కథా మూలం అమెరికన్ రచయిత షేర్ వుడ్ ఆండర్సన్ రాసిన – ‘బ్రదర్స్’
(https://americanliterature.com/author/sherwood-anderson/short-story/brothers)
రచయిత గురించి –
మొదటి రెండవ ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో రచనలు చేసిన షేర్ వుడ్ ఆండర్సన్, విలియం ఫాక్నర్, హెమింగ్వే లాటి రచయితలకి అభిమాన కథా రచయిత. మొదటి పారిశ్రామిక విప్లవం వల్ల పట్టణాల, గ్రామాలలో నివసించే ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, ఇబ్బందుల గురించి మానసికంగా విశ్లేషిస్తూ అనేక కథలు రాసారు.
ఒంటరి జోడి (Brothers – Sherwood Anderson):
అక్టోబర్ చివరి వారం. మా ఇంట్లోనే కూచుని వున్నాను. వర్షం పడుతోంది. మా ఇంటి వెనకాల ఒక అడవి, ఇంటిముందుగా ఓ రోడ్డు, అవతల వైపు పొలాలు. పొలాలు దాటి కనిపించే ఆ కొండలు ఒక్కసారి చదునై పోయి మైదానంగా మారిపోతాయి. ఆ మైదానం దాటి ఓ ఇరవై మైళ్ళు ప్రయాణిస్తే షికాగో మహానగరం.
వర్షపు జోరుకి , రోడ్డు పక్కనే బారుగా నించుని వున్న చెట్ల నుంచి ఆకుల వాన కురుస్తోంది .పసుపు పచ్చ , ఎరుపు , బంగారపు వర్ణాల ఆకులు, కుప్పలు కుప్పలుగా రాలి కింద పడిపోతున్నాయి. వర్షం, మెరుపులిచ్చే తళుకులనించీ, కొమ్మలనున్న ఆకులను, నిర్దాక్షిణ్యంగా దూరం చేస్తోంది. అవన్నీ గాల్లో అలా నాట్యం చేస్తూ వెళ్ళి ఆ మైదానాల్లో పరుచుకుంటే బావుండు.
నిన్న పొద్దున్నే లేచి , నా నడక మొదలెట్టాను. ఆ దట్టమైన పొగమంచులో నడుస్తూ నన్ను నేనే మరిచి పోయాను. మైదానాల్లోకి నడుచుకుంటూ వెళ్ళి కొండ ప్రాంతానికి తిరిగొస్తూంటే, పొగమంచు ప్రహరీ గోడలా నన్ను ఆవరించేసింది. నగరంలో నిశి రాత్రి వేళ , మనుషులు ఉన్నట్టుండి దట్టమైన చీకట్లోనుంచి, వీధి దీపపు కాంతి వలయంలోకి వచ్చి కనపడినట్టు, ఆ పొగ మంచులోంచి చెట్లు ఒక్కసారిగా బయటికి దూకి, ముందుకొచ్చి నించున్నాయి. పైనుంచి వచ్చే ఉదయపు వెలుగు, నెమ్మదిగా, బలవంతంగా పొగమంచులోకి ప్రవేశిస్తోంది. తీరిగ్గా అక్కణ్ణించి కదుల్తోంది పొగమంచు. చెట్ల పైభాగంలో కొమ్మలు అటూ ఇటూ నిదానంగా ఊగుతున్నాయి. చెట్ల కింది భాగంలో దట్టంగా వున్న పొగమంచు, లేత ఊదారంగులో వుంది, పట్టణ వీధుల్లో పరుచుకుని వుండే ఫ్యాక్టరీ పొగలా.
ఓ ముసలాయన ఆ పొగమంచులో నడుచుకుంటూ నా వైపు వచ్చాడు. నాకు బాగా తెలిసిన మనిషి. అందరూ అతన్ని ఒక పిచ్చోడికింద జమకడతారు, “కొంచెం తేడా” అంటూ. అరణ్యం నడి మధ్య దాగిన ఓ చిన్న ఇంట్లో వుంటాడతను. చేతుల్లో ఎప్పుడూ ఒక కుక్క పిల్లను మోస్తూ, తిరుగుతూ ఉంటాడు. పొద్దుటి నడకలో కలిసినప్పుడల్లా తన అన్నలూ, తమ్ముళ్లూ, అత్తలూ, మామలూ, బావమరుదులూ అనుకుంటూ ఎవరెవరిగురించో చెపుతూంటాడు. అంతా గందరగోళంగా ఉంటుంది నాకు. దగ్గరగా ఉండాల్సిన వాళ్లకు, దగ్గర కాలేకపోవడం వల్ల, వార్తా పత్రికల్లో తాను చూసిన పేర్లే, అతని బుర్రలో తిరుగుతూ ఉంటాయి.
ఒక రోజు పొద్దున్న కలిసినప్పుడు, దేశ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న కాక్స్ అనే వ్యక్తి తన బంధువు అని నమ్మబలికాడు. ఇంకో రోజు ప్రసిద్ధ గాయకుడు కారూసోని తన మరదలు పెళ్లి చేసుకుంది అని చెప్పాడు. “మరదలంటే నా భార్య చెల్లెలు” అన్నాడు ఆ కుక్కపిల్లను దగ్గరకు తీసుకుంటూ. చెమ్మగిల్లిన అతడి బూడిద రంగు కళ్ళు నన్ను నమ్మమని బతిమాలుతున్నాయి. “నా భార్య చక్కగా నాజూగ్గా ఉండేది” ప్రకటించాడతను. “ ఒక పెద్ద బంగళాలో వుండే వాళ్ళం నేనూ నా భార్యా, చేతుల్లో చేతులు వేసుకుని పొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఆమె చెల్లెలికి కారూసో… ఆ గాయకుడితో పెళ్లయింది. అతను ఇప్పుడు మా కుటుంబంలో మనిషే”.
ఇంతకు ముందుఎవరో చెప్పారు “ఆ ముసలాయన పెళ్లెప్పుడూ చేసుకోలేదు” అని. ఆలోచిస్తూ అక్కణ్ణించీ వచ్చేసాను.
సెప్టెంబర్ మొదట్లో ఎప్పుడో, ఆ ముసలాయన ఒక రోజు పొద్దున్న , వాళ్ళింటిదగ్గర, బాట పక్కన ఓ చెట్టు కింద కూర్చొని ఉండడం చూసాను. ఆ కుక్క నన్ను చూసి మొరిగి, పరిగెట్టుకెళ్ళి అతని ఒళ్ళో కూచుంది. ఆ సమయంలో షికాగో పత్రికల్లో అంతా ఒకటే మోత, ఎవరో బాగా డబ్బులుండే పెద్దాయన, ఓ సినిమా నటికి దగ్గరవ్వడం వల్ల, ఆయనకీ ఆయన భార్యకీ గొడవలైపోతున్నాయని.
ఆ నటి తన చెల్లెలే అని ఉద్ఘాటించాడు ఈ ముసలాయన. ఈయనకు అరవై ఏళ్ళుంటే, ఆ నటికి ఓ ఇరవై ఉంటాయి. వాళ్ళిద్దరూ కల్సి గడిపిన బాల్యపు రోజులగురించి చెప్పడం మొదలెట్టాడు. “ నువ్వు ఊహించడం కష్టం గానీ, మేము అప్పుడు చాలా బీదవాళ్లం.” అన్నాడు. “నిజం! కొండ పక్కన చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. ఓ సారి పెద్ద గాలీ వానా! ఆ గాలికి మా ఇల్లు లేచి ఎగిరిపోతుందనుకున్నాం. ఎంత గాలి అనుకున్నావ్? మా నాన్న వడ్రంగి పని చేసేవాడు. మిగతా వాళ్లకి ఇళ్ళు బాగా దృఢంగా కట్టి, మా ఇల్లు మటుకు సరిగ్గా కట్ట లేదు.” బాధగా తల ఆడించాడు. “ మా చెల్లెలు, ఈ నటి ప్రమాదంలో పడింది. మా ఇల్లు దృఢంగా కట్టలేదు.” అంటూ బాటలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
కొన్నిరోజులు పొద్దున్న నడకలో ఆ ముసలాయన ఎక్కడా కనపళ్ళేదు.
పొద్దున్నే మా గ్రామానికొచ్చే షికాగో పేపర్లు, గత నెలా, రెండు నెల్లుగా, ఒక హత్య గురించిన కథలతో నిండిపోయి ఉంటున్నాయి. వాటి సారాంశం, షికాగోలో ఓ మనిషి తన భార్యను హత్య చేశాడనీ, ఆ హత్యకు ఏ కారణమూ కనపడటం లేదనీ. కథలోకి వెళ్తే – కోర్టు విచారణలో వున్న ఆ వ్యక్తికి ఉరిశిక్ష పడుతుంది అన్న విషయంలో అనుమానం లేదు. ఆ మనిషి, తన భార్య, భార్య తల్లితో కల్సి ముప్ఫయిరెండో నంబరు వీధిలో ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాడు. అతను సైకిళ్ళు తయారు చేసే ఫ్యాక్టరీలో ఫోర్మన్ గా పనిచేసేవాడు. వాళ్ళ ఆఫీసులో పని చేసే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి అయోవాలో వున్న ఓ పట్టణం నించి వచ్చింది. వచ్చిన కొత్తల్లో, నగరంలోనే నివసిస్తున్న వాళ్ళ అత్తతో ఉండేది. తరువాత వాళ్ళ అత్త చనిపోయింది.
భారీ కాయంతో , బూడిద రంగు కళ్ళతో, నిరాసక్తంగా వుండే ఫోర్మన్ కి ఆమె ఓ ప్రపంచ సుందరిలా కనిపించింది. ఫ్యాక్టరీ కి ఐమూలగా వున్న ఆఫీసు భవనంలో, ఓ కిటికీ పక్కన ఆమె పనిచేసుకునే ప్రదేశం. ఫ్యాక్టరీలో, ఫోర్మన్ కిటికీ పక్కనుండే తన బల్ల దగ్గర కూర్చుని, ఆ రోజు తాను చేయించిన పని తాలూకు వివరాలు, కాగితంలోకి ఎక్కించేవాడు.
తల పైకెత్తి చూస్తే, కిటికీలోంచి ఆ అమ్మాయి కనపడేది. “ఆ అమ్మాయిది ఒక అరుదైన అందం” అనే భావం అతని బుర్రలోకి ప్రవేశించింది. ఆమెకు దగ్గరౌదామని కానీ, ఆమె ప్రేమను గెలుచుకుందాం అని కానీ, అతనికి ఆలోచన రాలేదు. అక్టోబర్ మాసపు రాత్రిలో చెట్ల ఆకులన్నీ ఎరుపు, పసుపుపచ్చని బంగారు రంగులో కి మారిన వేళ, ఊరి కొండ మీదుగా ఉదయించే నక్షత్రాన్ని చూసినట్టుగా ఆమెను చూసాడు. లీలగా ఏదో ఓ ఆలోచన, “ ఈ స్వచ్ఛమైన, పవిత్రమైన అమ్మాయి.. , కిటికీ పక్కనే కూచుని ఏవి ఆలోచిస్తూ ఉంటుందో”
ఊహల్లో, ఆ అమ్మాయిని అయోవానించీ, ముప్పయి రెండో వీధిలో వుండే తన ఇంటి లోపలికి, భార్య, అత్తగార్ల మధ్యలోకి తీసుకువచ్చాడు.
పొద్దున పని చేసేటప్పుడు, సాయంత్రం ఇంట్లో, ఆమె స్వరూపాన్నే మనసులో తనతో పాటూ మోసేవాడు. తన ఇంట్లో కిటికీ దగ్గర నుంచుని , బయట కనపడే ఇల్లినాయీ రైలు పట్టాలు, పట్టాలు దాటిన తర్వాత ఉండే సరస్సు, చూసేటప్పుడల్లా ఆమె అతడి పక్కనే ఉండేది . కింద, వీధిలో నడిచి వెళ్ళే ప్రతి స్త్రీలో అతడికి ఎంతో కొంత, ఆ అయోవా అమ్మాయి కనపడేది. ఒకరు ఆ అమ్మాయిలా నడుస్తున్నట్టు, ఇంకొకరు ఆ అమ్మాయిలా చేయి వూపుతున్నట్టు, ఎవరిని చూసినా ఆ అమ్మాయే గుర్తుకొచ్చేది. భార్య, అత్తగారు తప్ప వేరే ఏ స్త్రీ కనిపించినా తనలో దాగున్న ఆమెలానే కనిపించేవారు.
అతడు ఇంట్లో వున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళని చూస్తూ అయోమయంలో గందరగోళంలో మునిగిపొయ్యేవాడు. ఉన్నట్టుండి, వాళ్ళు అత్యంత సాధారణంగా అందవికారంగా కనిపించడం మొదలెట్టారు. ముఖ్యంగా, భార్యని చూస్తే తన శరీరాన్ని అంటుకునిఉన్న , ఓ వింతైన, వికారమైన పులిపిరిలా కనిపిస్తోంది.
సాయంత్రం పని పూర్తయినతర్వాత ఇంటికెళ్లి భోజనం చేసాడు. ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటాడు కాబట్టి , ఏవీ మాట్లాడకపోయినా ఎవ్వరికీ పెద్ద అభ్యంతరం ఉండదు. భోజనం తర్వాత భార్యతో కలిసి సినిమాకి వెళ్ళాడు. ఇద్దరు పిల్లలు. భార్య ఇంకోరు కావాలంటుంది. ఇంటికొచ్చి కూర్చున్నారు. రెండు అంతస్తులు ఎక్కి అలిసిపోయింది భార్య. అమ్మ పక్కనున్న కుర్చీలో ఆయాసపడ్తూ కూర్చుంది.
అత్తగారు మంచితనానికి ఓ అసలైన నిదర్శనం. పనిమనిషి స్థానం తాను తీసేసుకుని ఉచితంగా సేవలందిస్తోంది. కూతురు సినిమాకి వెళ్తానంటే చేయి ఊపింది చిరునవ్వుతో. “వెళ్ళు. నాకు రావాలని లేదు. ఇక్కడే కూర్చుండిపోతా ” అని కూచుని ఓ పుస్తకం తీసుకుని చదవడం మొదలెట్టింది . తొమ్మిదేళ్ల చిన్నవాడు లేచి ఏడుపు మొదలెట్టాడు, బాత్రూం కి వెళ్ళాలని. తీసుకెళ్ళింది.
అతను భార్యతో ఇంటికి రాగానే, ముగ్గురూ, పడుకోబోయేముందు ఓ గంటో రెండు గంటలో మౌనంగా కూర్చున్నారు. వార్తాపత్రిక చదువుతున్నట్టు నటించాడతను. తన చేతులు చూసుకున్నాడు. సైకిళ్ళు తుడిచేటప్పుడు చేతులకంటుకున్న గ్రీసు, ఎంత శుభ్రంగా కడుక్కున్నా, నల్లగా గోళ్ళల్లో కొంత ఇంకా మిగిలిపోయి ఉంది. టైపురైటర్ మీద చక చకా ఆడే ఆ అయోవా అమ్మాయి మృదువైన, తెల్లనిచేతులు గుర్తుకొచ్చాయి. తనమీద తనకు రోత పుట్టింది. ఆ అమ్మాయికైతే తెలుసు ఫోర్మన్ తనతో ప్రేమలో పడ్డాడని. కొంత ఉత్సాహం కలిగింది ఆమెకి. తన అత్తయ్య పోయినతర్వాత, ఆమె ఓ చిన్న హాస్టల్ లోకి మారింది. సాయంకాలం రూము కొచ్చిన తర్వాత, వేరే పనేమీ ఉండేది కాదు. అతడికి తన జీవితంలో ఎటువంటి స్థానం లేకపోయినా ఆ మనిషిని సరిగా వాడుకోవాలి. ఫోర్మన్ ఆమెకు ఓ ప్రతీకగా మారాడు.
అపుడపుడూ అతను ఆఫిసులోకి వచ్చి డోర్ దగ్గర ఓ క్షణం నిల్చునే వాడు. అతని పెద్ద పెద్ద చేతులు అంతా నల్లటి గ్రీసు మరకలతో నిండి ఉండేవి. అతడి వైపు చూడకపోయినా ఆమె కళ్ళల్లో, అతడి స్థానంలో ఒక పొడుగాటి నాజూకైన యువకుడు వొచ్చి నిల్చునేవాడు. అతడిలో వింతైన జ్వాలతో వెలిగిపోయే, ఆ బూడిద రంగు కళ్ళు మాత్రమే ఆమెకి కనపడేవి. ఆ చూపులో ఆతృత … శ్రద్ధ, వినయంతో కూడిన ఆతృత. అతని సమక్షంలో ఆమెకు అన్ని భయాలూ ఒక్కసారి మాయమైపోయినట్టుగా అనిపించేది. అలాటి చూపును తన కళ్ళల్లో నింపుకున్న ప్రేమికుడు ఆమెకి కావాలి.
అపుడపుడూ, రెండువారాల్లో ఒకటో రెండో రోజులు, ఇంకా చెయ్యాల్సిన పని మిగిలి వున్నట్టుగా, లేటుగా ఆఫీసులో ఉండిపోయేది. కిటికీలోంచి వేచి చూస్తూ ఫోర్మన్ కనపడుతున్నాడు. అందరూ వెళ్ళాక, డెస్క్ కి తాళం వేసి వీధి లోకి వచ్చింది . అదే సమయంలో ఫ్యాక్టరీ నించి బయటకొచ్చాడు ఫోర్మన్.
ఆమె రైలు ఎక్కే స్టేషన్ దాకా ఇద్దరూ కొంత దూరం కలిసి నడిచారు. వాళ్ళ ఫ్యాక్టరీ ‘సౌత్ షికాగో’ అనే ప్రాంతంలో ఉంది . నడుస్తూ ఉంటే నగరం సాయంకాలంలోకి ప్రవేశిస్తోంది. వీధుల పక్కనే, వరసగా, రంగులు వేయని,సగం కట్టి వదిలేసిన, ఇళ్ళు. దుమ్ము పట్టిన రోడ్ల మీద, మురికి మొహాలేసుకుని కేకలేసుకుంటూ పిల్లలు కొంతమంది అటూ ఇటూ పరిగెడుతున్నారు. ఇద్దరూ ఓ బ్రిడ్జి దాటారు. కింద నది పాయలో, ఎవరో వదిలేసి వెళ్ళిన రెండు బల్లకట్టు పడవలు, నిండా బొగ్గుతో మురిగిపోతూ, తేలుతున్నాయి.
చేతులు దాచిపెట్టుకుని, ఆమె పక్కనే, అతడు భారంగా నడుస్తూ వస్తున్నాడు. ఫ్యాక్టరీ నించి వొచ్చేటప్పుడు,చేతుల్ని జాగర్తగా రుద్ది రుద్ది కడిగాడు. కానీ ఇప్పుడు వాటిని చూస్తే, బరువైన అసహ్యకరమైన రెండు పనికిరాని పదార్థాలు, తన పక్కన, వేలాడుతూ వొస్తున్నట్టుగా వుంది.
అలా కలిసి నడవడం కొన్ని సార్లు జరిగింది. వేసవిలో ఓసారి “బాగా వేడిగా వుంది” అన్నాడతను. ఆమెతో ఎప్పుడు మాట్లాడినా వాతావరణం గురించే.. “వేడిగా వుంది, వానొస్తుందేమో”
ఆమె ఉద్దేశంలో వున్న ‘ప్రేమ’ అనబడే పదార్థానికీ, ఈ పక్కనే నడిచే వర్కింగ్ క్లాసు మనిషికీ అసలు సంబంధం లేదు. ఆమె కలల్లోకి అపుడపుడూ వచ్చిపోయే ప్రేమికుడు, పొడుగ్గా అందంగా వున్న యువకుడు, ఇళ్ళూ స్థలాలూ దండిగా వున్న ధనవంతుడు.
ఆఫీసులో అందరూ ఇంటికి వెళ్ళిపోయేదాకా ఆగి, ఎవ్వరూ గమనించే అవకాశం లేకుండా, అతనితో కలిసి నడవడానికి కారణం అతని కళ్ళు. తన్ని చూడగానే వంగిపోయే ఆ కళ్ళల్లో వుండే ఆతృత , ఆ కళ్ళల్లో వుండే వినయం. అతనితో ఏ రకమైన అపాయము లేదు, రాదు. ఇబ్బంది పడేటంత దగ్గరగా రావడానికి గానీ, తన్ను చేతులతో ముట్టుకోడానికి గానీ అతను ఏనాడూ ప్రయత్నించలేదు. అతనితో గడపటం పూర్తిగా సురక్షితం.
ఆ రాత్రి అతను ఇంట్లో తన భార్య , అత్తగారితో కూచుని వున్నాడు. ఇద్దరు పిల్లలూ పక్కగదిలో నిద్ర పోతున్నారు. కొన్ని రోజుల్లోనే భార్య ఇంకోర్ని కనబోతోంది. భార్యతో సినిమాకి వెళ్ళొచ్చాడు. ఇంకొంచెంసేపట్లో ఇద్దరూ కల్సి పడుకుంటారు. అలానే నడుం వాల్చి ఆలోచిస్తున్నాడు. అత్తగారు పడుకోడానికి మంచం ఎక్కిందన్నట్టుగా కిర్రుమని చప్పుడు, పక్కగదిలోంచి. జీవితం అంతా ఏదో మూసుకుపోతున్నట్టుగా ఇబ్బందిగా తయారైంది. ఏదో అతృత, నిరీక్షణ. ఏవుంది ఈ జీవితంలో నిరీక్షించడానికి? పిల్లల్లో ఎవరో లేచి ఏడుస్తున్నారు, బాత్రూంకు వెళ్లాలని. అపూర్వమో అద్భుతమో అయిన సంఘటనలు ఏవీ ఈ ఇంట్లో జరగవు, జరగబోవట్లేదు. జీవితం మూసుకుపోతూ, ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఈ ఇంట్లో జరిగే ఏ సంఘటనా తనకు ఉత్సాహాన్ని ఇవ్వలేదు. భార్య చెప్పే విషయాలు, అపుడపుడూ అన్యమనస్కంగా ఆమె చూపించే మోహావేశం, ఏవీ ఆశించకుండా ఇంట్లో చాకిరీ చేస్తున్న అత్తగారి మంచితనం, ఏది కూడా! ఇంట్లో లైటు కింద కూచుని, పేపర్ చదూతున్నట్టు నటిస్తూ తన చేతుల వంక చూసుకున్నాడు. అవి వెడల్పుగా ఉండి ఆకారాన్ని కోల్పోయిన ఓ కార్మికుడి చేతులు.
ఆ అయోవా అమ్మాయి ఆకారం గదిలో తచ్చాడడం మొదలైంది. ఆమెతో బయటికెళ్లిపోయి, వీధుల్లో మైళ్ళు మైళ్ళు మౌనంగా నడిచాడు. సముద్రపు తీరాల వెంబడి, పర్వత శిఖరాల వెంబడి ఆమెతో నడిచాడు. మాటల అవసరమేముంది? ఆకాశం నిర్మలంగా, నిశ్శబ్దంగా ఉండి నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆమె కూడా ఓ నక్షత్రమే. మాటల అవసరమే లేదు. “ఆమె కళ్ళు నక్షత్రాలయితే, ఆమె పెదవులు నక్షత్రాల మసక వెలుతురుతో వెలిగిపోతున్న మైదానాల అంచులనించీ, ఆవిర్భవించే, మృదువైన పర్వత సానువులు. ఆమె దుర్లభమైన, దూరాంతరాల్లో ఉన్న ఓ నక్షత్రం. కానీ శ్వాసించే, జీవించే నక్షత్రం.”
ఓ రోజు సాయంత్రం, ఆరువారాల కిందట, సైకిలు ఫ్యాక్టరీ లో పని చేసే ఒక ఫోర్మన్ తన భార్యను చంపేశాడు. ఇప్పుడు ఆ హత్య గురించి కోర్టులో విచారణకు హాజరౌతున్నాడు. ప్రతిరోజూ వార్తాపత్రికల నిండా ఆ హత్య గురించే వార్తలు.
హత్య జరిగిన రోజు సాయంత్రం, అలవాటు ప్రకారంగా, తన భార్యతో సినిమాకు వెళ్ళాడతను. తొమ్మిది గంటలకి, వాళ్ళు సినిమా హాలు నించీ ఇంటికి బయలు దేరారు. ముప్పైరెండో వీధిలో వాళ్ళ అపార్ట్మెంట్ కి దగ్గర్లో, మూలగా వున్న ఓ సందులోంచి ఒక వ్యక్తి ఉన్నట్టుండి బయటకొచ్చి, తచ్చాడి, మళ్ళీ మాయమైపోయాడు. బహుశా ఈ సంఘటనే అతని మనసులో భార్యను చంపేసే ఆలోచనను ప్రవేశపెట్టి ఉండవచ్చు.
వాళ్లిద్దరూ అపార్ట్మెంట్ బిల్డింగ్ గేటు తెరిచి, చీకటిగా వున్న కింది హాల్లో మెట్ల వైపు నడుస్తున్నారు. అతను అకస్మాత్తుగా, అనాలోచితంగా జేబులోంచి కత్తిని బయటకు తీసాడు. “ఆ సందులోకి మాయమైన వ్యక్తి, మమ్మల్ని చంపడానికి వచ్చాడనుకుంటే” అనుకున్నాడతను. తీసిన కత్తితో గిరుక్కున తిరిగి భార్యను కత్తితో పొడిచాడు. రెండు, మూడు.. పన్నెండు సార్లు పిచ్చిగా పొడిచేసాడు. గట్టిగా ఓ కేక పెట్టి, కింద కూలింది భార్య శరీరం.
కింద హాల్లో దీపం వెలిగించడం మర్చిపోయాడు అక్కడి పనివాడు. తర్వాత ఫోర్మన్ నిశ్చయించుకున్నాడు, అదీ కారణం. అదీ ఇంకా .. ఆ వ్యక్తి, నిశ్శబ్దంగా బయటకొచ్చి వెంటనే సందులోకి వెళ్ళి మాయమైన ఆ వ్యక్తి . “నిజంగా అంతే” … తనకు తాను చెప్పుకున్నాడు. “ అసలు కింద దీపాలు వెలిగించి ఉండుంటే, నేను ఈ పని చేసుండగలిగే వాణ్ణే కాదు”
ఆ హాల్లో నిల్చుని ఆలోచిస్తున్నాడు. ఆమె చనిపోయింది. ఆమెతో పాటూ ఆ కడుపులో వున్న బిడ్డ కూడా. పైన అపార్ట్మెంట్లల్లో ఎక్కడో తలుపు తెరిచినట్టుగా శబ్దం వినపడింది. దాని తర్వాత చాలా సేపు ఎక్కడా ఏవిధమైన అలికిడి లేదు. భార్య, పుట్టబోయే బిడ్డ చనిపోయారు. అంతే.
పైకి పరిగెడుతూ, వేగంగా ఆలోచించాడు. కింద హాల్లో కత్తిని తిరిగి తన జేబులో పెట్టుకున్నాడు. గమనిస్తే చేతుల మీద, బట్టల మీద ఎక్కడా రక్తపు మరకలు లేవు. ఉద్వేగం కొంత తగ్గిన తర్వాత, జాగర్తగా కత్తిని బాత్రూం లో కడిగాడు. అడిగిన ప్రతివాళ్ళకీ ఒకే కథ చెప్పాడు. “మా మీద దాడి జరిగింది. ఒక మనిషి పక్క సందులోనుంచి వచ్చి, మాకు తెలీకుండా మమ్మల్ని అనుసరిస్తూ వచ్చాడు. అపార్ట్మెంట్ బిల్డింగ్ లోకి ప్రవేశించి, హాలు దాకా వచ్చాడు. అక్కడ చీకటిగా వుంది. పనివాడి నిర్లక్ష్యం అక్కడ దీపం వెలగడం లేదు.”
ఒక పెనుగులాట జరిగింది, ఆ చీకట్లో తన భార్య చనిపోయింది, అంతకు మించి, ఏమి ఎలా జరిగిందో వివరాలేవీ చెప్పలేక పోయాడు. “పనివాడి నిర్లక్ష్యం. అక్కడ దీపం లేదు.” అదే చెప్తూ వచ్చాడు.
ఒకటి రెండు రోజులు వాళ్ళు అతన్ని ప్రత్యేకించి ఏవీ ప్రశ్నలు వేయలేదు. కత్తిని మాయం చేసే సమయం దొరికింది. చాలా దూరం నడిచి, సౌత్ షికాగో లోని నదిలో , ఎక్కడైతే రెండు బొగ్గుతో నిండిన బల్లకట్టు పడవలు, మురిగిపోతూ వంతెన కింద ఉన్నాయో, ఏ వంతెనను ఓ వేసవి సాయంకాలం, దూరంగా దుర్లభంగా వున్న నక్షత్రంలా వుండి, నక్షత్రం కాదో అలాటి స్వచ్ఛమైన, పవిత్రమైన అమ్మాయితో కల్సి దాటాడో, అక్కడ పారేసాడు.
దాని వెంటనే అతను అరెస్ట్ కాబడి, తాను చేసిన నేరాన్ని ఒప్పుకుని, విషయమంతా చెప్పేసాడు. భార్యను తానెందుకు చంపాడో తనకే తెలీదని చెప్పాడు. కానీ ఆఫీసులో ఉన్న అమ్మాయి గురించి మటుకు ఏవీ చెప్పకుండా జాగర్త పడ్డాడు. వార్తాపత్రికలన్నీ ఈ నేరానికి, ప్రేరణను కనిపెట్టడానికి ప్రయత్నించాయి. ఇంకా ప్రయత్నిస్తూనే వున్నాయి. కొంతమంది ఆ అమ్మాయితో కల్సి ఇతడు సాయంకాలం పూట నడవడం చూసి వున్నారు. అమ్మాయిని ఈ వ్యవహారం లోకి లాగి పత్రికలు ఆమె ఫోటోని ప్రచురించాయి. ఆ అమ్మాయికి ఈ విషయం కొంత చిరాకు కలిగించింది కానీ, తనకు ఈ హత్యతో ఏ రకమైన సంబంధమూ లేదని ఆమె నిరూపించుకోగలిగింది.
నగరం అంచున వున్న మా గ్రామాన్నంతా నిన్న ఉదయం దట్టమైన పొగమంచు ఆవరించింది. తెల్లవారగానే నా సుదూరపు నడక మొదలెట్టాను. వెనక్కి తిరిగి కొండ ప్రాంతంలో నడిచి వస్తూంటే, ఎవరి కుటుంబం అయితే ఇలాటి ఎన్నో వింత సంఘటనలను అనుభవించిందో, ఆ ముసలాయన ఎదురయ్యాడు. కొంతదూరం ఆ బుల్లి కుక్కను చేతుల్లో పెట్టుకుని నా పక్కనే నడిచాడు. బాగా చలిగా ఉండడంతో, కుక్క మూలుగుతూ, వణుకుతూ వుంది. పొగమంచులో ఆ ముసలాయన ముఖం స్పష్టంగా కనపడ్డం లేదు, పొగమంచుతో కప్పబడిన చెట్లలా, కనపడీ కనపడకుండా దోబూచులాడుతోంది ఆయన ముఖం.
భార్యను హత్య చేసాడని ఉదయాన్నే మా గ్రామానికి వచ్చిపడే పేపర్లలో ఎవరి పేరైతే , మారు మోగిపోతోందో,ఆ వ్యక్తి గురించి ప్రస్తావించాడు. ఆ హత్య చేసిన వ్యక్తిని తన సోదరుడిగా చేసేసుకుని, అతనితో కలిసి గడిపిన జీవితం గురించి పెద్ద కథ చెప్పడం ప్రారంభించాడు. “వాడు నా తమ్ముడు” అని తల ఊపేస్తూ మళ్ళీ మళ్ళీ అదే చెప్పడం మొదలెట్టాడు. నేను నమ్మనేమోనని భయపడుతున్నట్టు కనపడ్డాడు. ఒక సత్యాన్ని నిర్ధారించవలసిన అవసరం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. “ మేమిద్దరం పిల్లలం అప్పుడు. మా ఇంటి వెనకవుండే కొటారంలో కలిసి ఆడుకునే వాళ్ళం. మా నాన్న సముద్రం మీద ఓడలో వెళ్ళిపోయాడు. అందుకనే మా పేర్లలో ఈ గందరగోళం. ఆ విషయం అర్థం చేసుకోవాలి నువ్వు. మా పేర్లు వేరైనా మేమిద్దరం అన్నదమ్ములం. మాకిద్దరికీ తండ్రి ఒకరే. మేమిద్దరం మా ఇంటి వెనకనుండి కొటారంలో కలిసి ఆడుకునే వాళ్ళం. గంటలు గంటలు ఆ కొటారం లో వున్న గడ్డిలో అలా పడుకుని వుండే వాళ్ళం. వెచ్చగా ఉండేది గడ్డిలో.”
పొగమంచులో బక్కపలచని ఆ ముసలాయన దేహం వింతగా మెలికలు తిరిగిపోయిన చిన్న చెట్టులా కనపడుతోంది. కొంత సేపటి తర్వాత గాలిలో తేలుతూ , వురికంబం మీది శవంలా ముందుకీ వెనక్కి ఊగడం మొదలెట్టింది. అతడి ముఖం, పెదవులు చెప్పడానికి ప్రయత్నిస్తున్న కథను నమ్మమని నన్ను బతిమాలాడుతోంది. నా బుర్రలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, వాళ్ళ మధ్య సంబంధాలూ, విషయాలూ ఇవన్నీ గందరగోళంగా మారి కలగాపులగంగా తయారయ్యాయి. భార్యను చంపేసిన అతడి ఆత్మ, రోడ్డు పక్కనున్న ఈ ముసలాయన శరీరంలోకి ప్రవేశించింది.
అతడి ఆత్మ, నగరంలో, కోర్టులో, జడ్జి ముందర చెప్పలేక పోయిన తన కథను నాకు చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మానవాళి, అనుభవించే ఒంటరితనం గురించి, అందిపుచ్చుకోలేని సౌందర్యాన్ని అందుకునేటందుకు చేసే ప్రయత్నం గురించి, ఈ మంచుతో నిండి వున్న ఉదయపు సమయాన, రోడ్డు పక్కన నిలబడి, కుక్కపిల్లను చేతుల్లో ఉంచుకుని ఒంటరి తనంతో మతి చలించి పోయి, అస్పష్టంగా గొణుగుతున్న ఈ వృద్ధుడి పెదవుల ద్వారా సమగ్రంగా ఆ కథను చెప్పడానికి ప్రయత్నిస్తోంది.
ఆ ముసలాయన తన చేతుల్లోని కుక్కను బిగువుగా పట్టుకోవడంతో అది బాధతో మూలగడం మొదలెట్టింది. ఆయన శరీరం కంపించిపోతోంది. ఆ ఆత్మ ఈయన శరీరం నుంచి విడివడి , పొగమంచు, మైదానం, గాయకులు ,రాజకీయ నాయకులు, ధనవంతులు , ఖూనీకోర్లు, అన్నదమ్ములు , బంధువులు,అక్కాచెల్లెళ్లు వీళ్లందరి గుండా ప్రయాణించి పైకి ఎగిరిపోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది.
ఆ ముసలాయన కోరికలోని ఘోరమైన తీవ్రత గమనించి, జాలితో నిండి పోయి నా శరీరం వణకడం ప్రారంభించింది. ఆయన చేతులు పూర్తిగా చుట్టూ బిగుసుకుపోవడంతో ఆ కుక్కపిల్ల విపరీతమైన బాధతో అరుస్తోంది. నేను ముందుకు దూకి, ఆయన చేతుల్లోంచి కుక్కను విడిపించాను. అది నేలమీద పడి, కదల్లేక మూలుగుతోంది.
సందేహం లేదు, అది గాయపడింది. బహుశా పక్కటెముకలు విరిగివుండొచ్చు. అపార్ట్మెంట్ బిల్డింగ్లో, సైకిల్ ఫ్యాక్టరీ లో పని చేసే కార్మికుడు తన భార్య వైపు నిస్తేజంగా చూసినట్టు, ఆ ముసలాయన తన కాళ్ళ దగ్గర పడున్న కుక్క వైపు చూసాడు. “ మేమిద్దరం అన్నదమ్ములం” అన్నాడు మళ్ళీ. “ మా పేర్లు వేరైనా మేమిద్దరం అన్నదమ్ములం. మా నాన్న సముద్రం మీదికి వెళ్ళాడు నీకు తెలుసుగా.”
నేను మా గ్రామంలో ఇంట్లో కూర్చుని వున్నాను. వర్షం పడుతోంది. నా ముందు కొండలు ఉన్నట్టుండి మాయమై, మైదానాలు దాటి నగరం కనపడుతోంది. ఓ గంట క్రితం, అడవిలో ఇల్లుండే ఆ ముసలాయన , మా ఇంటి ముందు నుంచే నడిచి వెళ్ళాడు. ఆ కుక్క పిల్ల అతనితో లేదు.
పొగ మంచులో మేము మాట్లాడుకుంటున్నప్పుడు, అన్ని రోజులూ అతడికి తోడుగా ఉన్న ఆ ప్రాణం అదే చేతుల మధ్యలో నలిగిపోయివుండొచ్చు. ఆ ఫోర్మన్ భార్య, అతని పుట్టబోయే బిడ్డలా, ఈ కుక్క ప్రాణాలు వదిలి ఉండవచ్చు.
వర్షపు జోరుకి , రోడ్డు పక్కనే బారుగా నించుని వున్న చెట్ల నుంచి ఆకుల వాన కురుస్తోంది. పసుపు పచ్చ, ఎరుపు, బంగారపు వర్ణాల ఆకులు, కుప్పలు కుప్పలుగా రాలి కింద పడిపోతున్నాయి. వర్షం, మెరుపులిచ్చే తళుకులనించీ, కొమ్మలనున్న ఆకులను, నిర్దాక్షిణ్యంగా దూరం చేస్తోంది. అవన్నీ గాల్లో అలా నాట్యం చేస్తూ వెళ్ళి ఆ మైదానాల్లో పరుచుకుంటే బావుండు.
Leave a Reply