Apple PodcastsSpotifyGoogle Podcasts

మా ఊరి నీళ్ల పురాణాలు – హర్ష


పైన చెరువు, మధ్యలో వూరు, వూరికింద పొలాలు, పొలాల క్రింద,  ఎంత ఎండాకాలం లో అయినా ఒక్క పాయన్నా పారే వాగులతో,  అద్భుతమైన గ్రావిటీ నీటి పారుదల వ్యవస్థ వున్న మా వూళ్ళో,   తవ్వితే పడేది మాత్రం  ఉప్పునీళ్ళే. 

నీళ్లు పడ్డం అయితే ఇరవై ముప్పై అడుగుల్లోపలే పడతాయి, నోట్లో పోసుకుంటే కానీ తెలీదు ఎంత ఉప్పగా వుంటాయో. రాక రాక వచ్చిన జామ చెట్టు కాయలు, బాదం కాయలు, సపోటా కాయలు కూడా జవ్వ  బారిపోయుంటాయి. 

అందుకు వచ్చిందేమో ‘ఉప్పలపాడు’ అని మా వూరికి  పేరు. 

మా వూళ్ళో మూడు రకాల బావులు. ఊరికి దూరంగా  ఉండేది చెరువు అవతల వైపు ఒక మంచెళ్ల బావి. ఆ నీళ్లు కేవలం తాగడానికి మాత్రమే. ఊరి పైభాగాన, చెరువు కింద ఉండేది నడీది బావి.

 ఆ నీళ్లు అన్నం ఎసుటి మాత్రం వాడే వాళ్ళం.   ఇక వుప్పు నీళ్లు స్నానాలకు కాల కృత్యాలకి. 

ఆబ్బో! ఆ వుప్పు నీళ్లకే పెద్ద డిమాండ్ మా వూర్లో ఎందుకంటే అందరం బావులు తొవ్వించుకోలేము కదా.  అలా ఇంట్లోనే బావుండే మా  శంకరవ్వ లాటి వాళ్ళ ప్రాపకం కోసం మాలాంటోళ్లం, పడరాని పాట్లు పడేటోళ్ళం. 

శంకరవ్వ,  వాళ్ళ కోడి పక్కింట్లో గుడ్డు పెట్టేసిన రోజో,  లేదా  శంకరవ్వ దగ్గర పాలుపోయించుకొనే వాళ్ళు,  “కలిపితే కలిపావమ్మా కాస్త  మంచెళ్ళు అన్నా కలపకూడదా అన్న రోజునో” మనసు పాడుచేసుకునేది.

అలా పాడైన  రోజున మా నీళ్ల ఆశ మీద నీళ్లు  చల్లి,  మనసు ఉల్లాస పరుచుకోవటం ఆవిడ సరదా. 

అలాంటి శుభదినాల్లో , మా అమ్మ పిల్లకాయల్ని అందరినీ తీసుకొని ‘చలో పంటకాల్వ’  అని పొలాల్లో కి పట్టకెళ్లి మా వొళ్ళు  తోమేసేది. పంటకాల్వ దగ్గరికి పోవడం ఒక పిక్నిక్ లాంటిది మా పిలకాయలందరికీ,

పాపం మా ఊరి ఆడపిల్లకాయలు, ఎప్పుడన్నా నెల్లూరు కో , బుచ్చిరెడ్డి పాలెం కో సినిమాకెళ్లి  , అక్కడ ప్రకటనల్లో కన్పడే  సినీ తారల సౌందర్య రహస్యాన్ని వాళ్ళ నోళ్ళ ద్వారానే వినేసి,  మూకుమ్మడిగా ముచ్చట పడి,  కొనుక్కొచ్చుకున్న లక్స్ సబ్బులు,   మా ఊరి నీళ్ళకి నురుగు బదులు  ఒంటిమీద విరిగిపోయిన పెరుగులయిపోయేవి. 

ఈ కారణం చేత అందందేముందబ్బా, ఆరోగ్యం ముఖ్యం, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందొ ఆరోగ్యం అక్కడ వుంది అన్చెప్పి,  మా వూళ్ళో ఆడపిల్లంతా,  లైఫ్ బాయ్ కి బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయారు. 

నిత్యం ఉప్పునీళ్లతో  ఒళ్ళు ఉతుక్కున్నా,  మా ఊరి ఆడపిల్లకాయల కళే వేరబ్బా. 

ఇగన,  ఊరికి అవతలెక్కడో వున్నా మంచెళ్ల బాయి నుండి నీళ్లు తెచ్చుకోవటం పెద్ద ప్రహసనం. మా ఊరి అబ్బాయిలు బాధ్యత కల వాళ్ళో లేదో అనే విషయం,  యీ బాయి నుండి నీళ్లు తేవటం లో తెలిసిపోయేది. పెద్దోళ్ల మాటల్లో తరచూ వినపడేవి, “ఆ శేష మావ కొడుకు వయినమైనోడమ్మా! ఇంటికి సరిపడా నీళ్లు ప్రతీ దినం మోసుకొస్తాడమ్మా అనో లేక ఆ సుందరయ్య కొడుకు చాలా పెడద్రపోడమ్మా, ఏనాడన్న గుక్కెడు నీళ్లు తెచ్చి ఉండడు అనో”. 

నీళ్లు తెచ్చే వాడికే పిల్ల నిచ్చే వాళ్ళు  ఆ రోజుల్లో. 

ఇట్టానే నీళ్ల వాడకం బట్టి,  మా ఊరి ఆడోళ్లు కుటుంబాన్ని నడిపే పద్దతిని చెప్పేసే వాళ్ళు, ” ఆ ప్రమీలమ్మ కోడలిగా వచ్చిందమ్మా! ఆ ఈదలోళ్లు యీదిన పడ్డారమ్మా!  ఆ మహాతల్లి కడవల కడవల నీళ్లు పుసుక్కున పారబోసేదమ్మా అని. నీళ్ళేమన్నా వంటిమీద నిలుస్తాయమ్మా” అంటూ. 

ఎవరన్నా పిల్లలు తలి తండ్రులని సరిగ్గా చూసుకోకపోతే, “అంతేనయ్యా, నీరు పల్లమెరుగు అనో మానూరి నీళ్ళలో ఉప్పు పోదు మీ పిల్లకాయల్లో వుండే చెడు పోదు” అంటూ  ముసలి వాళ్ళ నిర్వేదం లో కూడా నీళ్ల ప్రసక్తే. 

మావూరి చెరువులోకి నీళ్లొచ్చే రోజుల్లో మటుకు  మా పిల్లకాయలకి పండగే పండగ. ఎప్పుడెప్పుడు చెరువు నిండుద్దా అని ఆత్రం గా చూసే వాళ్ళం. మా పెద్దకాయలేమో, ముందు తూములు ఎత్తేసి పొలాలకు పారిచ్చుకునే వాళ్ళు. అలా పొలాలన్నీ ఒక వారం ఒక తడవ తడిశాక,  తూములు బిగిచ్చి చెరువు నిండనిచ్చే వాళ్ళు. మాకైతే పెద్ద వాళ్ళు  ఈ పని చేయటం నచ్చేది కాదు. ఎప్పుడు చెరువు నిండుతుందా అని రోజూ చెరువు దాకా  పరిగెత్తి చూసే వాళ్ళం. అలా నిండిన చెరువు ఎండటం,  మళ్ళీ  నిండటం మళ్ళీ  ఎండటం,  అనేది నీళ్లు నేర్పిన పాఠం నాలాంటోడికి. 

నేనెప్పుడైనా మంచెళ్ల బాయి దగ్గరకు వెళ్ళినప్పుడు, మాఊరోళ్ళే  కొంతమంది  వచ్చి, ఎవరన్నా జాలి తల్చి,  వాళ్ళ బిందెల్లో కొన్ని నీళ్లు  పోస్తారా,  అని ఎదురుచూస్తూ  , ఓ  పక్కన నిలబడ్డం,  చూసేవాణ్ణి.  

వాళ్ళను  మటుకు నీళ్లు తోడుకొనిచ్చే వాళ్ళు కాదు ఈ బావిలోంచి.  “ఇదేంది మందలా” అని మా వాళ్ళని అడిగితే “అదంతే!  నీకు తెల్దులే అబ్బయ్యా” అనే వాళ్ళు మా ఇంట్లో పెద్దోళ్ళు. 

నేనే ఇంకొంచెం  పెద్దయ్యాక, నాకు అర్థమైంది, దేవుడు పోసిన నీళ్లు తాగాలన్నా, మనుషుల్లో వుండే  ముందూ వెనకల్ని బట్టేనని చెప్పి. 

ఒక పదేళ్ల క్రితం అనుకుంటా  మా వూరికి కుళాయిలొచ్చాయి. అంటే ఇప్పుడూ ముందూ వెనకాల ఏవీ లేవు. ఊరి  జామ చెట్టు కాయలు కూడా తియ్యబడ్డాయ్. వూరంతా తాగేది ఒకే నీళ్లు , మంచి నీళ్లు. 

పేరు మటుకు ఉప్పలపాడే. కొన్ని కొన్ని మారవు. మారడానికి టైము పడుతుందేమో.

“మా ఊరి నీళ్ల పురాణాలు – హర్ష” కి 4 స్పందనలు

  1. Excellent… seems like I am becoming fan of your writings… thank you. Similar setup in our villages also when we were kids…

    1. Thank you Bhujang..stories about soil and water have universal acceptance

  2. bale rasaru meru chala bavundi

Leave a Reply to BhujangCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading