Apple PodcastsSpotifyGoogle Podcasts

పతంజలి శాస్త్రి గారి కథల్లో పాఠకుడి పాత్ర

అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో – విభో – కందాళం ) 29 వ వార్షిక సందర్భంగా శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి, ఆయన చేసిన సాహితీ కృషికి గుర్తింపుగా. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని (PRATIBHAMURTHY LIFE TIME ACHIEVEMENT AWARD) జనవరి 9 వ తారీఖు 2021 న, కాకినాడలో ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి కథారచనపై హర్షణీయం సమీక్ష.

కథలో పాఠకుడి పాత్ర

“ నేను రాసేటప్పుడు అంతా అరటిపండు ఒలిచి పాఠకుడి నోట్లో పెట్టినట్లు కాకుండా, చెప్పింది కొంత, ‘చెప్పంది’ ఎక్కువగా ఉండే ఏర్పాటు చేస్తుంటాను. నా ఉద్దేశ్యం ఏంటంటే అటువంటి పరిశ్రమ గనుక పాఠకుడు చేస్తే అతడికి కలిగే సాహిత్యానుభవం ఎక్కువ రుచికరంగా ఉంటుంది.”
పతంజలి శాస్త్రి గారు

రేమండ్ కార్వర్ కు అమెరికన్ కథాసాహిత్యంలో ‘మినిమలిస్టిక్’ పంధాకు ప్రాచుర్యం తెచ్చిన రచయితగా పేరుంది. ఇప్పటి అమెరికన్ రచయితల్లో అత్యంత ప్రసిద్ధులైన టోబయస్ ఉల్ఫ్ , జార్జి సాండర్స్ లాంటి వారు, రేమండ్ కార్వర్ రాసిన ‘కంపార్ట్మెంట్’, ‘కాథెడ్రల్’ లాంటి కథలు తమ ‘రచనా జీవితానికి ప్రేరణ’ అని అంటారు.

‘కంపార్ట్మెంట్ ‘ అనే కథలో, మేయర్స్ అనే వ్యక్తి, తన భార్యతో గొడవ పడి ఒంటరి జీవితం గడుపుతూ ఉంటాడు. తన హింసాత్మక ప్రవర్తన తామిద్దరూ విడిపోవడానికి కారణం అయినా, జరిగిన దానికి తన టీనేజ్ కొడుకు ప్రవర్తన కారణం అని తనను తాను సమాధాన పరచుకుంటాడు మేయర్స్. ఎనిమిదేళ్ల తర్వాత తన కొడుకు రాసిన ఒక చిన్న వుత్తరంతో, అతనికి కొడుకుని కలవాలనిపిస్తుంది. తానున్న నగరం నుంచి , కొడుకు చదువుకునే ఇంకో నగరానికి రైలులో ప్రయాణిస్తాడు మేయర్స్ . కథంతా రైలుబోగీలో జరిగే చిన్న చిన్న సంఘటనలు, (seemingly unrelated incidents) , వాటిని చూసి మేయర్స్ మనసులో వచ్చే ఆలోచనల గురించే ఉంటుంది. పొడి పొడి వాక్యాలలోనే కథంతా రాసుకొస్తాడు రచయిత. బోగీలో వాతావరణం గురించి కానీ, తోటి ప్రయాణీకుల గురించి కానీ వర్ణనలు వుండవు. రైలు బోగీ లో మిగతా ప్రయాణీకుల ప్రవర్తన, కిటికీలోంచి బయట కనపడే దృశ్యం లో వచ్చే మార్పులూ ఇవన్నీ మేయర్స్ పక్కనే కెమెరా ఉంచి చూపిస్తున్నట్టుగా ఉంటుంది, పాఠకుడికి. గమ్యస్థానంలో ఆగినప్పుడు, దిగకుండా, రైలులోనే అలాగే ఉండిపోతాడు మేయర్స్. కథ ముగిసిపోతుంది. ఎందువల్ల మేయర్స్ రైలు దిగి కొడుకుని కలవలేదు అనే ప్రశ్న రేకెత్తుతుంది పాఠకుడి మనసులో. ఈ ప్రశ్నకు సమాధానం, మేయర్స్ కు కిటికీలోంచి కనపడే దృశ్యాలు , అతని కంటి ముందర జరిగే సంఘటనలు, ఈ రెండిటికీ ప్రతిస్పందనగా మేయర్స్ మనసులో మెదిలే ఆలోచనలు, వాటిని గమనిస్తే దొరుకుతుంది, పాఠకుడికి.

ఇతివృత్తం వేరైనా, ఇదే పంధాలో ఉంటుంది అత్యంత ప్రసిద్ధికెక్కిన రేమండ్ కార్వర్ ఇంకో కథ ‘కాథెడ్రల్’ (ఈ కథపై, మినిమలిస్టిక్ పంథాపై చాలా చక్కటి వ్యాసం రాసారు కొంతకాలం క్రితం శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు https://eemaata.com/em/issues/201303/2076.html). ‘మినిమలిస్టిక్’ కథల్లో ఇతివృత్తాలు సాధారణంగా మనజీవితాల్లో జరిగేవే అయివుంటాయి. అలానే పాత్రల స్వభావాల గురించి, వారి ప్రవర్తనకు మూలమైన కారణాల గురించి రచయిత నేరుగా విశ్లేషించకుండా, కవితాత్మక వర్ణనలు లేకుండా, కథలో జరిగే సంఘటనలపై పాత్రల ప్రతిస్పందన ద్వారానో, మెటాఫరికల్గానో, పొదుపుగా రచయిత తెలియచేయడం, విశేషణాలు, క్రియావిశేషణాలు అతి తక్కువగా వాడటం లాంటివి తటస్థిస్తాయి. కథకు ‘ముగింపు’ , కథలో రాసిన చివరి వాక్యంతో కాకుండా, రచయిత కథలో ఇచ్చిన సంకేతాలను బట్టి పాఠకుడే తన మనస్సులో ముగింపు ఇవ్వడం జరుగుతుంది.
పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ అనే కథాసంపుటంలో వచ్చిన ‘తురకపాలెం దేవకన్నియలు’ , ‘మార్కండేయుడి కాఫీ’ అనేవి ఇదే కథాశైలిలో రాసినవి. కథ చెప్పే పద్ధతి , వాక్య నిర్మాణం , ముగించే విధానం , పాత్రల తీరు తెన్నులూ, సంభాషణలు, ఇలాటి అనేక అంశాల్లో రచయిత తనదైన ట్రేడ్ మార్కు ‘మినిమలిజం’ పాటించి రాసిన కథలు ఈ రెండూ.

రెండు కథల్లోనూ , పై చూపుకి చాలా మామూలుగా కనిపించే ఇతివృత్తాలు – ‘దేవకన్నియలు’ కథలో ముఖ్యపాత్రధారి కిష్టప్ప అనే పదేళ్ళ కుర్రవాడు, అమ్మతో కల్సి ఇండియాకొచ్చి మొదటిసారి ఒక పల్లెటూళ్ళో కొన్నిరోజులు గడుపుతాడు. సవ్యంగా లేని రోడ్లూ, అదుపులేకుండా, బస్సులు నడిపే డ్రైవర్లు, అడ్డదిడ్డంగా నడిచే పశువులు, వీటిని చూస్తాడు వచ్చే దార్లో. ఊళ్ళోకి వచ్చిన తర్వాత , తన ఈడు పిల్లలతో తిరుగుతూ , అక్కడ కూడా శుచీ శుభ్రం లేని పరిసరాలను ,చూసి నిరాశ పడి , పది రోజులు ఈ వూళ్ళో ఎలా గడపాలా అని ఆలోచించడం మొదలుపెడతాడు రాగానే. పదిరోజులూ గడిపి , వెనక్కి తిరిగి వెళ్లిపోయే ముందు మళ్ళీ వస్తావా అని అడిగితే , ‘వస్తాను’ అని వుత్సాహంగా సమాధానం ఇస్తాడు కిష్టప్ప. ఈ మార్పు ఎలా వచ్చింది అనేదే మొదటి కథ.

రెండో కథలో – మార్కండేయుడు అనేవాడు ఒంటరి. సాధు జీవి. జీవితాలను భీమా చేయించటం అతని వుద్యోగం. సమయం కుదిరినప్పుడు, వున్న ఒకే స్నేహితుడితో కలిసి, ఒకే హోటల్లో ప్రతీ సారీ ఒకే చోట కూర్చుని, ఆర్డర్ చేసిన కాఫీని స్నేహితుడు ఆస్వాదిస్తూ తాగుతుంటే, చల్లారి పోతున్న కాఫీని పట్టించుకోకుండా , తాను మటుకు నిండివున్న కాఫీ కప్పును జాగర్తగా చూస్తూ, వున్న సమయాన్ని గడిపేస్తూంటాడు మార్కండేయులు. తనకెదురైన పూర్ణను ఇష్టపడి పెళ్లి చేసుకుని అదే జాగర్తతో చూసుకుంటే వదిలేసి వెళ్ళిపోతుంది పూర్ణ. ఆమెను వెతుకుంటూ జీవితాన్ని ముగిస్తాడు మార్కండేయులు.

రెండు కథల్లో సామ్యత – మనుషులు తమ జ్ఞాపకాలను పొందుపరుచుకునే ప్రక్రియనుఈ రెండు కథలూ గాఢంగా విశ్లేషించినవి. అనుభవంలోకి వచ్చే విషయాన్ని, స్వచ్ఛమైన మనసుతో చూసి, వాస్తవానికి అందమైన ఊహాశక్తిని జోడించి, వాటిని చక్కటి జ్ఞాపకాలుగా మార్చుకోవడాన్ని గురించి ‘దేవకన్నియలు’ చెపితే, సొంతం చేసుకున్నప్పటికీ, అనుభూతిని జోడించుకోలేని జ్ఞాపకాలు – అవి వ్యర్థం అని మార్కండేయుడి కాఫీ చెప్తుంది.

వూళ్ళో వున్న ఒక గుడి కట్టడం వెనకాల వున్న కథ తన పెద్దమ్మ చెప్తే , అదే గుడి గురించి ఇంకో కుర్రవాడి మామ్మ చెప్పిన కథ పూర్తిగా వేరేలా ఉంటుంది. రెండూ విని , తన ‘క్రియేటివ్ ఇమాజినేషన్’ తో ఆ గుడి గురించి ఇంకో కథను వాస్తవంగా అల్లుకుంటాడు పదేళ్ల కిష్టప్ప. శాస్త్రి గారి మాటల్లో తరచూ వినపడే ‘సమాంతర వాస్తవికత’ అనే ప్రక్రియకు చక్కటి ఉదాహరణ ఈ కథ.
ఎన్నో ఏళ్లుగా పరిచయం వున్నా తనకు మార్కండేయుడు అర్థం కాలేదు అని మార్కండేయుడి గురించి స్నేహితుడు అనుకుంటే, మార్కండేయులు పూర్ణ తమ కున్న రెండునెల్ల పరిచయం ఆధారంగా ముందుకెళ్లి పెళ్లి చేసుకుని ఇబ్బంది పడతారు రెండో కథలో. కొద్దిపాటి పరిచయంతో , ఒకే కప్పు కింద సుఖంగా జీవించాలనుకుని, ఒకటయ్యే ఇద్దరు వ్యక్తులు చేసుకోవాల్సిన సర్దుబాట్ల గురించి, ఆలోచనలను రేకెత్తించేది మార్కండేయుడి కథ. మార్కండేయుడు పూర్ణ విడిపోవడం , మార్కండేయుడి జీవితం ముగిసిపోవడం అనేవి, కథలో రెండు మైలురాళ్ళు అనుకుంటే, ఈ మధ్యలో జరిగిన సంఘటనలను కాలంతో సంబంధం లేకుండా ముందుకు వెనక్కూ నడిపిస్తారు రచయిత. మార్కండేయుడు శారీరకంగా కాకపోయినా, మానసికంగా కథ మొదట్నుంచీ చివరి దాటాక ఒకేలా ఉండిపోతాడు ఏ మార్పూ లేకుండా, చిరంజీవిగా. “మార్కండేయులు ఎలా ఉండాలనుకున్నాడో అలాగే ఉన్నాడు. పూర్ణ ఎలా ఉండకూడనుకున్నదో అలాగే ఉంది.” అంటూ ముగిస్తారు కథను రచయిత, అస్తిత్వ వాదం మూలాలను స్పృశిస్తూ
.
వాక్యనిర్మాణానికి వస్తే, చిన్న చిన్న సాదా సీదా వాక్యాలు అనిపించినా ,కథను అర్థం చేసుకోడానికి, రచయిత తేటతెల్లంగా ఇచ్చిన సంకేతాలు కనపడతాయి.

కిష్టప్పకీ వాళ్ళ అమ్మకీ మధ్య –

ఈ Cattle రోడ్డు మీదికి వస్తున్నాయేంటి మమ్మీ?’’
‘‘లేదు. రోడ్డు దాటుతున్నాయ్.’’ తగలపడుతున్న విమానం చూస్తున్నట్టుంది అతనికి.
‘‘యూఎస్ లో Villages బావుంటాయి మమ్మీ.’’
‘‘అవి Villages కావు. కొన్ని కుటుంబాలు ఒకచోట ఉంటాయంతే. మన గ్రామాలు వేరు.’’
‘‘గ్రామాలేంటి మమ్మీ?’’
‘‘Villages అన్న మాట.’’

మార్కండేయులు , పూర్ణ మధ్య –

కొన్నాళ్ల పరిచయం తరవాత పూర్ణ అడిగింది. “మీకూ మీ నాన్నగారు ఎప్పుడూ గుర్తు వస్తూంటారా, నాకులాగా?”
“నాన్నగారు కదా జ్ఞాపకం ఉంటారు. ఎవరేనా అడిగినా, గుర్తు చేసినా ఆ రోజులు గుర్తొస్తాయి. ఆయన లేరని మాత్రం జ్ఞాపకం వస్తూంటుంది.
“ఆయన జ్ఞాపకాలు మిగిలి ఉంటాయి గదా?”
“ఆయన లేరనే జ్ఞాపకం. అదే నిజం.”

మార్కండేయులు పూర్ణ వదిలేసి వెళ్లిన తర్వాత అనుకునే రెండు మాటలు -“ఆమె వంట ఎలా ఉండేదో జ్ఞాపకం లేదు. ఆమెకి ఏ చీర ఇష్టమో తనకి తెలీదు. ఏదైనా బావుంటుంది తనకి.”

కథంతా కూడా ఒకే రకమైన mood ని ప్రతి పదంలో జాగర్తగా పొందుపరిచి పాఠకుణ్ణి కథనుంచి బయటకు వెళ్లకుండా చూసుకుంటారు. ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రాఫ్ లాగా, రంగుల సహాయం తీసుకోకుండా , tonality , contrast ఉపయోగించుకుని అందంగా డిజైన్ చేస్తారు రచయిత.దేవకన్నియలు లో కథంతా , అక్కడి వాతావరణం దుమ్మూ ధూళితో నిండి ఉందని చెప్తూనే, అది చూసి మొదట్లో వూరు వదిలి వెళ్లిపోదామనుకునే కిష్టప్ప , చివరలో ఊరిని ఎందుకు ఇష్టపడతాడు? అలానే మార్కండేయులు – కాఫీ, సిగరెట్ , భార్య మూడిటితోనూ మార్కండేయులు ప్రతిస్పందన లో ప్రతిఫలించే నిస్తేజత ద్వారా.

‘ Making things look simple, is often very complicated ‘ అన్నాడొకాయన. ఇలాటి కథలు రాసే సాహసం చెయ్యాలంటే , రచయితకు తన ప్రజ్ఞ మీద అపారమైన నమ్మకం, పాఠకుడి మీద ప్రత్యేకమైన గౌరవం తప్పని సరి. కృతజ్ఞతలు పతంజలి శాస్త్రి గారు! మీ కథల ద్వారా మీరు ఇచ్చే అందమైన సాహిత్య అనుభవానికి. ధన్యోస్మి.

                                                         - మీ పాఠకుడు 

Leave a Reply