Apple PodcastsSpotifyGoogle Podcasts

ది ఫ్రెండ్స్ – ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన

ఎన్ ఎస్  ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో  అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి  కృతజ్ఞతలు. 

పుస్తకం కొనడానికి – https://www.telugubooks.in/products/uttarandhra-kathalu

*************

ఇంకా తెల్లవారలేదు.

శీతాకాలం మంచు బాగా కురుస్తోంది. సముద్రపొడ్డునే వున్న ఆ పొడుగురోడ్డు నిర్మానుష్యంగా వుందనే చెప్పాలి. ఒకవేళ ఎవరైనా వున్నారేమో? ఆ మంచుతెరల్లోంచి మాత్రం ఎవరూ కనబడడంలేదు. చలికి జడిసే కాబోలు పక్షులు కూడా ఇంకా గూళ్ళు వదిలి రావడంలేదు. సముద్రపు హోరునికూడా ఆ మంచు మింగేసినట్టుంది; ఆ పక్కని సముద్రమే లేనట్టుంది. స్టీమర్లలో దీపాలు కాబోలు ఏవో ఆకాశదీపాల్లాగా మసక మసకగా కనబడుతున్నాయి. రోడ్డుకి రెండోవైపు ఇళ్లున్నాయి. గాని పొగమంచుతో కప్పడిపోయేయి. తెల్లారగట్ట లేచి చదువుకొనే కుర్రాళ్ళ గదుల్లో దీపాలు కాబోలు అక్కడక్కడా కనబడీ కనబడనట్టు కనబడుతున్నాయి.

మంచుని చీల్చుకొంటూ ఎవరో ఇద్దరు మనుషులు వస్తున్నారు. వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనబడకపోయినా – వాళ్ళలో ఒకరు లావుగాను, మరొకరు అంతలావుగా లేనట్టూ కనబడుతున్నారు. అంత లావుకాని ఆయనచేతిలో వాకింగ్ స్టిక్ వుంది. దాన్ని మహా జోరుగా ఊపుతూ నడుస్తున్నాడతను. లావుగా వున్నాయన నోట్లో పైపొకటి వుంది. నోట్లో వుంచుకొనే ఏదో  మాట్లాడుతున్నాడతను. ఇద్దరూ నెమ్మదిగానే నడుస్తున్నా లావుపాటాయన కొంచెం ఈడుస్తూ నడుస్తున్నట్టూ, రెండో ఆయన ట్రిమ్ గా నడవడానికి ప్రయత్నిస్తున్నట్టూ ఉంది. వాళ్ళిద్దరూ తలలకి మఫ్లర్లు చుట్టుకొన్నారు చలికోట్లు వేసుకున్నారు. కాళ్ళకి బూట్లు తొడుక్కున్నారు.

వారిద్దరిలోనూ పైపు పట్టుకొన్నాయన యూనివర్సిటీలో అదేదో శాస్త్రంలో అసిస్టెంటు ప్రొఫెసరు. వాకింగ్ స్టిక్ పట్టుకొన్నాయన అదే యూనివర్శిటీలో మరేదో శాస్త్రంలో ప్రొఫెసరు.

“మేష్టారూ!” అన్నాడు అసిస్టెంటు ప్రొఫెసరు “రష్యాలో కూడా చలి విపరీతంగా ఉంటుంది, గానండి, అదంతా అదోరకం బ్యూటీసార్, నేను అక్కడ కూడా అప్పుడప్పుడు మార్నింగ్ వాక్ కి వెళ్ళేవాణ్ణిలెండి… కోటుజేబులో చిన్న వోడ్కా బాటిల్ పడేసుకొని” అంటూ పైపు  చేత్తో పట్టుకొని, బడబడ నవ్వేడతను.

ప్రొఫెసరు ఏం మాట్లాడలేదు. ఆయన రష్యా వెళ్ళలేదు గాని, అమెరికా వెళ్ళేడు. అతను చిన్నప్పట్నించీ జబ్బు మనిషి. అమెరికాలో వున్నన్నాళ్ళూ హాస్పిటల్లోనే వున్నాడు. మంచుతెరలూ, మోణింగ్ వాకులూ అతనెరుగడు. తన అనారోగ్యం గురించి అతనెప్పుడూ చికాకుపడుతూనే వుంటాడు. అందుకే ఏం మాటాడలేదు.

ఆయన మౌనాన్ని అర్థం చేసుకొన్నట్టున్నాడు, టాపిక్ మార్చేడు అసిస్టెంటు ప్రొఫెసరు. అసిస్టెంటు ప్రొఫెసరు పేరు ఎమ్.మారుతీరావు ఎమ్మెమ్ రావంటారు. స్టూడెంట్ సర్కిల్సులో మొద్దు మాస్టారనీ, ఏమేమీ రావనీ’ ముద్దు పేర్లున్నాయతనికి.

హెల్తుకి యోగాసనాలు మంచివి మేష్టారూ!… ఈ వయసులో యోగాసనాలేం చేస్తాంలెండి కాని, మోడింగ్ వాక్ ఫఱవాలేదు. మీకెందుకు, ఇలాగ నాలుగు రోజులు మీరు నాతో రండి. అయిదోరోజు మీరే వచ్చి నన్ను పిలుస్తారు” అన్నాడు మళ్ళీ దడదడ నవ్వుతూ,

ప్రొఫెసరు క్లుప్తంగా “వూc” అని వూరుకొన్నాడు.

ఆయన పేరు ప్రొఫెసర్ జె.గోవర్ధన గిరిధారి. ప్రొఫెసర్ జె.జీ.ధార్ అంటారు. జబ్బు గురుడు”.  ఆయన రహస్య నామం.

కొంతసేపు ఏమీ మాట్లాడకుండానే నడవసాగేరు వాళ్ళిద్దరూ. ఈ ఇద్దరి మధ్యా చాలాకాలం నించి మంచి స్నేహం వుంది. వాళ్ళ స్నేహానికి ఒక కారణం – ఇదే ముఖ్యమైన కారణమని కొందరు అంటారనుకోండి – వాళ్ళిద్దరిదీ ఒకటే కులం అవడం – అదీ కాకుండా ‘మరో విషయంలో కూడా ఇద్దరిదీ ఒకే “కులం”. ఉన్నత విద్యకోసం యూనివర్సిటీ ఖర్చుమీద ‘ విదేశాలకి వెళ్ళి, ఉన్న విద్యతోనే తిరిగొచ్చేరు. ఇద్దరూ.. |

చదువుకొనే రోజుల్లో (అంటే విద్యార్థి దశలో) తనశాస్త్రాన్ని మారుతీరావు ఎన్నడూ  (సరిగా) చదువుకోలేదు. ట్యూటరయేకా చదవలేదు. లెక్చరయేక అంతకన్నా లేదు.  ప్రొఫెసరయేక అసలులేదు. అతను కొద్దిరోజుల్లోనే ప్రొఫెసరయే అవకాశం వుంది.  అవగలనన్న నమ్మకం కూడా అతనికి వుండేది నిన్నమొన్నటి దాకా. కులం  ఎంచేతంటే,  అతని కులం వాడొకాయన రాష్ట్ర మంత్రివర్గంలో స్టేట్ మంత్రిగా వుంటున్నాడు. అతను కనీసం క్యాబినెట్  మంత్రయినా (కా(లే) నంద్కు అతను (అంటే అసిస్టెంటు ప్రొఫెసరు) మహాచిందులు తొక్కేవాడు. అయితే, ఈ మధ్య అతనికి కొత్త సమస్య ఒకటి తగులుకొంది. ఆ సమస్య – కంటిలోనలుసు కన్నా, కాలిలో ముల్లుకన్నా ఎక్కువగా అతన్ని బాధిస్తోంది. “ఈ అసిస్టెంట్ ప్రొఫెసరుకి ఏమీరాదనీ, ఇంగ్లీషు(లో) కూడా సరిగా మాట్లాడలేడనీ” – ఇతన్ని గురించి ఆకాశరామన్న ఉత్తరాలు పై అధికార్లకి అందేయి. (మారుతీరావు ఇంగ్లీషు గురించి విద్యార్థిలోకంలో బోలెడు జోక్సు ప్రచారంలో వున్నాయి)

దానికి తోడు ఆ స్టేట్ మంత్రి ఏవో పంతాలకిపోయి, ఉన్న పదవికి కాస్తా రాజీనామా ఇచ్చేస్తానంటున్నాడని వార్త వచ్చింది. వీటన్నింటినీ మించి మరో పెద్ద డేంజరస్ విషయంలో ఇరక్కున్నాడతను. రష్యానించి తిరిగివచ్చిన కొత్తలో,  అడగనివాడిదే పాపమన్నట్టు అందరికీ రష్యా గురించి గొప్పగా చెప్పేవాడు. అక్కడ పరిశ్రమల గురించీ, పాడిపంటల గురించి,

పాఠశాలల గురించీ, పసిపాల గురించీ, పంతుళ్ళ గురించీ తెగ పొగుడుతూ చెప్పేవాడు. దాంతో అతనికి “కమ్యూనిస్టు” అన్న పేరు వచ్చింది. ఇంత ఆస్తివున్నా, తను “కమ్యూనిస్టు” అని పిలవబడు తున్నందుకు అతను చాలా గర్వించేడు. అయితే, కొన్నాళ్ళకే అతనికి ఒక నగ్న సత్యం తెలిసొచ్చింది. ‘సభ్యసమాజంలో కమ్యూనిస్టనిపించుకోవడం ఇంటికి వంటికి మంచిది కాదని అర్థమయింది. అర్థమయిన తరువాత ప్లేటు మార్చి, నుదుట తిలకం దిద్ది ఇంట్లో గోడల్నున్న రష్యాదేశపు ప్రకృతి దృశ్యాల చిత్రపటాలుకూడా తీసిపారేసి – ఎంతగా “మంచిబాలుడు” గా చలామణి అవుదామని ప్రయత్నం చేసినా, చేసిన పాపం ఏడేడు జన్మలదాకా వెంటాడినట్టు అతనికి కమ్యూనిస్టన్న పేరు మాత్రం పోలేదు. రాబోయే ప్రొఫెసరు పదవికి ఇది కూడా అడ్డు తగుల్తుందేమోనని భయంగా వుందతనికి.

ప్రొఫెసర్ జెజిధార్ సబ్జక్టులో దిట్ట అనిచెప్పలేంగాని, పాపం ఎప్పటికప్పుడు చదువుదామనే అతను అనుకొనేవాడు. కాని అతని ఆరోగ్యం అలాంటిది పుస్తకం పట్టుకొంటే చాలు పక్కలో నొప్పి వచ్చేది. (సబ్జక్టు గురించి) ఆలోచిస్తే చాలు ఆయాసం వచ్చేది. తనకన్నా ఆలస్యంగా జాయినయినవాళ్ళు, ఆ మాటకొస్తే తన స్టూడెంట్సు – యిక్కడ చదువులు పూర్తిచేసుకొని, విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద డిగ్రీలు మోసుకొచ్చి డిపార్టుమెంటులో తిష్ట వేసుక్కూర్చున్నారు. కొంచెం సెన్సిటివ్ (“ఫెలో” అనొచ్చా ప్రొఫెసర్లని?) కాబట్టి అతనికి ఆ అవమానకరంగా వుంది . నిన్నగాక మొన్నచేరిన కుర్ర సరుకంతా మంచి పావులారిటీ కొట్టేస్తున్నారు. మీటింగ్సు, సెమినార్సు, పేపర్సు ఓ ఎక్కడ చూసినా వాళ్ళే! తనా అవన్నీ చూడలేడు. చూస్తూ వూరుకోలేడు. వీటన్నిటికి తోడు ఆరోగ్య కారణాలవల్ల (అనారోగ్య కారణాల వల్ల కాదా?) అతన్ని వేగంగా రిటైర్ చేసేస్తారని అధికార వర్గాలలో పుకారొకటి బయల్దేరింది. ఎలాగో ఒకలాగ హెల్తు ఇంప్రూవ్ చేసుకోవాలనుందతనికి. లేహ్యాలు తిన్నాడు. టానిక్సు తాగేడు, నవజీవన గుళికలు మింగేడు.వేళకి బోర్న్ విటా తీసుకొంటాడు. గుడ్లు, పాలు పుచ్చుకొంటాడు. పళ్ళూ, ఫలాలూ తింటాడు. – ఏం తిన్నా, ఆరోగ్యం మాత్రం అలాగేవుంది. –

కష్టాలలో ఉన్నవాళ్ళు స్నేహితులవుతారు. ఆ కష్టాలు ఒకే రకం కష్టాలయితే ఆ స్నేహితులు ప్రాణ స్నేహితులుగా మారొచ్చు . ప్రొఫెసర్ గోవర్ధనగిరిధారి గారికీ, అసిస్టెంట్ ప్రొఫెసరు మారుతీ రావు గారికి ఇప్పుడున్నది ప్రాణ స్నేహం.

తనతోపాటు మోణింగ్ వాక్కి వస్తే, ఆరోగ్యం బాగుచేసుకోవచ్చునని ఎప్పట్నించో చెప్తున్నాడు. మారుతీరావు. చాలా రోజులు అంత వుదయాన్నే లేవలేక రాలేకపోయేడు ప్రొఫెసరు. కాని ఉద్యోగం వూడిపోతుందేమోనన్న భయం అతన్ని ఆఖరికి లేపి కూచోబెట్టింది. ఇక  మారుతీరావు మోణింగ్ వాక్ లో ఓ రహస్యం వుంది. తను లావుగా వుండడంవల్లే “మొద్దు మాస్టారన్న” పేరు వచ్చిందని అతనికో అనుమానం వుంది. తనూ స్లిమ్ గా తయారయితే ఆ చెడ్డపేరు పోవచ్చునని అతనికి అనిపించింది. ఆరునెల్లనించీ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఒక మైలు దూరం నడిచివస్తున్నాడతను.

ప్రొఫెసరూ, అసిస్టెంట్ ప్రొఫెసరూ మాట్లాడకుండా నడుస్తున్నారు. అనుకోకుండానే చాలాదూరం నడిచేరు ఇద్దరూ. మారుతికి కొంచెం ఆయాసంగా వుంది. గోవర్ధనుడికి కొంచెం నీరసంగా  వుంది. పరగడుపుని ఇలా పరుగులు తీయడం అలవాటు లేదేమో, అతనికి కొంచెం ఆకలికూడా వేస్తోంది.

“మేష్టారూ? ఇవాల్టికి చాలు. ఇకవెనక్కి తిరుగుదాం ఏం వంటారు?” అన్నాడు మారుతీరావు వగరుస్తూ.

ఇంటిముఖం పట్టేరు ఇద్దరూ.

అప్పుడే తెలతెలవారుతోంది. ఉదయించడానికి కావలసిన సరుకూ సరంజామా అంతా సిద్ధం చేసుకొంటున్నాడు. సూర్యుడు. మంచు తెరలు ఒకటొకటే విడిపోతున్నాయి –  చలి కూడా చాలా మటుకు తగ్గింది. రోడ్డంతా, వానపడినట్టు తడితడిగా వుంది.

అలా నెమ్మదిగా నడిచివస్తూ వస్తూ, పాముని చూసినట్లు టక్కున ఆగిపోయేరు ప్రొఫెసరూ, అ. ప్రొఫెసరూ. 

ఆ. ప్రొఫెసరు నోట్లో పైపు జారిపడిపోయింది. ప్రొఫెసరు చేతిలో కర్ర నిలిచిపోయింది. 

పైపు చేత్తో పట్టుకుని, తెరిచిన నోటిని అలాగే వుంచి చూసేడు మారుతీరావు. వాకింగ్ స్టిక్ కి ఆనుకొని చూస్తూ అలాగే నిల్చుండి పోయేడు గిరిధారి.

అ మసక వెలుతురులో ఎర్రగా, అందంగా, గంభీరంగా, పెద్ద విమానంలాగ కనబడింది – ఒకకారు. రోడ్డుకి కొంచెం పక్కగా నిలిపివుంది. లోపల ఎవరూలేరు. అద్దాలు  మీదికి ఎత్తేసివున్నాయి. చుట్టుపక్కల ఎక్కడా అలికిడిలేదు; సముద్రపు హోరుతప్ప…

కారుకి రెండు గజాల దూరంలో బొమ్మల్లా నిల్చుండిపోయేరు ప్రొఫెసరూ, అసిస్టెంటు ప్రొఫెసరూ.

“మేష్టారూ!” అన్నాడు మారుతీరావు కొంచెం తేరుకొని. “అదేనంటారా?” అన్నాడు గిరిధారి నిటారుగా నిల్చోడానికి ప్రయత్నిస్తూ,

అంత చలీ పారిపోయి, ఒక్కసారిగా వుక్కపొయ్యడం మొదలెట్టింది ఇద్దరికీ. మఫ్లరు  విప్పి భుజంమీద పడేసుకున్నాడు అసిస్టెంటు ప్రొఫెసరు. మఫ్లరే కాకుండా కోటు బొత్తాలుకూడా రెండుమూడు విప్పుకొన్నాడు ప్రొఫెసరు. –

చెదిరిపోయిన తల వెంట్రుకల్ని సర్దుకొన్నాడు గిరిధారి. అది చూసి తనూ, సర్దుకోబోయి, మళ్ళీ వూరుకొన్నాడు మారుతీరావు. సర్దుకోడానికి మారుతికి అక్కడ ఏవీలేదు. అసలే బట్టతల, దానికి తోడు ఆ మధ్యే తిరుపతి వెళ్ళివచ్చేడు.

“ఆయన బీచికి వెళ్ళుంటారు” అన్నాడు మారుతీరావు ఇసక దిబ్బలవైపు చూస్తూ,

ఇసక దిబ్బలు బాగా ఎత్తుగా వున్నాయి. సముద్రపు ఒడ్డు కనిపించడఁవేలేదు. దూరంగా అలలులేని సముద్రం మాత్రం నీలంగా, పెద్ద చెరువులాగ కనిపిస్తోంది. ఇసక దిబ్బలమీద అక్కడక్కడా “రావణాసురుడి మీసాల” మొక్కలు తడితడిగా కనబడుతున్నాయి. ‘ఆయన’ మాత్రం ఎక్కడా కనబడలేదు.

ఆ “ఆయన” యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్‌ గారు.  ఆ కారు ఆయనది.

ఆయన ఆ యూనివర్శిటీకి కొత్తగా వచ్చేడు. వచ్చి ఇంకా వారం రోజులైనా కాలేదు. అంతకు ముందున్న వైస్ ఛాన్సలర్ (వీ.సీ. అంటారు క్లుప్తంగా) గారి హయాంలో యూనివర్శిటీ అంతా అల్లకల్లోలంగా తయారయింది. ఆ వీసీని పదవినించి దింపడానికి విద్యార్థులు సమ్మె చేసేరు. అందుకు కొందరు అధ్యాపకులుకూడా వెనక వుండి నాటకం ఆడించేరు. ఆయన పరిపాలనలో కొన్ని కులాల ఉపాధ్యాయులూ, విద్యార్థులూ, ఇంజినీర్లూ, డాక్టర్లూ కొందరు, కొందరు కంట్రాక్టర్లూ బాగుపడ్డారు. బాగా డబ్బు చేసుకొన్నారు. (కొందరు ప్రమోషన్లు సంపాదిస్తే,  కొందరు పరీక్షలు పాసయేరు, కొందరు ఉద్యోగాలు సంపాదిస్తే, ఇంకొందరు విదేశాలకు అవకాశాలు సంపాదించుకున్నారు) కొన్నికులాల వాళ్ళు మాత్రం తినడం గట్టిదెబ్బే తిన్నారు.  అసమ్మతి వర్గం బయల్దేరింది. అలజడి చెలరేగింది. వెంటనే ప్రభుత్వం వారు  ఆయన్ని మరో పెద్ద పదవికి పంపించేశారు.

కొత్త  వీసీగారిని గోవర్ధనుడూ, మారుతీ ఇంకా చూడలేదు. చూడ్డానికి వెళదామని అనుకున్నారు కానీ . ఇంతవరకు చూడ్డం జరగలేదు. –

వీసీ గారిని చూడకపోయినా, ఆయన  గురించి కొన్ని భోగట్టాలు మాత్రం చాలా రోజుల్నించీ తెలుస్తూనే ఉన్నాయి. 

వీసీగారిది ఏకులం? – అదికచ్చితంగా తెలుసు. ఆయనకి (స్వ) కులాభిమానం ఉందా – వుండే వుంటుంది. (పర) కులద్వేషం వుందా? – సరిగా తెలియదు – పోనీ ఏదైనా ప్రత్యేక కులంపట్ల ప్రత్యేక ద్వేషం వుందా? – అది సరిగా తెలియదు. ఇవి అతి ముఖ్యమైన వివరాలు.  ఇవిగాక, కొన్ని చిన్న వివరాలు : అంటే – ఆయన ఒక రిటైర్డ్ ఐ సీ ఎస్ ఆఫీసరనీ, అమెరికా, రష్యా, పశ్చిమ జర్మనీలాంటి దేశాలు తిరిగి అక్కడి విద్యా విధానాన్ని గురించి స్టడీ చేసేడనీ, ఆయనకి విమానంలాంటి ఎర్రటి అమెరికన్ కారు వుందనీ – ఇవి అందరికీ తెలుసు.

ఇసక దిబ్బలవైపు చూస్తున్న ప్రొఫెసరూ, అసిస్టెంటు ప్రొఫెసరూ ఒక్కసారి తలలు తిప్పేరు. ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకొన్నారు.

ప్రొఫెసరు తెల్లటి ముఖం ఇంకా తెల్లగా పాలిపోయింది. అసిస్టెంట్ ప్రొఫెసరు – నల్లటి ముఖం అటు ఎర్రగా కాలేక ఇటు నల్లగా వుండలేక మధ్యరకంగా వుండిపోయి కొంచెం అసహ్యంగా తయారయింది. మారుతీరావు వెంటనే ముఖం తిప్పేసుకొన్నాడు. ఇంకా వుక్క పోస్తున్నట్టే కోటు బొత్తాలు మళ్ళీ పెట్టుకొన్నాడు గిరిధారి.

వాచీ చూసుకొంటూ “మేష్టారూ! మీకు ఆలస్యం అవుతున్నట్టుంది! వెళ్ళిపోతారా?” అన్నాడు మారుతీరావు.

ప్రొఫెసరు కూడా వాచీ చూసుకొన్నాడు. “మీకు ఇదంతా కొత్త కదా ఆకలి వెయ్యడం లేదూ?”

గిరిధారికి ఆకలి వేస్తున్నమాట నిజమే కాని, మారుతీరావు ఎందుకు అంత ఆప్యాయంగా అడుగుతున్నాడో తెలుసుకొనే సరికి అతనికి చిన్న కోపంతోపాటు, కొంచెం ఉడుకు మోత్తనం కూడా వచ్చింది, ఒక్కసారి ఎలర్ట్ అయిపోయి.

“అబ్బెబ్బే! ఫరవాలేదు” అన్నాడు పొడిగా.. —

అని, ఒక్కక్షణం ఆగి, ఉన్నట్టుండి “వీసీగారుకూడా రోజూ ఇటే వస్తున్నారా” అన్నాడు  ప్రొఫెసరు.

అన్నాడు కాని, వెంటనే నాలిక కరుచుకొన్నాడు. మారుతిలో తను ఇదివరకు ఎన్నడూ  చూడని కొత్త మారుతి ఇప్పుడు కనబడుతున్నాడతనికి. (కొత్త) వీసీగారు ఇటు వస్తున్నారని   ముందే తెలిసి వుంటే, నన్నీదారంట ఎందుకు తీసుకొస్తాడు ‘వీడు’ – అనుకున్నాడు.

ప్రొఫెసరు ఆ ప్రశ్న వేసిన సమయానికి అసిస్టెంటు ప్రొఫెసరుకూడా సరిగ్గా అదే ఆలోచిస్తున్నాడు… వీసీగారు రోజూ ఈ దారంటే వస్తున్నారా?

అలా అనుకోగానే అతనికి చాలా చిరాకు కలిగింది. మారుతిరావు కొన్నాళ్ళపాటు ఈ రోడ్డంట వచ్చేవాడు. కొన్ని రోజుల్నుంచీ ఫరెఛేంజ్ మరోదారంట నడవసాగేడు. ఇవాళ ప్రొఫెసరుగారిని తీసుకొస్తున్నందుకు మళ్ళీ తన ఈ పాతదారికి వచ్చేడు.

కలిగిన చిరాకుని కనబడనివ్వకుండా ముఖం తిప్పేసుకున్నాడు మారుతీరావు,

“నేరకపోయి తీసుకొచ్చేనే ఈ జబ్బు వెధవని. ఇప్పుడెలా వదిలించుకోడం?” అనుకొన్నాడతను.

“దిబ్బ మారుతి” కన్న తను సన్నగా వున్నాడు గనక, పరిగెత్తికెళ్ళి వీసీగారిని కలిస్తే? – అనిపించింది ప్రొఫెసరుకి… కాని ఆయన స్నానంచేస్తూవుంటే?… చూడ్డం బావుంటుందా?… ఒక వేళ భార్యా సమేతంగా వచ్చేడేమో? కాదు కాదు వచ్చేరేమో?

ఆ ఇసక దిబ్బలమీద తను పరిగెత్తడం వూహించుకోగానే, కాళ్ళలో సత్తువంతా పోయినట్టయి నీరసంగా ఫీలయేడతను.

వీసీగారు వచ్చేసరికి కారుదగ్గిర నించుని వుంటే?… ఆయనేమనుకొంటాడు? కాదుకాదు ఏమనుకొంటారు?… ఆయన ఫేవర్ కోసం దేవిరించినట్టుండదా?.. ఐతే ఏం చెయ్యాలి? కాజువల్ గా వస్తూవుంటే, ఆయనకి కనబడినట్టుండాలి… కొంత దూరం మళ్ళీ వెనక్కి నడిచి నెమ్మదిగా ఇటువస్తే… ఈలోపున ఆయన వచ్చి,  కారులో తుర్రుమంటే…. ఇంతకీ, తనని చూడగానే తనముఖం మీద ఫలానా అసిస్టెంటు ప్రొఫెసరు అనేం లేదు కద?…. తనే పరిచయం చేసుకోవాలి. ఈ ప్రొఫెసరుగాడు ఎక్కువ అటెన్షన్ కొట్టేస్తాడు. తప్పదు. ఎంతైనా ప్రొఫెసరు ప్రొఫెసరే, అసిస్టెంటు అసిస్టెంటే… ఇక ఛస్తే వీణ్ణి నాతో తీసుకురాకూడదు… ఇక ముందు సంగతిసరే, ఇప్పుడెలాగ?….

తన సబ్జక్టు గురించి ఆలోచించి ఎన్నడూ బుర్ర పాడుచేసుకోలేదు మారుతీరావు, (నిజంగా ఆలోచించేవుంటే ఈ పాటికి యే నోబుల్ ప్రైజో కొట్టేవాడేమో- ఎవరు చెప్పగలరు?)

కాని ఇలాంటి విషయాల్లో అతని బుద్ధి అమోఘం. సీమ్మిరపకాయలా చురుగ్గా పనిచేస్తుంది.

వీసీ గారు రాగానే ఏం మాటాడాలో ఆలోచిస్తున్నాడు ప్రొఫెసరు… అన్నిటికన్నా ముందు తను చాలా రోజుల్నించీ మోణింగ్ వాక్ కి వస్తున్నట్టు చెప్పేయ్యాలి ఆ వెధవ చెప్పీలోపున.

ఉదయాన్నే  ఇంత హుషారుగా తిరుగుతున్నాడంటే, తన ఆరోగ్యానికేం లోపం లేదనే – అర్థం. ఇంకా కావాలంటే చిన్న చిన్న ఆటలు కూడా ఆడతానని చెప్పొచ్చు. ఎవడు చూడొచ్చేడు? నిటారుగా నిలబడి మంచి కండిషన్లో వున్నవాడిలా కనబడాలి. ఇంగ్లీషులో టపటపా  మాట్లాడితే సరి. దెబ్బతో “వీడి” నోరు కట్టడిపోతుంది. ఆయన చేతిలో వాకింగ్ స్టిక్ ఉంటె  సరేసరి. లేకపోతే ఇది హంబుల్ గా ప్రెజెంట్ చెయ్యొచ్చు. ఫేషన్ కోసం తనీ స్టిక్  పట్టుకున్నాడు కానీ, అవసరంవల్ల కాదని ఆయనకి తెలిసేలా చెప్పాలి. ఒకవేళ ఆయన అమెరికా గురించి మాట్లాడితే? తనకి అమెరికాలో ఆస్పత్రి జీవితం తప్ప మరోటి తెలియదే? అయితే మాత్రం పుస్తకాల్లో చదివిన సంగతులు లేవా? అవే చూసినట్టు చెప్పెయ్యొచ్చు. ఫరవాలేదు. ఆ మాత్రం చెప్పగలడు తను. తను మంచి హెల్త్ తో  వున్నాడన్న ఇంప్రెషను ఆయనకిస్తే ఈ మూడేళ్ళ సర్వీసూ అయిపోగానే తనని ఎమెరిటస్ ప్రొఫెసరుగా వెయ్యొచ్చు…

పదినిమిషాలు పాఠం చెప్తే సాధారణంగా పావుగంట రెస్టు తీసుకొంటారు ప్రొఫెసరుగారు. కాని యివాళ రెండు గంటలు (వీసీతో) మాట్లాడడానికి సిద్ధంగా వున్నారాయన.

అసిస్టెంటు ప్రొఫెసర్ మారుతీరావు గారు జనరల్ గా క్లాసులకి వెళ్ళరు. వెళ్ళినా పాఠం మాత్రం చెప్పరు. చెప్పినా ఏదో గొణుక్కుంటూ ఉంటారు. క్లాసు ప్రిపరేషనుకోసం ఆయన టైము వేస్టు చెయ్యడం ఎవ్వరూ చూడలేదింతవరకూ.

ఆయన ఇంగ్లీషులో మాట్లాడతారా? తెలుగులోనా? చిన్న చిన్న మాటలైతే ఫరవాలేదు. తను తెలుగు ఇంగ్లీషూ కలిసిన భాషలో దడదడ లాడించగలడు. కొంత సేపు చూసి, తెలుగులోకి దించితేసరి అది పెద్ద ఫరవాలేదు. కాని రష్యా వెళ్ళి వచ్చేడు కదా. ఆ దేశం గురించి ఆయన అభిప్రాయాలేమిటో? ముందే తెలిస్తే బావుణ్ణు. ఐ.సీ.యస్. ఆఫీసరుకదా, ప్రభుత్వానికున్న అభిప్రాయాలే ఆయనవీ అయితే అసలింక బెంగేలేదు. ఏవయినా జాగ్రత్త మీద వుండాలి. ఆయన ప్రైవేటు భావాలు తెలియందే నోరు జారకూడదు. ఆయనకూడా నాలాంటి కమ్యూనిస్టు అభిమానైతే, ఛాన్సు కొట్టేడన్నమాటే! ఆయనా నేనూ రష్యా గురించి చెప్పుకొంటూ ఉంటే! ఈ “జబ్బుగాడు” నోరు వెళ్ళబెట్టుకొని వినవలసిందే! మోణింగ్ వాక్ మంచితనం గురించి ఆయనకి చెప్పాలి. వీడు జబ్బు మనిషని తెలిసేలా చేస్తేసరి, రోగం కుదురుతుంది.

“కంయ్ “మని వినిపించింది. హారన్. ఉలిక్కిపడ్డారిద్దరూ.  

వేగంగా దూసుకుపోయింది ఒక కారు

గుండె ఆగిపోతుందేమోనని భయం వేసింది గిరిధారికి.  మారుతీరావుకూడాబాగా జడుసుకొన్నాడేమో, గుండెలు దడదడ లాడసాగేయి..

ఇద్దరూ ఒక్కసారే ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు. “వీడిక్కణ్ణించి కదలడు” అన్న సంగతి ఇద్దరికీ స్పష్టంగా అర్థమయింది.

ఎండ కొద్ది కొద్దిగా ఎక్కుతోంది. ఇసక దిబ్బలు నిశ్చలంగా కూర్చొని వున్నాయి. – దూరంగా సముద్రంలో – ఎక్కణ్ణించి వచ్చేయో, ఒక్కసారి కనిపించేయి వందలాది పడవలు.  మబ్బులులేని నీలాకాశం, అలలులేని నీలిసముద్రం – రెండూ కలిసిపోయి, దిక్చక్రం స్పష్టంగా కనబడడం లేదు. తెల్లటి నీటి కొంగలు బారులుతీరి ఎగురుతూ పోతున్నాయి,సూర్యుడి ఎరుపు కొంచెంకొంచెం తగ్గుతోంది. రోడ్డుకి రెండోవైపున ఇళ్ళు తడితడిగా కనబడుతున్నాయి. పాలవాళ్ళు ఇళ్ళకి గేదెల్ని తోలుకు వెళ్తున్నారు.

ప్రకృతి అంతా మనోహరంగా వుంది.

ప్రొఫెసరూ, అసిస్టెంటు ప్రొఫెసరూ ఒక్కమాట కూడా ఆడుకోకుండా కొయ్య బొమ్మల్లా నిల్చున్నారు.

ప్రొఫెసరుకి బోర్నవిటా టైమయి చాలా సేపయింది. ఆకలీ నీరసం, టైముతోపాటు ఎక్కవవుతున్నాయి. కోటు చిరాకు కలిగిస్తోంది. బూట్లలో కాళ్ళు మంట పెడుతున్నాయి.

అసిస్టెంటు ప్రొఫెసరుకి నెత్తి కొంచెం చుర్రుమంటోంది. అతని ముఖమంతా చెమటతో జిడ్డుగా తయారయింది. అతనికి వుక్కపోస్తోంది కాని, కోటు విప్పడానికి సందేహిస్తున్నాడు.

పది నిమిషాలయంది. వీసీగారు రాలేదు. పావుగంటయింది. రాలేదు. ఏ క్షణాన వస్తారా, ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నారిద్దరూ ఎండ ఇద్దర్నీ చిరచిరలాడిస్తోంది. ఇంతలో మారుతీరావుకి ఒక ఐడియా వచ్చింది. –

నేనూ, జబ్బుగురుడూ ఒకేకులం వాళ్ళంకద! ఇంతకుముందున్న వీసీ వెళ్ళిపోవడానికి కారణం కులాల కల్లోలఁవేకద! ఈ కొత్త వీసీకి ఆ సంగతి తెలిసే వుంటుంది కద! ఇప్పుడు ఇద్దరం ఒకేసారి కనబడితే, ఇవాళ కాకపోతే రేపైనా, ఒకకులం వాళ్ళ:తా ఒక జట్టుగా వుంటున్నామనుకొంటాడు కద! అది “మనకీ” మంచిది కాదు కద!… అందుచేత?

అందుచేత, ఈ ఐడియాని చేతనైనంత సౌమ్యంగా ప్రొఫెసరుకి చెప్పేడు మారుతీ రావు. 

ప్రొఫెసరు అంతా విన్నాడు. మారుతి ఎంత సౌమ్యం నటిస్తున్నాడో అతని మీద  అంత అనుమానం ఎక్కువ అవుతోంది. ప్రొఫెసరుకి.

“సరేననుకోండి. ఇంతకీ ఏంచేద్దామంటారు?” అన్నాడు అంతా విని.

ఇద్దరం  కలిసేవచ్చినట్టు తెలియకుండా మీరు కారుకి అటువైపు కొంతదూరం వెళ్ళి  , అట్నించి ఇటురండి. నేను కారుకి ఇటు వైపు కొంతదూరం వెళ్ళి,  మళ్ళీ ఇటువస్తాను” అన్నాడు అసిస్టెంటు ప్రొఫెసరు.

“నేను వచ్చేలోపునే ఆయన వచ్చేస్తే?” 

“మీకెందుకు నేనున్నానుగా, మిమ్మల్ని అప్పుడే చూసినట్టు ‘గుడ్మానింగ్ , రండిసార్, మార్నింగ్  వాక్ కి వచ్చేరా?’ అని అడుగుతాను” అన్నాడు మారుతీరావు అభినయిస్తూ,

ప్రొఫెసరుకి ‘ప్లాన్’ అర్థమయింది. కాని ఆ ఎడ్వాంటేజ్ తనే కొట్టాలనుకొన్నాడు. మీరే  కారు వెనకవైపు వెళ్ళండి. నేను ఇటువెళ్తాను” అన్నాడు. 

“ కాదు మీకు తెలీదు. మీరు అటువైపు వెళ్ళండి. నేనే ఇటు వెళ్తాను” అంటూ వెళ్ళిపోబోయాడు, అసిస్టెంట్ ప్రొఫెసరు.

టక్కున ముందుకెళ్ళి మారుతికి అడ్డంగా నిల్చున్నాడు గిరిధారి.

“ఏఁవిఁటి నాకు తెలియంది, నీకు… మీకు తెలిసిందీను? అటు వెళ్ళండి” అన్నాడు కొంచెం అధికార స్వరంతో.

“నేనెందుకు చెప్తున్నానో మీకు తరవాత తెలుస్తుంది. మీరే అటు వెళ్ళండి. దారి వదులు…. వదలండి” అన్నాడు దారి తప్పించుకొంటూ.

“తరవాత తెలిసేది తరవాత తెలుస్తుంది. కాని, నౌ యు షుడ్ గో దట్ సైడ్.” 

“దారొదలమంటే నీక్కాదూ?… మీక్కాదూ దారి వదలండి ముందు” అన్నాడు మారుతీరావు.

“ఏం తంతావా? తంతారా?” అన్నట్టు చూసేడు ప్రొఫెసరు కళ్ళలోకి. 

“అంత పనిచేస్తాను. వెళ్లటు” అన్నట్టు చూసేడా ప్రొఫెసరు.

“పొట్టమీద ఒకటి, ముక్కుమీద మరోటీ – రెండు గుద్దులు గుద్దితే వెనక్కి విరుచుకు పడిపోతాడు ముసిలిముండా కొడుకు” అనుకొన్నాడు అసిస్టెంటు ప్రొఫెసరు.

“చేతికర్రతో బోడిగుండుమీద ఒక్కటిస్తే, కిక్కురుమనకుండా చస్తాడు. ఈ వెధవ” అనుకొన్నాడు ప్రొఫెసరు.

ఒకరికొకరు ఎదురుగా నించున్నారు ఇద్దరూ.

(ఆ ఇద్దరూ ఎలా నిల్చున్నారు? మదమత్తేభాల్లాగా? సింహశార్దూలాల్లాగా? గ్రామసింహ మార్జాలాల్లాగా? – ఎలాగో ఒకలాగా మీ ఇష్టం)

పొద్దుటెండ చురుకు చురుకు మనిపిస్తోంది.

ఇసకదిబ్బలమీదనించి మనుషులు వస్తున్న అలికిడి వినిపించింది. స్పష్టంగా  తెలీకపోయినా ఏవో మాటలుకూడా వినిపిస్తున్నాయి.

మారుతిని వదిలాడు గిరిధారి. సర్దుకొని నిల్చున్నారు. ఇద్దరూ, బుద్ధిమంతుల్లాగ. ఎవరివో రెండు తలలు కనిపించేయి దుబ్బుల చాటునించి,

కారుకి కొంచెం పక్కగా వెళ్ళి నిల్చున్నారిద్దరూ, ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి చంపుదావన్నంత కోపం వున్నా ఆప్తమిత్రుల్లా కనబడ్డానికి ప్రయత్నిస్తున్నాయి వాళ్ళ ముఖాలు. ఇసక దిబ్బల వైపు చూస్తూ నిలుచున్నారు.

తెల్లటి యూనిఫాం వేసుకొని, కారు డ్రైవరు కాబోలు ముందు వస్తున్నాడు. అతనికన్నా ముందు నల్లటి ఆల్సేషియన్ కుక్క ఒకటి పరుగులు తీస్తూ వస్తోంది. దాని వళ్ళంతా తడిసిపోయివుంది. “టైగర్ టైగర్” అని అరుస్తూ వెంటపడుతున్నాడు. నిక్కరూ చొక్కా వేసుకొన్న కుర్రాడొకడు.

ముగ్గురూ వచ్చి కారుదగ్గిర నిలిచేరు. వెనక తలుపుతీసి తెరిచి పట్టుకున్నాడు. నిక్కరు కుర్రాడు. చెంగున గెంతి సీటుమీద నిల్చొంది కుక్క.  మరో నిమిషంలో కారు జారిపోయింది మెత్తగా, వేగంగా.

“ది ఫ్రెండ్స్ – ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన”‌కి ఒక స్పందన

  1. కధ బాగుంది… సస్పెన్స్ ఇంకా బాగుంది. చాలా థాంక్స్!!

Leave a Reply