Apple PodcastsSpotifyGoogle Podcasts

వాకాటి పాండురంగరావు గారి ‘మందీ – మరొక్కడు’

హర్షణీయంలో వినబోయే కథ పేరు ‘మందీ – మరొక్కడు’ వాకాటి పాండురంగరావు గారి రచన. ఈ కథను అందించడానికి అనుమతినిచ్చిన అపరాజిత గారికి కృతజ్ఞతలు.

సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో  జన్మించారు. ఆయన  ఆనందవాణిఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు.  విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు.

పాండురంగారావుకథలు మిత్రవాక్యం చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిదిదిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు.

ముందుగా ఈ కథ గురించి –

“కథ చెయ్యాల్సిన పని వర్తమానం నించి భవిష్యత్తు గా మారే, పరిణామ క్షణాన్ని (that fleeting moment) , పట్టుకునేందుకు ప్రయత్నించడం. దానికుండే పరికరాలు , similes, metaphors, images, magic realism మొదలైనవి.. అనుకూలమయిన వాటిని ఎన్నుకుని వాడడం లో రచయిత ప్రత్యేకత ప్రతిభ వెల్లడవుతుంది” – శ్రీ. మధురాంతకం నరేంద్ర

‘మందీ – మరొక్కడు’ వాకాటి పాండురంగరావు గారి ‘అపరాజిత’ అనే కథాసంపుటిలోనిది.

ఈ కథ రాసింది, 1964-65 మధ్య కాలంలో. అవి, మధ్యతరగతి కుటుంబాలు , వ్యవసాయాధారిత జీవనాన్ని వదిలేసి, ఉద్యోగాల కోసం పట్టణాలకు తరలి వెళ్లడం అనే మార్పు మొదలైన రోజులు.

కథలో ముఖ్య పాత్రధారి వేణుగోపాల్. అతని ‘ఐడెంటిటీ క్రైసిస్’ ఈ కథలో ముఖ్యాంశం.

అతను ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చిన్న ఉద్యోగి. వేణుగోపాల్ ఇబ్బందులు , ఆఫీస్ కు వెళ్ళడానికి బస్సు కోసం క్యూ లో నిలబడ్డప్పుడు మొదలౌతాయి. బస్సుల నిండా జనాలే. రెండు బస్సులు అసలు స్టాప్ లో ఆగకుండా వెళ్లిపోతాయి. మూడో బస్సు ఆగినా అతను ఎక్కేలోపల, బస్సు నిండిపోయి వెళ్ళిపోతుంది.

ఈ గోలలో సగం చచ్చి ఆఫీసు కు వెడితే, అక్కడ ఆఫీసులో తోటి ఉద్యోగుల ప్రవర్తన విసుగు పుట్టిస్తుంది. బాస్ రూంలోకి వెళ్తే , ఆయన మాటల్తో తను ఒక మనిషిని కాదేమో అన్న అనుమానం కలగచేస్తాడు వేణుగోపాల్ కి.

సాయంత్రం ఇంటికి వెళ్లబోయే ముందర అవసరార్థం ఏదో ఒక షాపు లో అడుగుపెడితే, అక్కడి అనుభవం అతని ఇబ్బందిని తీవ్ర తరం చేస్తుంది.

అక్కడ్నించీ ఇంటికి వెళ్లే లోపల , అతనికి సాంత్వన ఎలా లభిస్తుంది అని వివరిస్తూ కథను చక్కగా ముగిస్తారు రచయిత.

ఒక సాధారణమైన జీవితం గడిపే మనిషి రోజూ వారీ అనుభవం నించి కథను సృష్టించారు రచయిత. ఈ క్రమంలో తను చెప్పదలుచుకున్న విషయాన్ని మనకు స్పష్టంగా అవగతం అయ్యేలా చేస్తారు.

కథలో ముఖ్య పాత్రధారి మానసిక స్థితిని క్రమంగా గట్టిపడే బంకమన్ను తో పోలుస్తారు రచయిత.

పాండురంగరావు గారు ఈ కథగురించి మాట్లాడుతూ –

“మన నాగరికత విస్తరించిన కొద్దీ వ్య క్తిగా మానవుడు సంకుచించుకు పోతున్నాడు. ఇంకా మన దేశంలో ఈ “మంది” తనం అన్న భూతం నూటికి నూరుపాళ్ళూ విస్తరించలేదు గాని, దాని లక్షణాలు మాత్రం స్పష్టంగా అగుపడుతూనే ఉన్నాయి.” అన్నారు.

అరవై ఐదు ఏళ్ల క్రితం ఈ కథ రాస్తూ , రాబోయే కాలంలో సమాజంలో వచ్చే మార్పు ను గురించి ముందుగానే సూచించారు పాండురంగరావు గారు.

హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-seaso

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

మందీ – మరొక్కడూ

“తీరప్ప రం రం , తీరప్ప రం రం “

అన్న స్వీయ కృతిలోని ఒక్కొక్క చరణాన్నీ ఒక్కో స్థాయిలో పాడుతూ తలదువ్వుకుంటున్నాడు వేణుగోపాలం.

హఠాత్తుగా పాట ఆపి వంటింట్లోకి పరుగెత్తాడు. “లలితా !” 

పూజ చేసుకుంటున్న లలిత ఇటు తిరిగింది. 

“ఇటురా : ఒక నిమిషం…. అర్జెంటు….”‘అయిదు నిముషాలయింది. ఆమె వచ్చింది.

అతడి కళ్ళల్లోని వెలుగు చూచింది. ఇందాకటి సంగీతం కూడా విన్నది మరి. 

“ఏవిఁటి” అని అడిగింది నోరు తెరవక నే.

“సువార్త. సుందరీ | సువార్త! ఇవాళ నీ నాధుడి చేతికి రెండు వందలా నలభై రూపాయ లొస్తాయి.”

“ఎక్కడి నుండి !”

“మహా ఘనత వహించిన సర్కారు వారినుండి ! వారు మన ఇంక్రిమెంటు ఇవ్వకుండా రెండేళ్ళు నిద్దరోయి, ఈ మధ్య మేలు కున్నారు.”

“ఓహో!”

“అంచేత ఈ సుమూహూర్తాన నేను నీకు ఏదయినా కొని పెట్టదలచుకున్నాను. ఏం కావాలి కోరుకో !” అని గర్వంగా, భక్తుడి ఎదుట ప్రత్యక్షమయిన మహావిష్ణువులా అడిగాడు వేణు.

 ఆవిధంగా అతడు అడగగలిగిన అవకాశాలు వాళ్ళ జీవితాలలో ఎన్నో రాలేదు.

తన భర్తమీద జీవితం చల్లని చూపు చూడలేదని – ఎందరో భార్యల్లాగే లలిత కూడా నమ్మేది.

ఇప్పు డతడి చూపులో, మాటలో చిందుతున్న సంతోషం ఆమె గమనించింది. నచ్చిన బొమ్మతో ఆడుకుంటున్న బిడ్డను చూచిన తల్లిలా నిండిపోయింది ఆమె మనసు.

““ఊ • కోరుకో ! ఒక జత బంగారు గాజులు • ధర్మవరం పట్టుచీర • మహాబలిపురం యాత్ర – ఏది కావాలో కోరుకో.”

“నా కేమీ వద్దండీ • చింతా చికాకూ లేకుండా, హాయిగా నవ్వుతున్న మీరే నాకు అన్ని 

బహుమతులూను.”

“వ్రత రత్నాకరం చదవడం మానేయి.” 

“నిజంగానే నాకేమీ వద్దు “

“అట్లా కాదు.. నేను ఏదో ఒకటి కొన దలచుకున్నాను నీకు.”

 “అయితే మీ ఇష్టం – మీకేది నచ్చితే అది తీసుకురండి.”

“అదుగో ఆ మాటంటేనే నాకు మండుకొస్తుంది. నిన్నొక మనిషిగా పిలిచి ఏమికావాలని అడుగుతున్నానా ! నీ ఇష్టానిష్టాలు తెలుపకుండా నా ఇష్ట ప్రకారం కొనమంటా వేం ? నీకు మనసు లేదూ!

నీ కొక అభిప్రాయం ఉండదూ ? నువ్వొక వ్యక్తివి కావూ ! అన్నీ నాకు వదిలేస్తే ఏమిటని నీ అర్ధం ….. నువ్వు ఒక మనిషివి. నా నీడవు కావు. అది తెలుసుకో.” అని గబ గబా బట్టలు మార్చుకో సాగాడు వేణుగోపాలం.

“ఏమిటో బాబూ . నాకేమీ తెలియదు.” అంటూ వడ్డనకుపక్రమించింది లలిత.

భోజనం ముగించి బయటపడి  తొమ్మిదిన్నరకు బస్టాండ్ లో విల్చుని ఉన్నాడు. వేణుగోపాలం,  డెబ్బై తొమ్మిదిమంది గల ‘క్యూ’లో డెబ్బయిఆరవ వాడుగా.

పది అయింది. మూడు బస్సులు రావడం, వాటిలో రెండు ఆగక పోవడం, ఆగిన ఒకదానికోసం ‘క్యూ’ చచ్చి బ్రతకడం – అన్నీ జరిగాయి.

నాలుగవ బస్సు వచ్చి సగం జనం తగ్గేసరికి పదీ పది అయింది. వేణు ఆఫీసు పదింబావుకు మొదలవుతుంది.

ఆఫీసుకు వెళ్ళి చెక్కు అందుకుని బ్యాంకికి పంపాలి. ఆ వేళ శనివారం. పన్నెండు దాటితే బ్యాంకు వాళ్ళు డబ్బులివ్వరు. ఇవాళ ఆ డబ్బు లందకపోతే చాలా ఘోరంగా ఉంటుంది. నిప్పులమీద నిల్చున్న వాడిలా చిందులు తొక్కాడు వేణుగోపాలం. 

తన ప్రక్క నున్న, సూటు వేసుకున్న బట్టతలాయనతో అంతవరకూ సైప్రసు వ్యవహారమూ అదీ మాట్లాడిన వాడల్లా ఢామ్మని విషయం మార్చేసి “చీ ! వెధవ దిస్సులూ, వెధవ జనమూ…. కారు గనుక ఉంటే ఈ చండాలమంతా లేదు. అనుకున్న చోటికి, అనుకున్న వేళకు వెళ్ళి పోవచ్చు.” అన్నాడు వేణు.

సూ. వే. దిట్టతలాయన ఒకసారి తలమీది చర్మాన్ని రుమా లుతో తుడుచుకుని “ప్చ్ ” అన్నారు. 

“అంటే ఏవిఁటని మీ ఉద్దేశం” అని కళ్ళతో అన్నాడు-ఖాళీగా వెళ్ళిపోతున్న టాక్సీని పిలవడానికి డబ్బుల్లేని వేణుగోపాలం.

ఆ టాక్సీని గమనించని సూ. వే. బ . త. చెప్పసాగారు – “అబ్బే, కారులున్నా లాభం లేదండీ ! నాకు చూడండి. ఒకటికి రెండు కార్లున్నాయి. కాని ఏం లాభం….. ఒకటేమో  మాఆవిడ తీసుకువెళ్తుంది. ఇహ రెండోది నాది. దానిని మా అబ్బాయి తీసుకు వెళ్ళి లారీకి గుద్దించాడు. అంచేత ఇదిగో ఇక్కడ ‘క్యూ’లో ఏడుస్తున్నాను …. గనుక కారుల విషయంలో మీ నమ్మకం ఉత్త భ్రమ మాత్రమే అని చెప్పగలను …. కారు ఉంటే హాయిగా, జోరుగా, ఉషారుగా వెళ్లి పోవచ్చనికదూ అన్నారు… అది చాలా పెద్ద అచ్చు పొరబాటు. కారు అంటూ ఉంటే మీ ఒక్కరికే ఉండదుగా అడ్డమైన వాళ్ళందరికీ ఉంటాయి కార్లు. ఆ తర్వాత మరి కార్లు నడవ డానికి రోడ్లు. కావాలి— రోడ్లు ఆ రోడ్లమీద అడ్డదిడ్డంగా సవాలక్ష కార్లు. ట్రక్కలు, దిస్సులు, సైకిళ్ళు, మనుష్యులు వీటన్నిటిని మించి ఎర్ర దీపాలు ఉంటాయి. చూశారు. అందుకని కారున్నాసరే ఈ తొక్కిడి, ఈ జనమూ ఇంకో విధంగా అనుభవించక తప్పదు.” అని చాలా వివరంగానే చెప్పారాయన.

అవును. ఇది నిజంలాగే ఉంది అనుకుని తల వూచాడు వేణు. 

కాని లోలోపల ఎక్కడో ఏదో బంకమట్టి ముద్దలా ఉన్న ట్లనిపించింది.

ఇంతలో ఒక వింత విషయం జరిగింది. ఒక ఖాళీ బస్సు వచ్చింది. ఆ ‘క్యూ’ ని మింగసాగింది. 

హాల్లో పంకా తిరుగుతూంది. కిటికీ ప్రక్కగా కూర్చున్న వేణుగోపాలానికి పంకాతో అవ సరం లేదు. కాని దాని గాలి అతడి టేబిలు మీదికి రాక మానదు ! ఆ  కాగితాలని రెచ్చగొట్టక మానదు. ఇంచక్కా కిటికీ లోంచి గాలి వస్తూంటే పంకా ఎందుకు వేసుకోవాలో తెలీదు  వేణుగోపా లానికి. 

ఆ మాటే మునుపోసారి  చెబితే ఆ గుర్నాధమూ, వేలుమణీ పోట్లాట కొచ్చారు.

 “చెమటతో తడిసి చస్తున్నాం మేము. ఇది ఆఫీసు పంకా. దీన్ని ఆపమనడానికి నువ్వెవరు – పంకా అక్కర్లేక పోతే వెళ్ళి వరండాలో కూచో.” అన్నారు. 

ఏమిటో అవతలి వారు ఒక మనిషని గమనించరు కదా !

గడియారం టంగుమని పలికింది. పదకొండున్నరయింది. ప్యూన్ రజాక్ ని బ్యాంకికి పంపి అరగంటయింది. వాడింకో గంటలో వస్తాడేమో తన డబ్బుతో

“వేణుగోపాల్ గారూ !”

స్టెనో  గొంతు విని అదిరి పడి లేచాడు ఆ పేరు గలవాడు. స్టెనో పిలవడమంటే పెద్ద దొర గారు పిలుస్తున్నారన్నమాట.

వెళ్ళి పెద్ద దొర గదిలో నిల్చున్నాడు వేణుగోపాలం. విశాలమైన మంచంలాంటి టేబిల్ కొకమూలగా, గోడనంటి పెట్టుకుని, భయ భక్తులతో నిల్చుని ఉన్నాడు. దంతం రంగు టెలిఫోను, గాజుపలక మీద పార్కర్  పెన్నులు రెండు, రంగు పెన్సిలు, చిన్న తెల్లకాగితాల పుస్తకం, ముచ్చటయిన పేపర్ వెయిట్ లు నాలుగు, రెండు ట్రేలు, ఆష్ ట్రే – గల ఆ టేబిలు ఉపరితలం ఇంకేదో లోకానికి అద్దం పట్టినట్లుంది .. తాను లోపలికి రావడం గమనించకుండానే గ్రహించిన దొరగారు తన వైపు చూడకుండా, ఎదుట ఉన్న ఫైలుని, చూస్తూ పైపు  పీలుస్తూ మధ్యమధ్య కళ్ళు మూస్తూ, మళ్ళీ తెరుస్తూ. పొగ విడుస్తూ ఉంటే – వారి దృష్టిలో తనొక మనిషా. లేక ఆ గదిలో ఉన్న వస్తువులలో ఒకటా అన్న సంశయం వచ్చింది వేణు గోపాలానికి.

ఆ సంశయం ఆట్టేకాలం బతక లేదు. “ఇదిగో చూడూ ! నువ్వు ఏమిటి ?.”

లేచినించోలేక మట్టి లో పడి పొర్లాడుతున్న వాడిని ఇనుప బూట్లతో రాచడం  మొదలయింది.

ఆ గొంతే మళ్ళీ పలికింది. “నువ్వు గుమాస్తావి…..” నువ్వు పెద్ద యంత్రంలో ఎక్కడో చాలా చిన్న మరవి. మహారణ్యంలో లేత ఆకువి. సాహిత్యంలో ‘కామా’ గుర్తువి. మహా సముద్రంలో ‘నీటి బొట్టువి’. పది వేల లక్షల కోట్లలో ఒక అంకెవి.

నవ్వు .

రాక్షసుడి కోరల్లాటి, గుండెల్లోని విషపు ముల్లులాటి, బట్టల్లేని వాడి మీద జీరోడిగ్రీ చలిగాలి లాటి నవ్వు.

”  నువ్వు గుమాస్తావి. అంతే కాని డైరెక్టరువి కావు …. బహుశా అయ్యే ప్రమాదం కూడా లేదు …. ఆ ‘రూల్’ని ‘ఫ్లాగ్’ చేసి కాగితం అక్కడపెడితే నిర్ణ యం ఏదో నేను తీసుకోగలను.”

అసలు విషయపు తల, తోక ఇపుడే గ్రహించిన వేణు గోపాలం పలికాడు . “ఈ వెవింగ్ కాలేజీలలో చదువుతామనేవారికి సాధారణంగా పర్మిషన్  ఇవ్వమనే ‘రూల్’ ఉంటుందండి…. అలాగే ఇస్తున్నామండి …. ఫైలు రెండుసార్లు తిరగడం ఎందుకని ఒక్క సారే ‘డ్రాఫ్ట్’. కూడా పెట్టేశానండి” అని వివరించాడు.

“అదే చేయవద్దన్నది. నేను వీడికి ‘పర్మిషన్’ ఇవ్వదలచుకో లేదనుకో , అపుడు? ” అని, బ్రహ్మాండమైన సమస్యని సృష్టించి పారేసిన పోజులో వెనక్కు వాల్చి , తన ఆఫీసులో కలాలు నడిపే వారిలో ఒకడయిన ఈ కుర్రవాడివైపు ఒక్కక్షణం చూచి, ఆ ఫైలు మీద ఏదో గీకి, దానిని నేలమీదకు విసిరి పారేసి, పైప్ ని గట్టిగా పీల్చి పై కిచూశారు డైరెక్టరుగారు. ఇంక వారి దృష్టిలో తను లేనని తెలిసి బయటపడ్డాడు. వేణుగోపాలం.

అతని మనసు ఏమిటో గోలగోలగా ఉంది. ఎవరో లోపల్నించి ఏదేదో అడుగుతున్నారు. ఏం చెప్పాలో తెలియలేదు. కుర్చీలో కూలబడి ఎక్కడో చూస్తున్నాడు వేణు. 

బంకమట్టి ముద్ద…. బరువుగా కదిలినట్లయింది.

సరిగా ఆ సమయంలో రజాక్ రూపంలో అగుపించింది ధ్రువతార. 

వేణుగోపాలం అంతరంగంలోని గొంతుకలు చచ్చినట్లు పూరుకున్నాయి.

“ఇదిగోనండిసార్…… అన్నీ కొత్తనోట్లే!” అని రెండు వందలా నలభై రూపాయ లిచ్చాడు రజాక్ .

“ఇంద, నువ్వుంచుకో.” రెండువందలా ముప్పయి తొమ్మిది రూపాయలు తీసుకున్నాడు వేణుగోపాలం.

అతడి జేబులోకి వెళ్ళాయి ఆ నోట్లు.

అతడి లోలోపల క్రొత్త బలం  • కాల్షియం గ్లుకొనేట్ ఇంజ క్షన్ లా – పాకింది. అతడి మనసు డైరెక్టర్ జనరల్ అమ్మ మొగుడిలా వుంది.

అరఘంట తర్వాత ఒంటిగంటయింది. కాని వెంటనే ఆఫీసు విడవలేక పోయాడు. వేణుగోపాలం పనినంతా ఒక పద్ధతిలో తెముల్చుకుని బయట పడేసరికి రెండయింది. తనకు డబ్బు వచ్చిన విషయం ఆఘ్రాణించి, సినిమా, టీ పార్టీ  అంటూ స్లోగన్లు మొద లెట్టారు గురునాధమూ, ఇంకో ఇద్దరు మిత్రులూ. .

సరే, మ్యాటినీ చూశారు. ఆరయింది. హోటలు కెళ్ళితే ఇంకో మూడు రూపాయిలు వదిలాయి. అక్కడితో తమతమ జీవి తాశయాలు నెరవేరినట్లుగా సెలవు తీసుకున్నారు మిత్రులు ముగ్గురూ.

వేణుగోపాలం ఒక్కడే మిగిలాడు.

ఇటూ అటూ తోసుకుపోతున్న మూకనిచూస్తే జాలి వేసింది అతడికి. ఉత్తకాళ్లేగాని మొహాలున్నట్లు అనిపించలేదు, ఆ గుంపుకి. 

ఏవిటో ఈ గుంపు, ఎక్కడికో ఈ తొందర – పాపం. వీళ్ళందరికీ కాసేపు ఆగి, నిలబడి ఆలోచించి, ఏ సినిమాయో చూసి, వాళ్ళ వాళ్ళకి ఏదయినా కొనుక్కు వెళదామని వుండదు కాబోలు – ప్చ్. పాపం!

నెమ్మదిగా నడుస్తున్న వేణుకు, ఉన్నట్లుండి, తన చెప్పులలో ఒకటి తత్సంబంధమైన పాదంతో సహకరించడం లేదని తెలియ వచ్చింది. చూడగా కుడి పాదపు చెప్పు చాలా కీలకమయిన చోట వీడి పోయినట్లు కనబడింది. 

ఇంకొకప్పుడయితే చెప్పు మీద  చాలా కోపం, మధ్యాహ్నం డైరెక్టరుమీద వచ్చినంత కోపం  వచ్చి ఉండేది. కాని, ఇప్పుడతడు – చాలా అసాధారణమయిన దశలో, ఆ పాత చెప్పుల్ని అలా గిరవాటేసి, క్రొత్తవి కొనగలిగినదశలో ఉన్నాడాయె ! అందుకని ఆ చెప్పులమీద జాలి వేసింది వేణుగోపాలావికి –

‘మై డియర్ చెప్పుల్లారా ! పాపం  మీరు నాకు రెండున్నర సంవత్స రాలు అమోఘమైన సేవ చేశారు. నేను తొక్కినట్లెల్లా నలిగారు. ఒకటి రెండుసార్లు కాబోలు అతుకుల కోసం అడిగారు. ‘ ఆవి ఇచ్చేసిం తర్వాత మంచి అబ్బాయిల్లా మెలిగారు. కాని, – ఇప్పుడు నన్ను క్షమించాలి – మనం విడిపోక తప్పదు.’ అనుకుంటూ. “

విశాలమైన హాల్లో, చెప్పుల గోడల మధ్య, నీలపు దీపాల క్రింద, మంచి కుర్చీలలో చేరగిలబడి కూర్చుని, పాదాలకు క్రొత్త రక్షలు తగిలిస్తున్న వారిని క్రీగంటితో చూస్తున్న అదృష్టవంతుల లోకంలోకి అడుగు పెట్టాడు వేణుగోపాలం.

పది నిముషాలకు ఆతడి దగ్గర కొచ్చాడు షాపు కుర్రవాడు. “బూట్లా. శాండల్పా?” అని అడిగాడు.

“చెప్పులు.” అన్నాడు వేణుగోపాలం తనొకమనిషి. తన కొక ఇష్టంఉంది అన్న విషయం స్పష్టం చేస్తూ.

షాప్ కుర్రవాడు ఒక జత నల్ల చెప్పులు తెచ్చాడు. అవి గోపాలం పాదాలకు సరిపోయాయి. కాని

“ఇట్లాంటివే నాకు ‘బ్రౌన్’ రంగులో కావాలి” – 

కుర్రవాడు చెప్పుల గోడలోంచి ఇటుకరాయిలాంటి ఆట్టపెట్టెను పెకలించి తీసు కొచ్చాడు. ఆ చెప్పుల్ని వేణుగోపాలం పాదాలకి తొడిగాడు.

వేణు లేచాడు. క్రొత్త చెప్పులతో ఇటూ అటూ ఏడడుగులు వేశాడు. కాని స్నేహం కుదర లేదు.

కొద్దిగా పాదం నేలకి తగులుతున్నట్లనిపించి, వంగిచూశాడు. నిజమే! చెప్పులపొడవు ఓ అంగుళం తక్కువ.

“అబ్బే, సరిపోలేదు “

 “ఇది ఆరోనెంబరు, మీ సైజే సార్” 

“దీని తర్వాతి సైజు చూద్దాం తీసుకురా!”

 “అది పెద్దదవుతుంది  సార్ !”

 “ఏమిటయ్యా నీగోల. నా పాదం సైజు నా పాదందే గాని మీ అట్ట పెట్టిమీది అంకెకాదుగా !”

కుర్రవాడు మళ్ళీ వెళ్ళి వచ్చాడు.

ఆ తర్వాతి సైజు వేణుకి పెద్దదయింది. కాస్త చిరాకనిపిం చింది, వేణుకు.

“మొదట చూసిన ఆ నల్లవే బాగున్నాయి సార్ ” అవి సూచించాడు. షాపు కుర్రవాడు.

“నలుపు రంగు నాకు నచ్చదు.”

“అయితే ఉండండి..” అని బ్రౌన్ రంగులో ఇంకో జత చెప్పులు తెచ్చాడు కుర్రవాడు.

అవి వేణుకు సరిపోయాయి. 

“అమ్మయ్య” ఆనుకున్నాడు కుర్రవాడు.

అని వేణు.. “అబ్బే, ఈ బకిల్సూ, లేసు అల్లికలూ చూస్తే  నాకు రోత …. అసలు ఈ డిజైను బాగులేదు.” అన్నాడు. ” 

 కుర్రవాడి ఓపిక కొంత కర్పూర మయింది. – “మరేం చెయ్యమంటారు సార్.  దేశంనిండా మా షాపు బ్రాంచీలు రెండు వందలున్నాయి. మా కంపెనీ పాదరక్షలు ఏటా అయిదు కోట్ల జతలు అమ్ముడు పోతాయి. అల్లాంటప్పుడు అయిదుకోట్ల డిజైన్లు రమ్మంటే ఎలా వస్తాయి. ఏవో కొన్ని డిజైన్లు, కొన్ని రంగులు వస్తాయి. వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాలి గాని, మీ ప్రత్యేక అభీష్ట ప్రకారం కావాలి అంటే కష్టమే సార్ –.” అన్నాడు.ఇదేదో పాత పాటే , పదేపదే పాడుతున్నారు. 

లోలోపల, బాబోయ్, ఆ బంకమట్టి ముద్దకు ఏదో ఆకారం వస్తున్నట్లుంది…… 

పాత చెప్పులనే లాక్కుంటూ రోడ్డుమీద కొచ్చాడు వేణు. సందు లోకి తిరిగాడు.

‘లక్షలాది జనులు వాడే హేరాయిల్’ పోస్టరొకటి గోడమీద నవ్వింది అతడినిచూసి.

ఎవరో తరుముతున్నట్లుగా నడవసాగాడు వేణుగోపాలం.

అల్లా తాను నడుస్తున్నట్లు తెలిసినక్షణం ఠక్కున ఆగి పోయాడు. నవ్వొచ్చింది. నెమ్మదిగా నడుద్దామని నాలుగడుగులు వేశాడు.

“అయ్యా! మీ చెప్పునిట్లా ఇవ్వండి-బాగు చేస్తా. “

ఎవరు వారు–తన్నే గాక, నడకలో ఉన్న తన చెప్పు స్థితిని పైతం గమనించి, తన అవసరాన్ని గుర్తిస్తున్నారు- అనుకున్న మరుక్షణం ఒక ప్రక్కగా కూర్చుని ఉన్న చెప్పులు కుట్టే మనిషి కనుపించాడు.

వేణు ఆగి, వాడిని సమీపించి, తన కుడిచెప్పుని వదిలాడు. వాడు దానిని పరిశీలించి, కుట్టసాగాడు. కుడుతూ అన్నాడు — “అయ్యా.-ఇది బాగా అరిగిపోయిందండీ, క్రొత్తవి కుట్టించుకోండి. దొరా..”

 “కొత్తవి ఎంతవుతాయి?” 

చెప్పుల వాడిలో ఆశ మొదలయింది.

“మంచి తోలు వేసి, గట్టిగా కుడతానండి, ఎంత తిరిగినా రెండేళ్లు నడవ్వాలి: ఆ….! మరి…ఆర్రూపాయలుఅవుతుందండీ.”

“నాకు బ్రౌన్ రంగులోనే కావాలి చెప్పులు”

 “అట్లాగేనండి…”

“ఇది విను. కాలి వేళ్ళ దగ్గరొకపట్టి.. దానికి కొంచెం వెనక ఇంకో వెడల్పు పట్టి ఉండాలి. “

“ఓ.–అట్లానే..”

““బొటన వేలికి ‘రింగ్’ ఉండాలి. ఏం? ఇంక దానికి బకిల్సూ డిజైన్లు ఉండకూడదు. చాలా సింపుల్ గా ఉండాలి…”

“ఓ – మీ రెట్లా చెబుతే అట్లా కుట్టి పెడతాను దొరా! పని చూశాక చెప్పండి….కుట్టినాక చూడండి. అవసరం ఉంటే మార్పులు చేపిస్తాను. తమరికి పూర్తిగా తృప్తి అనిపించినాకనే డబ్బులివ్వండి.” అన్నాడు ఆ వేళ పొద్దుటినుండి రూపాయి బేడ మాత్రమే సంపాదించిన చెప్పులవాడు.

వేణుగోపాలానికి తానొక క్రొత్త ప్రపంచంలోకి వచ్చినట్లనిపించింది.

““మీ రెట్లా చెబుతే అట్లా.”

 “తమరికి పూర్తిగా తృప్తి.” 

ఆహా 11 ఆహాహా ! !!! 

అంతేగాని.  –  “అయిదు కోట్ల జతలు.”

– ”ఏదో ఒకటి తీసుకోవాలి గాని.” కాదు  మరి. … ఆ…. అదీ…. బంకమట్టికి ప్రాణమే కాదు రాక్షసుడి రూపమూ వచ్చింది నేను నాగరికతను అని నవ్వుతున్నాడు |

విశాలమైన – గంభీరమైన – నిండైన మనిషిని కొరుక్కు తింటున్నాడు. బాబోయ్ 

“అయ్యా. ఇదిగో పాత చెప్పు ! ఏదీ ఆ పాదం ఈ అట్టమీద ఉంచండి, కొలత తీసుకుంటా.”

బాలి శిరస్సు మీద వామనుడిలా అట్టమీద కుడిపాదం ఉంచిన వేణుగోపాలుడిలో ఎక్కడో చిన్న దీపం వెలిగినట్లయింది. 

“త్వరగా ఇంటికెళ్ళి లలితను లాక్కురావాలి – ఆమెకు నచ్చిందేదయినా కొని తీరాలి..”

దీపం పెద్దదయి. ఇంకా పెద్దదయి చీకటినీ చంపింది. 

పళ్ళులేని రాక్షసుడు. పాపం, తలవంచుకు నిల్చున్నాడు.

“రేపీపాటికి క్రొత్త జోళ్ళు తయారవుతాయండి.” అన్నాడు చెప్పులవాడు.

పాత చెప్పులలో పాదాలుంచి చకచక నడిచాడు వేణు. సందు విడిచి పెద్దరోడ్డు మీదికి నడిచాడు.

నడుస్తూ నడుస్తూ

“అరె! ఈ పాత జోళ్ళు బాగానే ఉన్నాయే• రేపు క్రొత్తవి వచ్చినా వీటిని పారెయ్యక్కర్లేదు.” అనుకున్నాడు !

********************************************

ప్రసిద్ధ కథకుల కథలు:

ప్రసిద్ధ కథకుల ఇంటర్వ్యూలు:

కథాపరిచయాలు:

“వాకాటి పాండురంగరావు గారి ‘మందీ – మరొక్కడు’” కి 2 స్పందనలు

  1. చాలా బాగుంది అండీ మంది మరొక్కడు. ఒక మధ్య తరగతి employee జీవితం లో ఒక రోజు జరిగిన విషయాలను చాల బాగ చూపించారు పాండురంగారావు గారు. చెప్పుల ప్రహసనం ఒక highlight!!

    1. హర్షణీయం Avatar
      హర్షణీయం

      Thank you Sir.

Leave a Reply