Apple PodcastsSpotifyGoogle Podcasts

హర్షణీయంలో సాహితీవనం !

హర్షణీయం వయస్సు రెండు మాసాలు. ఈ రెండు మాసాల్లోనే నేను, నా మిత్ర బృందం దాదాపు 1800 మంది అతిథులను, వారిచే 9000  దర్శనాలను మరియు పునర్దర్శనాలను సంపాదించుకున్నాము. మొదట మా గిరిగాడి సలహాకు నవ్వుకున్నాము, మా కథలను ఆడియో రూపంలో కూడా పెట్టమన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆశ్చర్యం గా మా కథలు ఆడియో రూపంలో రమారమి  5000 మార్లు దిగుమతి అయ్యాయి.

ఎంతో మంది స్నేహితులు, బంధువులు, సన్నిహితులు వారి సందేశాల ద్వారా ప్రోత్సహిస్తూ మా ఉత్సాహాన్ని ద్విగుణీకృతం కావిస్తున్నారు. మీ ప్రోత్సాహం ద్వారా మా ఉత్సాహాన్ని పెంపొందిస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు.

నాకు మరియు నా మిత్రులకు చిన్నప్పటినుండి తెలుగు భాష అంటే వల్లమాలిన ప్రేమ. నేను ఇదివరకే మీకు చెప్పినట్టు నా బాల్యం నుండి ఇప్పటివరకు నాతో ప్రయాణం చేసిన వ్యక్తులను గురించి, నా అనుభవాల గురుంచి అందరితో పంచుకుందామనే ఉద్దేశ్యం తో నేను తెలుగులో రాయటం మరియు నా మిత్రులు వాటిని చదివి ప్రోత్సహించి, వాటిని ఈ బ్లాగు రూపంలో ఆవిష్కరించమని ఆదేశించటం, నేను పాటించటం జరిగిపోయింది.

ఎప్పటిలాగే మా అనీల్గాడు నా బుర్రలో ఇంకో ఆలోచనకు బీజం వేసాడు. మనం ఈ బ్లాగ్ ద్వారా మనకు తెలిసిన మనలాగే తెలుగు అంటే వల్లమాలిన అభిమానం మరియు భాష మీద మనకు లేని పట్టు వున్న సాహితీ మిత్రులని వారి అనుభవాల ద్వారా లేక కథనాల ద్వారా ఎందుకు పరిచయం చేయ కూడదు అని. ఈ ఆలోచన సమంజసముగా ఉండటం తో మేము మా వాడికి గురుతుల్యులైన శ్రీ సుందర బాబు మాష్టారు గారిని సంప్రదించటం, ఆయనకూడా హర్షణీయానికి మొదట గెస్ట్ బ్లాగ్ రాయడానికి సుముఖతని వ్యక్తం చేయటం వెను వెంటనే జరిగిపోయాయి.

ఆయన పరిచయానికి వస్తే, నెల్లూరి వాస్తవ్యులైన శ్రీ సుందర బాబు గారు తన చిన్నతనం నుండి విపరీతమైన సాహితీ అభిలాష వున్న వ్యక్తి. పుస్తక పఠనం అనేది ఆయనకీ వ్యాపకం కాదు వ్యసనం. ఆయన మన వెంకటేశ్వర విశ్వ విద్యాలయము నుండి తెలుగు, చరిత్ర మరియు ఆంగ్ల శాఖలలో విడి విడి గా మాస్టర్ అఫ్ ఆర్ట్స్ ఆపైన మాస్టర్ అఫ్ ఎడ్యుకేషన్ లో పట్టా పుచ్చుకున్నారు. నలభై ఏళ్లకు పైగా ఉపాధ్యాయుడిగా మరియు ప్రధానోపాధ్యాయుడుగా సేవలు అందించిన ఆయన 1999 వ సంవత్సరములో పదవి విరమణ చేసి తన విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఆయనచే విద్యను భిక్షగా పొందిన వారు ఎందరో ఈనాడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉన్నత పదవులను అలంకరించి వున్నారు.

ఆయన వ్యక్తిగత గ్రంధాలయం లోనే తెలుగు మరియు ఆంగ్ల భాషలలో దాదాపుగా ఓ మూడు వేల పుస్తకాలు ఉంటాయి అని మా అనీల్గాడు నొక్కి వక్కాణించి చెబుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చదువు చెప్పటం, చదువుకోవటం మరియు చదవటం లాటి వ్యసనాలను ఒక చక్ర భ్రమణం లాగ సాగిస్తూ తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నారు.

ఈ గెస్ట్ బ్లాగ్ ద్వారా ఆయన మనకి తెలుగు సాహిత్యంలో ట్రావెలోగ్స్ అనే అంశం మీద మనకు మూడు వ్యాసాలు మూడు భాగాలుగా అందించబోతున్నారు. నేను ఈ భాగాలను భారతీయ కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రచురించాలని అనుకుంటున్నాను.

“హర్షణీయంలో సాహితీవనం !” కి 2 స్పందనలు

  1. చాలా మంచి ఆలోచన . చూస్తుంటే మీ మాస్టారు సాహిత్యం లో చాలా మెట్లు పైనే ఉన్నారు , అటువంటి వాళ్ళు అతిధి లా వఛ్చి వెళ్లిపోవడం కన్నా , ఒక సొంత బ్లాగ్ ప్రారంభించి , తరుచుగా తమ అభిప్రాయాలను , అనుభవాలను రాయడం ఇంకా ఎక్కువ బాగుంటుందేమో అని నా అభిప్రాయం . సాహిత్యం లో అంత పట్టు లేని నాలాంటి వాళ్ళు మరియు బాగా బిజీ గా ఉండేవాళ్ళు అతిధి గా రాయడం ఓకే , ఎందుకంటే ఒక సొంత బ్లాగ్ ని మైంటైన్ చేసే అంత విజ్ఞానం , టైం ఉండకపోవచ్చూ . అందు చేత , దయచేసి మీ మాస్టారు గారి ని సొంత బ్లాగ్ రాసేలా మీరు ప్రోత్సహించమని కోరుకుంటున్నాను .

  2. […] దేశానికి మహా ఇతిహాస జాతీయ కావ్యాలైన రామాయణ, భారత, భాగవతాలు ఎట్లో, ప్రాచీన […]

Leave a Reply to venkiCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading