Apple PodcastsSpotifyGoogle Podcasts

‘అంటు కొమ్మ’ – అక్కిరాజు భట్టిప్రోలు గారి రచన

‘అంటుకొమ్మ’ కథ శ్రీ అక్కిరాజు భట్టిప్రోలు గారు  రాసిన ‘మూడు బీర్ల తర్వాత’ అనే పుస్తకం లోనిది.  తన మూలాలను వెతుక్కుంటూ ఒక మహిళ చేసే  ప్రయాణమే ఈ కథ. కథను చాలా వాస్తవికంగా, ముగింపును హృద్యంగా చిత్రీకరించారు రచయిత. 

 విభిన్న అంశాలను స్పృశిస్తూ అక్కిరాజు గారు రాసిన  ‘ మూడు బీర్ల తర్వాత’  ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన అతి చక్కని కథాసంపుటాల్లో ఒకటి. 

పుస్తకం కొనడానికి కావాల్సిన  web link ….  https://bit.ly/3d4M0lv 

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  అక్కిరాజు  గారికి కృతజ్ఞతలు.

అంటుకొమ్మ

“అంటు కట్టడం” అంటే? ఈ చెట్టు కొమ్మని నరికి, కొంతమేర పై చెక్కు తీసి మరో చెట్టు కొమ్మకి అతికించి, పైన మట్టి కప్పి గట్టిగా కట్టెయ్యడం. ఈ కొమ్మ ఇమడ గలిగితే ఆ చెట్టు కొమ్మే అయి పూలూ పండ్లు కాస్తుంది. లేదా మాడి చస్తుంది. అప్పుడు మరో కొమ్మని తెచ్చి అతికించుకోవచ్చు. విషయ మేమంటే, అతుకుకొమ్మకు కాసే పండ్లని కూడా కొత్త చెట్టు పండ్లనే పిలుస్తారు. అదీ తమాషా! అతుకు కొమ్మలు బతికినా చచ్చినా ఒకటే… లెక్కలోకి రావు.

నల్లటి రోడ్డు మీద పరిగెడుతోంది కువాలిస్. “సంధ్యా! కాస్తా వాటర్ బాటిల్ అందుకోవే…. మీ నాన్నకి” 

మధ్య సీట్లో కూర్చున్న అనసూయమ్మ వెనక సీట్లో ఉన్న కూతుర్ని అడిగారు. బయటికి చూస్తున్న సంధ్య కాళ్ళ దగ్గరున్న బాటిల్ తీసి తల్లికిచ్చింది.

బాటిల్లో నీళ్ళు, తన దగ్గరున్న డిస్పోజబుల్ గ్లాసులో పోసి భర్త కందించారు అనసూయమ్మ. ఆ మంచి నీళ్ళు రెండు గుక్కల్లో తాగేసి మళ్ళీ ఖాళీ గ్లాసు భార్య కందించారు సదాశివరావు.

ఆవిడ ఆ గ్లాసుని ముందున్న డ్రైవర్ కిచ్చి “కాస్త బయట పడెయ్యి నాయనా” అంది.

ఏ.సి. కారు పుణ్యమా అని అన్ని డోర్లూ బిగదీసుకు కూర్చున్నారేమో, పెద్దావిడకి అద్దం ఎలా దించి గ్లాసు బయట పడేయాలో తెలీదు. తదేక దీక్షతో డ్రైవ్ చేస్తున్న రాముడు ఒకచేతిని స్టీరింగు మీదే ఉంచి, అలవోకగా మరో చేత్తో గ్లాసందుకుని, అదే చేత్తో అద్దాన్ని కూడా దింపేసి, గ్లాసు బయట పడేసి మళ్ళీ అద్దాన్ని మూసేశాడు.

తను మంచినీళ్ళు తాగడం అనే కార్యక్రమంలో మొత్తం ముగ్గురు పాలు పంచుకుని అంకిత భావంతో నిర్వర్తించడాన్ని తృప్తిగా గమనించి, గమనించకుండా అన్నారు సదాశివరావు…

“ఈ ఊళ్ళెంత మారిపోయాయో…”

“మనం రావట్లేదని ఊళ్ళు మారకుండా ఉంటాయేమిటి” అన్నారు అనసూయమ్మ.

ఆవిడ మాట పూర్తవకుండానే అరచినట్టుగా అన్నాడు ముందు సీట్లో కూర్చున్న పన్నెండేళ్ళ శశి. “దిసీజ్ సో ఫన్నీ”

అంటూనే తన చేతిలో ఉన్న కేంకార్డర్ ముందుకు ఫోకస్ చేశాడు. అంత ఆశ్చర్యం కలిగించే విషయమేమిటా అని అందరూ చూశారు.

కువాలీస్ కి అడ్డంగా రోడ్డు మీద మేకల దండు. ఆ మందకి అటువైపు ఓ లారీ ఆగి ఉంది. ఈ మధ్యలో ఓ ఆసామి ఆ మేకలన్నింటినీ ఓ వరసలో అమర్చి ట్రాఫిక్ ని పంపించే ప్రయత్నంలో ఉన్నాడు. 

అతి సహజంగా ఉన్న ఈ సంఘటన శశికి మాత్రం ఆశ్చర్యమే. వెనక సీట్లోంచి సంధ్య అందుకుంది.

“రోడ్డు మీద గొడ్డూ గోదా అడ్డం రావడం వీడెప్పుడు చూశాడు…”

అమెరికాలో పెరుగుతున్న తన కొడుకు శశిని మిగతా వాళ్ళందరికీ అర్థం చేసే ప్రయత్నం చేసింది.

“ఏవిట్రా మీ దేశంలో గొడ్డూ గొదా ఉండదేవిరా? ఏం తింటారూ ఏం తాగుతారూ?” తాత గారు మధ్య సీట్లోంచి.

“అక్కడ గొడ్డూ గోదా లేక పోవట మేంటి నాన్నా… పాలూ పెరుగూ చీజ్ సుబ్బరంగా తింటారు. పాలూ పెరుగూ మాత్రమేనా… ఆ గొడ్డూ గోదానే ఏకంగా తినేస్తారు. కాకపోతే అవిలా రోడ్డు మీదకి రావు. పొరపాటున వచ్చినా ఏ ట్రక్కు కిందో పడి పోవాల్సిందే తప్ప, ఇలా తీరిగ్గా తోలుతూ కూచోరు” అంది సంధ్య.

అడ్డు తొలగటంతో మళ్ళీ బయల్దేరింది వాహనం.

మొత్తం అందులో ఇద్దరు పిల్లలూ, ఐదుగురు పెద్దవాళ్ళూ ఉన్నారు, రాముడు కాక. డ్రైవర్ సీటు పక్కన ఇద్దరు పిల్లలు సంధ్య కొడుకు శశి, శంకరం కూతురు భార్గవి కూర్చున్నారు.

మధ్యసీట్లో పెద్దవాళ్ళిద్దరూ అనసూయమ్మ, సదాశివరావు గారు.

చివరి సీట్లో ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవచ్చని శంకరం, శంకరం భార్య లత, శంకరం చెల్లెలు సంధ్య కూర్చున్నారు.

“అన్నయ్య గారు కూడా వస్తే బాగుండేది” అంది లత, సంధ్య ని ఉద్దేశించి.

“వస్తాననే  అన్నారు వదినా. బెజవాడలో వాళ్ళ ఫ్రెండ్స్ వదల్లేదు. మనతో రావాలో వాళ్ళతో  వెళ్ళాలో తికమక పడుతుంటే నేనే అన్నా, మన వాళ్ళని ఎప్పుడో ఒకప్పుడు కలుస్తూనే ఉంటాం, మీ ఫ్రెండ్తోనే వెళ్ళండి అని” భర్త రాక పోవడాన్ని తన మీదే వేసుకుంది సంధ్య.

“అయినా మనం తిరిగి ఇంటికి చేరేటప్పటికి ఆయన కూడా వచ్చేసే ఉంటార్లే” అని ముక్తాయించింది.

ఎంత ఎ.సి. కారు అయినా, నిండుగా ఉన్న మనుషులు, వేసవి కాక పోయినా కాస్తున్న బయటి ఎర్రటి ఎండ కలిసి లోపల ఉక్కగానే ఉంది.

ఏదన్నా కూల్ డ్రింక్ తాగుదాం. ఇక్కడ ఏవన్నా చల్లగా దొరుకుతాయేమో చూడు” అన్న శంకరాన్ని ఉద్దేశించి సంధ్య.

ఇక్కడేం చల్లగా దొరుకుతాయే. ఏదో ఓ చిన్న ఫ్రిజ్ పెట్టుకుని కూర్చుంటారు. వచ్చీ పోయే కరెంటుతో నీకు కావాల్సినంత చల్లగా ఏమీ దొరకవు. ఆ బాటిల్ లో ఉన్న నీళ్ళే నయం” తేల్చి చెప్పాడు శంకరం.

తనలా అంటుండగానే అందరి తలలు అప్రయత్నంగా కారు బయటకి, రోడ్డు వెంబడి చూట్టం మొదలు పెట్టాయి, కూల్ డ్రింక్ షాప్ కోసం.

“రెండేళ్ళనించీ సరయిన వానల్లేవు. కాలవల్లో నీళ్ళు రావటం మానేశాయి. నాట్లు కూడా పళ్ళేదు ఇంకా. అదంతా పిచ్చి గడ్డి. ఇక్కడే ఇలా ఉంటే మెట్ట ప్రాంతాల పరిస్థితి ఏమిటో. జనాలు పురుగుల మందులు తాగేస్తున్నారంటే తాగరూ?” వరి పొలాల్లో మొలిచిన పిచ్చిగడ్డిని చూపిస్తూ బయట దృశ్యాన్ని స్వగతంలా వివరించాడు శంకరం.

“మరే! ఏమిట్రా నాయనా ఆ వార్తలు. తెలుగు పేపర్ చదవాలంటేనే భయమేస్తోంది. మొదటి పేజీలో ఆత్మహత్యల స్కోరూ, చివరి పేజీలో క్రికెట్ స్కోరు” విరక్తిగా అంది సంధ్య.

“ఆ రెండు పేజీల మధ్య చూడాలి స్టాకు మార్కెట్, హైటెక్ వైభోగం” కసిగా అన్నాడు శంకరం.

“సర్లేరా! నువ్వు మరీ అతి, వానలు పడక పోవటానికి రైలు లేగా రావటనికి కూడా హైటెక్కే కారణమనగల సమర్థుడివి” తేల్చేసింది సంధ్య.

“వాట్స్ దట్ మాం?” అన్నా చెల్లెళ్ళ సంభాషణని తుంచేస్తూ అడిగాడు శశి.

రోడ్డు పక్క నల్లటి కుండల్లోంచి తెల్లటి నురగతో తొంగి చూస్తూ అమ్మకానికి దంగా కల్లు. కనీసం కిలో మీటరుకు ఒక చోటన్నా కుండల్లో కల్లు పెట్టుకుని కూర్చున్నారు.

“అదా! కల్లు… ఆ తాటి చెట్లలోంచి వస్తుంది. ఆ పైన చూడు చెట్లకి కుండలు కట్టి  ఉన్నాయా… అందులోంచి వచ్చిన కల్లుని ఇలా అమ్ముకుంటారు” విడమర్చి మేనల్లుడికి చెప్పాడు శంకరం. అక్కడితో ఆగకుండా……

“అవునే.. నీకు ఏదన్నా చల్లగా కావాలన్నావుగా… ఇంతకు మించి చల్లటిది ఈ ప్రాంతంలో దొరకదు. ఓ కుండ కొనమంటా వేమిటి” చెల్లెలితో  పరాచికాలాడాడు.

“కొనరా! బెదిరిస్తున్నావా… నువ్వొకటి తాగు, ఆ తర్వాత నేనొకటి తాగుతా” అన్నని కవ్వించింది సంధ్య.

“వాడితో పెట్టుకోకే… కల్లు కొన్నా కొంటాడు. గొడ్లని కాసుకునే వాళ్ళతో పెరిగాడు. ఇప్పడూ వాళ్ళ వెంటే, వాళ్లని వెనకేసుకునే వస్తాడు వాడు. బ్రాహ్మణ పుటక పుట్టి చెరువు గట్టున పిట్ట మాంసం తింటుంటే ఈడ్చుకొచ్చాను వెళ్లి  వోసారి. వాళ్లే అడుగు.” తండ్రి మధ్యలో ప్రవేశిస్తూ అన్నాడు.

సంధ్య గతుక్కు మంది. తన భర్తా, కొడుకూ సుబ్బరంగా బీఫ్, పోర్క్ అన్నీ తింటారని తెలిస్తే అనుకుంది. తను కూడా కల్లు కాక పోయినా చక్కగా వైన్ తాగగలదని తెలిస్తే వీళ్లెలా  రియాక్ట్ అవుతారో అనుకుంది.

“పిట్ట మాంసమేం ఖర్మా… కల్లు కూడా గొప్పగానే ఉంటుంది. మా క్లాసులో త్రిమూర్తులు గాడుండే వాడు ఐదు నుండి పది దాకా. వాడెప్పుడూ ఏ తాటిచెట్టుకు ఎన్ని కుండలున్నాయో చూస్తుండే వాడు. వాడికి బలే లెక్క ఉండేది. ఒక్కోసారి వెంటనే కుండని దించక పోతే కుండనిండి ఒక్కో చుక్కా కింద పడుతుండేది. అది ఆగి ఆగి పడుతుంది. వీడు బలే కని పెట్టేవాడు. చెట్టు కింద నించుని పైకి చూసే వాడు. రెండు నిమిషాలకో చుక్క పడేది. వీడు అరచేత్తో దాన్ని కాచ్ పట్టి నాకే వాడు. కొన్ని రోజులకి మా గాంగ్ అంతా వాడి పక్కన చేరి పడే ప్రతి చుక్కనీ పోటీ పడి కాచ్ పట్టే వాళ్ళం. ఫ్రెష్ కల్లు ఎంత తియ్యగా ఉంటుందనుకున్నావ్” చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటూ శంకరం.

“నాకు తెలియని వెధవ్వేషాలు ఇంకా ఎన్ని వేశావురా. నేను పోయే దాకా నీ గురించి కొత్త సంగతులు తెలుసుకుంటూనే ఉంటాను” పెదవి విరిచేశారు సదాశివరావు.

“ఛీ కల్లు తాగావా డాడీ” అంది అంతసేపూ మౌనంగా ఉన్న శంకరం కూతురు భార్గవి.

“పిల్లల ముందు ఇలాంటివే మాట్లాడండి” మందలించింది లత. మళ్ళీ వెలక్కాయ గొంతులో పడింది సంధ్యకి.

మందు, మాంసం గురించిన విషయాలు పిల్లల ముందు మాట్లాడ్డం కూడా తప్పునుకునే ఈ కుటుంబంలోంచి వచ్చిన తాను ఎంతదూరం ప్రయాణించానా అనుకుంది. అయినా అన్న గానీ, తాను గానీ ఏనాడూ అంత చాదస్తంగా పెరగలేదులే అనుకుని సమాధాన పడింది.

“దాన్ని నాగలి అంటారు. దుక్కి దున్నుతారు దాంతో” శశికి చెప్తోంది భారవి. రోడ్డు పక్క పొలంలో ఓ నాగలి, జోడెడ్లు, వాటిని అదుపు చేస్తున్న రైతు, ఆతని చేతిలో ఓ చిన్న ముల్లు కర్ర. 

“ఇంకా నాగళ్ళు ఉన్నాయా. ఈ పాటికి ట్రాక్టర్లు మింగేసి ఉంటాయనుకున్నాను” అంది సంధ్య.

“నాగళ్ళు ఇంకా ఉన్నాయి కొద్దో గొప్పో. ఎడ్ల బళ్ళు మాత్రం చాలా తగ్గి పోయాయే” అన్నాడు శంకరం.

“గుర్తుందిరా… చట్రాన్ని పిడకల్లో కాల్చి బండి చక్రానికి బిగించే వాళ్ళు. ఎర్రగా కాలిన చట్రం చక్రానికి తగలగానే మంటలు లేచేవి. వడ్డా వాళ్ళ పిల్లలు గబ గబా బక్కెట్లలో నీళ్ళని చెంబులో ఆ చట్రం చుట్టూతా పోస్తూ మంటల్ని ఆర్పే వాళ్ళు.”

ఎక్కడో పడి ఉన్న చిన్నప్పటి పల్లె జ్ఞాపకాల్ని తిరగతోడుకుంటూ అంది సంధ్య.

చెల్లెలి వంక చూశాడు శంకరం. ఎడమ చేతి మణికట్టు మీద మచ్చ కనపడింది, సన్నటి అమెరికన్ బ్రాండ్ వాచీ కిందనించి. తన పక్క తొక్కుడు సైకిలు మీంచి కిందపడి, చేతి గాజులు పగిలి గుచ్చుకున్నప్పుడు పడింది ఆ గాటు. ఎక్కడో అమెరికా వెళ్ళి దూరమయిపోయిన అమెరికా “సంధ్య” లోంచి తనకి తెలిసిన చెల్లెల్ని చూసుకున్నాడు.

“ఇంకా ఎంత దూరంరా…” బయటకు చూస్తూ అడిగింది తల్లి.

“వడ్లమన్నాడు రావటానికి ఇంకో అరగంట. అక్కణ్ణించి ఇంకో పావుగంట గురివింద గుంటకి” లెక్కేసి చెప్పాడు శంకరం.

గురివిందగుంట అనసూయమ్మ గారి పుట్టినిల్లు. ఆవిడ చిన్నతనమంతా అక్కడే గడిచింది. శంకరం, సంధ్యలక్కూడా అమ్మమ్మగారి ఊరు ఆటవిడుపు చిన్నతనంలో, ఎండాకాలం శెలవులకోసం ఎదురుచూస్తూ ఉండేవారు అమ్మమ్మ దగ్గరికి పోవటానికి,

విమానం దిగుతూనే అంది సంధ్య “ఒరేయ్, ఈసారి ఏమయినా సరే గురివిందగుంట వెళ్ళి తీరాల్సిందే అని.”

“అక్కడేం ఉందే. ఊరు ఊరే లేకుండా పోయింది. మనకి సంబంధించి ఏమీలేదు, మనకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అయినా మనవాళ్ళేమిటీ… అసలు ఊరే మాయమయిందంటుంటే…” శంకరం.

“ఏమున్నా లేకపోయినా ఆవూరు వెళ్ళాల్సిందే” నని తీర్మానించింది సంధ్య.

నిజానికి కావాలనే భర్తని ఈ ప్రోగ్రాం నించి తప్పించింది సంధ్య. ఆ ఊరిని చూసి ఎంతో ఉద్వేగానికి లోనవుతుంది తల్లి అని ఆమెకు తెలుసు.అల్లుడి ముందు అనవసరపు భేషజాలతో పూర్తిగా ఆ ఆనందాన్ని అనుభవించలేదేమోనని సంధ్య భయం.

“అమ్మగారూ కొత్త ఆంజనేయ సామి గుడి” రాముడు రాబోతున్న గుడిని చూపిస్తూ. చక్కటి రంగులతో, చుట్టూతా ప్రహరీ గోడతో మంచి గుడి.

అప్రయత్నంగా సంధ్య, లతలు కళ్ళకద్దుకున్నారు.

కొద్దిగా ముందుకెళ్ళాక ఓ చిన్న కూలిపోవడానికి సిద్ధంగా ఓ బడి. “మండల ప్రాథమిక పాఠశాల” తడువుకుంటూ చదివింది సంధ్య. దాని పక్కనే “గ్రామ పంచాయతీ” కార్యాలయం అదే స్థితిలో.

ఆ ఊరు దాటి కొంచెం దూరం వెళ్ళాక. –

“సంధ్య, చూడవే 100 అడుగుల వినాయకుడి విగ్రహం. కిందటి సంవత్సరమే పెట్టారు” రోడ్డు పక్కనే అంతెత్తున ఉన్న బ్రహ్మాండమయిన విగ్రహం.

సంధ్య ఈసారి కళ్ళ కద్దుకోలేదు.

అనుమానంగా చూస్తూ “వానల్లేవు, అంతా దరిద్రం అన్నావు కదరా. ఇన్ని కొత్తగుళ్ళేమిట్రా” అంది.

“దరిద్రం మనిషికి గానీ దేవుడికి కాదుగా” వైరాగ్యంగా అన్నాడు శంకరం.

“అమ్మగారూ వచ్చేవూరు చూడండి. కొంచెం పెద్దదే ఊరు. రెండు సాయిబాబా గుళ్ళు అక్కడ. రెండూ ఈ మధ్యనే కట్టారు” రాముడు.

“రెండా… రెండూ షిర్డీ సాయి బాబావే?” అనుమానంగా సంధ్య.

“ఆహా! రెండూ షిర్డీ సాయివే… కాకపోతే ఒకటి కమ్మ సాయిబాబా, ఒకటి కాపు సాయి బాబా” అంటూ విరగబడి నవ్వాడు శంకరం.

“అవున్నాన్నా, బ్రాహ్మల రామాలయం ఏమయింది” నవ్వాపుకుంటూ తండ్రిని రెచ్చగొడుతున్నట్టుగా అడిగాడు శంకరం.

విననట్టుగా నటించి తలతిప్పుకున్నాడు తండ్రి.

“భగవంతుడా, నీకే గతి పట్టింది” పై పైన చెంపలు వేసుకుంటూ బయటకే అంది సంధ్య.

ఎవరి ఆలోచనల్లోకి వాళ్ళు వెళ్ళి పోయారు. కొంతసేపు మౌనంగా గడిచింది. “వడ్లమన్నాడు వచ్చేశాం” అని రాముడు డిక్లేర్ చేసిందాకా.

ఇక్కడ అర్థరాత్రిళ్ళు దిగేవాళ్లం. వానల్లో అయితే మోకాల్లోతు బురదలో పోవాల్సిందే. చచ్చేవాళ్ళం” అందరికీ తెలిసిన సంగతే చెపుతున్నారు అనసూయమ్మ. ఆ గొంతులో కొత్తగా వచ్చిన ఉత్సాహాన్ని అందరూ గమనించారు. బహుశా ఇక్కణ్ణించే ఆవిడ జ్ఞాపకాలు ప్రారంభమవుతాయి కావును.

వాను మెయిన్ రోడ్డు విడిచి గురివిందగుంట దారి పట్టింది. అదికూడా తారు రోడ్డే, చిన్నదిగా, గుంతలతో ఉంది.

“ఇక్కడే మా చంద్రం బాబాయి తల పగలగొట్టారు. కాలవల దగ్గర గొడవ. బతుకుతాడనుకోలా.”

“మా మావయ్యగారి రెండో అమ్మాయిని ఈ ఊరే ఇచ్చారు. ఇప్పుడేమయి పోయారో.”

“ఇక్కడో మూగాడుండేవాడు. వాడికి అప్పుడప్పుడూ పిచ్చ కూడా పడుతుండేది. మగవాళ్ళూ, పెద్దవాళ్ళు కూడా భయపడే వాళ్ళు రాత్రుళ్ళు ఒంటరిగా రావటానికి ఈ దార్లో , వాడి పిచ్చ ముదిరినప్పుడల్లా.” 

“ఇక్కడో డాబా ఉండాలి. అప్పట్లో అదొక్కటే ఇక్కడ.కోమట్లది.” గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టుగా ఆవిడ చెప్తూనే ఉంది. 

అవన్నీ ఏదో చరిత్రలోకెక్కాల్సిన సంఘటనల్లా చెప్తున్న ఆవిడని ఎవరూ వారించలేదు. ఆశ్చర్యంగా అవన్నీ అందరికీ ఆసక్తి కరంగా ఉన్నాయి. 

అలా సాగుతుండగానే గురివిందగుంట వచ్చేసింది. పక్కగా చెట్టుకిందకి తీసి ఆపేశాడు రాముడు. మెల్లగా అందరూ దిగారు.

తన చిన్న పర్సు తీసుకుని దిగారు అనసూయమ్మ. తన వూరు. తాను చిన్న పిల్లలా పరుగులెట్టి అల్లరి చేసిన ఊరు. ఆయాసంతో నడవలేనేమో నని భయంతో ఇన్హేలర్  ని చిన్న పర్సులో పెట్టుకుని దిగింది.

“ఏమిట్రా ఇదేనా మన వీధి. ఇళ్ళే లేవేమిట్రా” శంకరాన్ని ఉద్దేశించి.

“ఇక్కడెవరూ ఉండట్లేదుటమ్మా. ఉన్న కొంతమంది కూడా వడ్లమన్నాడు వైపుకు కదిలారు. ఎందుకో తెలీదు” జవాబిచ్చాడు శంకరం.

నడుస్తున్న అనసూయమ్మ ఆగిపోయారు.

“ఇదే ఇక్కడే మన ఇల్లు ఉండేది. మట్టి ఇల్లు. పెద్ద వసారా. గుర్తుపట్టలేక పోయాను ఒక్క నిమిషం.” ఓ గొడ్ల సావిడి చూపిస్తూ అంది.

“శశీ మీ అమ్మ పుట్టింది అక్కడే” గొడ్ల సావిణ్ణి చూపిస్తూ చెప్పాడు శంకరం.

“తనెక్కడ పుట్టాడో అడగరా మావయ్యని” తిప్పి కొట్టింది సంధ్య.

శశి ఇద్దరి మాటలు వినకుండా శ్రద్ధగా కాంకార్డర్లో అన్నీ రికార్డ్ చేసుకుంటున్నాడు.

“ఎదురుగా మా పెదనాన్న గారి పెంకుటిల్లు ఉండాలి. వాళ్ళు మేమూ ఇక్కడే నడి వీధిలో నులక మంచాలు వేసుకుని పడుకునే వాళ్ళం ఆరుబయట.” సగం కూలిన ప్రహరీ గోడని చూపిస్తూ అనసూయమ్మగారు. .

ఈ లోగా ఆగిన వాన్నీ పట్నం మనుషులనీ చూసి కొందరు ఊళ్ళో వాళ్ళు చేరారు. ఎవరూ ఏమిటీ అని ఆరా తీశారు. అందులో ఎవరో ఒకరిద్దరు పెద్దవాళ్ళు అనసూయమ్మగారిని గుర్తుపట్టారు… లేదా గుర్తించారు. ఎవరి తాలూకానో.

అరనిమిషంలో వాళ్ళమధ్య కల్సిపోయారు అనసూయమ్మ. ఎక్కడెక్కడివో పేర్లు. వాళ్ళెక్కడా, వీళ్ళెక్కడా, ఆయ్యో ఆయన పోయారా, ఈవిడది ఇప్పుడు ఏవూరూ… మాటలు సాగిపోతున్నాయి.

“ఎందుకులేమ్మా… ఈ ఊరేకాదు… చుట్టు పక్కల చాలా దూరందాకా బ్రాహ్మణ కుటుంబాల్ని వెతికి పట్టుకోవాల్సిందే. ఈ ఊళ్ళో అయితే ఒక్కటీ మిగల్లేదు” ఓ పెద్దావిడ చెప్తోంది.

“అందరికంటే ముందు ఈ ఊళ్ళని వదిలేసింది బ్రాహ్మలే” ఓ పెద్దాయన. అది నిందో, మరోటో తెలీలేదు శంకరానికి.

వ్యవసాయమూ, వృత్తులూ పోయి పల్లెలు వదిలేసి బతుకు తెరువు కోసం పట్టాణాలకి పోవటం సరే, జరుగుతున్నదే. బ్రాహ్మలు నగరాలకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కరణీకాలు పోకముందు, పౌరోహిత్యాలు దొరుకుతున్నప్పుడే ఎందుకు వెళ్ళిపోయారు?

 ‘పల్లెల్లో బ్రాహ్మలు కూడా వ్యవసాయాలు చేశారు” అంటాడు తండ్రి. ఆ వ్యవసాయాన్ని కూడా ముందే వదిలేసింది బ్రాహ్మలే అని ఇక్కడి పెద్దాయన అభియోగం.

“అవసరాలు, అవకాశాలు రెండూ తరిమేశాయిరా మనుషుల్ని పల్లెల్నించి. బ్రాహ్మలెప్పుడూ చదువులవెంటే పరిగెట్టారు. వ్యవసాయం నించీ, కులవృత్తి నించీ కూడా గవర్నమెంటు ఉద్యోగాలు వెతుక్కుంటూ పరిగెట్టారు. అలా అవకాశాల్ని వెతుక్కుంటూ వెళ్ళిన మొదటి వాళ్ళు బ్రాహ్మలు. ఇవ్వాళ కరువుతో కడుపు పట్టుకు పరిగెడుతున్న వాళ్ళు రెండో రకం.” పెద్దగా చదువుకోక పోయినా తల్లి చెప్పిన సాంఘికశాస్త్రం గుర్తుకు వచ్చింది శంకరానికి.

“చెరువు దగ్గరికి నడుద్దాం” పక్కనే ఉన్న చెరువు వైపు అడుగులు వేస్తూ అనసూయమ్మ గారు.

రెండడుగులేస్తే ఆయాసంతో ఇబ్బంది పడే పెద్దావిడకి ఇంత శక్తి ఎక్కణ్ణించి వచ్చిందా? అని ఆశ్చర్యపడుతూ అనుసరించారు అందరూ.

పెద్ద మురుగ్గుంటలా ఉంది. చెరువు.

“శశీ ఇక్కణ్ణించే బంకమన్ను తీసి బొమ్మలూ, గురుగులు చేసే వాళ్ళం” చిన్న పిల్లలా అరిచింది సంధ్య.

“యు మీన్ ఫ్రం దిస్ అగ్లీ లేక్ “ మొహం అసహ్యంగా పెట్టి శశి.

“అప్పుడు బానే ఉండేదిరా. ఈ నీళ్ళే తాగే వాళ్ళం. చెరువులో స్నానాలూ అవీ చేసే వాళ్ళం కాదు. జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం చెరువుని. మా అమ్మ మడి కట్టుకుని, ఆ తడి గుడ్డలతోనే బిందెలతో తాగడానికి నీళ్ళు తెచ్చేది. పాలేళ్ళు కావిళ్ళలో మామూలు అవసరాలకి నీళ్ళు తెచ్చేవాళ్ళు ఇక్కణ్ణించే. గేదెలు ఈనితే జున్ను పాలు బోలెడు మిగిలి పోయేవి… తిన్నంత తినగా. తెల్లవారు ఝామున బిందెతో ఆ పాలన్నీ తీసుకెళ్ళి చెరువులో కలిపేసేది మా అమ్మ.” అనసూయమ్మ గారి జ్ఞాపకాల వరద ప్రవహిస్తూనే ఉంది.

“అయ్యో వేరే వాళ్ళకి ఇవ్వచ్చుకదే” నొచ్చుకుంటూ అంది సంధ్య.

“ఆ రోజుల్లో ఎవరింట్లో పాడిలేదు? అదీకాక అన్ని జున్ను పాలు చూస్తే గేదెలకి దిష్టి తగులుతుందని భయం కూడా…. ఏదో పిచ్చ” అనసూయమ్మగారు. _

 “అమ్మా ఇక్కడ గుడి ఉండాలి కదే” సంధ్య, తనకి గుర్తున్న వైపు చూస్తూ,

 “అటే పద” అంటూ నడిచింది తల్లి.

ఓ చిన్న పాడుబడి, కూలిపోవడానికి సిద్దంగా ఉన్న గుడి. ముందు ఊడ్చి చిన్న ముగ్గేసి ఉంది. లోపలికి తొంగి చూసి ఎవరో దీపం పెడుతున్న ఆనవాళ్ళున్నాయని నిర్ధారణ చేసుకున్నారు అనసూయమ్మ.

పక్కూరినించి వారానికోసారి పూజారి వచ్చి దీపం పెడతాట్ట. గుడిపక్కన ఇంటావిడ రోజూ వాళ్ళ గుమ్మంతో పాటు గుడి ముందు కూడా ఊడుస్తుందట.

“ఇదెంత పాత గుడో తెలుసా? 150 ఏళ్ళకి పైమాటే. స్వాతంత్ర్యానికి ముందు బందరు నించి కాంగ్రెసాయన ఒకరు ఏవో కరపత్రాలు తీసుకుని అన్ని పిల్లలు కాలి నడకన తిరిగి పంచే వాడు. ఆయన ఈ గుడిముందే నుంచుని గట్టిగా చదవటం నాకింకా గుర్తె. ఇలాంటి చరిత్ర ఉన్న గుళ్ళన్నీ ఇట్లా పాడుబడి పోతుంటే… కొత్త కొత్త గుళ్ళు కావల్సి వచ్చాయి ఒక్కొక్కడికి. అయోధ్య పరిగెడతార్ట గుడి కట్టడానికి. దౌర్భాగ్యపు తరంరా మీది” అక్కసుగా అన్నారు అనసూయమ్మ.

“నీకు తెలిసిన రాజకీయాలు ఆపవే” సదాశివరావు గారు తన సహజ ధోరణిలో భార్య ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు.

“మనమిక్కడ ఉండనే ఉండము. ఇక్కడ వాళ్ళు ఎలా ఉండాలో మనమెలా చెప్తామే? ఏం హైదరాబాదు మాత్రం అలాగే ఉందా? ఒకప్పుడు హైదరాబాదు అని ఒక్క బొమ్మలో చెప్పాలంటే అందమైన చార్మినార్ బొమ్మని వేసి చూపించే వాళ్ళు. ఇప్పుడు హైటెక్ సిటీ బొమ్మ చార్మినార్ ని చెరిపేసింది” రెంటికీ సంబంధం ఉందో లేదో గానీ, తనకి తోచింది చెప్పాడు శంకరం.

“సరే ఇహ బయల్దేరదామా?” సదాశివరావు గారు వాచీ చూసుకుంటూ అన్నారు.

ఆయన మాట ఓ ఆజ్ఞలా అందరూ తిరిగి వాన్ వైపు బయలు దేరారు. వాన్ ఎక్కాక అన్నారు అనసూయమ్మ.

“ఒక్కసారి పుల్లపాడులో ఆగుదాంరా… పెద్దగా రాకపోకలు లేకపోయినా, మా బాబాయి వరసయే కుటుంబం ఒకటి ఉంది అక్కడ. ఆ బాబాయి మనవల్లో ఒకడింకా అక్కడే ఉన్నాట్ట. వాళ్ళ ఇంటి పేరూ మా ఇంటి పేరూ ఒకటేట. వాళ్ళింట్లో మా కుటుంబానిది వంశవృక్షం కూడా ఉందిట” ఎప్పుడు, ఎక్కణ్ణించి ఈ విషయాన్ని సేకరించిందో తెలీదు.

“అదేనా ఇంకా ఏమన్నా ప్రోగ్రాములున్నాయా? ముందే చెప్పు సరిగ్గా ప్లాన్ చేసుకుందాం” నవ్వుతూ అన్నాడు శంకరం.

వాన్ మళ్ళీ దారి పట్టింది. అరగంటలో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్లపాడు చేరింది వాన్. శంకరం దిగి వాకబు చేశాడు. ఇంటి పేరు చెప్పి బ్రాహ్మల ఇల్లు అని అడిగిన వెంటనే వచ్చింది సమాధానం. అయిదు నిమిషాల్లో వాన్ ఓ పాత మట్టి ఇంటి ముందు ఆగింది.

అందరూ దిగారు.  పెద్ద మనిషిలా సదాశివరావు గారు ముందుగా ఇంట్లోకి నడిచి పరిచయం చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు హడావిడిగా మంచాలూ, కుర్చీలు వాల్చి వచ్చిన వాళ్ళని కూర్చో పెట్టారు.

మొత్తానికి అనసూయమ్మ గారి బాబాయి వరస పెద్దాయన పోగా, ఆయన మనవల్లో ఒకడైన విశ్వం ఆ ఇంటినే అంటి పెట్టుకుని ఉన్నాడని తెలిసింది. వాళ్ళ అమ్మానాన్న కూడా హైదరాబాదులో వాళ్ళ అన్నయ్య దగ్గర ఉన్నార్ట.

“మీ నాన్న తాత, మా తాత అన్నదమ్ముల వరస. మరీ దూరపు చుట్టరికమేం కాదు.” అనసూయమ్మ చెప్తున్నారు.

మర్యాదలూ అవీ అయ్యాక మొత్తానికి ఇద్దరికీ తెలిసిన బంధువుల పేర్లూ ఊర్లూ కబుర్లూ దొరికించుకున్నారు. ఆ సంభాషణని తుంచలేకా, పాలు పంచుకోలేకా ఇబ్బంది పడ్డారు శంకరం, సంధ్య, లతలు.

“మీ దగ్గర వంశవృక్షం ఉందిట కదా… మీరు మాట్లాడుతూ ఉంటే మేం ఓసారి చూస్తాం” శంకరం మర్యాదగా అడిగాడు.

“అవునవును…. ఆ సంగతే మర్చేపోయాను” అన్నారు అనసూయమ్మ గారు. 

లోపలున్న భార్యని పిలిచి వంశవృక్షం తెప్పించాడు విశ్వం. ఓ పెద్ద కాగితాన్ని చుట్టలా చుట్టి ఉంచారు. దాన్ని జాగ్రత్తగా విప్పిదీసి చూపించారు. అది కంప్యూటర్లోంచి ప్రింట్ చేసిందని తెలుస్తోంది. ప్రింట్లో ఇంగ్లీషులో ఉన్న పేర్లకింద బ్రాకెట్లో తెలుగులో మళ్ళీ రాసి ఉన్నాయి పెన్సిల్తో.

 “మా అన్నయ్య కొడుకు అమెరికాలో ఉన్నాడు.వాడే ఇవన్నీ కంప్యూటర్లోకి ఎక్కించాడు. పెద్దవాళ్ళంతా చదవలేకపోతున్నారని తెలుగులో నేనే రాశాను” వివరించాడు విశ్వం.

సదాశివరావుగారు, అనసూయమ్మ గారు శ్రద్ధగా చూట్టం మొదలెట్టారు. విశ్వంగారు ఆయనకి తెలిసిన కుటుంబం గురించి చెపుతున్నారు.

“…ఇదిగో ఇదో పెద్ద కుదురు మళ్ళీ. ఈయన ఆ రోజుల్లోనే లండన్ వెళ్ళి వచ్చాట్ట.”

“…. వీళ్ళ పిల్లల్లో ఒకాయన వైజాగ్ షిప్యార్డ్ లో ఉన్నాట్ట. ” సంభాషణ సాగిపోతోంది.

అనసూయమ్మ తన తండ్రి పేరు వెతికి పట్టుకున్నారు. తన తండ్రి పేరు, తాత పేరు చూసి అలా పైకి మరో 4 తరాల దాకా ఉన్న ఉన్న బంధాల్ని చూసుకుంది.

ఓ పేరు పక్కనే D.W.M అని బ్రాకెట్లో పెట్టి ఉంది. ఆ కొమ్మ అక్కడితో ఆగిపోయి ఉంది.

“’D.W.M అంటే ఏమిటి” అడిగాడు శంకరం.

“డైడ్ వితౌట్ మారేజ్… పెళ్ళి కాకుండానే చనిపోయారు అని అర్థం” వివరించాడు విశ్వం.

ఆ మాట వినగానే ఆసక్తిగా మరో సారి చూశారు అనసూయమ్మ.” N.M.C అంటే?” ఈసారి అనసూయమ్మగారు.

“నో మేల్ చైల్డ్ … మగ పిల్లలు లేరు అని అర్థం” అన్నాడు విశ్వం.

శంకరానికి అర్థమయ్యింది. వంశవృక్షంలోకి తొంగి చూశాడు. అనసూయమ్మ రి చెయ్యి ఆవిడ తండ్రి పేరుమీద కదులు తోంది. ఆ పేరు పక్కన N.M.C అని బ్రాకెట్లో ఉంది. ఆవిడ తండ్రి పేరుతో కొమ్మ ఆగి పోయింది. మిగతా కొమ్మలు శాఖోప శాఖోపలుగా విస్తరించి ఉంటే, ఇది బోడిగా విరిగిపోయి ఉంది తన తండ్రి పేరు దగ్గర.

 పిల్లల్లేక పోయినా,పిల్లల్లేకుండానే పోయినా, మగ పిల్లల్లేకపోయినా కొమ్మ ముందుకు పోదు!

అతడికి అంటు కొమ్మలు గొర్తొచ్చాయి. ఈ చెట్టు కొమ్మని నరికి, కొంతమేర పై చెక్కు తీసి మరో చెట్టు కొమ్మకి అతికించి, పైన మట్టి కప్పి గట్టిగా కట్టేసేవాళ్ళు. ఈ కొమ్మ ఇమడ గలిగితే ఆ చెట్టు కొమ్మే అయి పూలూ పండ్లు కాస్తుంది. లేదా మాడి చస్తుంది. అప్పుడు మరో కొమ్మని తెచ్చి అతికించేవాళ్ళు. విషయ మేమంటే, అతుకుకొమ్మకు కాసే పండ్లని కూడా కొత్త చెట్టు పండ్లనే పిలిచేవాళ్ళు. అదీ తమాషా! అతుకు కొమ్మలు బతికినా చచ్చినా ఒకటే లెక్కలోకి రావు.

“నలుగురం అక్కాచెల్లెళ్ళం. ఒక్కళ్ళమైనా మగ పిల్లాడిగా పుట్టలేక పోయాం” పైకే అనేసారు అనసూయమ్మ.

“వై?” అడిగాడు శశి.

అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. సమాధానం ఎవరు చెప్పాలా, ఏం చెప్పాలా అని.

“రోలంటే ఇదేరా” శశికి చూపిస్తూ చెప్పింది సంధ్య, వాతావరణాన్ని తేలిక చేయటానికి, సంభాషణ మార్చడానికీ. |

మరో అరగంట తర్వాత అందరూ లేచారు.

“నువ్వు మా ఆడపడుచువమ్మా” అంటూ జాకెట్ గుడ్డ పెట్టి బొట్టు పెట్టారు పెద్దావిడకి. ఆడవాళ్ళందరూ బొట్లు పెట్టించుకుని శెలవు తీసుకున్నారు.

“ఆ వంశవృక్షం కాపీ ఒకటిస్తారూ… తర్వాత పంపించినా సరే” అడిగాడు

శంకరం.

“నా దగ్గర ఇంకా రెండు కాపీలు ఉన్నాయిలెండి. ఫ్లాపీలో కూడా ఉందిలెండి హైదరాబాదులో. ఎన్ని కావాలన్నా ప్రింట్ చేసుకోవచ్చు” అంటూ అప్పటిదాకా చూసిన వంశవృక్షాన్ని చుట్ట చుట్టి శంకరానికి ఇచ్చేశాడు విశ్వం. –

‘కెన్ యూ మేక్ మి ఎ కాపీ ఆఫ్ దట్” తనకో కాపీ విడిగా కావాలని అడిగాడు శంకరాన్ని శశి.

“నువ్వేం చేసుకుంటావురా దీన్ని? సరే బెజవాడలో జిరాక్స్ తీయించి ఇస్తాలే” హామీ ఇచ్చాడు శంకరం.

అంతా మళ్ళీ వాన్ ఎక్కారు. ఏదో అనబోయిన సదాశివరావుగారు భార్య ముఖం చూసి ఆగిపోయారు….

వాన్ విజయవాడ వైపు పరుగుతీసింది… కొత్తగా ఎక్కిన పాత జ్ఞాపకాల బరువుని కూడా మోస్తూ!

* * *

“శశీ! పొద్దున్నే ఏం చేస్తున్నావురా… స్నానం చెయ్యి… దుర్గ గుడి కెళ్లామని చెప్పానా” అమెరికా నించి దిగినప్పటినించీ మళ్ళీ విమానం ఎక్కే దాకా ప్రతి రోజునీ జాగ్రత్తగా ప్లాన్ చేసిన సంధ్య ఏది పూర్తి చెయ్యలేక పోతానో అని ఆత్రంగా ఉంది.

“హాంగ్ ఆన్ మా… జస్ట్ ఎ సెకండ్” తన పనిలోంచి తలెత్తకుండానే శశి.

ఏమి చేస్తున్నాడా అని తొంగి చూసింది సంధ్య. శంకరం ఇచ్చిన వంశవృక్షాన్ని ముందేసుకుని రంగు రంగు స్కెచ్ పెన్లతో కూర్చుని ఉన్నాడు. –

అనసూయమ్మ గారి తండ్రినించి నాలుగు నీలం గీతలు కిందికి గీసి అమ్మమ్మని అడిగి తెలుసుకున్న ఆవిడ అక్కా చెల్లెళ్ళ పేర్లు రాసేసి, మళ్ళీ అనసూయమ్మగారినించి ఓ ఎర్ర గీత గీసి శంకరం అనీ, నీలం గీత గీసి సంధ్య అనీ రాశాడు. మళ్ళీ ఓ ఎర్రగీత సంధ్యనించీ… ఓ నీలం గీత శంకరం నించీ…..

(పుట్టింటిని వెతుక్కుంటూ వెళ్ళి ఆగిపోయిన తాతయ్య కొమ్మని ఆప్యాయంగా తడువుకుని మౌనంగా ఉండిపోయిన అంటుకొమ్మ మా అమ్మకి – రచయిత)

• ఆంధ్రజ్యోతి, అక్టోబర్, 2004

“‘అంటు కొమ్మ’ – అక్కిరాజు భట్టిప్రోలు గారి రచన” కి 2 స్పందనలు

  1. ‘అంటు కొమ్మ’ – అక్కిరాజు భట్టిప్రోలు గారి రచన https://harshaneeyam.in/2021/04/09/akkiraju-garu/‌. చదవడం ప్రారంభించగానే, మనసు తెలియకుండానే, వారితో పాటు ప్రయాణించసాగింది. గురువింద గుంట నుండి వేన్ బయలదేరినా, మనసు ఆ పాత మధుర జ్ఞాపకాల నుండి బయటకు రావడానికి చాలా ప్రయాస పడవలసి వచ్చింది. పుల్లపాడులో కాసేపు ఆగినా, ఆ అనుభూతి వేరు. 3 తరాల కుటుంబ దృక్పథం. వంశవృక్షం వారిలో కలిగించిన చైతన్యం శ్లాఘనీయం. అంటుకొమ్మ అమ్మ తాతయ్య కొమ్మను తడుముకుంటూ ఆగిపోవడం రచయిత శైలికి, భావానికి దర్పణం. కాని చదివిన తర్వాత, మామూలు స్థితికి రావడం కష్టమే. ధన్యవాదాలు

Leave a Reply to హర్షణీయంCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading