Apple PodcastsSpotifyGoogle Podcasts

కూపే

‘కూపే’ ( మూలం: రేమండ్ కార్వర్ కథ ‘కంపార్ట్మెంట్’)

అమెరికన్ రచయిత రేమండ్  కార్వర్ కథల్లో  అత్యంత ప్రాచుర్యం పొందిన రచనల్లో ‘Compartment’ ఒకటి. కథాంశం ఎనిమిదేళ్లుగా దూరమైన కొడుకుని కలవడం కోసం మేయర్స్ అనే వ్యక్తి చేసే ప్రయాణం. 

సంభాషణల ద్వారా లేదా రచయిత జోక్యం ద్వారా కాకుండా, మేయర్స్ మనసులో ఆలోచనలూ, అతని చుట్టూ కనపడుతున్న వాతావరణం లో అతను గమనించే విషయాలూ వీటి  గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తూ కథను ముందుకు తీసుకెళ్తారు రచయిత. మేయర్స్ వ్యక్తిత్వాన్ని తేటతెల్లంగా మన ముందుంచడానికి రచయిత చేసిన ప్రయత్నం ప్రతి వాక్యంలో కనపడుతుంది. కథలో  అప్రస్తుతం  అని మనకనిపించే రచయిత ఇచ్చిన  కొన్ని వివరాలు , ప్రయాణంలో క్రమంగా అతని ఆలోచనలో వచ్చిన మార్పుని, ముగింపునీ మనం అర్థం చేసుకోడానికి వుపయోగపడతాయి.  ఉదాహరణకి కథలో మేయర్స్ చూసిన కలిసిన ప్రతి వ్యక్తి మేయర్స్ కు తెలీని భాషలో మాట్లాడతారు. ఇది మేయర్స్ వ్యక్తిత్వంలో ఉన్న ఇబ్బందిని మనకు సూచిస్తుంది.

ముగింపు తెల్సుకుని మరిచిపోయే కథ కాదు ‘కంపార్ట్మెంట్’. 

కథపై మీ ప్రతిస్పందన తెలియజేయడానికి harshaneeyam@gmail.com కి మెయిల్ చెయ్యండి. 

‘కూపే’:

మేయర్స్ మొదటి తరగతి కూపేలో ప్రయాణిస్తున్నాడు.   ఫ్రాన్సులోని స్ట్రాస్బెర్గ్ యూనివర్సిటీ లో చదువుతున్న  కొడుకుని కలవడానికి ఈ ప్రయాణం. కొడుకుని చూసి ఎనిమిదేళ్లయింది. ఆ అబ్బాయి తల్లితో మేయర్స్ విడిపోయిన తర్వాత ఈ  ఎనిమిదేళ్లలో ఫోన్లో వాళ్ళిద్దరూ ఎన్నడూ మాట్లాడుకోలేదు. కనీసం ఓ ఉత్తరం ముక్క కూడా  లేదు… .  కొడుకు  తల్లితోనే ఉంటున్నాడు. వాడి పాడు జోక్యం వల్లే, చివరన తామిద్దరం అంత తొందరగా విడిపోయావని మేయర్స్ గట్టి నమ్మకం. తమ పెనుగులాటలో వాడు తన మీదకి దూకినప్పుడే ఆఖరు సారి వాణ్ణి  చూడ్డం. పక్కనే నించుని  తన  భార్య ఒక్కొక్కటిగా  పింగాణీ గిన్నెలు ముందు గదిలోకి విసరడం మొదలెట్టి,  కప్పుల మీదికొచ్చింది. తాను   “ఇంక ఆపేయ్” అని గట్టిగా కేక పెట్టడంతో, వాడు ఒక్క ఉదుటున  మీదికి  వచ్చేసాడు. మేయర్స్ గబుక్కున పక్కకు జరిగి, వాడి తలను తన చంకకీ చేతులకీ మధ్య గట్టిగా  ఒడిసిపట్టుకున్నాడు. వాడు ఏడుస్తూ, మేయర్స్ వీపు మీద, పొత్తికడుపు మీద ఆపకుండా  గుద్దేసాడు. మేయర్స్ పట్టిన  పట్టు విడవకుండా,  అందిన కొద్దీ  చితక బాదేశాడు.  వాణ్ణి దడాల్న వెనక్కి  తోసి,  గోడకి అదిమిపెట్టి, చంపుతానని బెదిరించాడు. చంపేసేవాడేమో ఆ కోపంలో.. . తను అప్పుడు ఏవన్నాడో ఇంకా గుర్తుంది, “ నీకీ బతుకిచ్చిందే నేను, వెనక్కి తీసుకోగల్ను కూడా , జాగర్త”

ఆ  భయానక దృశ్యం తల్చుకుని ఒక్కసారి మేయర్స్ గట్టిగా  తల విదిలించాడు, అదేదో ఇంకెవరికో జరిగిన సంఘటనలా.  అవును…. తాను కూడా ఇంతకు మునుపులా లేడు. ఒంటరిగా బతుకుతున్నాడు. తన పనేదో తను చూసుకుంటూ, వేరే ఎవ్వరితో సంబంధం లేకుండా.  రాత్రి పూట శాస్త్రీయ సంగీతం వింటూ,  ‘నీటి పక్షులకు ఉచ్చులు ఎలా తయారు చేయాలి’  అనే విషయం మీద పుస్తకాలు చదువుకుంటూ పొద్దు పుచ్చుతున్నాడు. 

తలుపుకు అవతల సీట్లో కూర్చోనున్న వ్యక్తి తన టోపీని కళ్ళ మీదకు లాక్కుని నిద్ర పోతున్నాడు.  మేయర్స్ అదేవీ పట్టించుకోకుండా, సిగరెట్ వెలిగించి, తదేక దృష్టితో  కిటికీలోంచి బయటికి చూడ్డం మొదలుపెట్టాడు. అపుడపుడే తెల్లవారుతోంది. పక్కనించీ వెళ్లిపోతున్న పచ్చని పొలాల మీద పొగమంచు పల్చని తెర కప్పింది. అక్కడక్కడా పొలాల మధ్యలో కట్టుకున్న బంగళాలూ,  వాటి చుట్టూ కట్టిన ప్రహరీ గోడలూ. 

 ‘ఇలాంటి ఇళ్ళల్లో  బావుంటుంది, పాత కాలం ఇల్లూ, చుట్టూ వుండే పెద్ద గోడ.’ అనుకున్నాడు మేయర్స్. 

టైము ఆరుగంటలు దాటింది.  ముందు రోజు  రాత్రి పదకొండు గంటలకి మిలాన్ లో రైలు ఎక్కినప్పట్నించీ నిద్రే పోలేదు. రైలు మిలాన్ స్టేషన్ దాటిన తర్వాత అనుకున్నాడు ‘ అదృష్టం..  కూపే లో నేనొక్కణ్ణే!’. లైటుంచి, టూరిస్టు గైడు పుస్తకాలు తిరగేయడం మొదలెట్టాడు. ఇటలీలో ఏమేం చూసుండొచ్చో, చేసుండొచ్చో అర్థం అవుతోంది. ఇటలీకి రావడం ఇదే మొదటి, ఆఖరిసారి కచ్చితంగా. వదిలివెళ్లే  సమయంలో  ఆ దేశం గురించి   తెలుసుకోడం  .. కొంత  బాధగానే  వుంది.  

పుస్తకాలు సూటుకేసులో ఉంచి, సూటుకేసు పై  అరలో పెట్టాడు.  కోటు బయటికి తీసి దుప్పటిలా కప్పుకున్నాడు. లైటు ఆర్పేసి, నిద్ర పడుతుందన్న ఆశతో,  కూపే చీకట్లో అలా కళ్ళు మూసుకు కూర్చున్నాడు. చాలా సమయం గడిచిపోయింది అనిపించింది.  సరిగ్గా నిద్ర పట్టే సమయంలో, రైలు నడక మందగించడం  మొదలైంది.  రైలు బాసెల్ అవతల వుండే ఒక చిన్న స్టేషన్లో ఆగింది. ఒక నడివయసు మనిషి , తల మీద టోపీ తో, ముదురు రంగు కోటు వేసుకుని, కూపేలోకి ప్రవేశించాడు. మేయర్స్ తో, తెలీని భాషలో ఏదో మాట్లాడి  , తనతో పాటూ తీసుకొచ్చిన లెథర్ బాగ్ పక్కన పెట్టాడు. కూపేలో  అవతలి వైపు కూర్చొని  భుజాలు తిన్నగా చేసుకున్నాడు. టోపీ కళ్ళమీదకి లాక్కుని, రైలు కదిలే లోపలే, సన్నని గురకతో నిద్ర పోవడం మొదలుపెట్టాడు. మేయర్స్ కి అతన్ని చూస్తే అసూయ కలిగింది. 

కొంతసేపటి తర్వాత  ఒక స్విస్ ఆఫీసర్  కూపే తలుపు తెరిచి,  లోపలికొచ్చి  లైటు వేసి  పాస్ పోర్టులు  చూపించమని అడిగాడు,ఇంగ్లీషు తో పాటూ ఇంకేదో భాషలో కూడా (జర్మన్ అయుండొచ్చు).  మేయర్స్ తో పాటూ కూపే లో కూర్చొని వున్న వ్యక్తి, టోపీ వెనక్కి తోసి,కళ్ళు చిట్లించి, కోటు జేబులో చేయ్యిపెట్టాడు. ఆఫీసర్  అతని  పాస్ పోర్ట్ పరిశీలించి, అతడి వైపు నిశితంగా చూసి, వెనక్కి తిరిగి ఇచ్చేసాడు. మేయర్స్ తన పాస్పోర్ట్ ఇస్తే,  అందులో వున్న సమాచారం చదివి, ఫోటోని పరికించి, మేయర్స్  వైపు చూసి, తల ఆడించి,  వెనక్కి ఇచ్చేసాడు. వెళ్ళబోతూ  లైట్ ఆపేసాడు. మేయర్స్ ఎదురుగా కూర్చుని వున్న వ్యక్తి టోపీ కళ్ళమీదకి లాక్కుని, కాళ్ళు జాపుకున్నాడు. ‘ఇతను వెంటనే నిద్ర పోతాడు’ అనుకున్నాడు మేయర్స్ తిరిగి అసూయతో. 

అలానే మేలుకుని,  కొడుకును కలవబోయే విషయం గురించి  ఆలోచించడం మొదలెట్టాడు.  ఇంకొన్ని గంటలే వుంది వాణ్ణి కలవడానికి. వాణ్ణి స్టేషన్లో చూడగానే నేను ఏం చేస్తాను? వాణ్ణి దగ్గరకు తీసుకోవాలా? ఆ ఊహే అతన్ని ఇబ్బంది పెట్టింది. లేదంటే, చెయ్యి కలిపి, ఈ ఎనిమిదేళ్ళూ ఏవీ జరగనట్టు ఓ నవ్వు నవ్వి, వాడి భుజం తట్టాలా?   వాడు కూడా  నాలుగు మాటలు మాట్లాడతాడేవో? ‘నిన్ను కలవడం బావుంది’, ‘నీ ప్రయాణం ఎలా జరిగింది…’  లాటివి. అపుడు తను ఏదో ఒక సమాధానం ఇస్తాడు. నిజంగా ఏవనాలో  తెలీడం లేదు. 

ఫ్రెంచ్ ఆఫీసర్ కూపేలోకి వచ్చాడు. మేయర్స్ వైపు, ఆ నిద్రపోతున్న వ్యక్తి వైపు చూసాడు. ఆఫీసరు  ఇంతకు మునుపు  టిక్కెట్లు పరిశీలించిన మనిషే .  మేయర్స్ తల పక్కకు తిప్పి మళ్ళీ కిటికీలోంచి బయటకు చూసే పనిలో పడ్డాడు.  ఇంకొన్ని ఇళ్ళు కనపడ్డం మొదలెట్టాయి. అయితే ఇప్పుడు వాటికి గోడలు లేవు.  చిన్నవిగా ఉండి, పక్క పక్కనే  వున్నాయి ఆ ఇళ్ళు . 

 ‘ఇంకొంచెం సేపట్లో  ఎదో ఫ్రెంచ్ గ్రామం కనపడుతుంది కచ్చితంగా’   అనుకున్నాడు మేయర్స్. 

పొగమంచు తొలిగిపోతోంది. రైలు కూత పెట్టి, అడ్డుపెట్టున్న క్రాసింగ్ పక్కనించీ  పరుగులు తీస్తోంది.  వేగంగా పరిగెడుతున్న ఆ రైలు బోగీలను చూస్తూ ఒక యువతి జుట్టు పైముడితో, స్వెటర్ వేస్కుని, సైకిల్ పట్టుకుని నిలబడుంది.   

‘మీ అమ్మెలావుంది?’ స్టేషన్ నించీ కొంచెం దూరం వచ్చినతర్వాత అడుగుతాడు తాను. 

‘మీ అమ్మ ఏవంటోంది?’ 

 ‘ఆమె చనిపోయుండొచ్చు!’,  అని అకస్మాత్తుగా మేయర్స్ కి అనిపించింది. మరుక్షణం అనుకున్నాడు, లేదు! అదే జరిగుంటే, తనకు తెలీకుండాపోయే అవకాశమే లేదు.  ఏదో రకంగా తెలిసుండేది. ఏదో రకంగా… అతనికి తెలుసు ఇలాంటి విషయాలన్నీ ఆలోచిస్తూ పోతే, తన గుండె పగలొచ్చు. మేయర్స్ చొక్కా పైగుండీ పెట్టుకుని, టై బిగించాడు. పక్కనున్న సీటుమీద కోటును పరిచి, షూ లేసులు కట్టుకున్నాడు.  పైకి లేచి, నిద్ర పోతున్న వ్యక్తి కాళ్ళు దాటుకుని, కూపే నించి బయటపడ్డాడు. బోగీ  చివర భాగానికి నడుస్తూంటే  తాను పడిపోకుండా  ఊతంగా బోగీ కిటికీలను చేత్తో పట్టుకోవలిసి వచ్చింది. టాయిలెట్ తలుపు వేసి గడియ పెట్టాడు. కొళాయి తిప్పి ఆ నీళ్లను మొహం మీద చల్లుకున్నాడు. రైలు విపరీతమైన వేగంతో మలుపు తిరుగుతోంది. పక్కకు పడిపోకుండా, సింకును పట్టుకున్నాడు. 

రెండు నెలల  కింద వచ్చింది వాడి వుత్తరం. క్లుప్తంగా వుంది, ఒక ఏడాది నించీ ఫ్రాన్సులో ఉంటున్నాననీ,  స్ట్రాస్ బర్గ్ యూనివెర్సిటీ లో చదువుతున్నాననీ.  అది కాక, అసలు ఫ్రాన్స్ ఎందుకు రావలసి వచ్చిందో, రాక ముందు ఏవి చేస్తున్నాడో,  ఇలాటి వివరాలు ఏవీ లేవు. అలానే వాళ్ళ అమ్మ గురించి ప్రస్తావన గానీ , ఆమె ఎక్కడ, ఎలాఉందని గానీ ఏ రకమైన సూచనలూ లేవు ఆ ఉత్తరంలో. కానీ వాడు  ఉత్తరాన్ని ‘ప్రేమతో’ అని ఎందుకు ముగించాడో అర్థం కాలేదు. మేయర్స్ అదే విషయం గురించి చాలాసేపు లోతుగా  ఆలోచించి చివరకు  తిరుగు జవాబు రాసాడు.  కొంతసేపు మనసులో చర్చించుకుని, తాను  యూరప్ లో కొద్ది  రోజులు గడపాలని అనుకుంటున్నట్టుగా, ఉత్తరంలో రాసాడు.  

‘వాడు స్టేషన్ వచ్చి తనను  కలవడానికి ఇష్టపడతాడా?’  మేయర్స్  ఉత్తరం చివరన   ‘ప్రేమతో – నాన్న’ అని సంతకం చేసాడు. 

ఆ ఉత్తరానికి  వాడు సమాధానం ఇచ్చిన తర్వాత ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.  మేయర్స్ కు తన సెక్రెటరీ, కొంతమంది తోటి ఉద్యోగస్థులు, కాకుండా  తన దూర ప్రయాణం గురించి తెలుసుకోవలసిన  వాళ్ళు,  ఇంకెవరూ లేరు  అని హఠాత్తుగా స్ఫురించింది.   పనిచేస్తున్న ఇంజనీరింగ్ కంపెనీలో ఆరువారాల సెలవు పోగు చేసున్నాడు తను. ఇప్పుడు ఆ సెలవంతా ఈ ప్రయాణం పేరుతో  వినియోగించుకోబోతున్నాడు. మొత్తం  సమయం యూరప్లోనే గడిపే ఉద్దేశం లేదు కానీ,  సెలవు పెట్టినందుకు  మటుకు సంతోషంగా వుంది. 

మొదట రోమ్ కి వెళ్ళాడు. అక్కడ,  ఒక్కడే రోడ్ల మీద కొన్ని గంటలు  తిరిగిన తర్వాత, ఏదన్నా గ్రూపుతో కల్సి తిరిగే ఏర్పాటు చేసుకోనందుకు బాధ పడ్డాడు. తాను ఒక్కడే అయిపోయాడు. తను తన భార్య కలిసి వెళదాం అని ఎన్నోసార్లు అనుకున్న ‘వెనిస్’  కి వెళ్ళాడు. అయితే వెనిస్ అతన్ని నిరుత్సాహ పరిచింది. వెనిస్ లో  ఒంటి చేతి మనిషి ఒకడు , పది కాళ్ళుండే స్క్విడ్ ను తినటాన్ని చూసాడు. నీటి మరకలతో, మట్టి కొట్టుకుని వున్న భవనాలను చూసాడు. అక్కణ్ణించీ మిలాన్ కు రైల్లో వచ్చి ఒక పెద్ద హోటల్ లో దిగి, రాత్రంతా కూర్చుని , ప్రసారం ఆగిపోయేదాకా సోనీ కలర్ టీవీలో ఫుట్ బాల్ మ్యాచ్ చూసాడు.పక్కరోజు పొద్దున లేచి మిలాన్ అంతా,  అటూ ఇటూ తిరిగి, రైలు బయలుదేరే సమయానికి స్టేషన్ కి వచ్చాడు.   స్ట్రాస్బర్గ్ లో ఆగి  ఉండడానికి ఏర్పాట్లు చేసుకోనున్నాడు. ఒక రోజో, రెండు రోజులో , మూడు రోజులో … అక్కడ పరిస్థితిని బట్టి గడిపి, అక్కడనించి పారిస్ వెళ్లి,  అమెరికాకి విమానంలో  వెళ్ళిపోతాడు. తాను ఏవంటున్నాడో,  ముక్కు మొహం తెలీని వాళ్ళతో చెప్పడానికి  ప్రయత్నించి, ప్రయత్నించి, అలిసిపోయాడు. వెనక్కి వెళ్తూండడం ఆనందంగా  వుంది. 

ఎవరో  టాయిలెట్ తలుపు తీడానికి ప్రయత్నించారు. మేయర్స్ టక్ చేసుకోటం పూర్తి చేసి బెల్టు పెట్టుకున్నాడు. తలుపు తీసి, రైలు కదలికకు అటూ ఇటూ ఊగుతూ, వెనక్కు  తన కూపే వైపు నడిచాడు. తలుపు తీగానే, ఏ సీటు మీదయితే తాను కోటు వదిలేసాడో అక్కడ లేదు. వేరే సీట్లో కనపడింది.  తానొక  అర్థంలేని,   ఆందోళనకరమైన పరిస్థితిలో అడుగుపెడ్తున్నట్టుగా అనిపించింది.  కోటు చేతిలోకి  తీసుకుంటూంటే గుండె వేగంగా కొట్టుకోడం మొదలైంది. చేతిని లోపలి జేబులోకి పోనిచ్చి పాస్పోర్ట్ని బయటకి తీసాడు. పర్సుని పాంటు వెనక జేబులో పెట్టుకుంటాడు తాను. పర్సు , పాస్పోర్ట్ రెండూ ఉన్నాయి. కోటు  మిగతా జేబులన్నీ వెతికాడు.కనపడకుండా పోయింది, కొడుకు కోసం కొన్న ఆ బహుమతి. ఖరీదైన జపాను వాచీ, రోములో ఒక దుకాణంలో కొన్నాడు. జాగర్త కోసం కోటు లోపలి జేబులో పెట్టుంచాడు. ఇప్పుడు ఆ వాచీ పోయింది. 

సీట్లో జారగిలిపోయి కాళ్ళు చాపుకుని, కళ్ళమీద టోపీ అడ్డుగా పెట్టుకునివున్న ఆ వ్యక్తితో “క్షమించాలి” అన్నాడు.  “క్షమించాలి” మళ్ళీ రెట్టించాడు. టోపీ వెనక్కి తోసి అతడు కళ్ళు తెరిచాడు. కొంచెం సర్దుకుని కళ్ళు పెద్దవి చేసి మేయర్స్ వైపు చూసాడు. 

 ‘కలలు కంటున్నాడేమో?….. కాదేమో’?. 

“ఎవరన్నా ఇటు  రావడం చూసారా?” అడిగాడు మేయర్స్. 

మేయర్స్ ఏమంటున్నదీ అతనికి  తెలీడం లేదని, అర్థం అవుతోంది. అతను అలానే మేయర్స్ వైపే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. మేయర్స్ కి ఆ చూపులో అయోమయం తప్ప ఇంకేమీ కనపళ్ళేదు  .  ‘ఆ చూపు వెనకాల ఏవుంది’?  ‘తన కుయుక్తికీ ,  మోసానికి ఆ చూపుతో  ముసుగు వేస్తున్నాడా?’ .

మేయర్స్  తన కోటు దులిపి అతని దృష్టి అటువైపు మళ్లించేందుకు  ప్రయత్నించాడు. చేతులు కోటు జేబుల్లో పెట్టి వాటిని అటూ ఇటూ తిరగేసాడు. చొక్కా చేతులు పైకి మడిచి అతడికి తన వాచీ చూపించాడు.అపుడతను మేయర్స్ వైపు, తర్వాత మేయర్స్ వాచీ వైపు చూసాడు. ఆ చూపుల్లో గందరగోళం  కనపడుతోంది. మేయర్స్ తన వాచీ మీద  వేళ్ళతో తట్టి చూపించాడు.  ఇంకో చెయ్యి మళ్ళీ కోటు జేబులో పెట్టి దేని కోసమో  వెతుకుతున్నట్టుగా తడిమి చూపించాడు.  తన వాచీని ఇంకోసారి చూపించి, చేతి వేళ్ళతో వాచీని అటూ ఇటూ కదిపి  వాచీ  బయటికి ఎగురుకొనివెళ్లినట్టుగా సంజ్ఞ చేసాడు. ఆ వ్యక్తి భుజాలెగరేసి తల అటూ ఇటూ ఆడించాడు. 

“ఛ” అనుకున్నాడు మేయర్స్ విసుగొచ్చి. కోటు వేసుకుని కూపే బయటికొచ్చాడు. ఆ కూపేలో ఇంకొక్క క్షణం ఉండలేకపోయాడు తను.  ఇంకో క్షణం ఉంటే అతన్ని కొట్టేవాడేమో అని భయం వేసింది. దొంగ కనపడతాడేమో అన్న ఆశ వున్నట్టు బోగీ వసారాలో అటూ ఇటూ చూసాడు. కానీ అక్కడెవరూ లేరు.  తనతో పాటూ బోగీలో వున్న వ్యక్తి ఆ వాచీ తీలేదేమో. ఇంకెవరైనా అయ్యుండొచ్చు. టాయిలెట్ తలుపు తీడానికి ప్రయత్నించి, కూపే పక్కగా నడుస్తూ వెళ్ళినప్పుడు, సీట్లో పడున్న కోటును, నిద్ర పోతున్న మనిషిని  గమనించి వుండవచ్చు.   తీరిగ్గా తలుపు తెరిచి,  కోటు  జేబులు వెతుక్కుని, మళ్ళీ తలుపేసి, వెళ్లిపోయి ఉండొచ్చు.మేయర్స్ నెమ్మదిగా బోగీలో వున్న మిగతా అన్ని కూపేలలోకి  తొంగి చూస్తూ చివరి దాకా నడిచాడు.  మొదటి తరగతి బోగీ …  జనాలు అంతగా లేరు. ఒక్కో కూపేలో ఒకరో ఇద్దరో వున్నారు. చాలా మంది నిద్రపోతూనో  ,నిద్ర పోతున్నట్టుగానో వున్నారు. కళ్ళు మూసుకొని, తలలు సీటు మీద వెనక్కి వాల్చుకుని వున్నారు. ఒక కూపేలో మేయర్స్ వయసున్న వ్యక్తి , కిటికీ పక్కనే కూర్చుని బయట కనపడే పల్లెలను, పొలాలను చూస్తున్నాడు  మేయర్స్ ఆగి అద్దంలోంచి ఆ మనిషిని చూస్తూండగా ఒక్కసారి తిరిగి మేయర్స్ వైపు తీక్షణంగా చూసాడు.  రెండో తరగతి బోగీలో  ప్రవేశించాడు మేయర్స్.  అక్కడ  ఒక్కో కూపేలో ఐదారు ప్రయాణీకులతో జనం కిక్కిరిసి ఉన్నారు. వీళ్ళు   ఇంకా నిరాశగా వున్నారు అనుకున్నాడు చూడగానే మేయర్స్.  నిద్ర పోవడానికి అస్సలు సౌకర్యంగా లేక చాలామంది మేలుకొని వున్నారు,.  మేయర్స్ వెడుతూ ఉంటే అతడి వైపే చూస్తున్నారు. “పరాయి దేశస్తులు ” అనుకున్నాడు మేయర్స్. 

తన కూపేలో వున్న మనిషి వాచీ తీసుండకపోతే , కచ్చితంగా దొంగ ఇక్కణ్నుంచే వచ్చివుండాలి. కానీ తనేం చెయ్యగలడు?  ఏవీ లాభం లేదు. వాచీ అయితే పొయినట్టే. ఇపుడు ఎవడి జేబులోకో వెళ్ళిపోయింది. ఏవి  జరిగిందో తను టీసీకి అర్థం అయ్యేలా చెప్పలేడు. చెప్పినా కూడా ఏవిటి ? మళ్ళీ వెనక్కి తన కూపే  వైపు నడిచాడు.  కూపేలో వ్యక్తి మళ్ళీ కాళ్ళు చాపుకుని టోపీ కళ్ళ మీదుంచుకుని కనపడ్డాడు. అతడి కాళ్ళు దాటుకొని , కిటికీ పక్కన తన సీట్లో కూర్చున్నాడు మేయర్స్ . వొళ్ళు తెలీనంత కోపం. రైలు ఏదో నగరం పొలిమేరలను సమీపించింది.  పొలాలు, తోటల స్థానంలో, ఉచ్ఛరించలేని పేర్లతో బోర్డులున్న ఫ్యాక్టరీలు కనపడ్తున్నాయి. రైలు వేగం తగ్గింది.  మేయర్స్ కి  నగర వీధుల్లో వాహనాలు, క్రాసింగుల దగ్గర రైలు వెళ్ళిపోతే , దాటడానికి వరసలో నిల్చున్న మనుషులు  కనపడుతున్నారు. లేచి సూటుకేసు  కిందికి దించాడు. దాన్ని  ఒళ్ళో పెట్టుకొని, బయట కనపడుతున్న  ఆ హేయమైన ప్రదేశాన్ని చూడ్డం మొదలెట్టాడు .  

‘అసలు వాణ్ణి   ఎప్పుడూ చూడాలనుకోలేదు’ అనుకున్న విషయం తలపులోకి వచ్చింది. 

 అతను దిగ్బ్రాంతికి గురయ్యాడు. ఒక్క క్షణం ఆ ఆలోచనలో వున్న క్రూరత్వం అతణ్ణి చిన్నబోయేలా చేసింది.  తల విదిలించాడు.  తన  జీవితంలో చేసినవన్నీ మూర్ఖపు పనులే. వాటన్నిటినీ మించింది…  ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయాణం.  తన ప్రవర్తనతో ఎప్పుడో తన ప్రేమకు దూరం అయ్యాడు వాడు. నిజం ఏవిటంటే, వాణ్ణి  కలవాలనే కోరిక తనకు ఏనాడూ  లేదు.  అకస్మాత్తుగా, తనమీదకి  దూకుతున్న వాడి  మొహం పూర్తి స్పష్ఠతతో గుర్తుకొచ్చింది. పగతో రగిలిపోయాడు  మేయర్స్. వీడు తన  యవ్వనాన్ని అంతా మింగేశాడు.  ఏ అమ్మాయినైతే తాను  వలచి పెళ్లి చేసుకున్నాడో  ఆమెను ఒక దౌర్బల్యమైన తాగుబోతుగా మార్చేశాడు. ఇంత దూరం వచ్చింది తాను  ద్వేషించే ఒక వ్యక్తిని కలవడానికా ? అని తన్ను తాను ప్రశ్నించుకున్నాడు మేయర్స్. 

వాడితో  చెయ్యి కలపాలి అనుకోవడం లేదు. …తన శత్రువు చెయ్యి… అదేకాదు, వాడి భుజం తట్టడం, వాడితో అవీ ఇవీ మాటాడ్డం కూడా.  వాడి  తల్లి గురించి తెలుసుకోవాలని కూడా లేదు తనకు. 

రైలు స్టేషన్లో ప్రవేశిస్తోంది. సీటులో ముందుకు జరిగి కూర్చున్నాడు. బోగీ లో వున్న మైకులో ఫ్రెంచ్ భాషలో ఏదో ప్రకటిస్తున్నారు. ఎదురుగా కూచున్న మనిషిలో కదలిక మొదలయ్యింది.  తన టోపీ సవరించుకుని, అతడు సీట్లో సర్దుకుని కూచుంటూ ఉంటే, మళ్ళీ ఫ్రెంచ్ భాషలో ఇంకేదో ప్రకటన మొదలైంది. మేయర్స్ కి ఒక్క ముక్క అర్థం కాలేదు. మేయర్స్ రైలు నెమ్మదించి ఆగుతుంటే, ఇంకా ఇంకా ఇబ్బందికి గురౌతున్నాడు.  కూపే వదిలి బయటకు వెళ్ళేది లేదు అని నిశ్చయించుకున్నాడు. ఎక్కడైతే కూచుని వున్నాడో రైలు కదిలేదాకా అక్కణ్ణుంచి కదలడు తను. అదే రైల్లో పారిస్ వెళ్ళిపోతాడు….  అంతే.   అద్దం లోంచి వాడి మొహం కనపడుతుందేమోనని భయపడ్తూ, కిటికీలోంచి జాగర్తగా బయటికి చూసాడు.  కనపడితే ఏవి చెయ్యాలో తెలీదు. వాడి మీదకి  పిడికిలి విసురుతానేమోనని అతడికి భయం వేసింది.కొంతమంది  కోట్లు వేసుకుని, స్కార్ఫ్ లు  కట్టుకొని రైలు ఎక్కడానికి ,  ప్లాట్ఫారం మీద నిలబడున్నారు. కొంతమంది జేబులో చేతులుంచుకుని, సామాన్లు ఏవీ లేకుండా,ఎవరినో కలుద్దాం అని వచ్చి, వేచి చూస్తున్నారు. ఆ వేచి చూసే వాళ్లలో తన కొడుకు లేడు. కానీ దానర్థం వాడు అక్కడెక్కడా లేడని కాదు. మేయర్స్ సూటుకేసుని ఒళ్ళో నుంచి తీసి, కింద పెట్టి,  సీట్లో కిందికి ఒదిగి కూచున్నాడు. 

ఎదురుగా కూచుని వున్న మనిషి ఆవులించి, కిటికీ బయటకి చూసాడు. తర్వాత  తన దృష్టి మేయర్స్ వైపు సారించాడు. తన టోపీ తీసి, జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి సవరించుకున్నాడు. మళ్ళీ టోపీ పెట్టుకుని నిలబడి, తన బాగ్ ని అరలోంచి కిందికి లాగాడు. కూపే తలుపు తీసాడు. వెళ్లబోయే ముందు, వెనక్కి తిరిగి , స్టేషన్ వైపు చెయ్యి చూపిస్తూ ‘స్ట్రాస్ బర్గ్’ అన్నాడు. ఇంకో  వైపు తిరిగాడు మేయర్స్. 

ఇంకో క్షణం చూసి కూపే బయటికి బాగ్ తో సహా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ‘కచ్చితంగా వాచీ తీస్కొని పోతున్నాడు వీడు’ అనుకున్నాడు మేయర్స్. కానీ మేయర్స్ కున్న సమస్యల్లో  ‘వాచీని పోగొట్టుకోడం’  చాలా చిన్న సమస్య. మేయర్స్ బయట స్టేషన్ డోరు దగ్గర నించుని సిగరెట్ తాగుతూ వున్న ఒక మనిషిని చూసాడు. అతను, ఇద్దరు రైల్వే ఉద్యోగస్తులు  ఒక ఆడ మనిషికి  ఏదో వివరిస్తూ ఉంటే,  వాళ్ళను  చూస్తూ నిల్చొని వున్నాడు. ఆవిడ చేతిలో ఒక  పసిబిడ్డ వుంది. ఆమె వాళ్ళు చెప్పేది విని తల ఆడించి మళ్ళీ వినడం చూస్తున్నాడు మేయర్స్. ఒక చేతి లోంచి ఇంకో చేతికి బిడ్డను మారుస్తూ వుంది. వాళ్లింకా ఏదో చెప్తూనే వున్నారు. ఆమె వింటోంది. వాళ్లలో ఒకడు ఆ పసిబిడ్డ గడ్డం ముద్దుగా తడిమాడు. ఆమె పాప వైపు చూస్తూ నవ్వింది. మళ్ళీ బిడ్డను కదిపి  వినడం మొదలెట్టింది. ప్లాట్ఫారం మీద కొంత దూరంలో, ఒక జంట కౌగిలించుకుంటూ కనపడ్డారు. యువకుడు యువతిని తన కౌగిలి నించి  వదిలిపెట్టాడు. ఏదో మాట్లాడి, సూటుకేస్ను చేతిలోకి తీస్కుని,  రైలు వైపు  కదిలాడు. ఆ అమ్మాయి  అతణ్ణే చూస్తూ నిలుచుంది.  చెయ్యి మొహానికి దగ్గరగా చేర్చి, చేతి కింది భాగంతో ఒక కంటి తర్వాత ఇంకో కంటిని అద్దుకుంది.  మరు నిముషంలో ఆ అమ్మాయి మేయర్స్ ఉన్న బోగీనే చూస్తూ, ప్లాట్ఫారం మీదికి రావటం, మేయర్స్ కంటపడింది. ఎవరినో అనుసరిస్తున్నట్టుగా వస్తోందామె. మేయర్స్ ఆ అమ్మాయి వైపు నించి దృష్టి మరల్చి, స్టేషన్ లో, వెయిటింగ్ రూమ్ మీద వున్న పెద్ద గడియారం వైపు చూసాడు . అటునించి ఇటు ప్లాట్ఫారం అంతా పరికించాడు. కొడుకు  ఎక్కడా కనపళ్ళేదు. నిద్ర నించి లేవకపోవడమో లేదా తను కూడా మనసు మార్చుకోవడమో, జరిగుండే అవకాశం వుంది. మేయర్స్ స్థిమితపడ్డాడు.  గడియారం వైపు చూసి, పరిగెత్తుకుంటూ తన కిటికీ వైపే వస్తున్న  యువతిని చూసాడు.  ఆమె కిటికీ అద్దం మీదికి దూకుతూందేమో అనిపించి వెనక్కి జరిగాడు. 

కూపే తలుపు తెరుచుకుంది. ఇందాక  బయట కనిపించిన  యువకుడు లోపలికొచ్చి, తలుపు మూసి , “బాంజోర్” అన్నాడు. సమాధానం కోసం వేచి చూడకుండా, అతడు తన సూటుకేసు ని పైనున్న అరలోకి విసిరి, కిటికీ వైపు కదిలాడు. “పార్డ్నెజ్మోయ్” అంటూ కిటికీ ని కిందికి దించాడు. బయటున్న  ఆ యువతీ వైపు చూసి “మారీ” అని పీల్చాడు. ఆమె  నవ్వుతూ,  కన్నీళ్లు కూడా కారుస్తోంది . ఆమె చేతులు దగ్గరకు తీసుకుని వేళ్ళను ముద్దెట్టుకున్నాడు ఆ యువకుడు. పక్కకు ఎటో చూస్తూ పళ్ళు బిగించాడు మేయర్స్.  కదిలి వెళ్ళమన్నట్టుగా రైలు ఉద్యోగుల అరుపులు వినపడుతున్నాయి. ఎవరో విజిల్ వేశారు. రైలు ప్లాటుఫారం నించి కదలడం మొదలెట్టింది. ఆ యువకుడు ఆమె చేతులు వదిలేసాడు.  కానీ రైలు వెడుతుంటే తన చేతిని  వూపుతూనే వున్నాడు.

కానీ రైలు స్టేషన్ బయటికొచ్చి, పక్కనే  వున్న ఖాళీ ప్రదేశం దాకా ప్రయాణించి అకస్మాత్తుగా ఆగింది. యువకుడు కిటికీ మూసివేసి, తలుపు పక్కనున్న సీటు వైపుకు వెళ్ళాడు. తన కోటులోంచి దిన పత్రిక తీసి చదవడం మొదలెట్టాడు.  మేయర్స్ లేచి తలుపు తీసి కూపే బయటికొచ్చాడు. తన బోగీకి పక్క బోగీ కలిసే ప్రదేశం దాకా నడిచాడు. రైలు ఎందుకు ఆగిందో అతనికి అర్థం కాలేదు. ఏదన్నా ఇబ్బందేమో? మేయర్స్ అక్కడున్న కిటికీలోంచి  చూసాడు. బయట  రైలు పట్టాలన్నీ ఒక దాంతో ఒకటి పెనవేసుకునున్నాయి. బోగీలు ఒక రైలు నించి విడిపోయి  ఇంకో రైలుతో కలుస్తున్నాయి.  అంతా గందరగోళంగా వుంది. పక్క బోగీ మీద ‘పౌస్సెజ్’ అని రాసి ఉండడం కనపడింది.  ఆ రాసిన చోట పిడికిలితో నొక్కాడు. తలుపు తెర్చుకుంది. మళ్ళీ రెండో తరగతి బోగీలోకి ప్రవేశించాడు తాను. నడుస్తూంటే, అన్ని కూపేల్లో ప్రయాణీకులు నిండిపోయి,  అపుడే సర్దుకుంటున్నారు, ఎక్కడికో దూర ప్రయాణానికి సిద్ధం అవుతున్నట్టు. ఈ రైలు ఎక్కడికి పోతోందో,  వీళ్లల్లో ఎవరినో ఒకరిని అడిగి తెల్సుకోవాలి. 

టికెట్ కొన్నప్పుడు స్ట్రాస్ బర్గ్ మీదుగా రైలు పారిస్ వెళ్తుందిఅన్నట్టుగా అర్థం  అయింది. అయితే  ఏదో ఓ  కూపేలో  తల దూర్చి   ‘ పారీ’? (అదేదో అంటారు కదా  పారిస్ ని ?)  అని  పారిస్  చేరిపోయినట్టుగా  అడగాలంటే అవమానకరంగా అనిపించింది. ఏదో పెద్దగా ఒరుసుకున్నట్టుగా శబ్దం వినపడి రైలు కొంచెం వెనక్కెళ్లింది. స్టేషన్ మళ్ళీ కనపడింది. ఇంకోసారి  కొడుకు మనసులో మెదిలాడు. ఆఖరి నిమిషంలో స్టేషన్ కు  పరిగెత్తి వచ్చి, ఆయాసపడుతూ, వెనకాల ఎక్కడైనా  నిల్చొని ఉన్నాడేమో? తండ్రికి ఏమైందో అని ఆందోళన పడుతున్నాడేమో? మేయర్స్ తల విదిలించాడు. 

అతనున్న బోగీ కీచుమని అరిచి, ఏదో తగులుకున్నట్టుగా, కింద ఒక బరువైన వస్తువొచ్చి కుదురుకున్నట్టుగా ఆక్రందన చేసింది.    పక్కనే ఒక దానినొకటి  పెనవేసుకుని కనపడుతున్న  పట్టాలను చూస్తూ,  రైలు మళ్ళీ కదుల్తోంది అని తెలుసుకున్నాడు  మేయర్స్. తిరిగి తన మొదటి తరగతి  బోగీ వైపు నడిచాడు. దినపత్రికతో వున్న యువకుడు అక్కడెక్కడా కనపళ్ళేదు. మేయర్స్ కు తన సూటుకేసు  కూడా కనపళ్ళేదు. చివరికి ఇది అతని బోగీ కాదని అర్థం అయ్యింది. రైలు కదలగానే , తన  బోగీని వదిలేసి ఆ స్థానంలో రైలు ఇంకో  రెండో తరగతి బోగీని జోడించుకుంది అని అర్థమైంది.   పొట్టి, నలుపైన శరీరాలతో అతనికి ఏమాత్రం అర్థం కాని భాషలో మాట్లాడుకుంటూన్న జనాలతో  దాదాపుగా నిండిపోయుంది అతను  నిలుచుని వున్న  బోగీ.  వాళ్ళల్లో  ఒకతను లోపలి రమ్మన్నట్టుగా సైగ చేసాడు. మేయర్స్ లోపలికి వస్తూంటే  దారినిచ్చారు కూర్చుని వున్న వాళ్ళు. అక్కడ వాతావరణం ఉల్లాస భరితంగా వుంది. సైగ చేసిన మనిషి నవ్వుతూ, తన పక్కనున్న స్థలంపై చేత్తో తట్టాడు. వీపు రైలు ఇంజిన్  వైపు వుండేట్టుగా  కూచున్నాడు మేయర్స్.  బయట కనపడ్తున్న  పల్లె వాతావరణం వేగంగా మాయమౌతోంది. 

ఎక్కడికో వెళ్తున్నాడు తాను. అర్థమౌతోంది. ఆ  మార్గం సరైనది కాకపోతే, ఎపుడో ఒకపుడు తెలిసిపోతుంది. సీటుకి వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు. వాళ్లంతా మాట్లాడుతూ కేరింతలు కొడ్తున్నారు. వాళ్ళ స్వరాలు క్రమంగా దూరం అవుతున్నాయి. కొంత సేపట్లోనే, ఆ స్వరాలన్నీ రైలు కదలికలో కలిసిపోయాయి. మేయర్స్ అలా తేలుతూ నిద్రలోకి జారిపోయాడు. 

“కూపే” కి 3 స్పందనలు

  1. Compartment… Coupe… చాలా చక్కని కథని తెలుగు లో Translate చేసి, ఇంకా చక్కగా వర్ణించిన మీకు చాలా థాంక్స్. ఇటువంటి మంచి కథలను అంది ఇస్తారని ఆశిస్తున్నాను.

  2. ప్రతి మనిషి మస్తిష్కం ఒక individual compartment 😎

Leave a Reply