Apple PodcastsSpotifyGoogle Podcasts

‘సంపెంగపువ్వు’ – గోపీచంద్ గారు.

‘సంపెంగ పువ్వు’ గోపీచంద్ గారు రాసిన కథ . 1971 వ సంవత్సరం, జనవరి నెల యువ మాస పత్రిక లో ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.

ఈ కథను మీకు అందించదానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.

ముందుగా, రజని గారు గోపీచంద్ గారి గురించి , ఈ కథ గురించీ మాట్లాడతారు.

హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

సంపెంగ పువ్వు:

“ఆమె ఈ బండికి వస్తోందని నీకెట్లా తెలిసింది?” అని శాస్త్రిని అడిగాను. అప్పుడు ఆరుగంటలవుతుంది. బొంబాయినుంచి రైలువొచ్చే టైం. నేనూ, శాస్త్రి ప్లాటుఫారం మీద నుంచొని మాట్లాడుకుంటున్నాం.

“ఇవ్వాళే వైరిచ్చింది” అన్నాడు శాస్త్రి. ఆమె శాస్త్రి స్నేహితురాలట ఆమె బండికి వస్తోందని చెప్పి నన్ను వెంట పెట్టుకొచ్చాడు శాస్త్రి.

శాస్త్రి ఆమెని గురించి చెప్పిన మాటల్ని బట్టి ఆమె విచిత్ర వ్యక్తి అనిపించింది నాకు

 “బలే మనిషి, బలే మనిషి” అంటాడు శాస్త్రి. ఏమడిగినా “నువ్వే చూస్తావుగా” అంటాడు. “ఏమోనబ్బా, నాకు చెప్పటం చాతగాకుండా ఉంది మన సంఘంలో ఇటువంటి మనిషి ఉండదు. వచ్చే సంఘంలో ఆడవాళ్ళు ఇట్లా వుంటారేమో! ఇప్పుడు రష్యాలో ఏమన్నా ఉన్నారేమో!” అంటాడు.

“అయితే ఆమె భర్త ఏం చేస్తుంటాడు?” అని అడిగాను. ఆమె గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తూ ఉంది నాకు.

“ఏదో చేస్తూనే ఉంటాడు లాగుంది. ఆమె మాట్లాడితే ‘కామేశ్వరుడు అటువంటివాడు, ఇటువంటివాడు, ఎంత చలాకీగా వుంటాడనుకున్నావ్” అని చెపుతూ ఉంటుంది.

“భర్త అంటే చాలా ప్రేమ కాబోలు.”

“ఆమెకు మొత్తం నలుగురు పిల్లలు. ఒక మొగపిల్లవాడూ ముగ్గురు ఆడ పిల్లలూ” అన్నాడు శాస్త్రి కొంటెగా.

నిజంగా ఆమెకు పిల్లలనేటప్పటికి నా మనస్సు కలుక్కుమంది. మిగిలిన ఆడవాళ్ళకు మల్లే ఈ బలే మనిషిక్కూడా పిల్లలా? ఎందుకనోగాని ఈ భావాన్నే నేను భరించలేక పోయాను.

ఇంతలో “అదిగో రైలు వస్తూ ఉంది” అన్నాడు శాస్త్రి. ఆమాటకి నా హృదయం దడదడ కొట్టుకుంది.

అకస్మాత్తుగా ప్లాట్ ఫారానికి చలనం కలిగింది. ఇద్దరు ప్రయాణీకులు ప్లాట్ఫారం అంచునుంచి సామాను సర్దుకొని దూరంగా నుంచున్నారు. ఒక ముసలమ్మ మూటనొక చేత్తో, మనవణి పట్టుకొని నిలబడింది. ఒక రైతు నుంచున్నవాడు నుంచున్నట్టుగానే హడావిడి పడుతున్న కర్ర చుట్టా, చుట్టని కర్రా అనుకున్నాడు.

రైలు ఆగీ ఆగడంతోనే ‘మూడో తరగతి’ అని జ్ఞాపకం చేశాడు లక్ష్మణ శాస్త్రి. ఆమె ఎప్పుడూ మూడో తరగతిలోనే ప్రయాణం చేస్తుందట. అమెకు ఒంటరితనం గిట్టదు. అందుకని జనసమ్మర్థంగా మూడో తరగతి చూచి అందులో ప్రయాణం చేస్తుంది. ఆమెకు ఎంత ఇరుగ్గా ఉంటే అంత సరదాగా ఉంటుందట! నాకు ఆమెను వెతకాలని వుంది కాని కాళ్లాడక అక్కడే దిక్కులు చూస్తూ నుంచున్నాను.

అది చిన్న స్టేషను. ఎక్కువ మంది దిగరు. “అదుగో దిగుతూ ఉంది” అని గార్డు పెట్టె వైపుకి చూపిస్తే చూశాను. కనబడలేదు.

“హలో” ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తితో కరస్పర్శ చేస్తూ అన్నాడు లక్ష్మణశాస్త్రి, ఆ వ్యక్తి ఓవర్ కోటులో ఉంది. చేతిలో తోలుసంచి ఉంది.

“మీరు రారనుకున్నాను” అన్నాడు. “అదేమిటి? ఎందుకు అలా అనుకోవటం?” అంటున్నది.

ఆ ఓవర్ కోటులో ఉన్న వ్యక్తి ఆమె అని అప్పుడు నాకు తెలిసింది. మామూలు స్త్రీ ఆకారం కోసం వెతుకుతున్న నా చూపులు ఓవర్ కోటులో ఉన్న ఆమెను పట్టుకోలేక పోయినయ్. నేను మళయాళంలో ఉన్నప్పుడు ఇటువంటి అవస్థలోనే ఉండేవాణ్ని. గూడకట్టు కట్టుకొని తుండుగుడ్డ భుజాన వేసుకునే ఆ స్త్రీలు నా కంటికి ఎప్పుడూ పొరపాట్నయినా స్త్రీలుగా కనిపించేవాళ్ళు కాదు. ఇప్పుడూ ఆ దుర్గతే పట్టింది.

లక్ష్మణ శాస్త్రి “ఆపేక్ష వున్నచోటే భయంకూడా ఉంటుంది. మీరు రావాలనే ఆ పేక్షతో పాటు, మీరు రారనే భయంకూడా ఎక్కువైంది”.

ఆమె నవ్వి “కామేశ్వరుడు కూడా ఇట్లాగే మాట్లాడుతాడు” అంది.

ఆమె భర్త పేరు ఎత్తేటప్పటికి లక్ష్మణశాస్త్రి కించపడి టాపిక్ మార్చటానికి ప్రయత్నించాడు. నన్ను పరిచయం చేస్తూ, ఇతడు శరచ్చంద్రబాబు. నాకు పరమ స్నేహితుడు. రాస్తూ ఉంటాడు. సినిమాలతో సంబంధం ఉంది.. మంచి….”

ఆమె లక్షణశాస్త్రి చేతిని వదలకుండానే నన్ను ఎగాదిగా చూచి, “మీ కథలు కొన్ని చదివాను. మీ కథలు బాగుంటై” అంది. 

శాస్త్రి యింట్లో దిగింది!

ఆ రాత్రి నిద్రపట్టకపోవటం వల్ల తెల్లవారి కొంచెం ఆలస్యంగా లేచాను. త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆమెను చూట్టానికి లక్ష్మణ శాస్త్రి ఇంటికి వెల్దామా వద్దా ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలోకి లక్ష్మణశాస్త్రే వొచ్చాడు. “ఒకసారి మా ఇంటికి రావోయ్. ఆమె పిలుచుకురమ్మన్నది” అన్నాడు.

“ఎందుకు?” అని అడిగాను. లోపల వెళదామని  ఉంది. ఆమె ఊరికేనే పిలుస్తూ ఉందని తెలుసు. అయినప్పటికీ అప్రయత్నంగా అలా అడిగేశాను.

లక్ష్మణశాస్త్రి నన్ను విచిత్రంగా చూచి, కాసేపు ఆగి, “సరేలే, రా” అన్నాడు. నేను బయల్దేరాను.

మేము వెళ్లేటప్పటికీ లక్ష్మణశాస్త్రి స్నేహితులూ, ఊళ్ళో కుర్రవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మధ్య కూర్చొని కబుర్లు చెబుతూ ఉంది. నన్ను చూచి, “ఏమండీ, పిలిస్తేగాని రావొద్దను కున్నారా?” అని నవ్వుతూ అడిగింది.

“మా వాడికి ఆడవాళ్లని చూస్తే సిగ్గు” అన్నాడు శాస్త్రి,

అంతా నవ్వారు. ఆమె మాత్రం చిన్నపుచ్చుకుంది. కారణం నాకు బోధపడలేదు గాని, ఎందుకో బాధపడుతున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపించింది. అదైనా కాసేపే! మళ్ళీ యథాప్రకారం అందరితోనూ కులాసాగా కబుర్లు చెప్పటం మొదలు పెట్టింది. తన అనుభవాలు, కథలు కథలుగా వర్ణించి చెప్పింది. చివరికి “మీకు నాకున్న అనుభవంలో పదోవంతు కూడా లేదు” అంది.

నిజమే, అందరూ అంగీకరించారు. “కాబట్టి వయస్సు మాట ఎట్లా వున్నా మీ అందరికీ నేను తల్లిని” అంది.

ఈ మాట మామధ్య పిడుగుపడినట్లు పడింది. కొందరు సిగ్గుపడి తలవొంచుకున్నారు, కొందరు వెకిలినవ్వు నవ్వారు, కొందరు తెల్లబోయారు.

నాకు ఇంకొక లోకంలో ఉన్నట్లు ఉంది. ఆమె మాత్రం వీటిని గమనించనట్లు యథాప్రకారం మాట్లాడుతూనే ఉంది,  అందరితో ఒకే మోస్తరుగా. కుర్రవాళ్ళంతా కిక్కురుమనకుండా విన్నారు. అవునూ, కాదూ అంటాన్నిక్కూడా వాళ్ళకు ధైర్యం లేకపోయింది. ఊకొట్టటానికే వాళ్లకు సిగ్గు వేసింది. “నేను స్త్రీని’ అనే భావం ఆమెకు చచ్చినా గుర్తుకు రాలేదు. 

నాకు చాలా సంతోషం వేసింది. కాని “పూర్వం సంతానానికి స్త్రీ పురుష సంపర్కం అవసరం లేనట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అవసరం. కొన్ని సంవత్సరాలకు మళ్లీ అవసరం లేకుండా పోవొచ్చు” అని చెపుతూ ఉంటే నా మనస్సుకూడా చివుక్కు మంది.

కొంచెం సేపు అయింతర్వాత మేము కాఫీ హోటలుకి బయల్దేరాం. ఆమె కూడా కంగారుగా వుంది. కాని ఆమెకు ఏమని చెప్పటం?

మేము దారిన వెళ్తుంటే జనం గుంపులు గుంపులుపడి విచిత్రంగా చూస్తూ హేళన చెయ్యటం నేను గమనించాను. ఆమెను గురించి ఒకటి రెండు మాటలు నా చెవిని పడినై. హోటలనుంచి బయటపడి కొంపకి జేరదామని అంతా త్వరగా కాఫీ ముగించారు. ఆమె మాత్రం తొందరపడనేలేదు.

“ఏదీ ఆ హల్వా ఇట్లా ఉంచండి” అని సుబ్బారావు పేట్లో హల్వాలో సగం తీసుకుంది. “ఈ బూంది కొంచెం తీసుకోండి” అని శాస్త్రి ప్లేటులోకి తన బూందిని చెంచాలో సగం పెట్టింది.

ఇక మిగతా టేబిల్సు చుట్టూ ఉన్న జనం రుసరుసలు చెప్పాలి!

సాయంకాలం పార్కుకి వెళ్ళాం. అక్కడా ఇంతే. అక్కడి వాళ్లంతా మమ్మల్ని మ్యూజియంలో జంతువుల్ని చూచినట్టు చూట్టం మొదలు పెట్టారు. ఏం జరుగుతున్నా ఆమెలో మాత్రం ఏమీ మార్పు కనపట్టంలేదు. కాని నేను కని పెట్టిన వాటిల్లో మరీ విచిత్రం అయిన విషయం ఏమిటంటే ఆడవాళ్ళతో మాట్లాడటానికినికి ఆమె నాకంటే సిగ్గుపడేది. లక్ష్మణశాస్త్రి భార్యతో తలవంచుకొని మాట్లాడేది. ఆమె వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పటానికి అమిత సిగ్గుపడేది.

“మీకు పిల్లలు ఎంతమందండీ?”

“మీరిట్లా తిరుగుతూ ఉంటే మీపిల్లలకు ఆలనా పాలనా ఎట్లా జరుగుతుంది!”

“ఈ చీరె ఎక్కడ కొన్నారు? దీని రంగు నిలవదండి”

“ఈ జాకెట్టుకి కుట్టుకూలి ఏం ఇచ్చారు?”

ఇటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఆమె తబ్బిబ్బు పడేది. మర్యాదగా జవాబులు చెప్పాలని ప్రయత్నించేదిగాని జవాబులు దొరక్కో అలవాటు లేకో ఉక్కిరి బిక్కిరి అయ్యేది.

ఇంతేకాదు, పసిపిల్లల్ని చూసినా, అంతే! మేం అంతా మాట్లాడుకునే సమయంలో శాస్త్రి పిల్లవాడు “అమ్మా” అంటూ అమె ఒళ్ళో దూరితే అమె పడిన భయం నేనెప్పుడూ మరిచి పోలేను. 

ఒళ్ళో తేలుపడ్డట్టు ఉలిక్కి పడ్డది. శాస్త్రీభార్య, “తిరగమోత మాడుతూ ఉంది. కొంచెం పిల్లవాడ్ని చంకవేసుకోండి, చూసి వస్తాను” అని చెప్పి ఆమెకు పిల్లవాణ్ణి అందించినప్పుడు ఆమె పడ్డ యాతన ఆ పరమాత్ముడికే తెలియాలి.

పిల్లవాణ్ని చంకన వేసుకోవటం చాతకాక శాస్త్రి భార్య పొయ్యిమీద చట్టిని పట్టుకున్నట్లు పట్టుకుంది. కాని ఎంత బాధ అయినా ఆమె మరుక్షణమే మర్చిపోయేది. ఇవతలికి వచ్చి ఏమీ జరగనట్టుగానే యథాప్రకారం ఆమె అందరితోనూ కులాసాగా కబుర్లు చెప్పేది, ఆ సంగతే ఎత్తేదికాదు.

భోజనం చేసి ఆమెను గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలో ఆమె కూడా శాస్త్రి ఇంట్లో భోజనం పూర్తిచేసుకుని వచ్చి “సినిమాకి వెళ్లాం రండి” అని అడిగింది.

నేను కొంచెం తటపటాయించి “శాస్త్రి ఏడి?” అన్నాను. 

“శాస్త్రి లేకపోతే మీరు రారా?” 

“ఎందుకు రాను?” 

“ఇంకేం? రండి.” 

“బండి పిలిపిస్తాను.” 

“నడిచిపోదాం .”

ఇద్దరం బయల్దేరాం. రోడ్డు మీద ఎవ్వరూ నడవటం లేదు. మునిపల్ లాంతరు స్థంభాలు మిణుకు మిణుకు మంటూ కాపలా కాస్తున్నై. దూరంగా అప్పుడప్పుడూ గుర్రపు బళ్ళ వోటిమోత వినిపిస్తోంది. మేమిద్దరం పక్క పక్కనే నడుస్తున్నాం. చలికి ఆమె శాలువా కప్పుకుంది. అందుకని నాకు ఆమె స్త్రీగా కనపట్టం మానేసింది. కొంచెం సేపయిన తర్వాత ఆమె ఒక్క నిట్టూర్పు విడిచి ఇలా అంది. “మీ ఊరు చాలా వెనకబడి ఉందండీ!”

నాకేమీ తోచక, “శాస్త్రి కూడా వస్తే బాగుండేది” అన్నాను. 

ఆమె ఒక క్షణం ఆగి, “చాలా వెనకబడి ఉంది” అతని తనలో తాను అనుకుంటున్నట్లు అన్నది. 

“లేకపోతే బొంబాయి ఉన్నట్లు ఉండమంటే ఎట్లా ఉంటుంది!” అన్నాను.

“ఊరు సంగతి కాదు. మనుషుల సంగతి. నేను వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. మీరు మాంధాత కాలంలో ఉన్నారు. అబ్బా, మీ ఊళ్ళో ఎలా బ్రతుకుతున్నారో. ఒకరితో మాట్లాడితే యింకొకరికి కోపం, అందరితో మాట్లాడితే అందరికీ కోపమే! దీన్నే ఈర్ష్య అంటారు కాబోలు. శాస్త్రి ఇంటో మీ అందరి సంగతి గమనించాను. కాఫీ హోటల్ కి వెళ్ళేటప్పుడు ఊళ్ళో వాళ్ళ సంగతి చూచాను. ఏం అన్యాయం? అన్నీ ప్రిమిటివ్ లక్షణాలే. ఆడవాళ్ళ పని మరీ అన్యాయంగా ఉంది. ప్రతి భార్యా తన భర్తని యితర స్త్రీలనుండి కాపాట్టమే తన ధర్మంగా నటిస్తుంది. తన భర్తతో మాట్లాడే ప్రతి స్త్రీ తన భర్తను కాజెయ్యటానికే ప్రయత్నిస్తూ ఉంది అనుకుంటుంది. ఎంత ప్రిమిటివ్! మీరంతా మాంధాత యుగంలో ఉన్నారు.”

నేనేమీ మాట్లాడలేదు. ఆమె మాటలు యదార్థం అని నాకు తెలుసు. ఆమె వచ్చిందగ్గరనుంచి మా జీవితంలో అమానుషత్వం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

“మీరు తెలివిగలవాళ్ళు. మీరు అనుకుంటున్న దానికంటే తెలివికలవాళ్ళు. అందుకని మిమ్మల్ని చూస్తూవుంటే నాకు ముచ్చటగా ఉంటుంది. కాని ఏం లాభం? మీ చుట్టూ వున్న సంఘంలో మీరు ఒకరు అవటంవల్ల మీలో కూడా ప్రిమిటివ్ ఇనిస్టింక్స్ చాలా ఉన్నయ్. మొదటినుంచి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరిక్కడ ఉండి చెడిపోతున్నారు. మీ కొక్క సలహా చెపుతాను

మీరిక్కడ స్త్రీల క్లబ్బు నొకదాన్ని ఆర్గనైజు చెయ్యండి. ఆడవాళ్ళని కొంచెం కలిసి మెలసి తిరిగేటట్టు చేస్తే తప్ప ఈ పశుత్వం పోదు. నామాట వినండి.”

ఈ మాటలు మేం బ్రతుకున్న బ్రతుకునంతా ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చినయ్. భార్యల్ని ఇళ్ళల్లో పెట్టటం బజార్ల వెంట తుకిడీ లు తుకిడీలుగా తిరగడం ఏ స్త్రీ అయినా కనిపిస్తే కోతి చేష్టలు చెయ్యటం- ఆడవాళ్ళ సంగతే సదా మాట్లాడుకోవటం – అంతా అసహ్యంగా కనిపించింది. ఈ మధ్య మా ఊళ్ళో ఆడవాళ్ళకోసం జరిగిన హత్యలు జ్ఞాపకం వొచ్చినై. వీటన్నిటికీ కారణం ఆమె చెప్పిందేనా? ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడ్డాను. ఆమెకూడా గ్రహించినట్లు ఉంది. మళ్ళీ ఆ సంగతి ఎత్తలేదు..

హాల్లో ప్రవేశించిం తర్వాత మొత్తం రెండు మూడుసార్లు మాట్లాడించింది. ఒకసారి “నాకు ఛార్లెస్ బోయర్ అంటే ఇష్టం. కామేశ్వరుడికి గ్రేటాగార్బో అంటే ఇష్టం” అంది.

“ఛార్లెస్ బోయర్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో నాకు తెలుసు. కానీ మీకు ఇష్టం అవటం చాలా ఆశ్చర్యంగా వుంది” అన్నాను.

“ఎందుకని?”

“అతడు చాలా మాస్కులైన్ గా ఉంటాడు. అతడు ముద్దు పెట్టుకుంటూ ఉంటే తెర చిరుగుతుందేమోనని భయం వేస్తుంది నాకు.”

ఆమె చిరునవ్వు నవ్వుతూ, “చిరిగితే చిరిగిందిలే అని పిస్తుంది నాకు” అంది. కొంచెం సేపు వుండి, “విరుద్ధ స్వభావాలు ఆకర్షించుకుంటాయి అనుకోవటం పాత సిద్ధాంతం” అని నెమ్మదిగా చెప్పింది.

ఇంకా కొంచెం సేపు ఉండి, “మీరన్న మాటకి నాకొక్క విషయం జ్ఞాపకం వస్తూవుంది. మీతో చెప్పక పోవటం ఎందుకు? మా ఊళ్ళో ఒక మహిళా సంఘంలో సభ్యురాలిగా జేర్చుకోమని అప్లికేషన్ పెట్టుకున్నాను. వాళ్ళు నా అప్లికేషన్ తిరగగొడుతూ ఈ సంఘం స్త్రీలకు మాత్రమే’ అని రాసి పంపారు” అని బిగ్గరగా నవ్వటం మొదలు పెట్టింది. నాకు మాత్రం ఆమెను చూస్తే జాలి వేసింది.

మళ్ళీ సినిమా చూస్తూ కూర్చున్నాం

మొదటిరాత్రి తెల్లవారగానే కథానాయకుడూ, కథానాయకి అత్యుత్సాహంగా చెట్టుకొమ్మ పట్టుకొని ఒకళ్ళు పువ్వు వాసన చూస్తూ, ఒకళ్ళు డూయట్ సాంగ్ పాడుతూ ఉంటే ” ఈ సీను ఎట్లాఉంది?” అని అడిగింది.

“బాగోలేదు. ఆమె కాసేపు అభినయిస్తే బాగుండేది!” అన్నాను. “ఎందుకని”

“గత రాత్రి అనుభవం ఆమెకు ప్రథమం చూడండి. అందుకని అతని మొహం చూసీ చూట్టంతోనే సిగ్గు జనించటం సహజం” అన్నాను.

“ఆమెకు ఆ అనుభవం ప్రథమం అని మీకెట్లా తెలుసు?” అని నవ్వింది. నవ్వుతూ తన చేతుల్లో వున్న సంపెంగపువ్వు నా చేతిలో పెట్టింది. నాకు పువ్వులంటే ఇష్టం లేకపోయినా వాసన చూస్తూ కూచున్నాను.

“గ్రేటాగార్బో “క్వీన్ క్రిస్టనా” చూశారా”

“ఆ”

“ఆ సీను ఎట్లావుంది”

ఆమె ఏ సీనుకి రిఫర్ చేస్తూవుందో నాకు తెలిసింది. ఆ సీన్లో గ్రేటాగార్బో పక్కన పడుకునే వరకు ఆమెకుర్రవాడు అనుకుంటాడు హీరో.  అకస్మాత్తుగా తెలుస్తుంది ఆమె కుర్రదని.. ఆ సీను ఎట్లా ఉందని ఆమె నన్ను అడుగుతూ ఉంది.

“బాగుంది”

“ఆ షాటు ఎట్లా వుంది”

ఆమె ఏ షాట్ని గురించి అడుగుతూ ఉందో నాకు తెలిసింది. కాని ఆమె ఆ షాట్ అడగటం లేదు. ఆ షాట్లో ఉన్న గ్రేటా గార్బో సంగతి అడుగుతూ ఉంది. గార్బో  వదులుగా  ఉన్న చొక్కాతో నిలబడి వుంది. లోపల మరేమీ లేదు. అది ఎట్లా వుంది? అని అడుగుతూంది  నన్ను. 

“అసలు గార్బో చిత్రాలు చూస్తుంటే నాకు ఊపిరి సలపక ఒక రకంగా ఉంటుంది, అట్లా  అవటం నాకు ఇష్టం ఉండదు.”

ఆమె మాట్లాడలేదు.

సినిమా హాల్లోనుంచి బయటికి రాగానే ఆమె ఇట్లా అన్నది: “ఇక ఈ వూళ్ళో నేను బతక లేను. మీరంతా ప్రిమిటివ్ పీపుల్స్. నాలుగు వందల సంవత్సరాల కిందటి జీవితాన్ని ప్రస్తుతం మీరు గడుపుతున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే బారువా చిత్రాలలోని కోయవాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు. బారువా నవనాగరిక కుటుంబాలను చూపించి, చూపించి అకస్మాత్తుగా కోయగూడెంలో ప్రేక్షకుల్ని పడేస్తారు. ఇతర చోట్ల చూచి మీ ఊరు వచ్చిన నాపని ఇప్పుడల్లా ఉంది. ఇక ఇక్కడ నేను బతకలేను. రేపే వెళ్ళిపోతాను.”

ఆమె ఇంకా కొన్నాళ్లు ఈ ఊళ్ళో వుండాలని నాకు ఉంది. ఆమె ఉంటే మా జీవితాలు కొద్దిగానైనా మారవొచ్చు అనే ఆశకూడా ఉంది.

ఆమెతో చెప్పుకోలేక “రేపు ఒక్కరోజు ఉండమన్నాను.”

“నేను నిజంగా చెబుతున్నాను. ఈ వాతావరణంలో ఒక్క క్షణం కూడా బతకలేను. టార్జాన్ చూశారుగా! ఆ మృగాల మధ్య, ఆ మహారణ్యంలో, ఆ టార్జాన్ పక్కన వున్న పిల్లలని చూస్తే నాకు అమిత భయం వేసేది. ఇప్పుడు మీ ఊళ్ళో మీ మధ్య నా పని ఆ పిల్ల పనిలాగే ఉంది. ఎలా ఉండగలను! ఉండను”

మర్నాడు పొద్దున్న నేనూ లక్ష్మణశాస్త్రి మరి కొంతమంది స్నేహితులం కలసి ఆమెను బొంబాయి రైలు ఎక్కించి వొచ్చాం. ఎక్కించి వొచ్చాం అంటే ఆమె ఎక్కింది. మేం చూస్తూనుంచున్నాం.

ఆమె నా జీవితాన్ని మార్చి వేసింది. నా దృష్టి పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు ఏపని చెయ్యబోయినా ఇన్ సెంటివ్ ఉండేది కాదు. ఇప్పుడా తత్వం పోయింది. హుషారు ఎక్కువైంది. ఇదివరకు ఎవ్వరయినా ఉపన్యాసానికి పిలిస్తే వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఇప్పుడలా కాదు కథలు రాయాలనీ, ఉపన్యాసాలివ్వాలనీ, పదిమందిచేత మెప్పులు పొందాలనీ ఆపేక్ష కలిగింది. 

అన్నిటికంటే పెద్ద మార్పు చేతులు, కాళ్లూ, మొహం రోజూ వీలు చిక్కినప్పుడల్లా శుభ్రంగా తోముకోవటం, నాలో కలిగిన మార్పుకి ఇవి ఉదాహరణలు మాత్రమే! ఏ పని చెయ్యబోయినా ఎవరితో మాట్లాడబోయినా, ఏదో జీవిత రహస్యం తెలుసుకున్నట్టు, తారకమంత్రోపదేశం పొందినట్టు సంతోషంగా ఉండేది. ఆమె మాటలూ ఆ చనువూ ఉండీ ఉండకుండా ఉంటం… చనువుగా చనువుగా వుంటూనే లొల్లిగా ఉండకుండా ఉంటం… నిర్భయంగా అన్ని విషయాలు చర్చించటం ఆమెని తలుచుకొన్నప్పుడల్లా హృదయం ఉప్పొంగేది. స్త్రీ మొగవాడితో తిరిగితే పాడై పోతుంది అంటారే ఎంత పొరపాటు మాట!

ఆనాటి సాయంకాలం లక్ష్మణ శాస్త్రి ఇంటికి వెళ్లాను. అతనితో ఆమెను గురించి తలుచుకున్నా, ఆమెను గురించి మాట్లాడినా ఆమె పక్కన కూర్చొని నవ్వుతున్నటు ఉండేది నాకు. 

నేను వెళ్ళేటప్పటికి , లక్ష్మణశాస్త్రి యింట్లో సుబ్బారావు, కృష్ణారావూ, వెంకటేశ్వర రావూ ఉన్నారు. లక్ష్మణ శాస్త్రి వాళ్ళకేదో చెపుతున్నాడు. వాళ్ళుగూడా ఆమెను గురించే మాట్లాడుతున్నారని నేను కనిపెట్టాను. పాపం వాళ్ళని చూస్తే నాకు జాలివేసింది. వాళ్ళు దిగులుగా కూర్చున్నారు. ఆమె వెళ్ళిపోగానే వాళ్ళ జీవితాలన్నీ ఒక్కసారి అయోమయం అయిపోయినై. చెట్టు ఆశ్రయం పోయిన పక్షుల్లా అయిపోయారు. తల్లి ప్రేమను పోగొట్టుకొన్న పిల్లల్లాగా కూర్చున్నారు.

 “నేను మీ తల్లిని” అని ఆమె చెప్పిన మాట నా చెవుల్లో గింగురుమంది.

నేను వెళ్ళి కూర్చోగానే లక్ష్మణశాస్త్రి “ఏమోయ్ మన కృష్ణారావు ఏమంటున్నాడో విన్నావా? ఆమెను మళ్ళీ పిలిపించి మహిళా సంఘాలు ఆర్గనైజ్ చేయించాలంటున్నాడు”.

“మంచిదేగా! తగిన సన్నాహాలు చేసి పిలిపించండి” అన్నాను. నాక్కూడా ఆ కోర్కె ఉందని చెప్పటం నాకు ఇష్టం లేక అలా అన్నాను.

“పిలిపించండి అంటే కాదు. మేము రాస్తే వొస్తుందో లేదో నువ్వు రాయాలి” అన్నాడు కృష్ణారావు.

“మన కోసం వస్తుందా? ఎవ్వరు రాసినా ఒకటే” అన్నాను.

“అదేమిటి? స్నేహం, మంచీ చెడ్డా ఉండవ్! నువ్వంటే ఆవిడకు గురి…” అన్నాడు సుబ్బారావు, సుబ్బారావు చూపులూ, వైఖరీ నాకేమి నచ్చలేదు. అసలు మొత్తం అంతా విచిత్రంగా ఉంది. వాళ్ళ స్వభావమే విచిత్రంగా మారినట్లు ఉంది. వాళ్ళ ధోరణి చూస్తే నాకు కోపం వచ్చింది. – 

“అందరం స్నేహితులమే! ఇందులో ?” అన్నాను.

” మా స్నేహాల దేముందిలే! మావన్నీ ఉత్తుత్తి స్నేహాలు. మాతో స్నేహం చెయ్యటానికి, మే మేమన్నా కథలు రాస్తామా? హ్యూమరస్ గా మాట్లాడి నవ్విస్తామా? సినిమాలకు వెంటబెట్టుకు పోతామా?” అన్నాడు సుబ్బారావు.

ఆఖరి మాటకు అంతా విషపు నవ్వు నవ్వారు. కృష్ణారావుకి ఎన్నడూ ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం వల్ల ఏమొచ్చినా ఆపుకోలేడు. విరగబడి నవ్వటం మొదలు పెట్టారు. వాళ్ళ సంభాషణమాట అటుంచి, వాళ్ళ నవ్వుకూడా నాకు సహజంగా కనబడలేదు. క్షణక్షణానికి నాకు కోపం ఎక్కువ అవుతూ ఉంది.

నేను సుబ్బారావు వంక తీక్షణంగా చూచి, “నీ తెలివికి సంతోషించాను. ఇకనైనా ఆపు?” అన్నాను.

“మా అందర్లోకి ఆమెకు నువ్వంటే మనసన్నమాట అందరికీ తెలిసిన విషయమే! మొగ ఆడ అన్న తర్వాత, కలిసి తిరగటం మొదలు పెట్టింతర్వాత…..

“శాస్త్రీ….!!” అని గద్దించాను.

అతడు నామాట లెక్క చేయలేదు. వింత ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు. “తప్పేముందోయ్? ఆమె నంగనాచా?”

అంతా గొల్లున నవ్వారు. నాకు తపన పుట్టింది. “ఆమెను ఒక్క మాట అన్నావా నేను ఊరుకోను” అని గట్టిగా అరుస్తూ లేచి నుంచున్నా.  

నాకు కోపం ఎక్కువ అవుతున్న కొద్దీ శాస్త్రికి  చిలిపితనం ఎక్కువ అవుతుంది. కొంటెనవ్వుతో అతని మొహం నిండిపోయింది. – “చూశారా, ఆవిడమాటంటే అతనికి ఎంత కోపమో! మనం ఆమెని ఒక్కమాటకూడా అనకూడదట! మీరు శ్రద్ధగా వినండి. ఒక్కమాటకాదు వెయ్యిమాటలంటా, ఆమె  మహాపతివ్రత. ఈ మధ్య సినిమాలో ఆమె పాతివ్రత్యం కాపాట్టానికి ఇతగాడు ప్రయత్నించాడు

ఆమె…”

ఇంతవరకే అన్నాడు. కాని ఆమెని అతడు అనబోయే మాటలన్నీ నాకు ముందే వినబడి.. మాటలు నా చెవినిపట్టం నాకు ఇష్టం లేదు. క్షణం క్షణం పెరుగుతూ వచ్చిన కోపాన్ని తట్టుకోలేకపోయాను ఇంతలో శాస్త్రి “పుష్పం మకరందం భ్రమరం” అంటున్నాడు.

ఇంకేముందీ? అమాంతంగా శాస్త్రి మీదకు వెళ్ళాను. అతన్ని నేను ఎన్ని దెబ్బలు వేశానో, తర్వాత ఏమయిందో నాకు తెలియలేదు. కాసేపటికి నేను నుంచున్నాను. సుబ్బారావు, కృష్ణారావు, వెంకటేశ్వరరావూ కిందపడివున్న శాస్త్రిని నెమ్మదిగా లేపుతున్నారు. అతని చూపులు చూస్తే నాకు జాలివేసింది. నేను ఇటువంటి పనికి పూనుకుంటానని అతడు ఎప్పుడూ అనుకొని ఉండడు. నన్ను జాలిగా చూస్తు అతడు “నీకు పిచ్చెత్తింది” అన్నాడు.

నేను చేసిన పనికి నాకు ఏమాత్రం పశ్చాత్తాపం కలుగలేదు. ఎందుక్కలుగుతుంది? మంచి చెడూ తెలియకుండా అనేమాటా, అననిమాటా తెలియకుండా నోరు పారేసుకుంటే ఏట్లా ఓర్చుకోవటం? వాళ్ళు నాకు స్నేహితులే కావొచ్చును అయితే మాత్రం? అందులో ఆమెను గురించా? |

ఆమె అటువంటి మనిషేనా? ఆ మాత్రం వాళ్ళు తెలుసుకోవద్దూ! ఆమె పక్కన కూర్చున్నా, ఆమెతో కలిసి మాట్లాడినా, ఆమెతో కలిసి నవ్వినా, అటువంటి చెడు ఆలోచనే రాదే! ఏదో లోకంలో, మబ్బుల్లో, శరీరాలే జ్ఞాపకానికి రాని భావంలో సంచారం చేస్తున్నట్టు ఉంటుందే! అటువంటి ఆమెకా ఇటువంటి నీచ స్వభావం అంటగట్టటం? వీళ్ళు కూడా అందరికి మల్లే ‘స్త్రీ పురుషుడితో తిరగితే చాలు, చెడిపోయి తీరాలి’ అనే అభిప్రాయంలోనే ఉన్నారు. ఎంత స్నేహితులైతే మాత్రం వీళ్ళని నేను ఎందుకు సహించాలి. తీరాలి’ అనే అంటగట్టటం? 

నిజంగా నేను చేసిన పనికి నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళకు తగినట్టు బుద్ధి చెప్పాననే తృప్తి కలిగింది.

ఒక్కొక్కప్పుడు, జరిగింది. జరిగినట్టు ఆమెకు రాద్దామనిపించేది. మళ్ళీ ఆమె మనసుని కష్టపెట్టినవాళ్ళం అవుతామేమోనని పస్తాయించి ఊరుకునేవాణ్ని. అటువంటి ఆమె కొంతమంది తనని గురించి ఇట్లా అనుకుంటున్నారని తెలిసినా, కొంతమంది మనుషులు ఎంత నీచంగా ఆలోచిస్తారో తెలిసినా, ఎంత బాధపడుతుందో, ఆమె పవిత్ర హృదయం ఎంత కొట్టుకుంటుందో నాకు తెలుసు. అందుకని ఇక్కడ జరిగిన సంగతులు ఆమెకు ఏమీ రాయకుండా ఊరుకున్నాను. .

కాని అయిదోరోజు ఆమె దగ్గరనుంచే నాకు ఉత్తరం వచ్చింది. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందని? ఇక నా ఆనందానికి అంతేలేదు. గబగబా ఉత్తరం చించి చదివాను. ఆ ఉత్తరం రావటం నాకు ఆశ్చర్యం కలిగిస్తే, ఇక ఆ ఉత్తరంలోని సంగతులు చదివేటప్పటికీ నా హృదయం ఆగిపోయినట్లయింది. ఆమె ఉత్తరం ఇది…..

“నేను బాగానే ఉన్నాను. ఇంటికి నలగని పువ్వుల్లే జేరాను. వచ్చినప్పటినుంచి మీకు ఉత్తరం రాద్దామనుకుంటున్నాను. కాని మీకు ఉత్తరం ఎలా రాయాలో బోధపట్టంలేదు. ఏం రాస్తే ఏమనుకుంటారో, నేను రాయదలచింది మీకు అర్ధం అయ్యేట్టు రాయగలనో లేనో భయం వేసి మెదలకుండా ఊరుకున్నాను. నేను నిజం చెబుతున్నాను. మీకు అర్థం అయ్యే భాష నాకు రాదు. ఒకవేళ వచ్చినా మరచిపోయి ఉంటాను.”

“ఇవ్వాళ లక్ష్మణశాస్త్రి దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. మీరేమీ ఆశ్చర్య పడవద్దు మేమిద్దరం స్నేహితులమనే విషయం మీకు తెలిసిందే గదా? ఆ ఉత్తరంలో అతడు సంగతులన్నీ వివరంగా రాశాడు. అతనికి మీకు జరిగిన పోట్లాట అంతా రాశాడు. అతడేమీ అబద్దాలు రాయలేదు. అక్షరాలా జరిగింది, జరిగినట్టుగానే రాశాడు. ఆ వుత్తరం చదువుతూవుంటే నాకు అపరాధ పరిశోధక నవల చదువుతూ వున్నట్లు ఉంది. స్టంటు పిక్చరు చూస్తూ ఉన్నట్లు ఉంది.”

“ఏమండీ, మీరు నా అనర్ డిఫెండు చెయ్యటానికేనా శాస్త్రితో పోట్లాడింది! అతన్ని కొట్టటం కూడా నాకోసమేనా? నిజంగా ఆ దృశ్యం ఊహించుకుంటూ ఉంటే మీరేగిన ఉంగరాల జుట్టూ, ఎర్రబడ్డ కళ్లూ, ఆవేశంతో చేతులు కాళ్ళూ ఒణకటం, లక్ష్మణశాస్త్రి కిందపట్టం, మీరు మీదకు దూకటం, జుట్టు పీకటం, మొహం రక్కటం ఇవన్నీ ఊహించుకుంటూ ఉంటే నాడియామీద నాకు అభిమానం హెచ్చుతూ ఉంది. మాటవరుసకు అనటంకాదు. నాడియా అంటే నాకు పూర్తి అభిమానం. జనాన్ని గుంపులు గుంపులుగా పడేసి హంటర్లో ఏం కొడుతుందండీ!

“మీరు చూపిన షివల్రీ  నన్ను ఆకర్షిస్తూ ఉంది. గాలిపటంమీద ప్రయాణం చేసి, మీ ముందు నా కృతజ్ఞతను చెప్పుకోవాలనిపిస్తూ ఉంది. మీ ముందుకూర్చొని మీకు నా కృతజ్ఞతను తెలుపుకుంటూ నమస్కరిస్తే మీరు నా చేతులు పట్టుకొని లేపి, “దీనికి మీరింత పొగడాలా? నా ధర్మం నేను నెరవేర్చాను

అంటారు కదూ? ఇటువంటి సీను ఏదో సినిమాలో చూచినట్టు జ్ఞాపకం. ఇటువంటి సీన్లు నాకు బాగుంటాయి కూడాను. కాని ముందు మిమ్మల్ని ఒక్కమాట అడగాలని ఉంది. దానికి మీరు సవ్యంగా జవాబు చెబితే రెక్కలు కట్టుకొచ్చి మీ ముందు వాలి, ఆ సీను యాక్టుచేసి పోతాను. ఆ మాట ఏమిటంటే అసలు నేను, నంగనాచినని మీకెట్లా తెలిసింది? మీరు నన్ను గురించి అలా అనుకోటానికి ఆధారాలేమిటి? నామాటలుగానీ, నా చేష్టలుగాని అటువంటి అవకాశం కలిగించినయ్యా? అలా కలిగించి ఉండవు. ఎందుకంటే నేను నిజంగా నంగనాచిని కాదు. లక్ష్మణశాస్త్రి మీకు యదార్థమే చెప్పాడు. నాకు నంగనాచిని కావాలనే ఆ పేక్షకూడా లేదు.”

“మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఉన్న సంగతి ఉన్నట్టుగా చెపుతూఉన్నాను. మీరు చూపిన షివల్రీ విషయం కూడా నాకు అనుమానం ఉంది. ‘ఆడవాళ్ళని రక్షించవలసిన బాధ్యత పురుషులమీద

ఉంది’ అనే అభిప్రాయమే ఈ షివల్రీ కారణం అనిపిస్తూ ఉంది నాకు. ఈ అభిప్రాయానికి స్త్రీ పురుషుడి ఆస్తి అనే అభిప్రాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ ఆస్తి అనుకున్నప్పుడూ తన్ను తాను కాపాడుకోలేని స్థితిలో వుంది అనుకున్నప్పుడేగా రక్షించవలసిన అవసరం కలిగేది. నేను ఒక రోజు మీతో తిరిగి, ఒక రాత్రి కలిసి సినిమా చూచినంత మాత్రాన నన్ను గురించి మీరిట్లా అనుకోటం… నా ఆనర్ని కాపాడవలసిన బాధ్యత మీమీద ఉందనుకోటం చాలా అన్యాయం. లక్ష్మణశాస్త్రి మొదలయిన వాళ్ళకి

మీకుభేదం ఏముంది? నేను ఇంకొకళ్ళ ఆస్తి నయ్యాననే అసూయతో వాళ్ళు మీదగ్గర నోటికి వచ్చినట్లు మాట్లాడారు. మీ ఆస్తిని హేళన చేస్తున్నారనే భావంతో బాధపడి అవమానపడి మీరు వాళ్ళతో దెబ్బలాడారు. ఇక భేదం ఎక్కడ? మీరు నాకోసం పోట్లాట్టం ఖాళీ కోటని రక్షించటానికి ప్రాణాలు ఒడ్డిన రసపుత్ర వీరుని శౌర్యం, ధైర్యం, సాహసం జ్ఞాపకానికి తెస్తున్నది.

“మీకు, మీకథలకూ ఎంత భేదం ఉందండీ! మీ ప్రవర్తన వేరు, మీ రచనలు వేరు. ఒకటి వెనక్కు లాగుతూ ఉంటే ఒకటి ముందుకు లాగుతూ ఉంటుంది. ఆలోచించుకొన్న కొద్దీ ఆ కథలు రాసింది మీరేనా అనిపిస్తూ వుంది. నేను చాలామంది రచయితల్ని ఎరుగుదును. ఎక్కువ మంది ఇంతే! వాళ్ళు రచనల్లో వెలిబుచ్చే అభిప్రాయాలు ఎంత అభివృద్ధిదాయకంగా ఉంటై! ప్రవర్తన మామూలు మనిషి ప్రవర్తనకంటే అధ్వాన్నంగా ఉంటుంది. దీనికి భావాలను, ఆలోచనలను, ఆచరణలోకి, అనుభవంలోకి తీసుకురావాలనే ప్రయత్నం లేకపోవటమే కారణం అనుకుంటాను. మీ విషయంలో ఇటా ఉండదని కుతూహలం పడ్డాను. కాని మీరూ అంతే! సాధారణంగా రచయితల్లో ఉండే బలాలు బలహీనతలూ, ఉద్రేకాలూ, ఆవేశాలూ అన్నీ మీలోను ఉన్నాయ్.మీరు మారాలి దయచేసి మారాలి. ఈ మాట నేను మీకు మీ ఊళ్ళో ఉన్నప్పుడే చెప్పాను మళ్ళీ చెపుతున్నాను. నేను ఇంతగా ఎందుకు చెపుతున్నానంటే, మీలో ఇన్ని బలహీనతలు ఉన్నా మీరంటే నాకు ఇష్టం. అందుకని మిమ్మల్ని బాగు చెయ్యాలనే గాఢంగా ఉంది. దీనికి నాకు ఒకటే దారి కనిపిస్తూ ఉంది. లేడీస్ క్లబ్ ఒక్కటి ఆర్గనైజ్ చెయ్యండి. ఆ క్లబ్బుకి మీరే సెక్రటరీగా ఉంటే మరీ మంచిది. నేను చాలా సంతోషిస్తాను. ఆశ్రద్ధ వొద్దు. జాడ్యం ముదరనిస్తే తరువాత ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు.”

“లేడీస్ క్లబ్బుకి సెక్రటరీగా ఉంటే నాకు ఊపిరి సలపదు. నాకు అట్లా అవటం ఇష్టం వుండదు” అని మహాపతివ్రత ఫోజు పెట్టకండి. ఊరికే, అట్లా అంటారుగాని ఊపిరి సలపక ఏమవుతుంది? ఎంతసేపూ నేను ‘అందంగా’ తెలివిగా మాట్లాడుతున్నానా లేదా? అనే గొడవేగాని సహజంగా మాట్లాడుదాం అనిగానీ, యదార్థం మాట్లాడుదాం అనిగానీ, మీకు ఎందుకు ఉండదు? సంఘానికి జడిసి బానిస అయి చిటచిట లాడుతూ రుసరుస మంటూ కాలం గడిపే పతివ్రతగా మీరు ఉంటం నాకు యిష్టం లేదు.”

“ఇక సెలవు నేను మనసిచ్చి రాయదలచుకుందంతా రాశాను. మీరు కూడా అట్లాగే ప్రవర్తించాలని నా కోర్కె. తప్పకుండా జవాబు రాయండి.”

“అయితే, ఏమండీ, అడగటం మరచిపోయానూ, సినిమాలో సంపెంగపువ్వు చేతికి ఇస్తే, సినిమా అయ్యేదాకా వాసన చూస్తూ కూర్చుంటారా? వాసన చూట్టానికేనా సంపెంగపువ్వు లిచ్చేది? పువ్వులు ఎందుకు పుట్టినయ్? వాసన చూట్టానికి, సెలయేరు ఎందుకు ప్రవహిస్తూ ఉంది? గానం చెయ్యటానికి. మంచిగంధం చెట్టు ఎందుకు పుట్టింది? పాములకు ఆశ్రయం ఇవ్వటానికి. ఇంతేగాని వీటన్నిటికీ మానవుడు పరిస్థితుల్ని బట్టి కొత్త కొత్త అర్థాలు సృష్టించుకుంటాడనిగాని మాటలతో చెప్పుకోటానికి వీల్లేని భావాలను వీటి ద్వారా చెప్పుకుంటాడనిగాని మీకు తెలియదు. మీరంతా ఎంత ప్రిమిటివ్ గా వున్నారండీ! పైగా నేను నంగనాచినని ప్రచారం! నేనుకూడా ప్రిమిటివ్ గా ఉన్నాననేగా మీ ఉద్దేశం! ఉండాలని ఆపేక్ష కామాలు”.

ఇట్లు

మీ

……….

పి.యస్. లక్ష్మణశాస్త్రి రాసిన ఉత్తరం కాదు.

ప్రసిద్ధ కథకుల కథలు:

ప్రసిద్ధ కథకుల ఇంటర్వ్యూలు:

కథాపరిచయాలు:

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading