Apple PodcastsSpotifyGoogle Podcasts

‘మృగతృష్ణ’ – అల్లం శేషగిరిరావు గారి కథ

*** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు.

‘మృగ తృష్ణ ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది.

ఈ కథ ఆంధ్రజ్యోతి పత్రిక లో 1975 లో ప్రచురింపబడింది.

పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.

బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.

ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.

అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.

కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం , భావుకత్వం మనల్ని కట్టి పడేస్తాయి.

1981 లో ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది.

పల్లవి పబ్లికేషన్స్ వెంకట నారాయణ గారు , ఫిబ్రవరి మొదటి వారంలో ‘అల్లం శేషగిరిరావు సమగ్ర కథా సంకలనం’ తీసుకవస్తున్నారు.

మొబైల్ : ‘98661 15655’ ద్వారా ఆయన్ను సంప్రదించి , మీ కాపీ రిజర్వు చేసుకోవచ్చు.

కథ:

ఎండలు | నిప్పులు చెరిగే ఎండలు!!

అడవిలోని నీటిమాటులు, కొండ వాగులు, సెలలు ఎండిపోయాయి. కొండల్లో అగ్గి జంజలు. వడదెబ్బకి పిట్టలు సొమ్మసిల్లి నేలకు రాలిపోతున్నాయి. దాహం !

వులులు, తోడేళ్ళు, జింకలు, దుప్పులు, పిట్టలు, పురుగులు- నీటి కోసం ఆర్చుకుపోతూ మందలు మందలుగా వలసపోతున్నాయి. పరుగులు, ఉరకలు- దాహం. రాత్రింబవళ్ళు ఒకటే పరుగులు, దాహం. అడవి పంది పడితే రెండు మూడు వందలు దాకా చెయ్యొచ్చు. అదృష్టం పండి కణుసుపడిందా, నాలుగువందలదాకా చెయ్యొచ్చు. దుప్పి పడినా కనీసం నూటఏభైకి తక్కువరాదు,

సూరయ్య బాకీ తీరిపోతుంది. మూడు సంవత్సరాల నుంచి వర్షాలు లేక బీడు పడిన తన మెరక చెక్క మీద చేసిన అప్పు! అసలు, వడ్డీతో కలిసి మూడు వందలు దాటింది. ఈ సంవత్సరమైనా తీర్చకపోతే సూరయ్య, బాకీ క్రింద భూమి జమకట్టేసుకుంటాడు. అలా చాలామంది భూముల్ని పడేసుకుని పల్లం ప్రాంతంనుంచి వచ్చిన షావుకారు సూరయ్య లక్షాధికారయిపోయాడు. ఆ సంగతి బాగా తెలిసిన బైరిగాడు తన భూమిని ఎలాగైనా దక్కించు కోవాలనుకున్నాడు.

బైరిగాడు నాటు తుపాకీని బైటికి తీసి బూజు దులిపాడు. చూరులో దాచిన పాత మందుగుండు సంచి తీసి అందులోని మందుగుండు కొంచెం నేలమీద పోసి అగ్గిపుల్ల గీశాడు. పేదవాడి ఆశలా భగ్గున మండింది. పాతదైనా మందు ఇంకా పవరు పోలేదనుకున్నాడు. తుపాకీ నల్లీలో మందు ఎక్కువ పోసి దట్టించాడు. సంచీలో పాతబడిన మేకుల్నీ, ఇనుప ముక్కల్ని ఏరి గుళ్ళకు బదులుగా తుపాకీలో నింపి వాటి మీద కాగితపు ముక్కల్ని, గుడ్డ పీలికల్ని దట్టించాడు.

గోచి గట్టిగా బిగించి, గుడిసె తడక దగ్గరగా లాగి, తుపాకీని పట్టుకుని సంచి భుజానికి తగిలించి అడవి లోకి బయలు దేరాడు వేటకి.

అరవై సంవత్సరాలు నిండిన బైరిగాడి ముడతలు దేరిన ముఖం బీటలు పడ్డ నేలలా వుంది. వయస్సుతోనూ, కష్టాలతోనూ జీర్ణించుకుపోయిన శరీరం తోలుతో కప్పిన బొమికల గూడులా వుంది. జీరలు దేరిన కళ్ళు మాత్రం నిప్పు కణికల్లా తీక్షణంగా ఉన్నాయి. ఆ చూపుల్లో పట్టుదల, ఓపిక ఇంకా చప్పబడిపోలేదు. మధ్యాహ్నం దాటిపోయినా ఎండ ఇంకా తీక్షణంగా వుంది.

దూరాన గూడెంలో వర్షాల కోసం వన దేవతలను కొలుస్తూ డప్పులు వాయిస్తూ జాతర చేస్తున్నారు.

చెట్లన్నీ ఆకులు రాల్చేసి మోడువా రిపోయాయి. అడవంతా ఎండుటాకులు పరుచు కొనున్నాయి.

బైరిగాడు నడుస్తుంటే దిష్టిబొమ్మ తుపాకి పట్టుకొని అడవిలో నడుస్తున్నట్టుంది. బైరిగాడి కాళ్ళ క్రింద ఎండుటాకులు చిట్లుతూంటే ఆ సడికి వెదురు డొంకల్లో చిలకలు గోలచేస్తూ ఎగిరిపోతున్నాయి. కాకుల గుంపు బైరిగాడి వింత ఆకారానికి చెట్ల మీద నుంచి గోలచేస్తూ బైరి నెత్తిమీద వలయాకారంగా తిరుగుతూ మెడలు నిక్కించి చాలా దూరం వరకు వెంబడించాయి.

బైరిగాడు పొద్దుగూకక ముందే నీటిమాటు దగ్గరకు చేరాలని వడివడిగా అంగలేసుకుంటూ నడుస్తున్నాడు. అడ్డతోవల మీదగా నడుస్తూ తుప్పల్ని, డొంకల్ని, రాళ్ళని దాటుకుంటూ, రొప్పుకుంటూ, రోజాకుంటూ రెండు కొండలు ఎక్కి దిగి సాయంకాలానికల్లా నీటి మాటు దగ్గరకు వచ్చాడు.

ఆ కీకారణ్యం మద్య ఎండిపోయిన సెలయేటికి పక్కగా గుబురుగా బలిసిన తుప్పల నీడలో నేల చెమ్మగా వుంది. దాని మధ్యలో చిన్న నీటి గుంట. సన్నగా నీరు ఊరుతూ గుంటగా ఏర్పడింది. బైరిగాడు దగ్గరకు రాగానే నీటిమీద ముసిరిన దోమలు జామ్మున లేచాయి. అంత అడవిలోనూ మరెక్కడా నీటి చుక్క లేదు. చుట్టుపట్ల జంతువులు దాహం తీర్చుకోవడానికి అక్కడికే వచ్చి తీరాలి. గుంట చుట్టూ బైరిగాడు పరిశీలనగా చూశాడు.

జంతువుల అడుగులు చెమ్మ నేలమీద, సెలయేటి ఇసుక లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి, అడవి పందులు తేమనేలని నీటికోసం త్రవ్వేసి గొప్పులు పెట్టేసున్నాయి.

కొండల వెనుక అస్తమిస్తున్న సూర్యుడు చెట్ల సందుల్లోంచి అందంగా కనిపిస్తున్నాడు. వడగాలి చల్లబడుతున్నా పగలంతా ఎండకి సలసల కాగిపోయిన కొండ రాళ్ళలో నుంచి వేడి చిమ్ముకొస్తోంది.

నీటి గుంటకి ఇరవై గజాల దూరంలో వెదురు పొద మధ్యన కూర్చొనడానికి వీలుగా సంచీలో నుంచి కత్తి తీసి చదును చేశాడు. తను బయటికి ఏ మాత్రం కన్పించకుండా చుట్టుపక్కల కొమ్మల్ని, తుప్పల్ని నరికి తెచ్చి చుట్టూ పేర్చుకున్నాడు. తుపాకీతో కాల్చడానికి వీలుగా వాటి మధ్య చిన్న సందులు చేశాడు. దూరానికి చూడ్డానికి మాటు తుప్పల మధ్యలో తుప్పలాగా కనిపిస్తోంది. అంత గొప్ప నైపుణ్యంగా పేర్చినందుకు తననుతానే అభినందించుకొని మెల్లగా మాటులోకి దూరి కూర్చున్నాడు. తుపాకీ గుర్రం ఎక్కు పెట్టి సిద్ధంగా పక్కనుంచాడు. మాటు సందుల్లోంచి నీటి గుంటకి దాహం తీర్చుకోడానికి రాబోయే జంతువులకోసం నలువైపులా చూస్తున్నాడు. ప్రతి చప్పుడునీ చెవులు నిక్కించి సూక్ష్మంగా ఆలకిస్తున్నాడు- వేటలో రాటు దేరిన బైరిగాడు. • క్యాంప్, క్యాంప్ అడవిలో నెమళ్ళు అరుస్తున్నాయి.

కత్తిరి పిట్టలు ఒక్కొక్కటిగా చెట్ల మీది నుంచి దిగుతూ నీళ్ళు తాగి ఎగిరిపోతున్నాయి. నెమళ్ళు జంట ఎండుటాకుల మీద జరజరమని పరుగెత్తుకుంటూ వచ్చి నీటి గుంట దగ్గర ఆగి బెదురుగా అటూ ఇటూ చూశాయి. గబగబా నీటిని పీలుస్తూ మెడల్ని పైకెత్తి కతకతమని మింగుతూ దాహం తీర్చుకున్నాయి. దాహం తీరిన మగ నెమలి ఉల్లాసంగా పురివిప్పి ఆడ నెమలిని క్రీగంట చూస్తూ కెక్ కెక్ మని కేరుతూ అడుగులు వేస్తోంది. దాని పింఛం నీరెండలో రంగు రంగులుగా మెరుస్తోంది. అలా కాస్సేపు ఆడి నెమళ్ళ జంట అరుచుకుంటూ, తేలిపోతున్నట్టు ఎగురుకుంటూ అడవిలోకి పోయాయి. సాయంకాలం అవుతున్న కొద్ది అడవి కోళ్ళు, రకరకాల పిట్ట జాతులు నీటి మాటు దగ్గరికి వచ్చి నీరు తాగి వెళ్ళిపోతున్నాయి.

రాను రాను సందె చీకట్లు అలుముకుంటున్నాయి. పక్షుల అరుపులు తగ్గిపోతున్నాయి. అవి గూళ్ళకు చేరుకుంటున్నాయి.

ఇహ, జంతువులు నీటికి దిగేవేళ. గంటల తరబడి మాటులో కూర్చున్న బైరిగాడికి నడుం పీకేస్తోంది. క్రమేణా అడవంతా చీకట్లు ముసురుకున్నాయి. చీకటి దట్టమవుతున్న కొద్ది కీచురాళ్ళు ధ్వని ఎక్కువౌతోంది. దూరంగా కొండ లోయల్లో కొండ గొర్రె అరుపు మొదలు పెట్టింది. చుక్క వెలుగు గుంటలోని నీట్లో ప్రతిఫలిస్తూ

బైరిగాడి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది. ఎండిపోయిన సెలయేటి ఇసక అంత చీకట్లోనూ తీర్చి దిద్ది నట్లు కనిపిస్తోంది.

గంటలు దొర్లుతున్నాయి. బాగా చల్లగాలి తెరలు తెరలుగా ఎండుటాకుల మీద నుంచి గల గల వీస్తోంది. బైరిగాడి చెమట ఇగిరిన ఒంటిమీద చల్లగాలి తాకినప్పుడల్లా హాయిగా ప్రాణం లేచివచ్చినట్లుంది.

ఉన్నట్టుండి అడవి అదిరిపోయేటట్టుగా కణుసు “ఫోంక్, ఫోంక్” మని బెదురుగా దగ్గర్లో అరుచుకుంటూ పారిపోయింది. దూరమౌతున్న దాని డెక్కల చప్పుడు బైరిగాడికి స్పష్టా స్పష్టంగా వినిపిస్తోంది. కీచురాళ్ళ అరుపులు ఒక్కసారి ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం…. భరించలేని నిశ్శబ్దం అడివిని ఆవరించుకుంది. బైరిగాడు మాటులో ఉలిక్కి పడ్డాడు. ఒళ్ళంతా గగుర్పొడిచింది. అప్రయత్నంగా తుపాకీ మీదకి చెయ్యి పోయింది. ఈ అవ్యక్తమయిన గగుర్పాటుకి కారణం అర్ధమవక తికమక పడిపోతున్నాడు. • వాగు ప్రక్క తుప్పల్లో నల్లటి ఆకారం ఏదో కదుల్తున్నట్టు అనిపించిది. బైరిగాడి కళ్ళు చీకట్లను చీల్చుకుంటూ చూస్తున్నాయి. బైరిగాడు నెమ్మదిగా తుపాకీని భుజానికి ఎత్తి ఆ ఆకారం వైపు గురి పెడుతున్నాడు. ఆ ఆకారం బరువుగా నడుస్తూ నీటి గుంట దగ్గరకు వెళ్ళింది. నాలుగు కాళ్ళ మీద పడుకుని నీటి గుంటలో మూతి పెట్టి నీటిని కతుకుతోంది. గాలి విసురుకి గుఫ్ మని గబ్బు కంపు కొట్టింది.

బైరిగాడి గుండె ఝల్లు మంది. పెద్దపులి నీరు తాగుతోంది. నాటు తుపాకీ, అందులోనూ ఒకే ఒక్క బారు. గురి తప్పితేనో? అధవా, దెబ్బకి పడిపోయినా; అంత తేలిగ్గా ఫారెస్టు వాళ్ళ కన్ను గప్పి అమ్ముడుపోదు. సూరయ్య బాకీ తీరడం అటుంచి కనీసం ఆర్నెల్లు జైలు శిక్ష తప్పదు. నెమ్మదిగా తుపాకీ దింపేసి అలా పులిని చూస్తూ తుప్పల్లో తుప్పలాగా కదలకుండా కూర్చున్నాడు.

పెద్దపులి నీరు త్రాగి తీరిగ్గా నిల్చుని, తృప్తిగా తోకతో నేలమీద రెండు మూడుసార్లు బాది నిర్భయంగా చీకట్లో నడుచుకుంటూ అడవిలోకి పోయింది. ఎక్కడో చిటారుకొమ్మన కూర్చున్న కొండ ముచ్చు పులిని చూసి కాబోలు “హూప్ హూప్ ” మని అరుస్తూ తన మందని హెచ్చరిం చింది. దాంతో అడవిలో వున్న కోతుల మందలు కిచకిచ మని అరుచుకుంటూ అడవంతా ఒకటే గోల పెట్టేస్తున్నాయి.

రాను రాను పులి దూరమౌతున్న కొద్ది ఆ అరుపులు తగ్గిపోయాయి. తిరిగి అడవంతా నిశ్శబ్దం ఆవరించుకుంది.

“పులివాసన తగిలింది. మరే జంతువూ నీటికి రాదు” అని అనుకుంటూ నిరాశతో బైరిగాడు మాటులో చతికిలపడిపోయాడు. ఇంత ప్రయత్నం వృధా అయిపోతోందని ఉస్సురుమన్నాడు.

షావుకారు సూరయ్య మనస్సులో మెదిలినప్పుడల్లా పులికంటే ఎన్నోరెట్లు భయంగాను, క్రూరం గాను కనిపిస్తున్నాడు. తనకు మిగిలిన ఒకే ఒక్క జీవనాధారం- మెరక చెక్కని- నంజేసు కుంటాడు.

అర్ధరాత్రి దాటిన తరువాత అడవిలో గాలి ఎక్కువయింది. దూరంగా కొండల్లో ఉండుండి మెరుస్తోంది. గుడగుడ మంటోంది. బైరిగాడు తలెత్తి ఆకాశం వైపు చూశాడు. నలువైపుల నుంచి నల్లటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి.

“వర్షం కూడా వస్తాది కాబోలు” అనుకుంటూ తన దురదృష్టానికి నిందించుకొని తలపట్టుకు కూర్చున్నాడు.

రాను రాను ఆకాశం మేఘావృతమై ఉరుముతోంది. తేమగాలి మరింత జోరుగా వీస్తోంది. వెదురు పొదలు కట కటమని శబ్దం చేస్తూ పిచ్చిగా ఊగుతున్నాయి. ఎండుటాకులు అడివంతా చెల్లాచెదురుగా సుడులు తిరుగుతూ ఎగురుతున్నాయి. గాలికి రేగిన దూళి నల్లటి చీకట్లో మంచు తెరలా కనిపిస్తోంది.

“ఇంత సడయితే ఇంకే జంతువు దిగుతా ది; నా కరమ కాలిపోతుంటేను!” అనుకుంటూ శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఈ నిరాశకి తోడుగా దూరాన అడవిలో వర్షం పడుతున్న చప్పుడు స్పష్టాస్పష్టంగా వినిపిస్తోంది బైరిగాడికి.

రాను రాను వానజల్లు జలజలమని దగ్గరౌతోంది. రెండు మూడు చినుకులు బైరిగాడి వంటిమీద కూడా పడ్డాయి.

తనకి ఎదురుగా అడవిలో ఎండుటాకుల మీద జరజరమని చప్పుడైంది. ఈదురుగాలుల నుకున్నాడు. ఆ చప్పుడు ఎక్కువౌతూ దగ్గరవుతోంది. బైరిగాడు అనుమానంగా చెవులు నిక్కించి ఆలకించాడు. ఎండుటాకుల మీద అడుగుల చప్పుడు.. డెక్కల చప్పుడు… మంద పరుగుల చప్పుడు. మందలు పరుగెత్తుకొస్తున్నాయి పరుగులు.. ఉరకలు… దాహం

పెద్ద మెరుపు మెరిసింది.

ఆ మెరుపు కాంతిలో దుప్పుల మంద ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ వస్తోంది నీటి మాటుకి. తిరిగి చీకటి.

చీకట్లో నీటి గుంట దగ్గర చిందర వందరగా దుప్పులు పరుగెత్తుతున్నాయి. ఒకదాన్నొకటి త్రోసుకుంటూ నీళ్ళు జుర్రుతున్నాయి. టకటకమని కొమ్ములు రాసుకుంటున్న చప్పుడు.

బైరిగాడు మెరుపులా తుపాకీ తీసి గురి పెట్టాడు. చీకట్లో కదులుతున్న మంద తప్పించి సరిగ్గా గురి చూడడానికి స్పష్టంగా జంతువులు ఆనటం లేదు. ఆలస్యం చేస్తే మంద పారిపోతుంది. దుప్పుల మంద మధ్యలో గురి పెట్టి ట్రిగర్ నొక్కాడు.

“ ధూమ్!” నాటు తుపాకీ మోత చుట్టు ప్రక్కల కొండల్లో ప్రతిధ్వనించింది. దుప్పులు చెల్లాచెదురుగా పారిపోతున్నాయి. తుపాకీ పొగ….. మందుగుండు క్రూర వాసన.

బైరిగాడు గబ గబా మాటులోంచి బైటికి వచ్చి పొగకి చేతులు అడ్డు పెట్టుకుంటూ పిచ్చిగా నలు వైపులా వెతికేస్తున్నాడు. నీటి గుంటకి రెండు గజాల దూరంలో పొదల్లో సడసడమని చప్పు డౌతోంది. బైరిగాడు దానివైపు పరిగెత్తాడు. దుప్పి పొదల్లో మరణాయాసంతో గిలగిల తన్ను కుంటోంది. పొట్టలోకి గుళ్ళు దూసుకు పోయి పేగులు బైటకు వచ్చేశాయి. దాన్ని చూసీ చూడగానే పారిపోతుందేమోనన్న అనుమానంతోఅమాంతంగా దానిమీద వడి దానికాళ్ళు పట్టుకో బోయాడు. బాధతో గింజుకుంటున్న దుప్పి ఒక్క తన్ను తన్నింది. ““అమ్మ దీనియమ్మ! ” అంటూ వెల్లకితలా వడ్డాడు. బైరిగాడి జబ్బ గీరుకు పోయింది. క్షణం సేపులో తేరుకుని, తిరిగి దాని పీక మీదికి లంఘించి; మిగిలి వున్న కొనూపిరి పోయేదాకా కాళ్లతో కసాపిసా తొక్కి తొక్కి చంపేశాడు. పలవలకొమ్ములపోతు దుప్పి….. గీరుకు పోయి రక్తం కారుతున్న జబ్బని చేత్తో పట్టుకుని ఆశగా దుప్పివైపు చూస్తూ గుటకలు మింగేడు. కనీసం రెండు వందలు చేస్తుంది. సూరయ్య సగం బాకీ అయినా తీరిపోతుంది. ఏవో నాలుగాకులు తుంపి కస కస నమిలి వసరుతో నిండిని ఉమ్మిని జబ్బమీద గాయానికి రాసు కున్నాడు. భగ్గున మండుతూంటే ఉశ్ ఉశ్ అని కాసేపు మెలికలు తిరిగి చల్లపడే దాకా కూర్చున్నాడు.

పోతుదుప్పి. ఊరంత బరువు. దాన్ని ఇంటికి ఎలా చేరెయ్యాలా అనే ఆలోచనలో పడ్డాడు. అంత బరువు మోసుకుంటూ రెండు కొండలు ఎక్కి దిగాలంటే వీలవదు. దగ్గిర తోనొకటుంది గాని అది తుప్పలతోనూ, డొంకలతోనూ, ఎండిపోయిన గెడ్డలతోనూ నిండి దారి సరిగ్గా లేదు. ఒక్కొక్క దగ్గర పొదల మధ్య నుంచీ, ఇరుకు సందుల్లోంచీ, దూరవలసి ఉంటుంది. ఇలా కష్ట మయినా సరే, దూరం దారి కంటే ఇదే మేలనిపించింది.

చచ్చిపోయిన దుప్పిని ఎత్తలేక ఎత్తలేక దాని నాలుగు కాళ్ళూ పట్టుకుని ఊపిరి బిగబట్టి బలా న్నంతా కూడతీసుకుని ఎగరేసి ఎత్తి మెడమీద వేసుకున్నాడు. బరువుతో తూలిపోతున్నాడు. మాటు దగ్గర వదిలేసిన తుపాకీని చేత్తో పట్టుకుని దాన్ని నేలకి ఊత పెట్టుకుంటూ నడక ప్రారంభించాడు. అడ్డు తోవన పడి నడుస్తున్నాడు. ఎదురుగాలి, చినుకులు కూడా పడుతున్నాయి. సూరయ్య బాకీ తీరిపోతోందనే ఆనందంతో అంత కష్టాన్ని కూడా మరిచిపోయి తుప్పల్నీ, రాళ్ళల్నీ దాటుకుంటూ చీకట్లో, ఆ కీకారణ్యంలో నడుస్తున్నాడు. చచ్చిన దుప్పి నోట్లో నుంచి కారుతున్న చొంగలూ.. నెత్తురూ కలసి బంకబంకగా బైరిగాడి శరీరం మీద జారుతోంది. వెదురు కంపలూ, ముళ్ళ డొంకలూ బైరిగాడి వంటిని చేరుకుంటున్నాయి. ఇరుకు సందుల్లోంచి వంగి దూరుతున్నప్పుడు బరువుకి నడుం విరిగిపోతుందా అనిపించేది. కిరకిరలాడిపోతూ మూలిగేవాడు. కాస్సేపు జంతువు ని దించి అలసట తీర్చుకుందామా అనుకునేవాడు. దించితే తిరిగి ఎత్తుకోలేడేమో అనిపించేది. అలాగే కష్టపడుతూ నడక సాగిస్తున్నాడు.

దూరంలో ఈలలు వేస్తున్నట్లు సన్నని అరుపులు, రాను రాను నలువైపుల నుంచి ఈలలు దగ్గరౌతున్నాయి. కూడబలుక్కుని ఈలలు వేస్తున్నట్లు ఒకదాని వెంట మరొకటి అరుస్తున్నాయి.

మొదట్లో పిట్ట అరుపుల్లా వినిపించినా అడవిలో పుట్టి పెరిగి వేటలో మేటి అనిపించుకున్న బైరిగాడికి అవి రేచుకుక్కల అరువులని తెలుసుకోవడానికి అట్టే సేపు పట్టలేదు. జంతువును పసిగట్టిన రేచులు క్రమపద్ధతిలో నలువైపుల్నించీ ఈలలు వేస్తున్నట్టు అరుచుకుంటూ జంతువుపై దాడిచేస్తాయి. జంతువు బ్రతికుండగానే కండలు కండలుగా చీల్చుకుని తినేస్తాయి. .

బైరిగా డిగుండె దడ దడ కొట్టుకుంది. రాను రాను రేచు కుక్కల అరుపులు, అడుగుల చప్పుడు దగ్గరౌతోంది. వచ్చిన దుప్పి గాయంలోంచి కారుతున్న నెత్తురు వాసన్ని గాలిలో వసిగట్టిన రేచులుపరుగెత్తుకుంటూ వస్తున్నాయి. రేచులు మనుష్యుల్ని ఏమీ చెయ్యవని తెలుసు. కాని తను మోసు కొస్తున్న దుప్పి కోసం చీకట్లో అటకాయిస్తే? ఒంటరిగాడినని మీద పడినా పడొచ్చు! చుట్టూ బలిసిన అడవినీ, కటిక చీకటినీ తన ఒంటరితనాన్ని తలుచుకుంటూంటే గుండె మరింత వేగంగాకొట్టుకొంటోంది. ధైర్యం చిక్కబట్టుకుని దుప్పిని, ఏ పొదల్లోనో దాచ్చేద్దామనుకున్నాడు. ఎక్కడ దాచినా నెత్తురు వాసన పసికట్టి బైటకు లాగి పీక్కుతింటాయి. నలువైపుల చూశాడు. దగ్గర్లోనే ఒక పెద్ద మర్రిచెట్టుంది. గాబరా గాబరాగా అడుగులు వేసుకుంటూ చెట్టు దగ్గరకు వచ్చాడు. దానికొమ్మ అందుబాటులో వుంది.

జాగ్రత్తగా భుజం మీది దుప్పిని దింపకుండా అలా భుజం మీద నుంచే కొమ్మమీదికి జారిపోకుండా నెట్టాడు. వదులైపోతున్న గోచీని తొందర తొందరగా బిగించి తనుకూడా చెట్టెక్కిపోయాడు. ఇలా బైరిగాడు చెట్టేక్కేడో లేదో – రేచులు నలువైవుల నుంచి చెట్టుని గిరేశాయి. కొమ్మ మీద దుప్పిని చూసేయి. చెట్టు మొదలు చుట్టూ చిందులేస్తున్నట్లు తిరుగుతున్నాయి. ఒగుర్చుకుంటూ దుప్పి తమ అందుబాటులో లేనందుకు కసిగి మెరుగుతూ నాలికలు చాచుకొని మీదికి చూస్తున్నాయి. కొన్ని కుక్కలు చెట్టు బోదెను బర బర బకిరేస్తున్నాయి చెట్టేక్కే ప్రయత్నంలో.

బైరిగాడు చెట్టుమీది నుంచి “హాత్, హూత్! ” అని కేకలేస్తున్నాడు వాటిని బెదిరిస్తూ. ఆ అదిలింవులకి రేచులు బెధిరిపోలేదు సరికదా ” ఎప్పటికైనా ఆ దుప్పి కింద పడబోదా?” అన్నట్లు తిష్టవేసి చెట్టు చుట్టూ కూర్చున్నాయి. దుప్పి గాయంలోంచి కొమ్మమీద నుంచి బొట్లు బొట్లుగా ఉండుండి కారుతున్న నెత్తుర్ని రేచులు ఒక దానితో ఒకటి పోటీ పడి నాకుతున్నాయి.

బైరిగాడు చెట్టు మీద నుంచి కేకలేసి కేకలేసి విసుగెత్తిపోతున్నాడు. ఇవి వదిలేటట్టు లేవు అని అనుకున్నాడు. తుపాకి తీసి దట్టించి వాటిని కాల్చెద్దామా అనుకున్నాడు. కాని తొందరలో మంద గుండు సంచీ వదిలేసినందుకు తనని తాను చెడా మడా తిట్టుకుంటున్నాడు. అదే సమయంలో ““ బేర్, బేర్ ” మని కంచు గొట్టంలో అరచినట్లు ఓండ్రపోతు దుప్పి అరిచింది. ఆ అరుపుకి రేచుకుక్కల మంద; కుదిపివేసినట్లు లేచింది. చెవులు నిక్క బొడుచుకున్నాయి. వాటి వీపుల మీద రోమాలు గగుర్పాటుకి లేచి నిలుచున్నాయి. తోకల్ని సాలోచనగా అటు ఇటూ తిప్పు కుంటూ నిశ్శబ్దంగా గుమిగూడాయి. అరుపు వినపడిన వైపు చూస్తూ ఉద్రేకంతో సన్నగా మూల్గుతూ ఓక్కసారి గొలుసులు తెంచుకున్న కుక్కల్లా పరుగెత్తాయి కొత్త ఎరకోసం.

“ బతుకు జీవుడా” అనుకుంటూ హాయిగా నిట్టూర్చాడు చెట్టుమీది బైరిగాడు. బైరిగాడు సర్దుకుని చెట్టు దిగేలోగా అంతవరకు పడుతున్న చినుకులు ఒక్కసారి ఎక్కువై రాళ్ళు వాన కురిసినట్టు పెద్ద పెద్ద చినుకులతో వర్షం ప్రారంభమైంది. తేమగాలి ఝంఝామారుతంలా వీస్తోంది. రానురాను కుంభవృష్టి ఆకాశం చీలిపోతున్నట్టు మెరుపులు, పిడుగులు! గాలికి చెట్ల కొమ్మలు ఫెళ ఫెళ విరిగిపోతున్నాయి. మహా ప్రళయం సంభవిస్తున్నట్లు నింగీ నేలా ఏకమై పోతున్నట్టు ధారాపాతంగా వర్షం. బైరిగాడు తడిసి ముద్దయిపోయాడు. వర్షానికి కొమ్మ మీద దుప్పి ధ భీమని నేల మీద పడింది. అలా సుమారు రెండు గంటలు ఏకధాటిని కురిసి వర్షం ఆగి పోయింది.

వర్షం ఆగిపోగానే బైరిగాడు చెట్టు దిగేడు. కష్టపడి దుప్పిని ఎత్తి భుజాన వేసుకున్నాడు. తుపాకీమడమ బురద నేల మీద కూరుకుపోతూ సరిగ్గా ఊతనివ్వటం లేదు. తడిసిపోయిన దుప్పి ఒంటి మీద జారిపోతోంది. నడుస్తున్నాడు. పట్టుదలతో లేని ఓపిక కూడ గట్టుకుంటూ సూరయ్య బాకీ తీర్చేదామనే దీక్షతో బురదలో, ముళ్ళలో, గతకల్లో నడుస్తున్నాడు.

రాత్రి రెండు గంటలు దాటిపోయుంటుంది. వాన వెలిసిన ఆకాశం నిర్మలంగా కడిగినట్టుంది. సన్నని వెన్నెల పొడకూడా వచ్చింది. ఆకుల మీద నీటి బొట్లు ముత్యాల్లా మెరుస్తున్నాయి. కప్పల, కీచురాళ్ళ, చిమ్మెట్ల అరుపులతో అడివంతా నిండిపోయింది. బైరిగాడు చాలా దూరం వచ్చేశాడు. ఒక గెడ్డ దాటి, మరోమైలు నడిస్తే తన గుడిసె చేరుకుంటాడు. .

గెడ్డ దగ్గరౌతున్న కొద్పీ కప్పల బెకబెకలు ఎక్కువవుతున్నాయి. గెడ్డ దగ్గరకు రాగానే బైరిగాడికి కళ్లు తిరిగినంత పనయింది. కొన్ని గంటల క్రితం వరకూ ఎండిపోయి దిబ్బలు వేసిన గెడ్డ వర్షం పడడంతో కొండల్లో నుంచి నీరు దిగి నిండుగా ప్రవహిస్తోంది. నీరు సుడులు తిరుగుతూ పారుతోంది.

అప్పుడు బైరిగాడికి గెడ్డ దాటడం తప్ప మరో మార్గం తోచలేదు. చుట్టు తిరిగి గెడ్డను తప్పించు కుని వెళ్ళాలంటే ఇప్పుడు నడచిన తోవకు మరో నాల్గు రెట్లు నడవాలి. నడవటమే కాక కొండలు ఎక్కి దిగాలి. గెడ్డలో నీరు నిండినా అది అంత లోతైన గడ్డ కాదని బైరిగాడికి తెలుసు. నీరు గుండెల్ని దాటదు. వెడల్పు పది గజాలలోపే గాని ఎక్కువ ఉండదు. అందులోనూ గజ ఈతగాడు బైరిగాడికి ఆ గెడ్డ ఒక లెక్కలో ది కాదు. ఆ ధైర్యంతోనే బైరిగాడు గెడ్డ దాటడానికి సిద్ధపడ్డాడు. దుప్పిని గెడ్డ ఒడ్డున దించాడు. పీక్కుపోతున్న కాళ్ళని, మెడని చేత్తో రుద్దుకున్నాడు. ఒక చేత్తో తుపాకీ పట్టుకుని భుజాన్న దుప్పిని మోసుకుంటూ, ఊపు కాసుకుంటూ,

జోరుగా పారుతున్న నీటిలోంచి నడవటం అంత సులభం కాదు. అందువల్ల తుపాకీని రెండు చేతుల్తో పట్టుకుని గిర గిర తిప్పి అవతల ఒడ్డుకి విసిరాడు. అది అవతల ఒడ్డున బురదలో పడింది. ముసిలాడయిపోయినా తన జబ్బ సత్తువకి, గురికి మనస్సులోనే మెచ్చుకున్నాడు.

గట్టు దిగి మెల్లిగా నీట్లో కాలు మోపాడు. కప్పలు ఒడ్డుమీద నుంచి జల్లున నీటిలోకి దూకు తున్నాయి. బురద జారు జారుగా ఉంది. మెల్లగా పాదాల్ని నిలదొక్కుకుని గట్టుమీది దుప్పిని భుజం మీదికి లాక్కున్నాడు. మెడ మీద బరువు ఆనించి వేలాడుతున్న నాలుగు కాళ్ళనీ రెండు చేతుల్తో పట్టుకున్నాడు. బరువుకి బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. అడుగు తీసి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ నీళ్ళలో నడుస్తున్నాడు. నురుగులు కక్కుతున్న నీటి ప్రవాహం వెన్నెట్లోమెలికలు తిరిగిన తెల్లని పాములా కనిపిస్తోంది. ముణుకుల లోతు వచ్చేసరికి నీరు కింద నుంచి లాగేస్తోంది. ఎండిపోయిన కొమ్మలు, దుంగలూ శరవేగంగా కొట్టుకుని పోతున్నాయి. ఉండుండి ఒడ్డున మట్టి పెళ్ళలు విరిగి నీటిలో గుభిల్లు గుభిల్లుమని పడుతున్నాయి. నీరు నడుమును తాకుతోంది. సగం దూరం దాటేడు. నీటి వేగం మరింత ఎక్కువగా క్రింద నుంచి లాగేస్తోంది.

మెల్లిగా వీపు మీద బరువు కాసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. .. అమాంతంగా గోతిలో కాలు పడింది. అంతే! తూలిపోయి బోర్లా నీట్లో పడ్డాడు. దుప్పి దూరంగా తుళ్ళిపోయింది. నీట్లో పడడం తో ప్రవాహ వేగంతో కొట్టుకుపోయాడు. నీళ్ళలో దొర్లి కొట్టుకుపోతున్నాడు. మునకలు వేస్తు న్నాడు. నేలకి కాళ్ళు తగులుతున్నా ప్రవాహం వేగానికి తట్టుకుని నిలబడలేకపోతున్నాడు. అలాపడుతూ లేస్తూ కొట్టుకుపోతున్న వాడికి తనకంటే ముందుగా దుప్పి తేలుతూ కొట్టుకుపో తుండడం కనిపించింది. అంతటి జీవన్మరణ సమయంలో కూడా బైరిగాడికి సూరయ్య బాకీ మెదడులో చరాలున మెదిలింది. అలా మునకలు వేస్తూనే తమాయించుకుని ఈదుకుంటూ దుప్పి మీద గభాలున దూకి గట్టిగా పట్టుకున్నాడు.

అక్కడ గెడ్డ వెడల్పు తక్కువవటం వల్ల ప్రవాహ వేగం మరింత పుంజుకుంది. దుప్పిని విడవ కుండా నీట్లో క్రిందా మీదా ఆపుతూ ఎదురీదుతూ కొట్టుకుపోతున్నాడు. తన ప్రక్క నుంచి దుంగలూ, కర్రలూ, వాటిని అంటి పెట్టుకున్న నీటి పాములూ విసురుగా రాసుకుపోతున్నాయి. అలా దుప్పిని పట్టుకుని రెండు ఫర్లాంగులు కొట్టుకు పోయేటప్పటికి అక్కడ గెడ్డ తిరిగి వెడల్పుగా వుండడం వల్ల ప్రవాహాన్ని తట్టుకుని నిలదొక్కుకుంటూ ఒడ్డున నీట్లో వేలాడుతున్న చెట్టుకొమ్మని అందుకుని వేలాడాడు. దుప్పిని మాత్రం విడవలేదు. అతికష్టం మీద కొమ్మ ఆసరాతో ఒడ్డున కాలుమోపాడు. దుప్పిని కూడా పైకి లాగేశాడు. అదృష్టవశాత్తూ అది అవతలిగట్టు. అక్కడ ఒక గంటకి పైగా విశ్రాంతి తీసుకుని దుప్పిని మోసేబలం చాలక దాన్ని కాళ్ళు పట్టుకుని గట్టు వెంబడి ఈడ్చుకుంటూ తను మునిగిపోయిన జాగా దగ్గరకు వచ్చాడు. తుప్పల్లో పడున్న తుపాకీని తీశాడు. తెల్లవారు ఝాము కావస్తూ ఉండడం వల్ల అడవిలో పిట్టలు ఒక్కటొక్కటీ అరుస్తున్నాయి. అడవి కోళ్ళు కూడా కూస్తున్నాయి. చల్లగాలికి, తడిసిపోయిన ఒళ్ళు గబ గబిలాడుతున్నా పొద్దు పొడవకముందే ఇల్లు చేరుకోవాలని దుప్పిని తిరిగి భుజాన్ని వేసుకుని రొప్పుకుంటూ రోజుకుంటూ గుడిసె దగ్గరికి వచ్చేటప్పటికి బాగా తెల్లారిపోయింది. గూడెంలో పశువులు అరుస్తున్నాయి.

దుప్పిని దింపి, తుపాకీ గుమ్మానికి జారేసి ఆయాసంతో అరుగుమీద చతికిల పడ్డాడు. వళ్ళంతా పచ్చిపుండులా ఉంది. వంటినిండా ముళ్ళ రక్కులు- నెత్తురు చిమ్ముతోంది. బరువు మోతకి మెడ కదుంకట్టిపోయింది. దుప్పి డెక్కతో చీరుకుపోయిన భుజం వాచిపోయి; సలుపూ పోటు పెడ్తోంది. వీటికితోడు కడుపులో ఆకలి రాజాకుంటోంది. బాధగా కళ్ళు మూసుకుని గోడకి చారబడ్డాడు. ““ఇంత కష్టపడినా మరేం ఫర్వాలేదు. సూరయ్య బాకీ తీరిపోతుంది. పొలం చెక్కపోకుండా దక్కుతుంది”. అనుకుంటూండగా వాకిట్లో ఎవరో కదిలినట్లయింది. మెల్లగా కళ్లు విప్పాడు. ఉలిక్కి పడి లేచి నిల్చుని పాముని చూచిన కప్పలా గజగజా వణికాడు.

“ఇదొక్కటేనా, ఇంకేవైనాపడ్డాయా? అడివిలో ఎక్కడో దాచేసుంటావు. దొంగనాకొడుకువి!” అని అడిగాడు అతి నెమ్మదిగా ఫారెస్టు గార్డు విషపు చూపులు చూస్తూ.

బైరిగాడు చేతులు జోడించి నిలుచున్నాడు. మాట పెగలడం లేదు. “ఈ తుపాకీకి లైసెన్స్ ఉందిరా?” మరో ప్రశ్న. బైరిగాడు కాళ్ళు పట్టుకోబోయాడు. “ మాట్లాడవేంరా, మాదచోద్?” గర్జించాడు ఫారెస్టు గార్డు.

“బాబ్బాబు.. బాబూ.. బీదోణ్ణి.. మరెప్పుడూ సెయ్యను!” ఫారెస్టు గార్డు రెండు కాళ్ళమీద బోర్లపడి పట్టుకున్నాడు.

బైరిగా డి జాత్తు పట్టుకుని లేవనెత్తాడు గార్డు.

“నీ అమ్మ మొగుడి దనుకున్నావురా, జంతువుల్ని కొట్టేస్తున్నారు?

రాత్రే విన్నాను, నీ తుపాకీ దెబ్బ. రాత్రి నుంచి తిరుగుతున్నాను. కొట్టిందెవడు చెప్మా అని- దొరికేవ్ నాకొడకా”

“మరింకెప్పుడు సెయ్యను. సత్తె పెమాణంగా చెబుతున్నాను. ఈ ఏలే ఎల్లాను. ఈ పల్లి చూస్తే జోడిచ్చు కుని కొట్టు” బైరిగాడి గొంతు బొంగురుపోయింది.

“ఈ దుప్పి నెత్తుకుని పట్నానికి పద కేసు బుక్ చేసేస్తాను. అడవిలో జంతువుని కొట్టినందుకు ఆర్నెల్లు, లైసెన్స్ లేని తుపాకీ ఉంచినందుకు ఆర్నెల్లు, జైల్లో దూల తీరిపోద్ది, తొత్తుకొడకా! నిన్ను కటకటాల్లో తోసేస్తేగాని తిక్క కుదర్దురా.. ఊ, పద.. పద… ఏట్రా, అలా చూస్తున్నావు? గుండెమీద తన్నీ గల్ను.”

అడవిలోకి కర్రలు కొట్టుకోడానికి వెళ్ళే గూడెం జనం దారిలో బైరిగాడి గుడిసె ముందు ఫారెస్టు గార్డు కేకలు విని గుమిగూడుతున్నారు.

బైరిగాడు గార్డు కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలుతున్నాడు. గుమిగూడిన జనం లోంచి ఎప్పుడొచ్చాడో నక్కలాగ షావుకారు సూరయ్య వాళ్ళందర్నీ తోసు కుంటూ ముందుకు వచ్చి “ఏటయింది గార్డు బాబూ?” అని అడిగాడు.

“చూడు నా కొడుకులు. ఒక్క జంతువు కూడా మిగల్నియ్య కుండా కొట్టేస్తున్నారు. ఈళ్ళు బాబుగారి ఫారెస్టు లాగ. ఫారెస్టుకి లైసెన్స్ లేదు. తుపాకీకి లైసెన్సు లేదు. గవర్నమెంటోడి పెద్ద కొడుకులు! ” అన్నాడు దుప్పినీ, తుపాకి నీ చూపిస్తూ.

“అందుకే శ్రా, మీకు జరగదు. దేవుడు తిన్నగా సూడ్డు., ముసిలోడి వయిపోయావు; నీకెందుకురా దొంగ బుదులు, దొంగతనంగా ఏట సెయ్యటం? నీకు పెళ్ళాం పిల్లలు సచ్చినారు. నువ్వొక్కడివే బిక్కు బిక్కుమని సావడానికి సిద్ధంగా వున్నావు. ఇంతలోనే దొంగతనంగా ఏటచేసేసి ఏంజేసుకుందామనుకుంటున్నావు? ఇంకా నీ కెందుకురా డబ్బు మీద వ్యా మోహం?” అని బైరి గాణ్ణి చీవాట్లు పెట్టాడు సూరయ్య.

““ఊ…ఊ… పద.. పద.. పదమంటే నీకు కాదంట్రా?” అంటూ బై రిగాడి మీదికి హుంకరించుకుంటూ వెళ్ళబోయేడు ఫారెస్టు గార్డు.

““ఇదిగో గార్డు బాబూ, షావుకారోణ్ణి చెబుతున్నానని అనుకోకు. నువ్వు దయతలచకపోతే ఆడి గతేటయిపోద్ది. ఆడు గరీబోడు. నువ్వు కాకపోతే ఆడి నెవడు రచ్చిత్తారు?”

“అయితే నన్నేటి చెయ్యమంటావ్, కేసు వదిలీ మంటావేమిటి? గొప్పగా చెప్పావయ్యా శెట్టీ!” ““ గార్డుబాబూ, నువ్వు కాస్త పస్తాయించుకో.. ఒరే బైరినా కొడకా, ఆ దుప్పి నెత్తుకో! పద, మాయింటికి. అక్కడ మాట్లాడుకుందాం…. ఇక్కడేంటి సూస్తార్రా మీ పనులకి మీరు పోక. ఇదేం బయిసుకోపా, కోలాటవా?” అని అక్కడ చేరిన మనుషుల్ని గదమాయించి పంపించేశాడు.

బైరిగాడు దుప్పి నెత్తుకుని ముందు నడుస్తున్నాడు.

వెనకాల నడుస్తూ దారిపొడవునా ఫారెస్టు గార్డుతో ఏవేవో మంతనాలు జరిపాడు సూరయ్య. గూడెంలో సూరయ్య ఇల్లు చేరుకున్నారు.

సూరయ్య బైరిగాడినీ, గార్డునీ ఇంట్లోకి తీసుకు వెళ్ళి తలుపు రెక్క చారేసి బైరిగాడితో ”ఒరే, బైరిగా ! 

గవర్నమెంటోడి అడవిలో లైసెన్స్ లేని తుపాకీతో జంతువుని కొట్టడం న్యాయవాఁ, అన్యాయవాఁ? భగవంతుడి మొహం చూసి చెప్పెయ్. ఏటంటావ్? అన్యాయవే కదా, దానికి సిచ్చపడ్డం న్యాయవే కదా. ఏటంటావ్? గార్డుబాబు కుర్రోడైనా ధర్మాత్ముడు. నామాట కొట్టేనేక నిన్ను ఒగ్గేస్తున్నాడు. ఏటంటావ్?… ఆ బాబుకి ఒక వంద రూపాయలు కట్నం ఇచ్చుకో. మరి మాట్లాడకు. ఏటంటావ్” ““ఇదేమిటయ్యా శెట్టీ.. ఒద్దులెద్దూ, నేను కేసు బుక్ చేస్తాను”.

“ బాబ్బాబు .. అదేం మాట. నువ్వలాగ పట్టుబడితే గరీబు నా కొడుకు సచ్చిపోతాడే”. ఓరి బైరిగా, ఏట్రా అలా చూస్తావ్?.. బేగి ఇచ్చీసుకో” . “నా దగ్గర డబ్బెక్కడిదీ? – పోనీ దుప్పిని ఒగ్గేస్తాను”.

“అహ, ఏంమాట చెప్పావురా నా కొడకా | దుప్పి నొగ్గేస్తావా? నువ్వొగ్గేసేదేంటి, అదెలాగూ ఆ బాబుదే. నువ్వు గాని దాన్ని పెంచినావేంటి ఒగ్గేడానికి! గవర్నమెంటోడి సరుకు గవర్నమెంటో డిదే. ఏటంటావ్?.. ఇదిగో, ఆలిస్యం అయితే ఆ బాబు మనసు మళ్ళీ మారిపోగలదు. కేసెట్టేస్తే, అదార్నెల్లు, ఇదార్నెల్లు, మరి గూడెం ముకంసూడవు. జైల్లోనే సస్తావు. ఏటంటావ్?” తనని బ్రతికుండగానే పూడ్చడానికి గోతులు తీస్తున్నట్టనిపించింది బైరిగాడికి. “ నీకు తెలియని సంగతికాదు. డబ్బు నా దగ్గరెక్కడిది?”

“ఊఁ” సాలోచనగా, చిరాగ్గా, కనికరంగా, కోపంగా కూడా బైరిగాడి వైపు చూసి “ఇదీ నా నెత్తిమీదకే?” అంటూ విసురుగా లోపలికి పోయి కాయితం పట్టుకొచ్చాడు.

“ఊర్లో కుక్క జట్టీలన్నీ నేనే తీర్చాల. ఊ, దీనిమీద నిశానీ తగిలించు. ఉ, సరే, నువ్వెళ్ళు. తరువాత కలుద్దాం.. ఊ.. ఏటంటావ్. నువ్విక్కడ ఉన్నావంటే ఆడి మనసు మళ్ళీ మారిపోగలు”. అంటూ బలవంతంగా సాగనం పేశాడు, బైరిగాణ్ణి షావుకారు సూరయ్య. ఉన్న కాస్తంత మెరక చెక్క మీదా వ్యా మోహం పూర్తిగా వదిలేసుకుని తలొంచుకు వెళ్ళిపోయాడు బైరిగాడు.

లక్ష్మీదేవి పటానికి నమస్క రించి, పత్రాన్ని సందుగు పెట్లో భద్రంగా దాచి; తాళాన్ని మొల్లో దోపుకున్నాడు సూరయ్య.

“ఇదిగో సెట్టి; ఆ దుప్పిని బారికోడితో పంపించు. రేపు మా రేంజరుగారి అమ్మాయి పెళ్ళుంది. అక్కడికి తోలేస్తాను. ఆరేంజరుకి ఎంతిచ్చినా దాహం తీరదు. ఇంకాతే ఇంకాతే అని పీక్కు తింటాడు”. అంటూ సూరయ్య శెట్టితో చెయ్యి కలిపి జేబులో వందరూపాయల్ని తడుముకుంటూ వెళ్ళిపోయాడు.

గుడిసెలో కూర్చుని బైరిగాడు చాలా సేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎప్పుడు పట్టిందో తనకి తెలియకుండానే చిన్న కునుకు పట్టింది ఆ మగత నిద్రలో.

ఎండలు | నిప్పులు చెరిగే ఎండలు! వడ దెబ్బకి పిట్టలు సొమ్మసిల్లి నేలరాలిపోతున్నాయి. పులులు, తోడేళ్ళు, జింకలు, దుప్పులు, పిట్టలూ నీటి

కోసం ఆర్చుకుపోతూ మందలు మందలుగా పరుగులు- ఉరకలు, దాహం తీరని దాహం. వాటి మధ్యలో తనూ, షావుకారు సూరయ్య, ఫారెస్టు గార్డు కూడా పరుగులు, ఉరకలు. దాహం.

మగత నిద్రలోంచి ఉలిక్కి పడి లేచాడు బైరిగాడు. చీకటి పడింది. ఒళ్ళు తూలిపోతోంది. గీరుకుపోయిన వళ్ళంతా వాచిపోయి సలుపూ, పోటూ. జ్వరం పీల్చేస్తోంది. అలా తూలుకుంటూనేగుడిసె బయటికి వచ్చాడు. చీకటి. చుట్టూ చీకటి. అడవంతా తన బ్రతుకు లాగే చీకటి. కళ్ళలో నించి, నోట్లో నించి సెగలు కక్కుతున్నాడు.. జ్వరంతోనూ, కసితోనూ, పగతోనూ రక్తం మరిగి పోతోంది.

తుపాకీ తీశాడు. జంతువుల వేటకి కాదు. . గాఢాంధకారంలో చండ ప్రచండుడిలా అడవిలోంచి నడుస్తున్నాడు.

పులులు గాండ్రిస్తున్నాయ్, తోడేళ్ళు వెంటాడుతున్నాయ్. వాటిని ముక్కలు ముక్కలుగా నరికే విముక్త నారాచంలా ఏకైక లక్ష్యంతో, కీకారణ్యంలోంచి పయనిస్తున్నాడు.

తుప్పల్నీ, పొదల్నీ, వాగుల్నీ దాటుకుంటూ కొండల్లోకి వెళ్ళిపోయాడు. అలా తుపాకీ పట్టుకుని కొండల్లోకి వెళ్ళిన బైరిగాడు తిరిగి రాలేదు.

(ఆంధ్రజ్యోతి వీక్లీ: 14-2-1975)

“‘మృగతృష్ణ’ – అల్లం శేషగిరిరావు గారి కథ” కి 4 స్పందనలు

  1. అడవి అందమైంది. ఎపుడూ అందంగానే ఉంటుంది. కావలిసినవెన్నో ఇస్తూ తనక్కావలసింది తీసేసుకుంటుంది. ఒక జీవితాన్ని తనలోని రాతిరితో పోల్చింది.
    పలకరింపు లాంటి ఒక రచనతో తన అందానికి సొబగులు దిద్దుకుంది.
    అడవి అందమైంది

  2. అల్లం శేషగిరిరావు గారి ‘మృగతుష్ణ’ కధ చదువుతున్నసంత సేపూ మనస్సును కదిలించింది. మనస్సంతా బైరి గాడి మీద సానుభూతి తో నిండిపోయింది. ఈ కథ ప్రచురించి దాదాపు 45 సంవత్సరాల యినా, ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కు అద్దం పడుతోంది. మంచి కథ ప్రచురించిన హర్షణీయం కు ధన్యవాదాలు.

    1. హర్షణీయం Avatar

      Thank you Sudhannaiah.

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading