రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! ‘నల్లగొండ మల్లి’ గారితో కల్సి

తన డెబ్భైయ్యో ఏట రచనలు మొదలుపెట్టి తన జీవితంలోని అనేక ఆసక్తికరమైన అనుభవాలను అత్యంత ప్రతిభావంతంగా తన రచనల్లో చిత్రీకరించిన దేవులపల్లి క్రిష్ణమూర్తి గారు , ఈ ఇంటర్వ్యూలో తన రచనల గురించి , తనను ఇన్ఫ్లుయెన్స్ చేసిన అనేక విషయాల గురించీ, సాహితీలోకంలో తన పరిచయాల గురించీ వివరించడం జరిగింది.

ఈ ఇంటర్వ్యూలో ఇంకో విశేషం యువ కథా రచయిత మల్లికార్జున్ , హర్షణీయం టీం తో బాటూ క్రిష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చెయ్యడం. క్రిష్ణమూర్తి గారికి , మల్లికార్జున్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెల్పుకుంటోంది.

ముందుగా ఈ ఇంటర్వ్యూ గురించి మల్లికార్జున్ గారి మాటల్లో –

హర్షణీయం పాడ్‌కాస్ట్‌కు స్వాగతం. నా పేరు మల్లికార్జున్. ఇంతకుముందల మీరు ఇదే పాడ్‌కాస్ట్‌ల చానామంది రచయితల మాటలు విని ఉంటరు. ప్రతి రచయితతోటి ముచ్చట మనకు ప్రత్యేకమే. అయితే ఇయ్యాల నేను మీకు పరిచయం చేస్తున్న రచయిత మటుకు ఇంకొంచం ప్రత్యేకం అనొచ్చు. ఎట్ల అంటే – ఈ రచయిత తనకు డెబ్భై ఏండ్లు వచ్చేదాంక ఒక్క కథగూడ రాయలే. అట్లని ఆయనేం సాహిత్యమే తెల్వకుంటగూడ లేడు. చిన్నప్పటిసందే సాహిత్యకారులు, చిత్రకారుల మధ్యన తిరుక్కుంట, సాహిత్యమంటే ప్రాణంగ బతికిన మనిషి. కానీ కథలు రాసుడు మటుకు డెబ్భై ఏండ్లు వచ్చినంకనే మొదలువెట్టిండు. ఇప్పుడు ఆయన వయసు ఎనభై ఒకటి. గత పదేండ్ల కాలంల ఏడు పుస్తకాలు తీసుకొచ్చిండు ఆయన. గుర్తుపెట్టుకోండి ఏడు పుస్తకాలు తీసుకొచ్చిండు. ఆయన పేరు దేవులపల్లి క్రిష్ణమూర్తి.


హర్షణీయం టీమ్ ఆయనతోటి ఇంటర్వ్యూ చేద్దామని నన్నడిగి, ఆయన పుస్తకాలు కొన్ని ఇచ్చిపోయినరు. అయి చదివినప్పుడు నాకు తెలంగాణ జీవితాన్ని చూసినట్టు అనిపిచ్చింది. అంటే ఇప్పటి తెలంగాణేగాదు, సాయుధపోరాటం నుంచి మొన్నటి ప్రత్యేక తెలంగాణ పోరాటం దాంక పోరాటమే ఊపిరిగ బతికిన తెలంగాణ జీవితం ఉన్నది ఈ కథలల్ల.


మొన్న ఆదివారం దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో మాట్లాడినం. డెబ్భై ఏండ్ల వయసులో వచ్చిన రాయాల్నన్న ఆలోచన ఆయన జీవితాన్ని ఎట్ల మార్చిందో అడిగినం. దానికి ఆయన ఒక మాట చెప్పిండు – అది మీరు ఆయన మాటలల్లనే వినాలి. అట్లనే పుట్టిన ఊరిని తల్చుకొని తనకు ఆ ఊరి మీద ఎందుకో ఇప్పుడు ప్రేమ లేదన్నడు ఆయన. అంత మాట ఎందుకు అన్నడు?
ప్రస్తుతం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ల ఉంటున్న ఆయన, తను చూసిన జీవితం, రాయాలనుకున్న కథలు చానా ఉన్నయని, అయితే అవి రాస్తానికి ఇప్పుడైతే ఆరోగ్యం సహకరిస్తలేదని అంటున్నడు.
ఆయన ఆరోగ్యం బాగయ్యి మనకోసం ఇంకెన్నో కథలు రాయాల్నని కోరుకుందాం.
దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో హర్షణీయం ముచ్చట… వినండి!

హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

Leave a Reply