Apple PodcastsSpotifyGoogle Podcasts

‘హెడ్ మాస్టారు ‘ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!

న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్  అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘హెడ్ మాస్టారు ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . 

పుస్తకం కొనడానికి కావాల్సిన  web link

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.

ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.

హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

హెడ్ మాస్టారు

“హెడ్ మాస్టారు పోయారు -”

తంతి చదువుకున్నాడు. కెప్టెన్ రావు. క్షణం సేపు అలాగే నిలబడిపోయాడు, పరధ్యానంగా. 

జేబురుమాలు, పర్సు అందించడానికి వచ్చిన భార్య, బొమలు ముడివేసి అతని వంక చూసింది. వంగి తంతి చదివింది.

“ఎవరీ హెడ్ మాస్టరు?”

 “మా హెడ్ మాస్టారు.”

ఆమె భుజాలు అక్కళించి జేబు రుమాలు, పర్సు బల్లమీద పెట్టి లోపలికి వెళ్ళడానికి తిరిగింది. రావు పరధ్యానంగా అలాగే నిలబడ్డాడు. అతని కళ్లలో వెనకటి స్మృతులు తడిగా మెరిశాయి.

ఇసుకతిన్నెలు గోదావరిని దూరంగా జరిపేశాయి. గట్టుమీదినించి చూస్తే గోదావరి కొనఊపిరితో మెల్లగా అంతిమయాత్ర చేస్తున్నట్టు, నీరసంగా ఏదో గమ్యం చేరుకోడానికి పాకలేక పాకలేక పాకుతున్నట్టు అనిపించేది. కానీ  ఇసుక తిన్నెలు దాటి నీటి అంచుకి చేరుకునేసరికి గోదావరి నిండు ప్రాణంతో ఉత్సాహంగా సాగుతున్నట్టు అనిపించేది. హెడ్ మాస్తారు. అదే రేవులో మొలలోతు నీళ్ళలో నిలబడి ప్రతి ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు.

 రావు – అప్పుడతని పేరు సుబ్బారావు –

 కృష్ణయ్య, రామనాధం, సాంబు, రవి ఫర్లాంగు వెడల్పు నదిని ఈది, అవతలి తిప్పమీదికి పోయేవారు. అక్కడ దోసపాదుల మధ్య వాళ్లు దాచుకున్న ఉప్పూకారం పొట్లాలుండేవి. దోసకాయలు చేతులతోటే చిదిపి, ఉప్పుకారం అద్దుకు తినేవారు. వాళ్ళు పారేసిన దోసగింజల్లోంచి ఎన్నో కొత్త పాదులు మొలిచేవి. నీటి అంచుదాకా అల్లుకుపోయేవి దోసపాదులు. తిరిగి ఈదుకు వచ్చేసరికి హెడ్ మాస్టారి సంధ్యావందనం పూర్తయేది.

“ఏరా? కిష్కింధాపురి అగ్రహారికులు ఏ తోటలు తగలబెట్టొచ్చారు? దోసకాయలా? పుచ్చకాయలా?” అని అడిగారొకనాడు. కుర్రాళ్లంతా బిత్తరపోయారు. తమ దొంగతనం ఆయన కనిపెట్టారని వాళ్లనుకోలేదు.

“లేదండి – ఈత ప్రాక్టీసు…” అంటూ నసిగాడు రామనాథం.

“ఒరే సత్యహరిశ్చంద్రా! ఈత ప్రాక్టీసు మంచిదేగాని, ఆ తోటగలాయన వెంటబడ్డాడంటే కాళ్లు విరగొడతాడు. అప్పుడు ఈత దెబ్బతింటుంది.”

మెతని హాస్యం మాస్టారిది. పొడిచి బాధ పెట్టడు. అతి తాపీగా ప్రతి అక్షరం మెత్తగా ఉచ్చరిస్తూ మాట్టాడేవారాయన.

“ఏవిటోయ్? కెప్టెన్ రావేనా? అంతమెత్తగా ప్రతి అక్షరం ఉచ్చరిస్తున్నావేమిటి?” అని అడిగాడు ఫోన్ లో కెప్టెన్ రెడ్డి. రావు తనలో తను నవ్వుకున్నాడు, హెడ్ మాస్టారి లాగ అనుకోకుండా మాట్లాడినందుకు. 

హెడ్ మాస్టారిని అనుకరించాడు.  నాటకంలో ఒకసారి రావు ధర్మరాజు పాత్ర ధరించి అచ్చంగా

అనుకరించాడు. నాటకమయాక టీచర్లూ, స్నేహితులు అంతా ఎంతో. 

కాని హెడ్ మాస్టారు మాత్రం కళ్లతోటే నవ్వుతూ, “ఒరే సుబ్బులూ! (ఆయనొక్కడే సుబ్బులూ అనేవారు అతన్ని) నన్ను ధర్మరాజుని చేసేశావేవిఁట్రా? అతను వారి దొంగముండాకొడుకు” అన్నారు.

“రెడ్డీ ! ఏర్ పోర్ట్ కి వెళ్ళేప్పుడు ఇలారా. నేనూ వొస్తా.”

 “ఏవిటి విశేషం?” 

“చెప్తా” ఫోన్  పెట్టేసి లేచాడు రావు. డైనింగ్ రూంలోకి వెళ్ళేసరికి అతని భార్య కమల అన్నీ సిద్ధంగా పెట్టింది. కూర్చున్నాడు. బత్తాయిరసం మెల్లగా చప్పరించడం మొదలెట్టాడు, పరధ్యానంగా. కమల అతని వంక అనుమానంగా చూసింది. ఇద్దరి మధ్యా నెల్లాళ్ళుగా మాటామంతీ లేదు. స్పష్టంగా నేరారోపణలు కూడా జరగలేదు. కాని కమలకు ఎందుకు కోపం వచ్చిందో, ఆమె ఎందుకు ఆనాడు పడకగది తలుపు మూసేసిందో, అతనికి తెలుసు. ఆ రోజుని కమల ఏర్పోర్ట్ కి వచ్చింది, అతన్ని ఇంటికి తీసుకుపోడానికి. 

అంతవరకు, ప్రతిసారీ అతను డ్యూటీ ముగించి ప్లేన్ దిగే సమయానికి నిచ్చెనకింద చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉండేది. ఆ రోజు తరవాత ఆమె ఏర్పోర్ట్ కి రాలేదు. రాదని అతనికి తెలుసు.

ఆరోజు, సన్నజల్లు, ఈదరగాలి. కమల ఆ పెనుచీకట్లో అతనికి కనబడలేదు. ఆమె వస్తుందని అతను అనుకోలేదు. అసలు ఆమె సంగతి మరిచిపోయాడు. మిస్ ఉషా వణికిపోతూ అతని భుజం పట్టుకు వేళ్లాడుతోంది. సన్నని మెట్ల మీద ఆమె, అతను సుఖంగా దిగడానికి చోటులేదు. అంచేత ఆమెను ముందు ఒక మెట్టు దింపి, వెనకనుంచి పడిపోకుండా పట్టుకున్నాడు. ఆమె అతని మెడచుట్టూ చెయ్యివేసి, గట్టిగా పట్టుకుంది. ఎక్కడ పడిపోతాడో అన్నభయం, ఎక్కడ జారిపోతదో అన్న ఆత్రం. 

కింద-సమతలం మీద అడుగు పెట్టగానే ఉషకు మైకం కమ్మేసింది (నిజం మైకమే). అతను పడిపోకుండా పట్టుకున్నాడు. ఆమెను వాన్లోకి ఎక్కించి తను ఎక్కాడు. తన రొమ్ముమీద, వదులుగా నరాలు పట్టులేనట్టు వాలింది ఉష. అప్పుడు చూశాడు కమలని. చూడకుండా చూశాడు. విమానం రెక్కపక్కకి, గొడుగుకింద, సన్నని జల్లుతెరలోంచి, ఉషని ఆస్పత్రిలో చేర్చి ఇంటికి చేరేసరికి ఒంటిగంట దాటింది.

పడకగది తలుపులు తియ్యలేదు కమల.

పెద్ద ప్రమాదం తప్పి ఇంచుమించు మృత్యుముఖంలోంచి బయటపడి, శరీరం, మనస్సు అలిసిపోయి, ఇంటికి తిరిగివస్తే తన శ్రీమతి ఇచ్చిన స్వాగతం అది. అదే ఆమె శ్రీముఖం. కింద హాల్లో సోఫాలో నిద్రపట్టలేదు. దొర్లాడు. తన ఆత్మ ఎంత పవిత్రమైనదో, మనస్సులో విమానం అంత ఎత్తులేచి, తలచుకుని బాధపడ్డాడు. కేవలం సోదరీభావంతో, ఆనాడు ఉషని – పెనుతుఫానులో చిగురాకులా అల్లల్లాడిపోతూ స్పృహ తప్పి పడివున్న ఉషని – తను పట్టుకున్నంత మాత్రాన తన భార్య ఎందుకు తప్పు తలవాలి? (హ.హ.తప్పు. నువ్వు ఆమె సన్నని నడుంచుట్టు చెయ్యి వేసి పట్టుకున్నావు. అవసరమైనదానికన్న కాస్త  ఎక్కువ బలంతో దగ్గరగా ఒత్తిపట్టుకున్నావు. ఆమె నీ మెడచుట్టూ చెయ్యి వెయ్యడానికి సగం నీవంక తిరిగినప్పుడు ఆమె ఎడం రొమ్ము మెత్తగా నీ గుండెకు తగిలి పిట్టలా కొట్టుకుంటున్నప్పుడు, నీ కుడిచేతికి ఆమె వెన్నెముక సన్నని కాలవలా జిల్లుమంటూ తగిలినప్పుడు, ఆమె జుట్టు నీ మెడ కింద కితకితలు పెట్టినప్పుడు, నీలో ప్రవహించిన విద్యుత్తు సోదరీభావం!!)

ఆమ్లెట్ తింటూ, వెన్నరాసిన రొట్టి చీలిక కొరుకుతూ కమల వంక చూశాడు రావు. ఆమె అతని పరధ్యానాన్ని అతి తీక్షణంగా చూస్తూ కూర్చుంది, మోచేయి బల్లమీద ఆన్చి, చిరుగడ్డానికి చెయ్యి బోటు పెట్టి.  అతని కళ్లలో అనంతమైన ఆప్యాయత మెరిసింది. అది భరించలేక ఆమె చూపులు పక్కకి చెదిరిపోయాయి.

“నేను ఏలూరు వెళ్లాలి, విజయవాడలో దిగి.” ఆమె అతని వంక చూసింది..

“మా హెడ్ మాస్టారు పోయారు. ఒక్కడే కొడుకు. అమెరికాలో ఉన్నాడు… నాకు తండ్రిలాంటివాడు. నేను వెడితే పాపం ఆవిడ ఎంతో సంతోషిస్తుంది ” . 

అతనికే నవ్వొచ్చింది. అలాంటి భర్త పోయిన తరవాత ఆ ఇల్లాలు సంతోషిస్తుందా? ఇంకోమాట అతనికి తోచలేదు. కమల నవ్వలేదు. ఆమెకు అర్థమైంది.

రావు కాస్త సందేహించాడు. కాఫీ చప్పరించాడు. “ఆవిడికి నా అన్నవాళ్ళెవరూ లేరు…నువ్వూ వొస్తావా!”. 

కెప్టెన్ రెడ్డి వాన్ హారన్ మోగించాడు. సోఫాలోంచి లేచాడు. కమల గదిలోంచి తయారై వచ్చింది. తను అడిగినప్పుడు సమాధానం ఏమీ చెప్పకపోతే రాదనుకున్నాడు. తన వెనక ఇల్లు తాళం వేసి వచ్చి వాన్లో ఎక్కింది. రెడ్డి ప్రశ్నార్థకంగా చూశాడు.

“మా హెడ్ మాస్టారు పోయారు. చూడ్డానికి వెడుతున్నాం ఏలూరు.”

 విమానంలో చోటులేదు. ఎలాగో సంపాదించాడు కమలకి ఒక సీటు, ఏర్హోస్టెస్ పక్కని.

రెడ్డి చాలా నిదానమైనవాడు. ఏవ్రో ని  అతి తాజుగా లేపాడు. గాలిలోని తెల్లని దూదిపరుపుల పైకి. 

అతని వెనక నిలబడ్డాడు రావు.

– అంత ఆకాశానికి విమానం కేంద్రం లాగ అనిపిస్తుంది రావుకి ఎగురుతున్నప్పుడు. పలచని మబ్బుపొరలలోంచి దూసుకుపోతున్నప్పుడు కాస్త జలదరించింది. విమానం. ఆ తాకిడికి టీ తీసుకొచ్చిన ఎయిర్  హోస్టస్ – నాయకి ఆమె పేరు – తూలినట్టు అతనిమీద పడి, “ఓ” అంది నొచ్చుకుంటున్నట్టు, నవ్వుతూ.

“కాస్త ఉంటే టీ మీ మీద పడేది.” 

“టీకన్నా నువ్వు పడ్డమే మేలు” రెడ్డి వ్యాఖ్యానం.

కమలవంక చూశాడు రావు. కేవలం సోదరీభావం అని కళ్ళతో చెప్పబోయాడు. అతనికే నవ్వు వచ్చింది. 

కమల పక్కకి ఇరుక్కుని కూచున్నాడు. 

ఎక్కడికో చూస్తూ చెప్పడం మొదలు పెట్టాడు. 

“మేస్టారు  ఒకనాడు ఇంగ్లీషు పాఠం చెపుతున్నారు. ‘మానవులంతా సోదరులు’ అన్న గాంధీజీ వ్యాసం. – ఆయన అన్నాడు, ‘చూశారర్రా! గాంధీజీ చాలా కొంటెవాడురా.

మానవులంతా సోదరులు  అని ఒక్క మగవాళ్ళని గురించే చెప్పాడు. పుంలింగం ఉపయోగించాడు. ఆడాళ్ళూ మొగాళ్ళూ అందరూ సోదరీసోదరులు కారని ఆయన కనిపెట్టేశాడు – మన సుబ్బులుగాడిలాంటి వాళ్ళని ఆయన ఎందర్ని చూశాడో’ – ఎందుకంటే  నేను, హైస్కూలు రోజుల్లో నేను చాలా అల్లరి చిల్లరగా తిరిగేవాణ్ణి.”

కమల కళ్ళల్లో ఎక్కడో లోతుగా చిరునవ్వు తళుక్కుమని మెరిసి మాయమైపోయింది. ఎయిర్ హోస్టెస్  మీద అసూయపడకుండా చెయ్యడానికి రావు ఈ కథ చెప్పాడని ఆమెకు కచ్చితమైన  అనుమానం. 

అసలు కారణం ఏదయినా , మొదలు పెట్టిన తరవాత రావుకి, అసలు ఎయిర్  హోస్టెస్ గాని, టీ ఘట్టంగాని మనసులో లేదు. హెడ్ మాస్టారు గారు మనసులోనిండి, ఆయన ముఖంమీద ఎప్పుడూ మెదిలే కొంటె చిరునవ్వు అతని పెదవులమీద కొచ్చింది. తియ్యని చిరునవ్వు. కమల మౌనంగా చూసింది, క్రీగంట అతనివంక.

రెండో ఏర్ హోస్టెస్ కొంచెం వాళ్ళవంక తూలి అసందర్భంగా నవ్వింది. కమలకి ఆ నవ్వులో, కాలికింద ఆధారం చటుక్కున జారి పోతున్నప్పుడు కలిగే కడుపులో కాళీలాంటి ఆందోళన, కొంత జులాయితనం ధ్వనించాయి. రావు ఆ నవ్వు విన్నాడో లేదో అతని ముఖం చూస్తే ఆమెకు అర్థం కాలేదు.

చటుక్కుని రావు చెప్పడం మొదలుపెట్టాడు:

నేలలాంటిది కాదు గాలి. నేలమీద నడవటం అలవాటు పడ్డ వాళ్లకి గాలిలో ప్రయాణం చెయ్యడం ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది, ఎంత తరిఫీదు పొందినా సరే గాలి విమానాన్ని మోస్తుంది. కాని చటుక్కుని అప్పుడప్పుడు వొదిలేస్తుంటుంది – చంటి పిల్లాణ్ణి ఎగరేసి వొదిలేసినట్టు. అప్పడు గాలిమీద నమ్మకం ఉన్న వాళ్లకి భయం వెయ్యదు.

కొందరికి పాతికేళ్ళు విమానం నడిపినా ఆ నమ్మకం కుదరదు. ఎప్పటికప్పుడు గాలి, వాళ్లకి కొత్త శత్రువులా అగుపిస్తుంటుంది. కెప్టెన్ రూంగ్తా   చాలా అనుభవంగలవాడు. మంచి సాహసి కూడా. కాని ఆ రోజున అతనికి మతి పోయింది. 

గుర్తుందా? ఆ రోజుని వానాగాలీలో…తనూ వచ్చింది ఏర్పోర్టుకి… ఇంచుమించు అందరూ చచ్చిపోవలసింది. రూన్గ్తా  చీఫ్ పైలట్. తను కో పైలట్. ఎడమపక్క ఇంజిన్ చెడిపోయింది. గాలి విమానాన్ని ఊపేస్తోంది. ఏది చెయ్యకూడదో అది చేశాడు రూంగా, గాలితో యుద్ధానికి దిగాడు. గాలి ప్రాకృతిక శక్తి ముందు మనిషి చేసిన యంత్రం ఏపాటిది? 

కాగితం పడవలా లుంగలు చుట్టుకు పోతోంది విమానం. 

రావు హెచ్చరించాడు. 

రూన్గ్తా  ‘షటప్’ అన్నాడు. రావుకు చిరాకు హెచ్చింది. అన్యాయంగా 80 మంది ప్రాణాలు పోతాయి. ఏర్పోర్టు ఇంకో అరమైలుంది. విమానం పడిపోతోంది. ఏర్పోర్ట్ కి ఇవతల చిన్న గుట్ట – దానిమీద ఎర్రదీపం అతివేగంగా మీదికొచ్చి పడిపోతోంది. “ఎత్తు, పైకెత్తు” అని అరిచాడు రావు. ఉష అరుస్తోంది. ఆమెకు పిచ్చెక్కిపోతోంది. ఇంకొక్క రెండు నిమిషాల్లో గుట్టకి ఢీకొంటుంది  విమానం. చటుక్కుని చెయ్యెత్తి రూన్గ్తాని  గవదల మీద కొట్టాడు శక్తికొద్ది – రూన్గ్తా  పక్కకి పడిపోయాడు దెబ్బకి – అతన్ని సీట్లోంచి తోసేసి రావు స్టీరింగ్ పట్టుకొన్నాడు. పూర్తిగా త్రాటిల్  ఇచ్చి విమానాన్ని పైకి లేపాడు. 

 గుట్లమీది ఎర్ర దీపానికి అయిదారు గజాల ఎత్తుని విమానం జుంయని దూసుకుంటూ లేచింది. తరవాత విమానాన్ని తాజు చేశాడు, ఇప్పుడింక దిగడానికి వీల్లేదు. రన్‌వే సగం దాటిపోయింది.

 రావు విమానాన్ని ఆకాశంలో ఒక చుట్టు తిప్పి- అతి ఒడుపుగా కిందికి దించాడు. రెండు  చక్రాలే నేలకి తగిలి తూలింది విమానం. తరవాత రెండోపక్క చక్రాలు ఆనాలు తగ్గించి అదుపులోకి తెచ్చాడు రావు. 

ఆఖర్ని బ్రేకులు వేసి ఆపేసరికి, అంత చలిలోనూ  అతనికి ముచ్చెమటలు పోశాయి. ఉష పిచ్చిదానిలా మీదపడి గట్టిగా పట్టుకుంది. ఆమె  ఒదలలేదు. హాస్పిటల్ కి చేర్చి మత్తుమందిచ్చే దాకా వొదలలేదు. నిట్టూర్చాడు రావు…

“నేలమీది నీతినియమాలు, మంచి మర్యాదలు గాలిలో పని చెయ్యవు. రూలు ప్రకారం రూన్గ్తా ని ధిక్కరించడం నేరం. అతడు ప్రయాణికులందరినీ తన కంగారు వల్ల  చంపేసినాసరే, నేను అడ్డుపడకూడదు. రూలు అతిక్రమించి ఆ రోజుని అందరీ కాపాడాను… రూల్సు ధిక్కరించడం, ఆ సమయానికి నా మనసు చెప్పినట్టు చెసెయ్యడం నా స్వభావం, చిన్నప్పటినించీ. 

అంచేతే నిత్యజీవితంలో నేను అందరికీ  పెద్ద సమస్యనైపోతూ వచ్చాను. 

విమానం ఎగురుతున్నప్పుడు, అది ప్రత్యేకలోకం. నేలకు దానికి సంబంధం లేదు. అప్పుడు నేను రాజుని. నేనక్కడ ఎప్పుడూ తప్పు చెయ్యను…. నేలమీద దిగిన తరువాత చేసేవన్నీ తప్పులే.”

తన్ను చూసికూడా ఉషని వాన్లో ఎక్కించుకుని వెళ్ళిపోయాడా రోజు రావు. ఆ విషయమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని కమలకు తెలుసు. కాని రావు స్పష్టంగా క్షమార్పణలాగ చెప్పలేదు. తను అంతమంది ప్రాణాలు ఆ రాత్రి కాపాడాడు గనుక, సొంత భార్యని అలక్ష్యం చేసి, ఉషని వాటేసుకోవడానికి తనకి అధికారం ఉన్నట్టు తన చేతలు సమర్థించుకుంటున్నాడని కమల తిక్కగా అనుకుంది. కనీసం ఆమె అలా అనుకుంటున్నట్టు రావుకి అనిపించింది. ఒక జాలినవ్వు ఆమె వైపు ప్రసరించాడు. అందులోని ఆప్యాయతకి ఆమె చెక్కులు ఎర్రబడ్డాయి.

 హెడ్ మాస్టారు అన్న మాటలు గుర్తు కొచ్చాయి.

“ఆడది సాటి ఆడవాళ్ళని నమ్మదు. తన మొగుడితో చనువుగా ఉండే ఆడవాళ్ళని అసలే నమ్మదు. మొగుణ్ణి ఎప్పుడూ నమ్మదనుకో.”

రావు కథ పూర్తిచేశాడు.

ఉష  నిద్రపోయింది. తను హోటల్ కొచ్చాడు. గదిలో కూర్చుని రాశాడు. జరిగిందంతా రాయలేదు. తను క్రమశిక్షణ తప్పాననీ, కెప్టెన్ రూన్గ్తాని   అవమానించి, అతన్ని కొట్టి, కంట్రోల్స్ తన చేతిలోకి తీసుకున్నాననీ, ఆ నేరానికి ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని, అతిక్లుప్తంగా రాశాడు. తను చేసిన పనికి, కెప్టెన్ రూన్గ్తా  ను హృదయపూర్వకంగా క్షమార్పణ కోరుతున్నాననీ కూడా, రాశాడు. 

నాలుగు గదులు అవతలున్నాడు రూన్గ్తా . 

రావు వెళ్ళాడు. తలుపు మూసివుంది. మెల్లగా తట్టాడు. సమాధానం రాలేదు. గడియారం వంక చూసుకున్నాడు. రాత్రి రెండయింది. 

ఇప్పుడెందుకు లేపడం అనుకున్నాడు. 

వెనక్కి తిరుగుతుంటే, “కమిన్” అని గొంతు వినిపించింది. 

మధువుతో బరువెక్కిన  గొంతు. తలుపు తెరిచి లోపలికెళ్లాడు రావు. రూంగా కళ్లు ఎర్రగా మధువుతో బరువెక్కిన గొంతు. తలుపు తెరిచి లోపలికెళ్లాడు రావు, ఉన్నాయి.

“ఏమయ్యా! హీరో?”

గొంతులో ఎత్తిపొడుపు లేదు.రూన్గ్తా  అతనివంక ఎంతో సేపు చూశాడు. అతని మనస్థితి అర్థం కాలేదు. బాగా తాగినా శ్రుతిమించలేదు రూన్గ్త. 

 మెత్తగా  చిరు నవ్వు నవ్వుతూ  రావు తను రాసిన క్షమాపత్రం అతని చేతిలో పెట్టాడు. 

రూన్గ్తా  అతనివంక చూశాడు. మెల్లగా చదివాడు. మాట్టాడ కుండా దీపంవంక చూస్తూ ఒక క్షణం  కూర్చున్నాడు. చటుక్కుని ఆ కాగితం చింపి బుట్టలో పారేశాడు. రావు వంక తిరిగి శూన్యంగా చూశాడు. 

మెల్లగా అతని పెదవులమీద ఎంతో బరువైన చిరునవ్వు .. అంతులేని విషాదంతో మొలిచింది. 

“రావ్! నాతో ఒక్క పెగ్గు వేస్తావా? లేక అలిసిపోయావా?” 

రావు కూర్చున్నాడు. 

తనే సీసా తియ్యబోతుంటే – రూన్గ్తా  ఆపాడు. “నో నో నువ్వు నా అతిథివి.” – రూన్గ్తా  విస్కీ గ్లాసులో పోశాడు. 

రావు తీసుకున్నాడు “చీర్స్” అన్నాడు.

మౌనంగా తన గ్లాసు ఎత్తి ఒక్కగుక్కలో తాగేశాడు రూన్గ్తా. 

రావుకి ఇబ్బందిగా ఉంది. గ్లాసు కింద పెట్టి రూన్గ్తా  మెరుస్తున్న కళ్ళతో అన్నాడు రావు వంక చూస్తూ.

“రావ్! నీకింత ఔదార్యం ఎలా వచ్చింది?…ఎనభై లక్షలు విలువచేసే విమానం కాపాడావు. విలువ కట్టడానికి వీల్లేని 80 ప్రాణాలు కాపాడావు. పైగా నాదగ్గరకొచ్చి క్రమశిక్షణ తప్పినందుకు ఏ శిక్షయినా అనుభవిస్తానని కాగితం రాసిచ్చావు….నన్ను గట్టిదెబ్బే కొట్టావు. నాలుగు రోజులదాకా వాపు తగ్గదు. రేపు మెడ బిగిసిపోతుంది. మరింత బాధ పెడుతుంది. కాని నాకు తగలవలసిందే. ఆ సమయంలో నాకు నిజంగా మతిపోయింది. కంగారు పడి పోయాను. ఆ ఎర్రదీపం అసలు నాకు కనబడలేదు. అదీగాక, ప్రయాణికులు, నేను, నువ్వు అందరు చచ్చిపోవడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశాను. అయినా అహం. అందరితో చచ్చిపోవడానికి నాకు హక్కుందనుకున్నాను. ఊహలు, అహం కలగాపులగం అయిపోయాయి. నువ్వు కలగజేసుకున్నావు. కంట్రోల్స్ తీసుకున్నావు. కిందపడి లేచాను. నిన్ను తోసేద్దామని కోపంగా లేచాను. కొండవాలు జర్రున కిందికిపోతోంది. విమానం పైకి లేచింది. ఎర్రదీపాన్ని దాటేసింది. ఒక ఇంజన్ పనిచెయ్యని విమానాన్ని ఎంత ఒడుపుగా, ఎంత ఆత్మస్టెర్యంతో నువ్వు అదుపులో పెట్టావో చూశాను. పిట్టలా ఎంత చల్లగా తిప్పావు విమానాన్ని! తిప్పుతూనే దింపావు. ఒక పక్క చక్రాలమీద దిగిన విమానాన్ని ఎంత సున్నితంగా సరిజేశావు! నీ వంకే చూస్తున్నాను. నీకళ్ళలో తీక్ష్ణత  తప్ప మరొకటి లేదు. అప్పుడర్థమైంది నాకు – నువ్వు కొట్టిన దెబ్బలో పొగరు లేదు, అహంకారం లేదు. నామీద కక్షగాని ఈసుగాని లేదు. గత్యంతరంలేక కొట్టావు. ఇంత నిబ్బరం నీకుందని నేననుకోలేదు. నువ్వు అందరితోటీ ఛలోక్తులు చెపుతూ, జులాయిగా బాధ్యత తెలియకుండా తిరిగే మనిషివని అంతవరకు నా నమ్మకం. ఆ కులాసా వెనక, ఆ తేలికతనం వెనక, ఎంత లోతుందో ఆ అయిదారు నిమిషాల్లో నా కర్ధమైంది.”

రావు ఈ పొగడ్తకి చాలా ఇబ్బంది పడిపోయాడు. రూన్గ్తా వంక  చూడలేకపోయాడు. డ్రెసింగ్ టేబిల్ మీద పెద్ద అద్దంలో తన ప్రతిబింబం అతనికి  కొత్తగా కనబడింది. చటుక్కుని అది హెడ్ మాస్టరుగారి ముఖంగా మారిపోయింది. 

 చల్లని చూపులు – లోకమంతా తెలిసి, అమాయకంగా కనబడే చూపులు – ఆచిన ఆయనదే. కాని హెడ్ మాస్టారు ఎంతగా తనలో భాగమైపోయాడో అతనికి అప్పుడరమే కాని తను హెడ్ మాస్టారు ఎన్నటికీ కాలేడు. ఆయన తనలాగ ఎన్నడూ ఇరుకులో ప పడ్డవాళ్ళని అతి తాపీగా ఇరుకులోంచి బయట పడేస్తారు. తనలో ప్రవేశించి, ఆయన తను ఇరుకుల్లో పడ్డప్పుడు ఎన్నోసార్లు కాపాడారు. ఆ రాత్రికూడా ఆయనే తను ఆవేశించాడు.

“రావ్? నేనింక పైలట్ గా పనికి రాను. రిజైన్ చేసేస్తున్నాను.” 

“నాన్ సెన్స్!” అన్నాడు రావు. రూన్గ్తా  మెత్తగా నవ్వాడు.

“రావ్! యుద్ధంలో పైలట్ గా పనిచేసినవాణ్ణి. ఎన్నో అపాయాలు దాటి బతికినవాణ్ణి. పైలట్ గుండె ఎలా ఉండాలో, నరాలు ఎలా పనిచెయ్యాలో, అపాయం ఎదురైనప్పుడు ఎంత తాపీగా బుర్ర పనిచెయ్యాలో నాకు అనుభవమే. ఆ లక్షణాలు నాలో లోపించాయి. విమానం అల్లల్లాడినప్పుడు కాళ్లకి చెమటపట్టి చల్లబడిపోతే ఇంక విమానం నడపడానికి ఆ వ్యక్తి పనికిరాడు. రేపు చేర్మన్ ని కలుసుకొని, ఎగ్జిక్యూటివ్ శాఖలోకి మార్చమని అడుగుతాను. మార్చకపోతే రాజీనామా ఇచ్చేస్తాను.”

రూన్గ్తా  చెప్పింది నిజమని రావుకి తెలుసు. అతడు నిట్టూర్చాడు. రూన్గ్తా  చిరునవ్వు నవ్వుతూ వెళ్ళి మంచంమీద పడుకున్నాడు. .

‘క్షమించు. ఇంక నిద్ర ముంచుకొస్తోంది. కావాలంటే నువ్వు కూర్చో. ఇంకో సీసా ఉంది. నువ్వు నా వద్దకు వస్తావనుకోలేదు. వచ్చావు, అదే సంతోషం.”

రావు “గుడ్ నైట్” చెపుతుంటేనే రూన్గ్తా  నిద్రపోయాడు…

కమల అతని వంకే చూస్తూంది. అతని చెయ్యి ఆమెనడుం చుట్టింది. ఆమె బెదురుతూ ఇటూ అటూ చూసింది. ఏర్ హోస్టెస్లు ఇద్దరూ ఎక్కడో అవతలున్నారు.

ప్లేన్ దిగుతోంది. “బెల్ట్ లేదుగా ఇక్కడ.” అని రావు ఆమె నడుం గట్టిగా పట్టుకున్నాడు.

పాపం ఆ ఎయిర్ హోస్టస్లకి  ఈ అదృష్టంపోయింది ఈ రోజున నామూలంగా,” అంది కమల. 

కాని ఆ మాటల్లో ఎత్తి పొడుపు ధ్వనించలేదు. చక్రాలు రన్‌వేకి తగిలి విమానం ఒక్కసారి ఎగిరినప్పుడు ఆమె ఊపిరి గొంతులో అడ్డుపడింది. భర్త చెయ్యి తన నడుంచుట్టూ ఉన్నందుకు మనసులో ఎంతో కృతజ్ఞత, సంతృప్తి నిండిపోయాయి. మెల్లగా విమానం ఆప్రన్వెపు సాగుతుంటే రావుచెయ్యి తీసేశాడు.

ఏలూరుకి టాక్సీలో పోతున్నప్పుడు, రావు జేబులోంచి తన చిన్న డైరీ తీసి మొదటి పేజీ తిప్పి, కమలకి చూపించాడు. ఆ డైరీ ఆమె ఎప్పుడూ తెరిచి చూడలేదు. ప్లాస్టిక్ పొరకింద ఒక పాత ఫోటో వుంది.

“ఎవరు?”

“హెడ్ మాస్టారు.”

ఏలూరు  వెళ్ళేదాకా ఆ ఫోటోవంక చూస్తూ కూర్చుంది కమల. 

మాస్టారి శవం హాల్లో ఉంది. కాళ్ళవద్ద భార్య కూర్చుని వుంది. కాస్త దూరంలో జనార్దనరావుగారు, ఆయన  కుమార్తె నాగుమణి ఉన్నారు. రావుని శూన్య దృక్కులతో చూసింది మాస్టారి భార్య . ఏడుపుకి కూడా అతీతమైన దిగులు ఆ చూపులలో ఉంది.

“సుబ్బారావ్ కదూ,” అన్నారు జనార్ధనరావుగారు, అతన్ని ఆనవాలు పడుతూ. నాగుమణి అతని వంక చిత్రంగా చూసింది. అందులో ఆప్యాయత మెదిలింది.

“సుబ్బారావ్! సూర్యారావు (మాస్టారి కొడుకు) ఇంకా మూడు రోజులదాకా రాడు. రేపు దహనం చెయ్యకపోతే – పాడయి పోతుందన్నాడు డాక్టరు. ఏం చెయ్యడానికి పాలుపోవడం లేదు.” అన్నారు జనార్ధనరావుగారు.

రావు మేస్టారి భార్యవద్దకు వెళ్ళాడు. కమల ఆమె పక్కకు వెళ్ళి కూర్చుంది.

“అమ్మగారూ!… కొరివి నేను పెడతాను…. మీకేమన్నా అభ్యంతరమా?…మీ బిడ్డలాంటి వాణ్ణి,” అన్నాడు పూడిపోతున్న గొంతుతో.

ఎంత సేపో అర్థం కానట్టు అతనివంక చూసింది ఆ ఇల్లాలు – ఆఖరికి. “నీ ఇష్టం బాబూ” అంది.

జనార్దనరావుగారు అన్ని ఏర్పాట్లు చేశారు. శవాన్ని తీసుకుపోతుంటే మాస్టారి భార్యకి దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించింది –

రావు చనిపోయిన మాస్టారి ముఖం వంక ఒక్కసారికూడా చూడలేదు. చూడ్డానికి మనసు రాలేదు. మాస్టారి సజీవమూర్తే  అతని మనసులో మిగలాలి. ప్రాణంలేని, తళుకులేని మృతముఖాన్ని అతడు చూడలేడు. 

నిప్పుకుండ పట్టుకుని ముందు నడుస్తుంటే, పరిచితమైన వీధి మలుపులు అతన్ని మూగగా పలకరించాయి. కాలవ, పడవలరేవు, చీకటితోటే స్నానానికొచ్చి వెనకపక్కనించి పడవల్లోకి ఎక్కి అరిటిపళ్లు, బెల్లపు అచ్చులు దొంగిలించిన రోజులు – మరీ చిన్నతనపు రోజులు. 

ఆ తరవాత కొవ్వూరు పంపింది అమ్మ, హైస్కూల్ చదువుకి, హెడ్ మాస్టరి దగ్గరికి. అతను నాన్నగారికి మంచి స్నేహితులట. విపరీతమైన తన అల్లరి చూసి అమ్మ ఎంతో దిగులుపడేది. తను ఎన్నటికైనా బాగుపడతాడా అని. హెడ్ మాస్టారింట్లోనే పక్కగదిలో తనమకాం – ముగ్గురు సహాధ్యాయులతో. ఎవరన్నా అధికారం ప్రదర్శిస్తే తిరగబడే స్వభావం. 

మొదట్లో మాస్టారు అంతుపట్టలేదు అతనికి! సగం నెరిసిన తల, పలచగా కత్తిరించిన బూడిదరంగు మీసం, బంగారు కళ్లజోడు! రాత్రి పదైనా పదకొండయినా, అరుగుమీద కూర్చుని ఏదో చదువుతుండేవారు. ఓరోజున సర్కసు రెండో ఆటకి పోయివొచ్చాడు రహస్యంగా, ముగ్గురు సహాధ్యాయులూ బుద్ధిమంతులు. వాళ్లు రెండో ఆటకి సర్కసుకి వెళ్లరు. తన్ను గురించి మాస్టారికి చెప్పరు కూడా. కాని పొద్దున్న గోదావరికి స్నానానికి పోయేసరికి మాస్టారడిగారు. –

“ఏరా సర్కసు బాగుందా?” అని. ..

కంగారునించి తేరుకుని, తను వెళ్లలేదని బుకాయిద్దామని నిర్ణయించుకునే సరికి  ఆయన వెళ్లిపోయాడు. ఆ తరవాత గ్రహించాడు, ఆయన ముఖంలోకి చూస్తూ, అడిగితే  తను అబద్దం చెప్పలేడని.

“చితి మండుతోంది. కాలువగట్టున పచ్చికమీద జనార్దనరావు గారూ, తనూ

“అంత స్పష్టంగా ఆలోచించగలిగిన వ్యక్తి, దానికి తోడు అంత హృదయము మనిషి, నా ఎరికలో మరొకడులేదు. అమ్మాయి చదువుకోసం నేను ఏలూరు మార్చేను  ప్రాక్టీసు 

ఆయన రిటైరయి ఇక్కడే స్థిరపడ్డారు. కొడుకు పై చదువులకి పై దేశాలు పోయాడు. 

ఇంక కొవ్వూరులో ఎవరున్నారు?

 “ప్లీడరుగారూ! నాకో చిన్న ఇల్లు  చూసి పెట్టండి. నాకూ మా ముసిలిదానికి, అద్దె ఆట్టే ఇచ్చుకోలేం.” అన్నాడు. ఈ ఇల్లు  నేనే కుదిర్చాను…. రోజూ కలిసే వాళ్లం. అమ్మాయంటే ప్రాణం ఇద్దరికీ.”

“నాగుమణికి పెళ్ళయిందాండీ?” సందేహిస్తూనే అడిగాడు. జనార్దనరావుగారు అతని వంక చిరునవ్వు నవ్వుతూ చూశాడు.

“కాకుండా ఎలా ఉంటుంది… నీ వయసుది… నిన్నూ దాన్ని కూడా ఆయనే కాపాడాడు…ఆ గొడవయాక. నిన్ను అన్ని విధాలా నాశనం చెయ్యాలని, నేనెంత పట్టుదలగా ఉన్నానో, అదంతా మహా చమత్కారంగా వొదలగొట్టేశాడు. నీకే కాదు, మా అమ్మాయికీ మంచిదే అయింది…”

జనార్ధనరావుగారు బ్రహ్మసామాజికులు. బోగంవాళ్లు. ఈయన బి.ఎల్. పాసై పెళ్ళి చేసుకొని, చెల్లెళ్లందరికీ పెళ్ళిళ్లు చేసి, వృత్తి మానిపించేశాడు. నాగుమణి పెద్దకూతురు. మా క్లాసే. ఎప్పుడూ మా నాన్నారు, మా నాన్నారు, అంటూ ఆయన్ని గురించి గొప్పలు చెప్పేది. ఆయన తరచు ఉపనిషత్తులలోంచి సూక్తులు ఉదహరిస్తూ తన శ్రుతపాండిత్యం ప్రదర్శించేవాడు. సవర్ణ హిందువులందరికీ ఆయనంటే వెటకారం. మా తెలుగుమాస్టారు ఆయనమీద ఎన్నో ఛలోక్తులు విసిరేవాడు.

రామనాథం, సాంబు స్కూలు వదలి పెట్టాక ఆడపిల్లల వెనకాల నడుస్తూ ఎన్నో విసుర్లు విసిరేవారు.

“ప్లీడరుగారికి నాన్నా రెవరో?” 

 “చెప్పడం కష్టం – ఎంతమందిలోంచి ఏరుకోవాలో.”

 “ఊరి పెద్దల్లో చేరాలని పాపం ఆయన తాపత్రయం .”

 “ఎలుకతోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలు పేగాని తెలుపు కాదు.”

నాగుమణి కోపంతో, అహంకారంతో వినేది. తమందరినీ పురుగుల్ని చూసినట్టు చూసేది. ఒకనాడు తెలుగుమాస్తారు స్టాఫ్ రూంలో వెటకారంగా అన్నాడు –

“భారతంలో ప్రముఖులంతా ఏ తల్లికి ఏ తండ్రికో పుట్టినవాళ్ళే. మన ఊళ్ళో కొందరు ప్రముఖులూ అంతే” ,

అప్పుడే స్టాఫ్ రూంలోకి  వచ్చిన హెడ్ మాస్టారు – తెలుగు మాస్టారు ఆయన్ని చూడలేదు – చల్లగా చిరునవ్వు నవ్వుతూ అన్నారు –

“మీతండ్రి, నాతండ్రి ఎవరో కచ్చితంగా మనం మాత్రం ఏం చెప్పగలం మాస్టారూ? మన అమ్మలు చెప్పినమాట ఒక్కటే మనకి ఆధారం. తండ్రి ఎవడైతేనేం?

మనం ఎలాంటివాళ్ల మన్నది ముఖ్యం. ఫలాని తండ్రి కొడుకైతే మనకి ఒలికిందిలేదు,

కాకపోతే పోయిందీ లేదు.”

సాయంత్రం జనార్దనరావుగారి ప్రసంగం స్కూల్లో, హెడ్ మాస్టారే పిలిచారు.

తక్కిన మాస్టార్లు  ఎవరికీ ఇష్టం లేదు. ఆరోజుని జనార్దనరావుగారి మీదా, హెడ్ మాస్టారిమీదా అందరికీ ఎంతో తిక్క పుట్టుకొచ్చింది. జనార్దనరావుగారు ప్రసంగం ప్రారంభించగానే అందరం  అల్లరి  మొదలు పెట్టాం. ఆయన కాస్త చిరాకుపడ్డాడు. హెడ్మాస్టారు ఏమీ అనకుండా కుర్చీలో  అలాగే కూర్చున్నారు. 

జనార్ధనరావుగారి ధోరణి కుంటుపడింది. ఆయన చెప్పదలుచుకున్నది చెప్పలేకపోయారు. 

మేం చెప్పనియ్యలేదు, ఆఖర్ని హెడ్ మాస్టారు లేచారు . ఒక్క అరనిమిషం అలాగే నిలబడ్డారు. మేం గుండెలు కొట్టుకుంటూ ఎదురుచూశాం, ఏం చెపుతారో అని. 

మెల్లిగా వినిపించీ వినిపించని గొంతుతో అన్నారు.

“మన అందరి తరపునా జనార్దనరావుగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన చెప్పినదానికి కాదు. మనలనందరినీ అంత సహనంతో చూసినందుకు. ఆయనకి క్షమాపణ కూడా చెప్పుకుంటున్నాను. నేను ఆధ్వర్యం వహిస్తున్న ఒక విద్యా సంస్థలో, కుర్రవాళ్ళకి సంస్కారం నేర్పలేకపోయినందుకు.”

ఒక్క క్షణం ఆగారు. ముందు వరసలో కూర్చున్న మాస్టర్లంతా ముఖాలు ముడుచుకున్నారు. మాకందరికీ హెడ్ మాస్టారి మనసు ఎంతగా నొచ్చుకుందో, ఆయన మెల్లిగా ప్రతి అక్షరం తూచి అంటున్నప్పుడే అర్థమైపోయింది. 

ఆయన మనసు నొచ్చుకోడానికి కారణం – ఎందుకో – జనార్దనరావుగారని మా కుర్రతనపు తర్కానికి తోచింది. దానికితోడు అందరం వెళ్ళిపోతున్నప్పుడు నాగుమణి తండ్రితో మమ్మల్ని గురించి నానా మాటలు అంది. కోతిమూక అంది. జులాయిమూక అంది. 

నాకు నాగుమణి మీద కోపం నసాళాని కంటింది. ఆమెయే కావాలని హెడ్మాస్టారిచేత మమ్మల్ని అందరినీ తిట్టించినట్టు. జనార్ధనరావుగారి మీద కూడా కోపం రాలేదు. కేవలం నాగుమణి మీదే.

హెడ్మాస్టారి మాటల్ని ఆమె మహాదారుణంగా వ్యాఖ్యానించింది. ఒంటరిగా ఆమె దొరికినప్పుడు, “వెలయాలా నీ విలువెంత?” అని పాటలాగా పాడ్డం ప్రారంభించాను. ఆమె ముఖం ఎర్రబడిపోయేది.

 కాని మాస్టర్లు ఎవరికీ ఆమె నా మీద ఫిర్యాదు చెయ్యలా. 

తనమీద సానుభూతి చూపే మాస్టర్లు ఎవరూ లేరనుకుందేమో. 

హెడ్ మాస్టారికి చెపుదామంటే, నేను ఆయన ఇంట్లో ఉంటున్నాను. ఆఖరికి ఒకనాడు అతి వెటకారంగా నవ్వుతూ, “కుక్కలు మొరిగితే ఏనుక్కి లెక్కా?” అంది.

ఆఖరి క్లాసు. హిస్టరీ మాస్టారు శ్రోత్రియుడు, సాధువు. ఎప్పుడూ కొంటెప్రశ్నలు వేస్తుండేవాళ్లం. ఆయన సమాధానం చెప్పలేక తలకిందులై పోయేవాడు. కృష్ణదేవరాయునికి ఉంపుడు కత్తెలెందరని అడిగాడు సాంబు. నేను అడిగించాను. ఆయన ముఖం కందగడ్డ అయిపోయింది. ఆయనకి రాయలంటే అమిత గౌరవం. క్లాసులో ఏదో పెద్ద అనాచారం జరిగిపోయినట్లు బాధపడ్డాడు. అదృష్టవశాత్తు బెల్ కొట్టారు. టక్కున లేచి వెళ్ళాడు, అవతలికి. 

అంతలో గుర్తొచ్చినట్టుంది. ఆడపిల్లలు అవతలికి వెళ్లేవరకు ఆఖరి క్లాసు తీసుకున్న టీచర్ ఆగాలి. ఆయన గుమ్మం అవతల ఆగినట్టున్నాడు. నేను చూడలేదు.

మగపిల్లలంతా దొమ్మీగా అవతలికి పోతుంటే ముందు బెంచీలో ఆడపిల్లలు నలుగురూ  ఆగారు.

 నేను ఆఖరికి మిగిలాను. అప్పటికేం ఉద్దేశం లేదు. ఊరికినే ఆగాను.  చూసి వెటకారంగా నవ్వింది. నాకు తిక్క పుట్టుకొచ్చింది. ఆడపిల్లలు అవతలి కదులుతున్నారు. ఆఖర్ని నాగుమణి, ఆమె వెనుక నేను. 

చటుక్కున ఆమె జడ లాగాను. కెవ్వుమని అరుస్తూ, ఆమె నామీద పడిపోయింది. నడుం చుట్టూ చెయ్యి వేసి  గట్టిగా పట్టుకున్నాను. ఎందుకు పట్టుకున్నానో నాకే తెలియదు. బుర్ర పని చెయ్యలేరు

అంతా ఏదో కలలో జరిగినట్టు జరిగిపోయింది. ఆడపిల్లలంతా గొల్లుమన్నారు. “మాస్టారూ!” అంటూ అరిచారు. మేస్టారు గుమ్మంలో కొచ్చి, “ఒరే, ఒరే – తుంటరి వెధవా!” అన్నారు. చటుక్కున వొదిలేసి ఒకటే పరుగు, మేస్టారి పక్కనించే.

గోదావరి గట్టువెంట దిక్కు తెలియకుండా పరుగెత్తాను, రైలువంతెన వంక. ఎక్కి  రాజమండ్రి వైపు పరుగెత్తాను. ఎందుకో తెలియదు. వెనకాల రైలేదో వంతెన ఎక్కింది. నన్ను తరుముకొస్తోంది. అపాయంనించి పారిపోవడానికి దిక్కుతెలియకుండా పరుగెత్తాను,  గోదావరి స్టేషన్ చేరేదాకా.  నేనెక్కడున్నానో కూడా గుర్తులేదు. గుండెలు ఒకటే కొట్టుకుంటున్నాయి. ప్లాట్ ఫారం చివర చతికిల పడ్డాను ఊపిరి అందుకోడానికి ప్రయత్నిస్తూ. కొన్ని యుగాలు గడిచిపోయినట్టు అనిపించింది. కాని నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి పదికూడా కాలేదు. చీకట్లో గోడపక్క నిలబడి వింటున్నాను. 

జనార్ధనరావుగారు ముందుగదిలో హెడ్ మాస్టారితో ఆవేశంతో చెపుతున్నారు. –

“అటువంటి తుంటర్లకి పుట్టగతులు లేకుండా చేసెయ్యాలండి, రస్టికేట్ చేసెయ్యాలి.”

“చేసేస్తానండి. వెధవకి ఇంకెక్కడా అడ్మిషన్ లేకుండా రాసిపారేస్తాను. హిస్టరీ

మాస్టారి రిపోర్టు రానివ్వండి” అన్నారు హెడ్ మాస్టారు. 

నాకు ముచ్చెమటలు శాయి. కాళ్లల్లో సత్తువ పోయింది. గోడ ప్రక్కనే చతికిలబడ్డాను. జనార్దనరావుగారు వెళ్ళిపోతూ నన్ను చూడలేదు. నేనసలు ఆ ప్రాంతాన ఉన్నానని ఆయన అనుకుని ఉండరు. కాంపౌండు గేటుదాకా ఆయన్ని సాగనంపి, తిరిగి వస్తూ చూశారు హెడ్మాస్టారు. ఆగారు. లేచాను. ఛెళ్లున చెంప మీద కొట్టారు. తూలిపడిపోయాను. మళ్ళీ లేవలేకపోయాను. ఆయన ఆత్రంగా దగ్గరగా వచ్చారు. నేను లేవలేదు. మెల్లిగా ముఖం ఎత్తి ఆయన వంక చూశాను – ఆయన ముఖం చీకట్లో నాకు అగపడలేదు. నా ముఖంమీద వీధిదీపం పడుతున్నట్టుంది. ఆయన చూశారు. అతి మెల్లిగా అన్నారు.

“పోయి పడుకో…”

ఆ తరవాత ఏం గుర్తుకొచ్చిందో “అన్నం తిన్నావా?” అని అడిగారు. 

నేనేం మాట్లాడలేదు. లోపలికి రమ్మన్నారు. బొమ్మలా నడిచి వెళ్ళాను.

“ అడుగో వెధవ అన్నం తినలేదనుకుంటాను. కాస్త మజ్జిగ అన్నం పెట్టు” అన్నారు భార్యతో 

ఆమెకీ గొడవ తెలుసో లేదో నా కర్ధం కాలేదు.

 నేనొద్దన్నాను. 

“ఏడిసావు,తిను” అన్నారు హెడ్ మాస్టారు.

 తింటూ ఆయన ముఖం వంక చూశాను. పాపుల్ని దలిచి మన్నించే దేవతావిగ విగ్రహంలాగ కనిపించారాయన.

భోజనం చేశాకఇవతలికొచ్చాను. ఆయన పడకకుర్చీలో పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు.

కాస్త దూరంలో నిలబడ్డాను. ఎన్నో చెప్పాలనుకున్నాను. ఏం చెప్పాలో తోచలేదు…

“ పోయి పడుకో” అన్నారు నావంక ఒక క్షణం చూసి. 

మాట్టాడకుండా వెళ్ళి పడుకున్నాను. 

నా సహాధ్యాయులు గుసగుస లాడుకున్నారు నన్ను చూసి. తరువాత నిద్ర పోయారు.  నాకు నిద్రపట్టలేదు. అర్థంలేని అందోళన. అంతులేని ఆలోచనలు. నాగుమణికి  క్షమార్పణ చెప్పాలి. నన్నెలాగూ రస్టికేట్ చేస్తారు. అప్పుడు నడివీధిలో ఆ నాగుమణిని గట్టిగా వాటేసుకుంటాను. అసలు ఎందుకామెను పట్టుకున్నానిలా! మాస్తారు నన్నేం చెయ్యదలుచుకున్నారో? స్కూలంతా అల్లరైపోయింది. 

నన్ను చూసి అందరూ నవ్వారు. రైలువంతెన మీదెక్కి దూకేస్తాను. ఈదుకుపోతాను ….ఎక్కడికి? ఇంకా  నన్ను ఎద్దేవ పట్టిస్తారు. ఎందుకు చేశానీ పాడుపని? నన్ను చూసి నవ్వినవాళ్ళని బ్లేడ్  పెట్టి గీరేస్తాను. అమ్మ గోలెట్టేస్తుంది, ఈ సంగతి తెలిస్తే. పారిపోతాను. కనిపించకుండా పారిపోతాను. రాత్రి కలత నిద్రలో దిక్కు తెలియకుండా, పారిపోతూనే ఉన్నాను. –

మర్నాడు పొద్దున్న గోదావరికి స్నానానికి పోలేదు. గది దాటి బయటికే పోలేదు. తలుపు దగ్గరగా వేసుకుని కూర్చున్నాను. నా రూంమేట్సు నన్ను పలకరించలేదు. నేనేదో అపాయకరమైన జంతువునన్నట్టు చూశారు నా వంక. అందులో కొంత సానుభూతి. కొంత భయం, కించిత్తు వెటకారం లేకపోలేదు. 

అవతల అరుగు మీద హిస్టరీ మాస్టారు.

“వాణ్ణి ఏంచేసినా పాపంలేదండీ, తుంటరి వెధవ. పబ్లిక్ క్లాసులో! ఆరి వీడి దుంపతెగ! ఎంత ధైర్యం వీడికి! వాజ్ఞసలు…”

తలుపు సందులోంచి చూస్తున్నాను. హిస్టరీ మాస్టారు మూడు పేజీల రిపోర్టు రాశారు. హెడ్ మాస్టారు చదువుతున్నారు. మొదటి పేజీ చదివి తక్కిన రెండు పేజీలూ ఊరికే తిప్పేశారు.

“సరే మాస్టారు! పైకి రాస్తాను” అన్నారు.

మూడు రోజులు, నాలుగు రోజులు. వారం. 

రోజూ సాయంత్రం జనార్దనరావుగారొచ్చి అడుగుతారు.

“ఏమిఁటి మాస్టారూ? ఇంత దారుణం చేసిన కుర్రవాడి మీద చర్య తీసుకోకపోతే ఇంక స్కూల్లో క్రమశిక్షణ ఏం నిలబడుతుంది? మీ రిపోర్టుకి ఇంకా సమాధానం రాకపోవడమేమిటి?”

“రెడ్ టేప్ అండి ఆఫీసు ఒక్కటి సవ్యంగా పనిచేస్తోందా మన దేశంలో? మనం పంపించేవన్నీ బుట్టదాఖలు చేసి పారేస్తారు!” –

“రిమైండర్ రాయండి. వాణ్ణి సర్వనాశనం చేస్తేగాని ఈ కుర్రకారుకి బుద్ధిరాదు.”

 “రాస్తానండి, ఈ వేళే రాసేస్తాను . డి.ఇ.ఓ.కి ఒక కాపీ కూడా పెడతాను.”

రోజూ పొద్దున్న హిస్టరీ మాస్టారొస్తారు. ఏంచేశారంటూ. అదే సమాధానం చెపుతారు హెడ్ మాస్టారు. నేను వింటూ ఊహించుకుంటాను. హెడ్మాస్టారు రిమైండర్ రాస్తారు. పోస్టులో పడేస్తారు. సాయంత్రం మెయిల్లో ప్రయాణం చేస్తుంది, ఏలూరుకి. డి.ఇ.ఓ. చదువుతాడు. అమ్మని పిలిచి చెపుతాడు.

 అమ్మ ఎంత తలకిందులై పోతుందో. అసలు ఉత్తరం ఏలూరు చేరకూడదు. నిడదవోలు చేరకుండానే రైలు పడిపోతుంది.  టపా పెట్టి అంటుకుపోతుంది. ఉత్తరాలన్నీ కాలిపోతాయి. లేకపోతే డి.ఇ.ఓ. ఆఫీసు  గుమాస్తా చూసి చదువుతాడు. చిన్నప్పుడు ఇలాంటి ఇరుకులోనే పడుంటాడు గుండె కరిగిపోతుంది. ఆ రిపోర్టు తగలబెట్టి పారేస్తాడు. 

నాలుగు రోజులు నాగుమణి కూడా  క్లాసుకి రాలేదట. నా గుండెలో తప్పుచేసిన వెలితి. ఆమెను తలచుకుంటేనే నాలో ఏదో ముడుచుకు పోతుంది.

పదిరోజుల తరువాత ఒకనాడు ఉదయమే హిస్టరీ మాస్టారు చాలా చిరాకుగా వచ్చారు. హెడ్ మాస్టారితో –

“ఏమిఁటిది మాస్టారు? మీరసలు వాడిమీద రిపోర్ట్ పంపలేదట?”

 క్షణం ఆలోచించి హెడ్ మాస్టారన్నారు. “అదే ఆలోచిస్తున్నానండి, పంపనా వొద్దా అని.”

“ఆ! ఇలాంటి లుచ్చాని, పుండాకోర్ని దండించకుండా వొదిలి పెడితే ఇంకేవఁ న్నా ఉందాండి?”

“మాస్టారూ! వాడేవఁన్నా చైనావాడా అండి, మనం అంతకక్ష గట్టడానికి? కుర్రవెధవ ఏదో ఆవేశంలో ఒక తప్పు చేసి పారేశాడు.” —

“అదేవిఁటి మాస్టారూ? అలా అంటారు! అలా అయితే ఇక మంచీ మర్యాదా…”

“మాస్టారూ? వేలాది సంవత్సరాలు ఘోరతపస్సు చేసి బ్రహ్మానుసంధానం తప్ప మరొక లక్ష్యం లేదనుకున్న మహర్షులే – ఒక్క అప్సరస కనబడేసరికి గోచీలూడదీసుకుని వెనకబడ్డారంటే, వీడొక లెక్కాండి? మీ సంగతి నాకు తెలియదుగాని మాస్టారూ! పిటపిట లాడుతున్న ఆడపిల్ల పక్కనించి పోతుంటే, ఆమె వంక చూడకుండా ఉండలేను. సంఘం, సంసారం, నీతినియమం రాక్షసుల్లాగ నా మనస్సుని ఆరికట్టకపోతే, చటుక్కుని వాటేసుకునే వాణ్ణే , ఈ వయసులో కూడా. ఎటొచ్చి అలా చేస్తే – ఆ అమ్మాయి సంగతి దేవుడెరుగు-నాకు తీరని నష్టం కలుగుతుందని నాకు తెలుసు గనక ఆ పని చెయ్యను. వాడికి ఆ విచక్షణ లేదు పాపం. ఏదో చేసేశాడు. ఇప్పుడెంత బాధపడుతున్నాడో దేవుడి కెరుక. ఇక జన్మలో ఇటువంటిది కాదుగదా, ఎటువంటి తప్పుడుపని చెయ్యడు. ఈ దెబ్బతో వాడు మామూలు మనిషవుతాడు. మంచి మనిషవుతాడు. వాడికా అవకాశం లేకుండాజేసి మనం కక్షగట్టి వాడిని దుంపనాశనం చేశామంటే, వాడికి ఇప్పుడున్న విచక్షణ కూడా పోతుంది. ఇంతవరకు వాడు పడ్డ బాధలు చాలు మాస్టారూ. అంతకన్న పెద్దశిక్ష మనం ఏమి విధించలేం …. మీరే చూడండి.”

హెడ్ మాస్టారు తలుపు తోస్తారని నేననుకోలేదు. గుమ్మం పక్కని కూలబడిపోయి కూర్చున్నాను, మోకాళ్ళమీద తల పెట్టి. తలయెత్తలేకపోయాను. అలాగే భూమిలోకి కనిపించకుండా మాయమైపోతే బాగుండేదనిపించింది. హిస్టరీ మాస్టారు చూశారు.

మెల్లిగా  ఇద్దరూ అవతలకి వెళ్ళిపోయారు.

సాయంత్రం ప్లీడరుగారొచ్చారు. రోజు రోజూ రోజు రోజూ ఆయన ఆవేశం కాస్త తగ్గుతున్నట్టు అనిపించేది నాకు.  

హెడ్ మాస్టారు ఆయన్ని కూర్చో బెట్టి వేదాంత చర్చలోకి దింపేవారు. రాజకీయాలు మాట్లాడేవారు.

క్రమంగా ఆయన కూతురికి జరిగిన అవమానాన్ని గురించి  కాక రావడం తోటే ఏదో చర్చ ప్రారంభించేవారు. నా కవేవీ అర్ధమయేవికావు. అసలు నా మనస్సు అవేవీ వినేది కాదు. నన్ను గురించిన ప్రస్తావన ఏమన్నా వస్తుందేమోనని ఆత్రంగా – గుండెలు పీకే ఆదుర్దాతో – చెవులప్పగించి వింటుండే వాడిని. 

రాత్రి తొమ్మిది  దాకా జస్టిస్ పార్టీ  బ్రాహ్మణాధిక్యాన్ని గురించి చర్చ సాగింది. ఆయన వెళ్ళడానికి లేచారు. హెడ్ మాస్టారుగూడా లేచారు.

– ప్లీడరు గారూ! ఒక విషయం . నేను సాహసించి ఒక పని చేశాను. అంటే చెయ్యవలసిన పని చెయ్యలేదు… నేను సుబ్బారావు మీద రిపోర్టు పైకి పంపలేదు.”

“ఆ! !” అన్నారు ప్లీడరుగారు..

నా చెవుల్లో ఒకటే హోరు. ఒత్తిడి ఏదో చటుక్కున తగ్గిపోయినట్టు హెడ్ మాస్టారు చెపుతున్నారు.

“మీరు ఈ సంగతి పైకి రిపోర్టు చేస్తే, నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. నిజంగా నేను ఈ విషయం దాచకూడదు. తప్పే. కాని మరో దృష్టినించి చూస్తే ఇది తప్పు కాదనిపించింది. ఇదే వొప్పు అనికూడా అనిపించింది… నా మనసులో ఉన్నది చెపుతాను. నేను ఉపాధ్యాయుణ్ణి. తప్పుదారిలో పడ్డ కుర్రాళ్లని మంచిదారికి మళ్ళించాలి. అంతేగాని వాళ్ళని సర్వనాశనం చెయ్యకూడదు. నేను వెంటనే రిపోర్టురాసి ఉంటే ఈ పాటికి వాణ్ణి రస్టికేట్ చేసేసేవారు. వాడికి తగిన శిక్షే, నిజమే. కాని వాడు ఇంక మంచి దారిలో పడడు. బరి తెగిస్తాడు. వాడింక ఏం చేసినా మన అదుపులో ఉండడు. రేప్పొద్దున్న నడి బజారులో మీ అమ్మాయిని పట్టుకుని అవమానపరచొచ్చు. మీరతన్ని జైల్లో పారేయించొచ్చు. కాని అమ్మాయిమీద, ఏ తప్పూ చెయ్యకుండా, అన్యాయంగా మచ్చపడుతుంది – అధమం అల్లరవుతుంది… ఈసారి మనం ఉదారంగా క్షమించి వదిలేశామనుకోండి. వాడు మళ్ళీ ఇలాంటి పొరబాటు ఒక్కనాటికీ చెయ్యడు. మీరు పట్టుబడితే నేను రిపోర్టు రాయకతప్పదు.”

“మీరీ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు?”

 “అప్పుడు మీరు మంచి ఆవేశంలో ఉన్నారు….”

ఆ తరువాత సంభాషణ నాకు వినిపించలేదు. ఇద్దరూ దూరంగా వెళ్ళిపోయారు. రెండోదారంట బయటపడ్డాను. ఒకటే పరుగు. దమ్ము అందకపోయినా ఆగలేదు. ప్లీడరుగారికన్నా ముందు, వారి ఇల్లు చేరుకున్నాను. అరుగుకింద చీకట్లో ఆయాసపడుతూ నిలబడ్డాను. కాస్త దమ్ము నిలబడ్డాక తలుపుతట్టాను. ప్లీడరుగారి భార్య తలుపు తీశారు.

“ఎవరు బాబూ?” ఆమె నా ముఖం ఎరుగదు.

తలవంచుకుని, “సుబ్బారావు” అన్నాను. ఆమె ఊపిరి ఎగపీల్చుకోవడం వినపడింది. 

ఎవరో పచ్చిరౌడీ ఓ కూనీకోరో అర్థరాత్రి ఇంటిమీద పడితే భయంతో ఊపిరంతా బయటికి పోయినట్టు. ఇంతలో నాగుమణి వచ్చింది.

“నువ్వా!!” అంది.

“చాలా పెద్ద తప్పు చేశాను. క్షమార్పణ చెప్పుకోడానికొచ్చాను. క్షమించమని నిన్నడగడం లేదు. నాకా అధికారం లేదు. క్షమార్పణ చెప్పుకుంటున్నాను. నేను అంత దారుణం ఎందుకు చేశానో నాకే తెలియదు….”

నా వెనక గుమ్మం కింద నిలబడి ప్లీడరుగారు అంతా విన్నారో ఏమో, నేను వెళ్ళిపోవడానికి తిరిగేసరికి నా ముందు ఉన్నారు. నేను పక్కకి తప్పుకున్నాను. ప్లీడరుగారు పైకి రాలేదు. అక్కడే గుమ్మం కిందే నిలబడ్డారు. 

“మీరూ హెడ్ మాస్టారూ మాట్టాడిందంతా విన్నానండి… ఒకవేళ మీరు నన్ను రస్టికేట్ చేయించినా… మీ అమ్మాయినేమి అల్లరి పెట్టనండి. ఆమెకేసి కన్నెత్తయినా చూడను. అంచేత… మీకా సంకోచం అక్కర్లేదు. మీ ఇష్టం. మీకేది న్యాయమైనదని తోస్తే అలాగే చేయించండి.”

ఆ రాత్రి నేను తిరిగి గదికి వెళ్ళలేదు. స్కూలుదాకా నడిచి అక్కడ మెట్లమీద కూర్చున్నాను. అలాగే అక్కడే నిద్రపోయాను.

మర్నాటినుంచి స్కూలుకి మామూలుగా వెళ్ళాను. నన్నెవరూ ఏమీ అనలేదు. కుర్రాళ్ళుకూడా ఆ సంగతి మరచిపోయారు. కష్టపడి చదివి, ఆ సంవత్సరం స్కూలు ఫైనలు పాసయాను. హెడ్ మాస్టారికి కృతజ్ఞత చెప్పుకోడానికి అదొకటే మార్గమనిపించింది. నన్ను నిజంగా ఒక మనిషిని చేశానన్న సంతృప్తి అయినా ఆయనకు మిగలాలి.

ఆ తరువాత ఏ సమస్య వచ్చినా నేనేం చేస్తే హెడ్ మాస్టారు మన్నిస్తారు – అన్న ప్రశ్నే నాకు మార్గదర్శి అయింది. ఆ తరవాత ఆయనే నాలో ఒక భాగమైపోయారు. నా అసలు వ్యక్తి చేసే అవకతవకలన్నీ ఆ రెండో వ్యక్తి జాలితో సానుభూతితో విమర్శించేది, మన్నించేది –

-హెడ్ మాస్టారి అరుగుమీద కూర్చుని ఆ రాత్రి కమలతో ఈ కథంతా చెప్పాను. లోపల నాగుమణి అమ్మగారికి తోడుపడుకుంది. తెల్లవారగట్ల మసక వెలుగులో కాకులు కూస్తున్నాయి.

రాత్రి కమల వంక చూశాడు. ఆమె ఎప్పుడో నిద్రలో మునిగిపోయింది – ఆమె తల అతని తొడమీద ఉంది. ఆమె ముఖంలో మెత్తని చిరునవ్వు. తన అవకతవకలన్నీ గ్రహించి, మన్నించిన చిరునవ్వు.

హెడ్ మాస్టారి చిరునవ్వు.

*******************************

ప్రసిద్ధ కథకుల కథలు:

ప్రసిద్ధ కథకుల ఇంటర్వ్యూలు:

Leave a Reply