Apple PodcastsSpotifyGoogle Podcasts

‘పేరులోనేమున్నది’ – హర్ష

“రేయ్! గిరి బావా! నువ్వూ, మీ తమ్ముడు వంశీ గాడు దేవళం దగ్గరకు రండిరా!, ఆడుకుందాం!” అని కేక వేశా  నేను.

మా బ్యాచ్ లో ఏ రోజు ఏ ఆట ఆడాలో డిసైడ్ చేసేది వాడే. ఒక్కో రోజు గుడ్లు ఆట లేక గోళీలాట, లేక బొంగరాలాట, లేక కుందుడు గుమ్మ, పల్లంచి, ఇవన్నీ కుదరక పోతే ఒక గదికి అంతా దుప్పట్లు కట్టేసి చీకటి చేసేసి బూతద్దం ఉపయోగించి ఫిలిం గోడమీద ఫోకస్ చేసి చూడటం. ఈ ఆటలకి పిల్లకాయల్ని తోలుకురావటం, పనిలో పనిగా పెద్దోళ్ల చేత అక్షింతలు వేయించుకోవటం మా ఇద్దరికీ అలవాటే.

“ఈ రోజు ఉప్పు ఆట ఆడుకుందాం రా కిరణు! నేను రఘు గాడిని వాడి తమ్ముడు రమేష్ గాడిని పిల్చుకొస్తా! నువ్వెళ్లి మురళి, సుధీర్, మధు, శీనడి ని కేకేసుకు రా!” అని ఉత్సాహపడిపోయాడు వాడు.

నేను లగెత్తా! ముందు మురళిని వాడి తమ్ముడి సుధీర్ గాడి ని దేవళం దగ్గరకు తరిమి, మధూ, శీనళ్ల ను పిలచక రావడానికి వాళ్ళింటికి దౌడు తీశా!

వాళ్ళింటి ముందు ఆగి, గస తీర్చుకుంటూ, “ఒరేయ్! శీనా! ఇంట్లో ఉండావా!” అని కేకేశా! మధు గాడు బయటకి వచ్చాడు. నాకు విషయం అర్థమయ్యింది.

“ఒరేయ్! మధూ, ఉప్పాట ఆడుకుందాం బయటకురారా!” అని ఇంట్లోకి చూస్తూ మళ్ళీ గట్టిగా అరిచా.  వస్తున్నా! వస్తున్నా! అంటూ శీనడు బయటకొచ్చాడు.

“వీళ్ళ పాసుగూల! వీళ్ళతో మాకు ఈ రోజు గూడా సావు తప్పదు” అనుకుంటా తోలుకు పోయా వాళ్ళని.

ఆటకి కావల్సిన పదిమంది పిల్లకాయలు పోగవ్వటం తో, ఆట మొదలు పెట్టాము.

ఆటలో భాగం గా ఒరేయ్ మధు, లగెత్తరా! అంటే శీనడు  పరుగెత్తటం, ఒరేయ్ శీనా, ఉప్పు అందుకోరా, అంటే మధూ గాడు దిక్కులు చూడటం జరగిపోతున్నాయి.

మా వాళ్ళందరూ, చూశారు, చూశారు, యిక తట్టుకోలేక, అంబాలీస్ అని అరిచారు. ఆట ఆగిపోయింది. నా మీదకి యుద్ధానికి వచ్చారు, “ఒరేయ్! కిరణ్ గా, ఈ రోజు వాళ్ళింటికెళ్లి శీనా అంటే ఎవరొచ్చార్రా! మధు గాడేనా, ఆ సంగతి మాకు ఎందుకు చెప్పలేదురా” అని.

నాకు ఉక్రోషం ఎక్కువయ్యింది. ఏమైనా ఈ కన్ఫ్యూషన్ కి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టెయ్యాలిరా! ఈ సంగతేందో వాళ్ళ అమ్మతోనే తేల్చేద్దామ్ అని పిల్లకాయల్ని కూడగట్టి వాళ్ళింటికి తీసుకెళ్లా!

ఎంత వేగం గా అక్కడికి వెళ్ళామో! అక్కడ జరిగేది చూసేసరికి మేము అంతే వేగం గా బిక్క చచ్చిపోయాము.

మధూ, శీనయ్య వాళ్ళ అమ్మ అయిన జయక్క – మురళి, సుధీర్ వాళ్ళ అమ్మ అయిన సరోజనక్క హోరా హోరీగా పోట్లాడు కుంటున్నారు. వాళ్ళ చేలో ఉమ్మడి గెనం (కట్ట) మీద గడ్డి ఎవరు కోశారు అనే విషయం మీద. మాకర్థమయిపోయింది ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు అని. అయినా వీళ్ళ మొగుళ్ళు  అన్నా-తమ్ముళ్లే కదా, మరి యీ తోడికోడళ్లు ఎందుకు రోజూ ఏదో  విషయం మీద ఇలా పోట్లాడుతూనే వుంటారో మా చిన్న బుర్రలు అర్థమయ్యేది కాదు.

ఇక చేసేది ఏమీ లేక ఈసురో మంటూ ఎవరి ఇళ్ల దారి వాళ్ళం పట్టాము ఆ రోజుటికి.

మా ఆటలకి వాళ్ళు ఇద్దరూ కావాలి. వాళ్ళు వస్తే అంతా కన్ఫ్యూషన్. కన్ఫ్యూషన్ తీర్చేసుకోవడానికి వాళ్ళ అమ్మలు మాకు సందు ఇవ్వటం లేదు. ఒకరోజు గడ్డి మీద,  ఇంకో రోజు ఇక్కడ కోడి  అక్కడ గుడ్డు పెడితే గుడ్డు మాయం అవటం మీద లేక ఒకరి పసరం ఇంకొకరి చేలో పడి మేయటం మీద మాకు సందు ఇవ్వకూడదని వాళ్ళ మానాన వాళ్ళు బిజీ గా ఉంటున్నారు. మా ప్రాబ్లెమ్ వినాయకుడి పెళ్లి లా మారిపోయింది.

ఇలా జరుగుతుండగా, ఒకరోజు మా మధు గాడు అలియాస్ శీను గాడు (ఆ రోజు వాడి పేరు శీనయ్య), వాళ్ళ అమ్మ ని మా మూలకడ దగ్గర బస్సు ఎక్కిచ్చి వస్తూ కనపడ్డాడు.

“ఏరా! ఎక్కడికిరా” మీ అమ్మ వెళ్తుంది అంటే, “అల్లూరికి! మా అమ్మమ్మ కి బాగా లేదు. నాలుగు రోజులుండి వస్తుందట” అని చెప్పాడు వాడు.

“అరే! ఎలాగ రా! ఈ నాలుగు రోజులు మీ అమ్మా చిన్నమ్మల  తగవులుండవు. మనకి కాలక్షేపం వుండదే!” అంటూ వాడు కోపంగా చూడటం తో ఆగిపోయా!

ఆ మాట సరదాకి అన్నా, మాకు ఆ నాలుగురోజుల కాలక్షేపం నిజం గానే కరువు అయ్యి తెగ విసుగొచ్చేసింది. ఎలాగో ఒకలాగా ఆ నాలుగు రోజులు గడిపేశాము.

అలా కాలక్షేపం లేకుండా నిస్సారంగా రోజులు గడవకుండా వున్న మాకు, మా జయక్క రాక ఒక్క సారిగా  తెలిసిపోయింది, దిగటము దిగటమే మా సరోజనక్కతో, వాళ్ళింటి మునక్కాయలు ఆమె లేనప్పుడు ఎందుకు మాయం అయ్యాయి అనే సాకు మీద గొడవ మొదలుపెట్టడం తో.

ఇక మాకు పండగే పండగ ఆ రోజు, ప్రతీ రోజు.

నాలుగైదు రోజుల తర్వాత ఆ సందడి కి మరలా బ్రేక్ పడింది ఈ సారి సరోజనక్క ఊరెళ్ళటంతో.

మా అమ్మనడిగా నేను, ” సరోజినక్క ఎక్కడికెళ్లిందమ్మా?” అని.

“అల్లూరుకి వెళ్ళిందిరా!”

“అల్లూరా?”

“అవునురా! సరోజినక్క వాళ్ళ అమ్మకి బాగా లేదంట”

నా బుర్ర కి ఏదో  తడుతుంది. జయక్క! అల్లూరు! జయక్క! వాళ్ళ అమ్మ కి బాగాలేక వెళ్ళొచ్చింది. ఇప్పుడు సరోజినక్క! అల్లూరు! వాళ్ళ అమ్మకి బాగాలేదు. ఏమిటీ కనెక్షన్.

“అంటే! అంటే! జయక్క, సరోజినక్క ఏమవుతారమ్మా?”

“ఏమయ్యేదేముందిరా! నీ మొహం! ఎత్తి కుదేస్తే రెండవుతారు” అన్నది మా అమ్మ తన సెన్స్ అఫ్ హ్యూమర్ కి తానే మురిసి పోతూ!

“అబ్బా! చెప్పమ్మా! వాళ్లిద్దరు, అక్కా చెల్లెళ్ళా?”

“అవునురా! నీకు తెలీదా ఇంత వరకు, అన్నాతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ల ని పెళ్లి చేసుకున్నారు”

“ఇదెలా సంభవం, యీ  ప్రపంచంలో! ఇంతలా తగవులేసుకొనే, అక్క చెల్లెళ్లు?” అని మూలిగా నేను.

“అయితే పెద్ద అయ్యాక, మీరు అలా వుండకండిరా” అన్నది మా అమ్మ.

సరే! సరే ! అంటూ అక్కడనుండి తుర్రుమన్నా నేను యీ రహస్యం నా స్నేహితులతో పంచుకోవాలి అనే తహ తహ తో.

ముందు అందరు బోల్డు హాశ్చర్య పోయారు. ఈ సీక్రెట్ కనుక్కున్న నన్ను ఈర్ష్యతో చూసారు.

కొంత సేపటికి వాళ్ళ కోపమంతా, మురళి, సుధీర్, మధు శీనయ్య ల మీద మళ్లింది. మా పెద్దమ్మ, మా చిన్నమ్మ అని వీళ్ళు ఇన్నాళ్లుగా చెబుతుంటే వాళ్ళ పెదనాయన, వీళ్ళ చిన్నాయనల పెళ్ళాలు అని అనుకున్నాం కానీ, వాళ్లిద్దరూ అక్క చెల్లెళ్లు అనే రహస్యం దాచి ఇన్నాళ్లు కుట్ర చేసారు అని.

విషయం పాత బడి పోయాక, మళ్ళీ మా అసలు సమస్య కి పరిష్కారం ఇంకా దొరక లేదు అని గుర్తు వచ్చింది మా జనాలకి. మాలో ఒకడు, “ఐడియా” అని అరిచాడు. “ఏమిటిరా!  అలా పిచ్చి కేక పెట్టావు” అంటే, “సరోజినమ్మ! ఊర్లో లేదు అంటే జయమ్మ కి ఫ్రీ టైం చాలా ఉంటుంది! కాబట్టి మన సమస్య వెంటనే తేల్చేసుకోవచ్చు” అన్నాడు. “అబ్బా! నువ్వు సూపర్ రా!” అని జయక్క వాళ్ళింటికి పరిగెత్తాము.

వెళ్లి, “జయక్కా! జయక్కా ! బయటికి రా” అని కేకలు వేశాం.

ఆమె అప్పుడే చేలో నుండి వచ్చినట్టుంది. వాళ్ళ పిల్లకాయలు వూరు మీద పడి తిరిగి వచ్చేలోపల ఏదో  ఉడకేసి పెడదామని, పొయ్యి రాజేస్తూ, మధ్యలో మేము అరిచేసరికి, చేత్తో వూదుడు గొట్టం పట్టుకొని, “ఏందిరా ! మీ గోల అంటూ” వచ్చింది.

మా జయక్క నోటికి చాలా మంది పెద్దకాయలే దడుచుకుంటారు, మా పిల్లకాయలకైతే నిక్కర్లు తడుస్తాయి. మా వాళ్లంతా నన్ను ముందుకు తోసి నా వెనక ఒక్కోడు ఒక్కో లైన్ లో పది లైన్ లు కట్టారు.

“ఈ రోజు నీ కొడుకుల పేర్ల విషయం తేలిపోవాలి. మేము ఈ గందరగోళం ఇక తట్టుకోలేం” అని మా జయక్క నోరు ఎంత పెద్దదో గుర్తు తెచ్చుకొని అంత కన్నా ఎక్కువగా నా గొంతు వినపడాలి అని నా గొంతు పగిలేలా అరిచా.

విచిత్రం గా జయక్క నవ్వింది. “నాకేం చెవుడు లేదబ్బాయ్యా, సంగతేందో చెప్పు”

“నీ కొడుకులే అసలు సంగతి. వాళ్లకి తోచినప్పుడల్లా! పెద్దోడి పేరు చిన్నోడు, చిన్నోడి పేరు పెద్దోడు మార్చుకుంటారు. ఆటల్లో మేము చస్తున్నాము వీళ్ళ వల్ల.

“నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అబయా! అందుకే చిన్నోడికి శీనయ్య అని పెట్టుకున్నా! వాడికేమో అది ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అన్న పేరు లాక్కుంటాడు. వాడేమో వాడి పేరు వీడికి ఇచ్చి మరలా నా పేరు నాక్కావాలి అని లాక్కుంటాడు. సరే ఈ రోజు నుండి పెద్దోడు మధు, చిన్నోడు శీనయ్య” అని నామకరణ మహోత్సవం చేసేసింది ఆవిడ. మా పిల్లకాయలం పండగ చేసుకున్నాం అక్కడే.

ఆ తర్వాత మేము పెద్దోడ్ని ఎప్పడు మధూ అనే పిలిచే వాళ్ళం. పాపం చిన్నోడుకూడా ఇక చేసేది ఏమీ లేక వాడి పేరుకే వాడు ఫిక్స్ అయిపోయాడు. అలా మేము ఒక రహస్యాన్ని ఛేదించాము, ఒక ప్రాబ్లెమ్ ని సాల్వ్ చేసుకున్నాము. కానీ ఆ పెద్దోళ్లు మాత్రం వాళ్ళ మధ్య ప్రాబ్లెమ్ ని అలాగే ఉంచేసుకున్నారు. బహుశా ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోతే వాళ్లకు తోచదనే  భయంతో.

వాడు అంటే ఆ చిన్నోడు ఆ తర్వాత వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. చిన్న వయస్సులోనే వాళ్ళ ట్రాక్టర్ తో దుక్కి దున్నటం లో తిరుగులేదు అనిపిచ్చుకున్నాడు. వూర్లో వాళ్ళు కూడా ట్రాక్టర్ తో పని ఉంటే వాడినే పిలిచే వాళ్ళు. అలాటి మంచి రైతుగా పేరు తెచ్చుకోవాల్సిన మా శీనయ్య, హెపటైటిస్ తో చిన్న వయస్సులోనే చనిపోవటం మాకు చాలా బాధ.

పెద్దోడు మధు చక్కగా చదువుకొని, హైదరాబాద్ లోనే స్థిరపడ్డాడు. వాడికి ఫోన్ చేసి నేను మాటల్లో పడి ఒక్కోసారి సీనయ్యా అంటా. వాడు కూడా నవ్వేసి నన్ను ఒక్కోసారి కిరణన్నా అనో, ఇంకో సారి హర్షన్నా అనో అంటాడు. నీ పేరు నాలుగో క్లాస్ దాకా కిరణన్న, నువ్వు నాలుగు నుండి ఆరుకి జంప్ చేసినప్పటినుండి నీ పేరు హర్షన్న అని గుర్తు చేస్తాడు. పేరు లో ఏముందిరా పెన్నిధి అని అనుకున్నా కొన్ని పేర్ల వెనక కొన్ని జ్ఞాపకాలు. అంతే!

‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –

https://gaana.com/podcast/harshaneeyam-season-1(Harshaneeyam on Gaana app)

స్పాటిఫై యాప్ లో వినాలంటే –

http://bit.ly/harshaneeyam(Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –

http://apple.co/3qmhis5(Harshaneeyam on Apple. Podcast)

“‘పేరులోనేమున్నది’ – హర్ష” కి 2 స్పందనలు

  1. పేరులోనేమున్నది అంటూ పేరు లో వున్న గందరగోళం గురించి చక్కగా చెప్పారు హర్ష. ఒక చక్కని కథను ఇచ్చిన మీ అందరికీ చాలా థాంక్స్!!

Leave a Reply