స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు.
పొరుగు రాష్ట్రాలలో , బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలలో లక్షల సంఖ్యలో వున్న తెలుగు వాళ్ళు అనుభస్తున్న అస్తిత్వవేదన మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలియచేసారు రమేష్ గారు.
రమేష్ గారికి హర్షణీయం హృదయపూర్వక కృతజ్ఞతలు.
హర్షణీయం : స.వెం.రమేష్ గారు, హర్షణీయానికిస్వాగతం. రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో తెలుగును పునరుజ్జీవింపజేయాలనే కార్యక్రమం మీరెప్పుడు మొదలుబెట్టారు? ఎలా మొదలైంది? ఎందుకంటే మీరు ఎంఏ ఆంత్రోపాలజీ చేశారు, ఏంఏ తెలుగు చేశారు. ఈ ఆలోచన ఎలా మొదలైంది? దీని వెనకున్న నేపథ్యం ఏంటి?
స.వెం రమేష్ : నా ఆలోచనకు ముందు, మీ ప్రశ్నలో ప్రస్తావించిన ఓ సమాచారానికి చిన్న సవరణ. నేను ఎంఏ తెలుగు చేయలేదండి. ప్రళయ కావేరి కథల్లో చాలా అచ్చు తప్పులున్నాయి. నేను తెలుగు చదువుకోలేదు. బళ్లో మాకు తెలుగు లేదు. పదహారో యేట తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఎంఏ తెలుగు చేయవచ్చని ఒకసారి ఏదో పత్రికా ప్రకటన వస్తే దానికి అప్లై చేశాను. వాళ్లు పుస్తకాలు కొన్ని పంపించారు. పంపించారు కానీ నేను పోయి పరిక్ష రాయలేదు ఏమీలేదు. ఇది మా బాబాయితో చెబితే, ఆయన వినడం పొరపాటేమో తెలుగు ఎంఏ కూడా ప్రయత్నం చేశాడని చెప్పాడు. ఆ పుస్తకం వేసినతను తెలుగు ఎంఏ అని వేశాడు. బడి క్వాలిఫికేషన్ చూస్తే నాది ఒకటో తరగతి కూడా లేదు తెలుగులో. నేను ఒకటో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నా చదువంతా మద్రాస్ నగరంలోనే సాగింది. మద్రాస్ యూనివర్సిటీలోనే ఎంఏ ఆంత్రోపాలజీ చేశాను.
హర్షణీయం : ఎంఏ తరువాత ఏ పరిశోధన వైపో, ఉద్యోగం వైపో, టీచింగ్ వైపో వెళ్లకుండా ఈ ఉద్యమం ఎందుకు మొదలు పెట్టారు?
స.వెం రమేష్ : మద్రాసు నగరంలో చదువుకునేటప్పుడు ప్రతి కుర్రవాడికి, ప్రతి కుర్రదానికి తెలుగు, తమిళం గొడవనేది మొదలవుతుంది. నేను చదువుకున్న రామకృష్ణ మిషన్ స్కూల్ లో తెలుగు మీడియం ఉంది. మా నాన్నగారు వాళ్లే తెలుగు చదువుకోలేదు, కనుక నేను ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నాను. ఈ తెలుగు, తమిళం గొడవలకు దాదాపు వేలమంది సర్దుకునేస్తారు. ఎట్ల సర్దుకునేస్తారంటే మద్రాసు నగరంలో తెలుగు వాళ్లు రెండు రకాలు. ఆంధ్రప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్లు, మిగతా తమిళనాడు నుంచి వలస వచ్చినవాళ్లు. మిగతా తమిళనాడు నుంచి వలస వచ్చినవాళ్లు తరతరాలుగా తమిళమే చదువుకుంటూ ఉంటారు. వాళ్లెప్పుడో సర్దుకునేస్తారు. ఆంధ్రప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్లకు తెలుగుతో బాగా అనుబంధముంటది, రాయడం చదవడం ఇదంతా. వాళ్లు కొంతమంది తిరగబడతారు., ఆ మనకెందుకులే అనుకుంటే వాళ్ల ఊళ్లకు వాళ్లు వెళ్లిపోతారు. నేను అటూ ఇటు గానివాణ్ణి. మా అమ్మది ఆంధ్ర, నెల్లూరు జిల్లా. మా నాన్నది తమిళనాడు. మా అమ్మ తెలుగు చదువుకుంది. బ్రహ్మాండంగా సాహిత్యం చదివేది ఆమె తెలుగులో. కాబట్టి తెలుగు చదవకపోయినా నాకు తెలుగు పిచ్చి ఉంది. ఎవరో ఒకరు సర్ధుకోలేక వేలమందికి ఒకరు తిరగబడతారు. అది రకరకాలుగా ఉంటుంది. అప్పటికప్పుడు తిరగబడడం, అప్పటికప్పుడు కొట్లాడడం ఉంటుంది. సాహిత్యం ద్వారా తిరగబడడం ఉంటుంది. ఇట్ల మద్రాసు నగరంలో చాలా మంది తమిళ పెత్తనం మీద తిరగబడిన వాళ్లున్నారు. నా తిరుగుబాటు ఇదండి. ఏమిటీ నా తిరుగుబాటు అంటే? తెలుగు వాళ్ల ఉనికిని ఎందుకు పోగొట్టుకోవాలి?
అందుకని మద్రాసు నుంచి చదువు అయిపోగానే నా ప్రయాణం అలా మొదలైంది. తెలుగు రాష్ట్రాలని మీరన్నారు కదా… మాదీ తెలుగు రాష్ట్రమే. తమిళనాడు కూడా 1969లో డీఎంకే ప్రభుత్వం వచ్చిన తరువాత దానికి తమిళనాడు అనే పేరొచ్చింది. అంతకు ముందు తమిళనాడు అని లేదు కదా. తమిళనాడు అనే పేరు ఎక్కడ తమిళ సాహిత్యంలో ఎంత కూలంకషంగా వెతికి తిరగేస్తే కూడా ఎక్కడా లేదు. అది మద్రాసు రాష్ట్రం. మద్రాసు రాష్ట్రానికి ఇంకా ప్రాచీన కాలంలో ఇప్పుడుండే తమిళనాడు బార్డర్స్ చూసుకుంటే తొండ మండలం, చోళ మండలం, కొంగు మండలం, పాండ్య మండలం. అవి ఏ పేర్లతో ఉండేవి? ప్రత్యేక రాష్ట్రంగానూ, ప్రత్యేక దేశంగానూ పేర్లతో ఉండేవి. ఆరోజుల్లో భారత దేశం ఇలా లేదు కదా… చాలా దేశాలుండేటివి కదా. అట్ల చూస్తే వాటిని చోళ నాడు, పాండ్యనాడు, తొండ నాడు, కొంగునాడు ఈ నాలుగు ప్రధానమైనవి. దాట్లో తొండనాడు ఇప్పుడు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉంది. స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉన్న ప్రాంతం నాయుడు పేట, సూళ్లూరిపేట నెల్లూరు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు ఇవన్నీ తొండ మండలంలో భాగంగా ఉండేవి. ఇవి కాకుండా మొరసనాడు నుంచి ఒక ముక్క, హోసూరు దాంట్లో చేరింది. తగుడూరు నాడు అని ధర్మపురి జిల్లా. దాంట్లో తమిళనాడు కింద చేరింది.
హర్షణీయం : హోసూరు అంటే కర్ణాటకలోని ప్రాంతం కదా? అది కూడా ఇక్కడ నుంచి వలస వెళ్లిన తెలుగు వాళ్లు స్థిరపడిన ప్రాంతమా? లేక ఒరిజినల్ గా తెలుగు వాళ్లు ఉండేదేనా?
స.వెం రమేష్ : వలస వెళ్లిన వాళ్లు అంటే, వలసకి అర్థం వేరే ఉంటుంది. ఇప్పుడు చిత్తూరు జిల్లలో కాళహస్తి ప్రాంతాల్లో వ్యవసాయ కులాలకు చెందిన పంట రెడ్లని ఉంటారు. చిత్తూరు జిల్లాలోని కాళహస్తి, నాయుడు పేట, సూళ్లూరు పేట ఈ ప్రాంతాలకు పంటనాడు అని పేరు పాత రోజుల్లో. దీనికి ఉత్తరంగా నెల్లూరు, గూడూరు ప్రాంతాలకు పాకనాడు అని పేరు. ఇక్కడ పాకనాటి రెడ్లూ ఉంటారు. అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్లు. ఎప్పుడు వలస వచ్చారు. పాకనాటి రెడ్లు తెలంగాణలో కూడా ఉంటారు. ఎప్పటి వలస ఇదీ, చెప్పలేం. కృష్ణానదికి పేరకమ్మ అని పేరు శాసనాల్లో. కమ్మ అంటే నది ఒక అర్థం తెలుగులో. గుండ్ల కమ్మకి, పేర కమ్మకి నడుమనుండే సముద్రతీరం ప్రాంతానికి కమ్మనాడు అని పేరు. అక్కడ వ్యవసాయం చేసిన వాళ్లు కమ్మవాళ్లు. కాబట్టి ఈ వలస ఎప్పటిదీ? వేల సంవత్సరాల నాటిది. నేనొక ఆంత్రోపాలజిస్టుగా చెప్పేదేమిటంటే మొట్ట మొదటి ఉత్పత్తి దశలోకి వచ్చిన వాళ్లు ఏ భాషవాళ్లు ఈ దేశంలో అంటే తెలుగు వాళ్లు. వాళ్లు మొట్ట మొదట ఉత్పత్తి దశలోకి రావడం వలన ఉత్పత్తి కోసం అంటే వ్యవసాయం కోసం నేలను వెతుక్కుంటూ (ఉన్న జనాభాకు నేల సరిపోకపోవడం వల్ల) దూర దూర ప్రాంతాలకు విస్తరిస్తూ వెళ్లారు. కాబట్టి తెలుగు వాడి ఎల్లలు ఏమిటీ అంటే? ఉత్తరాన వింధ్య పర్వతాలు, దక్షిణాన కన్యాకుమారికి ఉత్తరంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వానమామల కొండలు, పడమటి హద్దు పడమటి కనుమలు, తూర్పు హద్దు బంగాళాఖాతం. ఈ నడుమల ఉండే తెలుగువారెవరూ వలసపోయిన వాళ్లు కాదు. వీటికి అవతల ఉండేవాళ్లు వలసపోయిన వాళ్లు. పశ్చిమ కనుమలు దాటి ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో తెలుగు వాళ్లు ఉంటే వాళ్లు వలసపోయిన వాళ్లు. కన్యాకుమారి జిల్లాలో తెలుగువాళ్లు ఉంటే వాళ్లు తెలుగువాళ్లు. వింధ్య పర్వతాలకు అటువైపు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో తెలుగువాళ్లు ఉంటే వాళ్లు వలసపోయినవాళ్లు. వింధ్య పర్వతాలు, వానమామల కొండలు, పశ్చిమ కనుమలు, వంగ కడలి వీటి నడుమనుండే తెలుగు వాళ్లు వలసపోయినవాళ్లు కాదు. ఇదంతా తెలుగునేలే. ఈ తెలుగు నేలలో కొన్నిచోట్ల తెలుగువాళ్లతో పాటు తమిళులూ ఉన్నారు, కొన్నిచోట్ల కన్నడిగులూ ఉన్నారు, కొన్నిచోట్ల ఒడియా వాళ్లూ ఉన్నారు. ఇట్ల తెలుగు వాళ్లతో పాటు కొన్ని కొన్ని తావుల్లో కొన్ని కొన్ని భాషల వాళ్లు కలిసిమెలిసి ఉన్నారు. కొన్నిచోట్ల ఏ భాషల వాళ్లతో కలవకుండా తెలుగువాళ్లే ప్రత్యేకంగా ఉన్నారు. కృష్ణా నదీ, గోదావరి నదీ ముఖద్వారాల ప్రాంతాలంతా ప్రత్యేకంగా తెలుగువాళ్లు మాత్రమే ఉన్నారు. అంతేగాని, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశో, ఇప్పుడున్న తెలంగాణనో మాత్రమే తెలుగు రాష్ట్రాలు… మిగతావన్నీ కాదు… అనేది సరైంది కాదు.
ఒకప్పుడు సాధు వరదరాజం పతులు గారని ఆయన దక్షిణాంధ్ర అని ఒక పత్రిక నడిపారు. ఆయనది తిరునల్వేని జిల్లా. మధురకు చాలా దగ్గర. అక్కడ ఆయన దక్షిణాంధ్ర అనే పేరుతో పత్రిక నడిపి, తమిళనాడును దక్షిణాంధ్ర అని పిలిచేవాడు ఆయన. ఆయన 1970వ దశకంలో చనిపోయారన. ఇదేమీ పాత చరిత్ర కాదు. కాశీనాధం నాగేశ్వరరావు ఆయనను పొగిడారు. దక్షిణ తమిళనాడులో అంటే వైగా నదికి దక్షిణాన ఆయన మెడలో ఒక పొడవాటి అట్టేసుకొని పైన తెలుగు లిపిలో తల్లి భాష తెలుగును కాపాడుము అని, దాని కింద తమిళ భాషలో తల్లి భాష తెలుగును కాపాడుము అని రాసుకొని వెయ్యికిపైగా పల్లెల్లో కాలినడక తిరిగాడు. దక్షిణాంధ్ర అని పత్రిక నడిపారు. రాజపాలెం అని మధురకి శివకాశీ, శ్రీవిల్లి పుత్తూరు ఆ ప్రాంతాల్లో ఉంటుంది. అక్కడ రాజులు ఎక్కువగా ఉంటారు. వాళ్లలో ముదునూరి జగన్నాథ రాజా గారు ఆయనకు ముఖ్య శిష్యులు. జగన్నాథ రాజా గారు సుమారు పదిహేనేళ్ల క్రితం చనిపోయారు. రాజపాలెంలో కనీసం ఇప్పటికీ ఏడెనిమి వేళ్ల మంది తెలుగు బాగా చదవగలిగిన వాళ్లు ఉన్నారు. అట్ల దక్షిణాదిన వరదరాజం పతులు కొంత ప్రభావం చూపించారు.
మేము తమిళనాడు అనే పేరుని ఇప్పుడు కూడా మేము ఒప్పుకోవడం లేదు. మేము అంటే నేను, నాతోపాటు కొంతమంది కలిసి పనిచేసే స్నేహితులు మేము ఎక్కడైనా రాసేటప్పుడు కూడా తెన్నాడు అని రాస్తాం. అంటే దక్షిణ ప్రదేశం. తెన్ అంటే దక్షిణం. తెన్ను అంటే ద్రావిడ భాషలన్నిటిలో దక్షిణం అనే. కాబట్టి తెలుగు వాళ్లం, తమిళవాళ్లం కలిసిఉన్నాం. అది తెలుగువాళ్ల నేలే అని చెప్పడంలేదు. తెలుగువాళ్లతో పాటు తమిళులూ కలిసిమెలిసి ఉన్నారు. ఎప్పటినుంచీ? వేల సంవత్సరాలుగా ఆ నేల మీద తమిళులు ఎంత ప్రాచీనులో, తెలుగు వాళ్లూ అంతే ప్రాచీనులు. కాబట్టి మేము తెన్నాడు అని పిలుచుకుంటున్నాము.
ఒక వందేళ్ల క్రితం దక్షిణ తమిళనాడులో అంటే మధుర, తిరునల్వేలి, (నిజానికి అది తిన్నివెల్లి. అనేవాళ్లు బ్రిటీష్ వాళ్లు కూడా తిన్నివెల్లి అనే రాసేవాళ్లు. తిరునల్వేలి అని లేదు. ఇంకా పాతరోజుల్లోకి పోతే తమిళులు సాహిత్యంలో ముంగిల్ కాడు అని రాసుకున్నారు. తిరునల్వేలి అని కొత్త పేరు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని ఊర్లపేర్లు మార్చేశారు.) కొమురవెల్లి ప్రాంతాల్లో తమిళులు ఇంట్లో తమిళం మాట్లాడుకొని వీథిలోకి వచ్చిన తరువాత తెలుగు మాట్లాడేవాళ్లు. అంటే వీథి భాష తెలుగు అక్కడ. వందేళ్లలో ఏమైపోయిందంటే తెలుగువాళ్లు ఇంట్లో తెలుగు మాట్లాడుకొని, వీథిలోకి వెళ్తే అమ్మా కొడుకు కూడా తమిళం మాట్లాడుకుంటున్నారు. వందేళ్లలో ఎంతదూరం తీసుకెళ్లారంటే… దాన్ని మెచ్చుకోవాలి మనం. తమిళ నాయకులు, తమిళ మేధావులు తమిళాన్ని ఎంత వేగంగా పైకి తీసుకువచ్చారంటే ఈ రోజు ప్రపంచంలో బాగా ఎదిగిన భాషలని పది భాషల జాబితా తీస్తే దాంట్లో తమిళం ఒకటి. మనం ఏమీ పట్టించుకోలే. అప్పటి నుంచీ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే, మా ఉనికిని మేం కాపాడుకోవాలి.
హర్షణీయం : మొట్ట మొదట ఎలా మొదలుబెట్టారు? మీరు కాలేజీ నుంచి ఎంఏ ఆంత్రోపాలజీ పూర్తిచేసుకొని బయటికి వచ్చాక ఏం చేశారు?
స.వెం రమేష్ : ఎక్కువ తిరిగాను. తిరగడం ఇష్టం. అంటే తెలుగుకోసం తిరగడం అని కాదు. ఊళ్లు చూడ్డం. పర్యాటక ప్రాంతాలు తిరగడం కాదు. జనాలతో వెళ్లడం ఇష్టం. నా సబ్జెక్ట్ అది. సంచార తెగలమీద పరిశోధన ఇష్టం. ఆశ్రిత కులాలు (ఉపకులాలు) తెలుగువాళ్లకు చాలా ప్రత్యేకం. తమిళ వాళ్లకు ఉండవు. తమిళం మాట్లాడే కులాల్లో ఒక మూడునాలుగు కులాలకే ఉప కులాలు ఉంటాయి. తెలుగువాళ్లకయితే దాదాపు అందరికి ఉంటాయి. ఇప్పడు బ్రాహ్మణులయితే విప్ర వినోదులని వస్తారు. తెలుగు బ్రాహ్మణులనే ఆశ్రయిస్తారు. తమిళనాడుకు వస్తే విప్ర వినోదులనే పేరు ఉండదు. పీతాంబర్ అయ్యర్ అంటారు వాళ్లని. వాళ్లు తమిళనాడులో కూడా తెలుగు బ్రాహ్మణులకే ఉప కులం. వడమ, వతిమ, బృహచరణం, అష్టశహస్త్రం లాంటి తమిళ బ్రాహ్మణుల దగ్గరకి వెళ్లరు వాళ్లు. తెలుగు బ్రాహ్మణుల దగ్గరే పీతాంబర్ అయ్యర్ లు అడుకుంటారన్నమాట. కొన్ని వన్నియర్లు, దేవర్లు, వెల్లాల గౌండర్లు వంటి మూడు నాలుగు వ్యవసాయ కులాలకు మాత్రం ఉప కులాలు ఉన్నాయి. ఆ ఉప కులాలన్నీ తెలుగు మాట్లాడుతారు. వాళ్లకు ఉండే ఉపకులాలు కూడా. అంటే తరువాతి కాలంలో తెలుగు వాళ్లను చూసి ఇది ఉంటే బావుంటుందని, మాకూ కథ చెప్పండయ్యా, మాదీ చెప్పండి అని తీసుకున్నారు. ఆ ఉపకులాల దగ్గరికి వెళ్లడం, ఏమేం కథలున్నాయి? ఎట్లా వాళ్లు పాట పాడుతారు? ఏయే వాయిద్యాలు, పరికరాలున్నాయి? తెలుసుకోవడం ఇష్టం. అలా జనాలతో తిరుగుతూ తెలుసుకుంటుండేవాణ్ణి.
ఎక్కడికైనా వెళ్లాలంటే డబ్బులు కూడా ఉండేవి కావు. లారీ వాళ్లను మాయచేసేవాణ్ణి. ఆంధ్ర నుంచి అటు వెళ్లాలంటే తమిళనాడు రిజిస్ట్రేషన్ లారీ చూసుకునేవాణ్ణి. లారీ అతడితో తమిళంలో మాట్లాడి ఏదో చెప్పి తీసుకెళ్లమనేవాణ్ణి. కింది బడుగు వర్గాల వాళ్లు భలే ప్రేమతో ఉంటారు. వాళ్లకు భాషతో సంబంధంలేదు. తమిళనాడు నుంచి ఇటు రావాలంటే ఆంధ్ర రిజిస్ట్రేషన్ లారీని పట్టుకునేవాడిని. వాళ్లు అయ్యో తమ్ముడు రా అని తీసుకొచ్చి, మధ్యలో వాళ్లు తినేదగ్గర నాకు భోజనం పెట్టి తీసుకొచ్చి వదిలేసేవారు. ఏదో తిరగాలంతే, అది మోసం చేయడం అనికూడా నేననుకోలేదు. ఇప్పుడు మధురకు వెళ్లాననుకోండి, మధురలో కమ్మవాళ్ల సత్రాలుంటాయి. అక్కడ కమ్మవాళ్లైతే ఫ్రీగా పడుకోవచ్చు. పొద్దున లేచి స్నానం చేసి పోవచ్చు. నేను పోతే కమ్మవాళ్ల ఇంటిపేరు, గోత్రం చెబుతాను. నేను కమ్మవాడినని చెబుతాను. వాళ్లకు సంబంధించిన యాసలో మాట్లాడుతాను. సేలంకెళ్లాననుకో కోమటి వాళ్ల భోజన సత్రాలుంటాయి. కోమట్లకు ఒకపూట భోజనం ఉచితంగా పెడతారు. భోజనం బ్రహ్మండంగా ఉంటుంది. అక్కడి వెళ్తే ఇంటి పేరు చెప్పాలి, గోత్రం చెప్పాలి, మేనమామ గోత్రం చెప్పాలి. అయ్యన్నీ చెప్పేస్తాను. అవన్నీ చెబితే మన కోమటివాడు వచ్చాడని కమ్మంగా పెడతారు. నేను తిరగాలి, అన్నంకావాలి, పడుకోవడానికి ఎక్కడో ఓ చోటు కావాలి. చాలా దూరం నడిచివెళ్లనేను కదా, అందుకని అది మోసం అని అనుకోలేదు. ఇట్ల చాలా కాలం తిరిగినానండి నేను. 1992కి చదువు అయిపోయింది. కుటుంబ బాధ్యతలు ఏమీ లేకుండా పోయినయి. పెద్దవాళ్లు కూడా లేరు. ఇక తిరుగుడు మొదలుపెట్టాను. తిరుగుతూ తిరుగుతూ 1998 నాటికి హోసూరుకు పోయాను. చాలాకాలం హోసూరులో పనిచేసుకున్నాం.
హర్షణీయం : హోసూరులో ఏం చేశారు? మీ కార్యక్రమం ఏమిటి?
స.వెం. రమేష్ : తమిళనాడులో మిగతా ప్రాంతాలకి, హోసూరుకి ఒక ప్రత్యేకత ఉందండి. చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే హోసూరు నుంచి ఇటీవలి కాలంలో బాగా సాహత్యం వస్తోంది. కథా సాహిత్యం వస్తోంది. దాదాపు ఇరవై మంది కథకులు ఉన్నారక్కడ. వాళ్లంతా ఇదే రికార్డు చేస్తున్నారు. నంద్యాల నారాయణ రెడ్డి గారు స్వతంత్రకాల చదువులు అని ఈ మధ్య ఒక నవల రాశారు. హోసూరు చుట్టుపక్కల పల్లెల్లో దాదాపు 20 మంది తెలుగు కథకులున్నారు. అక్కడి నుంచి దాదాపు 20 పుస్తకాలు వచ్చాయి. ఎక్కువగా కథలు, ఒకటి రెండు నవలలు వచ్చాయి. నాది హోసూరు కాదు. నేను హోసూరులో పుట్టి పెరిగిన వాడిని కాదు. నాకు 28 ఏళ్ల వరకు హోసూరు గురించి తెలియదు. ఎప్పుడైనా మద్రాసులో పేరు వినడమే అంతే. ఇప్పుడు గోదావరి జిల్లా ఉందండి. తూర్పు గోదావరి జిల్లానో, పశ్చిమ గోదావరి జిల్లానో, గుంటూరు జిల్లానో, కృష్ణా జిల్లానో, నల్లగొండ జిల్లానో, కరీంగనర్ జిల్లానో ఏదో ఒక జిల్లా తీసుకోండి. ఆ జిల్లాలో ఉన్నట్టుండి ఒకరోజు పొద్దున్నే అన్ని పత్రికల్లో ప్రకటన ఇచ్చేసి ఇప్పటి నుంచి ఈ జిల్లా తమిళనాడులోనే ఉంటుంది. ఇక్కడెవరూ తెలుగులో బోర్డులు పెట్టకూడదు, ఇక్కడెవరూ తెలుగులో చదువుకోకూడదు, ఇక్కడ ఆఫీసుల్లో తెలుగు మాట్లాడకూడదు, తెలుగులో ఏ విన్నపాలిచ్చినా తీసుకోము, ఇక్కడంతా తమిళమే, ఎంగుం తమిళం, ఎదులుం తమిళం, తమిళం, తమిళం అంటే ఏమైపోతారు వాళ్లు. నేను చెప్పేది చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా దక్షిణం ఇది కాదు. తూర్పు గోదావరో, పశ్చిమ గోదావరో ఏమైపోతారు వాళ్లు. ఒకప్పుడు హోసూరు తాలుకా ఒక్కటే, ఆతరువాత హోసూరు, డెంకనకోట, సోలగిరి మూడు తాలుకాలైంది. 970 గ్రామాలు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు తాలూకా లేదా పుత్తూరు తాలూకా లేదా కాళహస్తి తాలూకా లేదా పలమనేరు తాలూకా ఇక్కడున్నంత మంది తమిళులు కూడా లేరు అక్కడ. తమిళనాడు అసెంబ్లీలోనే భక్తవత్సలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రకటించాడు హోసూరు ప్రాంతంలో కేవలం నాలుగు శాతం మందే తమిళులున్నారు. కేవలం నాలుగు శాతం మంది తమిళులున్నదాన్ని తమిళనాడులో ఉంచేసి (రాజాజీ కుట్ర వల్ల, రాజాజీ పుట్టింది హోసూరు దగ్గర దొరపల్లె ) ఇంక అంతా తమిళమే అన్నారు. ఏమైపోవాలి వాళ్లంతా. ఎంత వివక్ష అంటే, మిగతా తమిళనాడులో కూడా ఆ వివక్ష ఉంది. కాని, మిగత తమిళ ప్రాంతంలోని వాళ్లం తమిళనాడుతో అడ్జెస్ట్ అయిపోయాం. ఎప్పుడు అడ్జెస్ట్ అయినం? మా తాతల కాలం నుంచే సర్దుకొని వచ్చేసినం. వాళ్లకేమీ తెలీదు. పూర్తి తెలుగుదనంతో ఉన్నారు. తెలుగు సినిమాలే చూస్తున్నారు. తెలుగు పత్రికలే ఉన్నాయి. తమిళం అక్షరాలు ఎట్లుంటాయో తెలియదు వాళ్లకి. అట్లాంటి ప్రాంతాన్ని ఇక నుంచి ఇది తమిళనాడు అనేస్తే, పరిస్థితి ఏమిటి? ఇవన్నీ వాళ్లు వాళ్ల సాహిత్యంలో రికార్డు చేశారు. ఎన్ని పోరాటాలు చేశారు? ఎంత కష్టపడ్డారు? ఏమిటీ? నేను వెళ్లేటప్పటికీ జరుగుతూ ఉన్నాయి.
హర్షణీయం : దాదాపు 20 మంది వరకు రచయితలు రాస్తున్నారన్నారు కదా, ఆ పుస్తకాలను ఎవరు ప్రచురించారు?
స.వెం. రమేష్ : కృష్ణరసం అని కృష్ణగిరి జిల్లా రచయితల సంఘం అని వాళ్లే పెట్టుకున్నారు. కృష్ణరసం పేరుతో వాళ్లే ప్రచురించుకుంటున్నారు. నేను వెళ్లేసరికి 1998లో నేనేమీ మొదలుపెట్టలేదు. తెలుగు కోసం పనీ మొదలుపెట్టలేదు, ఉద్యమం మొదలుపెట్టలేదు. అంతకు ముందే ఉంది, అప్పుడప్పుడే కాస్త కిందకు వెళ్తోంది. కోందడరామయ్య గారని, మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశారు హోసూరు ప్రాంతాల్లో. ఇంటిపేరు రాయపెద్ది. ఆయన ఎంత గొప్పవాడో అప్పుడు చూసినవాళ్లు చెబుతారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఆయన చనిపోయేనాటికి ఆయన ఇంటి తలుపుకు కీళ్లు లేవు. అవి ఊడిపోతే పెట్టుకోలేకపోయాడు. చిన్న పెంకుటిల్లు ఆయనది, ఆయన కొడుకులకు ఆయనమీద కోపం. ఆయన తెలీదు కానీ, ఆయన కొడుకులు తెలుసు. నేను హోసూరుకెళ్లేటప్పటికి ఆయన కొడుకులు ఉన్నారు. ‘‘మా అబ్బ మాకేం చేసిపెట్టిపోయినాడయ్యా?’’ అనేవాళ్లు. మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఆయన జీవితమంతా తెలుగు, తెలుగు అంటూ ఉన్నాడు. తెలుగు కాదు, హోసూరును ఆంధ్రలో కలపాలి, అది ఆయన పోరాటం. అట్లానే హోసూరును ఆంధ్రలో కలపాలి, హోసూరును ఆంధ్రలో కలపాలి అంటూనే 1984లో చనిపోయాడాయన.
హర్షణీయం : భౌగోళికంగా హోసూరు అనేది కర్ణాటక సరిహద్దులో ఉంది కదా?
స.వెం. రమేష్ : కుప్పం ఆనుకొని ఉంటుంది. కుప్పానికి లింక్ ఉంది. ఆ లింక్ వేపనపెల్లి ఫిర్కా అంటారు. దాన్ని హోసూరు తాలూకా నుంచి ఆ ఫిర్కాను విడదీసి క్రిష్ణగిరి తాలూకాలో వేశారు. కోదండరామయ్య గారు ఆ ఫిర్కాతో కలిపే అడిగారు. పటాస్కర్ కమిటీ వేసినప్పుడు కూడా ఆ ఫిర్కా కలిపే రికార్డు చేశారు. పటాస్కర్ కూడా చాలా మోసంగా ఇచ్చాడు. దాదాపు 25 శాతం తమిళవాళ్లు ఉన్నారు, తెలుగు వాళ్లు మెజార్టీ అయినా మూడు భాషల వాళ్లున్నారు కాబట్టి ప్రస్తుతానికి అక్కడే ఉంచాలన్నాడు. రాజాజీ ప్రభావం వాళ్లందరిపైనా ఉంది. కోదండరామయ్య గారు చనిపోయిన తరువాత కొంత మసకబారింది. అంటే కాస్త పోరాటం తగ్గింది అక్కడ. కానీ లోపల కుత కుత ఉడుకుతూ ఉంటారు, తమిళుల పట్ల ఇప్పటికి కూడా. అంటే అంత పెత్తనం వాళ్లపైన. నేను వెళ్లే సరికి అక్కడ పరిస్థితి ఏమిటి? 200 పైగా బడులున్నాయి. వాటిలో 100కు పైగా మూతబడే స్థితిలో ఉన్నాయి. కొంతమంది కార్యకర్తలున్నారు. వాళ్లలోంచే నేను వెతుక్కున్నాను. ఆ వెతుకులాటలో ఏడాది పాటు ఆ పలెల్లన్నీ తిరిగాను. తిరుగుతుంటే వాళ్లలోంచి ఓ పదిమంది కార్యకర్తలు దొరికారు. ఆ పదిమంది కార్యకర్తల్ని వెంటబెట్టుకొన్నాను.
అప్పుడొకాయన రాజారెడ్డి గారని కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఆయనకు కూడా తెలుగు పిచ్చి. మేము వెళ్లేసరికి రాజారెడ్డి గారు ‘‘తెలుగు దండోరా’’ అని ఒక కార్యక్రమం మొదలుపెట్టారు కమ్యూనిస్టు కార్యకర్తలతో. పల్లె పల్లెకు వెళ్లడం, దండోరా వేయడం, పిల్లల్ని తెలుగు బడిలో చేర్చించండి అని చెప్పి ప్రచారం చేయడం. తల్లి అని ఆయన నియోజకవర్గంలో కొద్ది పల్లె కొద్దికాలం నడిచి ఆగిపోయింది. అక్కడి నుంచి మేము హోసూరు, డంకెనకోట తాలూకాలో కొంతమంది కార్యకర్తలను పెట్టుకొని పల్లెపల్లెకూ వెళ్లడం, ప్రచారం చేయడం, తెలుగు బడిలో చేర్చించండి అని చెప్పడం, తెలుగు బడిలో మేమెందుకు చేర్చించాలని వాళ్లు ప్రశ్నించడం, ఎందుకు చేర్పించాలో మేము చెప్పడం, వాళ్ల ప్రశ్నలు మా జవాబులు, వాళ్ల ప్రశ్నలు మా జవాబులు ఇలా సాగింది. ఇక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు జన్మభూమి పథకం పెడితే, దాన్ని చూసి కరుణానిధి అక్కడ నమక్కునామి పెట్టాడు. ఊర్లో వాళ్లు కొంతేసుకుంటే, ప్రభుత్వం కొంత ఇస్తే ప్రభుత్వ బడులు బాగుచేయిండం, టీచర్ల మీద ఒత్తిడి తేవడం ఇలా చాలా పనులు చాలా కాలం చేసిన తరువాత దాదాపు 400 బడుల వరకు వచ్చాయి. కొన్ని పల్లెల్లో తమిళబడులు, కాన్వెంట్లు మూతబడినాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇరుల దొడ్లు అని అక్కడ ఇరులవాళ్లని ఉండేవాళ్లు. ఆ ప్రాంతాల్లో కూడా పనిచేశారు. ఒక్కో పల్లె ఒక్కో కథన్నమాట. పడిన పాటు ఇప్పుడు తలుచుకుంటే నేనేనా అనిపిస్తుంది. అంత పాటు పడినాం. ఒక్కొక్క బడికోసం ఒక్కొక్క ఊరికి వెళ్లడం, జనాల్ని ఒప్పించడం. మాకు పూర్తి వ్యతిరేకం ఎవరు ప్రభుత్వ అధికారులు. వాళ్లు వచ్చి దిగిపోయేవారు. వాళ్లు పల్లెకొస్తారు. ఒక్క తమిళ స్కూలు వచ్చిందంటే ఆ చుట్టుపక్కల దాదాపు 10 తెలుగు స్కూళ్లను మింగేస్తుంది. మేమెళ్లినప్పుడు కన్యాకుమారి జిల్లా నుంచి వచ్చిన అధికారులు తీవ్రంగా తమిళాన్ని ప్రచారం చేసేవాళ్లు. జేవియర్ అని అధికారి వచ్చేసి ఏదో ఊళ్లో ‘‘తాగేదానికి నీళ్లు లేవు కదా? మీకు బోరు వేయించమన్నారు కదా? సంతకాలు పెట్టండి, వేలు ముద్రలు వేయండి’’ అని వేయించుకుని తమిళ స్కూలు ప్రపోజల్ పంపించేవాడు. నీళ్ల కోసం కాదు… కానీ అలా చెప్పేవాడు. మేము అప్పుడు ధర్మపురి జిల్లా డీఈఓ ఆఫీసుకు వెళ్తే, అక్కడ ‘‘ అయ్యో సారక్ పల్లిలో తమిళబడి వచ్చేసింది. డీఈఓ ఆఫీసుకు వచ్చింది’’ అని మాకు సమాచారం ఇచ్చేవాళ్లు. మళ్లా మేము ఇటు పరుగెత్తి, అటుపరుగెత్తి వాటిని మార్చడం, ఇట్ల ఒక్క పనికాదు, ఒక్కరోజు పని కాదు, రాత్రింబవళ్లు చాలా చేశాము. కార్యకర్తలు కొద్ది మంది ఉన్నారు. ఒక కార్యకర్త ఆయన చుట్టుపక్కల ఊళ్లు చూసుకుంటాడు. ఆ కార్యకర్తల కుటుంబం. బతకడానికి వ్యవసాయం చేసుకునేవాళ్లు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవాళ్లు. వాళ్లకున్న సమయంలో వాళ్లు చెయ్యాలి. నాకు పనిపాట లేదు, ఇళ్లూ వాకిలి లేదు. ఓ గది తీసుకునే వాడిని. కాబట్టి అన్ని రోజులూ, అంత సమయం నేను పనిచేయాల్సి వచ్చేది. మంచి వయసు ఉండేది, ఓపిక ఉండేది. వాళ్లూ అట్లే చూసుకున్నారు హోసూరు వాళ్లు.
హోసూరులో నేను జీ లాక్ మ్యాన్షన్ అని ఒక అక్కడ ఉండేవాడిని, అది ఒక గది. అది రామకృష్ణా రెడ్డి ఒకాయన చిత్తూరు జిల్లా నుంచి వెళ్లాడక్కడికి. తమిళనాడులో, కర్ణాటకలో ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో మాదిరి పెద్ద మనుసులు ఉండవక్కడ. ఇక్కడ ఇళ్లు ఇప్పుడేమో మారుంటాయో కానీ, హైదారాబాద్ లో గాని నగరాల్లో ఎక్కడైనా రెండు నెలల అద్దె అడ్వాన్స్ గా తీసుకుంటారు. అక్కడ అట్ల కాదు, 12 నెలల అద్దె, 10 నెలల అద్దె ఇవ్వాలి. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదవడానికి ఆంధ్ర నుంచి వచ్చేవాళ్లు. 500 గది అద్దె అయితే, 5000 అడ్వాన్స్ కట్టాలి. ఈ రామకృష్ణా రెడ్డి వచ్చి చూసి, పాపం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పిల్లలు కష్టపడుతున్నారని, ఆయన దగ్గర డబ్బు ఉంది. జి లాక్ మాన్సన్ అని ఒక పాతిక గదుల భవనం రెండు అంతస్థుల్లో కట్టేశాడు. ఆయనేంటంటే అడ్వాన్సు తీసుకునేవాడు కాదు. 500 అద్దె ఇస్తే చాలు. పొయ్యి ఉండొచ్చు. ఈ ఆంధ్ర పిల్లలకు ఇచ్చేవాడు. పాపం వాళ్లు వచ్చిన పిల్లలు చానా మంది కొంటె పిల్లలు ఫ్యాన్లు అవి తీసుకుపోయ్యేవాళ్లు. ఈయన మళ్లీ వేసేవాడు. వాటిల్లో ఓ మంచం కూడా ఉండేది. పాపం నన్నయితే నేను ఇచ్చేవాడిని, ఏడాదికి ఓ నాలుగు నెలలు అద్దె ఎగ్గొట్టేవాడిని. మిగతా నెలలు కూడా ఆయన వద్దనేవాడు, అయినా నేను బలవంతంగా ఇచ్చేవాడిని. ఆ పల్లెల నుంచి టౌన్ కి వచ్చేవాళ్లందరూ నాకోసం ఏదో ఒకటి తీసుకొచ్చేవారు. కంది బేడలు, రాగి పిండి సంగటి చేసుకో, నూకలు, కాయగూరలు అట్ల వాళ్లూ బాగచూసుకున్నారు. నేనూ ఏదో తిరిగినాను, పదేళ్లు అక్కడే పనిచేశాను. 2006 వరకు పూర్తిగా ఉన్నాను. ఆతరువాత రావడం, పోవడం అలా చేసేవాణ్ణి.
హర్షణీయం : మీరు ఎక్కడైతే మీరు స్కూల్స్ ని రీ ఎస్టాబ్లిష్ చేశారో అవి నడుస్తున్నాయా ఇప్పుడు?
స.వెం రమేష్ : తమిళనాడులో ఇప్పుడు ఒక్క తెలుగు బడి కూడా లేదు. జయలలిత పోతూ పోతూ అన్ని మూసేసిపోయింది. ఒక్క తరగతి కూడా లేదు. అంటే, ఆ ప్రాంతాల్లో కాకుండా పల్లెపట్టు అంటే చిత్తూరు జిల్లాను ఆనుకొని ఉంటుంది. పల్లెపట్టు తాలూకా, గుమ్మడిపూడి తాలూకా, మద్రాసు తాలూకా ఇవన్నీ కలిపి దాదాపు 700 చిల్లర బడులుండేటివి. వాటన్నిటినీ తీసుకొని పోయిందావిడ పోతూ పోతూ. అది రాజకీయమనుకోండి. మేము తిరిగేటప్పుడు… హోసూరు ఎంత గొప్ప సాంస్కృతిక కేంద్రమంటే, ఆ తాలూకాలో (ఇప్పుడు మూడు తాలూకాలు, మేము పనిచేసిన కాలంలో రెండు తాలూకాలు) 900 పల్లెల్లో 50 తెలుగు జానపద కళలు కనిపించినవి. అంటే, సాంస్కృతికంగా ఎంత గొప్ప ప్రాంతమో చూడండి. బోలెడు తాళపత్ర గ్రంథాలు దొరికేటివి. ఆంధ్ర సాంస్కృతిక సమితిలో ఉండేటివి. అన్నీ తెలుగులోనే దొరికేటివి.
వాటితో ‘‘పల్లె కళల పరస’’ అని 2006లోనే 2007లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాం. చాలా మంది ఆంధ్రప్రాంతం నుంచి వచ్చారు. తరువాత సంవత్సరం తిరుచురాపల్లెలో ‘‘దక్షిణ భారత తెలుగు పల్లె కళల పండుగ’’ అని రెండు రోజుల పెద్ద కార్యక్రమం నిర్వహించాం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి నుంచి తెలుగు జానపద కళాకారులు వచ్చి ప్రదర్శనలిచ్చారు. అప్పుడు తెలుగు యూనివర్సిటీ వీసీగా ఆవుల మంజులత గారు ఉన్నారు. వారు కూడా వచ్చారు. పనబాక లక్ష్మి అప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆవిడ వచ్చారు. ఆర్కాడు వీరాస్వామి గారు, కేకేఎస్ ఆర్ రామచంద్రారెడ్డి, నెహ్రూ అనే తమిళనాడు మంత్రులు వచ్చారు. ఇట్ల కొన్ని కార్యక్రమాలు చేశాం. నేను రాయడం చేశాను. అక్కడ ఏమి ఉన్నాయి లాంటి విషయాలు ‘‘ఎల్లలు లేని తెలుగు’’ అని వ్యాస సంపుటి రాశాను. అందులో ఈ విషయాలన్నీ ఉన్నాయి.
హర్షణీయం : వ్యాస సంపుటిని ఎవరు ప్రచురించారు?
స.వెం. రమేష్ : విజయవాడలో డాక్టర్ సామల రమేష్ బాబు అని ఉంటారు. వారిది తెలుగు జాతి అని ఒక ట్రస్టు ఉంది. ఆ ట్రస్టు తరుపున ప్రచురించారు. ఆ తరువాత నాకు ఆంధ్రప్రాంతంలో రమేష్ బాబు గారు పరిచయం. ఆయన ద్వారా వేణుగోపాల్ రెడ్డి గారని, ఆయన ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ కార్యదర్శిగా చేశారు. ఆర్ఎస్ఎస్ కు సంబంధించినాయన, ఇప్పుడు ఏ పార్టీలో లేరు. సీరియస్ ప్రచారక్ ఆయన, బ్రహ్మచారి. పెద్దాయన 80 ఏళ్లు ఉంటాయి దాదాపు, హైదరాబాద్ లో ఉంటారు. ఆయన పరిచయమయ్యారు. వీళ్లిద్దరూ కలిసి నువ్వు చిన్న ప్రాంతానికి హోసూరుకు పరిమితమై పోయి, అక్కడే ఉండుకుంటూ చేసుకుంటే కాదు ఇది అని ‘‘తెలుగు వాణి’’ అని ట్రస్టు ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టు నుంచి మేము తమిళనాడులో తెలుగువాళ్లని ఒకచోటకు చేర్చాలంటే తెలుగు పేరుతోనే చేర్చగలం. కుల సంఘాలున్నాయి అక్కడ కూడా. అక్కడ తెలుగు వాళ్లు వాళ్ల ఉనికి కాపాడుకోవడానికి, ఇక్కడ కార్తీక వనభోజనాలు జరుగుతుంటాయి కదా అట్ల అక్కడ కూడా ఏ కులానికి ఆ కులం ఉగాది పండుగ చేసుకుంటారు. అంటే ఉగాది రోజు ఇంట్లో పండుగ అయిపోయిన తరువాత ఏదో ఒక ఆదివారం అనుకొని ఒక చోట కలుస్తారు. ఇప్పుడు వేలూరు జిల్లా ఉంది, వేలూరు జిల్లా కమ్మ సంఘం వాళ్లంతా ఓ 10వేల మందో, 15వేల మందో ఒక రోజు ఉగాది పండగ చేసుకుంటారు. అట్ల ప్రతి కులం వాళ్లు చేసుకుంటూ ఉంటారు. తెలుగు పేరుతో వీళ్లందిరినీ ఒకటి చేస్తే పెద్ద సంఖ్య అవుతుంది కదా అనిపించింది. తెలుగు పేరుతో చేయాలంటే తెలుగు రాయడం, చదవడం నేర్పాలి. ఆ ఉద్దేశ్యంతో తెలుగు వాణి అని ఒక ట్రస్టు పెట్టాం. 2004 , 2005 నుంచే పని మొదలు పెట్టాం. వేలూరు జిల్లా నుంచి ఆరంభించాం. 20 మంది వాలెంటీర్స్ హోసూరు నుంచి వచ్చారు. వాళ్లను పెట్టుకొని, వేలూరు జిల్లాలో ఒక 80 పల్లెల్లో 4వేల మందికి నేర్పించాం. వాళ్ల నుంచి ఇక్కరిద్దరు కథలు రాసే రచయితలు తయారయ్యారు. ఐతం దివాకర్ అని ఒక అబ్బాయి ఇప్పటికి కూడా రాస్తూ ఉంటాడు. ఓటర్ పురుషోత్తం అని అతను చాలా వ్యాసాలు రాశాడు. ఇప్పటికీ సామాజిక మాద్యమాల్లో యాక్టివ్ గా రాస్తూ ఉంటాడు. వాళ్లు రాసిన కథలు పత్రికల్లో కూడా వచ్చాయి. చాలా మంది అమ్మాయిలు రాసిన కవితలు పలు పత్రికల్లో వచ్చాయి. వేలూరు తరువాత కంచి జిల్లాలో కొన్ని పల్లెల్లో చేశాం. మళ్లీ దాని తరువాత పెద్ద ఎత్తున చేసింది తిరుపూర్ జిల్లా (పాత కోయంబత్తూర్ జిల్లా)లో ఉడముల పేట తాలూకాలో చేశాం. అక్కడ కూడా 40 చిల్లర గ్రామాల్లో తెలుగు నేర్పించాం. ఉడముల పేట తాలూకా అంటే ఉడముల పేట తాలూకా కేంద్రం. అది సుమారుగా లక్ష జనాభా ఉండే పట్టణం. ఆ పట్టణం నుంచి 12 కిలోమీటర్లలో కేరళా సరిహద్దు. అంటే కేరళాకు ఆనుకుని ఉండే తాలూకా. పని గట్టుకొని వెతికామండి తమిళ జానపద పాటలు పడేవాళ్లు ఉన్నారేమో అని. ఒక్క తమిళ పాట దొరకలేదు. ఇప్పటికీ తమిళ యూనివర్సిటీ వాళ్లు ప్రయత్నం చేయవచ్చు. ఉడముల పేట తాలూకాలో ఒక్క తమిళ జానపద పాట దొరకలే. వేల తెలుగు జానపద పాటలున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న షెడ్యూల్డ్ కాస్ట్ దాదాపు 90 శాతం తెలుగువాళ్లు. ఓ పది శాతం తమిళులు ఉన్నారు. వాళ్లూ తెలుగు పాటలే పాడతారు. తమిళవాళ్ల ను వెళ్లి అడిగాం తమిళ పాటలు పాడొచ్చు కదా అని. పాట తమిళంలో ఎక్కడ ఉంటది అనేవాళ్లు. అప్పుడు ఈ తరం పిల్లలు సినిమా పాటలు పాడేవాళ్లు. వేల తెలుగు పాటలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఎక్కడో తెలంగాణలో కనిపించే కిన్నెర అక్కడ ఉంది. కిన్నెర కళాకారులున్నారు అక్కడ. ఎన్ని రకాల వాయిద్యాలున్నాయో. దేవరాట, సేవాట, జిక్కాట ఇట్ల అనేకం. కేరళాను ఆనుకుని ఉండే తాలూకాలో ఇవన్నీ. దేవరాట అనేది దక్షిణ తమిళనాడులోనే ఉంటుంది. ఉత్తర తమిళనాడులో, ఆంధ్రలో ఉండదు. వలస పోయిన వాళ్లయితే ఇక్కడ ఆ కళారూపమేదో ఉండాలిగా. హోయలాట అని ఒకటుంది. తిరునల్వేలి జిల్లా కన్యాకుమారికి కాస్తపై భాగంలో హొయలాట అని తెలుగు వాళ్లు ఆడతారు. హొయలు అనేది తెలుగు మాట కదా. చాలా హొయలుగా ఉంటుంది. దానికి కడవమేళం అని పెద్ద బాణ లాంటి దానికి సన్న మూతి ఉంటుంది దాన్ని కొడుతూ వాయిస్తారు. ఇంకెక్కడా ఉండదు. అక్కడి నుంచి ఉత్తర దిక్కు వస్తే మధుర జిల్లాలో కూడా ఉండదు. వలసపోయిన వాళ్లు అయితే దానికి సంబంధించిన ఆనవాళ్లు కనీసం ఇక్కడి సాహిత్యంలోనైనా ఉండాలి కదా.
హర్షణీయం : ప్రభుత్వ జోక్యం, ప్రత్యేక మైన సంఘాలు ఏవీ లేకుండా ఆ కళ ఇంకా బతికే ఉందంటారా?
స.వెం. రమేష్? : అంటే చాలా పోయాయి. ప్రదర్శించేవాళ్లు చివరి తరం మాత్రమే ఉన్నారు.
****
హర్షణీయం : మీరు తెలుగు రాయడం, చదవడం గురించి మాట్లాడారు. హోసూరులో మీరు చేసిన పనితో పాటు కృష్ణగిరి రచయితల సంఘం గురించి చెప్పారు. అంటే సాహిత్య సృజన గురించి చెప్పారు. అలాగే జానపద కళలపై కూడా పని చేస్తున్నారు. ఆసక్తికరంగా మీరు వేరే దేశాల్లో కూడా తెలుగు వాళ్ల గురించి పరిశోధన చేశారు. ఉదాహరణకు శ్రీలంక. అక్కడ ఏం జరిగింది? ఎలా వెళ్లారు? ఆ ప్రయత్నం ఎలా మొదలైంది.
స.వెం. రమేష్ : అదీ, నేను ఆంత్రోపాలజీ చదువుకునే రోజుల్లోనే మా ప్రొఫెసర్ ఒకాయన శ్రీలంకలో పాముల పట్టేవాళ్లు ఉన్నారట ఆనేవారు. అదెప్పుడో 1990, 1992 ప్రాంతంలో విన్నది. అప్పటి నుంచీ శ్రీలంకకు వెళ్లాలని కోరిక నాకు. ఇక్కడ లారీ వాళ్లంటే ఫ్రీగా తీసుకెళ్తారు కానీ, విమానం వాడు ఎందుకు ఫ్రీగా తీసుకెళ్తాడు? ఎదురు చూస్తూ ఉన్న. ఈ లోపల సుబ్బారెడ్డి అని ఒక మిత్రుడు పరిచయమయ్యాడు. అతడికి క్రికెట్ పిచ్చి. ఆయన శ్రీలంకలో ఏదో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని వెళ్లాలనుకున్నాడు. అతను ‘‘రమేష్ వస్తావా? శ్రీలంక వెళ్తున్నాను’’ అన్నాడు. ‘‘బాబోయ్ నాకు అర్థం కాదు ఆ క్రికెట్, వాడు కొడతాడో, వీడు కొడతాడో… ఇద్దరూ పరుగెత్తుతుంటారు. నాకోసం ఒక పనిచేసిపెట్టు, నాకు వచ్చే ఓపికలేదు, నువ్వు వెళ్లేదగ్గర ఎక్కడైనా పాములోళ్లు కనిపిస్తే మాట్లాడు. తెలుగు మాట్లాడుతున్నారేమో చూడు’’ అన్నాను. మ్యాచ్ మ్యాచ్ కి గ్యాప్ లో వీళ్లు పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారు. అక్కడ సీగిరి అని ఒక ప్రాంతం ఉంటుంది. అంటే నాగార్జున పర్వతం (శ్రీగిరి) స్ఫూర్తితో అక్కడ కట్టుకున్నది. ఆంధ్ర ప్రాంతం (శ్రీ పర్వతం) నుంచి వెళ్లిన తేరవాద బౌద్ధులు కట్టింది అది. ఈయన అక్కడకు వెళ్లాడు చూడ్డానికి. అక్కడ పాములు ఆడించే ఒకతను కనిపించాడు. పలకరిస్తే తెలుగులో మాట్లాడాడు. సుబ్బారెడ్డి సంతోషపడిపోయి అడ్రస్ తీసుకొని మర్నాడు వాళ్ల ఊరికి వెళ్లాడు. వాళ్ల ఊరిపేరు చేపల చెరువు (సింహళంలో దీవరగమ). అంటే వాళ్ల ఊరు కాదది, వాళ్లు పిలుచుకుంటారు చేపల చెరువు అని. వాళ్లది సంచార తెగ. ఇది జరిగి పది పన్నెండు సంవత్సరాలైంది. అంతకు నాలుగైదు సంవత్సరాలు ముందే శ్రీలంక ప్రభుత్వం వీళ్లకు కొన్ని పల్లెల్లో కాలనీలు కట్టించింది. దీంతో వీళ్లు స్థిరంగా కుదురుకున్నారు ఒకచోట. అట్ల కట్టించిన దాంట్లో ఈ దీవరగమ కూడా ఒకటి. ఆ దీవరగమ అంటే వీళ్లకు అర్థం తెలుసు. వీళ్లు చేపల చెరువు అని పిలుస్తారు. అట్లాగే కుడాగమ అని ఉంటుంది, దాన్ని వాళ్లు పెద్ద చెరువు అంటారు. అట్లాగే అంతర పెద్ద అని ఒక ఊరు ఉంటుంది, వీళ్లు సీగుముల్లె అడవి అంటారు. ఇవి వీళ్లు పిలుచుకునే పేర్లు. అక్కడికి వెళ్లి వాళ్లింటో ఒక పూట ఉన్నాడు, వాళ్లు పెట్టింది తిన్నాడు. అంతా వీడియో రికార్డు చేసుకొని వచ్చాడు. ఆ తరువాత నాకు కుతూహలం కలిగి, ఇక లాభం లేదని పాస్ పోర్టు తీసుకొని సుబ్బారెడ్డితో కలిసి శ్రీలంకకు వెళ్లాను. ఆ తరువాత ఐదారుసార్లు శ్రీలంకకు వెళ్లాను. నాకు బాగా చుట్టాలైపోయారు వాళ్లు. వాళ్ల కోసం సింహళం నేర్చుకున్నాను నేను. ఎందుకోసమంటే, ఇప్పుడిప్పుడే వాళ్ల పిల్లలు బడికి వెళ్తున్నారు. వాళ్లకు ఎవరికీ చదువు రాదు. మాట్లాడడం మాత్రం సింహళం మాట్లాడుతారు, తమిళం మాట్లాడుతారు, తెలుగు మాట్లాడుతారు, ఇంగ్లీషు పర్యాటకుల కోసం నాలుగైదు ఇంగ్లీషు పదాలు మాట్లాడుతారు. ఏదీ చదవడం, రాయడం రాదు. ఎందుకంటే సంచార తెగ కదా, బళ్లకు పంపించేవారు కాదు. స్థిర నివాసం ఏర్పడ్డ తరువాత పిల్లలను బడులకు పంపించడం అలా మొదలైంది. సింహళం అక్షరం, దానికింద తెలుగు అక్షరం వేసి వాళ్లకోసం క్యాలెండర్లు తీసుకెళ్లి పల్లెల్లో ఇచ్చేవాళ్లం. వాళ్ల కోసం సింహళం నుంచి తెలుగు నేర్చుకోవడం ఎలా అని చిన్న చిన్న పుస్తకాలు వేశాం. అట్లా దాదాపు ఆరేడు సార్లు శ్రీలంకు వెళ్లొచ్చాను. వాళ్లతో మంచి స్నేహం కుదిరింది. ఇప్పటికీ ఫోన్లు చేస్తుంటారు. వాళ్లకు రెండు ఇంటి పేర్లు… దుగిడివాళ్లు, తేవల వాళ్లు. పోంగానే నేను దుగిడివాడిని, నాతో వచ్చిన సుబ్బారెడ్డిన తేవల వాడు అని చెప్పిన. దుగిడి వాడే తెలివైన వాళ్లు అని అన్నాడు ఆ మనిషి. ఇప్పటికీ నన్ను బంధువే అనుకుంటారు. నేను వాళ్లింటోనే ఉంటాను, వాళ్లింటోనే పడుకుంటాను, మషన్న అని మంచి స్నేహితుడు.
శ్రీలంకలో పాములవాళ్లు కాకుండా మాకు కొలంబోలో మాణిక్యం అని ఆటో డ్రైవర్ పరిచయమయ్యాడు. నేను, సుబ్బారెడ్డి తెలుగులో మాట్లాడుకుంటూ పోతున్నాం. అతను వచ్చేశాడు. తెలుంగా, నా తెలుంగు… నా తెలుంగు అన్నాడు. సరిగ్గా మాట్లాడడం రాదు. ఎంత ఆవేదన అంటే అతనికి. కోపియవత్త అని కొలంబోలో మురికి వాడలో వాళ్లింటికి తీసుకెళ్లాడు. చిన్న పుస్తకం డైరీలాంటిది తీశాడు. దాంట్లో రాజీవ్ గాంధీ ఘటన సందర్భంలో శాంతి సేన అని కొంతమంది సైన్యం వెళ్లారు చూడండి, వాళ్లలో తెలుగు వాళ్లను పట్టుకున్నాడు. వాళ్ల అడ్రసులు చూపించాడు. గుంటూరు జిల్లా, ఒంగోలు దగ్గర ఇలా ఉన్నాయి. అతనికి తెలుగు చదవడం రాదు. నా తెలుంగు నాతెలుంగు అని చూపించాడు. అతని భార్యా పిల్లలు లోపలి గదిలోకి వెళ్లిపోయారు. టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. క్యాసెట్ అరిగిపోయింది కర్ణకఠోరంగా శంకరాభరణం పాట వినిపిస్తోంది. దాన్ని ఆనందంగా వింటున్నాడు. ఆ ఆనందానికి కారణం ఆ పాట కాదు, అదంటే ఇష్టం అతనికి. మళ్లీ రెండో సారి వెళ్లినప్పుడు తర్వాత విషయం చెప్పుకొచ్చాడు. వీళ్లంతా మాదిగ కమ్యూనిటీ వాళ్లు. సేతుపతి అని వీళ్ల మామయ్య తెలుగు రాయడం, చదవడం తెలుసాయనకు. మాణిక్యం పదేళ్ల వయసున్నప్పుడు చనిపోయాడు. వీళ్లంతా చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి కొలొంబోలో తెలుగు రాయడం, చదవడం నేర్పించేవాడు. ఆయన దగ్గర తెలుగు నేర్చుకున్న మునిస్వామి అనే అతడిని రెండో సారి పోయినప్పుడు తీసుకొచ్చాడు. అతను కొంచెం కొంచెం తెలుగు చదువుతుంటాడు. అతడి దగ్గర సేతుపతి ఫొటో ఉంటే ఆ ఫొటోని మేము ఫొటో తీసుకున్నాం. దాంట్లో ఆయన చనిపోయినప్పుడు మునుస్వామి సేతుపతికి నివాళిగా నాలుగు మాటలు రాశాడు. ఆ మాటలతో పాటు ఫొటో తీసుకొచ్చుకున్నాం. అప్పుడు మునుస్వామి చెప్పాడు వాళ్ల కష్టాలన్నీ. ఎనిమిదిన్నర లక్షల మంది తెలుగు వాళ్లం ఉన్నాం. మా భుజాల మీద తుపాకులు పెట్టి ఎల్టీటీఈ పోరాటం చేసింది. మమ్మల్నందిరినీ కలుపుకునే వాళ్లు 18 లక్షల మంది తమిళులు అని చెబుతున్నారు. అంత పెద్ద జాతేం కాదు తమిళజాతి. కాకపోతే తెలుగువాళ్లకంటే లక్షో రెండు లక్షల మంది ఎక్కువ ఉండొచ్చు. కానీ ఎక్కడా మా తెలుగు ఉనికి లేదు అన్నాడు. ఆ మాణిక్యం ఎప్పుడు పోయినా ఏం చెబుతాడంటే ‘‘ఒక మండపం కట్టాలి. మన ఆంధ్ర ప్రభుత్వం తెలుంగు మండలం కట్టాలి. తెలుంగు మండపంలో తెలుంగు రాతలన్నీ చెప్పాలి.’’ నిజానికి ప్రభుత్వాలకు పెద్ద విషయం కాదు. కానీ ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి చెప్పేదెవరు? నేను చెప్పలేను. నాకు అంత శక్తిలేదు. అప్పటికే మంచి స్థానంలో ఉండే ఒక రాజకీయ నాయకుడు, తెలుగంటే బాగా ఇష్టముండే రాజకీయ నాయకుడు పరిచయముంటే ఆయనకు వెళ్లి చెప్పాం కూడా. ఆయన కాంగ్రెస్ లో ఉండేవారు, తరువాత తెలుగుదేశానికి వచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు. చాలా మంచి మనిషి, మంచి వ్యక్తిత్వం, ఆయన వల్ల కాలేదు. అంటే తీరికలేని తనం ఒక్కటి, ఆయన వెంటపడి గుర్తుచేస్తూ చెప్పేవాళ్లు ఉండాలి. ఆయన దగ్గరికి తరుచుగా వెళ్లేందుకు అంత పరిచయం ఉండదు. ఇట్ల అనేక కారణాలు. అంటే నా స్థాయి అంత పెద్దది కాకపోవడం కూడా, అంత పెద్ద పరిచయాలు లేకపోవడం. మీరొచ్చి వింటున్నారు. మీకు బదులుగా ఓ గంటసేపు ఒక మంత్రి స్థాయి వ్యక్తి వినగలిగితే ఏమైనా ప్రయోజనం ఉండేది. ఇప్పటికీ మాణిక్యం ఫోన్ చేస్తాడండి. నా దగ్గర ఫోన్ ఉంది. మాణిక్యం కోరిక ఏంటంటే మండపం అంటే ఒక హాల్ లాంటిది కట్టాలి. అక్కడ తెలుగు నేర్పాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి నెలకో, రెండు నెలలకో వెళ్లి ఓ కళారూపం ప్రదర్శించాలి. ఇలా జరుగుతుండడం వల్ల మళ్లీ అంతా తెలుగులో వచ్చేస్తారు అంటాడు. అది పేరాశే కావచ్చు. అది వేరే విషయం. అది స.వెం రమేష్, అనిల్ గారు చేయలేకపోవచ్చు కానీ, ప్రభుత్వాలు చేయదలుచుకుంటే పెద్ద విషయం కాదు. అట్ల మేము తెలుగు వాళ్లను కలిశాము. జాఫ్నా ఏరియాలో అల్లంపల్లి అని ఒక ఊరుకు వెళ్లాం.
తరువాత బంగ్లాదేశ్ లో తెలుగు వాళ్లున్నారని తెలిసింది. ఆరున్నర లక్షల మంది ఉన్నారు. ఢాకాలో ఉన్నారు. పారిశుద్ధ కార్మికులు, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్లు ఉన్నారని తెలిసింది. వేపాడ ఆనంద్ అని ఓ కుర్రాడు అతని ఫోన్ నెంబర్ పట్టుకొని వెళ్లాం. వెళ్తే ఢాకా నగరంలో దాదాపు ఒక ముప్పై నలబై వేల మంది ఉన్నారు వీళ్లు. ఇప్పటికీ వాళ్లకు ఆంధ్రకు రాకపోకలున్నాయి. వాళ్లు ఎక్కువ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వాళ్లలో నూటికి 90మందికి తెలుగు చదవడం, రాయడం తెలుసు. దాదాపు అందరూ క్రిస్టియన్స్ అక్కడ. అందరికీ తెలుగు రాయడం, చదవడం నేర్పుతున్నారక్కడ. అక్కడికి వెళ్లిన తరువాత ఏం తెలిసిందంటే 200 సంవత్సరాల క్రితం బ్రిటీష్ వాళ్లు టీతోటల్లో పనిచేయడానికి కొంతమందిని ఉత్తరాంధ్ర నుంచి తీసుకెళ్లారు. ఆ పల్లెలు ఉన్నాయని తెలిసింది. నర్సన్న తీల అని ఒక పల్లెకు వెళ్లాం. వాళ్లు గెంతు భజన అని ఒకటి చేశారు. అది ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది. అక్కడ యాభై సంవత్సరాలకు పైన ఉన్నవాళ్లకు తెలుగు మాట్లాడడం తెలుసు. ఆలోపల వాళ్లకు తెలుగు మాట్లాడడం తెలీదు. బాంగ్లా మాట్లాడుతారు. కానీ అందరికీ తెలుగు పాటలు తెలుసు. భజన పాట, రాత్రంతా రామాయణాన్ని గానం చేస్తూ భజన చేస్తారు. తరువాత పాటలు పాడతారు. ఎవరికైనా పాటలు పాడడం తెలుసా అని నర్సన్నతిలలో అడిగితే, ఒక పద్దెనిమిదేళ్ల కుర్రాడు మీ మీ అంటూ వచ్చాడు. వచ్చి హార్మోనియం వేసుకొని వచ్చాడు. ‘‘గోపాల భక్తులంటనే పోదము రారా ఓ కృష్ణ’’ అంటూ భజన పాటపాడాడు. అట్ల ఏయే జిల్లాల్లో ఉన్నారు? అని సమాచారం సేకరిస్తే బంగ్లాదేశ్ లో ఆరున్నర లక్షల మంది తెలుగువాళ్లు ఉన్నారు. ఇది మనకు తెలియనిది. తెలుగు సంఘాల వాళ్లకు కూడా. మలేషియాలో తెలుగు వాళ్లు ఉన్నారని, మారిషియస్ లో తెలుగు వాళ్లు ఉన్నారని తెలుసు. శ్రీలంకలో ఇంత మంది తెలుగు వాళ్లు ఉన్నారని, బంగ్లాదేశ్ లో ఇంతమంది తెలుగు వాళ్లు ఉన్నారని తెలీదు. అక్కడ దాలీ అని ఒక ముసలాయన. ఎప్పుడొచ్చారు? ఎలా వచ్చారు? అని అడిగితే ఆయన ఎంత సరదాగా శ్రీకాకుళం యాసలో చెప్పాడంటే ‘‘మామ మా తాతల కాలంనాడు ఎల్లిపోచ్చేసినారు. తెల్లపరంగోడు (తెల్ల దొరలు) డబ్బుల చెట్లున్నయి, ఊపుతే రాలిపోతున్నయి అంటే ఏరుకోవడానికి వచ్చేసినాడు మాతత. ఊపేసినడు. డబ్బులు రాలిపోయినయి. తెల్లపరంగోడు ఏరుకొనేసినడు. మాకేటినేదు.’’ అంటే డబ్బుల చెట్లున్నయి ఏరుకోవడానికి రమ్మంటే ఇక్కడికి వచ్చారని. అంటే అదీ వ్యగ్యం. డబ్బుల చెట్లంటే టీ తోట. టీతోటలో పనిచేస్తే డబ్బులొస్తయని చెప్పాడు. డబ్బులన్నీ వాడికి పొయ్యాయి. మేము ఇక్కడ ఉండిపోయామని. ఆయన పెద్దాయన. ఆయన తాత ఇతని చిన్నప్పుడు చెప్పేవాడంట… చుట్టూ నీళ్లు బంగ్లాదేశ్ లో. గంగా నది పాయలు పాయలు పాయలుగా పోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా మైళ్ల కొద్ది వెడల్పుతో ఉంటుంది ఆనది. ఆ చిత్తడి నేలలు దాటుకొని వీళ్లు రావాలి. తెప్పలుగట్టుకునే వాళ్లంట పారిపోదామని. వస్తుంటే తెల్లదొరలు చూసేవారంట. కాల్చేవారంట, కొంతమంది కాళ్లు తీసేశారంట. రూట్స్ నవల చదివారు కదా, అంతకంటే తక్కువ కష్టాలు పడలేదు తెలుగువాళ్లు. అంటే దాలయ్యకు చదువు వచ్చి ఉంటే రూట్స్ కంటే గొప్ప నవల రాసేవాడు. దాలయ్యకు చదువు రాదు.
అట్ల మా తిరుగుళ్లు… నేపాల్ లో పారిశుద్ధ్య కార్మికుల మధ్య నడిచింది. అక్కడ విభూది జంగం వాళ్లు కనిపించారు. ఆ దేశాలకు పోయినప్పుడు వాళ్లు చిన్న కోరిక కోరారు. ఇప్పుడు తిరగడం మానేశాను. ఇప్పుడు తమిళనాడులో తిరగడం లేదు. ఎందుకు తిరగడం లేదంటే నేను చేతగాని వాణ్ణి. నా శక్తి నాకు అర్థమైంది. ఏదో చేసేద్దామని ఉడుకు నెత్తురప్పుడు అనుకున్నాను. బంగ్లాదేశ్ వాళ్లు, శ్రీలంక వాళ్లు నన్ను ఏం కోరారు? శ్రీలంకలో ఆల్ఫన్స్ అని ఒకడు ఉన్నాడు. పాముల పట్టే పిల్లాడు. చిచ్చరపడుగు. ఐక్యరాజ్య సమితి ఆఫీసులో జీపు డ్రైవరుగా పనిచేస్తాడు. వాళ్ల ఆఫీసరుతో గొడవ పడతాడు. మైనార్టీ భాషల గురించి సమావేశం జరుగుతుంటే వీడు లోపలకు దూరేశాడు. దూరేసి ‘‘మీరెంత సేపూ మైనార్టీ భాష అంటే శ్రీలంకలో తమిళ్ గురించే మాట్లాడుతారు. మా తెలుగు గురించి ఎందుకు మాట్లాడరు?’’ అని వాదనకు దిగాడు. బయటకు వచ్చి నాకు ఫోన్ చేసి ‘‘అన్నా మీరు ఇండియాలో కూర్చొని ఏం చేస్తున్నారు? ఈరోజు మా ఆఫీసరును తిట్టేశాను. నాకు పనిలేదన్నాడు. పోతే పోనీ పనిలేకపోతే అడక్కతింటాను’’ అన్నాడు. అట్లాగే బంగ్లాదేశ్ లో ఓ కుర్రాడు ఆంత్రోపాలజీ చదువుతున్నాడు మేము వెళ్లే సరికి. వాడు చాలా సాఫ్ట్ గా ఉంటాడు. వాడితో ఇంగ్లీషులో ఒక వ్యాసం రాయించి అమ్మనుడిలో అనువాదం చేసి అచ్చేశాం. వాడు బంగ్లాదేశ్ తెలుగువాళ్ల గురించి ఆంత్రోపాలజిస్ట్ గా రాస్తాడు. వాళ్లు నన్నేమి కోరారంటే? ‘‘మేము ఆ దేశాన్ని (తెలుగు వాళ్లు ఉండే దేశాన్ని) చూస్తాం. ఓ పదిమందిని తీసుకెళ్లండి. ఓ నెల రోజులు ఉంటాం. మాకు తెలుగు రాయడం, చదవడం నేర్పించండి. మేము వచ్చి మావాళ్లందరికీ నేర్పిస్తాం.’’ పెద్ద ఖర్చు కాదండి. నేను ప్రయత్నం చేసిన. మళ్లీ సుబ్బారెడ్డి, మా అన్న ఒకరిద్దరిని పంపించిన. వాళ్లు శ్రీలంకకు పోయి ఆశ పెట్టివచ్చారు. పది మందిని రెడీ చేశారు. శ్రీలంక వాళ్లయితే తిరుపతికి, బంగ్లాదేశ్ వాళ్లయితే విశాఖపట్నం తీసుకొచ్చి నెలరోజుల పాటు భోజనం, వసతి కల్పించి వాళ్లకి రాయడం, చదవడం నేర్పించి చుట్టూ కొన్ని గ్రామాలు చూపించి, వాళ్లకు కావల్సిన పుస్తకాలు ఇచ్చి తిరిగి పంపించాలనుకున్నాం. చాలా ప్రయత్నం చేశాం. నా సర్కిల్ లో నావల్ల కాలేదు.
హర్షణీయం : చేతి పనులు చేసేవాళ్లు చాలా మంది తెలుగు వాళ్లు ఉన్నారని మీరు గుర్తించారు? ఆ ఏరియాలో మీరు ఎలాంటి వర్క్ చేశారు?
స.వెం. రమేష్ : ఏం పనిచేయలేదు. పని మొదలు పెట్టాం అంతే. డీటీఎల్ సీ (డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్) అని ఒక సంస్థ ఉంది. అమెరికాలో డిట్రాయిట్ లో ఉంటారు వాళ్లు. చాలా మంచి స్నేహితులు నాకు. మద్దిపాటి కృష్ణారావు గారు, వేములపాటి రాఘవేంద్ర చౌదరి గారు, అడుసుమిల్లి శివ గారు, పిన్నమనేని శ్రీను గారు, ఆర్ సీతారామయ్య గారు వీళ్లు చాలా మంచి స్నేహితులు. స్నేహితులు కాదు కుటుంబ సభ్యులు. అలాగే ఉంటారు. అమెరికాకు వెళ్తే కృష్ణారావుగారి ఇంట్లోనే ఉంటాను. శివగారు, శ్రీనుగారు వస్తారక్కడికి. రాత్రంతా కూర్చుంటాం. పన్నెండవుతుందో, ఒంటి గంట అవతుందో, రెండవుతుందో, మూడువుతుందో. కృష్ణారావు గారు సైన్టిస్ట్ అక్కడ. ఆయన భార్య విజయ డాక్టర్. నేను వెళ్తే వారం రోజులు సెలవు పెడతారు. రాంత్రి బవళ్లు మాట్లాడుకోవడమే. నిద్రొచ్చినప్పుడు నిద్రపోతాం, ఆకలేసినప్పుడు తింటాం. నా తిరుగుడులో నేను సంపాదించిన జ్ఞానం తెలుగు సంబంధించి. నా తిరుగుడులో వచ్చిందే ఇది. నేను పరిశోధకుడిని కాదు. నేను చాలా చోట్ల రాశాను. తిరుగుతున్నప్పుడు కనపడినవి మాత్రమే. బహుశా ప్రపంచంలో ఏడువేల భాషలున్నాయన్నారు. ఏ భాష వాళ్లకీ ఇంత గొప్ప సంస్కృతి లేదు. ఉంటే నాకు తెలీదు. నేను ప్రపంచంలో చెబుతున్నా… మన దేశంలో అయితే ఏ భాషకీ లేదు. ఇప్పుడు జానపద కళలున్నాయి. ప్రదర్శన కళలు. తమిళులు మాకు 110 కళలున్నాయని చెబుతారు. 110 పది కళలు చెప్తాను నేను. అందులో 105 తెలుగు కళలు, మిగిలిన 5 మాత్రమే తమిళులవి. కర్ణాటకలో వందల తెలుగు కళారూపాలున్నాయి. గుజరాత్ నుంచి ఒకయాన దేవీ అని వచ్చి కర్ణాటకలో సెటిల్ అయ్యారు. ఆయన భారతదేశంలోనే జానపద కళలకు రిచ్ ఏరియా కర్ణాటక, కన్నడిగులకు ఉన్నన్ని కళారూపాలు ఇంకెవరికీ లేవన్నారు. అందులో మూడొంతులకు పైగా తెలుగు. పేరెవరిదీ? కన్నడిగులది. నాకు తెలిసినవి నేను ఒక జాబితా రాశాను.
హర్షణీయం : ఎందుకు జరిగింది ఇలా?
స.వెం. రమేష్ : భాషా రాష్ట్రాలు. మా తాత ఒక కథ చెప్పేవాడు. ఆ కథ చెబుతాను మీకు. ఒక కాపాయన ఉన్నాడు. అంటే రైతు. రైతు అనేది ఉర్దూ మాట. కాపాయన అనేది తెలుగు మాట. ఆయనకు పదెకరాల నేల ఉంది. ఎక్కడినుంచో ఇంకొకాయన వచ్చాడు. ‘‘అయ్యా నేను బతకలేనండి, నాకేదైనా దారిచూపించండి’’ అన్నాడు. ‘‘సరే, నా దగ్గర పొలం పనిచేసుకో. నీకు బోజనంఇస్తాను, ఆ ఇంటి బయట ఉండే స్థలం శుభ్రం చేసుకొని అక్కడ ఉండు’’ అన్నాడు. ఓ ఏడాది గడిచింది. ‘‘నువ్వు బాగ చేస్తున్నావు. నాకు చాలా నేల ఉంది. ఇదో ఈ రెండు ఎకరాల పొలం నువ్వు చేసుకో’’ అన్నాడు. ఐదారేళ్లు గడిచాయి. ఈ కాపాయన ఉన్నాడు కదా, ఆయన ఊరి పెద్దల్ని పంచాయితీకి పిలిచి ‘‘వాడు నన్ను అన్యాయం చేస్తున్నాడు. నా ఐదెకరాలు నాకు పంచి ఇవ్వండి’’ అన్నాడు. అదే ఆంధ్ర ఉద్యమం. అదే ప్రత్యేక రాష్ట్రం 1953లో ఏర్పడింది. అదే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం 1956లో ఏర్పడింది. ఆ కథ వింటే ఎంత నవ్వొస్తుందో… అంతకంటే వెకిలిగా నవ్వాలి మనం ఆంధ్ర ఉద్యమం గురించి. వింధ్య నుంచి వానమామల వరకు, పశ్చిమ కనుమల నుంచి వంగ కడలి వరకు ఉన్న తెలుగు నేలలో, ఇదీ తెలుగు నేల అని చారెడు నేల అడిగి తీసుకున్నారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి మొత్తానికి కారణం 1913 నుంచి మొదలైన ఆంధ్రోద్యమం. చాలా వరకు కారణం. వాళ్లే ఇది తమిళ నేల, ఇది కన్నడ నేల, ఇది ఒరియా నేల అని ముద్రేసేశారు. మేధావులు చేసిన తప్పు ఇదంతా. రాజకీయ నాయకుల తప్పుకాదు. దానికీ కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా తెలుసు. 1913లో బాపట్లలో కూర్చున్నారు కదా ప్రత్యేక ఆంధ్రకోసం, దానికి రెండేళ్ల ముందు తిరుచురాపల్లిలో సమావేశం జరిగింది. కావేరి నదికి దక్షిణం మనం తమిళనాడు తీసుకోవాలి లేదంటే మనం ఈ తెలుగువాళ్లతో ఏగలేమని. అది వీళ్లకు తెలుసు. ఈ బాపట్లలో కూర్చున్న తెలుగు వాళ్లకు. మరి వీళ్లెందుకు అడిగారు మద్రాసుకు ఉత్తరం. వాళ్లు కావేరికి దక్షిణం అడిగారు, మరి వీళ్లు మద్రాసుకు ఉత్తరం ఎందుకు అడిగారు? దానికి కారణం ఉంది. ఎందుకు మొదలు పెట్టారు ఆంధ్రోద్యమం?
ఎందుకు మొదలుపెట్టారంటే? వింజమూరి వేదాంత దేశిఖర్ తెలుగు వైష్ణవుడు. ఆయన తమిళానికి వ్యాక్యరణం రాశాడు. 1870ల్లో. ఎక్కడ కడలూరు ప్రాంతంలో. రాస్తూ ఒక మాట రాశాడు. తమిళానికి ఒక భాషగా చెప్పుకునే అర్హత లేదు. సంస్కృతం లేనిదే తమిళం మనజాలదు అని రాశాడు తమిళంలో. ఇదీ తక్షి సూర్యనారాయణ శాస్త్రి అనే తెలుగు స్మార్థ బ్రాహ్మణుడికి ఒళ్లు మండింది. ఈ సూర్యనారాయణ శాస్త్రిది మధురకు దక్షిణం. ఎట్ల ఒక భాషను కించపరుస్తవు అని ఈయనకు కోపమొచ్చింది. ఈయన ఆయనను ఖండిస్తూ రాశాడు. ‘‘అట్ల ఒక భాషను అనడం తప్పు, సంస్కృతం గొప్ప భాష అని చెప్పు ఒప్పుకుంటాం. తమిళానికి వ్యాకరణం రాస్తూ తమిళాన్ని ఎందుకు కించపరుస్తావు’’ అని రాశాడు. అప్పుడు మద్రాసుకు దక్షిణ ప్రాంతంలో తమిళ వర్గాలు రెండుగా చీలాయి. అవి ఒకటి తమిళ వర్గం, మరొకటి సంస్కృత వర్గం. సూర్య నారాయణ శాస్త్రి ఆయన పేరు మార్చుకున్నారు. పరిది మార్కలైనర్ అని తమిళ పేరు పెట్టుకున్నారు. సూర్య అంటే తమిళంలో పరిది, నారాయణ అంటే మార్, శాస్త్రి అంటే కలైనర్. అలా పేరు మార్చుకొని ఉద్యమం మొదలుపెట్టాడు. ఆయన తరువాత ఆ ఉద్యమం బ్రాహ్మేతర చదువుకున్న కులం ఒకటి ఉందక్కడ. పిళ్లైలు. కనక పిళ్లై. కరణాలు. తమిళులకు ఏమైంది? బ్రాహ్మణులు కాకుండా కాయస్తులు అంటే కణక పిళ్లైలున్నారక్కడ. వాళ్లు చదువుకున్న వాళ్లు. వాళ్లకు చదువులో గాని, సాహిత్యంలో గాని బ్రాహ్మణులతో ఎప్పుడూ పోటీ. తెలుగు నేలపై వాళ్లు లేకుండా పోయారు. కణక పిళ్లైలు పదిరి మార్కలైనర్ నుంచి ఆ ఉద్యమాన్ని తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? వేదాచలం పిళ్లై అని, మరై మలై అడిగలార్. వేదం అంటే మరై, మలై అంటే కొండ. ఆయన తీసుకోవడం తీసుకోవడమే సంస్కృత వ్యతిరేక ఉద్యమాన్ని బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా మార్చాడాయన. కానీ సక్సెస్ కాలేదు. అదే సమయంలో ముగ్గురిలో ఇద్దరు తెలుగు వాళ్లు వచ్చారు. వింజమూరి వేదాంత దేశిఖర్, తక్షి సూర్యనారాయణ శాస్త్రి ఇద్దరు తెలుగు వాళ్లు. ఆ సమయంలో వావేసు అయ్యర్ తమిళంలో మొట్ట మొదటి కథ రాసినాయన. వరగనేరి వేంకట సుబ్రహ్మణ్య అయ్యర్ ఆయన ఇంటిపేరు వరాహగిరి. ఆయది తిరుచురా పల్లి. ఆయన మహారాష్ట్రలో సావార్కర్ ఎట్లనో తమిళులకు ఆయన అట్ల. అంటే ఒక తీవ్రవాది. పిస్తోల్ ఎత్తుకొని ఒక తెల్లదొరను కాల్చేశాడు. మహా పొగరుబోతు. ఆయనను అరెస్టు చేశారు. షిప్పులో లండన్ తరలిస్తుంటే షిప్పులోంచి దూకి ఇంగ్లీష్ చానెల్ ఈదుకుంటూ వచ్చేశాడు. తరువాత పాండిచ్చేరిలో ఉన్నాడు. ఆ తరువాత ఆయన గాంధీ అడుగుజాడల్లో నడిచాడు. తీవ్రవాదాన్ని వదిలేసి సత్యాగ్రహం అని చెబుతూ తిరిగాడు. తిరుచురాపెల్లిలో ఒక గురుకులాన్ని స్థాపించాడు. ఆ గురుకులంలో బ్రాహ్మణ పిల్లలకి, బ్రాహ్మణేతర పిల్లలకి విడివిడిగా వడ్డించేవారు. వంటలంతా బ్రాహ్మణులు చేసేవారు. అప్పుడు గాంధీ అడుగుజాడల్లో నడిచే ఆయన రామస్వామి నాయుడు అయన్ని పెరియార్ అంటారు. ఆయన తెలుగాయన. గాజుల బలిజ. ఆయన తిరుమాల్ పుర్ లో దేవాలయాల్లోకి హరిజనులను ప్రవేశింపజేయాలని ఉద్యమం చేస్తున్నాడు. ఇది తెలిసింది సుబ్రహ్మణ్య అయ్యర్ కి. వీళ్లిద్దరికీ పంచాయితీ నడిచింది. ఈ పంచాయితీ గాంధీ దగ్గరకు వెళ్లింది. గాంధీ ఏంచేశాడంటే అందరినీ కలిపి కూర్చోబెట్టి బోజనాలు పెట్టు, వంట కావాలంటే బ్రాహ్మణులతో చేయించుకో అన్నాడు. రామస్వామి నాయుడికి కోపం వచ్చింది. ఖద్దరు తీసి పక్కనేశాడు. నల్లచొక్కా వేసుకొని ద్రావిడ ఉద్యమం మొదలుపెట్టాడు. తీవ్రమైన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టాడు. అంటే ఎట్లా వచ్చిందంటే శ్రీరంగం కావేరిలో స్నానం చేస్తున్నారు బ్రాహ్మణులు, ఈ కార్యకర్తలుంటారు ద్రావిడ కలగం కార్యకర్తలు వస్తూనే పిలకలు పట్టుకొని వంచి వారి నామాలు నాకేవాళ్లు. జంధ్యాలు తెంచేవాళ్లు. చిన్న వేధింపు కాదది. ‘‘ఈ ఉద్యమం మద్రాసుకు ఉత్తరం పాకకూడదు. పాకితే తట్టుకోలేం మనం.’’ ఒక ఉద్యమం ఉన్నచోటే ఆగాలంటే ఇతర ప్రాంతాల్లో మరో ఉద్యమం మొదలవ్వాలని పొలిటికల్ సైన్స్ లో చెబుతారు. అలా వీళ్లు ప్రత్యేక రాష్ట్రోద్యమం మొదలుపెట్టారు. తెలుగు కోసం కాదు. దాంట్లో మంచి, చెడు గురించి నేను మాట్లాడడం లేదు. కానీ చేసింది ఇందుకోసమే.
తెలుగు కోసం ఈ ఉద్యమం చేసి ఉంటే 1953లో రాష్ట్రం ఏర్పడిన తరువాత వెంటనే చేయాల్సింది ఈ రాష్ట్రానికి అధికార భాషగా తెలుగును ప్రకటించడం. ఆంధ్రప్రదేశ్ కి అధికార భాషగా ఎప్పుడు ప్రకటించారు? రాష్ట్రం ఏడిన 10 సంవత్సరాల తరువాత. అక్కడే అర్థకావట్లా వాళ్ల చిత్తశుద్ధి ఎంతో? కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం తెలుగు కోసం జరగలేదు. అది అబద్ధం. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రరాష్ట్రం కోసం చనిపోలేదు. అది ఇంకా పెద్ద అబద్ధం. ఈ మాట అంటే పొట్టి శ్రీరాములు గారిని ఇట్లా అంటావా? అట్లా అంటావా? వాని వాదనకు రావచ్చు. పొట్టి శ్రీరాములు గారు చాలా చాలా చాలా గొప్ప మనిషి. చాలా సున్నితమైన మనిషి. అలాంటి మనిషి తెలుగు జాతిలో పుట్టడం తెలుగు వాళ్లందరికీ గర్వకారణం. ఆయన చనిపోయింది ఆంధ్ర రాష్ట్రం కోసం కాదు. ఆయన నిరాహార దీక్షకు కూర్చోవడానికి ముందే నెహ్రూ పార్లమెంట్ లో ప్రకటించాడు ‘‘వివాదాస్పదమైన మద్రాసు, బళ్లారి వదిలేస్తే రాష్ట్రం ఏర్పాటు చేస్తాం’’ అని. పొట్టి శ్రీరాములు గారు మద్రాసులేని ఆంధ్ర రాష్ట్రం తల లేని మొండెం వంటిదని, మద్రాసు నగరం కోసం ఆయన నిరాహార దీక్షకు కూర్చున్నాడు. అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రం కోసం కాదు కాదు కాదు. మద్రాసు నగరం కోసం అన్ని రోజులు కూర్చున్నాడని తలుచుకుంటేనే ఇప్పటికీ గుండెల్లో దేవేస్తుంటది. ప్రపంచంలో ఎవరైనా అన్ని రోజులు కూర్చున్నారా అట్ల? చచ్చిపోతున్నాం అని తెలిసీ ఎల్టీటీటీ వాళ్లు బాంబు కట్టుకొని దూకెయ్యవచ్చు, క్షణాల్లో చావు. కానీ అది క్షణాల్లో చావు కాదు కదా. చచ్చిపోతున్నానని తెలీసీ అన్ని రోజులు చేయడం… ఎంత గొప్ప త్యాగం అది. దేనికోసం త్యాగం చేశాడు? మద్రాసు నగరం కోసం. చచ్చిపోయాడు. అంతే, కనిపించిన తమిళ బోర్డులన్నీ పగలగొట్టారు. పేడవేశారు, తట్టా బుట్ట సర్ధుకున్నారు, కర్నూలు గుడారాలకు పరుగెత్తేశారు. కర్నూలులో ఆఫీసుల కోసం గుడారాలు ఏసుకున్నారు. నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేశామని ప్రకటించాడు, వెళ్లిపోయారు చకచక. ఎవరు వెళ్లిపొమ్మన్నారు మిమ్మల్ని? మద్రాసు నగరం పైనా మద్రాసుకు దక్షిణంగా ఉండే తెలుగువాళ్లం ఉన్నాం కదా మేము, మాకు కూడా హక్కు లేదు. అది పూర్తిగా ఆంధ్ర ప్రాంతపు తెలుగు వాళ్లది మద్రాసు నగరం. దాంట్లో ఉండే అంగుళం అంగుళం మీది. ప్రతి కట్టడంలో ఉండే ప్రతి ఇసుక రేణువు మీది. ఆంధ్ర ప్రాంతపు తెలుగువాళ్లది. ఎందుకు వెళ్లిపోయారంటే? మద్రాసీలనే వాళ్లు, ఎన్టీయార్ వచ్చిన తరువాతే గుర్తింపు వచ్చింది అంటారు. ఎవడి రాజధాని నగరంతో వారి గుర్తిస్తారు. మీరెందు ఉలిక్కిపడ్డారు మద్రాసీలంటే? తెలంగాణ వాళ్లని హైదరాబాదీ అంటే ఉలిక్కిపడతారా? ఉలిక్కిపడరు కదా. మద్రాసీ అంటే మీరెందు ఉలిక్కిపడ్డారు? మీరే మద్రాసీలు. మేము కాదు. దక్షిణాది తెలుగు వాళ్లం మేమేదో మధురైట్స్ లేదా కోయంబత్తూరైట్స్ ఇంకేదో అవుతాం. కానీ మేము మద్రాసీలం కాదు. మీరే మద్రాసీలు. చరిత్రలో ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్లు ఎంత చీకట్లో ఉండిపోయారో చూడండి. ‘‘మమ్మల్ని మద్రాసీలనేవాళ్లు, ఆత్మగౌరవం దెబ్బతినేది.’’ మద్రాసీలనక ఏమంటారు మిమ్మల్ని. ఇప్పుడా పదం తమిళవాళ్లు తీసేసుకున్నారు. దాంతో ఏమైంది? భారతదేశంలో నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వచ్చింది. హిందీలో ఛానెల్ పెడుతుంది. హిందీలో డబ్బింగ్ చెపుతారు, దాని తరువాత తమిళ్ డబ్బింగ్. డిస్కవరీ ఛానెల్ వచ్చింది. హిందీ వర్షన్ డబ్బింగ్, దాని తరువాత తమిళ డబ్బింగ్. దోమల చుట్ట తయారు చేస్తాడు టార్ టాయిస్ కంపెనీవాడు. దాని అట్టమీద హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తమిళ్ ఉంటుంది. సామ్రాని పుల్లలు తయారు చేస్తాడు, దాని అట్టమీద హిందీ ఉంటుది, ఇంగ్లీష్ ఉంటుంది, తమిళ్ ఉంటుంది. ఇట్లాంటివి ఒక చూపిస్తా. భారతదేశంలో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తరువాత ఉన్నది హిందీ, తమిళ్ మాత్రమే. కారణమేంటి? సౌత్ ఇండియాలో పెద్ద నగరం మద్రాస్. మద్రాసీలు ఎవరంటే తమిళియన్స్. వాళ్లు గర్వంగా చెప్పుకున్నారు మద్రాసీలమని. మీరు ఉలిక్కిపడ్డారు. ఎంత చారిత్రకమైన తప్పిదమో చూడండి. తెలుగు వాడు భాషా రాష్ట్రం అడగమేంటి? ఇందాక మా తాత చెప్పిన కథ చెప్పాను కదా… వాళ్లు గొడవ పడి కావేరికి దక్షిణం ఇంత ఇవ్వమనో, కన్నడీగుడు ఇంత ఇవ్వమనో అడిగి తీసుకొని పోవాల్సింది వీళ్లతోని మేము ఏగలేమురా బాబు అని. నిజానికి మీరు చెప్పే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40 మంది ఎంపీలుంటే, రాజాజీ ఇంకా మేలు కదా, దక్షిణ ప్రదేశ్ అని పెట్టమన్నాడు ఇదంతా కలిపి. పెట్టి ఉంటే డెబ్బై మందో, ఎనబై మందో తెలుగువాళ్లు ఎంపీలయ్యి ఉండేవాళ్లు. ఉత్తరప్రదేశ్ పెత్తనం జరిగి ఉండేది కాదు. హిందీ పెత్తనం జరిగి ఉండేది కాదు. తెలుగుకు ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా దక్షిణ ప్రదేశ్ ప్రపోజల్ రాజాజీది.
హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు అన్నాదురై లేచి ‘‘ఈ దేశానికి జాతీయ భాష ఉండకూడదు. ఈ దేశానికి లింక్ లాంగ్వేజ్ ఉండాలి. లింక్ లాంగ్వేజ్ గా హిందీ పనికి రాదు. ఎందుకంటే మీరు చెప్పే హిందీలో రైల్వే టైం టేబుల్ తప్ప ఇంకే పుస్తకం లేదు’’ అన్నాడు. అంతేకదా, 1950ల నాటికి హిందీల ఏం సాహిత్యముంది? తులసీదాస్ వాళ్లు రాసింది బ్రజ్ లో. నువ్వు హిందీ అని పేరు పెట్టిన తరువాత ఏముంది అందులో సాహిత్యం? ఏదో ప్రేమ్ చంద్ రాసిన నాలుగైదు కథలు తప్పితే ఏమున్నాయి? కాబట్టి ఈ దేశానికి అనుసంధాన భాషగా ఉండగానికి అర్హత తెలుగు ఉంది. తెలుగును అనుసంధాన భాష చేయండని పార్లమెంట్ లో అన్నాదురై అడిగాడు. సరోజినీ నాయుడు కూతురు కమల లేచి అన్నాదురైని నానా మాటలు తిట్టింది. నీకేం తెలుసు తెలుగు గురించి, తెలుగుకు ఆ అర్హత లేదని. ఇవన్నీ పార్లమెంట్ రికార్డ్స్. అంటే తెలుగును గురించి పట్టని తనం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులలోది కాదు, చాలా పాతది ఇది. దానికి కొస ఇప్పుడు జరుగుతున్నది. నేను చాలా చోట్ల చెబుతుండేది ఏంటంటే? తెలుగు జాతి ఇట్ల దిగజారిపోవడానికి కారణం రాజకీయ నాయకులు కాదు కాదు కాదు. మేధావులు. మేధావులు పాడైపోయినారు. చాలా కాలం నుంచి తెలుగును పట్టించుకోలేదు. కాబట్టి తెలుగు ఇట్ల ఉంది. ఇదే నేను చెప్పేది.
చాణక్యుడు ఆర్థశాస్త్రం రాశాడు. అర్థశాస్త్రం పేరుతో పొలిటికల్ సైన్స్ రాశాడు. అట్లాంటి పుస్తకం ఆకాలంలో భారతదేశంలో వచ్చిందంటే చిన్న విషయం కాదుకదా. పొలికల్ సైన్స్ రాశాడు. దాంట్లో ఒక చోట ఉంటుంది. ‘‘నడిపించేది రాజు కాదు. ప్రజలకు, రాజుకు మధ్య మేధావి వర్గం ఉంటుంది. వాళ్లు గుప్పెడు మంది ఉంటారు. వాళ్లు నడిపిస్తారు’’ అని అంటాడు. రాజు తెలివైన వాడైతే రాజు వాళ్లని కొనేసుకుంటాడు. రాజు తెలివి తక్కువాడైతే వాళ్లని వ్యతిరేకిస్తాడు. వాళ్లు ప్రజలని రాజుకు వ్యతిరేకంగా నైనా మలచగలరు, అనుకూలంగానైనా మలచగలరు. కొనేసుకుంటే మంచిగా ప్రచారం చేస్తారు. అంటే ఎక్కడైతే మేధావి వర్గం విఫలమవుతుందో ఆ సమాజం మొత్తం విఫలమవుతుంది. అది మనకు జరిగింది. తెలుగు నేలమీద మేధావి వర్గమంతా తమిళులైపోయారు. ఎప్పుడైతే ఈ ఉద్యమం మొదలుపెట్టిందో తమిళం, తమిళం, తమిళం. ఈరోజు తమిళాన్ని పెంచి పోషించి పెద్దదిగా చేసిందంతా తెలుగువాళ్లే తమిళనాడులో.
హర్షణీయం : మాకు తెలిసింది తెలుగు ప్రాంతాలంటే రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ. మీరు చెబుతున్న సంఖ్య వింటుంటే దాదాపు ఇంతే సంఖ్యలో ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నట్లుంది?
స.వెం. రమేష్ : 22శాతం తెలుగు వాళ్లు ఒరిస్సాలో ఉన్నారు. అంటే కోటి మంది. భాషా రాష్ట్రాలతో ఏయే రాష్ట్రాలు ప్రయోజనాలు పొందాయో చెబుతా వినండి. ఒరిస్సాలో పడమటి ప్రాంతమంతా. అంటే ఒరిస్సా ఈశాన్యం మూలగా ఉంటుంది కదా… సరిగ్గా నిలువుకు చీల్చారనుకోండి, కింది నుంచి ఆ మధ్యభాగమంతా కూడా తూర్పు కనుమలు ఉంటాయి. అంటే మల్కాన్ గిరి నుంచి మొదలుపెట్టి పై వరకు మయూర్ బంజ్ జిల్లా వరకు కూడా. మధ్యలో తూర్పు కనుమలుంటాయి. రాష్ట్రాన్ని పొడవుగా రెండుగా చీల్చుతాయి అవి. తూర్పు కనుమలకి కింద, అంటే సముద్ర తీరానికి కిందికి వచ్చే ప్రాంతమంతా ఒడియా ఉంటుంది. తూర్పు కనుమలు మొత్తం గిరిజన భాషలుంటాయి. గిరిజన భాషల్లో గోండులకు సంబంధించిన కోందు, కుయి, కువి, పెంగో, పర్జీ లాంటి ద్రావిడ భాషలు మొదటి స్థానంలో ఉంటాయి దక్షిణ ప్రాంతంలో. రెండో స్థానంలో ముండారి భాషలంటారు, అంటే సవర, బోండా ఇలాంటి భాషలు. కొంచెం ఉత్తర ప్రాంతాల్లో కొలేరియన్ లాంగ్వేజెస్ అని అంటారు, అంటే సంతాలి లాంటి భాషలు ఎక్కువ ఉంటాయి. ద్రావిడ భాషలు కూడా కొన్ని ఉంటాయి. ఒడియా ఇండో ఆర్యన్ లాంగ్వేజ్. దానికి సంబంధించిన గిరిజన భాషలేవీ ఉండవు. వాటికి సంబంధం లేని భాషలుంటాయి. తూర్పు కనుమలకు ఎగువ అంతా కూడా కోసలి, అదొక మాండలికం. అంటే హిందీలో బోజ్ పురి లాగా. అట్ల కోసలి ఉంటాయి. ఒడియా భాష చాలా తక్కువ ఉంటుంది. పది శాతం కూడా ఉండదు. ఒడియా భాష ఎక్కడ ఉంటుందంటే తూర్పు కనుమలకు దిగువ సముద్ర తీరంలో మన గంజాం జిల్లా (గంజాం జిల్లాలో తెలుగు మెజార్టీ) వదిలేస్తే … అంటే ఒడియా ప్రాంతం చాలా చిన్న ప్రాంతం. కళింగ చరిత్ర మొత్తం తెలుగువాళ్లదే. ప్రాచీన శాసనాల్లో కళింగ దేశం వేరు, ఓడ్ర దేశం వేరు. కళింగ దేశం గోదావరికి ఉత్తరాన మన తూర్పు గోదావరి జిల్లా నుంచి మొదలవుతుంది. తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గంజాం, గజపతి జిల్లాలు కళింగలో భాగం. మహానదికి దక్షిణం అంటే కటకం నుంచి మొదలవుతుంది. ఇది తెలుగు ప్రాంతం. మహానదికి ఉత్తరం ఓడ్రం. చాలా చిన్నది ఓడ్ర దేశం. వాళ్లకి ఎప్పుడైతే పెద్ద రాష్ట్రం వచ్చేసిందో 1936లో పెద్ద కల్చర్ వచ్చేసింది. ప్రపంచంలో గుర్తింపు వచ్చేసింది. 2001 జనాభా లెక్కలు తీయండి, ఇప్పటికీ కర్ణాటక జనాభా లెక్కల్లో ఎంత తారుమారు చేస్తారో తెలుసు మాకు. జనాభా లెక్కల్లోనే 65శాతానికి లోపు కన్నడ జనాభా కర్ణాటకలో. అంటే వాళ్లలో ఏవేం భాషలు చేరిపోయాయి? పెద్ద భాష తెలుగు. తెలుగు వాళ్లు కన్నడీగులుగా చేరిపోయారు. కొంత మరాఠీలు చేరిపోయారు, తులు వాళ్లు చేరిపోయారు. ఎనిమిది జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి కదా కన్నడీగులకు, వాళ్ల మాతృ భాషలు వెతుక్కోండి. మాస్తి వెంకటేశయ్యంగారు తమిళం మాతృభాష. ఇంకొకరిది తులు మాతృభాష. ఇంకొకరిది కొంకణి మాతృభాష. కన్నడీగులా కన్నడ సాహిత్యానికి సేవ చేసినవాళ్లంతా? కాదు. అంటే భాషా రాష్ట్రాల వల్ల ఆ భాషలన్నీ లాభం పొందినయి. తెలుగు మాత్రం నష్టపోయింది.
హర్షణీయం: రమేష్ గారు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు?
స.వెం. రమేష్ : తిరువూరులో నాకు ఏ భాషకూ లేనన్ని జానపద కళల వివరాలు తెలిశాయి. వాటి జాబితా రాశాను. ప్రదర్శన కళలే 500 పైచిలుకు దొరికాయి. అట్లాగే చేతి కళలు ఉంటాయి. కాళహస్తి చుట్టుపక్కల కొయ్యబొమ్మలు చెక్కుతారు. మాదవ మాల, పల్లె మాల. ఇట్లాంటివి ఇంకొక 300 వరకు దొరికాయి. మనం పోగొట్టుకుంటున్న పనులున్నాయి తెలుగువాళ్లం. ఉత్పత్తిదశలోకి మొట్టమొదట వచ్చిన ఉనికిలోకి వచ్చిన వాటిలో కొన్నిటిని పోగొట్టుకుంటున్నాం. ఈ మధ్యే ఓ మితృడు చెప్పాడు… సాళ్లు, జడ్డిగం వేసి గొర్రు అటారు కదా విత్తనం వేస్తారు కదా నాగలికి. నాలుగు సాళ్ల గొర్రు ఉంది తెలుగు నేలమీద. ఇంకా రాయలసీమ నేలపై బతికి ఉంది. ఒడియా వాళ్లకి ఇంకా ఒక్కసాలు గొర్రు మాత్రమే ఉంది. ఉత్తర ఒరిస్సాలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ ఎద్దులకు ముక్కు కుట్టడం తెలియదు. దక్షిణ తమిళనాడులో జంట నాగళ్ల పద్దతి వందేళ్ల క్రితం తెలుగు వాళ్లు కనిపెట్టారు. అంటే తెలుగు వాళ్లు ఉత్పత్తి దశలో ఎంత వెళ్లిపోయారు అనే దాని గురించి. ఇదంతా రాస్తే చదివేవాళ్లు తగ్గిపోతున్నారు. చూసేవాళ్లు పెరుగుతున్నారు. చూడడం, వినడం. పని ఒత్తిళ్ల వల్లకావచ్చు… చూడడం, వినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి, నా మితృలు డీటీఎల్ సీ (డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్) వారితో మేము గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటల్లోంచి వాళ్లు ఇవన్నీ రికార్డు చేస్తే బావుంటుంది అంటే వాళ్లు ముందుకు వచ్చారు. డాక్టర్ శ్రీనివాస్, విజయ్ అనే ఇద్దరి సహకారంతో ఈ పని మొదలుపెట్టి, మొన్న జనవరి నుంచి చేస్తున్నాం. ప్రతీది వీడియో రికార్డ్ చేస్తున్నాం. నాకంటే ఈ విషయాల్లో ఎక్కువ పనిచేసేవాళ్లు, ఎక్కువ ఓపికగా చేసేవాళ్లు ఇంకొకరు రావచ్చు రేపు, కానీ నేను మొదలుపెట్టిన దాంతో మొదలుపెట్టాల్సిన అవసరం లేదు.
హర్షణీయం : తెలుగు భాషకు ప్రాచుర్యం అనండి లేదంటే, వేరే రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్లను మనవాళ్లుగా గుర్తింపజేయడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం చేస్తే బావుంటుంది?
స.వెం. రమేష్: చాలా ఆసక్తి, అధికారాలు ఉన్న మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే సాధ్యమవుతుంది.
రమేష్ గారు ఇంటర్వ్యూలో ప్రస్తావించిన ‘మొరసునాడు కథలు’ పుస్తకం కొనాలంటే – https://kinige.com/book/Morasunadu+Katalu://bit.ly/2TXhEub
‘ తెలుగు వాణి’ ప్రచురిస్తున్న ‘అమ్మనుడి’ పత్రిక చందా కట్టడానికి –
సంవత్సర చందా – 300 రూపాయలు
జీవిత చందా – 5000 రూపాయలు
డాక్టర్. సామల లక్ష్మణ బాబు – 94929 80244 / 9440448244
హర్షణీయం ఫేస్ బుక్ లో – https://www.facebook.com/Harsha051271
హర్షణీయం ట్విట్టర్ – @harshaneeyam
హర్షణీయం యూట్యూబ్ లో – https://bit.ly/harshayoutube
Leave a Reply