు. బాగానే వుంటుందిలెండి బీరువా” అన్నాడు.

 “పని చెయ్యడం లేదు. ఎందువలన” అనడిగాను.

“కొయ్యలన్నీ మా ఇంటికే తీసుకెళ్లి చేస్తానంటే దొరగారు ‘ఒద్దు యింట్లోనే చెయ్యి’ అన్నారు. నేను పక్క వూళ్ళో  హోటలుకు బల్లలు చేస్తున్నాను. ఇక్కడ పని చేస్తూ నడి మధ్యలో వొదిలి అక్కడకు పోతే… దొరగారి పని అట్లా చెయ్యకూడదు! పనిలో దిగితే |పూర్తి చెయ్యాల్సిందే. అందుకని ఆ పని పూర్తి చేసి వొద్దామని ఆలస్యం చేస్తున్నాను.

మూడు నాలుగు రోజుల్లో వొచ్చి చేసెయ్యనా. అమ్మా!…దొరగారి పనంటే మాటలా!”. అన్నాడు.

పదిహేను రోజుల తర్వాత వొచ్చాడు పనికి. ఆయన బాగా చీవాట్లు వేశారు. వంచిన  తల ఎత్తలేదు జాన్.

 “అవును తప్పుచేశాను. పెద్దవాళ్లు…తిడితే పడాలి” అన్నాడు. 

దాని తర్వాత ఒక్క రోజు పని చేసి మళ్ళీ మాయమైపోయాడు. ఊళ్ళోనే ఎక్కడో దూలాలు  కోస్తున్నాడట. రెండు రోజుల తర్వాత వచ్చాడు.

“వాళ్లు నాకు ఇదివరలో డబ్బు ఇచ్చి ఉన్నారమ్మా. పీకలమీద కూచుంటే వెళ్ళవలసి వచ్చింది. అందులోనూ పెద్దవాళ్ళపని అని చెప్తే గూడా వాళ్లు ఊరుకుంటేనా” అన్నాడు.

“అసలు వాడు పనిచేసే చోటునుంచీ కొయ్యలు చల్లగా దాటించేస్తాడమ్మా. జాగర్తగా ఉండాలి” అని హెచ్చరించాడు, మా శ్రీరాములు.

 ఒకే ఊళ్ళోవాళ్ళకు…. పల్లెటూళ్ళలో… ఒకరిగురించి ఒకరికి బాగా తెలిసివుంటుంది. లేనిపోని తంటా కొని తెచ్చుకున్నట్లనిపించింది. 

పనిచేస్తూ వున్నప్పుడు గంటకోసారి బయటకు వెళ్తాడు జాన్… బీడీలు కాల్చుకోడానికి, టీ తాగటానికి, ఎవరితోనైనా మాట్లాడ్డానికి, సామాన్లు ఎవరి దగ్గర్నుండో తెచ్చుకోడానికి.. ..ఎన్నోపనులు. ఇందులో ఏ సమయంలో దాటించేస్తాడో! అసలు తాను తీసుకెళ్లడానికి సగం కొయ్యలు వేరుగా ఎక్కువగా తెచ్చాడేమో! మొదట చెప్పినదానికంటే ఎక్కువ బిల్లు చేసుకొచ్చాడే!

జాన్ కోసం మనుషులు వచ్చిపోతుంటారు కూడాను. ఎవరికిచ్చి పంపించేస్తాడో! ఎన్నో అనుమానాలు. అందుకని జాన్ దగ్గర ఒక మనిషి కాపలా ఉండవలసి వచ్చింది. 

శ్రీరాములికి ఇతరపనులు చెప్పకుండా, మా ఇద్దరిలో ఒకరు తప్పిస్తే ఒకరు అక్కడ ఉండవలసి వచ్చింది.

శ్రీరాముల్ని చూస్తే జాను చాలా లోకువ. “ఏయ్ అబ్బాయ్, ఆ ఉలి ఇట్లా అందించు, ఈ బల్ల పట్టుకో… ఊ సరిగ్గా పట్టుకోవయ్యా…. ఏ పనీ సరిగా చెయ్యలేవు” అంటూ శ్రీరాములుకు ఏదో ఒకపనిని చెప్తూ గదమాయిస్తూనే వున్నాడు.

చీటికీమాటికీ జాన్ బయటికి వెళ్తూండడంవలన పని వెనుకబడుతున్నది. టీకోసరం వెళ్తే గంటన్నర వెళ్లిపోతాడు. మొదటి రోజు సాయంత్రం మాతోపాటుగా టిఫిన్, టీ ఇచ్చాను. బయటకు వెళ్లకుండా ఇంకో గంట కూర్చుని పనిచేశాడు. మర్నాడు ఉదయం పనిలోకి రాకుండా మధ్నాహ్నం మూడుగంటలకు వచ్చాడు. ఇప్పడే కదా పనిలోకి వచ్చాడు, టిఫినూ టీలూ ఇచ్చి ఎదురు సేవలు చెయ్యాలా? అనుకొని ఇవ్వలేదు.

 అయిదుగంటలయ్యేసరికి కొయ్యలు, పనిముట్లు దభీదభీమని ఎత్తిపడెయ్యడం మొదలెట్టాడు. ఆ శబ్దాలు వినలేక అప్పటికప్పుడు టీ చేసి ఇచ్చాను. గ్లాసు చేతిలోకి తీసుకుంటూ నా కళ్లలోకి తీక్షణంగా చూశాడు. . 

“రెండుపూటలా అన్నం పెట్టి, కాఫీ టిఫినూ యిస్తామని ఎందరో పిలుస్తారమ్మా! దొరగారి పని అని వచ్చాను” అన్నాడు. ఆ చూపుకి నా గుండెలో దడవచ్చింది. 

మర్నాటి నుండీ నాలుగంటలకు సరిగ్గా టిఫిన్ టీలు ఇచ్చెయ్యాలనుకున్నాను. ఈ జాన్ పైకి కనిపించేటంత వినయవిధేయతలు కలవాడుగా తోచలేదు. మాటల్లో కనిపించే  విధేయతకు పూర్తిగా వ్యతిరేకమైన స్వభావం కలవాడుగా చేతల్నిబట్టి తోస్తున్నది.

**************************

జాన్ కి  ఒక కొడుకూ, ఒక కూతురునట. కూతురు చదువుకొని పట్నంలో టీచరుగా ఉంటున్నది. జాన్ సరిగా చూడడు గనుక జాన్ భార్యకూడా పట్నంలో  కూతురి దగ్గరే ఉంటున్నది. 

ఇదివరలో జాన్ సంపాదించినదంతా తాగేసి ఇంట్లో డబ్బు సరిగ్గా ఇచ్చేవాడు కాదట. ఏమని అడిగితే భార్యను బాగా తన్ని “ఆడముండవి,నోరు మూసుకొని పడివుండు” అనేవాడట. 

ఆవిడే కష్టపడి కూతురి చదివించుకున్నది. జాన్ మాత్రం కొడుకు ఫిలిప్తో యీ వూర్లో వుంటున్నాడు.

ఇదివరలో రాక్ లు  చేసేటప్పుడు ఒకనాడు ఫిలిప్ను వెంటబెట్టుకుని వచ్చాడు జాన్. వాడు కష్టపడలేని వాడు గనుక మిల్లులో ఏదైనా ఆఫీసు జవాను లాంటి పని ఇప్పించమని అడిగాడు. 

ఫిలిపు ఇరవై ఏళ్ళ పైన వయస్సుంటుంది. సెకండ్ ఫారమ్ చదువుతూ ఆపేశాడట.

“అమ్మో వాడు చాలా తెలివికలవాడు. పంతులు క్లాసులో ఏదో అన్నాడని పంతం మీద మానేశాడు గాని…. చదివుంటేనా, వాడు..అమ్మా..ఎట్లుండ వలసినవాడు. ఎప్పుడైనా సమయం పడినప్పుడు నేను పనిలోకి రాలేకపోతే, వాడు వెళ్లి నాకంటే బాగా చేస్తాడమ్మా పని! …. అయితే ఎంతటివాళ్లయినా మాటంటే మాత్రం పడడు” అన్నాడు

ఫిలిప్ ది  తండ్రికిలాగే దృఢమైన శరీరం. నల్లగా నేరేడు పండులాగా నిగనిగలాడుతుంటాడు. కాని జాన్ మొహంలోనూ ఆకారంలోనూ కనిపించే గట్టిదనం ఫిలిప్లో కనిపించదు. మొహమూ చెంపలూ చేతులూ ఆడపిల్లలకున్నట్లు మృదువుగా వుంటాయి. 

వాడి ఇరవై ఏళ్ళ కళ్ళల్లో సోమరితనం, అలసత్వం కనిపిస్తాయి. జీవితంతో పోరాడి ఎన్నో ఢక్కామొక్కలు తిని రాటుదేలిన జాన్ కళ్ళు… అరవై ఏళ్ళవి…. వాడి చూపుతో వెలుగుతూవుంటాయి. 

ఇద్దరూ తండ్రీ కొడుకులు. ఒక రకంగా ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. కాని అంతకంటే ఎక్కువ భేదమూ వున్నది.

జాన్ కొడుక్కి ఉద్యోగం కావాలని అడుగుతూవుంటే ఆ విషయంతో తనకు ఏమీ సంబంధం లేనట్లు రెండు చేతులు కట్టుకుని ఎటో చూస్తూ ఒంటికాలిమీద నిలబడ్డాడు | ఫిలిప్. 

వాడు ఉద్యోగం అర్థిస్తున్న వాడిలా కనబడలేదు. జాన్ పనిచేసుకుంటుంటే అట్లాగే నిలబడి కొంచెం సేపు చూసి ‘నేనింటికెల్తా, నాయనా’ అన్నాడు.

జాన్ పని ఆపి, ప్రేమగా కొడుకువైపు చూసి ‘వెళ్ళు’ అన్నాడు. ఫిలిప్ వెళ్లిపోయాడు. పనికోసరం వాళ్ళు మళ్ళీ అడగలేదు.  జాన్ కి ఫిలిప్ కి ఉండే సంబంధం నాకు ఆశ్చర్యం కలిగించింది. 

భార్యనీ, మరీ అంత కరుగ్గా చూసే జాన్ ఫిలిప్ ను అంత ప్రేమగా చూస్తాడెందుకు? వాడు కంద పయోజకుడైనాడు. జాన్ వాడినట్లా చేశాడనడమే సబబేమో. పంతులు ఒక మాటంటే  వాడు చదువు మానేస్తానంటే మానెయ్యనివ్వడమేనా? దండించి చదివించుకోరా! పోనీ చదువు అబ్బకపోతే తన పని నేర్పించితే ఒకరి సంపాదన కొకరికి  తోడుగా ఇబ్బడిగా సంపాదించుకోవచ్చునే!

జాన్ ప్రవర్తన చాలా చిత్రంగా ఉన్నది. తాను ఎన్నో అబద్దాలాడి నానా గడ్డీ కరచి నెట్టుకొస్తున్నాడు. కొడుకు మాత్రం ఒకరి చేత మాటపడని వాడుగా, కష్టపడలేనివాడుగా అబద్ధమూ అన్యాయమూ లేకుండా డబ్బంటే లెక్కలేకుండా ఉండాలా!

ఒకరోజు వచ్చి ఒక రోజు రాత్రి దాకా  పని చేసి, చేసి ఎట్లాగో బీరువా పని ఒక కొలిక్కి తెచ్చాడు జాన్. ఇహ అరలు పెట్టి తలుపులు బిగించాలి. అటువంటి సమయంలో మళ్ళీ మాయమైనాడు. 

ఆ ముందురోజునే పట్నం వెళ్లి సీలలు, బందులు, హాండిలు, తాళం, పాలిషు, ఎమెరీ పేపర్లు అన్నీ బస్సు ఛార్జీలతో సహా యాభై రూపాయల సామాన్లు తెచ్చాడు. ఇంకొక్క రోజు పనిచేస్తే పూర్తవుతుందన్నాడు. ఇంతవరకు పనిచేసినదానికి తనకు రావలసిన కూలిలో పది రూపాయలు మిగిలివుంటే తీసేసుకున్నాడు. అంతే పనిలోకి రాలేదు. 

ఎక్కడికైనా పారిపోయాడా అనుకోవడానికి జాన్ సామాన్లు-ఉలి, రంపం, క్లాంపు అన్నీ మా ఇంట్లోనే వున్నాయి. ఎన్నిసార్లు వెళ్లినా మా మనుష్యులకు జాన్ అంతు దొరకలేదు. మూడో నాడు శ్రీరాములికి బజార్లో కనబడ్డాడట. బాగా తాగివుండి శ్రీరాముల్ని నానా దుర్భాషలాడాట్ట. ఫిలిఫ్ సర్దిచెప్పి మర్నాడు పనిలోకి పంపుతానన్నాట్ట.

ఎన్నో క్షమార్పణలతో మర్నాడు పనిలోకి వచ్చాడు. ఎక్కడో పని ఒప్పుకున్నాడట. రేపటితో యీ పని పూర్తి చేసుకుని వెళ్లిపోతాడట. ఇక్కడ పని సరిగా చెయ్యకుండా, మాట నిలకడ లేకుండా చేసుకున్నందుకు కొడుకు బాగా కోప్పడ్డాడట. మొదట ఇచ్చిన ఎస్టిమేటుకి అయిన ఖర్చుతో సంబంధం లేకుండా ఉన్నదనీ, పని తొందరగా చెయ్యలేదనీ జాన్ ను  కోప్పడి ఆయన ఫాక్టరీకి వెళ్లిపోయారు. 

తరువాత నా దగ్గర మామూలుగా కనిపించే అతిశయంగానీ అతివినయంగాని లేకుండా మాట్లాడాడు. “సూటయాభై రూపాయలకు బీరువా చేసిస్తానని చెప్పాను. నిజమే. అంతా అయ్యేటప్పటికి రెండువందలయాభై దాటిపోతున్నది. ఇందాక అయ్యగారు తిట్టారు… నాకు అదే చాలా చింతగా ఉన్నది. 

ఇంట్లో గూడా చింతపడతాఉంటే నా కొడుకేమన్నాడంటే “మాట పొరపాటు రాకూడదు నాయినా. అయ్యగారు డబ్బు జాస్తి అవుతుందని కోప్పడితే నువ్వు కూలి డబ్బులు తీసుకోమాక! అన్నాడు….” అంటూ చెప్పాడు. 

కూలి డబ్బులన్నీ అప్పుడే తీసేసుకున్నాడుగదా! కొడుకు బడాయిమాటలన్నీ తమాషాకి వల్లిస్తున్నాడా? అనుకుంటూ జాన్ మొహంకేసి చూశాను. అక్కడ కనిపించిన ఆనందం  మాటల్లో చెప్పగలనా? ఎంతో ప్రశాంతత, ఆనందం, మార్దవం వెలిగిపోతున్నాయి జాన్  మొహంలో. 

జాన్ టక్కరివాడు. తాగుబోతు. నిలకడ లేనివాడు. పొగరుబోతు. పైసా  ఖరీదు చెయ్యని కొడుకు అప్రయోజకపు మాటలు జాన్లో ఇటువంటి భావం | కలిగిస్తాయా? ఎందుకని? ఆమాటల్లో ఏమున్నది? జాన్ అసాధారణ వ్యక్తి. 

వ్యక్తుల మధ్యనుండే సంబంధాలూ ఆ వ్యక్తుల్లాగే క్లిష్టమూ, సంకీర్ణమూ అయివుంటున్నాయి. అసలు మనుష్యుల మధ్య నిజంగా సంబంధం అనేది వుంటుందా? వుంటే దాని స్వభావం ఎలాటిది? ఇదంతా నా బుర్రకు అర్ధం అయే విషయంగా తోచలేదు. 

ఆలోచనల్ని పక్కకు నెట్టి, నేను చదవలేక పక్కన పెట్టిన పుస్తకం తీసుకున్నాను.

-అడవి ఏమంత దట్టంగా లేదు. కాకులు దూరని కారడవీ, చీమలు దూరని చిట్టడవీ కాదు. రకరకాల చెట్లు కీసర బాసరగా పెనవేసుకుపోయి ఉన్నాయి. ఒక్కో చెట్టుకి ఒక్కో విలక్షణత. ఆకులో, కొమ్మలో, రూపులో ప్రత్యేకత. కాని వాటిని గుర్తించగల జ్ఞానం నాకు లేదు. నేత్రోత్సవం కలిగిస్తున్న ఆ దృశ్యంలో నేను గుర్తించగలిగింది ఒక సీతాఫలం చెట్టుని. కాయలు విరగ్గా ఉన్నాయ్. అటువంటి చెట్టును నేను ఇదివరకే చూచివున్నాను. అందుకే గుర్తించాను. మిగతా చెట్లన్నీ కలిసి ఒక అడవి. అందులో ఈ సీతాఫలంచెట్టు…

ఈ ప్రపంచం ఒక అస్పష్టమైన వర్ణచిత్రం. అందులో మనం గుర్తించగలిగేది అంతకుముందే మనసులో ఎరుకగా ఉన్నదాన్ని మాత్రమే. తనలోని గుర్తునే బయట గుర్తిస్తాము.

ఒక మనిషి జీవితానికి అర్థం ఇందునుంచే ప్రాప్తించాల్సిందే… ఆజీవితం ముందునుండీ అతనిలో నిబిడీకృతమై ఉన్నదే…

ఒక చిన్న విషయం నుండి పెద్ద సూత్రాన్ని నిర్వచించబూనుకున్నట్లు కనిపిస్తున్నా, ఇది అనుభవసిద్ధమైన విషయమే. 

“ఇదేం నవలరా బాబూ’ అనుకుంటూ పుస్తకం మూసేశాను.

*****************************************

బీరువాకు తలుపులు బిగించి జాన్, శ్రీరాములు ఇద్దరూ కలిసి దాన్ని వరండాలోకి తెచ్చి పెట్టారు. ఇహ పాలిష్ చెయ్యాలి.

జాన్ కోసం మనిషి వొచ్చాడు. ఫిలిప్ మలి దేవిని దాటుతుండగా గభాల్న ఏరు వచ్చేసి కొట్టుకుపోయాట్ట. గాభరాగా పరుగెట్టాడు జాన్.

తరువాత తెలిసింది ఫిలిప్ శవం దొరికిందని. జాన్ ఈ దెబ్బకు తట్టుకోలేడు అనుకున్నాను. ఫిలిప్ కీ జాన్ కీ వుండే సంబంధంఎట్లాంటిది!

నాలుగోరోజు పనిలోకి వచ్చాడు జాన్. నాలుగు రోజులకే ముఖమంతా ఒడలిపోయి ముసలివాడయ్యాడు. ఇంతలోనే పనిలోకి రాకపోతేనేం?

“నీకు బాగున్నట్లు లేదు. పనికి తొందర లేదులే. ఇంటికెళ్ళు” అన్నాను సానుభూతితో. “మైనం రుద్ది పాలిష్ కొడితే బీరువాపని అయిపోతుంది” అన్నాడు ముక్తసరిగా.

జాన్ గొంతులో కొత్తగా ఒక హుందాతనం వచ్చింది. ఈ జాన్ ని  ఎవరూ ఓదార్చవలసిన పనిలేదు!

ఉప్పుకాగితం, మైనం బాగా రుద్దాడు. పాలిష్ మూడు కోటింగులు చేశాడు.

తొమ్మిది గంటలకు పనిలోకి వచ్చాడు. బయటికి కదలనేలేదు. మధ్యాహ్నం రెండు గంటలైంది, పని పూర్తయ్యేసరికి. 

జాన్ తన సామాన్లు మూటగట్టుకున్నాడు. మిగిలిపోయిన కొయ్యముక్కలూ, పాలిషూ, సీలలూ వప్పజెప్పాడు.

“కూలి ఏమిమ్మంటావ్?” అన్నారు ఆయన.

“మామూలుగా ఈ బీరువాకు నలభై రూపాయలు తీసుకుంటాను. ఇదివరకే ముప్పయి అయిదు ఇచ్చారు. నేను మొదట చెప్పినదానికంటే ఖర్చు ఎక్కువై పోయింది. మీ ఇష్టం” అన్నాడు.

 ఆ జాన్ మాటల్లో ఇదివరకటి అతి వినయం, టక్కరితనం పోయి ఒక హుందాతనం, నిక్కచ్చిదనం వచ్చాయి

.జాన్‌పాల్ చేసిన బీరువా చివరిమెరుగులు దిద్దుకున్నాక నిగనిగలాడిపోతూ నున్నగా, అందంగా వున్నది…

ఇప్పుడు నాకు ఒక్క విషయం తెలిసింది. మనిషిని ధరించిన మనస్సు అనంతమూ, మహాశక్తివంతమూ అయినది! అలా అనుకోగానే నాలో స్వేచ్ఛ, ఆనందం వెల్లివిరిశాయి.

జాన్  ధైర్యశాలి. బలశాలి. అదే జాన్ నిజస్వరూపం. ధైర్యమూ, బలమూ అనేవి మనిషిలోని సత్యానికి సంబంధించిన గుణాలు. అతను హీనుడుగా, బలహీనుడుగా వుంటే, అది అతని హేల! 

నాది జాన్ స్వభావానికి పూర్తిగా భిన్నమైన స్వభావం. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ముక్కలైపోయాను. మళ్లీ మనిషిగా నిలబడడానికి చాలా ప్రయత్నమూ, కాలమూ పట్టింది.

**********************************************

నాన్న గారు పోయాక మొదటిసారి ఆకాశం క్రింద నిలుచున్నాను. పైన శతకోటి నక్షత్రాలు మిలమిల్లాడుతున్నాయి. వాటిని చూడగానే నాకు గాభరావేసింది. ఎన్ని  నక్షత్రాలు! వాటిని గురించి నాకేమీ తెలియదే! నాన్నగారూ మేమూ యీ ఆకాశం కింద ఎన్నోసార్లు కూర్చున్నాము. నాన్నగారికి ఆ నక్షత్రాల గురించి తెలుసు. వాటి పేర్లు, నడక గురించి అప్పుడప్పుడు చెప్పేవారు. కాని నేను శ్రద్ధగా విని జ్ఞాపకం పెట్టుకోలేదు.  నాన్న గారి నడిగితే తెలిసిపోతుంది గనుక. ఇప్పుడు నాన్నలేరు. ఈ నక్షత్రాల గురించి నాకు ఎలా తెలిసేది? చాలా ఆరాటం, భయం, నిస్పృహ, కలిగాయి. ఏమిటో పోగొట్టుకున్నటు బాధ…

నాన్నగారున్నప్పుడు ఆకాశంగురించి నేనేమీ తెలుసుకోలేదు. అప్పుడు నాకు ఉన్నదీ, ఇప్పుడు కొత్తగా పోగొట్టుకున్నదీ ఏమీలేదు. మరి ఎందుకు నాలో యీ ఆరాటం! దేనికోసం ?

ఆ నక్షత్రాలు అప్పుడూ, ఇప్పుడు ఎప్పుడూ అలానే మెరుస్తూనే వుంటవి! జాన్ జ్ఞాపకానికి వచ్చాడు. మనసులోని బరువు తొలగిషోయి అకారణమైన ఆనందంతో నిండిపోయింది… మనిషి అనంతుడూ, మహాశక్తిమంతుడూను! 

జాన్ పాల్  చేసిన బీరువా మెరుస్తున్నది.

****************************************

“బీరువా బాగున్నదే! నా బట్టలూ, పుస్తకాలు అన్నీ పెట్టుకోడానికి బాగా సరిపోతుంది” అన్నాడు బాబు.

“బాగుంటే నీకేనా? పై అరలు రెండూ నాకు అందవు గనుక నీవు పెట్టుకో. కింది రెండింట్లో నేను పెట్టుకుంటాను” పాప తగవు పెట్టుకుంది అన్నతో.

అసలు బీరువా నాక్కావాలని గదా చేయించుకున్నాను. ముఖ్యంగా కావలసినవన్నీ పోకుండా దాచుకోవచ్చని అనుకున్నానే!

కాని… ఇప్పుడు నేను దాన్ని ఉపయోగించుకోవచ్చు. నేను దాన్ని ఉపయోగించుకోకపోవచ్చు.  

ఏం చేసినా ఫరవాలేదు.

*************************************************************************

‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

“‘జాన్ పాల్ చేసిన బీరువా కథ’” కి 2 స్పందనలు

  1. It’s a beautiful story . The narrative brings out the complexity and beauty of human relations so very well .

Leave a Reply