Apple PodcastsSpotifyGoogle Podcasts

స వెం రమేష్ గారి ‘ఉత్తర పొద్దు’ – ప్రళయ కావేరి కథలు నుంచి

‘ప్రళయకావేరి కథలు’రచయిత స.వెం.రమేశ్  ఎం.ఎ. (ఆంత్రొపాలజీ,)ఎం.ఎ. (తెలుగు) చదివారు. తెలుగు భాషకోసం అంకితమై పనిచేస్తున్న కార్యకర్త స.వెం.రమేశ్. తమిళనాడులోని తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధి ఆయన  కార్యక్రమం.  తెలుగు భాషోద్యమ స్ఫూర్తితో చెన్నై కేంద్రంగా తమిళనాడులో తెలుగు భాషాపరిశోధన, బోధన, ప్రచారాల కోసం ప్రారంభమైన ‘తెలుగువాణి’ (ట్రస్టు) సభ్యుడుగా, పూర్తి సమయ కార్యకర్తగా వున్నారు.

ఉత్తర పొద్దు కథను మీకు హర్షణీయం ద్వారా అందించడానికి అనుమతినిచ్చిన స వెం రమేష్ గారికి కృతజ్ఞతలు.

‘ప్రళయకావేరి’ అందమైన పేరుగల అందమైన సరస్సు, ఆంధ్రప్రదేశ్‍లోని నెల్లూరు జిల్లాలో ఎక్కువగా, తమిళనాడు తిరువళ్ళూరు జిల్లాలో కొద్దిగా పరుచుకున్న ఉప్పునీటి సరస్సు. ప్రళయకావేరి తల తమిళనాడులో, మొండెం ఆంధ్రలో. సరస్సులో నలభై వరకూ దీవులు. మనిషికీ మనిషీకి, దీవికి దీవికి నడుమ కంటికి కనిపించని అనురాగ సేతువులు. ప్రళయకావేటి పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఆ పల్లీయులనోట ఎన్నెన్ని కథలో, ఎన్నెన్ని పాటలో…ప్రళయకావేటి పుట్టుక గురించి, ప్రళయకావేటి లోని పెద్దపుణ్యక్షేత్రం ‘పంటరంగం’ గురించి పల్లె పల్లెలోనూ రకరకాల కథనాలు.

ప్రళయకావేరి గుండెకాయ అయిన శ్రీహరికోటలో 1969 లో   రాకెట్ కేంద్రం నిర్మాణం కారణంగా దీవిలోని ప్రజలు నిరాశ్రయులైనారు. చంగలపాలెం,  కాకరమూల, కిళివేడు, రవణప్ప సత్రం, వంటోరిపాళం, సూళ్లదొరువు వంటి పలుగ్రామాల ప్రజలను,  నూరుమైళ్ల దూరంలోని మెట్టపొలాలకు తరిమింది కేంద్రప్రభుత్వం.

పల్లెబతుకులతోపాటు అక్కడి ప్రాచీనదేవాలయాలు కూడా శిథిలమై రాకెట్ కేంద్రం స్థాపన మూలంగా నాశనమై పోయాయి. ఆ తరువాత పదేళ్లకు అభివృద్ధి పేరుతో ప్రళయకావేరి దీవుల్లో వేసిన గులకబాటలు, కరెంటుతీగెలు పట్టణనాగరికతను పల్లెలోకి తెచ్చింది. ప్రభుత్వంవేసిన గులకబాటలు, వర్షాధారమైన తమిదల్ని పండించడం మానివేసి, వరి పండించుటకై ప్రజలు వేసుకున్న చెరువుకట్టలు కలిసి, ప్రళయకావేట్లోని సహజమైన ఉప్పునీటిని కదలకుండచేశాయి. ప్రళయకావేట్లో కలిసే ప్రవాళం, కాళంగి, స్వర్ణముఖి, అరుణ కరిపేరు, చిలికేరుల్లో వానలేకా, ఎగువ ఆనకట్టలు కట్టెయడం వలన నీరు పారడం అగిపోయింది. ముఖద్వారాలలో ఇసుకమేటవేసి ఆటుపోట్లద్వారా వచ్చే సముద్రపు నీరు తగ్గిపోయింది. పేటలోని సినిమాలు మరిగి, ప్రళయకావేటి వారు జానపదాలను మరచిపోయినారు. ఇందతా, కళ్లముందే ఒక్క బతుకులోనే, తటాలున, చటుక్కున మాయమైపోవడం, అంతరించిపోతున్న ఆ సరస్సు జీవనాన్ని చూస్తూ తపించిపోయిన రచయిత నాటి వైభవాన్ని సజీవంచేసి, పాఠకులముందుంచిన ప్రయత్నమే ఈ ‘ప్రళయకావేరి కథలు’.

ఆనాటి ప్రళయ కావేరి సరస్సు   ఈనాటి  ‘పులికాట్’  లేక్. 

‘ప్రళయ కావేరి కథలు’ పుస్తకం కొనాలంటే – https://bit.ly/2TXhEub

మా ఊరిని ఆనుకొనే ఉంది. ప్రళయకావేరి. సుమారు ముప్పై మైళ్ల పొడవు .. పది మైళ్ల వెడల్పు ఉన్న సరస్సు అది. ప్రళయ కావేట్లో నలభై వరకూ దీవులు న్నాయి. వాటికి రకరకాల పేర్లు. వాటిల్లో కొన్ని దీవుల్లో మాకు చుట్టాలున్నారు.

ఆ దీవుల్లో ఒకటి ‘జల్లల దొరవు.’ విసిరేసినట్లు ఒక మూలగా ప్రళయకావేరి ఒడిలో ఒదిగి ఉండేది. ఆ దీవిలో నాకు వరసకు మామ ఒకాయన ఉండేవాడు. వాళ్లింటికీ మా ఇంటికీ రాకపోకలు ఉండేవి. నేను కూడా అప్పుడప్పుడూ అక్కడకు పోతుండేవాడిని.

జల్లల దొరువు ప్రయాణమంటే చిన్న విషయం కాదు. తెల్లవారి అయిదు గంటలకు మొదలుపెడితే రాత్రి ఏడుకో, ఎనిమిదికో ఆ దీవికి చేరేవాళ్లం. అంటే ఒక పగలంతా ప్రయాణమే. కాసేపు నీళ్లల్లో నడిచి కాసేపు దీవుల్లో నడిచి ఒక దీవి నుంచి ఇంకో దీవిని దాటి చేరుకోవాలి. ఇంతా చేసి మా ఊరికి, జల్లల దొరువుకి నడుమ దూరం పాతిక కిలోమీటర్లలోపే.

ప్రళయకావేట్లో ప్రయాణం ఒక వింత అనుభూతి. నడిచి నడిచి కాళ్లు పీకుతున్నా, ఇంకా నడవాలనే మనసు పీకుతుంటుంది. ఎండా, వానా, మంచు…. ఇవన్నీ కాలానికి అనుగుణంగా సరస్సులో ఎరగనన్ని వన్నెలు చూపించేవి. మా ప్రయాణం ముచ్చట్లు మొదలు పెడితే మీకూ తెలుస్తాయి ఆ వన్నెచిన్నెలు.

ఒకసారి నేనూ, మా వెంకటన్న, నా నేస్తాలు శీనయ్య, చెంగయ్య నలుగురం ప్రయాణం కట్టినాము ప్రళయకావేరిలో, శీనయ్య, చెంగయ్యలు ‘రాగన్న పట్టెడ’కు, నేనూ, మా అన్న జల్లల దొరువుకు. అప్పుడు నా వయస్సు పన్నెండో, పదమూడో ఉండొచ్చు. అప్పటికి ఉత్తరకార్తె పెట్టి రెండు దినాలయింది. ఆ ఏడాది మఖ, పుబ్బల్లోనే గట్టి వానలు పడినాయి. అందుకే మా అమ్మకూ, మా అవ్వకూ మా ప్రయాణమంటే దిగులు.

‘దార్లో వానొస్తే ‘రాగన్నపట్టెడ’లోనే నిలిచిపోండి. ఉత్తరపొద్దులో కావేట్లో దిగబాకండి’ మా అమ్మ హెచ్చరించింది.

‘ఉత్తరపొద్దంటే వాళ్లకేం తెలుస్తాదమ్మే’ అని మాయమ్మని ఒక్క కసురు కసిరింది మా అవ్వ.

మావైపు తిరిగి ‘నాయినా ! మద్దినేళ మడకలిప్పే పొద్దులో పెళయకావేట్లో నడవబాకండ్రా’ అనింది. 

‘పునమాల తిప్ప దాటినాక, చిన్నతోటకు పొయ్యే దాకా దిగులుతిప్పలెక్కువ. చూసి నడవండి’ మా పెద్దమ్మ సలహా ఇచ్చింది.

 ‘దిగులుతిప్ప’ అంటే ఒక రకమైన బురదగుంట. ఊబి కాదు. ఇందులోకి దిగితే నడుములదాకా కూరుకుపోతాము.

‘ఉత్తరపొద్దు బిడ్డల్ని ఏమారస్తాదేమో’ మా అమ్మ గొణగసాగింది.

ఆడవాళ్ల సణుగుడంతా విన్న మా తాత లేచి, ‘మేయ్! గమ్మునుంటారా? లేదా? అయినా పంట రంగస్వామి లేదా. ఏదన్నా అయితే చూసుకొనేదానికి. పోయిరానీ వాళ్లని’ అన్నాడు.

మా వైపు చూసి, ‘అబయా. నలగామూల దాటినాక పెళయకావేరమ్మకు సక్కలగిలెక్కువ. మునేళ్లు అదిమి పెట్టి నడవండి. లేకపోతే గెబ్బిడు గెబ్బిడు ఎంట్ర కాయల్ని జవరాల్సిపడతాది’ అన్నాడు. 

అంటే నలగామూల దగ్గర జారుడు ఎక్కువ. జాగ్రత్తగా నడవకపోతే పడతామని చెప్పడం. అప్పటికి మా పల్లెల్లో తమదల (రాగుల) వాడకం ఇంకా ఉంది. చిక్కటి మజిగ కలిపిన గట్టి అంబలిని స్టీలు టిఫిన్లో పోసిచ్చినారు. అట్లే రెండు పులుసన్నం  పొట్లాలు  కట్టిచ్చినారు. 

తెల్లవారి ఆరుగంటలకు ‘అటకానితిప్ప’కు పొయ్యే బస్సు ఎక్కి కూచున్నాము. బస్సు బయల్దేరి కసారెడ్డిపాళెం, చెరువుకండ్రిగ, దావాది గుంటలు దాటి కుదిరికి వచ్చింది. 

కుదిరి వస్తే మా ఆనందం ఎక్కువవుతుంది. కదిరి దాటగానే ప్రళయ కావేరి మొదలవుతుంది. ఇక కనుచూపు మేరా నీలాలు ఆరబోసినట్లు నీళ్లు.

ప్రయాణించి ‘అటకానితిప్ప’లో మమ్మల్ని దించింది,  బస్సు. కావేరిలోని దీవులకు కేంద్రం ‘అటకానితిప్ప ‘దీవి. దీవులలో ఉండేవాళ్ళు  ఆ పేటకు (మా ఊరికి) రావాలంటే ‘అటకాని తిప్ప’కు వచ్చే బస్సు ఎక్కాలి.

మూడునాళ్లుగా ముసురుపట్టిన మబ్బుల చాటు నుంచి సూర్యుడు తొంగి తొంగి చూస్తున్నాడు. 

అటకాని తిప్పలోని వినాయకుడి గుడి దగ్గరకు పోయి తెచ్చుకొన్న అంబలిలో కొంచెం తాగినాము. ..

‘ఏ ఊరికి సిన్నా?’ ఒక ముసలాయన అడిగి నాడు. ‘మేము జల్లల దొరువుకీ, వీళ్లు రాగన్నపట్టెడకీ’ ఇద్దరి తరపునా నేనే చెప్పినాను.

 ‘జల్లల దొరువా ! నాయినా దూరాబారం బొయ్యేవోళ్లు. బిన్నా బయల్దేరండి. తూరుపుగాలి మళ్లింది. వానొస్తాదేమో! ఇప్పుడు పెళయకావేట్లో దిగితేగానీ సద్దికూటేళ్లకు ‘కొరిడి’కి పోలేరు. ఉత్తరపొద్దులో యాడ్నో ఒక దెగ్గిర నిలబడిపోండి’ అన్నాడా ముసలాయన.

మేము ఆ మాటతో దెబగుబా ప్రళయకావేట్లో దిగినాము. తూరుపు నుంచి చల్లగాలీ లేత ఎండా కలిసి మమ్మల్ని గిలిగింతలు పెడుతున్నాయి. వానలు బాగా పడి సరస్సంతా నిండుగా ఉంది. అడుసు మీగాళ్లనూ, నీళ్లు మోకాళ్లనూ దాటుతున్నాయి. వలసపక్షులు కూడా కొంచెం ముందుగానే వచ్చినట్లుండాయి. ఉల్లంకి పిట్టలు వేలకు వేలు బార్లు కట్టి నిలబడి ఉన్నాయి. వాటి రెక్కల పసిమి ఛాయ, నీటి నీలివన్నె, ఎండ బంగరు రంగు కలిసి ప్రళయ కావేరి కొత్త హొయలు పోతోంది..

రెండుగంటల సేపు నీళ్లల్లో కాళ్లీడ్చుకొంటూ సాగిన మా నడక ‘కొరిడి’ దీవికి చేరి కుదుటపడింది. దీవంటే గట్టినేల. కాలు చకచకా సాగుతుంది. అప్పటి దాకా గిలిగింతలు పెట్టిన సూర్యుడు చుర్రుమనిపిస్తూ పైకి లేస్తున్నాడు. పేముపొదల దొరువులో కాళ్లు కడుక్కొని, తియ్యని ఆ నీళ్లు తాగి, నడక సాగించినాము.

కొరిడి దీవంతా చిట్టడవి. ఆ అడవిలోని పాల పండ్లు, కలిగిపండ్లు, బీరపండ్లు, బిక్కిపండ్లు, నిమ్మకాయలు, ఊటిపండ్లు, గొంజిపండ్లు, బలిజపండ్లు, ఎలికిచెవులూ,పిల్లొట్టలూ కోసుకొని తింటూ సాగుతున్నాం. అడివంతా చిన్న చిన్న, రంగురంగుల పిట్టలు. వింత వింతగా పలుకరించుకొంటూ, కులుక్కుంటూ, గిలుక్కుంటూ, చెట్టు చెట్టుకు చెంగున ఎగురుకొంటూ చెటాలున దోవకడ్డంగా పరుగెడుతూ మమ్మల్ని పలుకరిస్తున్నాయి.

కొరిడి దాటిన తరువాత మళ్లీ ప్రళయకావేరిలో గంటన్నర ప్రయాణం. తరువాత కొల్లపట్టు దీవి. కొల్లపట్టు నుంచి గంట ప్రయాణంలో తోటకట్ల.

తోటకట్లకు చేరేసరికి మిట్టమద్దినేళ అయింది. ఎండ కసిగా కొడుతోంది. గాలి ఎంత చల్లగా తగులుతున్నా చెమట కారుతూనే ఉంది. తోటకట్ల తరువాత గంట నడిస్తే ‘రాగన్న పట్టెడ’ వస్తుంది.

మాతోపాటు తెచ్చుకున్న తిండి ఎప్పుడో అయిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు రాగన్న పట్టెడకు చేరుకొన్నాం. మా నేస్తాల ఊరు అదే. మేమ ఐతే సగం వచ్చినట్లు. మా నేస్తాల ఇళ్లలో మమ్మల్ని చూసి చాలా సంతోషించినారు. చెంగయ్య వాళ్ల అమ్మ ఆదరాబాదరాగా సంగటి గెలిగి, ‘చెనిగపప్పుల ఊరిబిండి’ నూరి కడుపు నిండా పెట్టింది.

‘ఈ పొద్దు ఈడ్నే ఉండి రేపు బయదేలిపోండి నాయినా. ఉత్తరపొద్దు పెయాణం మంచిది కాదు’ అన్నారు వాళ్లింట్లోని పెద్దలంతా.

ఎప్పుడెప్పుడు జల్లలదొరువు పోదామా అని ఆత్రుతలో ఉన్న మేము వారి మాటలను వినలేదు. నేనూ, మా అన్నా బయలుదేరినాము.

ప్రళయకావేట్లో మిట్టమద్దినేళ ప్రయాణం కొంచెం కష్టమే. ఎండకు నీళ్లు తళతళలాడుతూ కళ్లను జిగేలుమనిపించి దారి తప్పేటట్లు చేస్తాయి. దారి తప్పి మిట్టకు పోయినామా నీళ్ల వేడికి కాళ్లు బొబ్బలు లేస్తాయి. పల్లానికి పోయినామా, ఏ దిగులుతిప్పో తగిలి నడుము లోతు అడుసులో కూరుకుపోతాము. 

దోవ పొడవునా అనుభవం ఉండే పెద్దలు అక్కడక్కడా కట్టెపుల్లలు నాటి ఉంటారు. వాటిని చూసుకొంటూ నడవాలి…

రాగన్నపట్టెడ తరువాత గంటన్నర నడకలో ‘పంట రంగం’ ఉంది. ఆ దీవిలో ఎవరూ కాపురం ఉండరు. పాతకాలం నాటి శివాలయం ఉంది అక్కడ. ప్రళయ కావేరి ప్రయాణీకులు ఆ శివాలయం దగ్గర విశ్రాంతి తీసుకొని పోతుంటారు. త్వరగా పోవాలనుకునే వారు శివాలయానికి పోకుండానే మరో గంట ప్రయా ణంలో వచ్చే ‘చిన్నతోట’వైపు సాగిపోతారు. మేమూ అట్లాగే పోవాలనుకొన్నాం. కానీ మేమనుకొన్నట్లు జరుగ లేదు.

రాగన్న పట్టెడ  తరువాత అరగంట నడిచినామో లేదో తూరుపు నుంచి పశువుల పండక్కి పరుగెత్తే బర్రెల మందలాగా గుంపులు గుంపులుగా మొయిళ్లు (మబ్బులు) బయలుదేరినాయి.

 మరుక్షణంలోనే నల్లగా మూసుకొనింది. కంటికి మింటికి ఏకధారగా వాన మొదలయింది.

ఒక మేము చిన్నతోటకు పోయే ఆలోచన మానుకొని పంటరంగం చేరుకొనేందుకు త్వరత్వరగా నడవసాగినాము. ఎగువ నుంచి ప్రవాళం వాగో, కాళంగి నదో పరుగెత్తుకొచ్చి ప్రళయకావేట్లో పడినట్లుంది. ప్రళయకావేట్లో సుళ్లు పుటినాయి. దోవ పక్కన నాటిన పుల్లలు కొట్టుకొని పోయినాయి. మాకు పంటరంగం దీవి కంటి కానడంలేదు. మధ్యాహ్నం మూడు గంటలు కూడా అయి వుండదు.

కానీ చీకట్లు ముసురు కొన్నాయి. మేము గుడ్డి గురుతులలో చాలాసేపు నడిచి, నడిచి చివరకు పంటరంగం చేరుకొన్నాము. ఆ దీవంతా పెద్ద పెద్ద మానులతో చిక్కటి అడవి. వాటి మధ్యలోనే శివాలయం ఉంటుంది. ఆ గుడి దగ్గరకు పోతే, ఎవరో ఒకరుప్రయాణీకులు ఉంటారు. కానీ గుడి దగ్గరకు పోవడానికి కాలిబాట కూడా దొరకడం లేదు. చివరకు నీటివరవను పట్టుకొని ఎదురు నడిచినాము. ఆ వానలోనే గంటకు పైగా ఆ దీవిలో నడిచినాము. శివాలయం జాడే లేదు. నాకు చలికి తోడు, భయం కూడా మొదలై వణుకు ఎక్కువయింది. తిరిగి, తిరిగి గుడి కనబడక ఒక మర్రిచెట్టు కింద నిలబడినాము.

చీకటి చిక్కబడుతోంది. ఏనుగు తొండంతో చల్లినట్లు వాన కురుస్తూనే ఉంది.

నేను భయంతో మా అన్నకు దగ్గరగా జరిగి నిలబడినాను. ఆయన పరిస్థితీ నాలాగే ఉన్నట్లుంది. నాకన్నా ఒక ఏడాది పెద్దవాడంతే. ఇద్దరమూ ఏమీ మాట్లాడుకోవడం లేదు. ఒకరికొకరం బాగా ఆనుకొని నిలబడినాము. 

ఇంతలో”ఎవుర్రా  ఆడ, ఇయ్యాళప్పుడు ఈడకొచ్చింది?’ అని కేక వినపడింది.

మెరుపుననుసరించే ఉరుము లాగా, కేకతోపాటు మనిషీ మా ముందుకొచ్చినాడు. నల్లగా, నిలువెత్తు మనిషి. తెల్లజుట్టు, ముడుతలు పడిన మొహం, వయసుడిగినా కండలు తిరిగిన దేహం.

‘మేము జల్లల దొరుకువు పోవాల తాతా! రాగన్న పట్టెడ దాటినాక వానొచ్చింది. పంటరంగం గుళ్లో తల దాచుకొందామని వచ్చినాము. గుడి కనబడక ఈడ నిలబడినాం తాతా’ మా అన్న అన్నాడు.

‘ఓరి కొడకా ! ఉత్తరపొద్దు ఏమార్చెను గదరా మిమ్మల్ని, పెద్దాళ్లే ఉత్తర పొద్దులో పెళయ కావేట్లో పెయాణం చెయ్యరు. ఏలిడంత లేరు మీరిద్దరూ. ఎట్ట దాటదామనుకున్నారా? సూడబోతే మిడిమాళపు బిడ్డలుగుండారే?” అన్నాడు ఆ తాత.

మాకేమీ అర్థంకావడం లేదు. మళ్లీ ఆ తాతే అడిగినాడు. ‘ఒరే! ఇప్పుడు మీరు యాడుండారో తెలుసా?’ అని.

మేమిద్దరమూ అయోమయంలో పడి ఏమీ మాట్లాడలేదు.

‘రాగన్న పట్టెడ నుంచి ఉత్తరానికి పోతే పంట రంగం. మీరు దోవతప్పి  తూరుపుకు నడిచి ‘రెట్టమూల’కు వచ్చుండారు. ఇది నరమానవులు తిరిగే దీవి కాదు. తెలుసా మీకు?’ తాత కంఠం ఖంగుమనింది.

మా పైప్రాణాలు పైనే పోయినట్లయింది. రెట్టమూల గురించి మా అవ్వా తాతలు అప్పుడప్పుడూ మాట్లాడుకొనే మాటలు గుర్తుకొచ్చినాయి.

‘రెట్టమూల’ కూడా ఒక దీవే. కానీ మనుషులెవరూ ఆ దీవికి పోరంట. కాలభైరవుడు ప్రేత గణాలతో ఆ దీవిలో తిరుగుతూ ఉంటాడంట. ఏడాదికొక సారి మాత్రం ఆ దీవిలో కాలభైరవుడి బొమ్మ దగ్గరకు చుట్టూ దీవుల్లో ఉండే వాళ్లు పొయ్యి పొంగళ్లు పెట్టి వస్తారంట. 

ఇవన్నీ గురుతొచ్చి నాకు ఏడుపొచ్చింది. గట్టిగానే ఏడవడం మొదలుబెట్టినాను. ఎంతసేపటి నుంచి అణుచుకొని ఉన్నాడో, మా అన్నా ఏడవడం మొదలు పెట్టినాడు.

‘రేయ్ ! అబ్బయ్యల్లారా ! ఏడవబాకండ్రా, నేనుళ్ళా’ అని ఆ తాత మాకు ధైర్యం చెప్పి ఆయనతో కూడా తీసికొని పోయినాడు. కొద్దిదూరం నడిచి ఒక చిన్న గుడిసె దగ్గరికి పోయినాము. ‘ రాండ్రా లోపలికి” అన్నాడు తాత.

లోపల తాత పొయ్యి రాజేసి మంట పెట్టినాడు. మేము మంట దగ్గర కూర్చుని చలి కాసుకొన్నాము. తాత అన్నం వండి, తక్కోలం (టమోటా) కాయలు పులుసు పెట్టినాడు. చుట్టూ కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి. పొయ్యి మంట చీకటినీ, చలినీ గుడిసెలో నుంచి తరిమేస్తూ ఉంది. తాత మట్ట మూకుడులో అన్నం కలిపి మాకు చెరి నాలుగు పిడచలు చేతిలో పెట్టినాడు.

మాకు ప్రాణం కుదుటపడింది. తాత ఏవో తత్వాలు పాడడం మొదలుపెట్టినాడు. నాకు కడుపులో ముద్దపడి, ఒంట్లోకి వెచ్చదనం వచ్చేసరికి, బుర్ర పని చేయడం మొదలయింది. పొద్దున్నించీ నన్ను పీడిస్తున్న ఒక సందేహాన్ని తాత ముందు పెట్టినాను.

‘తాతా, తెల్లారినించీ చానామంది ఉత్తరపొద్దు, ఉత్తరపొద్దు అంటుండారు. అంటే ఏంది తాతా?’ అడిగినాను. 

‘ఓహోహో! ఎద్దు గిట్లో ముల్లంత లేవు. అప్పుడే ఇయ్యన్నీ నీకు దేనికిరా?’ అన్నాడు తాత.

నేను వదల్లేదు. ‘చెప్పు తాతా, చెప్పు తాతా’ అని విసిగించసాగినాను.

‘అబ్బ ! బొక్కలాడ బాక చెప్తానుండ్రా’ అని మొదలుపెట్టినాడు తాత.

 ‘ఒరే అశ్విని, బొరణి, కీర్తిక, రోయిణి… ఈ మాదిరిగా మనకు ఇరవై యేడు కార్తిలుండాయిరా. దాంట్లో ఉత్తరకార్తి ఒకటి. ఈ ఉత్తరకార్తిలో సూరయ్య మన పెళయకావేరమ్మతో కూడతాడురా.. 

‘కూడేదంటే ఏంది తాతా?’ మధ్యలో అందుకున్నాన్నేను.

 ‘ఆ?! గోగాకు పులగూర్రా. అందుకే ఇప్పుడు నీకర్థం  కాదు. నేను చెప్పను అనింది’ అన్నాడు తాత. 

‘సరే, సరే. నడిమిద్దిలో మాట్లాడను. చెప్పు తాతా’ అన్నాను.

 “అబయా! ఉత్తరకార్తిలో పెళయకావేరమ్మ కట్టుకొస్తాది. సూరయ్యకు ముడిడస్తాది. ఇద్దురూ కూడతారు. దానికే ఉత్తర పొయినాకనే పెళయకావేట్లో చేపా, రొయ్యా ఎచ్చయ్యేది. ఉత్తరకార్తి పన్నెండు, పదమూడు దినాలుంటది. ఈ దినాల్లో మద్దినేళ గాలి బిగేసే పొద్దులో వోళ్లిద్దరూ కూడేది’ అన్నాడు తాత.

‘గాలి బిగేసే పొద్దంటే ఎప్పుడు తాతా?’ ఈసారి మా అన్న అడిగినాడు.

‘మద్దినేళ రెండూ, మూడు మద్దిలోరా. వాళ్లు కూడేటప్పుడు ఎవరన్నా పెళయ కావేట్లోకి దిగితే సూరయ్యకు కోపమొస్తాది. దోవ తప్పించో, దిగులుతిప్పలో ఇరికించో కసి తీర్చుకొంటాడు. దానికే ఉత్తరపొద్దులో మరీ అవసరమైతే తప్ప ఎవురూ పెళయ కావేట్లో దిగరు. దిగినా సూరయ్యకూ, పెళయ కావేరమ్మకూ తప్పు చెప్పుకొని దిగతారు. మీకు తెలియక దిగి ఎన్ని అగచాట్లు పడినారో చూడండి. నేను లేకపొయ్యుంటే మీ గతేం కావాల?’ చెప్పినాడు తాత.

మా మనసంతా తాతంటే ఒక రకమైన ప్రేమతో నిండిపోయింది.

మాకిద్దరికీ గోతాలు పరిచి, పడుకోమని చెప్పి పొయ్యి దగ్గర కూర్చుని తత్వాలు పాడసాగినాడు తాత. మాగన్నుగా కన్ను మూతబడి మంచి నిద్రపట్టింది మాకు. తాత ఆ రాత్రి తిన్నాడో, నిద్ర పోయినాడో లేదో తెల్లవారి వెలుగుపడే వేళకు మమ్మల్ని తట్టి లేపినాడు తాత. ‘నేను కూడా మీతో ఆడదాకా వస్తాను పదండి’ అని బయలుదేరినాడు. తాత వెనుక చకచకా నడిచినాము. 

పొద్దు పుట్టేటప్పటికి పంటరంగం చేరుకొన్నాము. కోనేట్లో మునిగి, పంట రంగేశ్వరునికి మొక్కినాము. తాత రాత్రి మిగిలిన గంజి అన్నాన్ని సొరకాయ బుర్రలో పోసుకొని వచ్చినాడు. మమ్మల్ని తినమని దోసిట్లో పెట్టినాడు.

మేము తినిన తరువాత, ‘నేను ఈడనే నిలస్తాను. మీరు బద్దరంగా పొయి రండి’ అన్నాడు.

మేము తాతకు వీడుకోలు చెప్పి బయలుదేరి నాము. చిన్నతోట, పెద్దతోట, పాములతేరి, నలగా మూలలు దాటుకోని, గొడ్లు విప్పేవేళకు జల్లల దొరువుకు చేరినాము.

ఆ సమయంలో వచ్చిన మమ్మల్ని చూసి మా మామ ఆశ్చర్యపోయినాడు. ‘ఇంత పొద్దున్నే ఎటొచ్చిన్నారా?’ అని అడిగి నాడు. మేము జరిగిందంతా చెప్పినాము.

మా మామతోపాటు, ఊర్లో వాళ్లు నలుగురయిదుగురు విన్నారు మేము చెప్పిన మాటలు.

అంతా విన్న కుమ్మరోళ్ల రమణన్న లేచి ‘అయ్యా! సుధాకరయ్య…. ఆ పంటరంగ సామే మీ బిడ్డల్ని కాపాడినాడు. రెట్టమూల్లో ఇన్ని తరంతాలుగా నరమానవుడున్నట్లు ఎరగం. ఆ సోమే పెద్దాయన మాదిర వొచ్చి బిడ్డల్ని ఉత్తరపొద్దు నించి కాపాడినాడు. శివరేత్తిరికి కూటి పొరుపు (అన్నదానం) జేస్తానని మొక్కో’ అన్నాడు.

మా మామ పంటరంగం వైపు తిరిగి చేతులెత్తి మొక్కి, మమ్మల్ని గట్టిగా గుండెల కదుముకున్నాడు.

ప్రళయ కావేరమ్మతో కూడడానికి సూరయ్య చరచరా పైకి లేస్తున్నాడు.

పుస్తకం కొనాలంటే – https://bit.ly/2TXhEub

హర్షణీయం ఫేస్ బుక్ లో  –  https://www.facebook.com/Harsha051271

హర్షణీయం ట్విట్టర్ – @harshaneeyam

హర్షణీయం యూట్యూబ్ లో – https://bit.ly/harshayoutube

“స వెం రమేష్ గారి ‘ఉత్తర పొద్దు’ – ప్రళయ కావేరి కథలు నుంచి” కి 2 స్పందనలు

  1. ప్రళయ కావేరి కథలు ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు. సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్తూ ఉంటారు ‘ భారత దేశంలో కర్మ సిద్ధాంతాన్ని ముక్తి మోక్షం అంటూ వేదాంతం ప్రతీ ఒక్కరూ సునాయాసంగా చెప్తూ ఉంటారు’ అని . ఈ కథల్లో చదువుతుంటే ‘చదువు’ అనేది లేని వారు ఎన్ని విషయాలు చెప్పారా అనిపిస్తుంది. సైన్స్, లాజిక్, వేదాంతం అన్ని ఉంటాయి. స. వెం. రమేష్ గారి ఇంటర్వ్యూ కూడా విన్నానండీ . చాలా బావుంది. కర్ణాటక సంగీతంలో చాలా మటుకు తెలుగులోనే ఉన్నాయి ఎందుకో అనుకునేదాన్ని. సమాధానం వచ్చేసింది నాకు 🙂 ధన్యవాదాలండీ

Leave a Reply