Apple PodcastsSpotifyGoogle Podcasts

తడిసిన నేల

ముందు ఉన్న  సీట్లు ,   ఊతంగా పట్టుకు నడుస్తూ, బస్సులో  వెనకనించీ  ముందుకెళ్తున్నాడు రెడ్డి.

లైట్లన్నీ ఆర్పేసున్నాయి బస్సులో. బస్సులో కూర్చున్న పది పన్నెండు మందీ, రక రకాల భంగిమల్లో,  నిద్రలో మునిగున్నారు. రోడ్డు మీద చిందుతున్న  వాన చినుకులు  హెడ్ లైట్ వెలుగు లో మెరుస్తున్నాయి. గతుకుల్లోంచీ బస్సు తనను తాను ఈడ్చుకుంటూ ముందుకెళ్తోంది. 

డ్రైవర్ సీట్ దాకా వచ్చి అడిగాడు, “కందుకూరు ఇంకా ఎంతసేపు ”?

“ వానలు గదా …. రోడ్డుగూడా, బాగా దెబ్బతినుంది. ఓ మూడుగంటలు వేస్కో.“ అన్నాడు డ్రైవర్ , తల తిప్పకుండా.  

వెనక్కి సీటు దగ్గరకొచ్చి  చూస్తే,  చిరంజీవి గాడు అంగుళం స్థలం కూడా మిగల్చకుండా  సీట్  అంతా ఆక్రమించి జోగుతున్నాడు.  

మెల్లగా భుజం మీద తట్టాడు.  

సగం కళ్ళు తెరిచి పక్కకు జరుగుతూ  అడిగాడు చిరంజీవి   –  “దగ్గరికొచ్చామా ’’ ?

“ఇంకా మూడుగంటలంటున్నాడు  డ్రైవరు”

“ బాగా లేటు అయ్యేట్టుంది.”  

“చూద్దాం“ 

“మరీ లేటయితే, రిక్షాలూ అవీ వుంటాయంటావా” 

“ అదే ఆలోచిస్తున్నాను. ఈ టైములో ఇల్లు వెతకడం కూడా కొంచెం కష్టమే ”

“వెతకడమేంది ,అడ్రస్ మన దగ్గర  లేదా “ అన్నాడు కళ్ళు  తెరిచి, పెద్దవిచేస్తూ  చిరంజీవి. 

“అంటే ,  ఏదో సాయినగర్ అని చెప్పినట్టు గుర్తు   “

“ ఇప్పుడెలా?  ఇరుక్కుపోతామేమో ?”

“ కందుకూరు మరీ పెద్ద వూరేమీ కాదు . చూద్దాం.  ” 

“వానేమో ఆగట్లేదు.  తుఫానో ఏందో ,  అన్నీ  చూసుకుని బయల్దేరాల్సింది. “ అటూ ఇటూ ఇబ్బందిగా కదుల్తూ అన్నాడు చిరంజీవి. 

“ ఇప్పుడు చాలా దూరం వచ్చేసాం కదా ?” 

“అవును “

“ ఈ టైములో  వెనక్కెళ్ళడం తేలికా   , ముందుకెళ్ళడమా “

ఏవీ మాట్లాడలేదు  చిరంజీవి. 

రెడ్డి  కిటికీలోంచి బయటికి  చూస్తూ అనుకున్నాడు. “ వీడెప్పుడూ ఇంతే. టెన్షన్తో పక్కవాణ్ణి చంపేస్తాడు.  అసలక్కడ మూర్తి  ఎలా వున్నాడో  ఏందో ”

రామిరెడ్డి , చిరంజీవి , ఇద్దరూ చిన్నపట్నించీ ఒంగోల్లో ఒకే స్కూల్లో చదువుకున్నారు. రామిరెడ్డి వాళ్ళది పెద్ద వ్యవసాయ కుటుంబం. ఉలవపాడు ఆ చుట్టుపక్కల  మావిడి తోటలున్నాయి   వాళ్ళకి . చిరంజీవి నాన్నగారు  ఎల్ ఐ సీ  లో సీనియర్ పొసిషన్ లో  పనిచేస్తారు. ఒకడే సంతానం. చిరంజీవి, రెడ్డి , మూర్తితో పాటూ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో వున్నారు.  కంబైన్డ్ స్టడీలూ, కాలేజీ ఎగ్గొట్టడాలూ ముగ్గురూ కలిసే చేస్తారు.  అదే కాలేజీలో చదువుతున్న, వాళ్ళ పెద్దమ్మ కొడుకుతో కల్సి చిరంజీవి ఒక రూంలో ఉంటే, వెనక పోర్షన్లో వుండే ఇంకో రూంలో రెడ్డి , మూర్తి వుంటారు.  

పొద్దున్న  బాగా వొళ్ళు నెప్పులని  చెప్పి,   కాలేజీ కి  రాలేదు  మూర్తి . సాయంత్రం వచ్చేటప్పటికి  రూము తాళం వేసుంది.  ఇంటిగలాయనకి కీ ఇచ్చి వెళ్ళాడు, ఊరెళ్తున్నా అని చెప్పి.   రూమ్ లోకొచ్చి  మెళ్ళో వేసుకున్న ఐ డీ కార్డు టేబుల్ మీద పడేస్తూంటే, ఒక చిన్న  కాయితం ముక్క  పెట్టుంది .

 “నాన్న పోయారు. టెలిగ్రామ్ వొచ్చింది. బయల్దేరుతున్నా, ఉన్న డబ్బులు ఛార్జీలకు మాత్రం సరిపోతాయి.”

మూర్తికి, రామిరెడ్డి చిరంజీవిలతో తప్ప  వేరే  ఎవరితో పెద్ద పరిచయాల్లేవు.  చదువు తప్ప ఏదీ పట్టదు అతనికి.  చిన్నప్పుడే వాళ్ళమ్మ పోయారు . ఇంట్లో డబ్బుల ఇబ్బంది ఉన్నట్టుంది. ఏ నెలా టైం కి అందవు, వచ్చే మనీఆర్డర్లు.  

పర్సులో వున్న మూడు, వంద నోట్లు చూసుకుంటూ  అనుకున్నాడు,  కొంచెం తొందరగా  బయదేరితే, రాత్రి పది కల్లా కందుకూరు  చేరొచ్చు. 

తలుపు తోసుకుంటూ  ‘టీకి పోదాం’ అంటూ చిరంజీవి వొచ్చి   “మూర్తి గాడేడీ?  క్లాసుక్కూడా రాలేదు” అనడిగాడు. 

విషయం చెప్తే , “ అయ్యో, నేనూ వచ్చేవాణ్ణి గానీ,  రేపు ఏటీడీ లాబులో రికార్డు సబ్మిట్ చెయ్యాలి. ” అన్నాడు 

“ అదంత కొంపలు మునిగే విషయం కాదు గానీ, అసలు విషయం చెప్పు” అని చిరంజీవి మొహంలోకి చూస్తూ అడిగాడు రెడ్డి . 

“అంటే…  నాకు అలాటి చొట్లకెళ్ళడం కంఫర్టబుల్ గా ఉండదు. మా తాతయ్య పొయ్యినప్పుడుకూడా ఎక్కువ సేపు అక్కడ ఉండలేక పోయాను. ” ఎటో చూస్తూ చెప్పాడు చిరంజీవి. 

“అది సరే. డబ్బులేవన్నా ఉన్నాయా, మూర్తి గాడికి  అవసరం పడొచ్చు.”

“ ఒక రెండు వందలు వున్నాయి. అన్న నడిగితే, ఇంకో మూడు నాలుగొందల దొరకొచ్చు. ” అని చెప్పి వెళ్లిన  చిరంజీవి,  ఓ పదిహేను నిమిషాలలో , ఓ చిన్న బాగు భుజానేస్కుని వచ్చాడు. 

“బ్యాగ్  ఎందుకేసుకొచ్చావు” 

“అన్నకు విషయం చెప్తే  “ఇట్లాంటప్పుడే, మనుషుల అవసరం, బయల్దేరి వెళ్ళు ” అన్నాడు.” 

భోజనం అయ్యిందనిపించి,  ఆదరా బాదరాగా బయల్దేరారిద్దరూ. కుండపోత వర్షం. గూడూరు లో బస్సు ఎక్కేటప్పటికి   బాగా లేట్ అయిపొయింది. 

                                                                    *****

 పైనుంచి  పరుచుకున్న   వాన తెర  లోంచి బస్సు తీరిగ్గా ముందుకు వెళ్తోంది. 

రెడ్డి అన్నాడు – “వీడెప్పుడూ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాట్టం గానీ , వాళ్ళనించీ లెటర్లు రావడం గానీ చూడలేదు. ఏదన్నా అలాంటి విషయం వొచ్చినా పొడి పొడి మాటలే . వాళ్ళ  అక్క కూడా కందుకూర్లో లేదనుకుంటా. “  అన్నాడు   ….  “ 

“ ఎవరో  ఒకరు వచ్చి వుండరంటావా ఈపాటికి ”

“నాకు అయితే డౌటే. అసలు ఈ వర్షం చూస్తూంటే, చాలా టైం పట్టేటట్లుంది.”

“ఏదో ఒక టైం కి చేరుకుంటే ఓకే. మధ్యలో వాగులూ అవీ …. “ అంటూ మధ్యలో ఆపేసాడు, రెడ్డి మొహం చూసి చిరంజీవి. 

బస్సు చిన్నగా , ఇంకో మూడు గంటల తర్వాత కందుకూరు చేరింది. అప్పటికి సెకండ్ షో కూడా అయిపోయిందేమో ,  ఊరి మొదట్లో  వుండే సినిమాహాల్లో కూడా, లైట్లు ఆర్పేసి వున్నాయి.  అక్కడక్కడా  ఆరుతూ వెలిగే, స్ట్రీట్ లైట్ల స్తంభాలు తప్ప రోడ్డంతా  ఖాళీ. బస్సు స్టాండ్ లోకి ఎంటర్ అవుతుంటే, ఎంట్రన్స్ లో పోలీస్ జీపు ఒకటి ఆగుంది. దాని పక్కన ఇద్దరు కానిస్టేబుళ్లు నిలబడి,  జీపులో వున్న మనిషితో ఏదో మాట్లాడుతున్నారు. వర్షం మటుకు సన్నగా పడ్తూనే వుంది.  

బస్సు దిగి, కింద కాలు పెట్టంగానే, చిరంజీవి అన్నాడు, “ఆకలేస్తోంది. తినడానికి ఏమన్నా దొరుకుతుందంటావా ఈ టైములో … ?”

బస్సు స్టాండ్లో  షాపులన్నీ  మూసున్నాయి, ఒక బంకు తప్ప . 

“నువ్వేమన్నా తింటావా ? “అడిగాడు చిరంజీవి.

 “నాకు ఆకలిగా లేదు, నీకేం కావాలో తీస్కో “అన్నాడు రెడ్డి, భుజాన వుండే బ్యాగ్ ని కిందపెట్టి, చుట్టూ చూస్తూ. 

చిరంజీవి  అరటి పళ్ళు బేరం చేసింతర్వాత, బంక్ అతన్ని , రెడ్డి  అడిగాడు.  “సాయినగర్ కి రిక్షా మీద  ఎంత అవుతుంది.”?

చాకుతో పళ్ళు కోసిస్తున్న మనిషి ఆగిపోయి “వూరికి కొత్తా” అని అడిగాడు.  సమాధానం చెప్పబోయే లోపల, అన్నాడు  “ ఈ రోజు రాత్రి ఎమ్మెల్యే మనిషిని ఒకాయన్ని, ఎక్స్ పార్టీ వాళ్ళు చంపేశారు. 144 సెక్షన్ పెట్టారు. రిక్షాలు దొరకడం కష్టం ” 

చిరంజీవి  పర్సులోంచి డబ్బులు తీస్తున్నవాడల్లా ఒక్క సారి ఆగి, రెడ్డి  వైపు చూసి అన్నాడు,  “ బయటికెళ్లి రిస్కు చెయ్యడం ఎందుకు . పొద్దుటిదాకా బస్టాండ్లో ఉందాం. “

పట్టించుకోకుండా  రెడ్డి  అడిగాడు  బంక్  అతన్ని  “ఇక్కణ్ణుంచి నడిస్తే ఎంతసేపు  సాయి నగర్  “?

“నడుచుకోని వెళ్లాలంటే, పదిహేను నిమిషాలు ,  సాయి నగర్లో ఎక్కడికి? “

“ఈ టైంలో  వర్షంలో నడుచుకుంటూనా, అదిగూడా ఇల్లెక్కడో తెలీకుండా.” అని సణిగాడు చిరంజీవి. 

సమాధానం చెప్పేలోపలే, రెడ్డి భుజం ఎవరో తట్టారు . వెనక్కి తిరిగి చూస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ నిలబడున్నాడు. 

“ఎక్కణ్ణించి వొస్తున్నారు”

వూరు, కాలేజీ పేరు చెప్పాడు రెడ్డి  . 

“ ఐడీ చూపించు  “

బ్యాగులో చేయ్యిపెట్టబోతూ ఆగి చిరంజీవిని  అడిగాడు రెడ్డి,  “నీది ఉందా, నేను పెట్టుకోలేదు”

అడ్డంగా తలూపాడు చిరంజీవి . 

“పదండి, బయట గేట్ దగ్గర సి ఐ గారున్నారు.”

“లేదు సర్, మా ఫ్రెండు వాళ్ళ ఫాదర్ పోతే, తొందర్లో …” 

స్వరం హెచ్చించి అన్నాడు కానిస్టేబుల్, “సీ ఐ గారి దగ్గరి కన్నానా”

ఒకరి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నడవడం మొదలు పెట్టారు , తల మీద కర్చీఫులు వేసి . చిరంజీవి మొహం ఎర్రబడి పొయ్యింది. నడవలేక నడుస్తున్నాడు. బస్స్టాండ్ గేట్ బయట దాకా తీసుకెళ్లి ఆగమన్నట్టు సైగ చేసాడు కానిస్టేబుల్.  తానొక్కడే నడుచుకుంటూ రోడ్డుకు అవతలి వైపున్న  జీపు దాకా వెళ్ళాడు. ఒకనిమిషం జీపులో ఉండే, సి.ఐ తో మాట్లాడి రమ్మన్నట్టు సైగ చేసాడు. 

