Apple PodcastsSpotifyGoogle Podcasts

‘పేపర్ టైగర్’ కథ – వాసిరెడ్డి నవీన్ గారి ముందు మాటతో

ఎన్ ఎస్  ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. ముందుగా ఈ కథ గురించి ‘ కథా’ నవీన్ గారు మాట్లాడతారు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి, ముందు మాటనందించిన నవీన్ గారికి   కృతజ్ఞతలు. 

“ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నారు నరసింహం గారు, కిటికీలోంచి బయటికి చూస్తూ. ఆయనకి చాలా చిరాగ్గా వుంది.

‘నువ్వు ఇప్పుడిప్పుడే నన్ను వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నట్టు విన్పించింది ‘అబ్బాయ్’కి. అబ్బాయ్ పేరు వరప్రసాదరావు, అతనా గదిలో ఒక సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడనడం కంటే సోఫాని ఆనుకొని ‘గోడ కుర్చీ’ వేసేడనడం సబవు. తను కూర్చుంటే సోఫాకి ఏం నొప్పెడుతుందో, ఏ కుళ్ళు అంటుకుంటే నరసింహంగారు,  ఏం చేసేస్తారో అని భయపడుతున్నవాడిలా వున్నాడతను. .

ఆ సాయంకాలం అతను నరసింహం గారింటికి వస్తూ వుంటే, అల్లంత దూరంలో వుండగానే టపటపా చినుకులు పడ్డం ఆరంభించాయి. వాళ్ళింటికి వచ్చేసరికి అతని చొక్కా వొంటికి అతుక్కుపోయింది. ఎత్తుగా దువ్విన జాత్తు అణగారిపోయి బుర్రకి అంటుకుపోయింది. నీళ్ళతో కలిపి, నూనె తలమీంచి కారి మొహమంతా జిడ్డులా తయారయింది. నరసింహంగారి ఇంటికి వచ్చాక మెట్లెక్కి, వరండాలో నుంచుని రుమాలుతో – తల తుడుచుకోవాలో, మొహం తుడుచుకోవాలో తేల్చుకోలేక మోచేతులు తుడుచుకుంటూ కాలింగ్ బెల్ నొక్కేడతను.

ఆ సమయంలో నరసింహంగారొక్కరే ఇంట్లో వున్నాడు. ఆయన కొడుకూ, కోడలూ, మనవలూ అంతా ఏదో పార్టీకి వెళ్ళేరు. –

కాలింగ్ బెల్ విని ఆయనే తలుపు తీసేడు. తలుపు తియ్యగానే – చామనచాయవాడు, జిడ్డుమోమువాడు, రెండుపదుల వయసువాడు, బక్క పలుచనివాడు – వర ప్రసాదుడు కనిపించాడు. అతని రూపురేఖా విలాసాలు చూసేక, లోపలకు రమ్మనాలో, బైటవుంచి ‘ఏవరికోసవని’ అడగాలో తేల్చుకోలేక డోర్ నాబ్ పట్టుకొని ఒక్క క్షణం ఆలా నిల్చుండిపోయేడాయన..

నరసింహంగారిని చూడగానే వరప్రసాదరావు నోరు పెగల్లేదు. పెద్దపులిని చూచినట్టు ఒక్కసారి జడుసుకున్నాడు. కనిపించగానే వినయంగా నమస్కారం చెయ్యమని మరీ మరి చెప్పి పంపించిన తాతగారి మాటే మర్చిపోయేడు. నరసింహంగారి మొహం చూస్తూనే ఎందుకోగాని గాభరాపడిపోయేడా కుర్రవాడు.

నరసింహంగారికి ముఖంలో రంగులు మార్చడంలో ఒక ప్రాక్టీసు వుంది. ఆయన తన చిన్న మనవడితో ఆడుకుంటున్నప్పుడు ఎంతగా బోసి నవ్వులు చిందిస్తాడో, అదే సమయంలో పని కుర్రాడితో మాట్లాడవలసొస్తే అంత కటువుగానూ వుండగలడు. పూర్వంకూడా తన క్లయింట్లతోనూ, జడ్జీలతోనూ ఎంత మృదు మధురంగా మాట్లాడేవాడో తమ వూళ్ళో రైతులతోటి, కూలీలతోటీ  అంత కర్కశంగా మాట్లాడేవాడాయన. ఎవరెనా కొత్తవాళ్ళను చూసీ చూడ్డంతోపే, విధిగా ఆయన ముఖంలో రంగులు మారతాయి. అవతలవాణ్ణి చూస్తూనే ఒక అంచనా వేసుకొంటాడు. దాంతో ముఖం ‘ప్రసన్నంగా పెట్టడం’ ‘గంభీరంగా పెట్టడవా’ ‘ప్రసన్న గంభీరంగా పెట్టడవాఁ’ అన్నది తేల్చుకొంటాడు.

కాని వరప్రసాదరావుని చూసి ఎలా ముఖం పెట్టాలో ఆయనకి వెంటనే తెలియక తటపటాయించాడు.

ఇంతలో ఆ కుర్రవాడు జేబులోంచి ఓ వుత్తరం తీసి ఇచ్చేడు. అది చూస్తూనే, అయోమయపు రంగులోంచి కొంచెం ప్రసన్నపు రంగులోకి మొహాన్ని మార్చుకొన్నాడు నరసింహంగారు.

“రా లోపలికి” అన్నాడాయన.

తను వచ్చిన పని సగం అయిపోయినట్టేననిపించి, చిన్న పొంగు పొంగిపోయేడు. వరప్రసాదరావు,

కాని,వెంటనే నరసింహంగారు జోళ్ళు ………. అంటూ అర్థాంతరంగా ఆగిపోవడంతో ఒక్కసారి కుంగిపోయాడా అబ్బాయి.

ఆ కుర్రవాడి జోళ్ళు చిరు బురదతో వున్నాయి. “ఆయన చెప్పబట్టి సరిపోయింది కాని, అమ్మబాబోయ్! ఆ జోళ్ళతో లోపలికి వచ్చేస్తే ఇంకేదన్నా వుందా?” అనుకొని మనసులోనే ఫెడీ ఫెడీమని లెంపలు వాయించేసుకొన్నాడు వరప్రసాద రావు.

జోళ్ళు బైటే వదిలి, లోపలికి వచ్చి సోఫాముందు ‘గోడ కుర్చీ’ వేసేడా కుర్రవాడు. “సరిగా కూర్చో పరవాలేదు’ అందామని నోటిదాకా వచ్చింది కాని మరెంచేతో నరసింహం గారు అనలేదు.

ఆ కుర్రవాడి తాతగారూ, నరసింహం గారూ, చిన్నప్పుడు క్లాసుమేట్సు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ – ‘చదువు లేకపోతే మన బతుక్కి మరో దారీ తెన్నూ లేదు. చదువుకోకపోతే మట్టి కొట్టుకు పోతాం సుమా – అనుకొని కష్టపడి చదువుకొన్న వాళ్లే కానీ , పెద్దలు చెప్పినట్టు రోజులు అందరికీ ఒక్కేలా వుండవు కదా!

నరసింహంగారికి రోజులు మారేయి. దశ మళ్ళింది. ఆ రోజుల్లో కుర్ర నరసింహాన్ని చూసి – తన బాగుకోసం, అవసరం వస్తే – ‘అమ్మ లేదు, నాన్న లేడు, అన్న, చెల్లీ ఎవరూ లేరు లేరంటే లేరు’ అని ఈ కుర్రవాడు అనుకోగలడని ఎలా పసిగట్టారో గాని, పసిగట్టేరొక పెద్ద ప్లీడరుగారు. అంత చిన్న వయసులోనే ఆ కుర్రవాడికి ‘జ్ఞానోదయం’ కలిగినందుకు తెగ మురిసి పోయేడాయన.

ఆ తరువాత నరసింహంగారు – ఆ ప్లీడరు గారింటికి ఇల్లరికపుటల్లుడుగా వెళ్ళేడు; మద్రాసుకీ ‘లా’ స్టూడెంటుగా వెళ్ళేడు. కోర్టుకి మావగారి జూనియర్ గా వెళ్ళేడు. ఆ తరువాత ఎన్నెన్నో చోట్లకి ఎంతో గొప్పగా, గర్వంగా వెళ్ళేడు.

నరసింహంగారికి భగవంతుడంటే,  చెప్పలేనంత భక్తి.  కాని ఆయనకి మావగారంటే అంతకన్న ఒక్క పిసరు ఎక్కువ భక్తి. ఆయన పావుగంట సేపు మాట్లాడేడంటే అందులో అరగంట సేపు మావగారిని గురించి రిఫరెన్సే వుంటుంది.

నరసింహంగారికిప్పుడు ముగ్గురంటే ముగ్గురే మగపిల్లలు. ఆయన పెద్ద కొడుకు బొంబాయి దగ్గిర ఏదో ఆయిల్ రిఫెనరీలో జనరల్ మేనేజర్ హోదాకి ఒకే ఒక మెట్టు కింద వున్నాడు. అందుగురించి నరసింహంగారెప్పుడూ చిరాకు పడుతూనే వుంటారు. రెండో కొడుకు ఈ వూళ్ళోనే యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసరుగా వున్నాడు. అతను ఇప్పట్లో ప్రొఫెసరవాలంటే, ఇప్పుడు ప్రొఫెసరుగా వున్నాయన హఠాత్తుగా హారీమవడం ఒక్కటే మార్గం.

అది తల్చుకున్నప్పుడల్లా నరసింహంగారికి ఆ ప్రొఫెసర్ పీక పిసికేద్దాం అన్నంత కోపం వస్తూంటుంది. మరి మూడోవాడు అమెరికాలో రిసెర్చి చేస్తున్నాడు. అమెరికాలో ‘స్టూడెంట్ రివోల్ట్’ గురించి ఎప్పుడయినా పేపర్లో చూసినప్పుడు కించిత్తు గాభరా పడినా, మొత్తంమీద నరసింహంగారికి ఆ చిన్నవాణ్ణి గురించిన చింతేమీ లేదు.

ఇక ఆ సమయంలో నరసింహంగారి పుట్టింటివాళ్ళ దశకూడా మారింది. చదువు చదివి నాలుగు రాళ్ళు సంపాదించి, కుటుంబాన్ని లేవనెత్తుతాడనుకున్న నరసింహం,  నడి సముద్రంలో సంసారాన్ని వదిలి పూలపడవలో తన మానాన్న తను పారిపోతే – ఆయన పెద్ద చెల్లెలు చాలాకాలం పెళ్ళి కాక అలా వుండి వుండి ఆఖరికి వురి పోసుకు చచ్చిపోయింది. రెండో చెల్లి ఎవరో ముసిలి ప్లీడరుగారికి మూడో భార్యగా వెళ్ళిపోయింది.

ఆయన అన్నయ్య టీ.బీ.తో  ఆమధ్యనే పోయేడు. అన్నగారి భార్యా, పిల్లలు అంతా ఎక్కడుంటున్నారో, ఏవయిపోయారో ఎవరికీ తెలీదు. తండ్రి చిన్నప్పుడే పోయినా నరసింహంగారి తల్లి మటుకు చాలాకాలం పీనుగు బతుకు బతికింది. ముసిలిముద్ద అయిపోయి, పక్క మీద బట్ట మార్చిన వాళ్ళు లేక, ఆఖరవస్థలో మరీ ఘోరంగా రోజుకి నలభైసార్లు మంచం దింపేస్తూ వుంటే; వీధరుగుమీద పారేస్తే బతికుండగానే చీమలు పట్టిపోయి, ఈగలు ముసిరిపోయి, దెయ్యపు చూపు వచ్చేసి; మందుమాకుల్లేక, చల్లనిమాట మాటాడే మనిషి లేక, నానాయాతనాపడి ఆవిడ ఆఖరికి ఆ దీనబాంధవుడి సన్నిధి చేరుకుంది.

మరి అదే సమయంలో వరప్రసాదరావు తాతగారి ‘దశ’ కూడా మళ్ళింది. హఠాత్తుగా తండ్రి చచ్చిపోవడంతో, ఇంటరుతోనే చదువాపేసాడాయన. ఆ తరువాత చిన్న చిన్న వుద్యోగాలు చాలా చేసేడు. “పిల్లకింత తిండి పెట్టగలిగినవాడు చాలు” ననుకొంటున్న మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఆయనకిద్దరు కూతుళ్ళు, ఒక కొడుకూ.

కొడుకు ఏదో ఫేక్టరీలో పని చేస్తూ నిచ్చెన జారి, నీళ్ళ టాంకులో పడి చచ్చిపోయేడు. ఫేక్టరీ యజమానులు మురిపించి మురిపించి యిచ్చిన కాంపెన్సేషన్ చేజిక్కించుకొని అతని భార్య పుట్టింటికి చేరింది. రెండో కూతురు కాపరం పరవాలేదు కాని, పెద్ద దాని మొగుడికి స్థిరం లేదు. అతను నెల్లాళ్ళు వుద్యోగం చేస్తే, రెండు నెలలు ఇంట్లో కూర్చుంటాడు. రెండునెల్లు  ఇంట్లో కూర్చుంటే నాలుగు నెలలపాటు ఎక్కడిపోతాడో  ఏవిటో పత్తా లేకుండా పోతాడు. వాళ్ళకి అయిదుగురు పిల్లలు. పెద్దవాడు వరప్రసాదరావు,

వరప్రసాదుణ్ణి వాళ్ళ తాతగారే బియస్సీదాకా చదివించేరు. ఆకాడికే బ్రహ్మాండవై  పోయింది. అంతకి మించి ఆయనకీ శక్తి లేదు. అందుకే – వరప్రసాదరావు వుద్యోగం ప్రయత్నం మొదలు పెట్టాడు. ఏడెనిమిది నెల్లపాటు, అతను వుద్యోగం కోసం చెడ తిరిగేడు. ఇతను వుద్యోగం అడిగిన చోటల్లా, వాళ్ళు ఇతన్ని లంచం అడిగేరు: రికమండేషన్ లెటరడిగేరు. రెండూ అక్కర్లేనివాళ్ళు కులం అడిగారు. కులం సరిపోయిన చోట శాఖ అడిగేరు. అన్నీ అడిగేరు కాని ఇతనడిగింది మట్టుకు ఇవ్వలేదు.

అలాంటప్పుడు – గోదావరి వరదలో కొట్టుకుపోతున్న వాడికి, గడ్డి కుప్ప దొరికినట్లు నరసింహంగారు గుర్తుకొచ్చేడు. ఆయన్ని గురించి తాతగారు చెప్పింది వింటూ వుంటే, కల్పవృక్షమో కామధేనువో మన తాతగారి బెస్ట్ ఫ్రెండ్ అన్నట్లు ఫీలయేడు వరప్రసాదరావు, మనవడి చేతికి వుత్తరం ఇచ్చి పంపించారు తాతగారు.

“ఈ బాలకుడు నా మనవడనీ; వీడి తండ్రికి స్థిరం లేదనీ, అందువల్ల తల్లీ నల్గురుపిల్లలూ మలమల మాడిపోతున్నారనీ, మీ పిల్లల ద్వారా కాని, మీకు తెలిసిన పెద్దవాళ్ళ ద్వారా కాని చిన్నదైనా సరే, ఏదో వుద్యోగం ఒకటి ఇప్పిస్తే, చచ్చి మీ కడుపున పుడతాసనీ; ఈ వుపకారం చేసి పెట్టినందుకు ఆ అనాధరక్షకుడు మీకు ఇందుకు వెయ్యి రెట్లు మంచి చెయ్యకపోడనీ; స్వయంగా వచ్చి కష్టసుఖాలు చెప్పుకొందికి తన కాళ్ళు స్వాధీనంలోకి రావడం లేదనీ”- ఆ వుత్తరంలో వుంది.

వరప్రసాదరావు, సోఫాలో సరిగా కూర్చుందామని రెండు మూడు సార్లు అనుకొన్నాడు కాని ఎందుకో భయపడిపోయాడు. తలెత్తి చూశాడు. నరసింహంగారు ఉత్తరం  చదువుతున్నాడు. ఆయన వెనకాల గోడమీద ఫొటో చూసి గతుక్కుమన్నాడా కుర్రవాడు.

ఆ ఫొటో అందమైన ప్రేములో బిగించి వుంది. అది ఎవరో పెద్దమనిషి ఫొటో, ఆ పెద్దమనిషి ముఖం – గంభీరంగా పెట్టబోయి, భయంకరంగా పెట్టినట్టు వుంది. పెద్ద తలపాగాతో ఆయన తల రెండింతలు పెరిగినట్టు కనిపిస్తోంది. దోసగింజంత బొట్టు, ఆయన కనుబొమల మధ్య మెరుస్తోంది. ఎక్కుపెట్టిన ఆయన మీసాలు, ఎవరివో తెచ్చి అతికించుకున్నట్లు వికృతంగా వున్నాయి. నల్లటి చీకటి కోటులోంచి బయటకు వచ్చిన ఆయన కంఠం, తెల్లగా సున్నం వేసుకొన్నట్లు వుంది.

మొత్తంమీద ఆ ఫొటోలో వున్న విశేషం ఏమిటోగాని దానివేపు మరొక్కమారు చూడ్డానికి భయపడ్డాడు వరప్రసాదరావు.

నరసింహంగారు పుత్తరం చదివి, ముడిచి టీపాయ్ మీద పెడుతూ ఒక నిట్టూర్పు, విడిచాడు. పరధ్యానంగా వున్న వర ప్రసాదరావు ఫొటోలో వున్నాయనే నిట్టూర్చేడనుకొనివులిక్కిపడ్డాడు. అయితే, యిప్పుడు మీ తాతకి వొంట్లో కులాసాగానే వుందా?……. అఫ్కోర్స్ ఓల్డ్ ఏజ్. నాయీడు వాడు. నాకూ యీమధ్య వొంట్లో బావుండటం లేదబ్బాయ్ ! మా పిల్లలు ‘ఇంకా మీరు కోర్టుకి వెళ్ళడం ఏవిటి నాన్నారూ!’ అంటే ఏణ్నర్థం నుంచి ప్రాక్టీసు వదిలేసేను……. మీ తాత ఇంకా ఏదైనా పని చేస్తున్నాడా?….. అని ఏదో ఆలోచిస్తున్న వాడిలా ఆగిపోయేడు నరసింహంగారు.

వరప్రసాదరావు ఏం మాట్లాడలేదు. అతనికిందాకట్నించి చేతులు ఎక్కడ పెట్టుకోవడమన్నది పెద్ద సమస్య అయిపోయింది. సోఫా మీద చేతులు పెట్టడానికి అతనికి భయంగా వుంది. ముణుకులమీద పెట్టుకుంటే కూర్చోడం కష్టంగా వుంది.

దానికి తోడు రాగానే నమస్కారం చేయ్యలేదన్న విషయం, అతనికి హఠాత్తుగా గుర్తుకి వచ్చింది. మహా పాపకార్యం ఏదో చేసినట్టు భయపడిపోయాడు. “ఇప్పుడు మధ్యలో నమస్కారం చేస్తే ఏం బావుంటుంది? మరింక వుండబట్టలేక పైకే “ప్చ్” అనేసాడు.

“నేను ఎవరితో చెప్పాలంటే వాళ్లతో చెప్తానబ్బాయ్! కాని చూడూ, వెధవ రోజులెలా వున్నాయంటే, మనెదురుగుండా, “అలాగే సార్ ! తప్పకుండా” అన్న వెధవలే వెనకాతలకెళ్ళి మన మాటే మర్చిపోతారు. పూర్వపు రోజులు కావు గదా. ఓ మాట అన్నారూ అంటే, దానిమీద నిలబడతారు – అని నమ్మడానికి! నాకేవిటంటే ఓసారి చెప్పింతరవాత అది జరక్కపోతే నన్నే ఇన్సల్ట్ చేసినట్టు ఫీలవుతాను. అడిగి లేదనిపించుకోడంకంటె, వూరుకోవడం వుత్తమం అనిపిస్తోంది. నాకు వీళ్ళని చూస్తుంటే…… పోనీ మావాడితో చెప్దాం  అంటే, అవడానికి మా వాడు అసిస్టెంటు ప్రొఫెసరే అనుకో కాని, వాడి నెత్తిమీద మరో వెధవ వున్నాడుకదా! నా అనుమానం మావాడి చేతిలో ఏమన్నా వుందా అని! వాడిప్పుడు ఇంట్లో లేడు. అంతా ఆ ప్రొఫెసరింటికే, వాడి కొడుకూ, కోడలు వెస్ట్ జర్మనీ  నించి తిరిగొస్తే చూడ్డానికి వెళ్ళేరు. తప్పదు కదా మరి! మనవాడు చెయ్యగలిగిన పనైతే నిముషాలమీద చేయిస్తాను. ఈ కాలపు  కుర్రవాళ్ళలా  కాదు. ఇప్పటిక్కూడా, వాళ్ళంతటి వాళ్ళయిపోయాకకూడా, నన్ను కన్సల్ట్  చెయ్యందే ఒక్క పనీ చెయ్యరు…….” అని మళ్ళీ ఆగిపోయాడాయన.

తనేం మాట్లాడాలో తెలియక వూరుకున్నాడు వరప్రసాద్ ….. “ఇంతకీ యీ ముసలాయన ఎవరితోనైనా చెప్తాడా, చెప్పడా? కర్ర విరుగుతుందా? పాము చస్తుందా? ఈ గోడ మీద పిల్లి ఎటు దూకుతుంది? అటా, ఇటా?……. మొహమంతా జిడ్డు కారుతూ చిటపటలాడుతోంది వరప్రసాదరావుకి. కాని తుడుచుకొంటే “స్టయిలు గాడనుకుంటారో, ఏమిటో “అనుకొన్నాడతను. 

“ఈ రోజుల్లో వెధవ కరువు! అన్నిటికీ కరువే! తిండికి కరువే, వుద్యోగాలకి కరువే! ఐటెల్ యూ వన్ తింగ్. నేనింత చదువుకొన్నాను; అంత చదువుకొన్నాను, నాకీ వుద్యోగం సరిపోదు, అనుకొంటే మరి లాభం లేదబ్బాయ్! ఏదో ఒకటి పని. పని చెయ్యడానికి సిద్ధంగా వుండాలి. టు టెల్ యూ  ఫ్రాంక్లీ – నా పిల్లలెవరికీ కూడా నేను  జాబ్స్ కోసం ట్రై చెయ్యలేదు. కావాలన్నంతవరకు చదువులు చెప్పించేను. ఆ తరవాత వాళ్ళ అదృష్టం బావుంది. భగవన్తుడి  దయవల్ల వాళ్ళే, ఏవో మంచి ఉద్యోగాలే సంపాదించుకొన్నారు……. ఎవ్వళ్ళూ నాకేవీ పంపిచ్చక్కర్లేదు. 

మొన్న మొన్నటిదాకా, నేనూ, మా ఫాదర్ ఇన్ లా  ఇక్కడే ప్రాక్టీసు చెయ్యడంచేత,  ఈ వూరొదిలి వుండటం నాకిష్టం వుండదు. కాని నా పెద్దకొడుకూ, పిల్లలూ ‘గ్రేండ్ పా! మా ఇంటికి రండి రండి’ అని పిలుస్తారు. కొన్నాళ్ళు బాంబే వెళ్ళి, వాళ్ళతో వుంటాను. మరింక మూడోవాడు, “ఎప్పుడూ ఆ ఇద్దరన్నయ్యల దగ్గిరేనా వుంటారు? నాతోపాటు అమెరికా వచ్చెయ్యండని” ఒకటే వుత్తరాల మీద వుత్తరాలు దంచేస్తున్నాడు……. నువ్వు నా యంగెస్ట్ సన్ ని ఎరుగుదువా……?” అని ఆగాడు నరసింహంగారు.

తమ చిన్న కుమారుని తల్చుకోవడం వల్ల  కాబోలు, ఆయన ముఖంలో చిన్న దరహాస రేఖ మెరిసింది.

వున్నట్లుండి గదంతా చీకటయిపోయింది. బైట వాన కురుస్తూనే వుంది. వరప్రసాద రావు కూర్చున్న సోఫామీద, వెనకాతల కిటికీలోంచి, చిన్న తుంపర పడుతోంది.

“గొప్ప స్మార్ట్ ఫెలోలే! చిన్నప్పుడు వాళ్ళ తాతగారు – పెద్దయాక నువ్వేం చేస్తావురా తాతా?” అని అడిగితే “నేను అమెరికా పోతాను తాతగారూ” అనేవాడు. సిల్లీ ఫెలో!. చిన్నప్పణ్నుంచీ వాడు అదేమిటో ‘అమెరికా పోతాన్, అమెరికా పోతాన్’ అంటూ వుండేవాడు. అఫ్ కోర్స్ హి ఈజ్  లక్కీ! భగవంతుడి దయవల్ల వాడికి స్టేట్స్లో సీటొచ్చింది. స్కాలర్ షిప్ ఇవ్వనన్నారు. “పొండి వెధవల్లారా! దరిద్రులకీ ముష్టివాళ్ళకీ  మీ స్కాలర్ షిప్లు  కానీ, నా కొడుక్కేం ఖర్మ కాలింది? అని నేను పంపించేశాను……… గొప్ప తమాషా ఏంటంటే, అసలు వాడు వెళ్ళేవరకు నాకు తెలీదు. నేను కోప్పడతానని నాతో చెప్పకుండానే వాడు అప్లై చేశాడు, సీటొచ్చిన తరువాత – “నాన్నారూ వెళ్తాను”, అని నాదగ్గర గునిసేడు. వైషుడై కమిన్ హిజ్ వే? బావుపడతాన్నాన్నా అంటే వద్దనే ఫాదరెవడైనా వుంటాడా? వెంటనే పంపించేశాను. ఆ తరవాత,  నాకిక్కడే అన్ని ఫెసిలిటీస్ వున్నాయి; ఇక్కడే సెటిలయిపోతాను నాన్నారూ! అన్నాడు. సరేనయ్యా అన్నాను……. ఇదిగో చెప్తున్నా నబ్బాయ్! ఇది మన ఊరా , అది కాకపోయిందా? ఎక్కడో వోచోట హాయిగా, సుఖంగా బతికితే అంతే చాలు. ఇక్కడకన్నా సుఖంగా వుంటుందంటే, చంద్రమండలానికి పోతానన్నా నేను వద్దన్ను, మూడే ఏళ్ళకోసారి మనవేపు వస్తూనే వుంటాడు. ఎందుకు; ఏం బావుకోవాలని రావడం చెప్పు? వేలకి వేలు ఎయిర్ సర్వీసెస్ కి పొయ్యడం తప్పిస్తే!  అయినా, ఏవిటో,  ఎక్కడికిపోయినా, ‘మనవాళ్ళూ’. అంటే అభిమానం పోకపోవడవే  పిటీ!” అని గుక్క తిప్పుకున్నాడు నరసింహంగారు.

అమెరికాలో వున్న ఆ తృతీయ పుత్రరత్నాన్ని కళ్ళారా చూడలేకపోయినందుకు నొచ్చుకున్నాడు వరప్రసాదరావు. ఒక్క ఘడియ అతను, తన ఇంటినీ, ఇంటికి రాని తండ్రినీ, మంచం వదలని తాతగారినీ; ఏడుపు ఆపని అమ్మనీ – మర్చిపోయి, నరసింహంగారే తన తాతగారైతే  ఎంత బావుండునోకదా! అనుకున్నాడు. అందులోకి నరసింహంగారు తన కుటుంబ వ్యవహారాలన్నీ తనతో అంత ఇంటిమేట్ గా ‘చర్చించడం’, అతన్ని ముగ్ధుడ్ని చేసింది. అంత పెద్దాయన తనొచ్చినందుకు విసుక్కోడంలేదు – అదే చాలు అనిపించిందతనికి,

వరప్రసాదరావు వీపుమీద వాన జల్లు వుండుండి పడుతోంది. అంతకంతకీ వాన ఎక్కువయి పోతోంది. చిన్న మెరుపు మెరిసింది.

“జల్లు కొట్టేస్తోందబ్బాయ్!” అన్నాడు నరసింహంగారు. అవి, ఒక్క క్షణం వరప్రసాదుడి వైపు చూసేడు.

“అవున్నిజవే! జల్లు కొట్టేస్తోంది” – అన్నట్లు బుర్ర వూపేడు ప్రసాదరావు. చిన్న విసుగులాంటి మూలుగుతో, సోఫాలోంచి లేచాడు నరసింహంగారు.

చుట్టూ తిరిగి వెళ్ళి, ప్రసాదరావు వెనకాతలవున్న కిటికీ అద్దాల తలుపులు మూసేసాడు.

పూని పుచ్చుకొని ఒక్క లెంపకాయ కొట్టినట్టనిపించింది. ప్రసాదరావుకి. అతని గుండెలు అతివేగంగా కొట్టుకొన్నాయి. తలతీసి ఎక్కడయినా పెట్టేదామనిపించిందతనికి.

అద్దాల తలుపుల్లోంచి బయటకు చూస్తూ “ఈ వర్షం ఇప్పుడప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నారు నరసింహంగారు.

ఎక్కడో దూరంగా పిడుగు పడింది.

“నువ్విప్పుడప్పుడే నన్ను వదిలేలాగ లేవబ్బాయ్!” అన్నట్టే వినిపించింది వరప్రసాదరావుకి, వున్నట్లుండి అతనికి వెన్నుపూసలోంచి వణుకు ఆరంభమైంది. బయట -హోరున  వాన కురుస్తోంది. ఉండుండి ఆకాశం పెద్ద వెలుగుతో చీల్చుకొంటోంది. దూరంగా గేటవతల వీధిలో దీప స్తంభానికి కట్టిన గేదె ఒకటి తడిసిపోతోంది. దానిముందు వేసిన గడ్డి పరకలు నీళ్ళలో కొట్టుకుపోతూ వుంటే, వెర్రి ముండలా చూస్తూ వుండిపోయిందా గేదె. ఎక్కణ్నించో కుక్కపిల్ల ఒకటి తడిసిపోయి, చలికి కాబోలు, “కుయ్యి, కుయ్యి”, మని అరుస్తోంది.

గదిలో ట్యూబ్ లైట్ వేసి, మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చున్నాడు నరసింహంగారు.

“టింగ్ టింగ్” మని చప్పుడు చేస్తూ, గుప్పున వెలిగింది, ట్యూబులైటు. మూలని నక్కి వున్న ఎలకని టార్చిలైటు వేసి మరీ,  పిల్లి పట్టుకొన్నట్టనిపించింది వరప్రసాదరావుకి.

చిరుచలితో వున్న ఆ కుర్రవాణ్ణి చూస్తే తువ్వాలిచ్చి, తల తుడుచుకోమని చెప్తామన్న ఆలోచన నరసింహంగారికి మెరుపులా మెరిసింది కాని, అంతలోనే ఆ ఆలోచన చప్పగా చల్లారిపోయి, అంతరాంతరాల్లో ఎక్కడో ఇరుక్కుపోయింది.

“మా ఫాదరిన్లాని నువ్వెరుగుదువా?”

నరసింహంగారి వేపు చూసాడు ప్రసాదరావు. బితుకు బితుకుమంటూ, ఆయన ఒక్క పిసరు వెనక్కి తిరిగి తన వెకాతలవున్న ఫొటోని చూసేడు. ఆ ఫొటోని చూస్తూనే నరసింహంగారి ముఖం ఒక విధమైన తేజస్సుతో వెలిగిపోయింది.

వరప్రసాదరావు మళ్ళీ ఆ ఫొటో చూసేడు. అతనింతకుముందు గమనించలేదు గాని, ఆ బొమ్మలోని పెద్దమనిషి చిన్న నవ్వు నవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ నవ్వు,శవం నవ్వినట్టుండి, పరమ భయంకరంగా వుంది. కళ్ళు దించేసుకొన్నాడు ప్రసాదరావు,

నరసింహంగారు గొంతు సవరించుకొన్నారు.

“నువ్వెరుగవులే! మీ తాతగారికి బాగా తెలుసును. కాని, అబ్బాయ్! చెపున్నాను.  అలాంటి మనిషి నూటికో కోటికో ఒక్కరుంటారు. ఆయన ఎన్ని పుస్తకాలు చదివేరు? | ఎంత జ్ఞానం సంపాదించేరు? ఆయన్ని చూస్తూ వుంటే – మనం ఎప్పటికైనా ఈయన సంపాదించిన జ్ఞానంలో నూరోవంతు సంపాదించగలవా? – అని నాకనిపించేది. కాని, చెప్తున్నాను విను, నెవర్, నెవరిన్ మై లైఫ్ . నేను మాత్రం ఇప్పటిదాకా సాధించలేక పోయాను…. అంత పండితుడాయన. అలాంటి దైవభక్తుణ్ణి  మళ్ళీ మరోణ్ని చూళ్ళేదు నేను. ఆ రోజుల్లో చదువుకొన్న ప్రతి గాడిదా”దేవుడు లేడు, దెయ్యం లేదు” అంటూ బయల్దేరుతున్నారు గాని, వీళ్ళందరూ లేడనేస్తే లేకుండా పోతాడా ఏవిటి? వాడూయూ సే? నువ్వు నమ్ముతావా, నమ్మవా?”……. అని ఆగేడు నరసింహం గారు.

వరప్రసాదరావు ఏదో చెబ్దామని నోరు విప్పేడుకాని, అతను చెబ్దామనుకొన్న ముక్కలు గొంతుకడ్డం వచ్చి గుటకతో మింగుడు పడిపోయేయి.

నరసింహంగారు ఏవనుకొన్నారో, ఏమో మళ్ళీ మొదలెట్టాడు.

“మాటవరసకి నా ఎల్డర్ సన్, నా డాటర్ ఇన్ లా , వాళ్ళ పిల్లలూ అంత చదువుకొన్న వాళ్ళే! బట్ దే ఆర్ ఆల్ గాడ్ ఫియరింగ్ పీపుల్, ప్రతి ఏడూ పిల్లలకి పరీక్షలయిపోగానే మనవేపు వస్తారు. మా పెద్దవాడూ, మగ పిల్లలూ అంతా తిరపతిలో తలనీలాలు సమర్పించుకు మరీ వెళ్తారు. అందులోనూ, నా ఎల్దెస్త్  గ్రాండ్సన్ – అచ్చు మా ఫాదర్ ఇన్ లా  పోలికే వాడిది – వాడు బాంబే ఐ.ఐ.టి. లో కెమికల్ టెక్నాలజీ చదువుతున్నాడు. వాడు మరి ఏ పని చేసినా ఆ ఏడుకొండలవాణ్ణి తల్చుకోందే చెయ్యడు….. చెప్పొచ్చేదేమిటంటే, మా మావ గారికి అంత దైవభక్తి……”

వరప్రసాదరావు నోరు కొంచెం వేళ్ళాడేసుకొని వింటున్నాడు. వింటున్న కొద్దీ అతనికి వెన్నుపూసలో వణుకు ఎక్కువవుతోంది.

“ఆయన కోర్టుకెళ్తే అర్ధణా కేసులూ, అణా కేసులూ ఎప్పుడూ చూసేవారు కాదు. నేను కొత్తగా ప్రాక్టీసు పెట్టిన రోజుల్లోనే నాతో చెప్పేరు, – ‘నాయనా, నరసింహం! మనకున్న ఆస్తి ఇప్పటికైనా, ఎప్పటికైనా చదువు ఒక్కటే కదా! అంచేత మనం మన చదువు సంధ్యల్ని అలగా వెధవలకి, అడుక్కుతినే వెధవలకి దానం చేస్తే, ఆఖరికది మనకే బెడిసికొట్టి మనల్నికూడా వాళ్ళతో తత్తుల్యుల్ని చేసేస్తుంది. అందుకే ఆపాత్ర దానం కూడదన్నారు. మరింక బతకలేం – అంటావూ. ఈ వెధవ మురికి కేసులు, ముస్లి కేసులు చూసుకుంటూ బతకడంకన్న ఆ పరమేశ్వరుడి సాన్నిధ్యానికి పోవడం నయం కాదూ!’ అన్నారు. అంతే! అన్నమాట నిలబెట్టుకున్నారు. ఆవేళే నేనూ వెంకటేశ్వరుడి సాక్షిగా ఒట్టు వేసుకొన్నాను….. అది ఖూనీ  కేసు కానీ, ప్రోనోటు కేసు కానీ, పార్టీ వచ్చి – బాబూ! రక్షించు అని అడిగితే, ‘అబ్బే! ఇంతవుతుంది’ అని చెప్పి డబ్బుకి డబ్బూ  కరాఖండిగా పుచ్చుకునేవారు; పనికి పనీ కరాఖండిగా చేసేవారు”.

ఎక్కువగా మాట్లాడుతున్నావేమోనని సందేహం వచ్చి ఒక క్షణం ఆగేరు వరసింహం

కాని చెప్తున్నది – హైక్లాస్ డిగ్నిఫైడ్ లైఫ్ గురించే కాని లోక్లాస్ రెచడ్ లైఫ్గురించి కాదు కదా!

చిన్ననవ్వు నవ్వి “ఇప్పుడు తల్చుకుంటే నాకే నవ్వొస్తోంది. ఓసారి నా చిన్నతనంలో  అమాయకంగా నేనాయన్ని అడిగేను. ‘ అయితే, మావగారూ! ఖూనీ చేసిన వాణ్ణి  రక్షిస్తే, అది దుష్ట రక్షణ అవుతుంది కదా! అది పాపం కాదా?’ – అని, ఆ ప్రశ్నకి మరెవరైనా అయితే వూరంత కోపం తెచ్చేసుకొనేవారు. కాని  ఆయన మాత్రం అంతా విని చిన్న నవ్వు నవ్వి, – “అది కానేకాదోయ్! మనం చేస్తున్నదేవీ  లేదు. ఆ చచ్చిపోయినవాడు వీడి చేతులో చావ్వలిసుండి, వీడికి వాణ్ణి చంపాలిసుండి; వీడు బతకవలసుండి మన దగ్గరకు రావలిసున్నపుడు – మధ్యలో మనవెవరమోయ్ , దుష్ట రక్షణ అవునా కాదా?’ అని ఆలోచించడానికి ఆ జగత్పాలకుడి చర్యల్ని ప్రశ్నించడానికి నువ్వు గాని, నేను గాని ఎవళ్ళమైనా ఎవళ్ళమోయ్? ఎవడి కర్మ పరిపాకం ఎలా వుంటే అలా జరుగుతుంది” అని ఆయన సుళువుగా చెప్పేరు” అన్నారు,  నరసింహం గారు.

అలా ‘గోడ కుర్చీ’ వెయ్యడం వల్ల, వరప్రసాదరావు కాళ్ళు తిమ్మిరెక్కి వణుకుతున్నాయి. మెడ నొప్పెడుతోంది. తలెత్తి చూసేడు, ఎదురుగా ఫొటోలో వున్నాయన – “బతుకులో ఇంకా అంతుచూడాలిసినవి ఎన్నో వుండగా, అప్పుడే ఇలాగ చచ్చి శవాన్నయిపోయానే” అన్న అసూయతో బతికున్న వాళ్ళని శపిస్తున్నట్టు చూస్తున్నాడు. వెంటనే కళ్ళు తిప్పేసుకున్నాడు వరప్రసాదరావు.

“ఇంతకీ నేను చెప్పిందేవిటంటే, ఆయన ‘లా పుస్తకాలు ఎంత క్షుణ్ణంగా చదివేరో, ధర్మ శాస్త్రాలూ, శ్రుతులూ, స్మృతులు అంత క్షుణ్ణంగానూ చదివేరు. ఎప్పుడూ చదువు, చదువు, చదువు. చేస్తే కోర్టుపని చేయ్యడం, లేకపోతే ఒక పుస్తకం చదువుతూ వుండటం. ఆఖరి రోజుదాకా ఆయన కోర్టుకి వెళ్తూనే వున్నారు. ఆ ఫొటో పోయిన వెంటనే తీసింది…. ఓసారిలాగే…..” నరసింహంగారు టక్కుమని ఆగిపోయేడు.

బైట వరండాలో ఏవో మాటలు వినిపించేయి. అంతలోనే ఎవరో తలుపు దబదబ కొట్టేరు.

నరసింహంగారికి చాలా చిరాకేసింది. “కాల్ బెల్ వుంటే, తలుపు బాదుతారు…….” అంటూ లేచి వెళ్ళాడాయన.

సోఫాలో సరిగా కూర్చుందామనుకొన్నాడు వరప్రసాదరావు. కాని, వెంటనే – “ఇంత సేపూ ఒకలా కూర్చుని, ఇప్పుడొకసారి దర్జాగా కూర్చుంటే బావుంటుందా?” అని ధర్మ సందేహంలో పడ్డాడు.

వరండాలో లైటు వేసి, తలుపు తీసాడు నరసింహంగారు. –

తలుపు తీసిన నరసింహంగారికి, అవతల వరండాలో – వానలో తప్పతడిసిపోయిన ఒక ముసలివాడు, ఒక పడుచుపిల్ల కనిపించేరు. వొంటికి గుడ్డలు అంటుకుపోయి – ముసలివాడి ఎముకలూ, పడుచుపిల్ల వొంపులూ నరసింహంగారికి స్పష్టంగా కనిపించేయి.

నరసింహంగారి మొహంలో మారుతున్న రంగుల్ని ఆ మనిషి గమనించలేదు.

“వొరసంలో తడిసి పోనాం. మా తాతకి జొరంగుంది. కుసింత సేపు లోపల కూసుంటాం.. బాబూ?” అంది.

కళ్ళు మిరిమిట్లుగొలిపేలా ఓ మెరుపు మెరిసింది.

నరసింహంగారికి మెదట అర్థం కాలేదు. “ఎవర్నువ్వు ? ఏవిటి కావాలి? … ఆయన గర్జించినట్టు అడిగేడు.

“మా తాతకి జొరం . వరసం తగ్గేదాకా లోపల కూసుంటాం బాబూ! దా దా ! ముసిలీ”! అందా మనిషి మళ్ళీ. 

నరసింహంగారికి అంతా అర్థం అయింది. ఎక్కడో పిడుగు పడింది. “నించో, ఎవడొద్దన్నాడు? నించోండి” అన్నాడాయన కొంత తగ్గి.

“వరండాలో జల్లు కొట్టేస్తున్నది బాబయ్యా! మా తాత తడిచిపోతన్నాడు. జొరంగుంది బాబూ! ఒక్క సినం  కూసుండి పోతాం తండ్రి!”

“బావుంది! ఏదో సావెత  చెప్పినట్లుంది. గదిలో దూరిపోతానంటుందేఁ? ఏంటి పిల్లా? వరండాలో నించోమంటే నీక్కాదూ?” అంటూ తలుపు వేసేసాడు నరసింహంగారు.

“బాబూ! బాబ్బాబ్బాబూ!” అంటూనే వుందా మనిషి,

“పోనీ, ఇక్కడే నించుందాం, పోన్లేయే!” అంటూ ముసిలతనివి కాబోలు, నూతిలోంచి వచ్చినట్టు మాటలు విన్పించేయి..

నరసింహం గారు రొప్పుతూ వచ్చి, సోఫాలో కూర్చున్నాడు.

“చూడు! ఆముండ అధార్టీ ! లోపలికి వచ్చేస్తుందిట, లోపలికి! ఇదేం దర్మసత్రవమునుకొందో, దీని బాబుగారు కట్టించిన ఇల్లనుకొంటోందో? ఆ ముసిలి వెధవ చూడు, ఇప్పుడా మరో క్షణంలోనా అన్నట్టున్నాడు….. వరండాలో నించోనిస్తే, గదిలోకి వస్తానంటోంది. ఆ తరవాత, దాని సొమ్మేం పోయింది. ఆ జబ్బు వెదవకి మంచవియ్యమంటుంది. ‘నాయినా, బాబూ’ అని బతిమాలితే లొంగిపోయి లోపలికి రానిస్తాననుకొంటోంది కాబోలు, దొంగముండ, పోనీకదా అని రానిస్తావనుకో. తీరా, ఆ ముసిలాడు ఇక్కడే గుటుక్కుమంటె? వెధవకి ఏం రోగవో, పూష్టం అంటోంది. ఏమో, ఏ విషజ్వరవో ఎవరికి తెలుసు? అయ్యోపాపం!….. అనుకుంటే, ఆ వెధవ రోగాలన్నీ మనింట్లో ప్రవేశించి మనల్ని పీక్కు తినేస్తాయే. ఆ వెధవలకయితే ఫరవాలేదు. రండికీ మొండికీ  వార్చేసి వుంటారు….. వర్షం వొస్తే…… వరండాలో నించోమన్నాను కదా? మరోడయితే, గేటుదాటి లోపలికెందుకొచ్చేవని తగిలేసును……. ముసిలాడు బాగా తడిసిపోయినట్టున్నాడు. వూరికే వణికిపోతున్నాడు. జబ్బులొచ్చేయంటే రావు మరి! ఓ చదువా సంధ్యా వల్లకాడా, వసినదిబ్బా? మళ్ళీ వెధవలింటిల్లిపాదీ సంపాయిస్తారు.. కాణి మిగల్చడం ఏదన్నా వుంటుందా? అదేవీ లేదు….. తాగేపి తందనాలాడటం……. పోనీ వుంటున్నచోట ఏదన్నా శుభ్రం అదీ వుంటుందా? జబ్బులొచ్చేయంటే వాటిదా తప్పు?………. “ గుక్క తిప్పుకొన్నాడు నరసింహంగారు.

వరప్రసాదరావుకి నరసింహంగారివేపు చూడ్డానికే భయం వేస్తోంది. సరిగ్గా వెనకాతల ఆయన తలమీద వున్న మావగారి బొమ్మ, ఆయన్ని ఆవహించిన దెయ్యంలా కనిపించిందతనికి. తిమ్మిరెక్కిన కాళ్ళు, స్వాధీనంలోకి రావడం లేదు. లేస్తే తూలిపడిపోతానేమోననిపించిందతనికి.

“చెప్పలేమబ్బాయ్! కీడెంచిమేలెంచమన్నారు. ఆ ముసిలాడికి నిజంగా జ్వరం లేదేమో! ఇద్దరూ దొంగవెధవలేమో ఎవడు చెప్పగలడు, అందులోనూ, ఈ రోజుల్లో దొంగతనానికి సవాలక్ష మార్గాలు. కాయకష్టం చేసి బతకడం మానేసి దోచేసుకు బతికేద్దాం అనుకొనే వెధవలికి మరి ఈ పోలీసులూ, ఈ కోర్టులూ లాభం లేదబ్బాయ్! నన్నడిగితే, దొంగ వెధవలు దొరికితే, నలుగురూ కలిసి చితకతన్నెయ్యాలి. అట్టే మాట్లాడితే, అక్కడే కాల్చిపారెయ్యాలి. దెబ్బతో మరెవడూ దొంగతనాలకి దిగడు”.

నరసింహంగారి ముఖం, ఎర్రగా దుంపలా అయిపోయింది. ఆవేశంలో వూగిపోతున్నాడాయన.

బైట  వానకి  గాలి తోడయింది. వూరూవాడా ఏకవయిపోయేంత వాన కురుస్తోంది. వరండాలో మాటలు వినిపించడం లేదు.

వరండాలో వదిలేసిన జోళ్ళు  ఓసారి గుర్తుకొచ్చేయి కాని ఆ భయంలో, ఆ చిరుగాలిలో ఆమాటే మర్చిపోయేడు వరప్రసాదరావు. 

ఇంతలో –

మళ్ళీ తలుపు దబదబ బాదేరెవరో, ఈసారి ఆగకుండా బాదుతున్నారు.

వరప్రసాదరావు లేచి వెళ్లామనుకున్నంతలో, చివాల్న నరసింహంగారే వెళ్ళేడు. ఆయనకి అరికాలిమంట నెత్తికెక్కింది.

వరప్రసాదరావు గుండె ఒక్కసారి కొట్టుకోడం మానేసి, మళ్ళీ గబగబా కొట్టుకొంది. ప్రళయావేశ రుద్రుడిలా వున్నారు నరసింహంగారు.

నరసింహంగారు, కోపవంతా తలుపుమీద చూపించి, తలుపు తీసేడు.

ఆయన ఇలా తలుపు తియ్యడం ఏవిటి, ‘సర్ర్’మని గాలీవానాతోపాటు ఆ పడుచుపిల్ల ముసలతని చెయ్యి పట్టుకొని లోపలకు రావడం ఏమిటి – మెరుపు మెరిసినంతలో జరిగిపోయేయి. నరసింహంగారు కొంచెమాగి, వెనక్కి జరిగేడు.

“ఏయ్! వాటీజ్ దిస్? ఏవిఁటి దౌర్జన్యం? చెప్తూ వుంటే నీక్కాదూ! నువ్వు మనిషివా? పశువ్వా? గెటౌట్! పొండి ముందు! వూ! బయటికి పొండి” అని అరిచేరు నరసింహంగారు.

ఆ మనిషి నోరు మెదపలేదు. వరప్రసాదరావు వేపు ఓ చూపు చూసిందావిడ. కాని ఆ కుర్రవాడు తన భయంలో తనుండి, ఆ చూపుల్ని గమనించలేదు.

ఆ మనిషి మౌనం నరసింహంగారిని మరింత రెచ్చగొట్టింది.

“పోతారా, పోరా? పోలీసుల్ని పిలిపిస్తాను. ఏదనుకొంటున్నారో? మర్యాదగా పొండి.  క్విక్ ! గెటౌట్!”

ఆవిడ అప్పటికి ఏం మాటాడలేదు. హోరున  వాన చప్పుడు, చెవుల్లో గింగురు ముంటోంది. వాన దబాయించి కురుస్తోంది. తీసిన తలుపులోంచి వరండాలో జల్లు, గదిలోకి కూడా వస్తోంది. చల్లటిగాలి వుండుండి వీస్తోంది.

తోకమీద లేచిన పాములా నిల్చున్నాడు నరసింహంగారు. ఆ మనిషి, ముసలతని   చేతిలో కర్ర తీసుకొని, అతన్ని గోడకి చేరవగా కూర్చోబెట్టింది. చేతిలో సంచినీ, కర్రని  ఆ పక్కనే వుంచింది. జుత్తు ముడి విప్పుకొని దులుపుకొంది.

నరసింహంగారు ఈ అవమానాన్ని సహించలేక పోయేడు. “రాస్కెల్స్! మీరిలాగ పోరు! పోలీసులకి ఫోను చేస్తాను” అంటూ ఫోను దగ్గరికి నడిచేడాయన. జాత్తు ముడి వేసుకొని, కొంగు బిగించి కొంచెం ముందుకొచ్చిందా అమ్మాయి.

ఈ క్షణంలో ఏ సిద్దుడో వచ్చి తనని మాయం చేస్తే బావుండు ననుకొన్నాడు వరప్రసాదరావు,

“ఏటి బాబు! పోలీసుల్ని పిలిపిస్తాన్ పోలీసుల్ని పిలిపిస్తాన్ – అని జడిపిస్తున్నావ్.. పిలు బాబు! పిలు. అంతకంటే నువ్వు మాత్తరంవేటి  సెయ్యగలవు? ఆలు నీ సేతిలున్నారు గనక ఆల్ని పిలుస్తావ్. పోలీసోల్లని కాకపోతే మిలిట్రోల్ని పిలు! ఏటి నానేని నీ వొంటి మీద సెయ్యేసినానా? నీ ఇల్లడిగినానా, నీ కోకలడిగినానా, నీ డబ్బడిగినానా? ముసిలి ముండాకొడుకు నిస్కారనంగ పచ్చిపోతాడు; ఒరసం వొగ్గగానే పోతాం బాబూ! – అన్నాను. అంతేనా, అంతకంటేటైనా  అధికంగ అడిగినాన? సెప్పు” అందామనిషి మర్యాదగానే.

“ఈ వెధవ కబుర్లు చాలుగాని, ఫో బయటికి. ఐవిల్ నెక్ యూ అవుట్. మిమ్మల్ని మెడ పట్టుకు గెంటేస్తాను. పొండి ముందు!” అరిచేడు నరసింహంగారు, ఫోను ఎత్తుతూ.

“ఏటి బాబు! మరియాదగ నాయినా  బాబూ అంటే బిర్రబిగిసి పోతున్నావు. నానెల్లను బాబూ! .మేఁవెల్లం.   ఇక్కణ్ణుంచి ఒక్కడుగు కదలం. ఏటి సేత్తావో సెయ్యి. వొరసం వొగ్గాల, మావు కదలాల. నీ సిత్తంకొచ్చింది, సెయ్యి. పోలీసోల్లనే పిలిపించుకుంటావో, మిలట్రోల్లనే పిలిపించుకొంటావో నియ్యిష్టం…… కూసోరా ముసిలీ!” అంటూ లేచిపోతున్న ఆ ముసిలతన్ని కూర్చోబెట్టి, అక్కడేవున్న కిటికీలో కూర్చుంది,  ఆ పడుచుపిల్ల.

నరసింహంగారు ఫోను దించేసేరు. పడుచుపిల్ల వయసు చూసే దించేసేరో, ముసలతని జబ్బు చూసే దించే సేరో, ఇది అపాత్రదానం కాదని తమని తాము నమ్మించుకొనే దించేసేరో, పోలీసుల్ని ఇంట్లోకి రానివ్వడం,  కోరి శనిని ఇంట్లోకి తెచ్చుకోవడమే అనుకొని దించేసేరో – ఎందుకోగాని మొత్తంమీద ఫోను దించేసారు నరసింహంగారు.

“వెధవలికి చెప్తే అర్థం కాదు” అంటూ గొణుక్కొన్నారు.

నరసింహంగారు కచ్చ సర్దుకొంటున్నారు. గోడ మీద ఫొటో,  బోనులో బంధింపబడ్డ  పులిలాగ, సీసాలో దిగబడిన పిశాచంలాగ, గిలగిలలాడుతోంది.

వరప్రసాదరావు ఠీవిగా  సోఫాలో వెనక్కి జారబడి, బేక్ పాకెట్ లోంచి దువ్వెన తీసి, జాత్తు మీదికి దువ్వుకొన్నాడు. రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు.

వరండాలో వానజల్లు పడుతూ తివాసీ ని తడిపేస్తోంది.

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading