Apple PodcastsSpotifyGoogle Podcasts

నిర్మల మొగుడు – తిలక్ గారి కథ:

నిర్మల మొగుడు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.

తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya

నిర్మల మొగుడు:

ఖంగారు ఖంగారుగా భోజనం చేస్తున్న భర్త మానసిక పరిస్థితినీ, మొహంమీద పడుతున్న నల్లని వంకీల జుట్టునీ, అదో విధమైన ఆనందానీ అందాన్ని సూచించే అతని రూపాన్ని చూసేటప్పటికి జాలివేసింది నిర్మలకు. –

– “తాపీగా  తినండి. మీకిష్టమని ఈ గోంగూరపచ్చడి కూడా వేశాను. మీరలాగ కంగారుగా తిని వెళ్ళిపోతే నా మనసంతా ఎంతో బాధపడుతుంది.”

“ఒళ్ళమ్ముకున్నాక తప్పుతుందా మరి! ఆ రావణాబ్రహ్మ ఈవేళ ఎలాగైనా నన్ను వదలడులే!”

ఈ రావణాబ్రహ్మ అన్న బిరుదు ఎవరికి చెందుతుందో నిర్మలకి తెలుసు. ఆ పేరు చెప్పితే తన భర్త హోరని వర్షములో తడిసి వచ్చికూడా గడగడా మరచెంబుడు నీళ్ళు తాగుతాడన్న విషయం కూడా తెలుసును. కాని ఎదురుగా తన భర్త అంత కంగారుగా భోజనం సరిగా చేయకుండా వెళ్ళిపోతుంటే ఆమె భరించలేకపోయింది. అందులోనూ జరిగిన రాత్రి అతనసలు భోజనమే చేయలేదు. దానికి కారణమైన కలహమూ, ఆ కలహములో మొండిపట్టుపట్టిన తనపాత్ర నిర్వహణా, ఆ కోపములోనే యిద్దరూ భోజనం మానేసి, ఒకే పెద్ద మంచంమీద ఒకరికొకరు తగలకుండా, ఒకరివైపొకరు తిరగకుండా పడుకొని జరిపిన అసిధారా వ్రత నిర్వహణమూ ఇవన్నీ నిర్మలని పశ్చాత్తప్తురాలినిగా భర్తయెడ మరీ సుముఖురాలిగా, ప్రేమచేత కరుణచేత ఆర్ద్రహృదయగా చేసివేశాయి. అందులోనూ అందమైనవాడు, జుట్టు ఆ విధంగా మొహంమీద పడేవాడు. అటువంటివాడు తనకి భర్త అయి, తన సర్వస్వమూ అయినప్పుడు. –

• “మీరు ఆ కూర మరోసారి కలుపుకుంటే కాని వీలులేదు. నా మీద ఒట్టే! బోడి ఉద్యోగం పోతేపోతుంది – దీని తాతలాంటిది వస్తుంది. ఊ, మరి కలపండి” అంది.

ఈసారి విసనకర్ర పుచ్చుకొని విసురుతూ అతని ప్రక్కన కూర్చుంది. నవ్వుతూ పట్టుదల పట్టుతూ లాలిస్తూ అతనిచేత తిరిగి కూర కలిపించింది. “అయిన ఆలస్యం ఎల్లానూ అయిందిగా? ఇంకో పావుగంట లేటయితే పీకలు తీస్తారా ఏమిటి? సంసారాల్లో ఎవళ్ళకి మాత్రం ఏదో అవసరాలు రాకుండా వుంటాయా, ఆలస్యాలవకుండా వుంటాయా?” అంటూ నొక్కులు నొక్కుతూ సన్నగా దీర్ఘం తీసింది. అసలు  ఈ ఆర్గ్యుమెంటుని ఏ కోర్టులోనూ ఒప్పుకోరని తెలుసు. కాని కలహానంతరం అందులోనూ ఒక రాత్రి రాత్రి మౌనంగా వుండి, తిరిగి సంధి కలుపుకొన్న తర్వాత భార్యా భర్త లనుభవించే ఆనందం సరిక్రొత్త ప్రేమలనూ ఉద్రేకాన్ని స్వచ్ఛ పరిమళాన్ని కలిగి వుంటుంది. అటువంటి పునర్నవమైన ఆప్యాయతలో భోజనం పెడుతూంటే, భార్య సన్నవి గాజుల చప్పుడుతో విసురుతూ లాలిస్తూ ఉంటే వేరే కాంక్షించే స్వర్గమే లేకపోయింది గంగాధరానికి. ఆఫీసులూ, బాధలూ, సమస్యలూ అన్నీ చప్పున ఫేడౌట్ అయిపోయాయి. ఆ కాస్సేపట్లోను అతనికి నిత్యమూ, సత్యమూనైన బ్రహ్మానందం గోచరించింది.

