Apple PodcastsSpotifyGoogle Podcasts

రావిశాస్త్రి గారి ‘వర్షం’

హర్షణీయానికి స్వాగతం.

“ రచయిత ప్రతివాడు, తాను రాస్తున్నది, ఏ మంచికి హాని కలిగిస్తుందో , ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను.” ఈ మాటలన్నది, తెలుగు కథారచయితల్లో అగ్రగణ్యుడుగా కొనియాడబడే శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు.

కవిత్వంలో శ్రీశ్రీ గారు చేసిన పని, కథల్లో రావిశాస్త్రి గారు చేశారని, 1993 లో ఆయన మరణించినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక తన సంపాదకీయంలో రాసింది.

తన రచనలకు ప్రదానం చేసిన ‘సాహిత్య అకాడమీ’ పురస్కారాన్ని, ఆంధ్రా యూనివర్సిటీ వారి ‘ కళాప్రపూర్ణ’ బిరుదుని ఆయన తిరస్కరించడం గూడ జరిగింది.

ఇప్పుడు మీరు వినబోయే ‘ వర్షం ‘ ఆయన రచించిన అత్యుత్తమ కథలలో ఒకటి. 

ఈ కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి,  తన అనుమతిని ఇవ్వడమే కాక, ఆడియో రూపంలో రావడానికి ఎంతో సహకరించిన శ్రీ రాచకొండ ఉమాకుమార శాస్త్రి గారికి , మా కృతజ్ఞతలు.

ఈ కథ అరసం వారు ప్రచురించిన, రావిశాస్త్రి గారి కథాసంకలనంలోనిది.

ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు వెబ్ పేజీ చివరలో అందించడం జరిగింది.

వర్షం: 

వర్షం  దబాయించి జబర్దస్తీ చేస్తోంది. సాయంకాలం అవుతోంది. 

మబ్బులవల్ల, మామూలుకంటె, చీకటి ఎక్కువగా వుంది. రోడ్డుపక్క కమ్మలపాక – టీ దుకాణంలో

చీకటి చికాగ్గా వుంది. 

అడివిపాలెంనుంచి వచ్చి తన దుకాణంలో చిక్కుకుపోయిన సిటీ బాబుని ఉద్దేశించి,

“మూడ్రోజులక్కాని ఒగ్గ దీ ఒరసం” అన్నాడు దుకాణం తాత. ఒగ్గితే సెవి కదపాయిస్తానన్నాడు. 

బల్లమీద దిగులుబడి కూర్చుండిపోయేడు, సిటీబాబు అనబడే పురుషోత్తం. 

“టేసన్ కి కదు బాబూ ఎళ్ళాలన్నావు?” ఆకాశం మెరుపుతో చీల్చుకొంది. 

“అవును” 

“అబ్బో! ఎక్కడ, రొండుకోసులుందే!”  అన్నాడు దుకాణం తాత. 

పిడుగు పడ్డట్టుగా ఉరిమింది.

 “ఏఁవిఁటీ?” 

“రొండుకోసు లుందయ్యా బాబూ! బొగ్గులకోసం కుట్టోణ్ని అక్కడికే తగిల్నాను. సదువుకోనేదుగాని నాకేరికే. రెండుకోసులుంది” అది రెండువేల మైళ్ళ దూరం అన్నట్టుగా చెప్పేడు దుకాణం తాత.

“బస్సు దొరకదా?” అని హీనస్వరంతో అడిగేడు పురుషోత్తం.

“ఈ ఒరసంలో బస్సు రాగల్గా? ఎర్రటి నీకు – ఉత్తప్పుడేరాదు. మా కుర్రాడు నడిసే ఎళ్ళేడు. ” 

పురుషోత్తానికి కొంచెం గాభరా వేసింది. అత్యవసరమైన పనిమీద అతను కలకత్తా వెళ్ళవలసి వుంది. మూడు రోజుల లోపల అక్కడికి వెళ్ళాలీ అంటే మరో రెండుగంటల్లో అతను స్టేషన్ చేరుకోవాలి. బస్సు రాదట. బళ్ళు కనిపించవు. వర్షం చూస్తే పెను ప్రళయంలా ఉంది.

“నేను కలకత్తా వెళ్ళాలే” అన్నాడు పురుషోత్తం 

“ఏ వూరూ?” “అబ్బో! శానా దూరఁవేఁ! అక్కడి కెళ్ళాలా నువ్వు?” 

“అవును” అన్నాడు పురుషోత్తం. 

“ఎళ్ళలేవు” చాలా ఖచ్చితంగా చెప్పేడు దుకాణంతాత. 

దిగులుపడి కూర్చుండిపోయేడు పురుషోత్తం. కత్తుల్లా మెరుపులు మెరుస్తున్నాయి. కొండలు బద్దలయినట్టు ఉరుములు ఉరుముతున్నాయి. శివాలెత్తి గాలి పరిగెడుతోంది. పగపట్టినట్టుగా వర్షం తెగపడుతోంది. చీకటి పట్టినపాకలో…. కొత్త పంట్లాం, కొత్త చొక్కా కొత్త జోళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఆ మూడు పురుషోత్తం వేసుకున్నాడు. అతన్ని బాగా చూడాలీ అంటే దీపం వెలిగించి చూడాలి. అతను చక్కనివాడా? ఒప్పుకొనేవాళ్ళు తక్కువ. అతని నడుం మాత్రం చక్కగా సన్నగా ఉంటుంది అతను సింహమధ్యముడే కాని సింహంలా ఉండడు. అతని పదిహేనోయేట “ఇరవయ్యేళ్ళుండవా?” అని చాలామంది అనుకొనేవారు. దుకాణం తాతని ఆ సమయంలో అడిగితే “నలభై దగ్గిరుండవా” అని అడగ్గలడు. పురుషోత్తం పాతిక సంవత్సరాల క్రితం పుట్టాడన్న సంగతి, ఆ పుట్టుక తెలిసిన వాళ్ళకి తప్ప మరొకరికి తెలియదు. అతను ఎదగని పడ్డలా వుండిపోయేడు.

*******************

ఆ సమయంలో ఆ దుకాణంలో దూరేందుకు అతగాడు ఆ ముందు రోజు బయల్దేరేడు. పయనమవడం కలకత్తాకనే పయనమయేడు. అంతలో అతని మేనమామ గాలీ ధూళిలా వచ్చిపడ్డాడు. ఆ మేనమామ అందరికీ ఉచితంగా సలహా లివ్వగలడు; అవలీలగా పనులు పురమాయించగలడు. 

అతగాడు వచ్చిపడి “నీకు పెళ్ళి కావాలనే సంగతి నీకేమైనా తెలుసా?” అని పురుషోత్తాన్ని ప్రశ్నించి టకాయించేడు. టకాయించి “వెళ్ళు వెళ్ళు మంచిది, వయసుది, డబ్బుది. అడివిపాలెంలో మున్సబుకూతురుంది,పిల్లని చూసేసి అలా కలకత్తా వెళ్ళిపోవచ్చు. వెళ్ళు వెళ్ళు వెళ్ళి చూడు” అని మేనల్లుణ్ణి వెంట తరిమేడు. 

దాన్తో చేతిలో పెదసంచీ వట్టుకొని అడివిపాలెంలో బంధువులింట్లో ప్రత్యక్షమై సాయంకాలం మున్సబుగారింట్లో కొత్త బట్టల్తో పెళ్ళికూతురి ముందు ప్రత్యక్షమయేడు పురుషోత్తం, ఆ పిల్ల తన చూపుతో అతనికొక చిక్కు ప్రశ్న వేసింది.

“మునసబు”గారిది పాతకాలపు పెంకుటిల్లు, లోపల వరండాల్లో చాపమీద కూర్చోబెట్టేరు పెళ్ళికుమార్తెని. ఆ పిల్ల మఠం వేసుకొని కూర్చొంది. 

పక్కనే వాకిట్లో తులసి కోట పక్క దండెం మీద తెల్లచీర ఒకటి ఆరవేసి వుంది. వాకిట్లో తోమిన ఇత్తడిగిన్నెలు తడితో మెరుస్తున్నాయి. ఇంటివెనక మామిడి చెట్టొకటి చీకటిగా ఆకుపచ్చగా కనిపిస్తోంది. దానిపక్కనే కొబ్బరిచెట్టొకటి నిటారుగా ఎత్తుగా గంభీరంగా మామిడి చెట్టు కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధంగా నిల్చొంది. అస్తమించడానికి తటపటాయిస్తూ దూరాన్న సూర్యుడు ఆకాశంలో అవతల గుమ్మం దగ్గర నిల్చున్నాడు. అంతలో గది తలుపులన్నీ గప్పున తెరచి ఆకాశమంతటా కుంకాన్నెవరో కుమ్మరించేరు. అంతట చెట్టున మామిడి చిగుళ్ళు, చెట్టున కొబ్బరి కొమ్మలు సంతోషంతో మూగనవ్వు నవ్వేయి, ఆరవేసిన తెల్లచీర వెలుగుని వరండా అంతటా ఎర్రగా గుప్పున వెదజల్లింది. మెరిసే ఇత్తడిగిన్నెలు రాగిరంగు కలుపుకొని బంగారంలా మెరిశాయి. తులసికోటలో తులసి మొక్క నర్తకిలా నిల్చొంది.

దీపపు వెలుగున దేవి విగ్రహంలా కనిపిస్తోంది పెళ్ళికూతురు. ఆమె తల కొంచెం దించి, రెప్పలు కొంచెం పైకెత్తి పురుషోత్తాన్ని నిదానంగా పరిశీలనగా చూసింది. ఆమె కళ్ళు విశాలంగా స్వచ్ఛమైననీటితో నిండిన తటాకాల్లా ఉన్నాయి. మారుమూల కుగ్రామంలోనే ఉన్నప్పటికీ ఆ తటాకాలు మెరిసే చుక్కల్నీ, వెలిగే చంద్రుణ్నీ, మండే సూర్యుణ్నీ కూడా సుస్పష్టంగా చూడగలవు. అవి చాలా దూరం చూడగలవు.

ఏవేవో ప్రశ్నలువేసి కూతురిచేత జవాబులు చెప్పిస్తోంది తల్లి. ఆ పిల్ల సన్నంగానే మాట్లాడుతోందిగాని, గుహలో మాట్లాడినట్టుగా గంభీరంగా మాట్లాడుతోంది. ఇంటర్వ్యూ ముగిశాక పురుషోత్తం లేచి నిల్చున్నప్పుడు, ఆమె చాపమీద కూర్చునే అతణ్ని నిదానంగా మరోసారి బరువుగా రెప్పలు కొంచెం పైకివంచి చూసింది. చూసి, నెమ్మదిగా నిల్చొని లోనికి వెళ్ళిపోయింది. ఆమె చూపు అతన్లో ఏదో అలజడి పుట్టించింది. కాని అతనికేమీ సరిగా అర్థం కాలేదు.

మర్నాడు బంధువులింట్లో మధ్యాహ్నం భోజనం చేసి రెండెడ్ల బండి ఎక్కి రోడ్డు జంక్షన్ కి బయల్దేరేడు. మధ్యాహ్నం ఒంటిగంటయింది. మువ్వలు చప్పుడు చేస్తూ ఎడ్లు ముందుకు సాగేయి. దార్లోనే ఉన్న మున్సబుగారింటిని, బండి దాటుతుండగా ఆ అమ్మాయి ఎందుకోసమో వీధి నడవలోకి వచ్చి బండీ చూచి ఇంటిలోకి వెళ్ళిపోకుండా, అక్కడే ఆగి, గుమ్మాన్ని ఓ చేత్తో ఆనుకొని నిశ్చలంగా నిల్చొని అతణ్ని నిశ్చలంగా చూసింది. బండీ ముందుకి సాగిపోయింది. ఆమె దూరాన్న ఉండిపోయింది. కాని ఆ చూపు అతణ్ని వెంట తరుముతోంది. మరో విధంగా చెప్పాలంటే, ఆ చూపు ఆతన్లో గోతులు తవ్వుతోంది. 

***************************

కొన్నాళ్ల క్రిందట పురుషోత్తం జబ్బుపడి ఆస్పత్రికి వెళ్ళేడు. అప్పుడతను చాలా నీరసపడి చిక్కిపోయున్నాడు. ఆస్పత్రిలో డాక్టర్ల వెనకనుంచి ఓ నర్సు ముందుకొచ్చి “ఇలారా” అని అతణ్ని తూకపు మెషీను దగ్గరికి తీసుకువెళ్ళింది. తీసుకువెళుతూ తనని ఆమె చూడ్డం అతను గమనించాడు. ఆమె చాలా లేతగా వుంది. రోగుల బాధలకి బాగా అలవాటుపడిపోగా ఆమె ఇంకా అమానుషంగా తయారవలేదు. ఆమె కళ్ళు చాలా చిన్నవి. ఆమె చూపులో అర్థం అతనికి తూకం మెషీను చూసేదాక బోధపడలేదు. 

దాన్ని చూశాక “ఓహో! ఈమె నా బరువెంతో అంచనా కడుతోంది” అనుకున్నాడు. మెషీన్ మీంచి అతను దిగిన తర్వాత ఆమె జాలిగా చూసి, హెచ్చరికగా నవ్వి, “మరేం భయం లేదు. ధైర్యంగా వుండు. నిమిషంలో నయంమవుతుంది జబ్బు” అని హుషారిచ్చింది. కృతజ్ఞత ఎలా తెలియజేయాలో తెలియక అతనప్పుడు కంటతడి పెట్టేడు. 

**************************

బండిలో కూర్చుని వెళుతూంటే ఆ లేతనర్సెందుకోగాని గుర్తుకొచ్చింది పురుషోత్తానికి.దూరంలో నల్ల కొండలు, ఇవతల కొబ్బరితోటలు, ప్రక్కన పచ్చని చేలు, పైన తెల్లటిమేఘాల చాందినీ, అంతా అలా చూస్తోనే అతడు ఆలోచనలో పడిపోయేడు. నేను సరియైన బరువులేనా? అని ఓసారి అనుకున్నాడు. కాని అతనికేమీ సరిగా అర్థం కావడం లేదు. తడికర్రకి నిప్పంటనట్టుగా, అతని మనసు రాజుకోవడం లేదు. బండి తాజుగా వెళోంది. “ఒహోయ్ హోయ్ హోయ్, మంటూ బండివాడు ఎడ్లని ఆ పేటప్పటికి త్రుళ్ళిపడి, బండిలోంచి దిగేడు పురుషోత్తం. ఆ సమయంలో ఎక్కడో ఆకాశం దద్దరిల్లింది. తోటల్లో గాలి గలగలమంది! రివ్వురివ్వుమంది. పురుషోత్తం ఆకాశంకేసి చూసేడు. తెల్లమబ్బుల్ని గాలి తుడిచిపారేసింది. ఓ పక్క నల్లమబ్బులు లావాలా, పెనుగడ్డలా పెల్లుబికి, వాహినిగా విజృంభించి ముందుకొస్తున్నాయి.

నాటురోడ్డు ట్రంకు రోడ్డు కలిసేచోట రోడ్డుప్రక్క అధికారిలా నిల్చున్న చింతచెట్టు ఈదురుగాలికి తలవిసిరి ఆకాశాన్ని ఎదిరిస్తోంది. చెట్టుకింద కమ్మలపాక చలిగాలికి ముసలమ్మ వణికినట్టు వణుకుతోంది. అంతలోనే మబ్బులు ముంచుకొచ్చేయి. ఎండ వేడికి పలకమీద నీరు మాయమైనట్టు ఎండంతా కూడా చూస్తోండగా మాయమయింది. పొలాల మీద మబ్బుల నీడ ప్రవాహంలా పరిగెట్టింది. 

ఆబండివాడు గాలినీ ధూళినీ బూతులు తిడుతూ బండిని మళ్ళించి మొత్తాల మీదికి చెంగున ఎగిరేడు. ధూళిని చీలుస్తూ ఎడ్లు దౌడుతీశాయి. పురుషోత్తం ఎదురుగా వున్న కమ్మలపాకలోకి దూరేసరికి వర్షం దడదడలాడుతూ దిగింది. జోరుగా వీస్తోన్న గాలి మరికొంత జోరుచేసేసరికి, ప్రవాహం ఒక్కసారిగా పల్లానికి దిగినట్టు, వర్షపుధార పాకని ముంచేసి హోరుమంటూ ముందుకిపోయింది.

******************************

కమ్ములపాక ‘టీ’ దుకాణంలో బల్లమీద గంట పై నుంచీ కూర్చున్నాడు పురుషోత్తం. ‘టీ’ బల్లమీద గళాసులు పనిలేక పడున్నాయి. కెటిల్ వంటి దొకటి పొయ్యిమీద పడుకుంది. పొయ్యిలో నిప్పు చల్లబడిపోతోంది. దుకాణం అంతా తీరుబాటుగా ఉంది.

 టీ చెయ్యడం తనపని కానట్టుగా ముక్కాలి పీటమీద ముసలిపిల్లిలా కూర్చున్న దుకాణం తాత, ఆరిపోయిన చుట్టని రెండు పీల్చులుపీల్చి, అంటించకుండా దాన్ని టీ బల్లమీది పెట్టి, ‘ఏ వూరు బాబూ మనిది?” అని పురుషోత్తాన్ని మొదటి ప్రశ్నగా అడిగేడు. తర్వాత వరుసగా, నెమ్మదిగా – కమ్మలచూరు నుంచి వానజల్లుకి ఒకటొకటిగా నీటి బొట్టు తాజాగా కిందికి దిగినట్టు – ప్రశ్నల్ని వరసగా దింపడం ప్రారంభించేడు. 

జవాబివ్వకపోతే ఏం కొంప మునిగిపోతుందో అన్నట్టు వాటన్నంటికీ పురుషోత్తం జవాబిస్తున్నాడు.

అన్నీ తెలుసుకొని, ఆఖరికి, నువ్వు వెళ్ళదల్చుకున్న చోటికి వెళ్ళలేవు అని ఖచ్చితంగా పురుషోత్తంతో చెప్పేసి అందుగురించి సంతృప్తిపడి నవ్వుకున్నాడు దుకాణం తాత.

పైన వర్షం జోరుచేస్తోంది. గాలి గీఁకొడుతోంది. ఆకాశాన్ని మెరుపులు చీలుస్తున్నాయి. ఉరుములు బద్దలు కొడుతున్నాయి. కొండలన్నీ వాన తాకిడికి మొండికెత్తి నిల్చున్నాయి. చెట్లన్నీ తిరగబడుతున్నాయి. దుకాణంలో పొయ్యిలో నిప్పుకి గాలి అందడం లేదు. మీద నుంచి కురిసే నీరుమాత్రం కెటిల్ మీంచి జారి నిప్పుల్లో ఇంకుతోంది.

నవ్విన నవ్వుని మాసిన గడ్డంలో మాయం చేసి “బొగ్గుల కెళ్ళేడు. కుర్రోడింకా రానేదు బాబూ, ఎక్కడుండి పోనాడో ఏదో” అన్నాడు దుకాణం తాత.

“అయితే బస్సు రాదంటావా?” అన్నాడు పురుషోత్తం.

 “ఆ మాట కొస్తే రెయిల్ గాడీనేరాదు. ముండమోపి బస్సుకి నెక్కేటి? అని, ప్రపంచమంతా ఆవిధంగా వర్షం వల్ల స్తంభించిపోయినందుకు, హర్షం వెలిబుచ్చేడు దుకాణం తాత.

గాలికీ వానకీ పాకమీద పాములు జారినట్టుగా చప్పుడౌతోంది. బ్రెయిన్ రావడానికి పూర్తిగా రెండు గంటలైనా వ్యవధి లేదు.

“పెందలకాడే బయలెల్లి నడిచేసినా అందేద్దువు. మరింకిప్పుడీల్లేదు. ఏళ్ళూ వూళ్ళూ ఏకవేఁ మరింక”. నడిచి వెళ్ళడానికి వీలుపడనందుక్కూడా హర్షం వెలిబుచ్చేడు దుకాణం తాత. 

బాధింపబడుతూ అలానే కూర్చున్నాడు పురుషోత్తం. బొగ్గుల కోసం పయనమైన కొడకడింకారానేదని దుకాణం తాత విసుక్కుంటున్నాడు. పాకంతా తడిసి ముద్దయింది. చలి హెచ్చూ, చలిగాలి జోరూ అయేయి. పైన వర్షం పడుతోంది. 

“పడకేటి చేస్ది బాబూ! దానిటయాం అది”. 

ట్రెయిన్ రావడానికి రెండు గంటలైనా వ్యవధి లేదు. రెండు కోసుల దూరం అలానే ఉండిపోయింది. బస్సు ఎక్కడో ఆగిపోయింది. ఆకాశం విరుచుకుపడిపోతోంది. పురుషోత్తం లేచి నిల్చున్నాడు.

“నరమానవుడన్న వోడూ బైట అడుగెట్టడానికీల్లేదు” అన్నాడు తాత. 

రెస్టు లేనివాళ్ళా పురుషోత్తం అటూ ఇటూ తిరిగేడు. పనిలేక గింజుకున్న వాళ్ళ గింజుకున్నాడు.

“అగ్గుందా బాబూ?” అడిగాడు తాత. 

“లేదు”

“ఉండదనే అనుకున్నాన్డే. నీట్లో అగ్గి పుట్టించాలగాని, మరి దొరకదు. ఈడు జూస్తే ఇంకా రాలేదు. ఎక్కడ చిక్కడి పోనాడో ఏటో? గేటుకాణ్నుండి బొగ్గులు పట్టుకొస్తానని పారెళ్ళాడు బాబూ! కుర్రోడేగాని శండసేసనమ్ముండకుడులే! ఒరసవేఁ నన్నమాటేటి. దిమదిమలాడుతూ ఏనుగులు దిగేసినా నెక్కసెయ్యడు”. 

కుర్రవాడు వెళ్ళడం, బొగ్గులు తేవడం, ఏనుగులు దిగడం వీటిగురించి వినడం లేదు. పురుషోత్తం చుట్టూ పాకంతా బందిఖానాలా అవుపిస్తోందతనికి. ఇనుప ఊచలు దిగొడుతున్నట్టుగా వర్షధారాలు చుట్టూ దిగుతున్నాయి. అతను ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. పరిస్థితులకి చిరాకుపడిపోతున్నాడు.

వెళ్ళు వెళ్ళంటే వెళ్ళిపోయి వచ్చాడు తను. ముందు కలకత్తానే వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసుకొని ఆ తరవాతే వచ్చి పెళ్ళికూతుర్ని చూడవలసింది. ఎప్పుడూ ఇలాగే అవుతోంది. 

ఆ పిల్ల కరెక్టుగానే ఆచోకీ కట్టినట్టుంది. ఛ! తనెప్పుడూ ఇంతే, కలకత్తా రావాలిస్మా అన్నారు. ఒస్తున్నానన్నాడు. అడివిపాలెం ఫో అన్నాడు మావ. పోతున్నానన్నాడు. చిన్నప్పటినుంచీ కూడా ఇంతే. చదువుకోకపోతే చెడిపోతావు చదువుకో అన్నారు. చదువుకుంటానన్నాడు. బుద్ధిగా ఉండకపోతే బాగుపడవుస్మీ అన్నారు. బుద్ధిగా ఉంటానని లెంపలు వేసుకున్నాడు. మజాలేని వెధవలు మంచిగానే ఉంటారు మరి అన్నాడొక స్నేహితుడు. అవునవునని తను ఒప్పుకున్నాడు. ఇలాగే అన్నీను. 

ఈత రాకుండా నీట్లోకి దిగేవు జాగ్రత్త! “దిగను”,

దీపం లేకుండా చీకట్లో నడిచేవు జాగ్రత్త. “నడవను”

చక్కని రాజ మార్గాలుండగా సందులంట తిరిగేవు జాగ్రత్త! “తిరగను”.

వాళ్ళెలా చేస్తే నీకెందుకు? వాళ్ళ జట్టీల్లోకి నువ్వు వెళ్లేవు జాగ్రత్త “వెళ్ళను”.

అన్యాయం. అధర్మం! నీకేలదంతా? నీ పని నువ్వు చూసుకోలేకపోతే తన్నులు తగిలేను జాగ్రత్త! “అదంతా నాకెందుకు?! ఆ తన్నులు నాకెందుకు? నాపని నే చూసుకుంటాను.”

టైఫాయిడ్, న్యుమోనియా, మరేదో ఏదైనా ఒస్తుంది, వర్షంలో చొరబడేవు జాగ్రత్త! “చొరబడ్నే. ఇక్కడే ఉంటాను”.

తుళ్ళిపడ్డాడు పురుషోత్తం. మరైతే కలకత్తా వెళ్ళడం ఎలాగ? గంటన్నరకంటె మరింక టైము లేదు. ఏం చెయ్యడానికి పాలుపోక 

పురుషోత్తం మళ్ళీ బల్లమీద కూర్చోబోతూ వుండగా దుకాణం తాత చూరికింద నుంచి రోడ్డువైపు చూసి “ఆ! ఒస్తుడొస్తండు హదిగదీ! రేసుకుక్కే! పార్రా! పార్రా!” అని వుత్సాహంతో కేకలు వేసేడు. 

పురుషోత్తం కూడా వంగొని, చూరుకిందనుంచి చూసేడు.

ఎదురుగా తిన్నగా దూరానికి కనిపిస్తోంది రోడ్డు. రెండుపక్కలా ఉన్నచెట్లు సిపాయిల్లా నిల్చొని అలజడి చేస్తున్నాయి. రోడ్డంతా నీటితో ఏటి కాలవలా ఉంది. అందుమీద ఆరని నిప్పుతునకలా, నీటిమీద బోటులా, చెట్లని చీల్చుకొని బాట వేసుకొని వస్తున్నట్టుగా ఓ కుర్రవాడు భుజాన్న మూట వేసుకొని పరిగెట్టుకొని కొట్కొస్తున్నాడు.

“ఒచ్చీసినాన్ తాతా”  అని వచ్చీ రావడంతో కేకవేసి, మూట నుండి భుజాన్ని సుళువుగా తప్పించి, బొగ్గుమూటని చక్కున కిందికి విసిరేడు. 

కుర్రవాడికి పన్నెండేళ్ళకి మించి ఉండదు వయసు. సరిగ్గా రేచుకుక్కలాగే వున్నాడు అరనిమిషంలో జుట్టునుంచి నీటినినొక్కేసి బట్టల్నించి నీటిని పిండేసి ఆ పాకలో పొడిగా గెంతులు వేసేడు.

“ఒరసంలో దార్లో సత్తే ఏటిజేద్దువురా మనవడా” అన్నాడు దుకాణం తాత బొగ్గులమూట విప్పుతూ, మూట విప్పగానే రాక్షసి బొగ్గులు నిగనిగ మెరిసేయి. 

“ఒరసవాఁ! మనసంగతౌల్టేటి తాతా? ఒరసాన్ని సంపిడిసి పెడతా డీ పోతురాజు” అని మూడులోకాలూ ఏలేవాళ్ళా జవాబు చెప్పి, పొయ్యి విసరడానికి విర్రవీగుతూ వెళ్ళేడు కుర్రవాడు.

ఆ పాకలో పాతుకుపోయినట్టుగా నిశ్చలుడై నిల్చుండిపోయేడు పురుషోత్తం. 

ఆకాశం ఒక్కసారిగా గప్పున మెరిసింది. అంతవరకూ పురుషోత్తాన్ని వెంటతరిమిన పెళ్ళికుమార్తె చూపు ఆ క్షణంలో అతని ముందుకొచ్చి మూర్తీభవించి నిలుచొంది. ఆమె చూసిన చూపు ఆనాటి నర్సు నవ్విన లేనవ్వు: చిగిర్చిన మామిడి మొక్క, ఎగిసిన కొబ్బరి చెట్టు, ఈదురుగాలి, హోరున వర్షం ; నీటిలో నిప్పు, మనిషిలో జ్వాల – అన్నీ అతనికి అర్థమయ్యేయి. అర్థయుక్తంగా, స్పష్టంగా తెరమీద కథలా అతనికంతా బోధపడింది. అంతా చూస్తూ అతనలా నిల్చుండిపోయేడు.

పైన వర్షపుధారలు స్తంభించినట్టుగా అలానే ఉండిపోయేయా అన్నట్టుగా అనిపిస్తోంది. ఆకాశం ఇంకా దట్టంగా మూసుకొంటోందేగాని పల్చబడ్డం లేదు. గుర్రాల్ని కట్టుకొని ఝాంమ్మని అన్నింటినీ తొక్కుకుబోతుంది ఈదురుగాలి. మెరుపులు పిడుగులయి, మబ్బులు కమ్మినకొద్దీ పాకలో చీకటి చిక్కనవుతోంది. పొయ్యి విసురుతూన్న కుర్రవాడు ఇనుంలా ఎర్రగా మెరుస్తున్నాడు. 

కొద్దిసేపయింది.అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూన్న దుకాణం తాత ఏదో గుర్తు కొచ్చినట్టుగా టక్కున ఆగి, కళ్ళు చిట్లించి, అటూ ఇటూ చూసి, మనవణ్ని “పోతురాజురే” అని పిల్చి “ఇప్పుడిక్కడున్నాడు! చిట్టిబాబెక్కడికి పోనాడ్రా” అని ఆశ్చర్యపడుతూ, చిట్టి బాబుని ఎన్నెమ్మకాని ఎత్తుకుపోయిందా? అన్నట్టుగా అడిగాడు. 

“అడుగో” అన్నారు పోతురాజు. “ఏడీ?” “అడుగడుగడుగో” అని రోడ్డువైపు చూపించేడు పోతురాజు. 

“ఏటి?! పప్పు ముద్దలా సతికిలబడిపోన్డు . ఒరసం ఒగ్గనట్టు పాకొగ్గడనుకున్నానొరె, ఆ! ఆ! కదిల్నాడే!” అంటూ మోకాళ్ళు వంచి వీపు విరిచి చూర్లోంచి పైకి చూసేడు దుకాణం తాత.

మసక చీకట్లో తిన్నగా, ఈదురుగాలి కెదురుగా, వర్షాన్ని సరకు చేయకుండా, తెరల్ని ఛేదించుకొంటూ చకచకా ముందుకు వెళుతున్నాడు పురుషోత్తం. 

అతణ్ని చూసి తలపంకించి, హసించి ‘సెబాసో’ అని మెచ్చుకున్నాడు దుకాణం తాత. 

***

మే 1959 ఆంధ్ర పత్రిక. 

పుస్తకం వివరాలు :

పుస్తకం కొనడానికి ‘నవోదయ’ సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.

నవోదయ బుక్ హౌస్

3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్

ఫోన్ నెంబర్: 090004 13413

https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7

లేదా ఆన్లైన్ లో కొనడానికి క్రింది నవోదయ వెబ్సైటు లింకుని క్లిక్ చెయ్యండి.

*Intro- outro BGM credits: Edhedho Ennam Valarthen | Durai Srinivasan | Soul Strings (https://www.youtube.com/watch?v=LWpJxRYZb2w)

“రావిశాస్త్రి గారి ‘వర్షం’” కి 2 స్పందనలు

  1. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి చక్కని కథ వర్షం ని మా అందరికీ చదవడానికి అంద చేసినందుకు చాల థాంక్స్. ఇటువంటి మంచి కథలను ముందు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను.

    1. అనిల్ కుమార్ Avatar
      అనిల్ కుమార్

      thank you Sir.

Leave a Reply