Apple PodcastsSpotifyGoogle Podcasts

‘తోటి వేటగాళ్లు’ కేఎన్వై పతంజలి గారి కథ!

‘తోటి వేటగాళ్లు’ కే ఎన్ వై పతంజలి గారు రాసిన , వేట కథలు అనే కథాసంపుటం లోనిది.

ఈ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి.

తోటి వేటగాళ్లు కథపై శ్రీ మందలపర్తి కిషోర్ గారి సమీక్ష కూడా ఆడియోలో మీరు వినవచ్చు.

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి ప్రమీలా పతంజలి గారికి కృతజ్ఞతలు.

తోటి వేటగాళ్ళు !

బండివేగిసచెట్టు చేతులెత్తి, జుత్తు విరబోసుకు నిల్చుని రాక్షసుడిలాగుంది ఆ చీకటిలో. 

దానినీ , దానితో కొమ్మలు కలిపి నిల్చున్న పచ్చగాత చెట్టునీ అల్లుకుని పాకిన అడ్డతీగ పాదు  కొసలు కొన్ని ఉరిత్రాళ్ళలాగ వేలాడు తున్నాయి. బండి వేగిసచెట్టు మీద ఇరవయి అడుగుల ఎత్తున కట్టిన మాటులో (మంచెమీద) మందసా రాజు కూర్చున్నాడు. అతని దగిర అతి శక్తిమంతమైన రైఫిల్ వుంది. మంచె కింద, రెండు చెట్టు కొమ్మల మీద ఇద్దరు తోటి వేటగాళ్ళు కూర్చున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా రెండు తుపాకులున్నాయి. అంత దూరాన జువ్వి చెట్టుకు కట్టిన ఆవుదూడ బేలగా అరుస్తున్నాది. గుంజి పిట్టలు ‘కరకరకర’ మని అరుస్తున్నాయి.

అడవి నిద్రతో తూలుతూంది. పులి అలికిడి లేదు. ముందురోజు, అంతకు ముందు రోజూ ఆ ప్రాంతంలో అది రెండు ఆవుల్ని ఎత్తేసింది. అడుగుల్ని బట్టి చూస్తే భారీ పులి. ఎరను బెట్టి, మాటు కట్టించి కూర్చున్నాడు రాజు. అర్ధరాత్రి దాటి చాలా సేపయింది. ఆ ప్రాంతంలో పులి ఎక్కడున్నా దానికి ఆవుదూడ అరుపు వినిపించే తీరాలి. అయినా రాలేదంటే రాజుకి ఆశ్చర్యంగా వుంది. ఇంకో అడివికి వెళ్ళిపోయిందా?

తెలీడం లేదు. గాలి చల్లగా వేస్తోంది. తెల్లారగట్ట గాలి అలాగే వుంటుంది. శ్రీనివాసదేవ్ తలెత్తి చూశాడు. చుక్కల కదలిక తెలుసునతనికి. ఒకటి రెండు గంటల్లో తెల్లారిపోతుంది.

మరి, అదిరాదు, మొన్ననే తెలిసినందుకు నిన్న మాటు కట్టేస్తే ఖచ్చితంగా దొరికిపోను. అవకాశం జారిపోయింది. నొచ్చుకున్నాడతను. నడుంకట్టు బిగువుగా, ఇబ్బందిగా వుంది. దానికి తోడు పిడిబాకు ఒర ఒరుసుకుంటోంది. చేయి పెట్టి నడుంకట్టుని కాస్త కదిపాడు. చప్పుడు కాకుండా వంగి మాటు అంచుమీద నుంచి కిందికి చూశాడు. తోటి వేటగాళ్ళిద్దరూ, ఒకేసారి తలెత్తి రాజుగారికేసి చూశారు. ఆ చీకటిలో వాళ్ళిద్దరి కళ్ళు జాలిగా, భయంగా కనిపించాయి. తల వెనక్కి లాక్కొని మళ్ళీ మామూలుగా కూర్చున్నాడు మాటులో. రాదల్చుకుంటే దానికి ఎంత సేపు. మెరుపులాగ రావచ్చు. మళ్ళీ ఆశ. ఒక్క షాట్ చాలు. మంచి నీళ్ళయినా అడక్కుండా చచ్చిపోతుంది. పులిని కొట్టి చాలా కాలం అయిపోయింది. ఈ సైజు పులి తిరగడం తక్కువే. అలాగ కూర్చున్నాడు. కారుకోడి కూసింది. తెల్లవారుజామున విచ్చుకునే ఏ కొండ పువ్వులు కళ్ళు తెరిచాయో గానీ చక్కని సువాసన నిండిన గాలితెర ఒకటి చెట్లని పలకరించుకుంటూ పోయింది. పిట్టలు లేచిపోతున్నాయి. కొండగొర్రె వేసిన వెలుతురు రెప్పలు ఆర్చుతోంది.

కేక లీలగా వినిపిస్తోంది. అడివంతా నిద్ర లేచిపోతోంది. వెలుతురు రెప్పలు ఆర్చుతోంది.

ఇంకరాదు! నిరాశతో నిట్టూర్చాడు. శ్రీనివాస్ దేవ్. నిద్ర దండగ. కారు దండుగ. ఎంతో సుఖంగా నిద్రపోవలసిన వాడికి కొండ చెట్ల మీద పడిగాపుల ఖర్మమేమి?   వేట సరదా.

ఎరగా చెట్టుకు కట్టి వుంచిన ఆవు దూడ ఇంకా అరుస్తోంది. అడివిని చూస్తే  దానికి భయం వేసింది. చూస్తూ వుండగానే వెల్తురు ఎక్కువైంది. చెట్ల మధ్య నుంచి రేవులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి రాదులే అను కుని మంచె మీద నిల్చున్నాడు శ్రీనివాస్ దేవ్. ఒళ్ళు విరుచుకున్నాడు.

“దిగుదాం” అన్నాడు శ్రీనివాసదేవ్.

 చిత్తం! అన్నారు తోటి వేటగాళ్ళు. శ్రీనివాసదేవ్ తుపాకీ మంచె మీదే వుంది.

జాగ్రత్తగా మంచె దిగి చెట్ల కొమ్మలు పట్టుకుని దిగుతున్నాడు. 

“జాగర్తండీ… ఆ కొమ్మ పట్టుకుని కుడి కాలు ఆ తొర్ర ఒడ్డున పెట్టండి..” అన్నాడో తోటి వేటగాడు.

 “రైఫిల్ మంచె మీద నుంచి… జాగ్రత్తగా దించండి. లోడ్ చేసి వుంచేను సుమా… కొంపలు అంటుకుపోతాయి” అన్నాడు శ్రీనివాసదేవ్ చెట్టు దిగుతూ.\

‘చిత్తం’. 

శ్రీనివాసదేవ్ కుడికాలు ముందు నేలని తాకింది. తరువాత ఎడమకాలు. 

చేతులు రెండు ఇంకా చెట్టుమానుని అంటి పెట్టుకుని వుండగానే ‘గాండ్రు’ మనే అరుపు వినబడింది. 

అంతసేపు ఎక్కడ ఉన్నదో గాని ఉరమని, కురవని పిడుగులాగ అతని మీదకి దూకింది. 

పెద్దపులి. 

తెల్లవారి వెలుగులో అది భయంకరమైన అందంతో మెరిసిపోతోంది. దాని కళ్ళూ కోరలూ మరీని. 

శ్రీనివాసదేవ్ చటాలున నిల్చున్న చోటునించి కొంచెం తప్పుకున్నాడు. పులి విసిరిన పంజా అతని భుజాన్ని రాసుకుంటూ చెట్టు మానుకి తగిలింది. శ్రీనివాసదేవ్ చటాలున ఆ పంజా అందుకున్నాడు. చెట్టు మొదటిని సందిట్లో పెట్టుకుని రెండో చేత్తో రెండో పంజా అందీసేడు. బలమంతా కేంద్రీకరించి, కాళ్ళు రెండో చెట్టు మొదటికి ఆన్చి తన్ని పెట్టి వెనక్కి లాగేడు. ఆ బలానికి ఆ ఊపుకి పులి తల వేగిస చెట్టు మొదటికి కొట్టుకుంది. అది ప్రళయ భీకరంగా గర్జించి గింజుకుంది. 

శ్రీనివాసదేవ్ బలమైన మనిషి పులి పంజాలు రెండూ అతని ఉక్కు పిడికిటిలో చిక్కుకుపోయాయి. ఆ పైన పులికీ, అతనికీ మధ్య బండివేగిస మానుంది. పంజాలు తన చేతిలోంచి జారిపోకుండా చూపుడు  వేల్తో బొటన వేలు మరింత బిగించి పట్టుకున్నాడు. పులి చెట్ల ఆకులు కంపించి పోయేలాగ అరుస్తోంది.

“… ఎవడో ఒకడు దిగండి… నా బొడ్లో బాకు దీసి దీన్ని పొడిచేయండి.. లేదా తుపాకీతో దాన్ని కాల్చేండి…” అని కేక వేశాడు శ్రీనివాసదేవ్ అరుస్తూనే తలెత్తి చూశాడు. 

తోటి వేటగాళ్ళిద్దరూ చెట్టుమీద కొమ్మల్ని అంటి పెట్టుకున్న కర్రిబల్లుల్లాగా పించారతని కంటికి. వాళ్ళిద్దరూ తుపాకులు ఎప్పుడో కిందపడేసి కొమ్మల్ని గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకుని గజగజ వణికి పోతున్నారు.

పులి  వేస్తున్న కేకలకి హడలిపోయిన ఆవుదూడ కాలికి కట్టిన మోకు తెంపుకుని పుటాయించి  పారిపోవడానికి యమయాతన పడుతోంది. అది తోక లేపి చెట్టు చుట్టూ పరిగెడుతోంది.

పులి వెనుక కాళ్ళ మీద నిల్చుని నేలంతా తవ్వి పారేస్తోంది. ముందుకాళ్ళు విడిపించుకోవాలని అది తెగ ప్రయత్నిస్తోంది. శ్రీనివాసదేవ్ పళ్లు గట్టిగా బిగించి, చెయ్యి పట్టు  తప్పిపోకుండా గట్టిగా దాని ముంగాళ్ళు పట్టుకునే వున్నాడు.

“రేయ్.. వెధవల్లారా రండర్రా… వచ్చి దీన్ని చంపేయండి… నేను దీని ముందు కాళ్పు కదలకుండా పట్టేసుకున్నాను. మీకొచ్చిన భయం లేదు. మీ ప్రాణానికి నా ప్రాణం అదు… ఎంతసేపు ఇలాగ… ఇంత జంతువుని ఆపగలను. వెంటనే దిగండి. తుపాకి తీసి పేల్చేయండి …” అని మళ్ళీ అరిచాడు శ్రీనివాసదేవ్. 

తోటివేటగాళ్ళు ఉలుకూ, పలుకూ లేదు. పులి పంజాలోంచి పొడుచుకొచ్చిన గోళ్ళు చెట్టు బెరడు మీద గీసుకున్నాయి.

అది గీసుకున్న చోట్నించి ఎర్రటి రక్తం లాంటి పాలు చిమ్ముతోంది బండివేగిస చెటు. పులి అలాగ పంజాతో చెట్టును గీకుతున్నప్పుడు శ్రీనివాసదేవ్ చేతి బొటన వేళ్ళు రెండూ, చెట్టుకు పంజాకు మధ్య పడి నలిగిపోయాయి. 

అయినా అతను పట్టు విడువలేదు. పులి ఘోరమైన పట్టుదలతో గింజుకుంటోంది. వదిలితే చచ్చిపోతానని తెలుసుకున్న శ్రీనివాస్ దేవ్ చచ్చినా వదలను అనుకున్నాడు. అది వెనక్కి గింజుకుంటోంది.

శ్రీనివాస్ దేవ్ కాళ్ళు రెండు చెట్టుకు తన్ని పెట్టి దాన్ని ముందుకు లాగాడు. “ఒరే దొంగలంజకొడకల్లారా… పులిని నేను పట్టుకున్నాన్రా రండి.. దిగొచ్చి తుపాకీతో కొట్టేయండి…”

నిశ్శబ్దం.

“వినబడ్డం లేదే ట్రా… మిమ్మల్నే… ఒరే బుచ్చయ్య, ఒరే నరిసీ ….” అని మళ్ళీ కేకలేశాడు శ్రీనివాస్ దేవ్. 

పులి కొండలు అదిరిపోయేలాగ అరిచింది. మునిపళ్ళతో చెట్టు బెరడుని కొరికేసింది. ఆ నోటితోనే శ్రీనివాస్ దేవ్ చేతుల్ని కొరికేయాలని చూసింది గానీ అతను చేతులు పైకెత్తి కుదరనివ్వలేదు.

ఒళ్ళంతా చెమటలు పట్టేసేయాతనికి. ఒంటిలోని కండరాలన్నీ అలసిపోయి నొప్పి పెడుతున్నాయి.

“ఒరే… ఒరే… ఒరే… ఒరే… దొంగ లంజా కొడకల్లారా చెట్టు దిగుతారా లేదా?” ‘అని మరోసారి కేకలేశాడు శ్రీనివాస్ దేవ్.

తోటివేటగాళ్ళు పులుగు పిట్ట లాగ కిందికి భయంగా చూశారు తప్పించి దిగలేదు.  

ఎవరో పరిగెడుతున్న చప్పుడు వినబడుతోంది.

“ఒచ్చే ఒచ్చే… ఓ మనిషో ఒచ్చే ఒచ్చే” అన్న కేక వినిపించింది. 

ఆ కేక విన్నాక శ్రీనివాసదేవ్ బలం పుంజుకున్నాడు. 

పంజాలు పట్టుకుని పులిని ఒక్కసారిగా ముందు ఒక గుంజు గుంజాడు.

ఆ విసురికి పులి బుర్ర చెట్టుకు టపాలున కొట్టుకుంది. – “రారారా! పులి… పులుంది… పట్టేసేను… రారారా!” అని శ్రీనివాసదేవ్ కేకవేశాడు.

అంత దూరం నుంచి ఒక మనిషి పరుగెత్తుకు వస్తూ కనిపిస్తున్నాడు. ఒంటి మీద గోచీ తప్ప ఇంకేమీ లేని బలమైన మనిషి, చేతిలో గొర్రెల కాపరుల కర్ర వుంది. అతను ఆయాసపడి ఒగుర్చుతూ వచ్చాడు.

“నీకు తుపాకీ వేయడం వచ్చునా?”

 “ రాదండి”

“పోనీలే… ఇలా నా వెనక్కి వచ్చి నా మొలనున్న బాకు తీసి పులిని పొడిచీ….” ఆ మనిషి చేతిలోని కర్రను కింద పారేసి శ్రీనివాసదేవ్ వెనక్కి వచ్చాడు.

“పులిని మాత్రం ఒగ్గీకండి … బాకు ఇలాగివ్వండి”

 “మొలనుంచి తీయి…” ఆ గొర్రెల కాపరి తడిమి శ్రీనివాసదేవ్ మొలనున్న బాకు తీశాడు.

“వెళ్ళు… బోర ఎముకల్లోంచి దూరి గుండెకాయ చీలిపోయీలాగ పొడిచీయాలి… సత్తుపూరా పొడవాలి” అన్నాడు శ్రీనివాసదేవ్.

అప్పటికి  అతని చేతులు వణుకుతున్నాయి. అరచేతులు చెమటలు పట్టిపోతున్నాయి. పులిని కాయడం ప్రాణాంతకంగా వుంది. గొర్రెల కాపరి పులి వెనక్కి వెళ్ళాడు. పులి గాండ్రించింది.

దానిలో ఈసారి ఒకటి నెత్తుటి జీర వుంది. మరోసారి అరిచింది.

అది ఒక జంతువు ఏడుపు మాత్రమే. అక్కడ ఆవుదూడ తెరిపి లేకుండా ‘అంబా’ అని అరుస్తోంది.

చెటు మీద గోరలు చేరి నానా గొడవా చేస్తున్నాయి. పులి అరుపు మరి వినిపించలేదు..!

దాని పంజాల్లోని శక్తి క్షీణించిపోయి దాని బరువుకి శ్రీనివాసదేవ్ పట్టుసడలిపోయింది.

పులి కింద పడిపోయింది.

మూడు పోట్లు  పొడిచీసేనండి… నంజికూతురు సచ్చింది… ఎవురండీ తవరు?” అని వాకబు చేశాడు గొర్రెల కాపరి.

శ్రీనివాసదేవ్ ఏమీ మాటాడలేదు. కిందున్న తుపాకుల్లో డబుల్ బ్యారెల్ గన్ తీశాడు. నల్లీ విరిచి చూశాడు.

రెండు తూటాలున్నాయి.

“ఎవురండీ. తవురు…” అని పశులకాపరి మళ్ళీ అడిగాడు. 

శ్రీనివాస్ దేవ్ సమాధానం చెప్పలేదు. తుపాకీ సరిచేశాడు.

‘పులిమాత్రం ఏనుగంత వుందండి. భలేగా పట్టేసుకున్నారు. నేకపోతే తమర్ని నలిపేసిపోను…’ అన్నాడు గొర్రెల కాపరి బాకుని అంటిన నెత్తుటి బురదను చేత్తో తుడుస్తూ.

శ్రీనివాస్ దేవ్ తుపాకీ మాను భుజానికి ఆనించి చెట్టుమీదే ఇంకా గడగడ వణుకుతూ కూర్చున్న తోటి వేటగాళ్ళకి గురిపెట్టారు.

ఢాం !

ఢాం !

అని రెండుసార్లు మోగిందా జోడుబారుల తుపాకీ.

తోటి వేటగాళ్ళ మృతదేహాలు చెట్టు మీదనుంచి దబ్ దబ్ మని కిందపడ్డాయి. 

“బాబు ఎవురండీ తవురూ?” అని భయంగా అడిగాడు గొర్రెలకాపరి.

హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

Leave a Reply