ఈసారి వాళ్ళ కబుర్లు, ఒకసారి మనస్సులోంచి సమస్యా సందేహాలు దూరమైపోయిన తరువాత – ఏ అడ్డంకీలేని నదీ ప్రవాహంలాగా సాగిపోయాయి. వచ్చే సంక్రాంతి పండుగకి మామగారు ఏం బహుమతి యిస్తారో అన్న ప్రశ్ననుండీ, సినిమాలో ఫలానా నటి తాలూకు నటన విశేషమూ, కో – ఆపరేటివ్ స్కీములో తాము కట్టించబోయే చిన్న సైజు యింటికి యెన్ని గదులు ఉండాలి అన్నంతవరకు అనవసర అవసర సమాలోచనలన్నీ సాగిపోయాయి. అతను చెయ్యి కడుక్కొని లేచేటప్పటికి ఆమె వక్కపొడుం తీసుకొచ్చి ఇచ్చింది. అతను బనీను ధరించేటప్పటికి దువ్వెనతో వచ్చి అతని పాపిడితీసింది. అతను అమెరికన్ జాకెట్ వేసుకొనేటప్పటికి జోళ్ళు రడీగా ఎదురుగా పెట్టింది. అతను ఆమెను ముద్దు పెట్టుకొని “వస్తాను నిర్మలా” అని యధాలాపంగా అలవాటు చొప్పున గోడమీద టైము చూచేటప్పటికి అతనికి స్పృహవచ్చినట్టు – లేక తప్పినట్టు అయింది. కఠిన వాస్తవికత కొరడాతో కొట్టినట్లయింది. అతని నీడ అతని వెనకనే వచ్చి వెన్నుల్లో పొడిచినట్లయింది. ఉన్నపళంగా కుప్పగా కుర్చీలో కూలి “పదకొండుంబావు” అన్నాడు. అతని మొహంలో కత్తినాటుకు నెత్తురు చుక్కలేదు. తెల్లబడిన అతని మొహాన్ని, పిచ్చిగా చూస్తోన్న అతని కళ్ళను చూసి అర్ధాంగి కంగారుపడింది.

“గంటంపావు లేటు! ఆఫీసుకు వెళ్ళేటప్పటికి యింకో పావుగంటైనా పడుతుంది. ఇంక ఉద్యోగానికి నీళ్ళు వదులుకోవలసిందే. అసలే కోపిష్టిమనిషి, అందులోనూ దొరల పంక్చుయాలిటీ అంటో ఛస్తోంటాడు. అసలు మొన్నమీ వాళ్ళు వచ్చిన రోజున ఆలస్యమైనందుకే మండిపడ్డాడు. తుది హెచ్చరిక అని చెప్పాడు, మీసాలమీద చెయ్యివేసి. నా కొంప తవ్వేశావు. ఏ పావుగంటో, అరగంటో ఆలస్యం అయితే సర్దిచెప్పుకోవచ్చును. ఇప్పుడేమిటి చెయ్యటం?”

నిర్మలకి ఏమీ తోచలేదు. ససంభ్రమ సవిషాద సశంకిత అయి అలాగ నించునిపోయింది. అతను కణతల్ని రెండు చేతులతోనూ అదిమి పట్టుకొన్నాడు. ఈవిధంగా ఆలస్యంగా ఆఫీసుకు దయచేసి ఆ తప్పుని మళ్ళీ మళ్ళీచేసి ఉద్యోగం పోగొట్టుకొని, కొత్తది దొరక్క, మాసిన గడ్డంతో, లోతుకుపోయిన కళ్ళతో రోడ్లుకాస్తూ మిత్రుల్ని అణా, బేడా అడిగి బతుకుతున్న శంకరం స్మృతిపథంలో మెలిగేటప్పటికి అతనికి ఒక్క నిమిషం ఊపిరాడలేదు. అతన్ని లాలిస్తూ భోజనం పెడుతూ, అరగంటకన్న ఆలస్యం అవడంలోని వైప్లవ్యాన్నీ, విపత్తునీ చూడలేకపోయానే అని బాధపడుతోంది ఆమె!

“చీ చీ-మీ ఆడాళ్ళింతే! వెధవసొద వేసుక్కూర్చున్నావు. ఇప్పుడు చీవాట్లు తినాలి. డిస్మిస్ అంటే గొల్లుమని ఏడుస్తూ రావాలి. రేపటి నుండి మెతుకులు కూడా ఉండవు.”

“అయ్యో నాకేం తెలుసండీ” అంది నిర్మల.

“ఏం తెలుసు మరీ? నీ మొగుడేమైనా కలెక్టరనుకున్నావా? మినిష్టరనుకున్నావా! గుమాస్తా అంటే. ఏమిటనుకున్నావు? ఎన్నిసార్లు చెప్పాను నీకు తొమ్మిదింటికల్లా వంట అవ్వాలనీ” కోపంతో కేకలు వేస్తున్నాడు గంగాధరం.

“మరి మీరు తొమ్మిదింటికిగా బియ్యం పట్టించుకొని వచ్చింది?” అంది నిర్మల భయంగా.

మొదట తడితడిగా కనబడి తర్వాత బలం సంతరించుకొని బిందురూపం తాల్చికొని, కనుకొలకుల నుండి రెండశ్రువులు నిర్మల కపోలాల మీద మెల్లగా జారాయి. గంగాధరానికి గబుక్కున జాలి వేసింది. అతనికి ఏ వూహ తట్టినా, ఏ అనుభూతి కలిగినా గబుక్కున కలుగుతుంది. “ఏదో కోపంలో అన్నాను నిర్మలా. నీ తప్పేమీ లేదు. కాతాకొట్టు తెరిచేటప్పటికీ యీవేళ తొమ్మిదయింది. అవునుకాని యిప్పుడేమిటి చేయడం?” అన్నాడు గంగాధరం. –

నిర్మల తడికళ్ళు ఒకసారి మెరిశాయి. మంచుపడుతూన్న వేకువ పొద్దు మీద చటుక్కున సూర్యకిరణాలు పడ్డట్టు బిక్కపోయిన ఆమె మొహం ఒక్కసారి వెలుగుతో ఉద్దీపమయింది. తన భర్తకి నెల నెలా వచ్చే జీతపురాళ్ళని రక్షించే ఒక ఉపాయం ఆమెకు తట్టివుండాలి. .

గంగాధరం ఆశగా ఆమెకేసి చూశాడు. ఊపిరాడకుండా నదితో కొట్టుకుపోతున్న అతనికి ఆమెలో స్ఫురించిన ఊహ అనే పడవచెక్కని పట్టుకొని గట్టుకు చేరుకోవాలనుకున్నాడు.

“నాకో ఊహ తట్టిందంటీ” అంది నిర్మల. “నిజంగానా” ఆతృతగా అన్నాడు గంగాధరం.

“నిజమేనండీ. మా స్కూల్లో యిదివరకు ఓ మేస్టరు ఉండేవాడు. ఆయన చాలా కోపిష్టి, పెద్ద పెద్ద మీసాలతో గండుమొహంతో అచ్చంగా పెద్దపులిలాగ ఉంటాడు. ఓనాడు నేను స్కూలుకి బాగా ఆలస్యంగా వెళ్ళాను. ఆయన కళ్ళెర్రజేసి ఎందుకింత ఆలస్యమయిందని గర్జించాడు. ఒకవేళ ఆడపిల్లనని చేయిచేసుకోకపోయినా, అక్కడ ఎండలో ఇసుకలో నుంచోబెడతాడు. మగపిల్లలు ఏడిపిసారేమో అని నా భయం. నాకు భయంతో సిగ్గుతో ముచ్చెమటలు పోశాయంటే నమ్మండి. నాకు చటుక్కున జ్ఞాపకం వచ్చింది. ఆయనకి మాతృప్రేమ ఎక్కువనీ, మాతృపూజకన్నా జీవితంలో పరమార్థం మరొహటి లేదనీ – చూడండి మీరేదో కాంప్లెక్సూ, గీంప్లెక్సు అంటారు, అలాగ అన్నమాట. అంతే మా అమ్మ ఊరగాయలు కోసం అటక ఎక్కబోతూ నిచ్చెనమీదనుంచి పడిందనీ, ఆమె కాలికి మర్దనా, అదీ చేసి, ఆవిడకి భోజనం పెట్టి, నే నన్నం తిని వచ్చేటప్పటికి ఆలస్యమయిందనీ మాంచి వొడుపుగా అబద్ధం ఆడేశాను. దాంతో అంత పెద్దపులి అహింసావాది అయిన మేక అయిపోయాడనుకోండి. నన్ను  దగ్గరకు పిల్చి నా తల నిమిరి, విద్యార్థులందరికీ నన్నొక ఆదర్శం కింద చూపించి  గౌరవించాడు మా మేష్టారు.”

ఆమె ఆగింది భర్తకేసి భావయుక్తంగా చూస్తూ. పాపం భయావస్థలో నున్న – గంగాధరానికేమీ స్ఫురించలేదు.

“ఈ కథకీ నా ఏడుపుకి సంబంధం ఏమిటి?” అన్నాడు విసుగ్గా.

భర్త తెలివితేటల్ని గురించి కొంచెం నిరసనగా, జాలిగా నవ్వి, విడమర్చి యిలా చెప్పింది నిర్మల. “చూడండి, మీ ‘బాస్’లో ఎక్కడో వీక్ పాయింట్ ఒకటి ఉంటుంది. దానిమీద మీరు ‘ప్లే చెయ్యాలి. ఎంత కోపంలో ఉన్నవాడైనా, | అతనికి యిష్టమైన, ఆప్యాయమైన ప్రసక్తి తీసుకువస్తే చటుక్కున మెత్తబడిపోతాడు, మా మేష్టారులాగా, ధైర్యం తెచ్చుకోండి, ఆలోచించండి.”

గంగాధరానికి ఆమధ్య తోటి గుమస్తా ఒకడు చెప్పిన విషయం సమయానికి జ్ఞాపకం వచ్చింది. ఒక్క ఉదుటున లేచి ఆమెని కావలించుకొని “మై ప్రెషస్ ! నువ్వు నిజంగా నన్ను రక్షించడానికి వచ్చిన దేవతవు. అందుకే కార్యేషు మంత్రి, కరణేషు దాసీ (పాపం తిరగేశాడు కంగార్లో) అన్నారు పెద్దలు. మా అధికారికి ఓ పెద్ద వీక్నెస్ ఒకటి వుంది. అదేమిటంటే ఆయనకి చాలాకాలం పిల్లలు లేరు. ఈమధ్యే మూడు నాలుగేళ్ళ క్రితం ఒక పిల్లాడు కలిగాడు. ఆయనకు పిల్లలు అంటే ఎంతో పిచ్చట. ఆ రోజుల్లో మిఠాయీ బొమ్మలు కొని చుట్టుప్రక్కల ఉన్న పిల్లలకు వారం వారం పంచి పెట్టేవాడుట. ఇప్పటికీ ఈయన ఉన్న వీధిలో ఏ పిల్లవాడికి జబ్బుచేసినా స్వయంగా వెళ్ళి కష్టసుఖాలు విచారించి అవసరమైతే స్వయంగా డాక్టర్ని కూడా తీసుకు వెళతాడట. ఎవరికీ కానీ రాల్చనివాడు నిరుటేడు అనాథ శిశుశరణాలయానికి రెండువందలు – టూ హండ్రెడ్ అడగ్గానే యిచ్చి పారేశాడుట. ఏదీ, నా అమెరికన్ షర్టు ఇలా పడెయ్యి, ‘ఓహో బ్యూటిఫుల్ అయిడియా” అంటూ అతనోవిధమైన నాట్యం చేశాడు.

“మీరు షర్టు తొడుక్కునే ఉన్నారండీ” అంది నవ్వుతూ నిర్మల. గోధుమరంగు పాంటు మీద షార్కుస్కిన్ బ్లౌజు  వేసుకొని, జుట్టు అందంగా మొహంమీద పడుతుంటే సైకిలెక్కి సంతోషంగా వెళ్ళే భర్తను చూసి నిర్మల  ఒకసారి సరికొత్తగా ప్రేమించినంత ఆనందమును, గర్వమూ పొందింది.

గంగాధరం వచ్చినట్లు తెలిసిన మేనేజరు తన గదిలోంచి గంగాధరాన్ని  పిలిచాడు. మాంచి ధీమాగా, ఏ సంకోచమూ లేకుండా వెళ్ళే గంగాధరాన్ని చూసి సోదర గుమాస్తాలంతా తమ కళ్ళను తామే నమ్మలేక ఒకసారి కళ్ళు నులుముకు చూశారు. వినయంగా మేనేజర్ ముందు నిలబడ్డాడు గంగాధరం.

“నీ ప్రవర్తన నాకర్థం కావటం లేదు. నీకు బొత్తిగా భయమూ, భక్తి లేకుండా  పోయాయి. ఇది ఆఫీసని, ఇక్కడ నీవు జీతగాడివనే స్పృహ కూడా నీకు లేనటుంది. ఇదివరకు నీకు మూడుసార్లు వార్నింగు యిచ్చాను. నా మాట నీకు లక్ష్యం ఉంటేగా, ఇంక నీ విషయంలో కన్సిడరేషన్ ఎమి చూపలేను. ఇంక నువ్వు ఫలితం అనుభవించక తప్పదు.” అని కోపంగా నిక్కచ్చిగా ఆరోహణావరోహణలు పాటిస్తున్న గొంతుతో, మీసం కొనల్ని మెలివేస్తూ కళ్ళెర్రచేస్తూ మాటాడే మేనేజరును చూస్తూంటే ఠీవిగా వెనకాలే నడిచివెళ్ళి ‘జింకని, అమ్మని’ నోట కరుచుకునే పులిలోని ఒడుపూ, నిశ్చయమూ గంగాధరానికి స్ఫురించేటప్పటికి అతని గుండె కొన్ని సెకనులు పనిచెయ్యలేదు. భయం భయంగా వణికే గొంతుని సరిచేసుకుంటూ ఇలా అన్నాడు.

“చిత్తం…. ఏక్సిడెంటు జరిగిందంటే… తమరు క్షమించాలి.”

“ఏక్సిడెంటా?” ఎగాదిగా చూశాడు మేనేజరు. “నువ్వు బాగానే వున్నావే” అన్నాడు.

“ఆఫీసుకి ఆలస్యమవుతుందేమోనని తొందరగా వస్తున్నానండి. చటుక్కున్న దారికడ్డంగా ఒక చిన్నపిల్లవాడు వచ్చాడండీ. సైకిలు ఆ కుర్రవాణ్ణి ఢీకొన్నదండి.”

ఈసారి అధికారి మొహం మారిపోయింది. ఆ తరువాత ఆవేదన మొహంలో కనబడింది. “ఏమైంది….. ఏమైంది” అన్నాడు.

“తలకి, కాలికి గాయాలు తగిలాయండి. ఒకటే రక్తమండి. తక్షణం నా జేబురుమాలు తలకి కట్టి ఆ కుర్రవాణ్ణి ఎత్తుకొని హాస్పటల్ కి వెళ్ళానండి. అక్కడ చికిత్స చేయించి కట్టుకట్టించి, డాక్టరుగారు ఫరవాలేదన్న తరువాత ఆ కుర్రవాడింటికి ఫోనుచేయించి మరీ వచ్చానండి. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొని…..”

“ఏం డేంజరు లేదుగదా. డాక్టరు గట్టిగా చెప్పాడా” ఫైర్ అలారంలా మోగింది అతని గొంతు.

“మరేం ఫర్వాలేదండి. అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యం చేయించాకదండీ. సెప్టిక్ అవకుండా పెన్సిలిన్ ఇవీ అవీ ఇంజెక్షన్లు ఇచ్చాడండి డాక్టరు.”

“ఆ కుర్రాడు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడా?”

“చిత్తం….. మొదట్లో కొంత సేపు తెలివిలేదండి, ఇప్పుడు మా అమ్మ కావాలి అని అంటున్నాడండి. ఈపాటికీ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళే ఉంటారండి!”

మేనేజరు మొహంలోని బాధ క్రమేణా తగ్గింది. “మీరంతా వట్టి బ్రూట్స్. సైకిలెక్కితే ఏదో పెద్ద నిషా వచ్చేస్తుంది కాబోలు మీ అందరికీ. రోడ్డుమీద పిల్లలు – అమాయకులైన పిల్లలు – ఉంటారని ప్రాథమిక జ్ఞానం కూడా పోతుంది కాబోలు. ఇకనైనా జాగర్తగా మసులుకో. నిన్ను క్షమించాను. నువ్వు వెళ్ళి నీపని చూసుకో. నా మనసంతా అదోలా అయిపోయింది” అన్నాడు మేనేజరు.

శాల్యూట్ చేసి వెనక్కి తిరిగి తోటి గుమాస్తాల మధ్యకి పచ్చిపడ్డాడు గంగాధరం సగర్వంగా సహాసంగా. “ఏం జరిగింది? ఏం జరిగింది?” అంటూ చుట్టూ చేరి అడిగారు అందరూ. “భాయ్ వీడు గంగాధరం ఏమిటనుకున్నారో” అంటూ నవ్వుతూ ఫైల్సుతీసే గంగాధరాన్ని ఏదో మహిమాన్వితుడిలాగా, హఠాత్తుగా అణిమాది సిద్ధులు లభించిన యోగీశ్వరుడిలాగా, వెట్టిగా చూశారు. మనసులోనే నిర్మలని తలచుకొని ధన్యవాదాలర్పించాడు గంగాధరం.

ఈ ప్రమాదవార్త విని సగం డీలా అయిన మేనేజరు కాస్సేపట్లో తిరిగి కోలుకొని, ఒక్కసారి నిట్టూర్చి, తన పనిలో నిమగ్నుడయ్యాడో లేదో, గణగణమని టెలిఫోను మోగింది. తాపీగా చెవిదగ్గర పెట్టుకొని “హలో” అన్నాడు. అవతల కొననుండి కంగారుగా భార్య గొంతు “ఏమండీ మీరేనా, అయ్యో అర్జంటుగా రండి. ప్రమాదం అండి అబ్బాయికి ప్రమాదం జరిగిందండీ. ఎవడో సైకిలు మీదనుంచి పోనిచ్చాడండి. తలంతా రక్తమండీ. త్వరగా రండి.”

మేనేజరు గుండె ఆగి, తిరిగి ఎగిరి గొంతుకలోకి అడ్డంగా వచ్చేసింది.

అతని మొహం తెల్లబడిపోయింది. మాట వణికింది. “ఎవడా వెధవ ఆ సైకిలు తొక్కినవాడు?” అన్నాడు

“ఆ దుర్మార్గపు వెధవ సైకిలు ఆపకుండా దిగకుండా రయ్యిమని తొక్కుకొని పారిపోయాడండీ. వాడికాళ్ళు విరగ – త్వరగా రండి.”

మేనేజరు చేతులూ కాళ్ళూ ఆడలేదు. “బతికే ఉన్నాడా” అని ఒక్క కేక పెట్టాడు ఫోనులోకి.

“అవేంమాటలండీ మీరు మరీన్నూ తలమీద గాయంపడింది. అంతే. గాయంకడిగి గుడ్డతో కట్టాను. మన డాక్టరుకు ఫోనుచేస్తే లేడు. ఇంకొక డాక్టరిని ఎవరినైనా వచ్చేటప్పుడు తీసుకురండి. నెత్తురింకా కొంచెంగా వస్తూనే వుంది. ఆలస్యం చెయ్యకండి” అంది.

మేనేజరు కిప్పుడు శ్వాస ఆడింది. కాని క్షణంలోనే అతని మొహం కోపంతో కందగడ్డలా అయిపోయింది. కోటు చేత్తో తీసుకుని .ఆఫీసుగదిలోంచి ఇవతలికి వచ్చి గంగాధరంకేసి విషం కక్కుతూ చూశాడు.

“ఏయ్ – యిలారా.”

ఆ పిలుపుకీ చూపుకీ గతుక్కుమన్నాడు. గంగాధరం. “సార్” అన్నాడు దగ్గరగా వచ్చి.

“నువ్వెవరిమీదనుంచి పోనిచ్చావో తెలుసునా సైకిలి….?”

గంగాధరం ఏమిటన్నట్లు వెర్రిగా చూశాడు.

“మా అబ్బాయి మీదనుంచి, లేకలేక కలిగిన ఒక్క కొడుకుమీద నుంచి. మా ఆవిడ ఇప్పుడే ఫోను చేసింది. పైగా ఆగకుండా పారిపోయావుట. నీ అంత నీచుడూ, దుష్టుడూ, అల్పుడూ, అధముడూ ప్రపంచంలో ఉండడు. నామీద నీకున్న గడ్డి మూలాన్ని చెయ్యాలని చేసినట్టు కనబడుతోంది. నిన్ను అరెస్టు చేయించాలి న్యాయానికి. కాని నీపాపం నిన్నే కొడుతుంది. నిన్ను డిస్మిస్ చేశాను పో – ఆఫీసులోంచి పో.” అంటూ మేనేజరు ఊగిపోయాడు కోపంతో.  గంగాధరం ఏమీ అర్థంకాక గుటక మింగాడు. ‘సార్’ అనబోయాడు.

“నువ్వేం చెప్పనక్కరలేదు. ఇంకొక నిముషం ఎదురుగా ఉంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఏమయ్యా హెడ్ గుమాస్తా, ఇతనికి ఏదైనా ఇవ్వవలసింది ఉంటే తక్షణం ఇచ్చి పంపెయ్యి. మళ్ళీ నా కళ్ళకి కనబడ్డావంటే అరెస్టు చేయిస్తాను. జాగ్రత్త” అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అధికారి వెళ్ళిపోయాడు.

కాసేపటికి వెర్రివాడులాగా, సర్వం పోగొట్టుకొన్న వాడిలాగా మూర్తీభవించిన శోకంలాగ’ వచ్చిన గంగాధరాన్ని చూసి కలవరపడింది నిర్మల. అతని నోటినుండి జరిగినకథ విని నిశ్చేష్టురాలైంది. జాలిగా తల రెండు చేతుల్తో పట్టుకుని కుర్చీలో కూర్చున్న గంగాధరాన్నీ, అతని అందమైన మోహం మీదపడే నల్లని వంకీలజుట్టునీ చూసేటప్పటికి ఆమె కనుకొలకుల్లో తెల్లని నీటి బిందువు తళతళలాడింది.

Leave a Reply