ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన ‘రిక్షా ప్రయాణం’. 1981 వ సంవత్సరంలో ఆంద్రజ్యోతి సంక్రాంతి కథల పోటీలో ప్రధమ బహుమతి పురస్కారం అందుకున్న కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అర్నాద్ గారికి కృతజ్ఞతలు.
“అమ్మా రిక్షా కావాలా” తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు, కోల ముఖంలో చురుకైన కళ్లు, సూది ముక్కు, బండ పెద వులు, మెడలో మురికి పట్టిన తాడు, దానికి వేళాడుతూ ఏడు కొండలవాడి ప్లాస్టిక్ బిళ్ళ, చిన్నచిన్న బొక్కల బనీను, రెండు పెద్ద పేలున్న బిగుతు ఆఫ్ ఫేంటు, బనీన్ని ఫేంటుని కలుపుతూ మురికి పట్టిన నల్లని తోలు బెల్టు, నల్లని ఒళ్ళు. చెప్పులు లేని కాళ్ళు. ముప్పయి మూడేళ్ళ వయసు. పేరు నర్శిమ్మ. నరిసిగాడంటారు అంతా.
“రిక్షా తల్లీ రిక్షా”. గోదావరి ఎక్స్ ప్రెస్ చాలా ఆలస్యంగా వచ్చింది. అందులో ఆశ్చర్యం లేదు. అదేం అద్భుతం కాదు. ఎప్పుడూవున్న న్యూసెన్సే గాబట్టి పెద్ద బాధాకరమైన విషయం కూడా కాదు. ఆ మాటకొస్తే సీటూ బెర్తు రిజర్వేషనూ… వీటికన్నా ఇదిగో ఈ వూళ్ళో స్టేషన్నించి ఇంటికి వెళ్ళడమే అసలైన బాధ. సిసలైన గాథ! –
“రిక్షా కావాలేటమ్మా”.
ఆ ప్లాటుఫారం అవతల వుండాల్సిన రిక్షావాడు ప్లాటుఫారం టికట్ లేనే లేకుండా ప్లాటుఫారం మీదికి ప్రవేశించి – బిలబిలమంటూ రైలు దిగిన జనాన్ని దేవే స్తున్నాడు. పట్టే యత్నంలో, పోటీలో రెండూ, మూడు చిక్కినట్టుచిక్కి చేజారి పోయేయి. నిరాశ ఆ క్షణం! ఆశ మరుక్షణం. మళ్ళీ ప్రయత్నం. పరుగు పట్టు.
“అమ్మా రిక్షా”. అమ్మని వదిలేలాలేడు రిక్షా నరిసిగాడు.
ఆయమ్మ ‘అమ్మ’ అంటే అమ్మకాదు. అమ్మమ్మ నరిసిగాడికి కాదు. ఆమె చెంగు పట్టుకొని నడుస్తున్న చిన్నారి చిట్టికి. ఏడేళ్ళ బూరిబుగ్గల పెద్దకళ్ళ చిట్టికి,
చిట్టి అమ్మమ్మని పట్టుకు నడుస్తుంటే, అమ్మమ్మ ట్రంకు పెట్టిని పట్టుకు నడుస్తోంది.
పెట్టిని మోస్తుంటే చేయిలాగేస్తోంది ఆమెకి. పదడుగులు నడిచింది. పెట్టె నేల దించింది. పెట్టిని కుడిచేతి నుంచి ఎడమచేతికీ, చిట్టిని ఎడమ చేతినుండి కుడిచేతికి మార్చుకు నడుస్తోంది. మనిషిని చూస్తే – అలాంటి బరువు పెట్టెలు పది ఒక్కసారే మోసేయగలదు అనిపిస్తుంది. కాని ఆమె తనవొళ్ళు తనే మోయలేక పోతోంది. ఆమె శరీరం యినపరాయిలా గట్టివొళ్ళు కాదు. గాలి నింపిన బెలూన్లో నీరుపట్టిన వొళ్ళు. నాలుగడుగులు నడిస్తే చాలు కాళ్ళు పొంగుతాయి. ఆమె వయసు యాభై అయిదేళ్ళు. పేరు సోములమ్మ. కాని అంతా దిబ్బమ్మ అంటారు.
“ఎక్కడికమ్మా ఎల్లాల”.
వెళ్ళాల్సిన చోటు ఇక్కడా, అక్కడాలేదు. చాలా దూరం. ఆటో అయితే పదో, పన్నెండో అడిగే దూరం. బస్సయితే రూపాయి తీసుకొని పదిపైసలు తిరిగిచ్చే దూరం. –
తను వెళ్ళాల్సిన సిటీ బస్సు దొరికే బస్టాండు దిబ్బమ్మకి తెల్సు, ప్లాటుఫారం అంచునుంచి చూస్తే అదిగో, అల్లదిగో కనిపిస్తోంది… పెట్రోలు బంకు పక్కన నడిస్తే అయిదు నిమిషాలు.
ఆమె నడిచేయగలదు – కాళ్లు పొంగినా ఖాతరు చేయకుండా. ఈ గుంట పాప, ఆ ట్రంకు పెట్టె లేకుంటే నడిచేసును.
తను వెళ్లాల్సిన బస్టాండు చెప్పి, చూపించి ‘ఎంతిమ్మంటావు’ అనడిగింది. “రెండ్రూపాయిలిప్పించండి”.
రిక్షావాళ్లు అడిగే రేట్లు చూస్తే సింహాచలం, పెందుర్తి అయినా నడిచి పోవాలనిపిస్తుంది. అది అనిపించడం వర్కే! నసిగో, గుణిసో, ముక్కో, మూలిగో వాహనం ఎక్కకుండా వెళ్ళలేం మనం చివరికి. ఈ నాగరికత ఎలాంటి దూరాన్నయినా నడిచిపోగలమనే సంగతి మనం మర్చిపోయేట్టు చేసింది. మన పూర్వీకులు కాశీకి నడిచి వెళ్లారంటే తెల్లమొగాలు వేయడం వేరే సంగతి. పెదవాల్తేరు నుంచి పూర్ణా మార్కెట్ కి ఏమీ కాకుండా నడిచేసిన వాళ్ళు – సిటీ బస్సుకోసం గంటల కొలదీ వెయిట్ చేసి, నలిగిపోతూ, వేలాడ్డానికే ఇష్టపడుతున్నారిపుడు. కాలం! –
“ఏటీ రెండడుగుల దూరానికి రెండు రూపాయలా! అవ్వ! ఏం ఆశరా”!
“అదేటి తల్లీ అలాగంటారు. రెండు రూపాయల్కి శేరునూకలు రావడం లేదు.”
ఆమె అన్నది వేరు. వాడు చెప్పింది వేరు. కాని రెంటికీ లింకు వుందనేది వాస్తవం.
అంచేత రిక్షావాడి రేటుబట్టి ఆ పట్నం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ స్థాయిలో వుందో ఈజీగా చెప్పేయవచ్చంటారు. ఒకే దూరానికి రిక్షావాడు రాజమండ్రిలో అర్ధరూపాయికి కడ్డాడు. విజయవాడలో ముప్పావలాకి కడ్డాడు. వైజాగులో అర్థలూ, పావలాలు నైజానా! మూడు రూపాయలవుద్ది, యిష్టమైతేరా, కష్టమైతే పో అంటాడు.
రెండు రూపాయలివ్వడం దిబ్బమ్మకి తన జరుగుబాటు బట్టి పెద్ద కష్టమేమీ కాదు. కాని కనిపించే ఆ మాత్రం దూరానికే రెండు రూపాయలు అర్పించాలంటే యెవరి మనసైనా ఎలా ఒప్పుతుంది?
దిబ్బతనం “సుఖంగా, హాయిగా కష్టబడకుండా బతికేస్తున్నాడు” అనే దానికి సాక్ష్యం, సంకేతం. కాని దిబ్బమ్మ కష్టజీవి. ఆమె కష్టపడి సంపాదించడాన్నే నమ్ముకుంది. ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది. కోరుకుంటుంది. ఏడేళ్ళ కిందట జబ్బు పడి ఒళ్ళు వచ్చింది గాని అంతకుముందు రివటలా లేకపోయినా లావు మాత్రం కాదు.
తను కష్టం చేసి తను బతగ్గలిగింది.
పిల్లా, పాపని పెంచగల్గింది. కాని ఒక్క పైసా కూడా కూడబెట్టలేక పోయింది. తన శ్రమంతా ఏ గంగలో కలిసిపోయి ఎవరి పూలతోటలు పెంచిందో ఇంకెవరి పళ్ళ తోటలు పెద్దచేసిందో ఆమెకి తెలీదు. దగాలు, దోపిడీలు… వీటి అర్థాలు తనకి ఇప్పటికీ సరిగా తెలీవు. తను చేసే పని – కూలి పని. ఎంతో నిక్కచ్చిగా, నిజాయితీగా చేసేది. వూరికే గోడు గిల్లుకుంటూ వుండడం ఇష్టం వుండేది కాదు. రోడ్డుమీద పేడని కూడా వూరికే పోనిచ్చేది కాదు. పిడకలు పెట్టి అమ్మేది. బొరిగతో చకచకా గడ్డికోసి గంపలకి గంపలెత్తి అమ్మేది. కాని కూతురికి పావుతులం బంగారం కొనలేక పోయింది.
అయితే ఇప్పుడు ఆ కూతురు మెడలోనే పది తులాల బంగారం పెట్ట గల్గింది. అది తన కష్టంతోకాదు – అదృష్టం వల్ల. తనకి అదృష్టం, రోగం ఒకేసారి వచ్చేయి. అదృష్టం ఆస్తి తెచ్చింది. రోగం వంటికి నీరు నెక్కించింది. సోములమ్మగా ఎవర్కీ తెలీనితను దిబ్బమ్మగా ఆ వూళ్ళో ప్రసిద్ధి కెక్కింది. తన పెనిమిటి పదిహేనేళ్ళు మిలటరీలో సేవచేసినందుకు ఐదెకరాల బంజరు పొలం బహూకరించింది….. ప్రభుత్వం. ఎందుకూ పనికిరాని ఆ భూమి పక్కనే ఐదు వేల మంది పనిచేసే ఫేక్టరీ లేచింది. దాంతో ఆ భూమికి ఎక్కడలేని గిరాకీ వచ్చింది. ఒక ఉద్యోగి వచ్చాడు. ఆ భూమిని ప్లాట్లు వేసి అధిక లాభానికి అమ్మి పెడతానన్నాడు. అందులో నూటికి 10 రూపాయల కమీషన్ ఇమ్మన్నాడు. ఆ వ్యవహారాలు తెలీక తన పెనిమిటి అందుకు ఒప్పుకున్నాడు. చివరికి ఆ ఉద్యోగి కమీ షన్ డబ్బుతోనే ఇల్లు కట్టేయగలేడు. వాడు ఏదో మాయ చేశాడని చాలామంది అంటారు గాని – తనకా లెక్కలు తెలీదు గనక “అవును. మాయ చేసే వుంటాడు దొంగ సచ్చినోడు’ అని అనుకోవడం ఆమె ఇష్టపడదు. డబ్బు తమకీ బాగానే వచ్చి పడింది. కమ్మలిల్లు పెంకుటిల్లుగా మారింది. కూతురికి 5 వేల కట్నంతో, 10 తులాల బంగారంతో పెళ్ళి చేసింది.
దిబ్బమ్మకి ఒకతే కూతురు. నలుగురు పిల్లలు పుట్టిపోయారు. కూతురు పెళ్ళయి, అత్తవారింటికి పోయేక తనూ పెనిమిటీ ఇద్దరే వుంటున్నారు. ఇప్పటికీ కూర్చొని తినడం ఆమెకి ఇష్టముండదు. తనకిప్పుడు ఎనిమిది గేదెలున్నాయి. ఆ పాలు కంపెనీ క్వార్టర్సులో ఉన్న ఉద్యోగస్తులకి పోస్తుంది. పాలు పితకడం కాడనించి, గేదెల్ని, గేదెలుండే పాకని శుభ్రం చేయడం వర్కూ అంతా తనే చూస్తుంది. తనకి పెనిమిటి చేసేది సాయం మాత్రమే.
తను కూలి కెళ్ళిన రోజుల్లో రోజంతా కష్టపడితే రెండు రూపాయలు సంపాదించడం బ్రహ్మాండమై పోయేది. అలాంటిది రిక్షావాడికి ఆ పాటి దూరానికే రెండు రూపాయలు కావాలట! అయినా రోజులు మారిపోయేయి. ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయన్న బాధతో బాటు అసలు బజార్లో పూర్తిగా దొరక్కుండా మాయమై పోతాయేమోనని భయం.
రిక్షా నరిసిగాడు రెండడిగేడు. దిబ్బ సోములమ్మ రూపాయి ఇస్తానంది. సెటిలుమెంటు రూపాయిన్నరకయింది.
ఏం చేస్తుంది. అర్ధ రూపాయి తగ్గేడు అదే చాలనుకుంది. ఏమంటే ఈ రిక్షా వాళ్ళతో గొప్ప పేచీ ‘రిక్షా అబ్బాయ్, నీ వడిగిన బేరం నేనివ్వలేను, తప్పుకో’ అంటే తప్పుకోడు. మనకి తోవ ఇవ్వడు. మరో రిక్షా దగ్గరకి వెళ్ళనీయడు. మనల్ని వెంటాడుతాడు. వెంట వాడువుండగా మరో రిక్షావాడు ముందుకి రాడు. గొప్ప హింస పెట్టేస్తారు. ఎలాగోలా వాడితో దెబ్బలాడి దూరంగా వుంచి – మరో రిక్షావాడి దగ్గరకెళ్ళి బేరమాడితే… వాడు అంతే! అదే రేటు చెబుతాడు. అంతా ఒకే రేటు. ఒకే కట్టు.
ఎవడైనా కట్టుతప్పి, రేటు తగ్గించడానికి కక్కుర్తి పడ్డాడో – ఇక వాళ్ళలో వాళ్ళు కొట్టేసుకుంటారు. ఇక ప్రయాణికుడి పని అంతే!
ఈ గొడవలేం పడకుండా నరిసిగాడి రిక్షాయే బేరం సెటిల్ చేసుకుంది. రిక్షా వరకు పెట్టె పట్టుకోడానికి నర్సిగాడి కివ్వలేదు. ఫర్వాలేదు, తనే పట్టుకుంటానంది దిబ్బమ్మ. అతను పరుగెత్తలేదు. వాడు పెట్టె పట్టుకొని తుర్రున పారిపోతేనో! అమ్మో ఇంకేమయినా వుందా!
ట్రంకు పెట్టె పైకలా కనిపిస్తోంది గాని… దాని ఖరీదు పదివేలు! –
రిక్షా ఎక్కడమంటే చిట్టికి చెడ్డ సంతోషంగా వుంది. కాని సీటంతా మామ్మే ఆక్రమించేయడంతో ఏనుగు పక్కన ఎలకలా నక్కి, నలిగిపోవడంతో ముఖం చిన్నబోయింది.
దిబ్బమ్మకి రైలుదిగిన కాణ్ణించి దాహంగా వుంది. రిక్షాను ఆపించి ఏకొట్టు దగ్గరైనా సోడా తాగుదామనుకుంది. కాని కొట్లు మూసేసి వున్నాయి. పోనీ స్టాండు దగ్గర తాగొచ్చు అనుకుంది.
స్టాండుకొస్తే – తీరా అక్కడా లేవు కొట్లు! లేకపోతే లేక పోయాయి వెధవ కొట్లు, సోడా తాగడం మానేస్తాం.
కాని బస్సులు కూడా వున్నట్టు లేవే!
పిట్టమనిషి కూడా లేడు. రెండు కుక్కలు మాత్రం సరదాగా కరుచుకుంటూ, దొర్లుకుంటూ స్టాండును ఆక్రమించేశాయి. జంక్షనులో హార్బరు కెళ్ళే రోడ్డు కిరువైపులా, ఎల్లవేళలా పచ్చపచ్చగా మెరిసి పోతూ జీవనదులు; ఆ నదుల పై నుంచి వీస్తున్న గాలి మాత్రం ముక్కుల్ని మీరు మూసుకోపోతే మీ ఖర్మ అంటోంది. దిబ్బమ్మకి ఎందుకో గాభరా వేసింది. రిక్షా దిగలేదు. రిక్షావాడు దిగుదిగు అనలేదు. తెల్లబోతూ, బెదురు చూపులు చూస్తున్న ఆమె ముఖం చూస్తుంటే నరిసిగాడికి నవ్వొస్తుంది.
వాడికి అంతా తెల్సు. కొట్లు లేక పోవడం ఏటో, బస్సులు రాక పోవడం ఏటో తెల్సు! తెల్సు అంతా తెల్సు వాడికి! ఇక్కణ్ణించి మళ్ళీ తనే కట్టక తప్పదనీ, దానికి మళ్ళీ వేరే బేరమనీ…. పెద్ద ఆశేవుంది వాడికి.
నరిసిగాడు తనకేమీ తెలీనట్టు నడిచిపోతున్న ఒకతణ్ణి ఆపి అడిగేడు – ఏటి బాబు ఏటయింది? కొట్లూ, బస్సులు, ఆటోలూ… ఏటీ లేవేటి?…. ఏటయ్యిందో”.
“ఈ రోజు బందయ్యా బంద్. ఇంకేం బస్సులు, ఇంకేం కొట్లు, ఇంకేం హోటల్లు! అధిక ధరలకి నిరసనగా బంద్ అని వారం రోజుల్నించి గోల పెడుతున్నారు గదయ్యా” – అంటూ వెళ్ళిపోయాడు అతడు.
దిబ్బమ్మ గుండెల్లో రాయి పడింది. “ఇపుడేం దారి దేవుడోయ్” అనుకుంది.
బందులనుంచి రిక్షావాళ్ళకి మినహాయింపు వుంది. ‘రెక్కాడితే గాని, డొక్క నిండని బతుకులు. తొక్కుకోనియ్ – వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం’ అని వదిలేస్తారు బంద్ నిర్వాహకులు.
ఇప్పుడా అవకాశం తీసుకుని … బేరం మరో… అయిదో, ఆరో కొట్టేయాలని ఆశ పడుతున్నాడు నరిసిగాడు.
అవకాశం వచ్చినప్పుడు ఎదుటివాణ్ణి అందినంత మేరకి బలిచేసుకోడమే (ప్రస్తుతం అమల్లో వున్న) లోక న్యాయం! అందులో లింగభేదం లేదు. వర్గభేదం లేదు. ‘తప్పు, దోచుకోవడం తప్పు, తప్పు’ అని వచ్చే ఛాన్సు నుంచి తప్పుకుంటే – భవంతులు కట్టడం సంగతికేం గాని, బతకం కష్టమై పోతున్న మాయదారి రోజులు!
“ఎక్కడ కెళ్లాలమ్మా?”
“నాతయ్యపాలెం బాబూ”.
ఏటి! నాతయ్యపాలెవా…. అయ్యబాబోయ్ అంత దూరవే….. సరిపోయింది. తను ఏ పోర్టు క్వార్ట్రర్స్ ఏ షిప్ యార్డో అనుకున్నాడు గాని…. ఎక్కడో బి.హెచ్.పి.వి. దగ్గరున్న నాతయ్యపాలెవంటే ఎవడు వొస్తాడు … తగలగా, తగలగా ఎలాంటి బేరం తగిలిందిరా బాబూ – అనుకున్నాడు నరిసిగాడు చిరాగ్గా
“బాబూ! ఎలాగోలా నీవే రిక్షా కట్టి పున్నెం కట్టుకో నాయనా” ప్రాధేయ పూర్వకంగా అడిగింది దిబ్బమ్మ.
“నాది పిట్రోలు కాత్తల్లీ, రక్తం… నానంత దూరం రాలేను తల్లోయ్” అని బుర్ర అడ్డంగా వూపే శాడు.
చుట్టూ చూసింది. చుట్టుపక్కల మరేం రిక్షాలు లేవు! ఈ రోజు రిక్షాల డిమాండు అలా వుంది మరి.
చావుల మదుం కిందనుంచి ఓ పోలీసు వ్యాను వెళ్ళిపోతోంది. నేవెల్ బేసుకి ఏదో జీపు పోతోంది. ఎదురుగా శ్మశానంలోంచి శవం కాలుస్తున్న పొగ వస్తోంది. కుష్టివాడిని ఒక చక్రాల తొట్టెలో లాక్కు పోతున్నాడు ఏ కుష్ఠ లేని పదేళ్ళబాలుడు.. కూలికి! –
“అలాగ అనేయకు బాబు. ఎంతకైతే కడతావో అడుగు. అంతేగాని కట్టననేస్తే మేం చచ్చి పోవాఁ”అంది దిబ్బమ్మ.
నరిసిగాడు తల గోక్కొని, ముఖం అదోలా పెట్టి అన్నాడు – “ఇరవై అవుద్దమ్మా… ఈ రూపాయి న్నర కాక”.
కడ్తానన్నాడు అదే సంతోషం అనుకుని “మళ్ళి రూపాయిన్నర యెందుకు. మొత్తం ఇరవై చేసుకో బాబూ” అంది.
“అదేం కుదర్దు” అన్నాడు నరిసిగాడు. “సరే, పోనియ్ బాబు” అంది దిబ్బమ్మ.
స్టాండుకి రూపాయిన్నర పోయడానికి గిజగిజలాడిన దిబ్బమ్మ మరో ఇరవైకి వెంటనే ఒప్పేసు కుంది. ఒప్పుకోక చస్తుందా!
దిబ్బమ్మ యెంతంటే అంతకి ఒప్పేసుకోడంతో – మరో అయిదు ఎక్కువ అడిగి వుండాల్సింది, అయ్యయ్యో! అని బాధ పడ్డాడు నరిసిగాడు.
ఎండ తీక్షణంగా వుంది. ఇంటికెలా చేరాలనే భయం. కలవరపాటులో తన దాహం సంగతే మర్చిపోయింది.
చావులమదుం కిందనుంచి చావుడప్పుల బాజాలతో ఊరేగి వసోంది ఒక శవం! పాడెవెనకాల పడుతున్న పైసలకోసం నలుగురు దిసమొల కుర్రాళ్ళు పడి కొట్టుకు చస్తున్నారు. స్టాండులో నున్న రెండు కుక్కలు ఆడుతున్న ఆటలు ఆపేసి దీనంగా, భయంకరంగా అరవడం మొదలు పెట్టాయి. దిబ్బమ్మ ఆ కుక్కల అరుపులు భరించలేక చీ ఛీ అని కేకలు వేసింది. ఆ కేకలకి కుక్కలు చలించలేదు. రిక్షా కదలడానికి గ్రీన్ సిగ్నల్ యిచ్చినట్టు మదుంమీద నుంచి రైలు కూత పెట్టింది.
రిక్షాకి పాడె ఎదురురావడం యిష్టం లేదు దిబ్బమ్మకి. గబగబా దాటించేయమంది రిక్షాని.
చిట్టి పెళ్ళి పల్లకీని చూసి ఆనందించినట్టే, ఆ పాడెను కూడా క్యూరియస్ గా, కళ్ళార్పకుండా చూస్తోంది. ఇంటికెలా చేరాలనే భయమే కాదు, ఏ బాధా, భయం లేని వరం లాంటి వయసు ఆ పాపది.
రిక్షా కదులుతుండగా దిబ్బమ్మ మనసులో ఏడుకొండలవాణ్ణి తలచుకుంది. ఇంటికి క్షేమంగా చేర్చు తండ్రీ, ఈ పసిపిల్లతో, ఈ ట్రంకు పెట్టెతో నన్ను ఒడ్డుకి పడేయ్ తండ్రి’ అని ప్రార్థించింది.
ధరల పెరుగుదలకి నిరసనగా బంద్ జరుపుతున్నందుకు దిబ్బమ్మ విసుక్కోవడం లేదు. దురదృ పవశాత్తు బంద్ కి దొరికిపోయినందుకు తనను తాను నిందించుకుంటోంది. తనలాంటి ఏ ఒక్క వ్యక్తో ఇబ్బందుల పాలవుతారని ప్రజల ఉద్యమాలనే తప్పు పట్టడం తప్పు కాదూ?
జరుగుతున్న బంద్ ధరల పెరుగుదలకే కాదు, క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితికి కూడా నిరసన అని ఆమెకి తెలీదు.
మనిషికి సెక్యూరిటీ అంటూ ఒకటి లేకుండా పోయింది. గుండెమీద చేతులేసుకుని ఎవరూ నిద్రపోలేక పోతున్నారు. నిర్భయంగా, నిశ్చింతగా వుండలేక పోతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, అలజడులు, దుర్మార్గాలు, ఇంటినుంచి బయటికెళ్ళిన పెనిమిటి తిరిగి ఇంటికి చేరేవరకు ఇల్లాలికి పీచుపీచు భయం! ఇంట్లో వంటరిగా వున్న తన ఇల్లాలిపై ఏ అత్యాచారాలు సాగుతాయో, ఇంటిపై ఏ రాబందులు వాలేయో – అని అవతల భర్త భయం. బతికే బతుకంతా భయం, భయం అయిపోయింది.
వంటరిగా ప్రయాణం చేస్తున్న ఆడమనిషిపై జరిగే అత్యాచారాలకి అంతే లేదు. ఆరేళ్ళ పసిపాపనే కాదు, ఎనభయ్యేళ్ళ ముసలమ్మనే మానభంగాలు చేసేస్తున్నారు. బంగారం కోసం చెవుల్నీ, ముక్కుల్నీ కూడా నిర్దాక్షిణ్యంగా కోసేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఏ మగతోడు లేకుండా ఒంటరిగా పదిమైళ్ళ దూరం ప్రయాణం చేస్తోంది దిబ్బమ్మ. ఎన్‌హెచ్ 5 రోడ్డుకి టర్నయి, కాకాని నగర్ దాటేక – నాతయ్యపాలెం చేరేదాకా ఒక్క యిల్లుగాని, పిట్టమనిషి గాని కనిపించరు! దిబ్బమ్మ చెవులకి పోవుఁలున్నాయి. ముక్కుకి నత్తువుంది. మెళ్ళో గొలుసు వుంది. చిట్టిచెవులకి రింగులున్నాయి. అంతేకాదు పెట్టెలో బంగారం ఎనిమిది తులాలు వుంది!
అల్లుడు చేస్తున్న ఉద్యోగం మానేసి ఆ బంగారంతో ఏదో వ్యాపారం చేస్తానంటున్నాడు. కూతురుకది ఇష్టం లేక, మొగుడెక్కడ బంగారం లాగేసుకుంటాడోనని (అప్పటికే రెండు తులాలు ఆర్పేశాడు!) తల్లి చేతికిచ్చేసి నీ దగ్గరే వుంచమ్మా అంది. తీసుకు వెళ్ళిపో అమ్మా అంది. తీసుకు వస్తోంది తను. బంగారం మోసుకెళ్ళడం ఇంత ఇబ్బందని అనుకో లేదు. సిటీ బస్సే వుంటే ఇబ్బందే అన్పించక పోను!
ఎండ నిప్పులు చెరుగుతోంది. రోడ్డుమీద తారు మెత్తగా కరుగుతోంది. ఎక్కడో ఇళ్ళంటుకున్నట్టు న్నాయి – ఫైర్ సర్వీస్ లారీలు గణగణ గంటల చప్పుడుతో తాపీగా పోతున్నాయి! రోడ్డు కిరువైపులనున్న దుకాణాలు మూసేసి వున్నాయి. మెడికల్ షాపువాడు నా దుకాణం కేం ఫర్వాలేదు అని ధైర్యంగా తెరిచే వుంచాడు. ఒకటి, రెండు చోట్ల కొద్దిగ తలుపులు తెరిచి తొందర, తొందరగా, భయం భయంగా
అమ్మకాలు చేస్తున్నారు.
బంద్ తోపాటు భీకరమైన ఎండ కాస్తుండటం చేత రోడ్డు మీద జనం లేరు.
అక్కడక్కడ పోలీసులు లాటీలు, తుపాకులతో వున్నారు. అయిదు నిమిషాల క్రితమే కర్వ్యూ సడలించి 144వ సెక్షను పెట్టినట్టు నిస్తేజంగా వుంది రోడ్డు.
దిబ్బమ్మకి బెంగగా, గాబరాగా వుంది. రిక్షా వెళ్తూంటే తోవలో పైడితల్లమ్మ గుడి తగిలింది. నరసిగాడి చేతిలో పావలా పెట్టి ‘బాబూ ఆ యమ్మ హుండీలో వేసిరా బాబూ’ అంది. తర్వాత రామమందిరం తగిలింది. రిక్షాలోంచే దండం పెట్టుకుంది. రిక్షా అప్ ఎక్కేక ముత్యాలమ్మ గుడి… తను లెంపలు వాయించుకు దండం పెట్టింది. పక్కనే శివుడి కోవెల! తనే కాక చిట్టిచేత దండం పెట్టించింది. దండం పెడుతున్న చిట్టికి ఏం జ్ఞాపకం వచ్చిందో ఏమో ‘మామ్మా! ఆకలి’ అంది. ఇదిగో ఇంటికొచ్చే సేం అంటూ మరిపించడానికి మనవరాలిని మాటల్లోకి దించింది మామ్మ? ఆ చిట్టి ఆపకుండా ఏవేవో పిచ్చి, పిచ్చి ప్రశ్నలు వేసి వేధిస్తోంది.
సాధ్యమైనంతవరకూ చిరాకు పడకుండా పిల్ల యక్ష ప్రశ్నలకి సమాధానం చెబుతోంది దిబ్బమ్మ.
రిక్షా కీచుకీచుమని వెల్తోంది. స్పీడు లేదు. నరిసిగాడు హుషారుగా ఫెడలు వేసినప్పటికీ చక్రాలు సర్రున పరుగుదీయడం లేదు. డొక్కు రిక్షా! పోనీ డొక్కుకైనా ఏనాడైనా ఆయిలింగ్ చేసిన పాపానికి పోతేనా!
గట్టిగా పెడలు వేస్తున్నప్పుడు చైను ఫట్ ఫట్ మంటోంది. వాడికి దిబ్బమ్మ నెక్కించుకొని రిక్షా తొక్కడం – నడుం మీద వంద కేజీల బియ్యం బస్తాని వేసుకు మోస్తున్నట్టే వుంది.
రోడ్డంతా ఎగుబోటు!
మరిక ఫెడలు వేయడం కష్టమయి ‘దీనమ్మ’ అని కిందకి దిగేడు. కాళ్ళు చుర్రు మంటున్నాయి. తారు చురకలు పెడుతోంది. ఎడమచేయి హాండిలు మీద వేసి, కుడి చేయి వెనుక ఐరస్టాండు మీద వేసి బలంగా లాగుతున్నాడు. తన శక్తినంతా కూడదీసి వంగోని లాగుతుంటే తనకి ముందు చక్రం మూడు చక్రాల్లా కన్పిస్తోంది. కళ్ళమీద చమటపడి మసక కమ్మేస్తోంది. మోచేతి బనీనుకి ముఖం తుడుచుకుంటూ రిక్షాని ముందుకి పోనిస్తున్నాడు. నుదుటిపై చెమటబొట్లు రోడ్డుపై పడి, అంతలో ఆవిరై పోతున్నాయి.
రిక్షాకి అడ్డంగా గజ్జి కుక్క వచ్చింది. ‘ఛత్తల్లి… నీయమ్మ’ అని దాన్ని ఒక్క తావు తన్నేడు. అది కుయ్ కుయ్ మని పరిగెట్టింది. రిక్షాని అంత కష్టంగా లాగుతున్నప్పుడు నరిసిగాడి కెంతో కసిగా, కచ్చగా వుంటుంది. ఆ కసి, కచ్చ ఎవరి మీదో తెలీదు. ఆ సమయంలో కుక్కేకాదు లారీ. రిక్షా, మనిషి… ఏ అడొచ్చినా, ఎవరు అడొచ్చినా ఎగిరిపోయి బూతులు అందుకుంటాడు.
గంటసేపు తొక్కితే – ఇంకా సగం దూరమైనా రాలేదు. ఛత్తిరి!… ఇరవై రూపాయలకి కక్కుర్తి పడిపోయి తొక్కలేని దూరానికి ఒప్పుకున్నాను. అంతా ఎగుబోటు. ఎదురు గాలి, మిట్ట మధ్యాహ్నం. కూర్చున్నది దిబ్బది! రిక్షా డొక్కుది…. ఏదైనా రిక్షాకి తన బేరం అప్పగించేసి తప్పుకుంటే బాగుణ్ణు అనిపిస్తోంది. అడివిలోంచి ఎడారిలో కెళ్ళడానికి తను కాబట్టి ఒప్పేసుకున్నాడు గాని బుద్ధి, బుర్రా వున్న ఏ రిక్షా నా కొడుకు కట్టడు, కట్టడు – అనుకున్నాడు నరిసిగాడు.
తెల్లారి కొట్టిన గిన్నెడు చద్దన్నం ఏ మూల కెళ్ళిపోయిందో… లోన పేగుల్ని ఎలుకలు కొరికేస్తు న్నాయి.
దిబ్బమ్మకి చెమటలో తడిసిన వాడి కండలు యినప దిమ్మలా కన్పిస్తున్నాయి. చేతులపై నరాలు ఎత్తుగా ఉబ్బేయి. పొట్టి నిక్కరులోంచి తొడలు, పిక్కలు రాళ్ళలా కన్పిస్తున్నాయి. గోడకి పోస్టరు అంటించినట్టు బనీను వీపుకి అతుక్కుపోయింది. బనీను మీద కన్నాలు అయిదు లెక్క పెట్టింది చిట్టి.
చిన్నకొండలా వున్న కొత్త రోడ్డు బ్రిడ్జి దాటేటప్పటికి పన్నెండు సైరను ఊదింది. రిక్షా సింహాచలం రోడ్డు దాటి ఎన్ హెచ్ 5 రోడ్డులో వుందిప్పుడు. బ్రిడ్జ్ కింద వంకర వంకరగా తిరిగివున్న పట్టాలు – పాదరసం పరుగుతీస్తున్న గొట్టాల్లా ఉన్నాయి. తాగేసో, లేక మూర్ఛపోయో ఒకడు పక్కన పడి వున్నాడు. ఆ బ్రిడ్జి దగ్గర అర్బన్ ఏరియా దాటి రూరల్ ఏరియాలోకి వెళ్ళిపోతున్న వారికి మున్సిపాలిటీ ‘థాంక్యూ’ అని బోర్డు కట్టి చెబుతోంది.
ఆ రిక్షా బ్రిడ్జి నెక్కడం ఎంత కష్టమయిందో, దిగడం అంత ఈజీగా వుంది, కాని ఎదురుగాలి అటకాయిస్తూనే వుంది.
ఇక ఎదురుగా ఎడారి. రోడ్డు పక్కన ఒక ఇల్లు లేకపోతే పోనీ, నీడనిచ్చే ఒక చెట్టు కూడా లేదు. అంతా డ్రయ్ ఏరియా. ఈ ఎడారిలో గంట సేపు ఈదుకెళ్తే గాని నాతయ్యపాలెం అంచులు దొరకవు. – చిట్టి సీటులో ఒద్దికగా కూచోకుండా నించొని, పెట్టె తొక్కి, అటుకదిలి, ఇటు కదిలి, స్టాండు పట్టుకు వూగి ఎంత అల్లరి చేసినా భరించింది దిబ్బమ్మ. అడిగిన లక్షయక్ష ప్రశ్నలకీ జవాబులు ఇచ్చింది. చిట్టిది పట్టిందేపట్టు – దాహం. ఆకలి అనడం లేదు. అదే చాలు అనుకుంటోంది. నెమ్మదిగా ఇంటిదాకా ఓపిక పడితే ఏదైనా గబగబా వండి పడెయ్యొచ్చు.
కాని అనుకున్నట్టు జరగలేదు. – అకస్మాత్తుగా ఆకలేస్తోందని రాగం తీయడం మొదలుబెట్టింది చిట్టి. ఎంత నచ్చ చెప్పినా, ఎన్ని మాయమాటలు ఆడినా వినిపించుకోలేదు. పోనీ ఏదైనా కొని పడేద్దామన్నా గడ్డితప్ప ఎక్కడా ఏమీలేదు.
అయిదు నిమిషాలు నచ్చజెప్పచూసి, విసిగి వీపుమీద రెండు బాదులు బాదింది. నెత్తిమీద రెండు మొట్టికాయలు మొట్టింది. ఆ – చిట్టి గొప్ప మాటకారి. చిట్టిచేత ఏవేవో మాట్లాడించుకుని, వినడం, మురిసిపోవడం దిబ్బమ్మకి ఇష్టం. స్కూలు సెలవులివ్వడంతో చిట్టిని వెంటేసుకు వచ్చింది.
ఎప్పుడూ కొట్టని మామ్మ కొట్టడంతో చిట్టికి కోపం, రోషం వచ్చింది. “నీ జుట్టు పీస్…. నీవు నా కొద్దు. మా అమ్మకాడికెళిపోతాను” అంది.
“ఎళ్లిపోయే సిగురుగుంట…. ఒవుల్నే బెదిరిస్తావు”.
“అవుతే నన్ను దిగబెట్టేయి మా ఇంటికి”.
“ఆఁ! నాకు పట్టింది బాధ” అంది ఒళ్ళు మండి. అంత మంటలోనూ మనవరాలితో వాదన సరదాగా వున్నట్టుంది దిబ్బమ్మకి.
“నాకేం బయ్యివేఁటి? నేనెళ్ళి పోగల్ను”.
“పో అయితే”.
“డబ్బులియ్యి”.
“తొంగుడున్నాయి”.
డబ్బులు తొంగుడోడవేవిఁటో చిట్టికి అర్థం కాలేదు. మొత్తానికి డబ్బులివ్వనంటుందని అర్థమయ్యింది.
“అవుతే, మా నగలిచ్చే సేయ్”…
“ఏం నగలు? మీ బాబూ సంపాయించేడా? మీ యమ్మ సంపాయించిందా”..
“అదేం కాదు… మా అమ్మవి, ఇచ్చేయ్” – రోషంగా మామ్మగుండెల మీద రుద్దుతూ అంది. మనవరాలితో అలా గుండెల మీద గుద్దించుకోవడం సరదాగానే వున్నట్టుంది దిబ్బమ్మకి.
“ఇస్తావా, లేదా?”
“తచ్చాడుతున్నాయి లచ్చోరం సంతలో”.
సంతలో తచ్చాడ్డం ఏమిటో అర్థంకాక – “అదేం కాదు, నాకు తెల్సు. ఇగో ఈ పెట్టెలో వున్నాయి మా అమ్మ నగలు” తెలియజేసింది గొప్పగా.
ఆ దెబ్బతో దిబ్బమ్మకి మురిసిపోతున్న మనవరాలి ముచ్చటా, గిచ్చటా ఎగిరిపోయేయి. ఆమె గుండెలు ఒక నిమిషంపాటు కొట్టుకోవడం మర్చిపోయేయి. రిక్షావాడు వినేశాడు… వినేశాడు. అవునే వినేశాడు. అమ్మ నాయినో ఇంకేం వుంది. అదిగో రిక్షా ఆపేశాడు… ఎంత పని చేశావే గుంటా? ఇంకేం వుంది… అయిపోయింది, అంతా అయిపోయింది. దేవుడోయ్… అయిపోయింది… పెట్టెలంకించుకు పోతాడు. ఇక నేనేం చేతును దేవుడోయ్….
చిట్టిని శుభ్రంగా రెండు చేతుల్తో దబదబా మొత్తేసింది. ‘చావే గుంటా, చావు’ అని జుత్తు పీకేసింది.
నరిసిగాడు రిక్షాని ఆపేడు.
రోడ్డుకి ఎడమవైపున పచ్చపచ్చగా మెరిసిపోతూ పొలాలు. ఆ పచ్చని పొలం పక్కనే గాలివాన తుప్పలు, తుమ్మచెట్లతో నిండిపోయిన బీడు నేల. కాళ్ళూ, చేతులూ, ముక్కూ, ముఖం చెక్కేసినట్టున్న తవ్వినంత తవ్వి వదిలేసిన మొండి కొండ! విశాలంగా లేని చిన్ని ఏరోడ్రాంలో పెద్ద పక్షి ఏదో వాలినట్టు విశ్రాంతి తీసుకుంటున్న విమానం! రోడ్డు కిరువైపులా కాస్త దూరంలో దట్టంగా పెరిగిన సరివిడి తోట. ఆకాశం అంచుల్ని వంకరటింకరగా కత్తిరించినట్లు చుట్టూ కొండలు, కొండలు! సింహాచలం కొండ వెండి జరీ తలపాగ చుట్టుకున్నట్టు శిఖరాన్ని చుంబిస్తూ తెల్ల మబ్బులు! చెట్లు, తుప్పలు. రాళ్ళ గుట్టల మధ్య నుంచి కొండచిలువలా పాకుతూ రైలు…. చిట్టి అంత ఏడుపులోనూ రైలుని దీక్షగా కళ్ళార్పకుండా చూస్తోంది.
“ఎందుకు తల్లీ పిల్లనలా బాదేస్తావు” అన్నాడు నరిసిగాడు. అంటూ దగ్గరకొచ్చేడు. ఒక చేయి పెట్టె మీద వేశాడు.
“అమ్మా. కొద్దిగ లేస్తారా”. తనని దింపేసి రిక్షాలో పిల్లనీ, పెట్టెనీ పట్టుకు ఉడాయిం చేస్తాడా? చిట్టిని ట్రంకు పెట్టెమీద నించో బెట్టేడు. “మిమ్మల్నేనమ్మా… కొద్దిగ లెగండి”. దిగకపోతే తోసేస్తాడేమో!
దిబ్బమ్మ గుండె దబదబ కొట్టుకుంటోంది. కాళ్ళు తడబడుతున్నాయి. నెమ్మదిగా రిక్షా దిగింది. నరిసిగాడు సీటుని పక్కకి తప్పించేడు. బల్ల చెక్కను తీసేడు. చిన్న అరలా వుంది. అందులో మాసిన గుడ్డ పీలికలు, సైడు కర్టెన్లు వున్నాయి. చేత్తో లోపల దేవుతున్నాడు.
కత్తిగాని తీస్తాడా….. వణికిపోతోంది. దిబ్బమ్మ
చివరికి దొరికింది చేతికి! పచ్చగా జామికాయ! జామికాయ చిట్టిచేతిలో పెట్టి, బల్లచెక్కను సరి, సీటువేసి, దాని పై ఒక చరువు చరిసి… ‘కూర్చోండమ్మా’ అన్నాడు దిబ్బమ్మని..
దిబ్బమ్మ నిట్టూర్చి, గుండెల మీంచి చేతులు తీసేసింది. రిక్షా ఎక్కింది.
రిక్షా కదిలింది.
రిక్షావాడు ఇచ్చిన జాంకాయ దగ్గర అంత బంగారం తీసుకట్టుగా, విలువ లేనిదిగా అన్పించింది దిబ్బమ్మకి.
ఎదురు గాలికి రిక్షా కదలడం లేదు. అయిదు నిమిషాలకి రిక్షా పది గజాల దూరమెళ్ళడం గగనమవుతోంది. గాలి బొయ్ బొఁయ్ మని రాక్షస చప్పుడు చేస్తోంది. రిక్షా టాపు టప్ మని కొట్టుకుంటోంది. ఎదురుగా ఒకడు సైకిల్ తొక్కకుండా, ఫెడలు వేయకుండా, హాండిల్ మీద చేతులు వదిలేసి మరీ పోజుగా వస్తున్నాడు!
మేఘాలు చెదిరి పీలికలై ఎగిరిపోతున్నాయి. సూర్యుడూ, గాలీ పోటీపడి ఎవరి ప్రతాపం వాళ్ళు చూపిస్తున్నట్టు… తీవ్రంగా ఎండ! వేడి, వేడి గాల్పులు కొడుతూ ఎదురుగాలి. ఒక్కొక్కసారి ఆ గాలికి రిక్షా తట్టుకోలేక ఒక మిల్లీమీటరైనా ముందుకెళ్ళడం కాదు. వెనక్కి వెళ్ళిపోతోంది. వడగాలి కొడ్తున్న చెంప దెబ్బలకి సరివిడి చెట్లు గిజగిజలాడిపోతున్నాయి.
నరిసిగాడికి కొండ ఎక్కుతున్నట్టుగా వుంది. ఎక్కలేకపోతున్నాడు కొండ. ఎక్కాలి, అదిగో కనిపిస్తోంది శిఖరం… అందుకోవాలి…… ఎదురుగాలితో యుద్ధం చేస్తున్నాడు నరిసిగాడు.
మధ్యలో విశ్రాంతి తీసుకోడానికి చెట్టునీడ ఒకదగ్గర కాపోతే ఒక దగ్గరైనా లేదు. నాలిక పిడచకట్టుకు పోతోంది. కాళ్ళూ, చేతులూ లాగేస్తున్నాయి. తేలిపోతున్నాయి. కళ్ళు తిరిగి పోతున్నాయి. శ్వాస తీయడానికి ఉక్కిరిబిక్కిరి అయి పోతున్నాడు.
‘ఇక రిక్షా నడపలేను తల్లీ… ఎలాగెలావో ఎల్లమ్మా…. ఇక నా తరం కాదు, ఏ డబ్బులూ వద్దుగాని తల్లీ, ఇకనే తొక్కలేనమ్మ’ అని అనేయాలనిపిస్తోంది.
రిక్షా ఆపేశాడు. రిక్షా వెనక్కి వెళ్ళిపోతోంది. రాయితీసి వెనక చక్రానికి అడ్డంగా పెట్టేడు.
రిక్షా వదిలేసి రోడ్డు దిగిపోతున్న రిక్షావాడికేసి గాభరాగా చూసింది దిబ్బమ్మ.
నరిసిగాడు తాగిన వాడిలా జోగుతూ మదుంకేసి నడిచేడు. మూత్ర విసర్జనకా! దిబ్బమ్మకి అటువైపు చూడాలో, చూడకూడదో తెలియకుంటోంది.
మదుం కింద నుంచి గెడ్డ పారుతోంది. నీళ్ళు తేటగా వున్నాయి. కింద తెల్లటి ఇసుక స్పష్టంగా కనిపిస్తోంది. తళుకులీనుతోంది. –
నరిసిగాడిని చూసి భయపడి రెండు కప్పలు నీటిలోకి గంతేశాయి.
ఆదమరచి నిద్రపోతున్న తల్లి వక్షం మీదకి… ఆకలేయగానే గబగబా బంగురుకుంటూ వచ్చి అమాంతంగా పడిపోయి పాలుకుడిచే పసిపాపలా – నరిసిగాడు, అతి నెమ్మదిగా పారుతున్న ఆ నీటిలో అడ్డంగా పడిపోయేడు. నిక్కరు తడవకుండా, బొడ్డువరకు మాత్రమే నీరు తగిలేలా పడిపోయేడు. చేతులతో నీరుతీసి ముఖానికి దబదబా కొట్టుకున్నాడు. దోసిళ్ళో పట్టుకు నీళ్ళు తాగేడు. తర్వాత చేతులతో కాకుండా ఏకంగా నీటిలో నోరు పెట్టే తాగేడు. చెమటకి పూర్తిగా తడిపిన తువ్వాలుని నీటిలో ముంచి కాళ్లు, చేతులు తుడుచుకున్నాడు. బనీను తీసి పిండుకొని మళ్ళీ వేసేసుకున్నాడు. కొంత ప్రాణం లేచి వచ్చింది. .
ప్రక్కనేవున్న పొదల్లోకి వెళ్ళి పెద్ద ఆకులు తెచ్చేడు. ఆ రెండు ఆకులని కోన ఆకారంలో చుట్టి నీళ్ళు పట్టుకొచ్చి దిబ్బమ్మ కిచ్చేడు. నీళ్ళు ఆమె రెండు గుక్కలు తాగి మిగతాది ముఖం మీద దిమ్మరించుకుంది. చిట్టి అప్పటికే మామ్మ ఒడిలో నిద్రపోతోంది! లేకుంటే చిట్టిని తీసుకెళ్ళి నీళ్ళు తాగిద్దామనుకున్నాడు.
ఆగిపోయిన స్కూటరు, రిజర్వులో వున్న పెట్రోలుతో ముందుకు కదిలినట్టు రిక్షా కదిలి. మదుం దాటేక రోడ్డు ఎడమకి తిరగడంతో ఎదురుగాలి దురుసుతనం తగ్గింది. సరివిడి చెటు ఆడుతున్న అల్లరి పిల్లల్లా గోల చేస్తున్నాయి. పచ్చని చేను విరగబడి అటూ, ఇటూ చూరంలో తాటిచెట్టుపై నుంచి కిందకి మట్ట పడింది. మట్ట చప్పుడికి ఉడుత జడిసి తుర్రుమంది. రాయి నిలబడిన తొండ వస్తూన్న రిక్షాని నిక్కినిక్కి చూస్తోంది. –
రిక్షాకి ఎదురుగా… కాస్త దూరంలో కొండమీదున్న గుడి అందంగా కనిపిస్తోంది. గుడికన్నా ముందే నాతయ్యపాలెం తగులుతుంది. ‘వూరు, అదిగో వచ్చేసింది. వచ్చేసింది’ అన్నదే వూపిరై రిక్షా ముందుకు పోతోంది.
నాతయ్యపాలెం రిక్షాని చిరునవ్వుతో ఆహ్వానించింది.
“నీయమ్మ, రెండు గంటలపాటు నన్ను సంపినావుగదే’ అనుకున్నాడు నరిసిగాడు, వూరి ఆహ్వానాన్ని మన్నిస్తూ! ఇంచుమించు ఒకే దగ్గర వున్న మూడు బ్రాందీ కొట్లని చూసి వూరు బాగానే వుందే అనుకున్నాడు.
ఎక్కడినుంచో మంచి పాతపాటని తెరలు తెరలుగా మోసుకొస్తోంది గాలి. రోడ్డుకి కుడివైపునున్న రెండిళ్ళ అవతల ఇల్లే దిబ్బమ్మ యిల్లు. తిన్నగా ఇంటి దగ్గరే ఆగింది రిక్షా.
తన వూరునీ, వూళ్ళో తన ఇల్లునీ చూడగానే దిబ్బమ్మకి కన్న తల్లిని కావలించుకున్నంత ఆనందమై పోయింది. గోదావరి పొంగి పొరలి వూరుని ముంచేస్తుంటే… తనని రక్షించి, పడవ ఎక్కించి ఒడ్డుకి దింపిన తమ్ముడిలా కన్పించాడు నరిసిగాడు.
దిబ్బమ్మ చిట్టిని ఎత్తుకొని దిగింది. రిక్షా నరిసిగాడు పెట్టెని పట్టుకున్నాడు.
‘అమ్మో!’ అనుకొని నవ్వుకుంది! పాడు మనిషిని! ఏ పాపం ఎరుగని రిక్షావాణ్ణి యేవేవో అను మానాలతో వూహించుకొని భయపడినందుకు సిగ్గుపడింది. కాని ఆ పరిస్థితిలో భయం సహజం అన్నది ఆమె గుర్తించడం లేదు.
దిబ్బమ్మని చూడగానే దిబ్బమ్మ మొగుడి ముఖం దిబ్బరొట్టంతయి పోయి గేటు తెరిచాడు. పాకలో కూర్చొని కునుకుపాట్లు పడుతున్న గేదెలు లేచి సంతోషంతో చెవులు వూపేయి, వరండాలో నులక మంచం వేసి దుప్పటి పరిచేడు దిబ్బమ్మ మొగుడు. పడుకున్న చిట్టిని మంచం మీద వేసింది దిబ్బమ్మ. మనరిసిగాడు పెట్టెని వరండాలో వారగా, గోడ పక్కన పెట్టి బయట కొచ్చి నిలబడ్డాడు. తువ్వాలు తీసుకొని ముఖం, చేతులు తుడుచుకుంటున్నాడు. – ఆ చెంబుడు నీళ్ళు తెచ్చి తాగమని ఇచ్చింది దిబ్బమ్మ, చెంబు ఎత్తిపెట్టి గుటుక్, గుటుక మని నీళ్ళన్నీ తాగేశాడు. ‘ఇంకా కావాలా’ అనడిగింది. చాలన్నాడు. “ఇక వెళ్తానమ్మా” అన్నాడు. –
““వెళ్తువుగాని లేబాబు, చూస్తే… నీర్సంతో ఎక్కడో పడేపోయేటట్టున్నావు. అందాక ఆ అరుగుమీద నడుం వాల్చు” అంది దిబ్బమ్మ.
అవును, తను వెళ్ళే స్థితిలో లేడు, కాసేపు నడుం వాల్చాలనే వుంది… ఆ అరుగుమీదకి వెళ్ళేడు.
దిబ్బమ్మ గేదెలు దగ్గరకెళ్ళి ఒకసారి వాటిని పలకరించి చేతుల్లో నిమిరి వంట గదిలోకి వచ్చింది. రెండు పొయ్యిలు వెలిగించి గబగబా ఒక గంటలో వంట చేసింది.
వంట చేసేసి, మగత నిద్రలోకి జారిపోయిన నరిసిగాణ్ణి లేపింది. వాడు తుళ్ళిపడి లేచాడు. ఒళ్ళంతా పచ్చి నొప్పిగా వుంది. ఆఁ’ అని చప్పుడు చేస్తూ ఆవలించాడు. బద్దకంగా చేతులు విరిచాడు. కళ్ళు నలుముకున్నాడు.
చేతులూ, ముఖం కడుక్కోమని నీళ్ళిచ్చింది. నరిసిగాడికి ఏదో కలలో వున్నట్టే వుంది. కాళ్ళూ, చేతులూ కడుక్కుని వచ్చేడు. ఎదురుగా విస్తరిలో భోజనం! దిబ్బమ్మ మొగుడు మగ్గుతో సారా అందించేడు! ఇంకేముంది!
అడిగి, అడిగి ఆప్యాయంగా వడ్డిస్తున్న దిబ్బమ్మ ముఖంలోకి ఎందుకో నరిసిగాడు చూడలేక పోయేడు. కళ్ళనీళ్ళు తిరిగేయి. గతం గుర్తుకొచ్చింది.
తను ఏ తండ్రికి పుట్టాడో తెలీదు. తల్లి జబ్బుతో పోవడం గుర్తుంది. గున్నయ్య కాఫీ హోటల్లో కప్పులు కడిగి, పొప్పులు రుబ్బి పదేళ్ళు చాకిరీచేసి వాడి దగ్గర డబ్బు దాచుకుంటే – నీవు నా దగ్గర అసలు డబ్బేం దాయలేదు, ఫో పొమ్మన్నాడు. తను పెళ్ళిచేసుకున్న లచ్చి ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత, కొవ్వెక్కి ఎవడితోనో లేచి పోయింది! తనకన్నీ ఇలాంటి దెబ్బలే, మనిషి మంచితనం మీద నమ్మకమెప్పుడో పోయింది. ఇక ప్రేమా, దయా, అనురాగం, ఆప్యాయతా… ఇవంటే ఏమిఁటో, ఎలా వుంటాయో తెలీదు. కాని యిప్పుడు….. ఈ అనుభవం కొత్తగా వుంది.
“తినుబాబు”.
“తింటాను తల్లీ, తింటాను” – కళ్ళు తుడుచుకొని తినడం మొదలెట్టాడు.
విస్తరిలో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా వూడ్చుకు తినేశాడు. వేళ్ళకి అంటుకున్న అన్నాన్ని నాలుకతో నాకేశాడు. చెంబుడు నీళ్లు తాగి తృప్తిగా తేల్చేడు.
భుజం మీద తువ్వాలుతో చేతులు తుడుచుకొని…. చేతులెత్తి దండం పెట్టి “వస్తాను తల్లీ” అన్నాడు.
దిబ్బమ్మ నవ్వింది. “అదేంటి బాబూ! 20 రూపాయలొద్దా! అన్నట్టు ఇరవయ్యేం? రూపాయిన్న రొకటివ్వాలి కదా”.
“డబ్బుకేఁవుంది, తల్లీ దయతో కడుపునిండా అన్నం పెట్టారు. అదే సాలు. ఆ సల్లదనం ముందర 20 రూపాయలు కాత్తల్లి లచ్చరూపాయలు కూడా నిలబడ్నేవు తల్లీ” అన్నాడు. –
తను ఎన్నాళ్ళగానో రిక్షా తొక్కుతున్నాడు. రిక్షా ఎక్కినోళ్ళంతా మనుషులేనని మొదట్లో అను కున్నాడు.
కాని రిక్షా ఎక్కిన వాళ్ళెవరూ తనని మనిషి కింద లెక్క చేయక పోవడంతో, సాటి మనిషిగా చూడకపోడంతో – ‘అవును ఎందుకు సూడాల? సూడాల్సిన అవుసరవేఁటి అలాగే నానెందుకు సూడాల? నాకేటి అవుసరం? వొవుడి సొద ఆడిది. వొవుడి బతుకు ఆడిది!’ అనుకున్నాడు. – అయితే,
ఆ నరిసిగాడే ఇప్పుడు – ‘దయా దాచ్చిన్నం ఇంకా బతికే వున్నాయి. ఎదటి కడుపు సొద ఎరి గిన అమ్మలు ఇంకా యీ బూమ్మీదున్నారు’ అనుకున్నాడు. అదే ఆమెతో అన్నాడు. అలా అనేటప్పుడు నరిసిగాడి కళ్ళు ఆనందం వల్లో, కృతజ్ఞత వల్లో తడితడిగా అయ్యేయి.
‘పిచ్చోడా! నాదేదో దయ, నాదేదో మంచి మనసు అంటావు గాని నీ మంచితనవేఁటో, నీ గొప్పతనవేఁటో నీకు తెల్దు . ఈ ఎడారిలో, ఎండలో, ఎదురుగాలిలో….. రెండు గంటల పాటు పడ్డ నీ కష్టం కాడ, అదునుకి పిల్లకిచ్చిన జాంకాయ కాడ, అదునుకి ఆకు దోనె నిండా నీవిచ్చిన నీళ్ళకాడ….. నా దయేపాటి? నా దాచ్చిన్నవేఁపాటి? నువ్వు సేసిన మేలుకి కొంతలో కొంతైనా రునవుఁ తీర్సుకుందారని వొన్నం పెట్టినాను గాని ఆ పాటి దానికే రునం సెల్లిపోదు… అయినా చేసిన మేలుకి వొన్నం పెట్టడం గొప్ప కాదయ్యా! మేలు సెయ్యడవేఁ గొప్ప! అంతేకాదు, ముందిస్తిరాకు, కష్టజీవికే ఎయ్యాల, నానేటి ? వొవులైన సరే… ఆ దేవుడైనసరే… కష్టం చేసినోడి కాలికి తలొంచి దండవెట్టాల’ అనుకుంది దిబ్బమ్మ.
దిబ్బమ్మ అలా అనుకోడంలో ఆశ్చర్యం లేదు. ఏవంటే – కష్టం చేసినోళ్ళకే కష్టమంటే ఏవిఁటో తెలుస్తుంది. కష్టం చేసినోళ్ళకే కనికరమంటే ఏవిఁటో తెలుస్తుంది. కరిగినా, మరిగినా కషపాటోళ గుండెలో కదుల్తుంది. మెదుల్తుంది…
దిబ్బమ్మ కష్టం చేసిన మనిషి..
దిబ్బమ్మ చిక్కం లోంచి డబ్బు తీసి యిచ్చింది.
రూపాయిన్నర ప్లస్ యిరవై యివ్వక తప్పదని డిమాండు చేసిన నరిసిగాడు ఆ డబ్బు తీసు కుంటూ…… ఎందుకో సిగ్గుపడ్డాడు. ఇరవయ్యే తీసుకుని రూపాయిన్నర జోలికి వెళ్ళగూడదను కున్నాడు!
కాని దిబ్బమ్మ నరిసిగాడి కిచ్చింది యిరవయ్యా కాదు, యిరవై మీద ఒకటిన్నరా కాదు!
పాతిక అవును. పాతిక
స్టేషన్లో అర్థరూపాయి కోసం అరగంట బేరమాడిన దిబ్బమ్మ, ‘ఒరే! ఏం ఆశరా!’ అన్నదిబ్బమ్మ. ‘రూపాయిన్నర అడక్కుండా మొత్తం ఏకంగా యిరవై చేసుకో’ అన్న దిబ్బమ్మ… వాడు ఏ డిమాండు చేయకుండానే పాతిక రూపాయలిచ్చింది!
తను యిచ్చినది వాడి కష్టానికి కట్టిన విలువని కాదు –
తనకి తోచినది.
తను సంతోషం కొద్దీ ఇచ్చినది.
Leave a Reply