‘ నల్లజర్ల రోడ్డు’ – తిలక్ గారి కథ!

నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.

ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.

తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya

“నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు”. 

అవధానిగారు యిలాగ అనేటప్పటికి మేమందరం పక్కున నవ్వాం. .కొవ్వొత్తి దీపపు వెలుతురులో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండిదారాల్లా మెరిసాయి.

“చంద్రుడూ వెన్నెలా ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం. కాని ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయ పెడతాయో మీకు తెలియదు” అన్నారు మళ్ళీ.

“చెప్పండి. మీరేదో కథ చెబుతారని తెలుస్తూనే వుంది. వినటానికి సిద్ధంగా ఉన్నాం” అన్నాను నేను.

“ఈ రాత్రికింక లైట్లురావు. ఎక్కడో తీగ తెగిపోయి వుంటుంది.” అన్నాడు నారాయణ.. –

“తోట అంతా చీక టైపోయింది” అన్నాడు నెర్వస్ గా ఆచారి. అస్థిమితంగా చేతివేళ్లతో బల్లమీద ఆదితాళం వేస్తున్నాడు. “ఇంకా – కొవ్వొత్తులున్నాయాండీ!” అని అడిగాడు. 

అవధానిగారు తల వూపారు – ఉన్నాయన్నట్టు

“ఈ తోటా, తోటలో మీ బంగళా, మీరు చేసిన విందూ – ఓహ్! మరిచిపోలేం” అన్నాడు నారాయణ.

“వూరికి యింతదూరంగా యీ తోట వుండడమే అంత ‘ బాగా లేదు” అన్నాడాచారి.

“చెప్పండి కథ” అన్నాను నేను. “కథా!” నిరసనగా చూశారు – అవధానిగారు.

“అదే! అదే! మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన….” అని సర్దుకున్నాను. 

అవధానిగారు కవీకాదు; కథకుడూ కాదు.. జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి. హృదయమూ, చమత్కారమూ, ఆలోచనా ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా విరుద్దంగా బాగా డబ్బున్నవాడు. .

 ఆయన చెప్పడం మొదలు పెట్టారు.

“ఏలూరులో చూసుకోవాల్సిన పని అంతా అయిపోయింది. ప్లీడరు గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక, కారు స్టార్టు చేశాడు రామచంద్రం, పది గంటలు దాటింది రాత్రి. నాగ భూషణం మామయ్యా, నేనూ వెనకాల సీటులో కూర్చున్నాం. 

ప్లీడరుగారు – కారు దగ్గరకి వచ్చి”నా మాట విన్నారు కాదు” అన్నారు.

 “అబ్బే ఎంత సేపండీ, సరీగ్గా తొక్కితే ఒక్క గంటన్నరలో తణుకులో పడతాం. మీరేం యిదవకండి” అన్నాడు రామచంద్రం.

– “అమ్మమ్మ! ఎంత మాట! కలక్టరుగారింట్లో శుభ • కార్యమంటే వేరే చెప్పాలా! ” అన్నారు ప్లీడరుగారు … యావద్విషయాన్నీ గ్రహించిన వారై.

కారు సాగింది.

“అప్పటికి నాకు పద్దెనిమిదేళ్ళు. అప్పటికి – మీ రెవరూ పుట్టివుండరు” అన్నారు – అవధానిగారు మా అందరికేసి చూసి.

“అటువంటి ప్రమాదం సంభవించే సూచనలు కూడా వాతావరణంలో ఉండి ఉండవండి” అన్నాడు నారాయణ. 

తోటలో గలగల చప్పుడయింది. ఆచారి ఉలిక్కిపడి “దొంగలేమో” అన్నాడు.

“పక్షులు చెట్లలో కదులుతున్నాయి. అంతే” అన్నారు అవధానిగారు.

కథలోకి రండి” అన్నాను నేను. . 

“అంటే….. ” కోపంగా చూశారు అవధానిగారు.

 “అదేనండీ, మీ చిన్నప్పటి….”

అవధానిగారు చిన్నగా నవ్వి గడ్డం చేత్తో ఒక్కసారి సవరించుకున్నారు. కొంచెం ముందుకు వంగి యిలా చెప్పసాగారు.

-ఆరుమైళ్ళు వచ్చేటప్పటికి కారు ఆగిపోయింది. రామ చంద్రం దిగి బానెట్ చూశాడు. 

 ” ఇది వెధవ కారులా వుంది. నడచి వెనక్కి పోదాం పద. ఎందుకేనా మంచిది” అన్నాడు నాగభూషణం మామయ్య.

“అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమోగాని యీ కారుని తిడితే మాత్రం నే నూరుకోను. అసలీ యింజనులాంటిది ఇండియాలో వుండదు” అన్నాడు రామచంద్రం.

“అందుకే ఆరుమైళ్ళకే ఆగిపోయింది” మామయ్య విసుగ్గా అన్నాడు. 

“డొక్కు కార్లు కొనకురా , అంటే విన్నావ్? సెకండ్ హాండ్ వి కొనవల్సిన ఖర్మ నీకే మొచ్చింది? మనమాట ఎలాగున్నా వీణ్నికూడా మనతో తీసుకువచ్చాం.  కర్మ!  వీడు ఎనిమిది గంటలకి పడుకోకపోతే మా అక్కయ్య ఎనిమిదిమంది డాక్టర్లని ఒకేసారి పిలిచి చూపెడుతుంది” అన్నాడు నన్ను ద్దేశించి.

“ఏం భయంలేదు మామయ్యా. రాత్రిళ్ళూ ,కార్లలో , ప్రయాణం చెయ్యడం నాకు సరదా” అన్నాను నేను.

రామచంద్రం మావూళ్ళో పెద్ద టెన్నీస్ ఛాంపియన్. – పొడుగ్గా, బలంగా, హుషారుగా వుంటాడు. మా, వూరి క్లబ్బుకి , సహాయ కార్యదర్శి, సేవాసదనానికి గౌరవాధ్యక్షుడు. ఆ సదనం ఏమిటో, యేం చేసేదో యిప్పటికీ నాకు తెలియదు. ఇటువంటి సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు. 

రామచంద్రానికి కాలవ వొడ్డున పెద్ద మేడ వుంది. మేడలో అతనికొక భార్యా కుమారరత్నమూ , కూడా వున్నారు. అతను భార్య నెక్కువ ప్రేమిస్తాడో భార్య పేర ఆమె తండ్రి వ్రాసి యిచ్చిన ముప్పేనాలుగెకరాల్నీ ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక, తేలక జిజ్ఞాసువులు చాలామంది బాధపడే వారు పాపం.

 మా నాగభూషణం మామయ్యకి వరుసకి బావ అవుతాడో బావమరది అవుతాడో – యిటువంటి భోగట్టా నాకు సరీగా తెలియదు. మా ఆవిడకి తప్ప – అసలు నాగభూషణం నాకు వేలు విడిచిన మేనమామ; అందరమూ ఒకే ఊళ్ళో వుండ డమూ, రాకపోకలూ, శుభకార్యాలూ, మంచి చెడ్డల్లో ఒకరినొకరు ఆదుకోవడమూ – ఇలాంటి వాటివలన ఈ కుటుంబాలన్నింటికీ చనువూ, గాఢ స్నేహమూ ఏర్పడ్డాయి. నాగభూషణం కూడా ఉళ్ళో చెప్పుకోదగినవాడు. ఎం.ఏ చదివాడు. పెద్ద కలప వ్యాపారం నడుపుతున్నాడు. ప్రతీ ఏడాదీ భగవద్గీత మీదా, ఉపనిషత్తులమీదా పెద్ద వాళ్ళని పిలిపించి ఉపన్యాసాలు యిప్పిస్తుంటాడు. కట్టడం ఎప్పుడూ ఖద్దరేగాని జిల్లా బోర్డు ప్రెసిడెంటు ఏ పార్టీ అయితే ఆ పార్టీనే బలపరుస్తాడు. దివ్యజ్ఞాన సమాజానికి ఉపాధ్యక్షుడు. ఊళ్ళోకి కలక్టరు వచ్చినా, మంత్రి వచ్చినా ఇతని యింట్లోనే మకాం. 

– కారు బాగుపడిందాండీ?” అన్నాడు నారాయణ మధ్యలో అడ్డువచ్చి.

ఆ రామచంద్రం కారు చుట్టూ రెండుసార్లు ప్రదక్షిణం చేశాడు. కొంత సేపు గొణుక్కున్నాడు. కారు కిందా మీద ఏవో పరీక్ష చేశాడు. చివరికి “ఆల్ రైట్” అంటూ కారులో కూర్చు న్నాడు. కారు సాగింది. ఎర్రని పొడుగాటి రోడ్డుమీద కారు వెళుతూంటే చల్లనిగాలి మొహానికి కొడుతోంది. ఇటూ అటూ’ పంటచేలు. కారు లైట్ల కాంతిలో నెంబర్లు వేసిన మైలురాళ్ళు ఒకటొక్కటే జరిగిపోతున్నాయి. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాలలాగ నక్షత్రాలు మెరుస్తున్నాయి. మండుతున్నాయి. చీకటిలో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది. దేవుడులాంటి అనిర్వచ నీయమైన శక్తి సన్నిహితంగా వున్నట్టు వుంటుంది. మామయ్య నన్ను బి.ఏ. ఎక్కడ చదువుతావని అడుగుతున్నాడు. 

మద్రాసులో అని చెప్పాము లజ్ కార్నర్ కి దగ్గర్లో అతనికో థియాసఫిస్టు మిత్రుడున్నాట్ట. అతని దగ్గరవుండి చదువుకోమనీ, హాస్టల్సులో వుంటే పాడై పోతావనీ చెపుతున్నాడు. రామచంద్రం మధ్య – మధ్య రాజమండ్రి శంకరం టెన్నీస్ ఆటలో. వుండే లోపాన్ని గురించి చెపుతున్నాడు.

“మిక్సెడ్ డబుల్స్ ఆడుతుందిట. ఆవిడెవరూ?” మామయ్య అడిగాడు.

“మిస్ శర్మిష్ట” 

“బాగుంటుందా?”

 “ఆవిడా, ఆవిడ ఆటా?”

 “రెండూనూ” అంటూ మామయ్య నవ్వాడు.

 “దోబిచెర్ల వస్తున్నాం” అన్నాడు రామచంద్రం.

అక్కడక్కడ రెండు మూడు పాకలూ, గుడి సెలూ, చీకట్లో ముడుచుకుపోయి పున్నాయి. ఒక బండి దగ్గర ఇద్దరు మనుష్యులు తలలకు పాగాలు చుట్టుకుని జమిలిదుప్పట్లు కప్పుకొని చుట్టలు కాల్చుకొంటూ కూర్చున్నారు. ఊరు ఎక్కడో లోపలకు వుంది. ఇప్పటిలాగా అప్పటికి పల్లెటూళ్ళలోకి నాగరికత ప్రవేశించలేదు. ఈ పాతికేళ్ళలో ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందో మీకు ! తెలియదు. మీకు ఆ రోజులు తెలియవు. విద్యుచ్ఛక్తి అంటే గ్రామీణులకు ఏమిటో తెలియదు. ఏలూరు నుంచి తణుకు వెళ్ళే రోడ్డుని గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. రాత్రి ఎనిమిది దాటాక యీ రోడ్డు సంరక్షితం కాదు. నిర్జనంగా, చీకట్లో నిశ్శబ్దంగా నిద్ర పోతూండేది. 

ఇప్పుడు చూడండి నిముష నిముషానికి ఒక లారీ వస్తూ, వెళుతూ వుంటుంది. ప్రతీ గ్రామం నుండీ కూరలూ, – పసుపూ, మిర్చీ మొదలైనవి ఎగుమతి అవుతున్నాయి. ఈ దోబిచెర్లలో యిప్పుడొక డేరా సినిమా కూడా వుంది. గ్రామీణు లీనాడు చుట్టలకన్న సిగరెట్లు ఎక్కువకాలుస్తున్నారు. 

మొన్న  కార్లో వస్తూ చూశాను. వెంకట్రామన్న గూడెంలో బాడ్మింటన్ పోటీలు జరుగుతూన్నట్టు పెద్ద బోర్డు వ్రాసి ఉంది. దారి పొడుగునా కాగితపు జెండాలు కట్టివేశారు. అక్కడ రెండు న్యూ మోడల్ కార్లు కూడా వున్నాయి.

పాతికేళ్ళ క్రితం ఉన్న స్థితికీ యిప్పటికీ ఉన్న వ్యత్యాసం చాలా తీవ్రమైనది. సాధారణంగా రెండు దశాబ్దాలలో యింత మార్పు ఎక్కడా చరిత్రలో జరుగదు.

కాని ఒక్కుమ్మడిగా భూస్వామ్య వ్యవస్థ మీదకు పారిశ్రామిక విప్లవమూ, సైన్సు పరిణామ  ప్రయోజనమూ దాడిచేసేటప్పటికి పాతవి విచ్చిన్నం చేస్తూ నవీన లోకం కఠినంగా స్థిరపడుతోంది. ఈ తీవ్రవేగానికి తట్టుకోలేక మనుష్యులూ, సమాజమూ తమ చుట్టూ గోడలని కట్టుకుని లోపల దాక్కుంటారు. దేశానికేదో కీడు మూడిందని గోల పెడతారు….

“మీరు కథని ఆపుచేశారు” అని జ్ఞాపకం చేశాడు నారాయణ అవధానిగారి ఉపన్యాస ధోరణికి కొంచెం భయపడి.

“అవును. కథ ఆగిపోయింది. ఎందుకంటే కారు కూడా సడెన్ గా అక్కడ ఆగిపోయింది” అన్నాడు అవధానిగారు చిన్నగా ‘ నవ్వుతూ.

– “కొవ్వొత్తి అయిపోతోందండోయ్” అన్నాడు. ఆచారి. వాడి చూపు దానిమీదే వుంది. మొదటినుంచీ.

అవధానిగారు సొరుగులోంచి ఒక కొవ్వొత్తి తీసి వెలిగిం చారు. “ఇంక ఒక్క కొవ్వొత్తి మాత్రం వుంది – యిది కాక” అన్నారు.

“చచ్చాం !’ అన్నాడాచారి. , 

“ఎందుకురా అంత భయం”- ప్రశ్నించాడు నారాయణ

“నాకు చీకటంటే పడదు” అన్నాడాచారి దిగులుగా తోటలో పేరుకుని ముద్దకట్టిన చీకటిని చూచి.

ఇంతలో ఏదో వికృతంగా సన్నగా కూత వినపడింది. ఆచారి భయంతో చటుక్కున లేచి “ఏమిటది అవధానులుగారు?” అని అడిగాడు.

“నక్కలు”

 “మీ తోటలో నక్కలు కూడా ఉన్నాయాండీ?” 

“తోటలో కాదు. శ్మశానంలో వుంటాయి”

 “శ్మశానమా?” ఆచారి గొంతు తడబడింది. వణికింది.

“అవును. తోటకి అవతల కాస్త దూరంలో వుంది” – అవధానిగారు తాపీగా, జాగ్రఫీ, మేష్టారు తూర్పున బంగాళా ఖాతమూ దక్షిణమున హిందూ మహాసముద్రము ఉన్నవి అని చెపుతూన్నంత నిర్లిప్తతతో అన్నారు.

– “నోర్ముయ్యి ఆచారీ. ఇంత వయసొచ్చి కూడా, యింత మంది ఉండగా ఈ భయం ఏవిటీ? నవ్వుతారెవరైనా వింటే……” అన్నాడు నారాయణ కోపంగా.

“నాకు దెయ్యాలంటే తెగ భయం…. అయితే…. హిహి హిహి” నెర్వెగా నవ్వాడు ఆచారి. ఈసారి బల్లమీద ఆదితాళం తొందరగా వేస్తున్నాడు. నక్కల కూతలు అప్పుడప్పుడు ఘోరంగా వినపడుతూనే వున్నాయి.

“చెప్పండి” అన్నాను నేను అవధానిగారితో.. , 

రామచంద్రం విసుగ్గా కార్లోంచి దిగాడు. “మొదటినుండీ నువ్వు అపశకునం మాటలే మాట్లాడుతున్నావు. అందుకే అభిమానవతి అయిన వా .ఫోర్డు మారాం చేస్తోంది” అన్నాడు నాగభూషణంతో.

 బానెట్ తీసి పరీక్షించాడు. “సరిగ్గా కనపడ డంలేదు యీ గుడ్డి వెన్నెలలో” అన్నాడు. 

అంతవరకూ వెన్నెల ఉన్నట్టు మాకు అనిపించలేదు. ఆకాశం మీదికి చూశాను. జేగురురంగుగా ఉన్న చంద్రుడుమీద పల్చని’ మబ్బులు తారాడు తున్నాయి. 

రామచంద్రం’ చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్న ఆసామీలను పిలిచాడు. “కొంచెం అగ్గిపుల్ల గీస్తారా! కారు ఆగి పోయింది” అని అడిగాడు. 

వాళ్ళు కుతూహలంగా ఒక్కొక్కటే. అగ్గిపుల్ల. గీస్తోంటే ఆ వెలుగులో ఏదో మరమ్మతు చేశాడు రామచంద్ర. 

“థాంక్స్” అంటూ కారు ఎక్కి కూర్చున్నాడు స్టీరింగ్ దగ్గర.

“ఏ వూరెడుతున్నారు బాబూ” అన్నాడొక ఆసామీ. “తణుకు” అన్నాడు నాగభూషణం.

“శానాదూరం. జాగ్రత్త బాబూ. అడవిలో ఏదో చిరుతపులి కనపడిందని చెప్పుకుంటున్నారు.”

“అలాగే, అలాగే” అని కారు స్టార్టు చేశాడు. రామచంద్రం. కారు సాగింది. నాకు ఏదో భయంగా వుంది.

“అదేరా నల్లజర్ల అడవి ఉదయం వస్తూంటే నీకు చూపిం చలేదూ!” అన్నాడు మామయ్య.

అవును, గూడెం దాటాక మైళ్ళ కొద్దీ రోడ్డుకి .. రెండువై పులా అడవి పరచుకుని వుంది. వందల కొలదీ కొండ ముచ్చులు రోడ్డుకడ్డంగా సభలు తీర్చి మా కారు సమీపించగానే కిచకిచలు చేస్తూ పరుగెత్తేవి. పగటి వేళ సూర్యరశ్మిలో ఆ ఆకుపచ్చని అరణ్యం ఎంతో మనోహరంగా వుంది. నోరులేని, తెలివిలేని వృక్షకోట మౌన సౌహారంతో హాయిగా గుబురుగా స్వేచ్ఛ ఉన్నట్టున్నది.

“అయితే చిరుతపులి ఉందంటావా మావయ్యా” అన్నాను నేను.

“ఆ! చిరుతపులీలేదు గిలీలేదు. ‘ఈ పల్లెటూరి వాళ్లు వూరికే ఇలాగ పుకార్లు వేస్తుంటారు. అబ్బాయ్! ఇది ఇంగ్లీషు వాడి రాజ్యం రా. వాడి తుపాకిముందు సింహాలూ, పులులూ నిలుస్తాయట్రా…” అంటూ రామచంద్రం ఏదో చెపుతున్నాడు. కాని కారు యింజనులోంచి ఏదో పెద్ద స్వరం బయలుదేరి గొంతును వినపడకుండా చేసింది.

“ఇదేం జబ్బురా వెధవ కారుకి. మళ్ళీ ఆగిపోతుందేమో!” అన్నాడు నాగభూషణం భయంగా. 

“ఇది మీ కాలంలోలాగే రెండెడ్ల బండికాదురా భూషణం. ఫోర్డు యింజను ఇలాగ చప్పుడైతే ఇంజన్ మాంచి బలంతో వుందన్నమాట” అంటూ రామచంద్రం ఏక్సిలరేటర్ మీద కాలు నొక్కాడు. 

కారు రయ్యిమని చీకట్లో దూసుకుపోతోంది. నాకు ఏదో సరదాగా థ్రిల్లింగ్ గా వుంది; ఆ చిరుతపులి గొడవ మాత్రం మధ్యమధ్య భయ పెడుతోంది తప్ప… 

“చూశావా ఒక్క పిట్టకూడా మైళ్ళకొద్దీ వెళ్ళినా కనపడదు. ఈ చెట్ల చాటున దొంగలు గుంపులుగా దాకుని పల్లెటూరి ప్రయాణీకుల్ని దోచుకునే వారు యిదివరలో….” అన్నాడు మావయ్య.

గత చరిత్ర నా కళ్ళముందు లీలగా ఆడింది. ఇలాగ రోడ్లూ అవీ ఉండేవి కావు. అక్కడక్కడా ఓ పల్లెటూరు వుండేది. ఏ కాకతీయులో, చాళుక్యలో పరిపాలిస్తూ ఉండేవారు. అప్పుడు దేశంలో వీరులూ, వీర వనితలూ, బందిపోటు దొంగలు, మట్టి రోడ్లూ, పులులూ ఎలుగుబంట్లూ, స్థిరమైన నమ్మకాలూ, సంప్రదాయాలూ అన్నీ ఉండేవి. ఇప్పుడు రోడ్లూ, టెలిగ్రాఫ్ తీగలూ, పోలీసులూ అన్నీ వచ్చి దొంగల్ని, క్రూరమృగాల్నీ నాశనం చేశాయి. వాటితోపాటు వీరవరులూ, స్వధర్మ నిరతులూ కూడా మాయమైపోయారు. 

“అడవి వచ్చేసింది. ఇది దాటితే యింక పది హేను మైళ్ళ తణుకు” అన్నాడు రామచంద్రం.

నాగభూషణం జవాబివ్వలేదు. వెనక్కి జేర్లబడి నిద్దరోతు “నువ్వూ నిద్రపోతున్నావా ఏవిటిరా?” అన్నాడు రామ చంద్రం నన్ను ఉద్దేశించి.

– “లేదు” అన్నాను నేను దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తూ. అడవి మధ్యనుండి రోడ్డు ఒక రాక్షస సీమంతంలాగా వుంది. అడవిలో అంతా కటిక చీకటిగా ఉన్నట్టుంది.

ఇంజన్ లో ఏదో రమని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు.

 కారు. ఒక గంతువేసి ఆగిపోయింది. …

“ఏమయింది!” అన్నాడు నాగభూషణం. శ్రీ రామచంద్రం మాట్లాడకుండా దిగి యింజన్ ని పరీక్ష చేశాడు.

“సరీగా కనపడటం లేదు” అంటూనే పరీక్ష చేస్త న్నాడు. కీచురాళ్ళ కూతలు ఉచ్చస్వరంతో వినపడుతున్నాయి. 

నాగభూషణం కూడా దిగాడు. కంగారుగా అన్నాడు. “ఏం బాగుపడుతుందా?” అని అడిగాడు. 

రామచంద్రం • మాట్లాడ కుండా వెనక సీటు కిందనుంచి కొంత సామాగ్రి తీసుకుని పనిలో పడ్డాడు . 

“చిరుతపులి యీ అడవిలోనేనా వుందీ?” అన్నాను నేను.

మామయ్య ఉలిక్కిపడి “ఎక్కడ?” అని ఒక గంతు వేశాడు. 

“వెధవాయ్ సడెన్ గా అలా అన్నా వేమిటిరా? అన్నాడు కోపంగా. 

రామచంద్రం పనిముట్లు టిటిక్ మని చప్పుడు చేస్తున్నాడు. శ్రమవలన అతని బరువైన వూపిరి చప్పుడు కూడా వినపడుతోంది. 

మధ్య మధ్య – ఎండుటాకులలో ‘ గలగలమని చప్పడు. పక్షి కూతలు…. కిచకిచలు… ఇన్నిటినీ మించిన భయంకరమైన నిశ్శబ్దం. –

“తెల్లవారితే కలక్టరు గారింట్లో పెళ్ళి …..” స్వగతం చెప్పుకున్నాడు మామయ్య. – “నువ్వేం చదివిస్తున్నావ్ ” అన్నాడు రామచంద్రం.

“మనం వెళ్ళలేకపోతే ఎంత అభాసు అవుతుంది!”అన్నాడు భూషణం. 

. “చిరుతపులి మనుషుల్ని’ తింటుందా మామయ్యా” చిన్నవా డినైన నాకు ఒక పక్క భయం, మరోపక్క కుతూహలం.

“ప్లీడరుగారు పక్కలు వేయిస్తానన్నారు. వినలేదు ఖర్మం” మళ్ళీ భూషణం మామయ్య స్వగతం. 

ఏదో చెప్పలేని భయం అందరిలో. వెన్నెల మరి కాస్త వచ్చింది. ఆకాశంమీద చంద్రుడు ఎర్రగా వున్నాడు. అసహ్యంగా మానని పెద్ద వ్రణంలా ఉన్నాడు, నోరు, చెక్కిళ్ళు పెరికి వేసిన శిరస్సులా ఉన్నాడు. వలయంలోంచి కొంత భాగం పూడిపోయి ఉన్నాడు. నాకు చంద్రుణ్ణి చూడగానే మొదటిసారిగా భయం వేసింది. అనంతమైన శూన్యంలో నీర సంగా, నిగూఢంగా ఉన్న అడవి మీద చంద్రుడు ఏదో విపత్తుకు సూచనలాగా దుశ్శకునంలాగా అనిపించాడు. వెలవెలబోతూన్న వెన్నెల కూడా కాష భస్మంలాగా భయ పెడుతోంది.

అరగంట జరిగింది. రామచంద్రం పట్టుదలగా, యింజ న్ తో తిప్పలు పడుతున్నాడు, “కారు బాగుపడదు, ఈ రాత్రి అంతా యిక్కడ బిక్కు బిక్కుమంటూ ఉండాల్సిందే” అన్నాడు నాగభూషణం.

కాస్సేపాగి మళ్ళీ అన్నాడు. “వద్దురా యీ కార్లో ప్రయాణం అంటే విన్నావు కాదు. మా ప్రాణాలు తియ్యడానికి వచ్చింది. ఖర్మం ”

రామచంద్రం సహనం కోల్పోయి “అబ్బ చంపకు. వెధవ గోలా నువ్వూ, బాగుపడకపోతే నువ్వు కార్లో ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చో. నేను తాడేపల్లిగూడెం వచ్చేవరకూ తోస్తాను. నీ ప్రాణానికి నా హామీ, సరేనా …” అని అరిచాడు.

మనుష్యుల గొంతులకి రోడ్డు వారనున్న చెట్లలో కలకలం రేగింది. ఒక్క క్షణం సద్దు అణగింది. రామచంద్రం లేచి రేగిన జుట్టుని, వెనక్కి తోసుకుని “ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఒక లావుపాటి కర్ర ఉంటే చూడాలి కారుని పైకి ఎత్తి పట్టుకోవాలి”. అంటూ రోడ్డు వారకుపోయి కర్రలకోసం వెదుకుతున్నాడు.

నేను భయంతో ఆకాశం కేసి చూశాను. తెలుపూ నలుపూ కలిపిన చిరుమబ్బుlu చంద్రుణ్ణి కప్పి వేస్తున్నాయి. చలిగాలి వీస్తోంది. నాగభూషణం దిగులుగా కారు పక్కనే నుంచున్నాడు. రామచంద్రం కర్రకోసం వెదుకుతూ పదిగజాల దూరం ముందుకు నడిచాడు. రోడ్డువారనే చింతచెట్లూ, రావిచెట్లూ ఉన్నాయి. ఎప్పటివో ముసలి చెట్లు శాఖోపశాఖలుగా అంతటా ఆక్రమించి వేశాయి. ఒక పెద్ద మర్రి చెట్టు ఊడలతో చీకట్లో అసహ్యంగా, భయంక రంగా , ఉంది. ఊడలు చీకటి పేగులలాగ వేలాడుతున్నాయి. చెట్టు చెట్టుకీ మధ్య యీతపొదలు, బ్రహ్మ చెముడు డొంకలు, రకరకాల తీగలూ అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి. ఒక గుడ్లగూబ అరుస్తూ, ఒక చెట్టుమీద నుండి యింకో చెట్టుమీదికి యెగిరింది. ఆ చప్పుడికి ఉడతలు కాబోలు కిచకిచమంటూ పరుగులెత్తాయి . మనుష్యులకి నివాసంకాని యీ కీకారణ్యం జంతువులకి సహజమైన ఆవాసంగా ఉంది. ప్రకృతి శాసనం తప్ప వాటికి వేరే జీవన విధానమూ, నియమమూ, నీతిలేవు. ప్రతీ ప్రాణి యిక్కడ తనని తాను రక్షించుకుంటూ తనకన్న అల్పమైనదానిని భక్షిస్తూ బతుకుతూంటుంది. ఈ అడవి యిలాగ యెన్ని మైళ్ళు లోపలికి చొచ్చుకుపోయిందో! లోపల చిరుత పులులేకాదు, మనిషి మీదపడి నోట కరుచుకుపోయి ఏ పొదలోనోదాగి ఒక్కొక్క అవయవాన్నే సావకాశంగా చీల్చి రుచిగా భక్షిస్తాయి కాబోలు. ఈ అడవి మీద వెన్నెల అనవసరంగా, అసందర్భంగా ఉంది. అందుకే అడవి కాచిన వెన్నెల అంటారు. అదేకాదు, వెన్నెల సహజమైన సౌకుమార్యాన్నీ ఆహ్లాదత్వాన్ని కోల్పోయి దుర్మార్గంగా, దుస్సహంగా కూడా ఉంది. గుబురుగా ఉన్న ఆకుల మధ్యనుండి,  కొంచెం కొంచెం వెన్నెల నేలమీదకు జారి వందల కొలదీ కట్లపాములూ, కొండ పాములూ పాకుతున్నట్టుగా ఉంది.

“మరీ లోపలకు వెళ్ళకు, జాగర్త రోయ్.” అంటూ భూషణం కేక వేశాడు .

“కారు బాగుపడకపోతే, రాత్రి అంతా ఇక్కడ ఉండిపోవడమే!” అన్నాను నేను. నాకు భయంగా ఉంది. గొంతుక యెండిపోతూన్నట్టు ఉంది.

“మంచినీళ్ళు కావాలి” అన్నాను.

“మంచినీళ్ళు! ఎక్కడ దొరుకుతాయి. ఇదేం మీ యిల్లనుకున్నావా” విసుక్కున్నాడు, నాగభూషణం.

“నిస్సహాయతవలన నాగభూషణానికి అసహనం ఎక్కువైపోతోంది. నాకు ఎందుకో అమ్మా, మా ఇల్లూ అన్నీ జాపకం వచ్చాయి. లోపల్లోపల చిరుతపులి వచ్చి కరుచుకుపోతుందన్న భయం అవ్యక్తంగా పెరుగుతోంది కాబోలు. నాకు ఏడుపు రాబోయింది. 

నాగభూషణం నా వళ్ళు నిమురుతూ అన్నాడు. “భయపడకురా అబ్బాయి. ధైర్యం తెచ్చుకోవాలి. పన్నెండు గంటలయింది. ఇంకో నాలుగైదు గంటలు వోపిక పట్టితే తెల్లవారిపోతుంది. కారు బాగుపడిందా సమస్యే లేదు.”

నేను మౌనంగా తలూపాను. – 

హఠాత్తుగా “భూషణం! పాము! పాము!” అన్న భయ విహ్వలమైన కేక నిశ్శబ్దాన్ని కత్తిలా చీలుస్తూ వినపడింది. 

నాగ భూషణం రామచంద్రం వెళ్ళిన వైపు నాలుగడుగులు ముందుకు వేశాడు. దూరంగా రోడ్డుమీద ఒక వైపు నుండి మరోవైపుకి పెద్దపాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెలలో మెరుస్తూ వెళ్ళిపోయింది.

 “రామచంద్రం! రామచంద్రం!” అంటూ కేకలు వేస్తూ పరుగెత్తాడు. నాగభూషణం. రామచంద్రం అక్కడ పొదల దగ్గరే కూలబడ్డాడు. నా ప్రాణాలు బిగుసుకుపోయాయి. నెత్తురు జిలజిలమంది.

రెండు చేతులతోనూ పొదివి పట్టుకుని తనమీద ఆనుకున్న రామచంద్రాన్ని తీసుకువస్తున్నాడు భూషణం. 

రామచంద్రం వణకిపోతున్నాడు. “తలుపు తియ్యి” అన్నాడు భూషణం. 

కారు తలుపు తీశాను.

“పడుకో రామచంద్రం, ఇలాగ పడుకో” అంటూ మెల్లగా రామచంద్రాన్ని వెనుక సీటులో పడుకోబెట్టాడు. పై మీద కండువా తీసి కాలిమీద గట్టిగా బిగించి కట్టాడు. 

“భయపడకు, భయ పడకు” అని హెచ్చరిస్తున్నాడు భూషణం.  గొంతులో ప్రాణం లేదు, ఎండిపోయి చచ్చిపోయి ఉంది. 

రామచంద్రం కళ్ళలో విపరీతమైన భయం సుళ్ళుతిరిగింది. వెర్రిగా పరవళ్ళు తొక్కింది. చావుకన్నా, దాన్ని గురించిన భయం భరింపలేనిది. మనిషి యొక్క ప్రాణం స్వరక్షణార్థం వెర్రిగా అరుస్తూ నరాలలో కళ్ళల్లో గుండెలలో పరుగులెత్తుతుంది. ఆ ప్రాణం యొక్క ప్రథమ వివేకం “నేను” అన్న అహమిక. నేను అనుకునే ఆ ప్రాణం ఏడుస్తుంది. మొర పెట్టుకుంటుంది. మోదుకుంటుంది, గిజగిజలాడుతుంది. రామచంద్రం వణికిపోతున్నాడు. రామచంద్రంలోని “నేను” లుప్త మైపోతున్నాడు. కరిగిపోతున్నాడు. కోట్ల కొలదీ రక్త కణాల సైన్యాన్ని తన్ని తాను రక్షించుకుంటా నికి యుద్ధానికి పంపిస్తున్నాడు. కాని పాము విషం ముందు యింత సైన్యమూ ఓడిపోతోంది. కాలకూట జ్వాల రక్తాన్నీ, మాంసాన్నీ, ధాతువునీ అంతటా రూప హీనంగా పరచుకున్న ప్రాణాన్ని కాల్చి వేస్తోంది. 

“భూషణం నేను చచ్చిపోతాను, చచ్చిపోతున్నాను” అంటూ అరిచాడు రామచంద్రం, బొంగురుగా, గాద్గదికంగా.

భూషణం యిటూ, అటూ చూశాడు. ఎవరూ లేరు. చుట్టూ భయంకరమైన అడవి.  ప్రతీ నిముషమూ అమూల్యమైనది. ఒక నిముషం గడచిందీ అంటే రామచంద్రం నివారింపలేని విపత్తులోకిజారిపోతున్నాడు. భూషణం కర్తవ్యతా విమూఢుడై పోయాడు ఏమీ చెయ్యలేని, ఏమి చెయ్యాలో తెలియని తన అవివేకం, తన అశక్తతలో తనే బంధింపడి కొట్టుకుంటూ నీరసంగా “ఏం ‘భయం లేదు భయంలేదు” అంటూ గుండెలు రాస్తున్నాడు.

“నా భార్యా – నా పిల్లలు… రక్షించు భూషణం రక్షించు-” రామచంద్రం దీనంగా ఏడుస్తున్నాడు.

నాకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. ఇంత భయంకరమైన అనుభవం నన్ను సంధులలో కూడా సళ్ళించివేసింది. బావురుమని ఏడవాలనీ, అక్కడనుంచి పారిపోవాలనీ ఉంది. కాని ఎక్కడికి పోను, ఎలా పోను ఆ అడవిలో!

“గుండె బరువెక్కిపోతోంది. భూషణం” రామచంద్రం గొంతు క్షీణిస్తోంది. అతని నుదుటిమీద చెమట బిందువులుఅంత చలి గాలిలో కూడా..

“ఆపద్బాంధవా! జగద్రక్షకా! నా రామచంద్రాన్ని రక్షించు” తడబడుతూ భూషణం రెండు చేతులూ పైకెత్తి జోడించాడు.

రామచంద్రం వగరుస్తున్నాడు. అతని కళ్ళు పిచ్చిగా ఉన్నాయి. పెదవుల చివరినుండి నురగ కక్కుతున్నాడు. అది చూసిన నాగభూషణం “బాబోయ్” అని వెర్రికేక పెట్టాడు. నిలువునా వణకిపోతున్నాడు.

 “వీడి శవాన్ని యింటికి తీసుకు వెళ్ళి చెల్లెలికి ఎలా చూపించనురా” అంటున్నాడు. రామచంద్రం కళ్ళు తెరచి “నా పెళ్ళాం…” అని అస్పష్టంగా అని నిస్పృహలోకి జారిపోయాడు.

అవధానిగారు ఆగారు. గత స్మృతుల పునశ్చరణవలన ఆయన గొంతు ఉద్రేకంతో బాధతో నిండింది. మేమందరం వూపిరాపి వింటున్నాం. ఆచారి బల్లని రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకుని పళ్ళు బిగించి వింటున్నాడు. కొవ్వొత్తి జాలిగా రామచంద్రం ప్రాణంలాగా వెలుగుతోంది. 

తోటలో ఏమీ ఎరగనట్టు, ఈ మాటలేవీ విననట్టు చెట్లు చీకటిలో నిశ్శబ్దంగా నుంచున్నాయి ఒక – నిముషం ఆగి అవధానిగారు చెప్పడం సాగించారు.

భయంకరమైన మృత్యువు ఎదురుగా రామచంద్రం గుండెలమీద కూర్చుంది. ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరు, అడవిలో మృత్యువులాంటి చీకటి. మృత్యుదేవత నవ్వులాంటి బూడిదరంగు వెన్నెల, నాగభూషణం రెండు చేతులతోనూ నమస్కరించి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నాడు. నేను కొయ్యబారిపోతున్నాను. కాలం కదలడం లేదు, తన యినుప పిడికిలితో మా తలలమీద నొక్కు తోంది. కారులో మూడు ప్రాణాలు. ఒక ప్రాణం కథావశిష్టంగా అయిపోతోంది. తక్కిన రెండు ప్రాణాలూ నీరసించి అచేతన స్థితిలోకి జారిపోతున్నాయి. అసలే అడవి-అందులో కాళ్ళ ముందు శవం, శవప్రాయమైన రామచంద్రం. పట్టణంలో సుఖ జీవితానికీ, నౌకర్లకీ, అబద్దాలకీ, భేషజాలకీ అలవా టైన కృత్రిమ సుకుమారమైన జీవులకి యింతకన్న ఆపద ఏముంది? ఇంతలోకి అడవిలో కాస్త దూరంలో ఒక చోట గప్పున మంట రేగింది. బలహీనమైన నా మనస్సు ఇంక తట్టుకోలేకపోయింది.

 “బాబోయ్ దెయ్యం ” అని అరచి వెనక్కి పడిపోయాను..

బహుశా అయిదారు నిముషాలలోనే తెలివి వచ్చి వుంటుంది. కళ్ళు తెరచి చూశాను. స్టీరింగుకీ సీటుకీ మధ్యగావుంది నా తల. మెల్లగా లేచి భయంగా వెనుక సీటులోకి చూశాను. 

నాగభూషణం సీటునానుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. “మామయ్యా” అన్నాను నేను.

భూషణంకి దుఃఖం పొరలు పొరలుగా వస్తోంది. ఆడదానిలా ఏడ్చేస్తున్నాడు. నాకేం తోచలేదు. ఏదో చెప్పాలనుకున్నానుగాని నాకూ మాట పెకిలి రావడం లేదు. రామచంద్రం నోటి చివరల నుంచి నురగ వెన్నెలలో పొంగుతూన్న సోడాలాగ వుంది. అతని తెల్లని అందమైన మొహంమీద వెన్నెలపడి ఏడుస్తూన్నట్టుంది. బరువుగా తీసే వూపిరి వలన అతని గుండెలు కిందకీ పైకీ లేస్తున్నాయి, మృత్యువుతో ముఖాముఖీ, ముష్టాముష్టి యుద్ధం చేస్తున్నాడు రామచంద్రం. 

“మనంకూడా చచ్చిపోతాంరా. ఈ అడవిలో దిక్కుమాలిన చావు చస్తాంరా. మన కెంత గతి పట్టిందిరా” ఏడుస్తూనే అన్నాడు నాగభూషణం.

“పారిపోదాం మామయ్యా” అంతకంటె ఏడుస్తూ అన్నాను నేను.

“ఎక్కడికి?” – “పరుగెత్తుకుపోదాం, గూడెంవరకూ పరుగెత్తుకుపోదాం.”

 “రామచంద్రం. “ 

“వదిలేద్దాం. ఎలాగూ చచ్చిపోతాడుగా.”

నాగభూషణం ఆలోచనలో పడ్డాడు. అవును. చచ్చే రామచంద్రం కోసం యిద్దరుకూడా ఎందుకు చావాలి? అయితే పరుగెత్తగలమా, మాట రావడంలేదే. యింక కండలలోకి వోపిక ఎలా వస్తుంది? కొంతదూరం వెళ్ళి ఆగిపోతే అక్కడ గతి ఏమిటి?’ ఈ కారుకూడా ఉండదే పడుకొని చావడానికి!

ఆ నిముషంలో స్వార్థంకన్నా గొప్పశక్తి ప్రపంచంలో లేదని – తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలూ, ఆశయాలూ అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయాన్ని కలిగించనంతవరకే, ప్రతీ మనిషి లోపల్లోపల ఒక పాము! 

“అయితే రోడ్డమ్మట పాములుంటాయి ఎలాగ?” అన్నాడు నాగభూషణం.

అవును అక్కడ వుండలేం, అలాగని ఎక్కడికీ వెళ్ళలేం, _ అరణ్యం మా చుట్టూ కనపడని ఉచ్చులు పన్ని వుంచింది, ఏన్నో మైళ్ళు పరుగెత్తితేకాని గూడెం రాదు. భగవాన్. ఎందుకిలాగ బాధిస్తున్నావు? ఆశలేదు. ధైర్యం లేదు. అక్కడ చెట్ల ఆకుల్ని తిని _ బతికే కీటకంకన్నా మానవుడు నికృష్టంగా అయిపోతున్నాడు. – నీచంగా, దిక్కు లేకుండా చచ్చిపోతున్నాడు. ” – 

రామచంద్రం కదలినట్లయింది. “రామచంద్రం” అని పిలి _చాడు నాగభూషణం. 

రామచంద్రం మెలికలు తిరుగుతున్నాడు. గుప్పిట మూస్తున్నాడు. మళ్ళీ పిలిచాడు భూషణం. రామచంద్రం తెలివిలో లేడు, అతని ప్రాణం విపరీతమైన బాధపడుతోంది. అతని దేహం వంకరలు తిరుగుతోంది. 

భూషణం చూడలేక కళ్ళు మూసుకున్నాడు. “దేవుడా!” అంటూ కాతరంగా ఆర్త నాదం చేశాడు. అడవి అంతా ప్రతిధ్వనించినట్టయింది. నాకు – నాలిక పిడచకట్టుకుపోతోంది. 

Leave a Reply