చిరంజీవి కి అడుగు ముందర  పడట్లేదు. “నువ్వెళ్ళి మాట్లాడు .. ప్లీజ్ “అన్నాడు =  

రెడ్డి జీప్ దగ్గరికి వచ్చాడు. జీప్ స్టార్ట్ చేసి వుంది. 

 ముందు సీట్లో కూర్చొని వున్న సీ ఐ   అడిగాడు “ ఈ టైములో బస్సు స్టాండ్ లో ఏంచేస్తున్నారు”

“ఇప్పుడే గూడూరు నించీ బస్సు దిగాం సర్ “

“పనేంది?  “

“మా రూమ్ మేట్ మూర్తిది ఈ వూరే సర్. వాళ్ళ ఫాదర్ చనిపోతే, వాణ్ని కలవడానికి వొచ్చాము.”

“ఇంజనీరింగ్ స్టూడెంట్లవని చెప్పారట మా వాడికి, ఐ డీ కార్డులు పెట్టుకొని తిరగరా మీరు, రాత్రి ప్రయాణాలు చేస్తూ “

“ఆ తొందర్లో మర్చిపొయ్యాం సర్. “

“  మీ ఫ్రెండ్ ఇల్లెక్కడ వూళ్ళో . “

చెప్పాడు రెడ్డి. 

“సాయి నగర్లో ఎక్కడ.” 

“అదీ  …… “

“ఇంటి అడ్రస్ , అడ్రస్ ఎక్కడ  “

సమాధానం రాకపోవడం చూసి మళ్ళీ   రెట్టించాడు సీఐ . 

“కరెక్టుగా తెలీదు సర్’

“రమణరావు ఇద్దర్నీ, స్టేషన్ కి తీసుకెళ్ళు, నేను రౌండ్స్ మీద పోతున్నా,” అని కానిస్టేబుల్ కి చెప్పి  వెళ్ళిపోయాడు జీపులో సీ ఐ . 

ఏదో చెప్పబోతున్న రెడ్డి తన పక్కనున్న ఆ కానిస్టేబుల్ రమణారావు వైపు చూసాడు. చెప్పాడు “ సర్, నిజంగానే, ఈ వూరు మా వాణ్ణి కలవడానికి వచ్చామండీ. తొందర్లో వచ్చేసాం. మా మూర్తిని చేరుకోటం ఇప్పుడు చాలా అవసరం. ఏదో ఒకటి చెయ్యండి.”

“ఒకసారి సీ ఐ గారు ఏదన్నా చెప్పింతర్వాత, మా చేతుల్లో ఏం ఉండదు. మీ మొహాలు చూస్తే, చెప్పేది  నమ్మాలనే  వుంది. సీ ఐ గారు ఎటూ ఒక గంటలో స్టేషన్ కొస్తారు . అప్పుడు ఏదైనా మాట్లాడి చూడొచ్చు.”

అలానే కాళ్ళీడ్చుకుంటూ, అతనితో ఓ రెండు ఫర్లాంగుల దూరంలో వున్న స్టేషన్లోకి అడుగుపెట్టారు, ఇద్దరూ. ఒక వరండా, వరండాలోంచి లోపలికెళ్తే హాలు. అక్కడ ఇద్దరు పోలీసులు ఛైర్లు టేబుళ్లు వేసుకుని కూర్చోనున్నారు. తన కుర్చీలో కూర్చుంటూ, మూలగా వుండే బల్ల చూపిస్తూ “అక్కడ కూర్చోండి” అన్నాడు రమణారావు. 

హాల్లో ఒక మూల  కకటకటాల గది ఒకటుంది.  దాంట్లో నేల  మీద కూర్చొని వున్న, ఇద్దరి  ఆకారాలు కన్పడుతున్నాయి. అటు పక్కా, ఇటు పక్క ఇంకో రెండు రూములు . ఒక రూము తలుపు దగ్గరగా వేసుంది, రూమ్ లోపల్నించీ గట్టి గట్టిగా  అరుపులు    వినపడుతున్నాయి. నేలంతా అక్కడక్కడా  రెక్క పురుగులు కుప్పలు, కుప్పలుగా చచ్చి పడున్నాయి. ఎదురుగా కూర్చొన్న రమణారావు పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. వెనకాల పేజీలో చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్, సినిమా యాభై రోజులని రాసుంది. సినిమాల్లో తప్ప పోలీస్ స్టేషన్ని చూడని , చిరంజీవి రుమాల్తో మాటి మాటికీ మొహం తుడ్చుకుంటున్నాడు. 

“ఏదో ఒకటి ఆలోచించరా పుణ్యం ఉంటుంది.” చిరంజీవి మాటలు తడబడుతున్నాయి.  

” ఇంకెవరన్నా వచ్చి మనల్ని  బయటపడేసి , మూర్తి దగ్గరికి తీస్కెళ్ళే  అవకాశం ఉందా  ”

“ లేదు”

“ ఏం చెయ్యాలి ?  ” అన్నాడు రెడ్డి. 

“మనమే ఏదో చెయ్యాలి”

“అదీ ఆ విషయం ఆలోచించు. నేను కూడా అదే పని మీద వున్నా. అయినా మన సంగతి సరే. మూర్తి ఎట్టున్నాడో . వాడికి తోడెవరన్నా వున్నారో లేరో.  ”

ఓ రెండు నిమిషాలాగి చిరంజీవి అన్నాడు “ మూర్తి అపుడపుడూ వాళ్ళ టీచర్ ఒకరి గురించి చెపుతూంటాడు “

“నాదగ్గర కూడా అన్నాడు. లెక్కల మేష్టరు  అనుకుంటా. పేరేవన్నా గుర్తుందా”

ఈలోగా, సి ఐ జీపు స్టేషన్ లోకి ఎంటర్ అయ్యింది. గబగబా స్టేషన్ లోకి వొచ్చి, వీళ్ళ మొహాల్లోకి చూసి, రూమ్ లోకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. రమణరావు  అతని పక్క కుర్చీలో  కూర్చోనున్న   కానిస్టేబుల్,  ఇద్దరూ సి ఐ రూమ్ లోపలికి వెళ్లారు  బెల్ శబ్దం విని.ఇటు పక్క  రూమ్ నించి  అరుపులు ఎక్కువౌతున్నాయి.  

సిఐ అడిగాడు  “ఏమంటున్నాడు ఆ రాజా   గాడు,  ఏడుపులు పెడబొబ్బలు  కాకుండా చెప్పాడా ఏవన్నా”

“లేదు సార్,   రాత్రంతా తాగి ఇంట్లో  పడున్నాట్ట.  అసలా  హత్య విషయమే తెలీదంటున్నాడు.”

సీ ఐ అంటున్నాడు “ఆ రాజా గాడి ఒంటికి  మీ చేతులు  సరిపొయ్యినట్టు లేదు.” 

 ఆ మాటలు చెవిలో పడ్డ  చిరంజీవి మొహం చేటంత అయ్యింది. . “మూర్తి చెప్పాడన్నానే  ,వాళ్ళ స్కూలు టీచర్,….   గుర్తొచ్చింది ఆయన పేరు  రాజారామ్ గారు .”

“కరెక్ట్ . అదే ”అన్నాడు రెడ్డి. 

ఇద్దరూ అడుగులో అడుగు వేసుకుంటూ, సి ఐ రూమ్ ముందరకొచ్చి  నిలబడ్డారు . 

“ఎక్స్ క్యూజ్ మీ సర్ “

“ఏందీ” విసుగ్గా, తల తిప్పి చూసాడు సీ ఐ. 

“ఇక్కడ స్కూలు టీచరు ఒకాయన తెలుసండీ, రాజారామ్  గారనీ” అన్నాడు రెడ్డి . 

రమణారావు వైపు చూసాడు సీ ఐ . “అవును సర్, మున్సిపల్ హైస్కూల్ టీచర్ ఒకాయన వున్నాడు . పక్క వీధిలోనే ఆయన ఇల్లు “

అన్నాడు  రెడ్డి, “సర్, ప్లీజ్ సర్. మా కాలేజీ కి రేప్పొద్దున మీరు ఫోన్ చేస్తే, వివరాలన్నీ, తెలుస్తాయి. ఇప్పుడు వెళ్లనివ్వండి. మళ్ళీ రేపు కనపడమంటే, వచ్చి కనపడతాం. . ఈ టైములో మా వాడి  దగ్గర ఉండటం   చాలా అవసరం అండీ”

తాగుతున్న సిగరెట్ ఆష్ ట్రే లో పడేసి, లేచి బెల్టు సరిచేసుకుంటూ అన్నాడు , “ రమణరావు  వీళ్ళని ఆయన దగ్గరకి తీసుకెళ్లి విషయం కనుక్కో . నేను రాజా గాడి  సంగతి చూడాలి “  

స్టేషన్ బయటికి రాంగానే అన్నాడు , చిరంజీవి “ నీకు భలే ధైర్యం రా. తొణకవూ, బెణకవూ “

“స్కూల్ టీచర్ విషయం  మొదట ఎవరికి గుర్తు కొచ్చింది? “

“నాకే”

“టీచర్ పేరు ఎవరు చెప్పారు”

“నేనే”

“ అదీ విషయం” అన్నాడు రెడ్డి. 

మబ్బులు ముసురేసుకుని వున్నా, ఆకాశంలో నెమ్మదిగా వెలుగు పర్చుకుంటోంది.  న్యూస్ పేపర్లూ, పాల కేన్లూ తగిలించుకున్న ,సైకిళ్ళు ఎదురొస్తున్నాయి. రాజారామ్ గారు కళ్ళు మూసుకుని వసారాలో బావి పక్కన కుర్చీ వేస్కుని కూర్చోనున్నారు.  ఓ డెబ్బై ఏళ్ళుంటాయి ఆయనకి. 

“విషయమంతా విని రమణరావుకి చెప్పాడాయన, వీళ్ళ చెప్పే మూర్తి నాకు బాగా తెల్సు. ఊరికొచ్చిన ప్రతీ సారీ వచ్చి కలుస్తాడు కూడా. సాయి నగర్లో ఇల్లు. “

రమణమూర్తి అక్కడ ఇద్దర్నీ వదిలేసి వెళ్ళిపోయాడు స్టేషన్కి. 

రెడ్డి  ఏదో మాట్లాడపోయే లోపల  రాజారామ్ గారు అన్నారు  “ఆ బావి దగ్గర మొహాలు  కడుక్కొని, కాఫీలు తాగండి. వెళుదురు గాని ”

పరిచయాలయ్యాక , కాఫీ తాగుతూ  చెప్పాడాయన   “అవధాని అంటే మూర్తి  వాళ్ళ నాన్న , చిన్న చిన్న పౌరోహిత్యాలు చేస్కుని బతికేవాడు. మూర్తి వాళ్ళ అమ్మ టైం కి వైద్యం అందక పోయిందని, బంధువుల అందరినీ దూరం చేసుకున్నాడు అవధాని. ఇది గాక కూతుర్ని కూడా  ఎవరో తురకబ్బాయిని చేసుకుందని దగ్గరకి రానివ్వలేదు. ఈయన పోవడం మూర్తికి పెద్ద దెబ్బే . వెంటనే వచ్చి మీరు మంచి పని చేశారు. మూర్తి కి ఈ టైములో కావాల్సింది మనుషులే.  ” అంటూ ఏదో  చెప్పబోతూంటే, ఎవరో ఇక మనిషి ఒక చిన్న చెక్క పెట్టె పట్టుకుని  వాకిట్లోకి వచ్చాడు. . 

అతన్ని  చూసి రాజారామ్  గారు “నాకు ఈ కుడికాలు రెండు రోజుల్నించీ ఇబ్బంది పెడ్తోంది. ఇంట్లోనే ఏదో నాటు వైద్యం చేయించుకుంటున్నా. లేకపోతే నేను గూడా అక్కడికి వచ్చేవాణ్ణి . వాళ్ళిల్లు ఇక్కడ్నించీ ఓ పది నిముషాలు నడక, సాయి నగర్లో ఆంజనేయ స్వామి గుడిని ఆనుకొని వున్న పెంకుటిల్లు.” అన్నారు. 

మూర్తి ఇంటి వైపు వెళ్తూంటే, చిరంజీవి అన్నాడు, “వాణ్ణి తల్చుకుంటూంటే జాలేస్తోంది. ఏవి ఇబ్బందులు పడ్తున్నాడో ఏందో .”

                                                    ************

ఆ వీధిమొదట్లో వుంది ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి గుడికి ఆనుకొని వున్న ఇల్లు గేట్ తీస్కొని లోపలోకి అడుగుపెట్టారు ఇద్దరూ.  ఇంటి పైన పెంకులన్నీ నల్లబడి అక్కడక్కడా విరిగి ఖాళీల్లోంచి దూలాలు కన్పడుతున్నాయి. . గోడలన్నీ చెమ్మ పట్టున్నాయి. వసారాలో, అక్కడక్కడా  పోగుల్లేచిపొయ్యిన నవారు  మంచం ఒకటి వేసుంది.  

గేటు శబ్దం వినంగానే  వసారాలో కొచ్చాడు మూర్తి.

ఇద్దరి చేతులూ పట్టుకొని అన్నాడు , “రాత్రికే వచ్చేస్తారు అనుకున్నా ”. 

ఒంట్లోంచి శక్తినంతా ఎవరో లాగేసుకునట్టు కన్పడుతున్నాడు మూర్తి. 

ఇంట్లో ముందు గదిలో పడుకోబెట్టి వున్నారు, మూర్తి వాళ్ళ ఫాదర్ ని. ఇంట్లో వేరే మనిషి జాడ గూడా లేదు. 

భుజం మీద చెయ్యి వేసి అడిగాడు రామిరెడ్డి , “ఇంకా ఎవరూ రాలేదా”

“ఎవరున్నారు రావడానికి, పక్కవీధిలో అమ్మకు తమ్ముడు వరసాయన రామారావు గారని  ఉన్నాడు. ఆయనే టెలిగ్రామ్ ఇచ్చింది. నేనొచ్చేదాకా నాన్న దగ్గర వున్నాడు. “

“అక్క కు వెళ్లిందా ఇన్ఫర్మేషన్ ….?  “ చేతిలో,  తెచ్చిన డబ్బులు పెడ్తూ,  అడిగాడు రెడ్డి. 

“అక్కపెళ్ళైనప్పట్నుంచీ, రాక పోకలు  లేవు. అక్క బావ చీరాలలో టీచర్లు అని మాత్రమే తెల్సు. రామారావు గారు,  ఎవరో మనిషి నిన్న   చీరాల  పోతుంటే, చెప్పి పంపించారట  .”

“ఖర్చులకెంతవ్వొచ్చు.”

“ఏమో అంత  ఐడియా లేదు. ఒక రెండు మూడు వేలు అవ్వొచ్చేమో.  బ్రామ్మడు, అతనితోపాటు ఓ నలుగురు మనుషులు, సామాన్లూ ” అన్నాడు మూర్తి. 

మిగతా ఇద్దరూ  ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

“ మేం తెచ్చినవి సరిపోవు. ఇంకా డబ్బులు కావాల్సొస్తాయి ” అన్నాడు చిరంజీవి. 

“అదే ఆలోచిస్తున్నాను. రామారావుగారు కూడా కోర్ట్ కేసు ఎదో ఉందని, ఊళ్ళో ఈ రోజు ఉండననీ చెప్పి వెళ్లిపోయారు  ” అన్నాడు మూర్తి నిస్తేజంగా చూస్తూ. 

“రాజారామ్ గారి నడిగితే” అన్నాడు చిరంజీవి. 

అదే టైములో  గేటు తీస్కొని ఓ ముఫ్హై ఏళ్ల అమ్మాయి,  దాదాపు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చింది . ఆమెని చూసి  వెంటనే కళ్లలో నీళ్లు తిరిగాయి  మూర్తికి. ఆమె చెయ్యి పట్టుకుని లోపలి తీసుకెళ్లాడు. 

ఆ అమ్మాయి వెనకాలే , కళ్లజోడు పెట్టుకుని, తెల్లగా వున్న  ఒకతను లోపలికొచ్చి  అడిగాడు. “మీరు మూర్తి స్నేహితులా  “

“అవునండీ క్లాస్ మేట్స్ “

చెయ్యి కలుపుతూ అడిగాడు  అతను , నా పేరు భాషా. మూర్తి వాళ్ళ బావని. జరగాల్సిన పన్లకు ఏర్పాట్లు ఏవన్నా జరిగాయా ”

విషయం విన్నతర్వాత అన్నాడతను “దగ్గర్లో మా బీ.ఎడ్. క్లాస్ మేట్ ఒకతను వున్నాడు. అతనికీ విషయాలు తెలిసుంటాయి .” 

భాషా తో పాటూ రెడ్డీ చిరంజీవి, బయటకు కదిలారు. 

మాటల మధ్యలో అడిగాడు, చిరంజీవి, “మీరు మూర్తి వాళ్ళ ఇంటికొస్తూంటారా అప్పుడప్పుడూ” ?

అదోలా నవ్వి అన్నాడతను, “ మా పెళ్లి,  ఫ్రెండ్స్ చేతుల మీద  జరిగింది. పెళ్లైన తర్వాత నేరుగా ఇంటికొస్తే, దాదాపు కొట్టినంత పని చేశారు ఈయన. విషయం ఈ రోజు పొద్దున్నే తెల్సింది, బయలుదేరి వచ్చాము.”

“ఆయన మీద మీకు కోపంగా లేదా”

 “బతికున్నప్పుడు ఆయనకు నేను పనికిరాలేదు. పోయినప్పుడు  ఆయన కూతురికన్నా పనికి రావాలిగా”

చిరంజీవి అతన్నే చూస్తూ వుండిపోయాడు ఓ క్షణం. 

ఒక సంచీ సామాన్లతో బ్రామ్మడు , వెదురుబద్దలు భుజాన వేస్కుని  ఒక మనిషి ఇంటికి  వచ్చారు వర్షంలో తడుస్తూ. మూర్తి  వెనక బావి దగ్గర ఓ చేద నీళ్లు నెత్తిన పోసుకుని, తడి పంచతో బయటకొచ్చాడు.   కార్యక్రమం అంతా పూర్తి చేసి, అవధాని గార్ని, పాడె మీద పడుకోబెట్టారు. 

“ఇంకో ముగ్గురు కావాల్సి వస్తారు” అన్నాడు బ్రామ్మడు. 

పాడె తయారు చేసిన మనిషి తో అవధాని గారి ముందు పక్కకొచ్చి  నిలబడ్డాడు మూర్తి వాళ్ళ బావ.  రెడ్డి గూడ ఓ రెండడుగులు వేసాడు అవధాని గారి  వైపు. అప్పటిదాకా ఏదో ఆలోచిస్తూ నిలబడున్న  చిరంజీవి, నెమ్మదిగా నడుస్తూ వచ్చి, నాలుగో మనిషి స్థానంలో రామిరెడ్డి పక్కకొచ్చి  నిలబడ్డాడు. 

బ్రామ్మడు ఒక క్షణం ఆగి   చెప్పాడు,  చిరంజీవి, రెడ్డి ఇద్దరి మొహాల్లోకి తేరిపార చూస్తూ “ మీరు ఇద్దరూ మరీ చిన్నవాళ్లుగా వున్నారు.  మా బ్రామ్మల్లొ మటుకు  తల్లీ తండ్రీ వున్న వాళ్ళని   స్మశానానికి రానివ్వం. ఇలాంటి పనులు అసలు చెయ్యనివ్వం.”


రెడ్డి చిరంజీవి వైపు చూసాడు. చిరంజీవి మొహంలో ఏ మార్పూ కనిపించనివ్వకుండా, కిందికి ఎత్తుకోవడానికి వంగాడు. మిగతా ముగ్గురితో కల్సి, చిరంజీవి అవధాని గారి శరీరాన్ని మోస్తూంటే బ్రామ్మడితో పాటూ, ముందుకు  నడిచాడు మూర్తి. 

భోజనాలయ్యేటప్పటికీ , మధ్యాహ్నం నాలుగయింది.  మూర్తి వాళ్ళ బావ, బ్రామ్మడికి డబ్బులు ఇచ్చేసి చెప్పాడు, బయలుదేరబోతున్న ఇద్దరినీ చూసి ,  “నేను గూడా బస్ స్టాప్  దాకా వస్తాను” అని. 

దార్లో అడిగాడు “ నెల నెలా ఎంత ఖర్చు అవుతుంది మీకు “ ఫీజు వివరాలు, నెల ఖర్చూ చెప్పాడు చిరంజీవి. 

“ఇది నా అడ్రస్. ఇంకనించీ అతని చదువు ఖర్చు, వాళ్ళ అక్క, నేను  చూసుకుంటాం. మూర్తికి  మొహమాటం ఎక్కువ అని వాళ్ళ అక్క అంటూ ఉంటుంది. అతనికి వేరే  అవసరం ఏదన్నా వస్తే నాకు ఇన్ఫామ్  చెయ్యండి ” అని ఓ చిన్న స్లిప్ చేతికిచ్చాడు భాషా. 

బస్సు బయల్దేరే ముందు అతని చేతిని  తన రెండు చేతుల మధ్యలోకి తీస్కుని. “మా కాలేజీకి రండి వీలున్నప్పుడు ”అన్నాడు చిరంజీవి. 

బస్సు బయల్దేరిన ఓ  రెండు నిమిషాల తర్వాత  రెడ్డి   అడిగాడు, “ స్మశానానికి రాగూడదు అన్నప్పుడు నీలో రియాక్షనే లేదు.”?

“అక్క కోసం,  వాళ్ళ బావ అంత చేస్తున్నప్పుడు, నేను మూర్తికోసం ఆ మాత్రం చెయ్యొచ్చు అనిపించింది.”

“ ఏమో? ఆ వూర్లో ఏదో అయింది నీకు “ అన్నాడు రెడ్డి. 

“ ఏం లేదు.  వర్షంలో తడిసి తడిసి దుమ్ము వదిలింది“ అంటూ ఇరవైనాలుగుగంటల తర్వాత మొహానికి నవ్వు పులిమాడు  చిరంజీవి. 

వాన ఆగిపోయి చాలా సేపయింది. సూర్యుడు మబ్బుల్లోంచి మెల్లగా బయటికొస్తున్నాడు. 

                                                            ************

“తడిసిన నేల” కి 13 స్పందనలు

  1. రవికాంత్ Avatar
    రవికాంత్

    ఒక చిన్న సంఘటన, ఇంకొకరి వ్యక్తిత్వం ఓ మనిషిలో కదలిక తెచ్చింది.. మారడానికి, మానవత్వం వైపు అడుగులేయడానికి.. ఆలోచింపజేసే అవకాశం కలిగించే రచన ఇది.. ఒక సున్నితమైన ఇతివృత్తాన్ని అందంగా మలిచిన అనిల్ కు ఆభినందనలు 👍

    1. హర్షణీయం Avatar
      హర్షణీయం

      Thank you Ravi

  2. Chala bavundi katha konni chotla very realistic ga vundi like entha manchiga rasaru ante kalla Munde jaruguthunatlu vundi

  3. Harshanna,very nice story and close to reality.Chiranjivi character is highlighted, If you add more,we can do a movie like Gamyyam…

  4. మానవత్వం అనే సూర్యుడు ఉదయించచడం తో చక్కని ముగింపు నిచ్చేరు.మంచి కథ.

  5. Sneha bandham, manavathvam kalisina kadha , chaalaa adbhutham ga raasaaru

  6. Sneha bandham, manavathvam kalisina kadha, adbutham ga raasaaru.mugimpu bavundi

  7. That is true FRIENDSHIP —- GOOD STORY. SIR

  8. కథ చాలా బాగుంది. చాలా సహజంగా ఉంది. సమాజం మారాలంటే ఇటువంటి చిన్న సంఘటన లే దోహదం చేస్తాయి. అనిల్ గారికి అభినందనలు.

    1. హర్షణీయం Avatar
      హర్షణీయం

      thank you Sir.

Leave a Reply to BUCHIREDDY GANGULACancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading