Apple PodcastsSpotifyGoogle Podcasts

మనోభావాలు దెబ్బ తీసిన ఐదేళ్ల అమృత!

మేము డెన్వర్ లో వున్నరోజులు అవి. ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా అమృత వాళ్ళ ఉపాధ్యాయురాలి నుండి ఫోన్ వచ్చింది, వచ్చి వెంటనే కలవమని. ఆవిడని అడిగాను నేను మరుసటి రోజు వచ్చి కలవవచ్చా అని, దానికావిడ ఈరోజే వచ్చి కలిస్తే మంచిదని చెప్పటం తో ఆఫీసు నుండి బయలుదేరాను. దారిలో ఎన్నో ఆలోచనలు, అమృతాని ఉదయమేమన్నా అరిచానా?  అదేమన్నా బడికి వెళ్లి మా నాన్న అరిచాడు ఈరోజు అని వాళ్ళ ఉపాధ్యాయురాలికి చెప్పిందా అని?

సుప్రియాకి కూడా ఫోన్ చేసి అడిగాను, తనేమన్న అన్నదా అమృతాని ఈరోజు కానీ లేక గత రోజుల క్రితం గాని అని? అసలే ఈ అమెరికాలో తలితండ్రులు 911  దెబ్బ, పిల్లలకి హడిలి పోయేకాలం.  సుప్రియా అటువంటిదేమీ లేదని చెప్పినా మనసేమో పరి విధాలుగా పోతున్నది. అసలే నాకు మరియు మా అమ్మకి ఏమన్నా సమస్య వస్తే పరిష్కారమేమిటి అన్న ఆలోచన కాక, పుట్టు లెత్తమంటే పూర్వోత్తరాలు ఎత్తిన మాయిన, మూల కారణాలు శోధించటం అలవాటు. దేశం కానీ దేశం లో ఏమన్నా విరుద్ధం గా జరగబోతుందా అన్న భయంతోనే, బిక్కు బిక్కుమని అమృతా వాళ్ళ క్లాస్ రూమ్ కి వెళ్ళా.

పిల్లలందరూ ఎదో యాక్టీవిటీ లో నిమగ్నమై వున్నారు, మా అమృతా మాత్రం వాళ్ళ క్లాస్ రూమ్ కార్నర్లో వున్న ఒక పార్టిషన్ చేయబడ్డ  ప్రదేశంలో ఒక్కటే కూర్చొని వుంది. నాకర్థమయ్యింది మా అమృతాకి వాళ్ళ ఉపాధ్యాయురాలు టైం అవుట్ ఇచ్చిందని. నాకు చెప్పొద్దూ అదొక్కటే అలా ఐసోలేటెడ్ గా ఎదో ముద్దాయిల కూర్చొని ఉంటే తెగ నవ్వు వచ్చేసింది. వాళ్ళ ఉపాధ్యాయురాలు మాత్రం లేని గాంభీర్యాన్ని మొహంమీదకు తెచ్చుకొని నన్ను ఆసీనుడవ్వమని చెప్పారు.

నేనుఆసీనుడను అవ్వగానే చెప్పారు ఆవిడ, మీ అమృత మీద తన సహాధ్యాయిని వాళ్ళ నాన్న గారు వచ్చి ఒక ఫిర్యాదు చేసి వెళ్లారు, ఆ ఫిర్యాదు చాలా గంభీరమైనది అని. ఇంతకీ ఏమిటంటే ఆ ఫిర్యాదు, అమృత తన సహాధ్యాయినితో చాలా వర్ణవిచక్షణ బహిర్గత మయ్యేలా ప్రవర్తించిందని. అసలు అమృత అలా ఎలా ప్రవర్తించిందనేది ఆవిడకి అర్థం కానీ విషయమని, దాని గురుంచే మాటలాడడానికే నన్ను పిలిపించానని చెప్పారావిడ.

దేవుడా, ముక్కు పచ్చలారని ఐదేళ్ల అమృత మీద ఈ నింద ఏమిటి అని అనుకుంటూ, వివరాలు అడిగిన నాకు, “అమృత నిన్న ఉదయం బడికి రాగానే, ఆ అమ్మాయి దగ్గరకెళ్ళి  తనని స్నిఫ్ చేసి, యు అర్ స్టింకీ, బెటర్ టేక్ యువర్ బాత్”,  అని అన్నదని చెప్పింది. అది ఆ అమ్మాయి, నల్లనయ్య అయిన వాళ్ళ నాన్నగారికి చెప్పటం, ఆయన ఈరోజు అమృత వాళ్ళ ఉపాధ్యాయురాలిని కలవటం మరియు ఫిర్యాదు చేసెయ్యటం జరిగిపోయాయట.

నాకర్థమయ్యింది ఈ సమస్యకి మూల కారణం నేనేనని. అవి చలికాలం కావటంతో అమృత స్నానం చేయడానికి ప్రతీ రోజు మమ్మల్ని విసిగించేది. రోజూ ఎదో ఒక విధం గా తన చేత స్నానం చేయించటం మాకు గగనమయ్యేది. తనని స్నానం చేయించడానికి నేను అమృత దగ్గరకెళ్ళి తమాషాగా తన చేతులు లేక ముఖాన్ని స్నిఫ్ చేసినట్టు నటించి, “అబ్బే అమృత స్నానం చేయలేదు, అమృత ఈజ్ స్టింకీ,  అమృత బెటర్ టేక్ హర్ బాత్” అంటూ ఏడిపిస్తే చేయించుకునేది స్నానం.

నా ఈ ఎదవ పదజాలం చిన్నదైన అమృత ఆ పిల్ల దగ్గర అనుకరించి సమస్యలో పడిపోయింది. నేను ఈ విషయమంతా వాళ్ళ ఉపాధ్యాయురాలికి వివరించి, తన తప్పేమీ లేదని, కావాలంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని కలిసి  నేను క్షమాపణ చెప్తానని చెప్పాక విషయం సద్దుమణిగింది. ఆ తర్వాత రోజు నేను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి కలిసి, నా క్షమాపణలు వేడుకున్నా. ఆయనకూడా నవ్వేసి, నాకేమీ అర్థం కాకుండా, “యు బెట్ మాన్, హా హా హా” అంటూ వెళ్ళిపోయాడు.

ఇలా మన అనాలోచిత పనులు మన పిల్లల్ని ఎలాటి సమస్యల్లో పడవేస్తాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ తర్వాత మాకు అమెరికాలో ఉన్నంత వరకూ ఎలాటి సమస్యా ఉత్పన్నం కాలేదు. అలా అమెరికాలో ఉండగా అమెరికనుల మనోభావాలు గౌరవించాము. 

“మనోభావాలు దెబ్బ తీసిన ఐదేళ్ల అమృత!”‌కి ఒక స్పందన

  1. Amrutha kada bavundi, ee story chadivaka parents evaru pillalatho ala chepparemo😊chakkaga raasaaru

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading