Apple PodcastsSpotifyGoogle Podcasts

వంశీ గారి ‘సొట్ట ఆదిగాడు’ – ‘మా దిగువ గోదావరి కథలు’ కథాసంపుటం నించి!

‘సొట్ట ఆదిగాడు’ అనే ఈ కథ, వంశీ గారి “మా దిగువ గోదారి కథలు’ అనే కధాసంపుటి నించి.

పుస్తకం కొనడానికి –

https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.)

‘సొట్ట ఆదిగాడు’:

ఆ వూళ్ళో  వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి.

ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండి కూలోళ్ళనీ పాలేళ్ళనీ పెట్టి పంటలు పండిస్తున్నారు. అదీ ఈనాటి నించి కాదు ఏనాటి నించో.

అయితే, దొంగలుగానీ, దోచుకుపోయేవాళ్ళుగానీ ఆ ప్రాంతాలకి రాకండా కూలోళ్ళు పాలేళ్ళూ ఉద్దారకుడూ పగటిపూట కాపలాగాస్తే రాత్రిపూట గంగాలమ్మ తల్లి కాపలా కాస్తుంది.

గంగాలమ్మంటే మామూలు మనిషి కాదు. గ్రామదేవత. మహాశక్తి, ఆది శక్తి. ఆవిడకి విగ్రహం లేదు. తోటలో ఒక పంపర పనాస చెట్టు మొదట్లో బొట్టెట్టి  గుగ్గిలం పొగేసి అగరొత్తులు వెలిగించి నైవేద్యాలు పెట్టుకుని దణ్ణాలు  పెట్టుకుంటారు.

ఆమధ్య మాదిగ పేటలో కాళిదాసు సూరన్నగాడు తోటలో కాసే కాబూలు దానిమ్మకాయలు కోసుకెళ్లామని రాత్రిపూట వస్తే తెల్లారేసరికి ఆవిడ పాదాల దగ్గర (పంపరపనస చెట్టు మొదట్లో) రక్తం కక్కుకు చచ్చిపడున్నాడు.

ఇంకోసారి లంకలో పొగాకు మోపులు పట్టుకెళ్లామని నావఁ వేసుకెళ్తే, తెల్లవారేసరికి వాళ్ల తలకాయలు పొగాకు తోటలోనూ,  మొండాలు ఎక్కడో వున్న మూలస్థానం అగ్రహారం రేవులోనూ తేలాయి.

పరిశోధనంటా దిగిన పోలీసులకి చంపినోళ్ళెవరన్నదిఎన్నాళ్ళకి తేలలేదు.

అయినా సరే డిటెక్షను చేస్తున్న పోలీసుల్ని చూసి,  నవ్వుకున్న గోపిలంక జనం, “వెర్రిగాకపోతే …అమ్మోరు. వీళ్ళకి దొరుకుద్దా?” అనుకున్నారు.

అమ్మోరు గంగాలమ్మ తల్లంటే రావికంపాడు రాజులకి చాలా నమ్మకం, చాలా భయం భక్తీనీ,

ఆ తల్లిని నమ్మేవాళ్ళు ముక్కనుమ రోజున కోడిపుంజుల్నీ  బోల్డన్ని  మేకపోతుల్ని గొర్రెపోతుల్ని బలేస్తారు. ఆ రోజంతా ఆవిడ ముందు రక్తం గట్టు తెగిన ఏరులా పారుతూ వుంటుంది. నెర్రలు  తీసిన నల్లరేగడి నేలలో ఇంకుతా వుంటుంది. అమ్మవారికి తుని నించి కొమ్ము బూరా వాళ్లని, పెద్దాపురం నించి డప్పులవాళ్లని పిలిపించి మా గొప్పగా చేయిస్తారు సంబరం. చిత్రమేంటంటే ఎప్పుడూ గుమాస్తాలకి  వదిలేసే ఆ రాజులో ఒకరు మాత్రం ఆ సంబరం రోజు వచ్చి తీరతారు. అది ఆనవాయితీ..

ఎడం కాలు మడం దగ్గర తోడెయ్యడంతో వేళ్ళని మాత్రం భూమ్మీద ఆన్చి నడిచే గుత్తాల ఆదియ్యని సొట్టాదిగాడంటారంతా. చాలా కష్టపడి పనిచేసే ఆ సొట్టాదిగాడి నోరు మంచిది కాదంటారు.

అలాంటి సొట్టాదిగాడు రావికంపాడు రాజుల కమతంలో జేరాడు.

ప్రతి ఏడు వారి వంశంలో ఎవరో ఒకరొచ్చేవారు. అలాంటిది ఆ ఏడు ముక్కనుమ రోజు ఆ రావి కంపాడు రాజులు ముగ్గురొస్తున్నారు.

గోపిలంక గంగాలమ్మ వారి సంబరం చరిత్రలోనే,  ఇదో గొప్ప వింతని గుమస్తాలంతా తెగ కంగారు పడిపోతా, సంబరం చాలా పెద్ద ఎత్తున జరిపించే పనుల్లో వున్నారు.

రకరకాల బెత్తాయింపులు, రకరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తూర్పు నుండే తోటల మధ్య పడమట వేపుండే గోదావరితల్లి కనపడేలా కొబ్బరితోటల మధ్యలో అచ్చం రాజులకోటలా కట్టిన గెస్టహౌస్లోకి దిగిన రాజులు, పాలేళ్ళందరికి తలకో జత బట్టలూ నూట పదహారు! చొప్పున డబ్బులు ఇమ్మని గుమస్తాలకి ఆర్డర్లేశారు.

ఎక్కడ దొరికిందో మూడు ముంతల సందకల్లు దొరికింది సొట్టాదిగాడికి. దాన్ని లాగిస్తుండగా రాజులు తోటలోకి దిగారన్న సంగతి తెల్సింది. నిషా బాగా ఎక్కేసిన ఆదిగాడికి రాజులో మాటాడాలనిపించింది

సొట్టాది గాడు  అనుకుంటున్నట్లు అక్కడెవరికైనా తెలిస్తే కాళ్ళకి పలుపుతాడు మెలేసి పక్కకి లాగేసే  వారు. కానీ, ఎవరి పనుల్లో వాళ్లుండటంతో ఈడ్ని పట్టించుకోలేదు.

గెస్ట్ హౌస్ బాల్కనీలో కూర్చున్న రావికంపాడు రాజులకి ఈ తోటల్లో మా గొప్పగా దర్శనమిచ్చే ఆ గోదావరి తల్లి,  ఈ వాతావరణం ఇంత గొప్పగా వుంటుందని ఇప్పుడే తెలిసొచ్చింది. వాళ్లు కళ్ళు మూసుకుని గంగమ్మ తల్లికి  దణ్ణమెట్టుకుని ఇక నించి ప్రతి ఏడూ వస్తామని మొక్కుకున్నాకా స్కాచ్ పోసిన గ్లాసులందుకున్నారు.

ఇంతలో దిగిపోయిన సొట్టాదిగాడు, “మా రాజులకి నమస్కారవండి,” అన్నాడు. 

మందు పుచ్చుకుంటా ఎవర్నువ్వన్నట్టు చూశారు.

“నన్ను సొట్టాదిగాడంటారు బాబూ…” అంటా ఆ రాజుగారి నోట్లో వున్న దాన్ని చూసి, “తవరి నోట్లో అదేంటండి తెల్లగా అంత పొడుగ్గా వుంది,” అన్నాడు.

నవ్వేసిన రంగరాజు, “ఇదా? దీన్ని కింగ్ సిగరెట్ అంటార్లే… సిగరెట్ కోసమొచ్చావా?” అనందిస్తుంటే సిగ్గుపడతా  తలొంచుకుని, “వద్దండి బాబూ నా దగ్గర గుర్రంబీడి వుందండి.” అన్నాడాదిగాడు.

“అయితే సరే,” అనుకుంటా సిగరెట్లు వెలిగించి స్కాచ్ తాగుతున్నారు.

వాళ్ళ ముందు చతికిలబడిపోయిన సొట్టాదిగాడు, “ఎంత కింగయినా గుర్రం లేకపోతే వేస్ట్ కదండీ,” అనడంతో గతుక్కుమన్న రంగరాజు, “ఈడికి బాగా ఎక్కేసినట్టుంది.” అన్నాడు.

“స్కాచ్ పక్కన నీచు కాదండి… కొంకిడికాయ రసం కలిపిన సందకల్లు తాగండి. అసలు కిక్కేంటో తెలుస్తది.” అన్నాడు సొట్టాదిగాడు.

మూడో రౌండు పోసుకుంటున్న పర్వతాలరాజుగారు, “ఏరా…. పండగపూట ఒంటిమీద బట్టలు చేతిలో డబ్బులూ పడేసరికి మాట తేడా వచ్చేసింది,” అన్నారు.

నవ్వేసిన సొట్టాది, “మావి మాటలే బాబూ… సేతలు మాత్రం మీవి..” అంటా లేచి, “ఏవండి… జత బట్టలు జీవితమంతా సరిపోతాయా… నూట పదార్లుతో నేను సచ్చిదాకా కల్లు తాగల్నా” అనడంతో చిరాకు పడతా లేచిన పర్వతాలరాజు, “మరి మీలాంటి కూలి నాకొడుకులకి మా భూములు బంగ్లాలూ రాసెయ్య మంటావా?” అన్నాడు.

“నిజంగా కూలోడు మీ కొడుకైతే తెలుస్తదండీ కష్టమేంటో.”

సొట్టాదిగాడి నడ్డి మీద తన్నడానికి లేచిన రంగరాజుని కూర్చోబెట్టారు బంగార్రాజుగారు. అయినా కోపం ఆగని రంగరాజు, “ఏంట్రా నోరు లెగుస్తుంది,” అన్నాడు.

“కూలోడు గోదారితల్లిలాంటోడండి… ఆడెప్పుడు గోపాదాలరేవులో గోదారమ్మలాగ మెదలకండానే వుంటాడండి… సిరాకేస్తేనే ఇదిగో ఇప్పుడు నాలాగ రెచ్చిపోతాడండి,” అన్నాడు సొట్టాదిగాడు.

“అసలు వీడ్నిక్కడికెవడు రానిచ్చేడు,” అంటా చిరాగ్గా లేచి ఆదిగాడ్ని తన్నడానికెళ్ళబోతున్న రంగరాజుని వెనక్కి లాగిన బంగార్రాజు, “ఈ ఈవినింగు మనకో ఎంటరటైనుమెంటీడు. సీరియస్సవ్వకండా కూర్చో జెబుతాను,” అని కూర్చోబెట్టి సొట్టాదిగాడి కేసి చూసి, “ఏరా కుంటోడా… నీ కంత అన్యాయమేం జేసేంరా.” అన్నాడు.

“దార్లో కొచ్చేరు,” అంటా నవ్వేసి, “కల్లు రేటు పెరిగింది… కూలి రేటు పెంచలేదు… రోజంతా రెక్కలు ముక్కలు జేసుకునేదెందుకండీ, పొద్దోతే  గొంతులో పడే ఆ కల్లుకోసమో సారాకోసమో గదా… ఏవండి గట్టు మీద కూర్చుని చూసే వాడికేం తెలుసండీ  కమతంలో కష్టం ఏంటో? ఊరికే ఇచ్చినట్టు అంత ఇదైపోతారేంటండీ. ఇక్కడ జేసే ప్రతి పన్లోనూ మా కల్లూ సారా వున్నాయండీ… అదే… మీ సేవలకి రక్తం మొత్తం కరిగిపోయి ఒంట్లో మొత్తం ఇప్పుడున్నది కల్లే కదండీ… సంటి పిల్లోడి చేతిలో తాయిలం పెట్టినట్టు ఏడాదికోసారి కంటి తుడుపుగా మీరేదో ఇస్తే మా రాజులుంగారిచ్చేరంటా ఏడాది పొడుక్కి పని చేస్తారండి మా బుర్ర తక్కువ ఎదవలు… అందుకే నేనొకటినిర్ణయించుకున్నానండీ.”

“ఏంట్రా?”

“మూడునెల్లకో జత బట్టలూ, పది తాళ్ళున్న అయిదెకరాల పొలం నా పేర్న  రాస్తేనే రోజూ పన్లో కొచ్చేస్తానండి.”

మేనేజరు నారాయణమూర్తిని పిల్చిన పర్వతాలరాజుగారు, “వీడ్ని అర్జంటుగా బయటికి తొయ్యండి,” అన్నాడు.

“ఆ లాగేవోడికన్నా డబ్బులు కరక్టుగా ఇవ్వండి బాబూ… లేకపోతే ఏదో రోజూ కోపంతో మిమ్మల్ని  నేను గోదాట్లోకి లాగెయ్యగలను,” అంటున్న ఆదిగాడి అంతా బయటికి లాక్కెళిపోయారు..

సొట్టాదిగాడి దెబ్బకి రాజులు ముగ్గురూ తాగిన స్కాచ్ మొత్తం దిగిపోయేసరికి కొత్తబాటిలో పెన్ చేశారు.

చిన్నప్పుడే మేనకోడలు వీరలక్ష్మితో పెళ్ళయిపోయిన సొట్టాదిగాడికి ఇద్దరు కవలపిల్లలు. అదీ ఆడ పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలంటే పంచప్రాణాలు. వాళ్ళు కడుపునిండా తింటుంటే చూడ్డం చాలా యిష్టం వాడికి పొద్దుట రేవులోకెళ్ళి శివాలక్ష్మి హొటేలో ఇడ్డెన్లు  తెచ్చి పెడతాడు. సాయంత్రమైతే మళ్ళీ రేవులో చినబ్బు కాఫీ హోటేల్లో పెసర పొణుకులు తెచ్చి తినిపిస్తాడు. ఆ పిల్లలూ వీరలక్ష్మి తిన్నాకా మిగిలింది మట్టుకే తింటాడు సాట్టాదిగాడు.

“పగలంతా పని చేసాచ్చే నువ్వు ఇదేంటిలా పస్తు?” అని వీరలక్ష్మడిగితే నవ్వేసెళ్ళిపోతాడు ఏటిగట్టు వేపు. అలా వెళ్తా వెళ్తా తల్లి గోదారి గాలిని పీలుస్తా తన బిడ్డల్నే తల్చుకుంటా ఆనందపడతాడు.

అలా అందర్నీ తిడతా వుంటే ఆ ఏరియాలో ఎవడూ పనిలో పెట్టుకోడం లేదాడిని. దాంతో పెళ్ళాం పిల్లల కోసం గోదావరి గట్టుమీద చాలా మైళ్ళు నడిచి కోటిపల్లి అవతలున్న కూళ్ళ ఇసక రేంపులో జేరాడు.

ఎండిపోయిన గోదావరిలో ఇసకని ప్రొక్లైనర్ల తో  తీసి లారీలో వేస్తున్నారు. అక్కడొకటీ అక్కడొకటి ఆఫీసు పాకలు. అందులో వున్న గుమస్తాలు లారీల ట్రిప్పులు రాసుకుంటున్నారు. ఎక్కడికక్కడ మేనేజరూ సూపర్‌వైజర్లు కల తిరుగుతున్నారు. వాళ్ళ పని ఈ నాలుగు నెలలే. తర్వాత వర్షాకాలమొచ్చేస్తుంది. వరదలో గోదావరి ములిగిపోతుంది. కోట్ల మీద పాట పాడిన కాంట్రాక్టరు ఈలోపే తన పెట్టుబడి లాభాల్తో సహా వెనక్కి లాక్కోవాలి. దాంతో ఎవరికీ నిద్రలుండటం లేదు. రాత్రీ పగలనక పనిచేస్తున్నారు. ఏటిగట్టు మీంచి లోపల గోదావరి దాకా ఒక కిలోమీటరు పొడుగున ఇసక, కొబ్బరాకులు వేసి దానిమీద మళ్ళీ ఇసక వేసి తడుపు తున్నారు. జనంలో ఎక్కువమంది వూరికి దూరంగా వున్న లాకు పేటలో వాళ్ళే. వాళ్లలో కలిసిపోయిన సొట్టాది  గాడు సీవెండి బిందెలో నీళ్ళు తెచ్చి తడిపే పని చేస్తున్నాడు.

రేంపుని  ఆ ఏడు వేలం పాట పాడుకున్న సలాది  సూర్రావు మంచి భోజనప్రియుడు. రేంపులోనే కుదుమట్టంగా  వంట పాకనేయించి వారానికో రకం కూరలూ, పులుసులూ, వేపుళ్లూ వండించడం మొదలెట్టాడు. సాయంత్రమైతే మసాలా గారో, ఉల్లిపాయ పకోడిలో వేయిస్తున్నాడు. ఆ కూలోళ్ళ మధ్యలో తనూ వాళ్ళలో ఒకడిగా కల్సిపోయి చిల్లో బొల్లో మంటా మాటాడుంటే చూసిన జనం, ఈరికి పెద్దా చిన్నా లేదం’టాని సంబరపడిపోతున్నారు. వాళ్ళు చేస్తున్న బండ చాకిరీ మర్చిపోతున్నారు. అందరి కంటే ఎక్కువ  ఆ పని చేస్తా చూస్తున్న సొట్టాది గాడు కొన్ని రోజులు చూశాడు.

అది కల్లు  సీజను కాదు. దాంతో పుల్లు  నాటుసారా పట్టించేసి సూర్రావు దగ్గర కెళ్లేసరికి కూలోళ్లతో  పంక్తి  కూర్చుని భోజనం చేస్తూ కనిపించాడు సూర్రావు, నమస్కారం పెట్టి కూర్చున్న సాట్టాదిగాడికి ఆకేసేరు

దాన్ని ఇసకలోకి విసిరేస్తున్న ఆదిగాడ్ని చిత్రంగా చూస్తున్నారు. 

“ఏరా ఏమైంది?” అన్నాడు సూర్రావుగారు. 

“గుండెల్లో మంటగా వుందండి.” అన్నాడు.

“రాంపురంలో స్టాలిన్ డాక్టర్ గారి దగ్గరకి తీసుకెళ్ళి ఏదన్నా మందేయించనా?” అన్నాడు సూర్రావు.

“నేనే వేసుకున్నానండీ. గాబట్టే ఆ మంట బయటికొచ్చిందండి… ఏవండీ… సవ్వాదిగా వుండే పెసర పొణుకులూ మసాళాగార్లూ మీకిష్టమైతే మేవెందుకు తినాలండి… సీక్రేటు  చెప్పనాండీ . మీరు తినగా మిగిల్సి మాకెడతన్నారండి… మా పిచ్చి యెదవలు ఇదంతా మామీద మీకిష్టవనుకుంటున్నారండి.” అనాగేడు అదిగాడు.

ఏం చదువుకోపోయినా వ్యాపార లక్షణాలు తెల్సిన సలాది సూర్రాపుగారికి ఎక్కడ పెంచాలో ఎక్కడ తుంచాలో  బాగా తెల్సు. దాంతో నవ్వుతా, “చూడొరే కుంటోడా ఇవన్నీ మీకోసమే చేయిస్తున్నాను.” అన్నాడు..

నవ్వేసిన సొట్టాదిగాడు, “ఆకలితో ఉంటార్రే, ఆకులో ఏది పడేస్తే అది తింటార్లే  అనుకుంటున్నారండీ… మాకూ రుచులు తెల్పండీ,” అన్నాడు.

“ఒరేయ్… వోనర్నన్న విషయం కూడా మర్చిపోయి మీ అందర్లో కల్సిపోయి పని చేస్తున్నాన్రా… మిమ్మల్ని నా పిల్లల్లాగ చూసుకుంటన్నాన్రా. అలాంటి నా గురించి ఏంట్రా నోటికొచ్చినట్టు మాటాడతన్నావ్?”

“మీ పిల్లల్లాగ జూసుకుంటన్నావా? అయితే మీ పిల్లల్ని గూడా రేపట్నుంచీ మా పన్లోకి పంపండి. లేదా మమ్మల్ని మీ పిల్లల్తో పాటు స్కూళ్ళకి పంపండి.”

ఆవేశంతో రెచ్చిపోయిన సూర్రావు వూగిపోతా. “ఒరేయ్,” అనరిచాడు.

“ఓనర్… ఓనర్లాగుంటే మాటాడలేకపోయేవాడ్నేమో… మీరు ఓ కూలోడిలా మాతో బాటు తిరుగుతా మధ్యలో ఇది చెయ్యి అని చెబుతా మాతో బండెడు చాకిరీ చేయించుకుని చికెనుముక్కలూ చిల్లిగార్లూ అన్నంలో పడెయ్యడం గాదు. ఈ ఎదవ డ్రామాలొద్దుగానీ కరక్టుగా డబ్బులివ్వండి.”

అప్పటికే చాలా సేపు ఓరిమి పట్టిన సూర్రావు ఇక ఆగలేక ఆదిగాడి గూబమీద లాగి పెట్టి కొట్టేసి, “మళ్ళీ ఈ రేంపులోకొస్తే గోదారి మధ్యలో ముంచేస్తాను పోరా.” అనరిచాడు

.

గూబమీద రుద్దుకుంటా సూర్రావు మీదకి దూసుకుంటా వచ్చిన సొట్టాదిగాడు, “ఈ రేంపేవన్నా నువ్వు గుట్లేసి పోశావా?… గోదారితల్లి ప్రాసాదం ఇది… మూడునెల్ల తర్వాత నువ్వు కూడా ఇక్కడుండవ్… ఇదిగో సలాది సూర్రావూ నీ భోగం మూడ్నెల్లేరా… మట్టిని నమ్ముకుని మేం బతుకుతున్నాం. మట్టిని అమ్ముకుని నువ్వు బతుకుతున్నావ్,” అనరుస్తున్న ఆదిగాడ్ని చితకబాదేసి సూర్రావు అలుపొచ్చేదాకా ఆ గోదావరి గట్టుమీద తరుముతానే వున్నాడు.

– గోపిలంక తిరిగొచ్చిన సొట్టఆది గాడు అలికిన నేలమీద పడుకుని కముకు దెబ్బలతో  మెలికలు తిరిగి పోతుంటే ఏడుస్తా వేణ్నీళ్ళు కాపడం పెట్టింది వీరలక్ష్మి.

రోజులు గడుస్తున్నాయి.

పని చెయ్యాలి. లేకపోతే పెళ్ళాం బిడ్డలు మాడిపోతారు. తెల్లవారుఝాము మూడు దాటేక గోదావరి గట్టు మీదే నడుచుకుంటా పిల్లంక, పెదలంక, బోదిలంక దాటుకుంటా కోటిపల్లి సుందరపల్లీ దాటి తమ్మాయి పాలెం, కూళ్ళ, కోరుమిల్లి దాటేక వచ్చే కపిలేశ్వరపురం రేవులో కొచ్చి అక్కడ్నుంచి ఇసకలో మైలు దూరం నడుస్తా రేంపులో ఉన్నవాళ్ళ ఆఫీసులో కెళ్ళి తనెంత దూరం నించొచ్చేడో చెప్పి తన కష్టాలు చెప్పుకుని పన్లోకి జేరేడు.

ఆ రేంపు కాంట్రాక్టరు పేరు చుండ్రు వెంకట్రావు. సలాది సూర్రావు దగ్గర పనిచేసొచ్చి కాంట్రాక్ట రయేడేమో కొంచెం అటూ ఇటూగా ఆ సూర్రావు టైపే. 

అయితే తాటి బెల్లం ముక్క బుగ్గనెట్టుకున్నట్టు తియ్యగామాటాడే అతనికి కోపం గబుక్కున రాదు. అందరితోనూ ఆచి తూచి మాటాడుంటాడు. అందర్నీ, ఏరా అని పలకరిస్తానే ప్రేమగా భుజం మీద చెయ్యేస్తుంటాడు. 

భోజనాలప్పుడు, “ఒరేయ్ ఎదవా ఆ సన్నబియ్యం అన్నంలో నిన్న రాత్రి మట్టిదాకలో కాచిన చేపలపులు సేసుకు తింటే దాని మజాయే సపరేటురా వేస్టు ఫెలో, ఎండిరెయ్య తలకాయలేసి కాసిన ఈ లచ్చుంచారు వేసుకుని రెండు ముద్దలు చుట్టి నోట్లో పెట్టుకో…. తర్వాత దోర్చడవేఁ నీ పని… పుల్ల పెరుగు పక్కనెట్టి మీ అమ్మగారు పంపిన ముంత పెరుగేసుకోరా ఎదవ నా కొడకా” అని ప్రేమగా తిడుంటే అంతా వెంకట్రావు మాయలో పడిపోయి రాత్రనకా పగలనకా తెగ పచేసేస్తున్నారు.

ప్రొక్లైను ఆపరేటర్ చెల్లెలు పెళ్ళి అంటే పెద్దరికం చేశాడు. కొత్తగా పెళ్ళయిన హైడ్రాలిక్ ట్రక్ డ్రైవర్ జాన్సన్ గాడి భార్య గొడవ పడ్తే  మధ్యలో కొచ్చి వాళ్లిద్దర్నీ కలిపాడు. రేంపు  రూటుకి కొబ్బరాకు సప్లయి | చేసే మేడిశెట్టి చందర్రావు కూతురు ముండమోస్తే వెళ్ళి పరామర్శించొచ్చాడు.

అదంతా జూస్తున్న రేంపులో జనం ఒంగి దణాలెట్టేస్తున్నారు. వెంకట్రావు గారికి,

సొట్టాదిగాడు మట్టుకి చూస్తానే వున్నాడు. అదోరకంగా నవ్వుతానే వున్నాడు. ఈ వెంకట్రావుగాడు ఆ సూర్రావుగాడ్ని కాపీగొడ్తున్నాడు అంటా నవ్వుకుంటున్నాడు.

రేంపులో  జనాలందరికీ మేనేజరు లాగున్న  సీతంరాజు వడదెబ్బకి తేడా జేసి పడిపోతే మండపేట హాస్పిటల్లో వైద్యం చేయించి తీసుకొస్తే అర్జంటుగా అక్కడ ప్రత్యక్షమయిన సొట్టాది గాడు  ”  నాదో మనోయాది  లేండి… ఓ రకం జబ్బనుకోండి. అయితేనండీ ఈ జబ్బుకి మందుల్లేవండి… మాత్రల్లేవండి.. ఇంజక్షన్లు లేవండి…” అన్నాడు.

ఆలోచించిన వెంకట్రావు, “కొంపదీసి వికారమా?” అన్నాడు..

“ఇకారమంటే…మీలాంటోళ్ళు జేసే ఎదవ పన్లు భరించలేక మనసులో వున్నది బయటికి కక్కేస్తుంటా నండి. అదీ జబ్బు. దీనికి మందులుంటాయంటారా? తోళుం అర్ధం జేసుకోండి,” అన్నాడు.

“మీ గురించి నేను ఎంత ఆలోచిస్తున్నానో తెల్పా… దగ్గరుండి మీకు అన్నం వడ్డిస్తున్నానా,” అని వెంకట్రావంటే నవ్వేసిన సాట్టాదిగాడు. “గిన్నెల్లో వున్న కూరలు మేఁవేసుకోలేమా…. మీరెందుకండీ వడ్డించడం…. ఎదవ బిల్డప్ గాకపోతే?” అన్నాడు.

“ఒరేయ్ కుంటి.. ఏంట్రా వాగుడూ?” అరిచేడు వెంకట్రావ్..

“రోజూ మీరు జెప్పే సొళ్ళు కబుర్లన్నింటికీ మర్యాదగా మేం ఊ  కొట్టాలి. మేం ఏదన్నా అంటే అది వాగుడైపోయింది.”

“నీ గురించి ఈ గోదారిగట్టు  మీద చాలామంది చెప్పారా నాకు… పోన్లే  పాపం అని పనిచ్చేను.” 

“మీరు జేసే పాపాల్లో ఇదేం పెద్ద పాపం గాదులెండి.”

ఆదిగాడ్ని లాగి పెట్టి గూబమీద కొట్టబోతా ఆగేడా చుండ్రు వెంకట్రావ్ గారు.

“ఇన్నాళ్ళూ పుల్ల పెరుగొద్దు. ఆ గెడ్డ  పెరుగేసుకొండి… చేపల పులుసు కలుపుకోండ్రా మీ అమ్మ గారు నిన్న కాసింది అంటే. అదంతా నిజవనుకున్నారు మా కూలెదవలు… చూసేరా… ఒక్క మాట గట్టిగా అడిగేసరికి  మనసులోది మొత్తం బయటికొచ్చేసింది. ఎందుకండి ముసుగులో యాక్సనూ ” 

అంటా ఇష్టానికి రెచ్చిపోతున్న  సొట్టాది గాడ్ని  అక్కడున్న దుడ్డుకర్ర  తీసుకుని ఏటిగట్టంతా  తరిమి తరిమి కొట్టాడా  కాంట్రాక్టరు వెంకట్రావ్. 

ఎక్కడికెళ్ళినా ఇలా మాటాడేస్తుంటే ఎవడు పెట్టుకుంటాడు పన్లో? పొరపాటున పెట్టుకున్నా మధ్యా అని ఏదో తేడా వచ్చేస్తుంది. వెంటనే పన్లోంచి పీకేసి పచ్చడి కింద కొట్టేసి మరీ పంపిస్తున్నారు.

సొట్టాదిగాడింట్లో పొయ్యి వెలిగించి రెండ్రోజులయ్యింది. భార్యాపిల్లలూ మలమలా మాడిపోతున్నారు. ఆకలికి తట్టుకోలేని పిల్లలు ఒకటే ఏడ్పు. అది చూసిన అదిగాడు నీరులా కరిగిపోయాడు. బొలబొలా ఏడ్చేసేడు. అలా ఏడుస్తానే ఆలోచిస్తున్నాడు.

చాలా సేపు ఆలోచించిన సొట్టాదిగాడికి జన్మలో ఎప్పుడూ రాని ఒక తప్పుడు ఆలోచనొచ్చింది.

ఇది తప్పు కదా అనుకున్నాడు ముందు. ‘తప్పో ఒప్పో బిడ్డల ఆకలి తీర్చాలి అంతే,’ అనుకుని బయల్దేరాడు.

చాలా రాత్రయ్యింది. వూరంతా మాటు మణిగింది. గాలి లేదు. పౌర్ణమి వెళ్ళిన నాలుగోరోజు చిక్కి పోయిన చందమామ ఆలస్యంగా వచ్చేడు ఆకాశంలోకి.

నడుచుకుంటా గోదావరి ఒడ్డుకొచ్చిన ఆదిగాడు రేవులోకి దిగాడు. ఒడ్డున కట్టేసున్న చాలా నావలో పాటు కామాడి దుర్గారావు నావం కూడా వుంది.

.

దాని తాడు విప్పి నావఁలో కూర్చుని తెడ్డేస్తా  రావికంపాడురాజుల లంక వేపేళ్తున్నాడు సొట్టాదిగాడు. 

కాస్సేపటికి లంక ఒడ్డుకొచ్చిన ఆదిగాడు నావఁని కట్టేసి లంక లోపలి కెళ్ళేడు. 

ఎప్పుడూ ఎవరూ చెయ్యంది ఈ ఏడాది వరి పండించారు. లంకలో, పంటని కోసేసి పనలు వేసేరు.

ఒక అరబస్తాడు ఒడ్లయ్యేలాగ రెండు పనల్ని మోపు కట్టుకుని పండి నిలువుగా పగిలిన రెండు దోసపళ్ళని భుజాలకి తగిలించుకుంటుండగా ఘల్ ఘల్ మంటా వినిపించింది కంచు గజ్జల చప్పుడు.

తలెత్తి చూశాడు సొట్టాదిగాడు. ఎర్రటి చీర కట్టుకున్న ఆ ఆడమనిషి పుష్టిగా ఎత్తుగా వుంది. సొట్టాదిగాడ్నే చూస్తోంది.

ఆ మనిషికేసి ఎగాదిగా చూసిన ఆదిగాడు, “కాలం చాలా మారిపోయింది. ఈ మధ్య ఆడోళ్ళు కూడా దొంగతనాలు మొదలెట్టే సేరన్న మాట,” అన్నాడు.

“నేను దొంగని కాదురా గంగాలమ్మని,” అందామె.

ఆవిడ శిరస్సు నించి సిరిపాదం దాకా చూసి చేతులెత్తి దణ్ణమెట్టిన సొట్టాదిగాడు “నువ్వా తల్లీ…. సెమించండమ్మా” అన్నాడు.

“ఇక్కడ ఎవరు దొంగతనానికొచ్చినా ఏం జరుగుతుందో తెల్పుగదా?” కటువుగా అందామె. 

“తెలుసమ్మా… నీ శూలం ఎత్తి కడుపులో గుచ్చి చంపేస్తావు?” అన్నాడాదిగాడు. 

“తెలిసి కూడా దొంగతనానికొచ్చేవన్నమాట?” గొంతు పెంచింది, తల్లి.

“ఏం జెయ్యమంటావమ్మా… నీతికి పోయి ముక్కుసూటిగా మాటాడుతూంటే  పనివ్వడం లేదెవ్వడూ, పెళ్ళాం పిల్లలుతిండిలేక మాడిపోతుంటే జన్మలో ఎప్పుడూ చెయ్యని ఈ దొంగతనం చెయ్యడానికొచ్చేనమ్మా.  తల్లీ!  నువ్వు నిజంగా గంగాలమ్మతల్లివైతే పనిలేక తిండిలేక అల్లల్లాడిపోతున్న మా అలగా జనాన్ని సల్లగా చూడాలి. అంతేగానీ కడుపులు నిండిపోయినోళ్ళ పొలాలకి కాపలా గాస్తున్నావు. నాలాగొచ్చినోళ్ళని పొట్టన పెట్టుకుంటున్నావు…. చల్లటి చెట్టునీడలో వుండి చీకటి పడ్డాకా బయటికొచ్చే నీకేం  తెలుస్తాయి? అయినా నువ్వు మమ్మల్నెందుకు జూడాలి. మేం నీకు కోడి కోస్తామా? మేకల్ని కొస్తామా! ఆ మారాజులైతే , మేకలేంటి ఇంకా దున్నపోతుల్నేసి  రక్తంతో నీ కాళ్ళు తడుపుతా వుంటారు. బోల్డు పప్పులోవండి   నైవేద్యాలు పెడతారు. ఆళ్ళలంచాలకి మరిగిన నువ్వు ఆళ్ళ బాగోగులు చూస్తున్నావ్. చూడమ్మా గొప్పడిక న్యాయం బక్కోడికో న్యాయం పనికిరాడు తలీ. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. నేను మాటాడిందాంట్లో  నిజం లేకపోతే నీ బళ్ళెంతో కుళ్ళ బొడిచి చంపేసెయ్యి.” అనాగాడు .

తలొంచుకుని చాలా సేపుండిపోయింది గంగాలమ్మ.  తల్లి గంగాలమ్మతల్లిలో సొట్టాదిగాడి దెబ్బకి చాలా మార్పొచ్చింది. దొంగతనం చేసిన ఆ మోపుని వాడి తలమీదికెత్తి నావ దాకా వచ్చి సాగనంపింది శక్తి గంగాలమ్మతల్లి. 

సెప్టెంబర్ 2009

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading