Apple PodcastsSpotifyGoogle Podcasts

‘జెన్’ – పతంజలి శాస్త్రి గారి రచన

రిటైరై,  కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా,  చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ,  జీవించడాన్ని ఇష్టపడతారు. 

ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన కొడుకు కృష్ణ , తన జీవితంలో వుండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక , తన భార్యను కూడా వాటి గాటన కట్టేసే  మనిషి.

కథలోవుండే ఇంకో ముఖ్యపాత్ర ‘అమ్మతల్లి’ –  స్నేహితుడు పనికి రాదని పారేస్తూంటే నాయుడుగారు అతన్ని ఆపి  తన ఇంటికి తెచ్చుకున్న,  పాడుబడ్డ ఒక మెషీను.

చెప్పదల్చుకున్న విషయాన్ని పాఠకుడికి చేరవేయడానికి , ఒక శిల్పాన్ని చెక్కినట్టు కథను చెక్కుతూ మెల్లగా పాఠకుణ్ణి తనకు కావలసిన ఆవరణంలోకి తీసుకువెళతారు, శాస్త్రిగారు.  

నా కథలన్నీ అనుభూతి ప్రధానమైనవి, కథ నుంచి ఏమి తెల్సుకోవాలో, పాఠకుడే అలోచించి అందిపుచ్చుకోవాలి అంటారు ఆయన. 

పతంజలి శాస్త్రి గారు  రాసిన అనేక గొప్ప కథల్లో ఇప్పుడు మీరు వినబోతున్న ‘జెన్’ ఒకటి. 

హర్షణీయం టీం  తరఫున ఆయనకు డెబ్భై ఐదవ జన్మ దిన శుభాకాంక్షలు . Happy Birthday Sir.

హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

‘జెన్’ :

గేటు ముందర స్కూటరు భయంకరంగా పొరబోయి దగ్గుతోంది. కిక్ కొట్టే కొద్దీ  పొడి దగ్గే తప్ప ప్రాణం పోసుకుంటున్న జాడలేదు. కృష్ణ మొహం చెమటతో తడిసిపోయింది.  తన భార్యని మానభంగం చేసిన దుర్మార్గుడిలా కనిపించింది స్కూటరు. ఆఖరిసారి కసి  కొద్దీ కిక్ కొట్టి, దగ్గి ఆగిపోయిన వాహనాన్ని,  అదే వేగంతో ఓ తాపు తన్ని నాలుగు బూతులు తిట్టాడతను.

“నీడలోకి రండి” గేటు వెనక నిలబడి అంది అతని భార్య, డాబానీడ ఆమె మీద పడుతోంది. మొహం తుడుచుకుంటూ ఆమె పక్కన నించున్నాడు కృష్ణ.  స్కూటర్ని చంపేయాలనిపించిందతనికి.

“ఛీ ఎదవ స్కూటరు. సరిగ్గా టైముకు పెంట పెట్టింది. పది రూపాయలక్కూడా ఎవడూ తీసుకోడు.” తరువాత స్కూటరు శీలం గురించి అతని అభిప్రాయం వెలిబుచ్చాడు.

సరళ కొంచెం సిగ్గుపడి నవ్వుతూ అంది “చీ. మామయ్యగారు వింటారు”

“వింటే విన్నీ, మధ్యలో నీకేం? ఆఫీసుకెళ్ళేదినువ్వా? నేనా? దరిద్రం. నా కంటే ఎదవ ఎవడూ దొరక్క నాకమ్మాడు. నాకీ చండాలం పట్టింది”

“కృష్ణ ఇంకా వెళ్లలేదా?” భుజం మీది తువాలుతో కళ్లజోడు తుడుచుకుంటూ గేటు దగ్గరకొచ్చాడు నాయుడుగారు.

“స్టార్టవట్లేదండి” పక్కకి తొలుగుతూ చెప్పింది సరళ.

కొడుకు వైపు చూశారు నాయుడుగారు. ఆగ్రహంతో స్కూటర్నే చూస్తూ మాట్లాడలేదు కృష్ణ.  గేటు తోసుకొని బయటికొచ్చి గూడకట్టు చుడుతూ వాహనం దగ్గరికి వెళ్లారాయన.

“ఎండ్లో మీరెందుకు. మీ వల్లకాదు. నే చూస్తాలేండి.”

ఆగమన్నట్టు చెయ్యి చూసింది.  స్కూటరు కింద చెయ్యి పెట్టి చూశారు నాయుడుగారు. ట్యూబు సరిచేసి పైకి లేస్తూ కొడుకు వైపు చూసి నవ్వారు.

“ఓవర్ ఫ్లో. చూసుకోలేదేవీ?”. 

ఆశ్చర్యపోయాడు కృష్ణ. దగ్గరికొచ్చి నుంచున్నాడతను. “కంగార్లో చూసుకోలేదు.”

“కంగారెందుకు? బండి ఆగిపోతే జాగ్రత్తగా చూసుకోవాలి. కాలిరిగేలా కిక్కిస్తే లాభం లేదు. బయలుదేరు.”

నీలి ధూపం సమర్పించి బయలుదేరింది, స్కూటరు. 

ఇద్దరూ నవ్వుకుంటూ వరండాలోకి వచ్చారు.

“ఆఫీసుకు లేటయిందని కంగారండి” భర్త తరఫున అంది సరళ.

“ఆఫీసుల గొడవ స్కూటర్లకి తెలీవు. బయలుదేరే ముందు మనమే చూసుకోవాలి. ఆదివారం పూట ఓ అరగంట బండి దగ్గర కూర్చుని శుభ్రంగా అన్నీ సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి.”

సరళ నవ్వింది. అంటే ‘మీ అబ్బాయికి అంత ఓపిక ఎక్కడుందని అర్ధం’.

“కొంచెం కాఫీ ఇవ్వు. ఓ అరగంట అమ్మతల్లి దగ్గర కూర్చుని తరవాత స్నానం చేస్తాను”

తల ఊపి లోపలికి వెళ్లిపోయింది సరళ. చిన్న డాబా ముందు మూడు లుంగీల స్థలం. ఉద్యోగంలో ఉండగానే జాగ్రత్తగా కట్టించుకున్నాడు నాయుడుగారు. డాబా పిట్ట గోడ మీద కుండీలు పెట్టి మొక్కలు వేశారు. గేటు పక్కన అటూ ఇటూ రెండు రోజా మొక్కలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ నీళ్లు పోస్తూ వాటితో నాయుడుగారు మాట్లాడతారని కృష్ణ గట్టి నమ్మకం. ఎన్ని పువ్వులు పూసినా, కోడలికి  రెండూ పక్కింటిపాపకు ఒకటి, దేవుడి దగ్గర ఒకటి,  మొత్తం నాలుగు పువ్వులు మొక్కలవి. గోడ బయట తురాయి

మొక్క నాటారాయన. చైత్రమాసం నుంచీ కెంపులు పూస్తుందది. ఉదయం సాయంకాలం నాయుడుగారు గోడవతల పెరిగిన ఎర్ర నెమల్ని చూస్తూ కూచుంటారు. ఆయన్నలా చూసి చూసి కోడలు కాసేపట్లో మామగారే ఎర్రగా పూసుకొస్తారను కుంటుంది. ఇంకొంచెం పెద్ద స్థలం లేదని ఆయన బెంగ. 

మధ్యాహ్నాలు భోజనం చేస్తూ కోడలితో ఆయన చిన్నతనాన్ని, యవ్వనాన్నీ నెమరేస్తుంటారు నాయుడుగారు. సరళ ఓపిగ్గా వింటుంది. మామగారి బాల్య, కౌమార, మౌనవ జీవిత విశేషాలు ఆమెకి కామా చుక్కలతో సహా నోటికి వచ్చేశాయి. గడచిన పది సంవత్సరాల్లో చెప్పినవే చెప్తున్నానని తెలీదాయనకు.

కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరు. ఊరికి కొంచెం దూరంగా దట్టంగా పచ్చటి ముద్దల్లా పెరిగిన మడచెట్ల అడవుల్ని చీలుస్తూ ఏర్లు సముద్రంలోకి జారుకుంటాయి. నదిలో మెత్తగా ఆయన జ్ఞాపకాల పడవలో ఊగుతూ బయల్దేరతారు నాయుడుగారు. తెల్లటి పెద్ద ఏటి కొంగలు, ఆశ్చర్యపడ్డ నీటి పిల్లి,  డైనింగు టేబులు మీద ప్రత్యక్షం అవుతాయి. ఒకసారి సముద్రపు ఆటు సమయంలో మడచెట్ల ఏట్లో పడవలో చిక్కుకుపోయి నీరు తీస్తుండగా పడవ తోసుకుంటూ పడ్డ అవస్థను సరళ అయిదువందల నలభైరెండోసారి వింటూ ఓపిగ్గా నవ్వుకుంటుంది. ఆమె నిజానికి పదహారోసారి నుంచే వినడం మానేసింది కానీ, నాయుడుగారు ఆమెతో మాట్లాడరు. ఆమె వైపు చూస్తూ ములక్కాడ చప్పరిస్తూ మాట్లాడతున్నా ఆయన కళ్లలో సముద్రం, అడవి, కొంగలూ పాత సినిమాలా కనిపిస్తాయి. చిన్నతనం గురించి చెప్తుంటే ఒక్కోసారి ఆయన కళ్లజోడు పెట్టుకున్న కొంగలా కనిపిస్తారు కోడలికి.

కాఫీ తీసుకుని వరండాలోకి వచ్చింది సరళ. చేతిలో సిగరెట్ తో పరధ్యానంగా చూస్తూ కాఫీ అందుకున్నారాయన. కాఫీ చప్పరించి సిగరెట్టు పారేసి అమ్మతల్లి వైపు చూశారు. నాయుడుగారు. 

వరండా ఓ చివర సగం కిందికీ, మిగతా వరండాలో చెక్కల మీద బైఠాయించింది అమ్మతల్లి. స్టూలు మీదకూచుని రెంచి అందుకుని చిన్న చక్రాన్ని విప్పడం మొదలు పెట్టారు. కొంచెం నైవేద్య తైలం; గ్రీసు, పాత ఇనప రంగుతో కళకళ లాడుతూంటుంది తల్లి. 

తోలు తీసి పేగులు బైటపడేసినట్టు మరలూ, ప్లాస్టిక్ గొట్టాలు, పెద్ద చక్రం, రెండు చిన్న చక్రాలూ, స్క్రూలతో  వరండాలో వేంచేసిన పాత యంత్రం అమ్మతల్లి. 

ఈ యంత్రం దేనిదో, ఎందుకు ఉపయోగపడుతుందో, ఎందుకు బాగు చెయ్యాలో ఆయన ఎప్పుడూ చెప్పలేదు. (“ఇనుం దరిద్రం గూడా. చెప్తే ఇనరుగా”) 

దానికి నామకరణం చేసింది ఆయనే. జానపదుల పూజారిలా నాయుడుగారు భక్తిగా, ప్రేమగా, ఓపిగ్గా అమ్మతల్లిని సేవిస్తుంటారు. చిన్న చిన్న స్కూలూ, వాషర్లూ నూనెలో ఊరబెట్టి  మళ్లీ బిగిస్తుంటారు.

చక్రం చేతిలోకి ఊడొచ్చింది. రెంచి పక్కనబెట్టి కాఫీ తాగుతూ చక్రాన్ని పరిశీలించారు. ఎక్కడా వెంట్రుకవాసి బీటలేదు. త్రెడ్లు  బాగానే ఉన్నాయి. నిన్ననే గ్రీసు పెట్టారు. మళ్లీ చక్రం బిగించి యంత్రం అవతలివైపు కరెంటు సరిగ్గా వస్తుందో, లేదో పరిశీలించారు. అంతా సవ్యంగావున్నట్టే. ప్లగ్ తీసి మళ్లీ బిగించారు. మళ్లీ స్టూలు మీద కూర్చుని జాగ్రత్తగా చక్రాన్ని బిగించి పాత గుడ్డతో చెయ్యి తుడుచుకుని స్విచ్చి నొక్కారు నాయుడుగారు. ముందు గొంతు సవరించుకుని కసకసమంటూ ఒక్కసారి ఊగి ఆగిపోయింది అమ్మతల్లి. స్విచ్చి ఆపి తేరిపార చూస్తూ కూర్చున్నారాయన.

నాయుడిగారి అనుభవంలో ఎన్నో యంత్రాలు మొరాయించి మాట వినక తప్పలేదు. ఆయన స్పర్శ తగలగానే నాడి కొట్టుకుని ప్రాణంతో కెవ్వుమంటాయి యంత్రాలు. చెడిపోయిన యంత్రం చూడగానే ఆయనకి ప్రాణం లేచొస్తుంది. ఆయన కింద మెకానికులు పడుకునీ. దొర్లీ,  కూర్చునీ వాటితో కుస్తీ పడుతుండేవారు. (మెషీనూ మనిషి లాటిదే! మనం అర్థంజేసుకోవాలంతే”) రెండు రోజులు చూసి సరదాగా ఆయనే గ్లోవ్స్ తొడిగి రెంచి పట్టుకు తయారయ్యేవారు. ఇంజక్షన్ తీసుకుంటున్న రోగిలా యంత్రం నీరసంగా మూలిగి, కాసేపట్లో పూర్ణారోగ్యంతో బయటపడుతుంది.

“మొత్తం చూసుకోవాలయ్యా నువ్వు. కరెంటు వస్తానే ఉంది. లోపల ఏవైందో చూడాలి. నీకసలా సౌండ్ వింటే అర్ధం గావాలి. ఇప్పుడు జూడూ. పెర్ఫెక్ట్ సౌండు ఉంటే మెషీను పెర్ఫెక్ట్ గా ఉందన్నమాట.స్థిమితం ఉండాలయ్యా” 

శ్రీశైలం నీటిమట్టం వల్లా, ప్రభుత్వం వల్లా కరెంటు పోవాలి తప్ప నాయుడిగారింట్లో గీజరూ. లైట్లూ, కుళాయిలూ, పనిచెయ్యకపోవడం ఉండదు. సరళ స్నానం చేసి వచ్చేసరికి మామగారింకా అమ్మతల్లి దగ్గరే ఉన్నారు. ప్లాస్టిక్ గొట్టం తీసి శుభ్రం చేసి మళ్లీ బిగిస్తున్నారు. ఒక్క క్షణం ఆయన వేపే చూస్తూండిపోయిందామె. ఆయన బాల్యం, కౌమారం ఆమెకి కొంచెం అర్ధమైనాయి కానీ పాతబడి చెడిపోయిన ఈ యంత్రాన్ని ఆయన అంత ఓపిగ్గా ఎందుకు బాగు చెయ్యాలో తెలీలేదామెకు. ఒక్కసారికూడా ఆయన చీకాకు పడ్డం, విసుక్కోవడం చూడలేదు సరళ. ఒకటి రెండుసార్లు చటుక్కున ప్రాణం వచ్చి మెషిను తిరగడం మొదలుపెట్టి మరుక్షణంలో ఆగిపోయింది. నాయుడుగారు తల అడ్డంగా ఊపుతూ నవ్వుకున్నారు. 

సామాన్యంగా ఆదివారాలు భార్యాభర్తలిద్దరూ సాయంకాలం బయటికి వెడతారు. టీ టైముకి లేవగానే ఇద్దరికీ ఆయన అమ్మతల్లి దగ్గరో, స్కూటరు పేగులు సవరిస్తూనో కనిపిస్తారు. సామాన్యంగా రాత్రి ఇద్దరూ తిరిగి రాగానే గొడవ పడతారు.

స్నానం చేసి బట్టలు మార్చుకుని పేపరుతిరగేస్తూ కూర్చున్నారు నాయుడుగారు. మార్చి నెల ఎండలు ముదరలేదు. హైదరాబాదు నీటి కరువుకి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిగారు వీలయితే హిమాలయాల్లోంచి నీళ్లు తెచ్చి రాజధాని దాహం తీర్చే పథకం తన దగ్గర రహస్యంగా ఉందని తెలియచేస్తున్నారు. ఈలోగా కృత్రిమ వర్షాలు కురిపిస్తారుట. ప్రధానమంత్రిగారు మెక్సికో అధ్యక్షుణ్ణి పిలుస్తూండగా నాయుడిగారికి చిన్న కునుకు పట్టింది. పేపరు చేతిలో ఉండిపోయింది. మధ్యలో ఒకసారి సరళ వచ్చి చూసి వెళ్లింది.

ఆయన్ని అలా చూస్తూ అప్పుడప్పుడు ఆమెకి భయం వేస్తుంది.

“మామయ్యగారండీ! భోజనం వడ్డించాను” చటుక్కున మెళకువ వచ్చిందాయనకి. 

“సాయంకాలం మలక్ పేట వెళ్లాలటండి”

 “దేనికి!”

“ప్రసాద్ గారి అబ్బాయి పుట్టిన రోజు, ఇద్దరం వెళదాం. రెడీగా ఉండమని చెప్పేరండి.”

“వెళ్లిరండి. మరీ లేటవుకుండా వచ్చెయ్యండి.” 

“అబ్బే. పిల్లాడి చేతిలో ఏదైనా పెట్టి త్వరగానే వస్తాంలెండి” 

“వాణ్ణి బండి జాగ్రత్తగా తీసుకెళ్లమనిచెప్పు” 

సరళ నవ్వింది. తండ్రీ కొడుకులు ఎక్కువ మాట్లాడుకోకపోయినా కృష్ణకి తండ్రి అంటే గౌరవం ఆయన ఎప్పుడూ ఒక్కమాట అనడం గుర్తులేదతనికి. చిన్నప్పుడు కూడా చెయ్యి చేసుకునేవారు కాదు. కోడలు రావడం వల్ల పొరపొచ్చాలు రాలేదు. స్కూటరు వల్ల వస్తుంటాయి. కృష్ణ  గేరు మార్చడం దగ్గర్నించీ ఆయనకి నచ్చదు. గాలి దుమారంలా వెళ్లడం, కీచుమని ఆగడం నాయుడుగారికి గిట్టదు. (“బ్రేకు వెయ్యకుండా బండి నడుపుకోవాలి”) దూరాన్ని వేగాన్ని అంచనా వెయ్యడం రాదని ఆయన అభిప్రాయం.

“ఈ ఎదవ ట్రాఫిక్కులో బండి నడపడం అంత బుద్ది తక్కువ లేదు.”

“సిటీల్లో ట్రాఫిక్కు అలాగే ఉంటుంది. నీ బండి నువ్వు సరిగ్గా ముందు చూసుకోవా లంటున్నాను. బ్రేకు మీద కాలు ఆనగానే మెత్తగా ఆగిపోవాలి. బండి మీద పోతుంటే పర్ ఫెక్ట్ స్మూత్ గా ఉండాలి. బండి నడిపించేటప్పుడు హాయిగా ఉండాలి. శుభ్రంగా ఉంచుకోవడమే గాదు. పరిగెట్టేటప్పుడు సుఖంగా ఉండొద్దూ? అసలు కిటుకు అదీ. ట్రాఫిక్కు ఎంతుంటే నీకేం. దాని మధ్యలో మెత్తగా వెళ్లిపోవాలంతే!”

“అదంతా ఇక్కడ గాదు . అమెరికాలో.”

“అమెరికాలో హైదరాబాదైనా ఒకటేనయ్యా. అమెరికాలో ట్రాఫిక్కు ఉండదా? అదిగాదు అసలు.”

“కాదులెండి నాన్నా! మీరిప్పుడోసారి స్కూటరు మీద వెళ్తే తెలుస్తుంది. చేతులు బొబ్బలెక్కుతాయి. ఈ ఎదవబండి మొన్నో రోజు సరిగ్గా మధ్యలో ఆగిపోయింది. అయిదు నిమిషాలు పట్టింది. ఇసిరి హుస్సేన్‌సాగర్లో పారేద్దామనుకున్నా… డబ్బాలో కారం ఉందా, అంతా కూరలోనే పారేశావా?”

“నువ్వు బండికి, ట్రబులిస్తున్నట్టుంది. హాండిల్ బారు మీద చెయ్యేస్తే ఆకాశంలో కొంగలా వెళ్లాలి. ” (“నాన్నని కాకినాడెళ్లి కొంగను పట్రమ్మను.”)

తువ్వాల్తో  చెయ్యి తుడుచుకుని రెండు పలుకులు వక్కపొడి నోట్లో వేసుకునీ సిగరెట్  వెలిగించారు. నాయుడుగారు. సరళ భోజనానిక్కూచుంది. 

“కోడిగుడ్లలో బాతుగుడ్డు కలిపేస్తున్నారు.”

“అంతే మరి. అన్నీ కలిపేస్తున్నారు.”

తలెత్తి చూసి అన్నారాయన. బాతు గుడ్లనగానే నాయుడిగారికి బాతులూ, కొంగలూ భుజం మీద వాలాయి. వక్కపలుకు మెల్లగా చప్పరిస్తూ చటుక్కున అడిగారు. మనస్సులోంచి చిన్న నవ్వు ఒడ్డున పడింది.

“తాబేలు గుడ్లుగాని చూశావా ఎప్పుడైనా?”

 “లేదండి. అసలు తాబేల్నే చూళ్లేదు” 

“అంటే, ఓసారి చూశానండి”

 “తాబేళ్లలో చాలా రకాలున్నాయి. ఈ డైనింగు టేబులంత కూడా ఉంటాయి తెలుసా?”

 “అయ్ బాబోయ్.”

“అవేం జెయ్యవు. ఓసారి తాబేళ్లు గుడ్లు పెట్టడం చూడ్డానికి ఎళ్లాను. దొరయ్యగాడని మరకాడుండేవాడు(జాలరి) వాడు చెప్పాడు. వాణ్ని చంపి ఓ రోజు రాత్రి సముద్రం దగ్గరికి పోయాను.”

“ఒక్కరే!”

 “నేనూ, ఆడూనూ.”

అర్ధరాత్రి దాటగానే సముద్రం నల్లగా ఉద్రేకపడుతుంది. పోటులో అలల కుచ్చెళ్లు తెల్లగా మెరుస్తుంటాయి. ఒడ్డున దూరంగా దొరయ్య పడవ ఊగిపోతోంది. నక్షత్రాల్ని ఎవరో కడిగి పొదిగినట్టు మిలమిలమంటున్నాయి. త్రయోదశి చీకట్లో సర్వితోట నిశ్చల సముద్రంలా కలవరపడుతోంది. లైట్ హవుసు తెల్లకన్ను టపటప కొట్టుకుంటోంది. సముద్రం అప్పుడప్పుడూ పచ్చగా తళుక్కుమంటోంది. మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరి అర్ధరాత్రి దాటింతర్వాత అలల మీంచి చిన్న నల్లపడవల్లా కడుపునిండా గుడ్లతో సముద్రపు తాబేళ్లు తీరం చేరుకున్నాయి. మెత్తటి తడి ఇసక మీంచి బరువుగా తూలుతూ, జాడలు వేసుకుంటూ పొడి ఇసకలో బొరియ చేసుకుని గుడ్లు పెడుతూ గర్భభారాన్ని దించు కుంటున్నాయి. నిశ్శబ్దంలో గుడ్లు పెట్టినప్పుడల్లా ‘టప్ మని శబ్దం వినబడుతోంది. నక్షత్రాలు, కెరటాలు, పొదల్లో నక్కల కళ్లూ మెరుస్తున్నాయి తాపీగా బొరియ కప్పి మళ్లీ నిర్వికారంగా సముద్రంలోకి తేలిపోయాయి తాబేళ్లు

“అన్నీ నక్కలు తినేస్తాయి. బతికి బట్టగడితే పిల్లలు మళ్లీ రాత్రిళ్లు సముద్రంలోకి పోతాయి. పీతలు కూడా తినేస్తాయనుకో.”

నాయుడిగారి కాళ్లకి తడి ఇసక తగుల్తోంది.

నాలుగున్నరకల్లా వచ్చాడు కృష్ణ, గాలి దుమారం తలుపుతోసినట్టు ముందు గేటుకు గుద్ది ఆగింది స్కూటరు. హారన్ మోగింది. సరళ వెళ్లి తలుపు తీసింది.

“త్వరగా బయల్దేరు”

వరండా చివర నాయుడుగారు స్టూలు మీదకూచుని అమ్మతల్లిని పరిశోధిసున్నారు భార్యాభర్తలిద్దరూ లోపలికి వెళ్లిపోయారు. నూనెలోంచి స్క్రూ  తీశారు నాయుడుగారు . తుప్పు వదిలిపోయింది. దాన్ని జాగ్రత్తగా బిగించి, మెషిను ఒక చివర నుంచి మరో చివరకు వెళ్లే వైరు ఇవతలికి తీశారు. కత్తెరలో చిన్న ముక్క కత్తిరించి మళ్లీ కనెక్షనిచ్చి  లేచి స్విచ్ ఆన్ చేశారు. ఈసారి యంత్రం అంతా పూనకం వచ్చినట్టు ఊగిపోయింది. రెండు అంగల్లో స్విచ్ ఆపి, పెదాలు బిగించి మోటారు వైపు నిశితంగా చూస్తూ ఉండి పోయారాయన. మోటారు రీవైండ్ చేసిందే. అందులో పొరబాటు ఉండదు. ఓ క్షణకాలం తరవాత మెషిను కడుపులో ఏదో కాలుతున్న  వాసన వచ్చింది. చిన్న నవ్వుతో నాయుడిగారి నల్ల పెదాలు విచ్చుకున్నాయి. స్టూలు దగ్గరికి జరుపుకుని రెంచి అందుకున్నారాయన.

 “నాన్నా! మేం ఎళ్లొస్తాం. జాగ్రత్త మీరు” 

“పదండి”

గేటు వరకు సాగనంపారు నాయుడుగారు. స్కూటరు బయటికి తియ్యబోతూ వరండాలో వేంచేసిన అమ్మతల్లిని చూశాడు కృష్ణ. అలాగే తండ్రి వైపు చూశాడతను. ఆయన వీధి వైపు చూస్తున్నారు. చేతులింకా నూనె మరకలతో ఉన్నాయి ఓ చేతిలో మసిగుడ్డ. వాహనం బయట పెట్టి స్టాండు వేశాడు. తలుపు గడియ వేసి వెళ్లి నాయుడుగారు అమ్మతల్లి కడుపులో చెయ్యి పెట్టారు. చేత్తో జాగ్రత్తగా తడుముతూ చిన్న వైరు బయటికి లాగారు. 

కృష్ణ మొహం చెమటపట్టింది. నాలుగు కిక్కులకి వాహనానికి ప్రాణం వచ్చింది. అతని చెప్పు తెగినంత పనైంది. విసురుగా స్కూటరు లాగాడతను.

“ఎక్కదల్చుకోలేదా, చూస్తూ నుంచుటావేటి?”

“ఇప్పుడే గదండీ.” సరళ కొంచెం చిన్నబుచ్చుకుని వెనక కూచుంది. ఒక్క ఉదుటున గుర్రంలా ముందుకి దూకింది చేతక్. గట్టిగా అతని భుజం పట్టుకుందామె.

“నీకు తయారవడానికి ఎంత టైమైనా చాలదు.”

ఆమె ఏమీ అనలేదు. సమాధానం చెప్తే మలక్ పేట వెళ్లి వచ్చే వరకూ దెప్పుతూనే ఉంటాడు కృష్ణ. 

వాళ్లు వెళ్లిన గంట వరకూ నాయుడుగారు అమ్మతల్లి దగ్గరే ఉన్నారు. ఆయనకి యంత్రం అర్ధమైంది కానీ ఎక్కడో ఏదో చిన్న మెలిక చేతిలోంచి జారిపోతోంది. సమస్య  మెషిన్లో ఉందో, తనలో ఉందో తెలీడం లేదు. అది మెరాయించే కొద్దీ అదే మోతాదులో ఆయనకి ఓపిక ఎక్కువవుతోంది. అలిగిన స్నేహితుడిలా కనిపించిందతనికి. కాసేపు టీవీ చూసి పెన్సిలూ, పెద్ద కాగితం, స్కేలూ తీసుకని డైనింగ్ టేబులు మీద పరిచారు. ముందు రెండు దీర్ఘచతురస్రాలూ, తరవాత గీతలతో సున్నాలతో కాగితంనిండా యంత్రం తయారైంది. లోపలి భాగాన్ని విడిగా కాగితం కింద గీశారాయన. కొలతలు తగ్గిస్తూ, వేస్తూ, గీసినవి తుడుపుతూ ప్రాణప్రతిష్టకి కీలకం వెతుకుతూ ఉండిపోయారు నాయుడుగారు.

గోడ మీద వాద్యగడియారం అయన్నీ లోకంలోకి తెచ్చిపడేసింది. ఎనిమిది. కళ్లజోడు తీసి మొహం తుడుచుకుని వరండాలోకి వెళ్లి సిగరెట్టు వెలిగించారు. ఈ పాటికి వస్తూండాలి. ఎక్కువసేపు ఉండవనే చెప్పారు. సిగరెట్టు కాలుస్తూ నుంచుండిపోయారాయన. కార్లూ, బస్సుల, స్కూటర్ల, సైకిళ్ల పద్మవ్యూహంలోకి వేగంగా, అసహనంగా చొచ్చుకుపోతున్న కొడుకు కనిపించాడు. అతని చేతిలో గేర్లు హింసబడుతున్నాయి. కళ్లు చికిలించి, ముక్కుపుటాలెగరేస్తూ నడుపుతున్నాడతను. అతనికీ, రోడ్డుకీ ఇతర వాహనాలకీ సంబంధం ఉన్నట్టు కనిపించదు నాయుడుగారికి. వాహనాన్ని శిక్షిస్తూ వెళ్లిపోతాడు. స్కూటరు అతని శరీరానికి అతుక్కున్న ఇనపముక్కలా, దాన్ని త్వరగా వదిలించుకోవాలనే ఆదుర్దాతో కనిపిస్తాడతను. స్కూటర్ని అతను నడిపిస్తాడో, అతన్నే స్కూటరు నడిపిస్తుందో నాయుడుగారికీ ఎప్పుడూ సరిగా అర్ధం కాలేదు. ఎనిమిదన్నర అయినా ఇద్దరూ రాలేదు. ఈసారి ఫోన్ కి పెట్టుకోవల్సిందే. స్కెచ్ పరిశీలిస్తూ కూచుండిపోయారాయన.

తొమ్మిది అవుతుండగా స్కూటరుగేటు దగ్గర ఆగడం వినిపించింది. భళ్లున గేటు తెరుచుకుంది. సరళ తలొంచుకుని లోపలికి వెళ్లిపోయింది. కృష్ణ కుర్చీలో కూలబడ్డాడు.

“ఇంత ఆలస్యం అయిందేం?” 

ఒంటి మీద చొక్కాను తొక్కలా ఊడదీస్తూ విసుగ్గా అన్నాడతను.

“ఆళ్లు వదల్లేదు. ఈవిడెగారు వాళ్లని వదల్దు. ఎదవ కబుర్లు. దార్లో మామూలే. ఎదవబండి రెండుసార్లు ఆగింది. పంచరైందనుకున్నాను. ఏదో తెగులు.”

బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్లాడతను. కాయితం నిలువుగా చుట్టి అలమరలో పెట్టారు నాయుడుగారు. క్షణంలో లోపల్నించి భార్యాభర్తలు గొంతు తగ్గించి గొడవపడుతున్నారు. ఇది కొత్తకాదాయనకి. కృష్ణ కోపం భార్య మీద కాదని తెలుసు… నాయుడుగారికి. అందులో సందేహం లేదు. 

మళ్లీ ఎందుకో, అనుకోకుండా అమ్మ తల్లిని ఇంటికి తీసుకొచ్చిన రోజు జ్ఞాపకం వచ్చింది. అంతకుముందు జగన్నాథం ఇంటికి వెళ్లారు నాయుడుగారు. కాసేపు కబుర్లు చెప్పుకుని రెండు సిగరెట్లు కాల్చి ఇంటికి వెడతానంటూ లేచాడు. మెట్లు దిగుతుండగా “నాయుడూ! మర్చిపోయాను. నీకోటి చూపించాలి. రా చెప్తా” అంటూ జగన్నాథం ఇంటి పక్కకి తీసుకెళ్లాడు. 

గోడనా పాత బడిపోయిన మెషిను నిర్జీవంగా పడి ఉంది.

“ఓల్డు బ్రిటీష్ మోడలు చూసావా ?”

 “ఎక్కడిదయ్యా బాబూ!”

“దీని కథ చాలా ఉందిలే. అదెందుగ్గానీ అసలు నువ్వోసారి చూడు. నాకయితే  పీచు మిఠాయి కొనుక్కోవడానిక్కూడా పనికిరాదనిపిస్తోంది”.

నాయుడుగారు మెషిన్ దగ్గరికెళ్లి జాగ్రత్తగా, నిశితంగా చూశారు. కాసేపు చూడగానే నాయుడుగారి చేతులూ, వేళ్లూ ఉత్సాహంగా చలించాయి.

‘ఏం జేస్తావు మరి?” 

“ఆ! అణాకో, బేడకో అమ్మి పడేస్తాను.” –

 ఓ క్షణం ఆలోచించి నాయుడుగారన్నారు.

“వద్దులే. ఇంటికి పంపించు చూద్దాం. బావుంది. దాని గొడవలోబడితే నాకూ బావుంటుంది.”

అణా బేడా కాకుండానే రెండ్రోజుల తరవాత ఓ మధ్యాహ్నం అమ్మతల్లి నాయుడుగారి వరండాలో తయారైంది. లోపల్నించి కరెంటు వైరు బైటికి లాగి స్విచ్ బోర్డు తగిలించి సిద్ధం చేశారాయన.

“ఏంటండి మామయ్యగారూ?”

ఆమెకీ అర్ధం కాలేదు. దాని వాలకం చూస్తే  బాగయ్యేలా కనిపించడం లేదు. ఉత్సాహంగా చేతులు రుద్దుకున్నారు నాయుడుగారు.

“బాగవుతుందండీ?”

 “తెలీదమ్మా. అవుతుందనుకుందాం.”

టీ తాగి మెషిన్ దగ్గర కూచున్నారు నాయుడుగారు. పాత బట్టతో మొత్తం శుభ్రం చేసి అక్కడక్కడా నూనె వేసి వైర్లు, ట్యూబులు బయటికి లాగడం ప్రారంభించారు. సాయంకాలం ఆఫీసు నుంచీ వస్తూనే వరండాలో మెషిన్ కళేబరాన్ని చూశాడు కృష్ణ వాహనాన్ని ఒక్కలాగుతో స్టాండు వేసి దగ్గరకొచ్చాడు. కొడుకు రావడం గమనించలేదాయన.

“ఏమిటిది?

ఉలిక్కిపడి తలెత్తి చూశారు నాయుడుగారు. 

“జగన్నాథం పంపించాడు. చూస్తున్నాను. బాగానే ఉంది.” 

“దీన్ని రిపేరు చేద్దామనే?” 

“అందుకేగా. చేస్తావుంటే బావుంటుంది.” 

“ఎందుకు నాన్నా అది? నయాపైస కూడా పనికిరాదు. ఎందుకు బాగుజెయ్యడం?”

“లాభం గురించి కాదయ్యా. అసలు ట్రబులు ఏమిటో చూస్తున్నాను. అప్పుడే తెలీదు.”

“మీరనవసరంగా హైరానాబడ్డం తప్ప ఎందుకిదీ?” 

“రన్నింగులో పెడితే మంచిది. పెర్ ఫెక్ట్ గా స్మూత్ గా నడిపించాలని.”

 “మీ చాదస్తం అంతే.”

తలుపు తీసిన శబ్దం అయింది. వెనుక. సరళ ఒక్కత్తే వచ్చింది. టేబులు మీద భోజనం వడ్డించి అంది.

“ఆలస్యం అయిపోయింది. మీరు రండి. ఆయనగారికి తలపోటుగా ఉందండి.”

సరళ మొహం వాడిపోయి కనిపించిందాయనకి. రెండుచపాతీలు తిని లేచారాయన. బయటికి వెళ్లి సిగరెట్టు వెలిగించారు నాయుడుగారు. 

బాగా పదిన్నర దాటింతరవాత మెళకువ వచ్చింది సరళకి. కృష్ణ అటు తిరిగి పడుకుని నిద్రలో ఉన్నాడు. ముందు గది తలుపు మామయ్యగారు వేశారో లేదో! సడగ్గది తలుపు తీసిందామె. ముందు గదిలో లైటు వెలుగుతూనే ఉంది. పెద్దకాగితం టేబులు మీద పరిచి ఓ చేత్తో స్కేలు పట్టుకుని పెదాలు బిగించి అమ్మతల్లి బొమ్మవైపే చూస్తున్నారు నాయుడుగారు. అప్రయత్నంగా చెయ్యి చాపి సిగరెట్ తీసి వెలిగించారాయన.

******************************************************************************

హర్షణీయంలో పతంజలి శాస్త్రి గారి ఇంటర్వ్యూ – ఇంకొన్ని కథలూ –

హర్షణీయంలో సుప్రసిద్ధ కథకుల కథలు

హర్షణీయంలో సుప్రసిద్ధ కథకుల కఇంటర్వ్యూలు

Leave a Reply