Apple PodcastsSpotifyGoogle Podcasts

‘మనిషి లోపలి విధ్వంసం’ – అల్లం రాజయ్య గారి రచన

గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోపలి విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు.

ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి.  https://bit.ly/3scvsxP

అదొక చిన్నరైల్వే స్టేషన్. ఆ స్టేషన్ భవనాలు నైజాం కాలంలో కట్టినవి. ఈ ఏడు వానాకాలంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలవల్ల స్టేషన్ భవనం, గోడలు పెచ్చులూడిపోయాయి. భవనం పైనుండి కారిన

నీటి ధారల మూలంగా గోడల మీద చారికలు ఏర్పడినాయి. రైల్వే స్టేషను కుడిఎడమల పాతిన సిమెంట్ పోల్స్, కట్టిన ఫెన్సింగు వైరు అక్కడక్కడ విరిగి పోయాయి. ఆ స్టేషన్లోకి వచ్చే ప్రయాణీకులు, పోయే ప్రయాణీకులు సాధారణంగా స్టేషన్ ద్వారం నుండి కాక విరిగిన సిమెంట్ పోల్స్ ఫెన్సింగు నుంచే నడుస్తారు.

రైల్వే స్టేషన్ వెనుకవైపు, స్టేషన్ కట్టినప్పుడే కట్టిన క్వార్టర్లలో నాలుగు కూలిపోయి ఉన్నాయి. మిగతా క్వార్టర్లలో రైల్వేగ్యాంగు వాళ్లు తప్ప బుక్కింగు క్లర్కుగాని స్టేషన్మస్టరు గాని ఉండటం లేదు. వాళ్ళు దాదాపు అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో గల ఓ మాదిరి పట్నం నుంచీ రోజూ వస్తారు.

రైల్వే స్టేషను దక్షిణాన నీలగిరి చెట్లు పెరిగి ఉన్నాయి. నీలగిరి చెట్ల కింద ఆకులుపడి ఆ స్థలమంతా తెల్లగా మెరుస్తున్నది. స్టేషన్‌కు ఎదురుగా పసిరిక చెట్లు, వేపచెట్లు, తుమ్మచెట్లు పెరిగి ఉన్నాయి. ఆ చెట్లకింద రైలు పట్టాలకు ఆవలి వైపున ‘తాటికల్లు’ కుండల్లో నురుగు వస్తుండగా నలుగురు గౌండ్ల వాళ్ళు గిరాకి లేక దిగాలు పడి కూర్చున్నారు. వాళ్ళకు కొంచెం దూరంలో పసుపుపచ్చ ప్లాస్టిక్ ట్రేలో సారా ప్యాకెట్లు పెట్టుకొని పేడి మూతి ఉపేంద్ర కూర్చున్నాడు.

పొద్దున తయారుచేసిన ‘మిరపకాయ బజ్జీలు’ చల్లారిపోగా షేక్ దావూద్ గొణుగుతున్నాడు.

వేపచెట్టు కింద కాల్చిన మొక్కజొన్న కంకులు పెట్టుకొని ముగ్గురు పల్లెటూరి ఆడవాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు.

పరికి పండ్లు అమ్మే ముసలవ్వ ఎందుకో విచారంగా కూర్చున్నది.

ఆ చెట్ల కింద దుమ్ములో కూర్చుండలేక, అలాగని ఎంతో సేపు నిలబడలేక ఒక కుటుంబం దిక్కులు చూస్తున్నది.

“అట్ల పోయి రైలెప్పుడు కాలవడ్తదో తెలుసకరాపోరాదు!” భార్య భర్త మీద విసుక్కున్నది. భార్య పేరు గంగమ్మ. ఆమె గులాబిరంగు పాలిస్టర్ చీర కట్టుకున్నది. చెవులకు బంగారు జూకాలున్నాయి. కాళ్ళకు పట్ట గొలుసులు, వెండి మట్టెలున్నాయి. భర్త రాయేశం తన అంగీజేబులో చెయ్యి పెట్టి, భార్యకేసి చూసి వంకర నవ్వు నవ్వాడు.

రాయేశం తెల్లటి పాలిస్టర్ కమీజు తొడిగి ధోవతి కట్టుకొన్నాడు. కాళ్ళకు సింగరేణి బొగ్గుగని బూట్లు వేసుకున్నాడు. మెడకు మఫ్లర్, ఎడమచేతికి గడియారమున్నది. .

“అమ్మా పరికి పండ్లే!” వారిద్దరి పదేండ్ల కొడుకు అడిగాడు. “మీ బాపు నడుగుపో” గంగమ్మ పిల్లవాడ్ని కసిరింది.

రాయేశం వంకర నవ్వుకు గంగమ్మ ఎలాంటి అడ్డంకి చెప్పకపోయేసరికి ఉపేంద్రం దగ్గరికి నడిచి “ఎంతకోబత్త (సారా ప్యాకెటు) పిలడా?” అడిగాడు.

“మీ కాలేరు (కాలరీ) లెంత?” ఉపేంద్రం. 

“మా బొగ్గుబాయిల కాడ అమ్మినట్టే అమ్ముతానవా?” 

“ఈడ అంతరేటు కమ్ముతె బొక్కలిరువరా?” ఒక గౌండ్లాయన కోపంగా అన్నాడు.

 “ఎవలు?” రాయేశం. 

“ఇంకెవలు పాముకోరలిరిసినోళ్ళే” ఇంకో గౌండ్లాయన. పాము కోరలిరిసినోల్లెవరో రాయేశం అడుగలేదు. వాళ్లు చెప్పలేదు.

 “రెండున్నర” ఉపేంద్రం.

“లావు సస్తనే ఉన్నది. మా వూల్లే సార మావులా పట్టిన కొత్తల నాలుగు రూపాయలన్నరు. లొల్లయి నంక గిప్పుడు గిదేధర”.

“మీ వూల్లేంది ఈ సుట్టు పక్క అన్ని ఊళ్ళల్లగిదే ధర – ఈసారి మావుల (కంట్రాక్ట్) పట్టినోడు మన్నై పోయిండనుకో.”

“మా కాలేరుమీద దోసుకుంటండ్లు – ఆడ బత్తకు అయిదు రూపాయలు” రాయేశం. రెండు సారా ప్యాకెట్లు తీసుకొని ఒకటి కట్టుక్కున కొరికి నోట్లో పోసుకొని ఇంకొకటి జేబులో వేసుకున్నాడు. అయిదు రూపాయల నోటు తీసి ఇచ్చాడు.

ఆ వాసన తనకే వచ్చినట్లుగా ఒక అంగన్‌వాడి టీచరమ్మ అటేపు జరిగింది.

ఒక ముసలమ్మ చెవుల గంటీలు ఊగుతుండగా “రైలెప్పుడత్తది పిలడా! సిటక్కున సీకటైనంకనా?” అన్నది.

ఆ ముసలమ్మ మనవడు “ప్యాసెంజర్ రైలు గంట కొట్టేదనుక తెలువదే” బియ్యం సంచి మీద కూర్చుండి జవాబు చెప్పాడు. అతను ప్యాంటు వేసుకొని ఉన్నాడు.

కొంచెం దూరంలో అదివరకే తాగి ఉన్న ఒక బతికి చెడ్డ రైతు ఎవరినో అంతూ పొంతూ లేకుండా తిడుతున్నాడు.

రైలు కిందబడి కాలు ఎప్పుడో తెగిపోయిన కుంటి ముసలి బిచ్చపాయన“నిన్ను సిలువకు గట్టిరిబిడ్డా నా యేశయ్యా!కీలుకీలున మొలలు గొట్టిరి తండ్రీ యేశయ్యా!” అంటూ యేసుక్రీస్తు మరణఘట్టాన్ని తను ‘నిజంగా’ చూసినట్లుగానే వర్ణించి పాడుతున్నాడు. 

ఆ గొంతులో విచిత్రమైన “వణుకు” అక్కడి వాళ్ళకు దుఃఖాన్ని కలిగిస్తోంది. ఆ పాటలోని నాదం వారికి అనుభవంలో ఉన్నట్టే ఉంది. అందరికీ చేయిచాపుతూ కర్రకాలు పొడుచుకుంటూ తిరుగుతున్నాడు.

రైలు టైం కనుక్కోవడానికి బయలుదేరిన రాయేశం ఇరువై అయిదు పైసల బిళ్ళ తీసి కుంటాయన చిపులోవేసి “ఏసయ్యను కాదు గరీబోని” అని పాటకు అర్థం  చెప్పి కదలబోయాడు.

ఇంతలోనే పెనుకేక వేస్తూ ఏదో ఎక్స్ ప్రెస్ రైలు దూసుకపోయింది.

రైలు వెళ్లేదాకా ఆగి రాయేశం పట్టాలు దాటాడు. అతని వెనుకనే రాబోయిన కొడుకు భయపడి తల్లి దగ్గరికి పరుగెత్తాడు.

రాయేశం స్టేషన్లోకి అడుగుపెట్టాడు. టికెట్లిచ్చే కిటికీ మూసున్నది. స్టేషన్ మాస్టర్ గదిలోకి తొంగిచూశాడు.

ఒక పాతటేబుల్ ముందు అంతకన్నా పాతగీలిన  స్టేషన్ మాస్టర్ విచారంగా కూర్చున్నాడు.

ఇంతలోనే స్టేషన్ ద్వారం నుంచీ ఆదరబాదరగా వచ్చిన రైల్వే పోలీసు స్టేషన్ మాస్టర్ రూంలోకి నడిచాడు. టోపి తీసి ఉఫ్మనుకున్నాడు.

“వాని వివరాలు తెలుసుకునేసరికి తాతలు దిగొచ్చిండ్లు సార్” ఆ కష్టమంతా ముఖంలో తొంగి చూస్తుండగా మాట్లాడసాగాడు పోలీసు.

“సార్ వాన్ని వారం రోజుల క్రితం మన రైలు స్టేషన్లో రాత్రి చలికి వణుకుతుంటే పోలీసులు పోలీస్ స్టేషను పట్టుక పోయిండ్లట. అసలే ఈ ఏరియాల డేంజర్ గున్నది కదా! మల్ల వీడు పడుసు పోరడాయె. ఏదడిగిన నోరు తెరువకపాయె. పొద్దటినుంచి సాయంత్రం దాకా ఎంత తన్నినా ఏం మాట్లాడలేదట. ఆఖరుకు వాని తల్లి గురించి చెప్పిండట. ఎంక్వయిరీల వీళ్ళది కుద్దు రాములపల్లెనట. తండ్రి బేవార్సు  గాడట. భూములమ్ముకొని పెద్దపెల్లిల తిరుగుతున్నడట. వాడు పాతకాపేనట. ఏడాది కరీంనగర్ సబ్ జైల్ల ఉండచ్చిండట. తల్లి కూలినాలి చేసి వీన్ని పెంచి పెద్దజేసిందట. ఆవార కేసని విడిచి పెట్టిండ్లట” రైల్వే పోలీసు గుక్క తిప్పుకున్నాడు. –

“వాడు ఏదైతే మనకేమిటి గని – మన నెత్తిమీదికి తెచ్చాడు. ప్యాసింజర్ వెళ్ళిపోతే ఈ చలిలో రాత్రంతా చావాల్సిందే” స్టేషన్ మాస్టర్..

“సార్ మనము కూడా ఆవారా కేసు కింద పంచనామా చేస్తే?” రైల్వే పోలీసు.

“అసలే రోజులు బాగాలేవు. వెధవ పెంట మనమీదికొస్తే! అచ్ఛా నువ్వు పోయి శవం దగ్గర కావలి వుండు. రంగయ్య టీకి పోయి వస్తాడు! ఈ లోగా నేను వాడి తల్లి, తండ్రి కోసం ట్రై చేస్త”. స్టేషన్‌ మాస్టర్.

రైల్వే పోలీసు గది బయటకు వచ్చాడు.

“ఏందేంది?” రాయేశం.

“ఏమున్నదివయ్యా! మర్డర్లు, కూలీలు, చావడాలు, చంపడాలు – ఆజ్ కల్కా దునియా ఖుద్మర్ నా కిసీ కో మార్ డాల్ నా (ఇయ్యల్ల రేపు ప్రపంచంల తను చావడం ఇంకోన్ని చంపడం)”

“దాసుకోవయ్యా! అమ్మమ్మ నీ ఉచ్చ మందులకు గావాలంటె చింతకొమ్మ లెక్కి చిమ్మిచ్చి పోసిందట” రాయేశం.

“పొద్దటి నుంచి చెప్పలేక నోరు పోతంది. అగో క్యాబిన్ దగ్గర ఓ మాదెర్ చోదుగాడు రైలుకింద తలకాయ బెట్టిండు. పంచనామా చేసి పారేత్తమంటే మా స్టేషన్‌ మాస్టర్ ఉచ్చపోసుకుంటుండు – వాని తండ్రి వీనికన్నా ఆవారా ఉన్నడు”. చెమట పట్టిన ఖాకీ బట్టలు మాటిమాటికి లూజు చేసుకుంటూ ఉత్తరం వేపు క్యాబిన్ కేసి నడిచాడు.

స్టేషన్ మాస్టర్ పెద్దపల్లికి ఫోన్ చేశాడు

“ఇంతకు ముందు వైర్లెస్ ల  ఇక్కడి పోలీస్ స్టేషన్ కు కబురు వచ్చింది. వాణ్ని పోలీసు వాళ్లు వెతికి పట్టుకున్నారు. సింగరేణి రైలులో తీసుకు వస్తున్నారు” ఆవలి కంఠం.

మళ్ళీ తల్లి ఉండే ఊరు ఓదెలకు ఫోన్ చేశాడు. అదృష్టవశాత్తు ఆ ఊరులో రైల్వే స్టేషనున్నది. “వాని తల్లి, బంధువులు ఎడ్ల బండిలో వస్తున్నారు” అక్కడి నుంచి.

స్టేషన్‌ మాస్టర్ ఈ కబురు శవం దగ్గర కావలున్న రైల్వే పోలీసులకు తెలుపాలనే ఉద్దేశంతో గది బయటకొచ్చాడు.

“సార్ ప్యాసెంజర్ టైమెంత?” రాయేశం.

“ఉండవయ్య మగడా!” స్టేషన్ మాస్టర్ దిక్కులు చూస్తూ చిరాకుగా అని గ్యాంగుమన్ కోసం వెతకసాగిండు.

“నేను శవాన్ని సూసత్తసార్! ఏం చెప్పమంటారు?” రాయేశం.

“వాని తండ్రి సింగరేణి రైలులో వస్తున్నడని చెప్పు” స్టేషన్ మాస్టర్.

రాయేశం చేతులూపుకుంటూ ప్లాట్‌ఫారం మీద నుండి ఉత్తరం వేపు పోవడం చూసి “రైలచ్చే యెల్లయ్యింది మల్లేడ కాల్వడ్తన్నవ్ ?” రైలు పట్టాల ఆవలి నుంచీ రాయేశం భార్య గంగమ్మ కేకేసింది.

ఆ కేకను పట్టించుకోకుండానే రాయేశం చరచరా నడుస్తున్నాడు.

రాయేశం బూట్లకింద ఇసుక కరకర లాడుతోంది.

ప్లాట్‌ఫారంకు వందగజాల దూరంలో క్యాబిన్ కు ప్లాట్ ఫారంకు మధ్యన పదిమంది మనుషులు కన్పించారు.

అక్కడ నలుగురు చేతి సంచీలు పట్టుకొని విచార వదనాలతో నిలబడి వున్నారు.

రైల్వే పోలీసులిద్దరు అక్కడ శవం వున్నదన్న మాట మరిచిపోయి బీడీలు పీలుస్తూ లోక రివాజు గురించి మాట్లాడుకుంటున్నారు.

ఢిల్లీ వెళ్లే రైల్వేలైను పక్క కంకరరాళ్ళ మీద ఒక మొండెం పడుకోబెట్టి వున్నది. శవం మీద చాలీచాలని తెల్లని గుడ్డ కప్పి వున్నది. పట్టాల మధ్య కండ్లు భయంకరంగా తెరుచుకున్న తల వున్నది. తలకు మొండానికి మధ్య రక్తం మడుగుకట్టి జొబ్బజొబ్బ పెద్ద ఈగలు ముసురుతున్నాయి.

– ఇంకా మీసం సరీగ మొలువని లేత ముఖం – ఎత్తు దవడలు – ఎంత అందమైన ముఖం! నెత్తిమీద రక్తంతో తడిసి పిడుచగట్టిన వెంట్రుకలు – మొండెం మీద కప్పిన గుడ్డ సరిపోక పిక్కలు పాదాలు కన్పిస్తున్నాయి. మడిమెలు గిలగిల తన్నుకోవడం వల్ల పగిలున్నాయి. ప్యాంటు చిరిగి వుంది.

రాయేశం నిషా దిగిపోయింది. కడుపులో చెయ్యేసి ఎవరో దేవినట్లనిపించింది. “ఛీ మనిషి జల్మంత పాపకారి జల్మ మరోటి లేదు” అన్నాడు. ..

రాయేశంకు తమ బొగ్గు గనిలో పైకప్పు కూలి చనిపోయిన కార్మికుల శవాలు కండ్ల ముందు మెదిలాయి.

‘రాయేశం కాళ్ళమీద కూలబడి “అయ్యో బిడ్డా! కట్టం సుకం సూడాల్సినోడివి ఎంత కర్మాని కెత్తుకున్నవ్” అని బొటబొట కన్నీళ్ళు కార్చాడు.

“ఖర్మమేమున్నది బై – ముచ్చు దొబ్బుకత్తె  ఎవడైన గంతే” రంగయ్య అనే రైల్వే పోలీసు.

“ఛ….” చుట్టు మూగుతున్న మందిని ఇంకో పోలీసు దూరం కొట్టాడు. “ఏ తల్లి గన్న బిడ్డో !” ఊళ్లో బతుకు గడవక సింగరేణి గనుల్లో పరుగుపందెంలో నౌఖరికోసం పోతున్నవాడన్నాడు.

“కట్టాలలో జెనుకక (భయపడక) సీతమ్మ తీర అగ్గినుంచి బయటి కచ్చినోడే మనిషి” ఒక ముసలయ్య.

“అరె! కష్టాలుంటయి. సుఖాలుంటయి, మనిషి పుటుకే అసొంటిది. ఈ కాలపు పోరగండ్లకు అన్ని ముంగటికి రావాలె” రంగయ్య.

“ఔ బాంచెన్ – నీ తీర అందరికి కొలువు దొరకద్దా” ఒక ముసలమ్మ.

“ఔ బై కొలువు దొరకలే, సచ్చుడేనా?” రంగయ్య వాదంలోకి దిగుతూ.

“సావకుంటే ఏం జేసుడువయ్యా! అడుక్క తినమంటావా? ఊళ్ళమీద బడి దోసుకు తిన మంటావా?” ఎవరో మందిలోనుంచి.

“అయిరెండూ బమ్మకట్టాలే” యువకుడు. ఇంకో రైల్వే పోలీసు బీడి విసిరికొడుతూ “ఔ” నంటూ ఒప్పుకున్నాడు.

“ఆ దమ్మున్నోడు సావడు. అడ్డమచ్చినోన్ని సంపుతడు” రంగయ్య తన అనుభవం నుంచి నిగ్గుతీసిన సత్యాన్ని చెప్పి రైల్వే స్టేషన్ కేసి నడిచాడు.

“ఏ రైలుకు పడ్డడు బిడ్డా?” ముసలవ్వ. రాయేశం కండ్లకు చీకట్లు కమ్ముతున్నాయి.

తోటి కార్మికులు గనిలో చనిపోయినప్పుడు మిగతా కార్మికుల్లో చెలరేగిన కోపం లాంటి కోపం అతని ముఖంలో చిమ్ముకొచ్చింది.

“వారం రోజుల క్రితం ఆవారా కేసు క్రింద పోలీసులు పట్టుకుపోయినారట.” ఇందాక రైల్వే పోలీసు స్టేషన్‌ మాస్టర్కు చెప్పినమాట జ్ఞాపకం వచ్చింది. కంఠంలో కోపం దుఃఖం మిళితం కాగా “మనిషి జల్మంత ఈనం జెల్మ లేదు. బంచత్-గీడనియ్యతి గలోన్ని, నోట్లో నాలిక లేనోన్ని బతుకనియ్యరు. అరే కోమలిపోరడు ఇంట్ల నుంచి ఎటచ్చిండో? కొట్లాడే అచ్చెనో? మనసు చెంచాల్లమైతేనో? బుద్ధులు గ్యానాలు చెప్పే నాయిన్నే తనకే దోసక దేశాలు బట్టుకపోయిండట. ఆడది ఏం చెలాయించుకత్తది? ఇటుసూత్తే తల్లి కొట్టిపోసుకునుడు. అటు తండ్రి ఏమయ్యిందో సమఝుకాక ఎంతకొట్టి పోసుకున్నడో? పోరడు! అరరె! ఎవల్లన్న మనిషి దగ్గరికి తీసి కడుపుల ఆయత్తం అడుగుతె బతికిపోవు. ఎంతపని జర్గిపాయె. పోలీసోల్లన్న దగ్గరికి దియ్యకపోయిరి. ఆళ్లు దొరికిందే బరికినట్టు మనసుపుండై పోయినోన్ని మళ్లీ కొట్టిరి. ఇదేమన్న నాయెమా …?” రాయేశం కోపంగా. 

“నీకెందుకువయ్యా తీస్ మారాఖాన్ (ముప్పయి మందిని కొట్టేవాడు) – ఊ అంటే తీసుకపోయి పోలీసు స్టేషన్ల అప్పజెప్పివస్త” రైల్వేపోలీసు.

“ఏది అప్పజెప్పుసుద్దాం” జేబులో సారా ప్యాకెట్లు తీసి కటుక్కున కొరికి గటగటా తాగి రాయేశం అన్నాడు కోపంగా.

“ఏం చేస్తవ్ బే – అందరి తీర్గ నువ్వుచూడక – లావులావు మాట్లాడన్నవ్. సచ్చినోని బావవా? అన్నవా?” రైల్వే పోలీసు.

“అంతకన్న ఎక్కువ” రాయేశం పోలీసుమీది కురికాడు. అక్కడ గుమికూడిన వాళ్ళంతా వాళ్ళిద్దరిని విడదీశారు.

దూరం నుంచి ఈ గొడవంతా చూస్తున్న రాయేశం భార్య గంగమ్మ పటాలమీదుగా పరుగెత్తికొచ్చి శవాన్ని చూసి ఆమెకు నోట మాట రాలేదు.

తిట్టుకుంటూ వచ్చిన గంగమ్మ భర్త చెయ్యి పట్టుకొని తీసుకపోయింది. రాయేశం బియ్యం బస్తామీద కాసేపు తలపట్టుకొని కూర్చున్నాడు. గనిలో చనిపోయిన శవాల దగ్గర కార్మికులు కోపంగా అరుస్తున్న దృశ్యం. చివ్వున లేచి వెళ్ళి మరో రెండు సారా ప్యాకెట్లు తెచ్చుకున్నాడు.

గంగమ్మ తను చూసిన దృశ్యాన్ని అక్కడివాళ్ళకు వర్ణించి చెప్పడంలో భర్తను మరిచిపోయింది.

అదివరకే చూసి వచ్చినవాళ్లు వివరాలు చెప్పారు. కొత్తగా వచ్చిన వాళ్ళు శవాన్ని చూడడానికి కదిలారు.

అప్పుడు సాయంత్రం అయిదు గంటలయ్యింది. చలికాలపు పొద్దు క్రుంకడానికి సిద్ధంగా వున్నది. పడమటి ఆకాశం ఎలుగడిపడిన అడివిలాగా వున్నది. ఏడ్చేడ్చి సొమ్మసిల్లిన పసిపిల్ల జేవురించిన ముఖంలా సూర్యుడు. స్టేషన్ ఆవలి ప్రక్కన గల ముసలి పచ్చిరిక, వేప, తుమ్మచెట్ల నీడలు ఆ చోటంతా కప్పేశాయి. చలి విషాదంలా కమ్ముకుంటోంది. .

ఆ చిన్న స్టేషన్లో జనసంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆ స్టేషన్లో చేరుతున్న జనమంతా చుట్టుపక్కల పల్లెటూళ్ళ వాళ్లు – పైగా సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ తాలూకూ బంధువులు ఎక్కువగా వున్నారు. ఆ స్టేషన్ నుంచి ఖాజీపేటకు పోయేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఆ తక్కువలో కూడా ఈ మధ్య కొత్తగా రైల్వేలైను విద్యుద్దీకరణ, రైల్వే కార్మికులే ఎక్కువ మంది వున్నారు.

స్టేషన్ లోకి వచ్చిన వాళ్ళందరూ శవాన్ని చూసి వచ్చారు. అక్కడ చాలా మంది ముఖాలల్లో నిర్లిప్తత చోటు చేసుకున్నది. అటు తెల్లకల్లు (తాటికల్లు), సారా అమ్మకం జోరుగా సాగుతోంది. అందరి మనసుల్లో ఆ శవం ఒక పెనుకల్లోలం లేపుతోంది. మంటను ఎగదోస్తోంది. ఆ మంట మీద ఏదో ఒకటి పోసే ప్రయత్నం.

షేక్ దావూదు మిరపకాయ బజ్జీలు అయిపోయాయి. చావు బతుకుల మధ్య తచ్చాడే మాటలు – సుళ్లు తిరిగే మాటలు –

ఒక ముసలి రైల్వే మొఖద్దమ్ అక్కడే పాత క్వార్టర్లో వుండేవాడు, డ్యూటీ దిగి స్నానంచేసి ధోవతి కట్టుకొని వచ్చి స్టేషన్లో తిరుగుతూ “ఆ పొల్లగాడు పది దినాల కింద నుంచి గీ స్టేషన్లనే తిరుగుతున్నడు. ఎవలతోని మాట్లాడడు. సకులం దోసుకపోబడ్డాని తీర్గ కూకుండెటోడు. అప్పుడప్పుడు పిచ్చోని తీర ఒర్రుకుంట అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఫ్లాటుఫారం మీద ఉరికెటోడు. సొమ్మసిల్లి పడిపోతేమేం మొన్న బువ్వబెట్టినం – ఆనాడు పొల్లగాని తల్లి, ఎవలో సెప్పుతే అచ్చి తీసుక పోయింది. మల గిదే సూసుడు” తనకు తెలిసిన వివరాలు చెప్పసాగాడు. 

ఆ వివరాలు అందరికీ తెలిసినట్టుగానే వున్నవి. అందరూ ఆ పిలగానిలాగే దగ్ధమైన మనసులతో ఎక్కడెక్కడో దిక్కుతోచక పరుగెత్తిన వాళ్ళలాగే వున్నారు. అందరి లోలోపల ఏదో తొలుచుకపోతోంది. అదేమిటో కొద్ది కొద్దిగా తెలిసినట్టే తెలిసి మళ్ళీ చిక్కుపడుతోంది. పల్లెల కడుపుల్లో ఏదో కల్లోలం మరిగిమరిగి బుసబుస పొంగుతోంది. ఇల్లు, పిల్లలు, భూమి, పంటలు, పెండ్లిల్లు ఎండావానా అన్నిరకాల మానవబంధాలు, సెంటిమెంట్లు తెగిపోతున్నాయి. అన్నిటికన్నా బలీయమైన భూమి సంబంధం తెగిపోయి పల్లెలను విడిచి బతుకు తెరువుకోసం చెల్లా చెదరుగ చెదిరిపోయిన వాళ్ళు, పిల్ల పేగు సంబంధాలు తెగినవాళ్లు అస్తుబిస్తుగా తచ్చాడుతున్నారు.

గొణుగుడు, విచిత్రమైన కొత్తమాటలు చితిమంటల చిటపటల్లా – కూలిపోయిన వేదాంతాలు స్టేషనంతా గగ్గోలుగా అర్థం కాకుండా వున్నది.

మోకాళ్ళదాకా నెక్కరేసుకున్న రైల్వే కార్మికుడు వచ్చి “ఠనారన్” మంటూ గంట కొట్టాడు. విచిత్రం అతను పండ్లు బిగపట్టి పూనకం వచ్చిన వానిలాగా గంట కొట్టాడు! |

రైల్వే బుకింగ్ కిటికీ దగ్గరికి జనం పరుగెత్తారు.

బుక్కింగ్ క్లర్కు అప్పుడే నిదురలేచిన వానిలాగా టికెట్ల కెగబడుతున్న ముఖాల కేసి చూడకుండా టికెట్టు నింపాదిగా ఇస్తున్నాడు. రాయేశం “పాసెంజరు ఎంత లేటు మారాజా” అన్నాడు పరాచికమాడే ధోరణిలో.  బుక్కింగు క్లర్కు ఈ పరాచికాల కతీతుడులా కన్పిస్తున్నాడు. అతను జవాబు చెప్పలేదు. “రామగుండం రెండు పెద్దయి, రెండు సిన్నయియ్యి ” అన్నాడు రాయేశం. రాయేశం టిక్కెట్లు తీసుకొని బయటకు వచ్చేసరికి – సింగరేణి రైలు వస్తున్నదని – స్టేషన్ లోని వాళ్ళు వేగిరపడుతున్నారు. ఆ

మరికొద్ది సేపట్లోనే ధనధనలాడుతూ సింగరేణి రైలు వచ్చింది. దిగేవాళ్లు తక్కువ. ఎక్కేవాళ్లు అంతకన్నా తక్కువే. రైలు వెళ్లిపోయింది. – సింగరేణి రైలులో నుంచి ఒక పొడుగాటి నడీడు మనిషి దిగాడు. అతని ముఖం కోలగా వున్నది. పండ్లు కందుపండ్లు (గారపట్టిన) – కమీజు భుజాలమీద చిరిగి ఉన్నది. ధోవతి సన్నపుదేకాని చాలా పాతది. కాళ్ళకు చెప్పులు లేక మోకాళ్ళదాకా దుమ్ము పేరుకున్నది. మడిమెలు ఎండిన వరిమళ్ళలా పగిలున్నాయి. ఎముకలు తేలి ఆరడుగుల అస్తిపంజరం లాగున్నాడు. అతని ముఖం బండబారి వున్నది. కండ్లు – ఆ కండ్లు అక్కడున్నవాళ్ళకు తెలియకుండా వున్నాయి. మొత్తానికి అతను విధ్వంసమైన సేనానాయకునిలాగా ఉన్నాడు. అతని చేతిలో మూలలు చిరిగిన పాత క్యాష్ బ్యాగున్నది. కుడిచేతిలో బాగా నలిగిపోయిన రెండు తెలుగు వార్తాపత్రికలున్నాయి. అవి ఏనాటివో, తెలియకుండా మాసి వున్నాయి.

అతని వెంటే నల్లగా బలిష్టంగా ఉన్న రైల్వేపోలీసు దిగాడు. అతను బాగా వంగిపోయి వున్నాడు. అతని ముఖం భూమి పొరల్లో నలిగిన నేల బొగ్గులాగున్నది.

రైల్వేపోలీసు ఆ పొడుగాటి వ్యక్తిని స్టేషన్‌ మాస్టర్ రూంలోకి తీసుకపోయాడు. “బండి కింద పడ్డ పిల్లగాని తండ్రి వచ్చిండనే వార్త’ అతి తొందరలోనే అందరికి తెలిసిపోయింది. అతన్ని చూడడం కోసం స్టేషన్మస్టర్ రూం కేసి చాలామంది నడిచారు. • “వచ్చావా నాయనా?” స్టేషన్‌ మాస్టర్ పాత నల్లకోటు తొడుక్కొని బయలుదేరాడు.

పొడుగాటి వ్యక్తి కొడుకును కోల్పోయిన తండ్రిలా లబోదిబోమని రోదించడం లేదు. శవంగా మారిన తన రక్తాన్ని చూసుకోవడానికి పరుగెత్తలేదు. ఆ మొత్తం వ్యవహారం అదివరకే అనుభవించిన వాడి లాగా – “అంత తొందరేం లేద”న్నట్లుగా స్టేషన్ మాస్టర్ టేబుల్ ఎదురుగా గల కుర్చీమీద కూర్చున్నాడు.

కిటికీలోంచి దరువాజాల్లో నుంచి చూస్తున్న జనం మొదట విస్తుపోయారు. ఆ తరువాత “బండ తీరుగున్నడు”, “మనిషికి గింత సెమట లేదు”, “నెనరులేదు” తలో రకంగా గుసగుసలాడారు.

పొడుగాటి వ్యక్తి తలతిప్పి వెనక్కి చూశాడు. అనేక ముఖాలు సగం సగం కాలిపోయినట్టుగా అతనికి కనిపించాయి. మొత్తం ఆ ప్రాంతమంతా మనుషులు కాలిన కమురు వాసన వ్యాపించినట్టుగా

అతనికి తోచింది.

“అరె నడువయ్యా రాజారాం” రైల్వే పోలీసు యాతనగా, “ఎక్కడికీ?” పొడుగాటి వ్యక్తి రాజారాం .

“ఎక్కడికంట వేందయ్యా! నా కొడుకు పెండ్లి కచ్చినవా? నిన్ను పెద్ద పెల్లంత తిరిగి దొరుకుబట్టేటాల్లకు తాతలు దిగచ్చిరి”.

“అయితేం జెయ్యిమంటవు?” “చనిపోయిన నీ కొడుకును చూసుకోవా?”

రాజారాం తన కొడుకు ముఖం స్టేషన్ మాస్టర్దే  అన్నట్టుగా అతని ముఖంలోకి చూసి “చూసేదేమున్నది?” అన్నాడు. 

“కాలాంతకపు ముండ కొడుకున్నట్టున్నది.” 

స్టేషన్ మాస్టర్ కు మతి పోతోంది. తన సర్వీసులో చావులు చాలా చూశాడు. జంతువులు, మనుషులు – చనిపోయింది – మనిషైతే  స్టేషనంతా ఏడుపులు పెడబొబ్బలతో నిండి పొయ్యేది. శవాలకేసి పరుగెత్తేవాళ్ళు – ఆ ఏడుపులు తగ్గి పంచనామా చేసేసరికి తాతలు దిగొచ్చే వాళ్ళు. కాని ఈ మనిషికి ఆ ధ్యాసే లేదు. వీడు మనిషేనా? జంతువా? రాయి కాదు కదా? ఇంతకూ చనిపోయిన పిల్లవాని తండ్రేనా?

స్టేషన్ మాస్టర్ మీమాంసలో ఉండగానే – రాజారాం ముఖం రుద్దుకున్నాడు.

“అది కాదయ్యా! ఎంతసేపు శవాన్ని ఉంచుతాం. పొద్దున నాలుగున్నరకు చనిపోయాడు. ఇప్పటికే ఖరాబయ్యింది. పంచనామా చెయ్యాలి” స్టేషన్ మాస్టర్ నచ్చ చెప్పే ధోరణిలో,

“చెయ్యండ్లి” రాజారాం. 

“అక్కడికే పోదాం ” స్టేషన్ మాస్టర్.

“పోయి?”

“అక్కడ నువ్వు నీ కొడుకును చూసుకొని నవ్వేవు. మేం ఏడుస్తం” అన్నాడు రైల్వే పోలీసు కోపంగా,

రాజారాం లేచి నిలబడి రైల్వే పోలీసు ముఖంలోకి చూశాడు. అక్కడ అతనికి కాలిపోయిన తునికి చెట్టు మొదలు కన్పించింది. 

ఈ వాదనలు ఇష్టం లేని వానిలాగా రాజారాం లేచి నిలుచున్నాడు. నిజానికి కొడుకు శవం అతని మనసులో ఎప్పుడో చూసుకున్నాడు. కొడుకు చనిపోవడం ఎప్పటినుంచి ప్రారంభమైంది అన్న చిత్రమైన ఆలోచన కలిగింది. మనుషుల చావు ఒక ఘడియలో జరుగగలదన్న దాని కన్నా, సంవత్సరాల తరబడి జరుగుతుందనేది అతని నమ్మకం.

స్టేషన్‌ మాస్టర్, రైల్వేపోలీసు రూంలో నుంచి బయటకు నడిచినా కూడా రాజారాం కొడుకు చావు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైనదనేది తెలియక అక్కడే నిలుచున్నాడు.. ..

“ఏమయ్యా రాజారాం !” రైల్వేపోలీసు పిలిచాడు. ఆ రాజారాం కలలో నడుస్తున్నట్టుగా రూం బయటకు వచ్చాడు. అక్కడి వాళ్ళంతా రాజారాంను చుట్టుముట్టారు. 

“పాప కర్ముడున్నట్టున్నది” ఎవరో ముసలమ్మ గొణిగింది.

“ఏమయ్యా ముఖం సూత్తే సదువు సాత్రం వచ్చినోని తీరుగున్నవ్  – ఇయ్యల్లటి రేపటి కోమలి పోరగండ్లు మాటంటెబడ్తలేరు. కొడుకును కొట్టినవా? తిట్టినవా?”

“నీకు అక్కల్  (బుద్ధి) లేదా?” –

ఇలాంటి తిట్లు దీవెనలెన్నెన్నో – పిల్లలను ఎట్ల పెంచుకోవాలో సలహాలు – ఆ తిట్లమీద రాజారాంకు ధ్యాసలేదు. మనుషులందరికి చావడం ఎప్పుడు మొదలయ్యిందోనన్నట్టుగా, చావును జయించిన వాళ్లున్నారా అన్నట్టు చూశాడు.

రాయేశం తలవంచుకొని నడుస్తున్న రాజారాం పక్కకు వచ్చి “నీకెందరు కొడుకులే?” అన్నాడు తడి గొంతుతో ఆప్యాయంగా.

“ఒక్కడే” రాజారాం .

జనంలో కొందరికి మరీకోపం పెరిగింది. “ఓరి జెష్టమ్మా ! ఒక్క కొడుకును సాది సవరచ్చెన చేసుకోలేంది నువ్వేం మనిషివిరా?” ఒక ముసలయ్య. 

“ఛత్తెరి ఏ పాపకర్ముడన్నా గీదునియల కొడుకుల, బిడ్డల సాదుకోని వాడుంటడా?” ఒక నడీడువాడు.

“ఇగో ఈడున్నడు గదా?”

“ఇయ్యల్లరేపు ఎవలరచ్చెన ఆళ్ళ సేతుల్లున్నదా? అంత మంచిగనే బతుకుదామనుకుంటరు. కని నొస్టరాసిన రాత – ఆ పిల్లగానికి గీ కొరత రాసిండు బమ్మదేవుడు” మరొక నడీడు మనిషి.

“మన గీతలన్నీ రాసేది మనుషులే-” రాయేశం అన్నాడు. రాజారాం ఏం మాట్లాడకుండా నడుస్తున్నాడు. అతని వెంట మంది నడిచారు. రైల్వే పోలీసు, స్టేషన్ మాస్టర్ ముందు నడుస్తున్నారు.

పొద్దుగూకింది. పడమటి దిక్కుకాలి కూలిన గ్రామం దూరంగా కనిపించినట్టుగా నలుపు ఎరుపుల సంగమం.

రాజారాం బోరింగు నీటి పంపుదగ్గర ఆగాడు. ఎవరో బోరింగు కొట్టారు. రాజారాం ముఖం కడుక్కున్నాడు. కొన్ని నీళ్ళు తాగాడు. జేబులు వెతుక్కున్నాడు. ఎవరో బీడికట్ట, అగ్గిపెట్టె ఇచ్చారు. ఎవరో సిగరెట్టివ్వబోతే తీసుకోలేదు. బీడికట్ట రాజారాం తిరిగి ఇవ్వబోతే ఇచ్చినాయన వాపసు తీసుకోలేదు.

బీడి బస్స బస్స పీలుస్తూ రాజారాం నడుస్తున్నాడు. అప్పటికే శవం దగ్గర మంది జమై పోయారు. 

రాజారాం రైలు పట్టాల దగ్గర పడున్న తన మాంసాన్ని, నెత్తురును చూశాడు. జనం రాజారాం ముఖాన్ని అక్కడ పడున్న తలకాయను మార్చి మార్చి చూశారు. దాదాపు రెండింటిలో ఒకే పోలికలు, విచిత్రంగా రెండింటిలో ఒకే భావం. రాజారాం ఒకరాతి బొమ్మలాగా నిలుచున్నాడు. .. స్టేషన్‌ మాస్టర్ కనుసైగతో రైల్వే పోలీసు మొండెం మీది గుడ్డ తొలిగించాడు. రాజారాం సత్తువ (బలం) లేని వానిలాగా కాళ్ళవేపు కూలబడ్డాడు. “అబ్బ ఎంత నెనరు లేని గుండెనయ్యా నీది!” అన్నారెవరో? రాయి, పాపకర్ముడులాంటి మాటలు ఒకవేపు “అయ్యో కాసేపూసే చెట్టు” అని ఇంకొక వేపు.

రాజారాంకు ఈ మాటలేవీ చేరడం లేదు. తన మనసులో అనేక దృశ్యాలు రూపుకట్ట సాగినయ్. కూలిపోయిన గుడిసెలు, పెంకలు కిందికి తోడిన పెంకుటిండ్లు, చెల్లాచెదురుగా పడిన ధాన్యం, తొక్కబడిన కుండా, గుర్గి, ధ్వంసమైన గ్రామం అతని మనసులో రూపుకట్టింది.

ఇప్పుడు రాజారాం ఒక ధ్వంసమైన పల్లెలా వున్నాడు. ఎలుగడి బడి సాంతం కాలిపోయి చల్లారిన అడివిలా వున్నాడు. ఇంకిపోయిన నదిలా, నెర్రెలిచ్చి ఎండిన చెరువులా వున్నాడు. మాటలు తెగిపోయిన మనిషిలా కూర్చున్నాడు. –

ధ్వంసమైన పల్లెలో ఇల్లిల్లు తిరిగి చూసిన ఆకలేసిన దుక్కిటెద్దులా రాజారాం ఎప్పుడో మరిచిపోయిన తనబతుకు తాలూకూ శకలాల చుట్టూ తచ్చాడుతున్నాడు. చిత్ర విచిత్రంగా ఆ శకలాలు అతని మనసులో మెదలసాగినయ్. తన కొడుకు చావు తనకు పుట్టకముందెక్కడో ప్రారంభమైనట్లుగా అతనికి తోచింది.

ఒక అంగీ తప్ప లాగులేని పిల్లవాడు తండ్రి వెంట ఉరుకుతున్నాడు. ఒక చేతిలో పార ఇంకో భుజం మీద మోటబొక్కెన గల రైతు నడుస్తున్నాడు. ఎండకు పిల్లవాడి పాదాలు మాడి పొయ్యాయి. తండ్రి తిడుతూ కుడి చంక కెక్కించుకున్నాడు. పిల్లవాడు మక్క కంకులకు వచ్చిన పీసును చూసి “నాయినా వీటికి మీసాలెక్కడి నుంచి వత్తయే” అంటున్నాడు.

ధ్వంసమైన పల్లెలో ఎవరో ఏడుస్తున్నట్లుగా విన్పించింది. ముడతలు పడ్డ ఎర్రతోలు, నీలంరాయి కొనుకపోగు గల తండ్రిని వాకిట్లో పడుకో బెట్టారు. తల్లి శవం మీద పడి ఏడుస్తోంది. కడుపుల నరాలు బయట పడే లాగున దగ్గుతూ – ఏదుకొయ్యలా తలవెంట్రుకలు కలిగిన అన్న – పోలీసు పటేల్ కింద గుమస్తా – బొనుగూపినట్టుగా మాట్లాడే అంతెత్తు వదిన – అన్న తాగి తాగి చనిపోయాడు. కుటుంబం కకావికలు. తను చదువుబడిలో నుంచి నాగలికి మార్పు – తండ్రి చావు మళ్ళీ కన్పించింది. తండ్రి, అన్న ఇద్దర్లో ఎవరు ముందు చనిపోయారో జ్ఞాపకం రావడం లేదు.

తను నాగలిని పట్టే నాటికి పదెకరాల భూమి – నుయ్యికోసం అంజుమాన్ (సహకార సంఘం) అప్పు – అప్పు తీరలేదు. తను వేసిన మిర్చిపంట – ఇంజను (పంపుసెట్టు) కోసం మళ్ళీ కొత్తగా  వెలిసిన భూమి తనఖా బ్యాంకు అప్పు – మిర్చికి కొరుకుడు రోగం – హల్లికిహల్లీ సున్నకు సున్న – బేంకు వాళ్ళు పెద్ద ఎడ్లబండి తీసుకపోవడం – వేలం వేయడం – ఎరుపెక్కిన చెక్కిళ్ళతో ఈ గజిబిజి మధ్య ఒక స్త్రీ రూపం కన్పించింది.

తన్నులు గుద్దులు తాగుడు. బిసతప్పిన యంత్రంలా తను తిరిగేనాటికి భార్య కలుపులకు, నాట్లకు కూలికి పోతున్నది. బీదతనపు చావులోనుంచి పిల్లవాన్ని తీసుకొని తల్లిగారింటికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి రాజారాం మళ్ళీ భార్య దగ్గరికి పోలేదు. తాగడం దొరగారి దగ్గర చేత (వ్యవసాయం) చేయించడం. నెల పనిచేస్తే మరో రెన్నెల్లు తిర్గడం – ఎక్కడపడితే అక్కడ – ఊల్లెకు  పాటలచ్చినయె….. ఊళ్లో గొడవలు ప్రారంభమయ్యే నాటికి తను “తునికి ఆకుకల్లం (బీడి ఆకుల కంట్రాక్టు)” పట్టాడు. గొడవ లేకుండా వాళ్ళు ఇయ్యమన్న రేటు (అన్నలు (నక్సలైట్లు) యియ్యిమన్నరేటు) ఇచ్చినందుకు పోలీసులు పట్టుకపొయ్యారు. మరింకేమీ జ్ఞాపకం రాలేదు. ఊళ్ళో ఒక యువకుడికి జమానతుగ పాత ఇంటిని రాయించాడు. తట్టుకోలేక కేసుల సుట్టు తిర్గలేక బేలుజంపుచేసి ఆ పిల్లవాడు పార్టీలో కలిసి పోయిండు. జమానతు డబ్బు కట్టమని తనకు ఆర్నెలు జైలు – ఆఖరుకు ఇల్లు జప్తు చేశారు. ఆ తరువాత తనెక్కడ తిర్గింది? ఏమి చేసింది? ఏమి జ్ఞాపకం లేదు.

రైల్వే పోలీసులు మొండాన్ని, తలను ఒక్కదగ్గర చేర్చారు. రైల్వే పోలీసొకాయన పంచనామా రాస్తున్నాడు. ఇంకొకాయన మందిని దూరం కొడుతున్నాడు.

“ఇంటినుంచి ఎప్పుడెల్లి పోయిండు?” స్టేషన్ మాస్టర్. “ఎవలింటి నుంచి?” రాజారాం తేరుకొని. “నీ ఇంటి నుంచి”.

రాజారాం మాట్లాడలేదు. తల మొండెం కలిపిన తన కొడుకును అక్కడ నిల్చున్న మందిని మార్చిమార్చి చూశాడు. వీడు తన కొడుకేనా? నాలుగేండ్ల పిల్లవాడి ముఖం ఎంత ముద్దొచ్చేది? వాడి కడుపులో ఎన్ని ప్రశ్నలుండేవి? వాడి చిన్న కండ్లు ఎంత ఆత్రంగా పిట్టను, జంతువును, చెట్టును చూసేవి? ఇక్కడ వీడి ముఖంలో ఏ ప్రశ్నలేదు. విధ్వంసమై పోయిందెప్పుడో?

“నీకు ఇల్లు లేదా? ” స్టేషన్ మాస్టర్ కు కోపం వస్తోంది. 

“లేదు” రాజారాం జ్ఞాపకాలు కొద్దికొద్దిగా అతుక్కునే సమయంలో ఈ ప్రశ్నలేమిటి అన్నట్టుగా, 

“ఎప్పుడు వెళ్ళిపోయిండు?” 

“ఎవలు?”

 “నీ కొడుకేనయ్యా!” రాజారాం మాట్లాడలేదు. అతనికి ఇంతకు ముందడిగిన ప్రశ్న జ్ఞాపకమే లేదు.

 “నీ కొడుకు ఇంటినుంచి ఎప్పుడు పోయినాడయ్యా!” స్టేషన్ మాస్టర్…

 జనానికి విసుగొచ్చింది. “మెదడు పని జేత్తలేనట్టున్నది పాపం” ఎవరో మందిలో నుంచి“ఓ బత్త సారా ఎత్తే పని చేస్తది” రాజారాం పక్కనున్నతను. 

రాయేశం ఉరికి రెండు సారా బత్తలు తీసుకొచ్చాడు. అవి రెండు ఏమిటన్నట్లుగా కొత్తగా చూసి వద్దన్నాడు….. సారా నిషా కన్నా ఏదో మత్తు అతన్ని ఆవహిస్తోంది. మొదట స్టేషన్లో కొచ్చినప్పుడు అతనికి ఏ మత్తులేదు. ఏ జ్ఞాపకము, ఆలోచనలు లేవు. కాని ఇప్పుడేవేవో తిరుగుతున్నాయి. – 

“నీ కొడుక్కు ఎన్నేండ్లు?” స్టేషన్‌ మాస్టర్. –

సరిగ్గా రాజారాంకు అప్పడు శవాన్ని తడిమి చూడాలని కోరిక కలిగింది. అదే సమయంలో స్టేషన్ మాస్టర్ ప్రశ్న. 

“నా కెర్కలే?” రాజారాం గొంతులో కాఠిన్యం. 

అప్పుడు స్టేషన్లో నుంచీ ఒక స్త్రీ ఏడుపు విన్పించింది.

ఒక బక్కపలుచటి స్త్రీ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ శవం కేసి పరుగెత్తుకొచ్చింది. ఆమె వెనుకే కర్ర ఊతంతో ఒక ముసలివాడు. బక్క దుక్కిటెద్దుల్లాంటి ఇద్దరు రైతులు వచ్చారు.

ఆ స్త్రీ రాజారాం కన్న పేదగా అధ్వాన్నంగా ఉన్నది. నడి వయసులోనే ముసలిదై పోయినట్టుగా వున్నది. రెండు పాత చీరెలు కలిపి కుట్టిన రెండు రంగుల చీరె కట్టుకున్నది. అదైనా అక్కడక్కడ చిరిగి వున్నది. వెలిసి పోయిన పాత రయికె తొడుక్కున్నది. ఆ స్త్రీ వెంట్రుకలు విచ్చిపోయి ఉన్నాయి. ముఖంలో ఎముకలు తప్ప గోరెడు మాంసం లేదు.

_ “ఓరి కొడుకా! ఎంత పని కెత్తుకున్నవ్ రా కొడుకా! మొన్న మునిమాపు నాబట్టు చేతులతోని బువ్వబెడ్తి గాదు కొడుకా! మీ అవ్వచ్చింది గాదు కొడుకా! ఓరి మల్లయ్య మీ తాతచ్చిండుగాదు కొడుకా! మీ మామలు వచ్చిండ్లు గాదు కొడుకా! గీదిక్కు మల్లె అవ్వకేం జెప్పి పోతివి కొడుకా! నిన్ను గంటి గని నీ రాత కనకపోతి కొడుకా! దేవుడా నీ గుల్లెరాయి పడ దేవుడా! నా బతుకు కుక్కలు సింపిన ఇత్తరిజేతివి దేవుడ. కన్నోడు సుకపెట్టకపాయె కొడుక – పాపకారి జల్మనాది కొడుక – కట్టుకున్నాడు సుకపెట్టకపోయె దేవుడా! అడివిల పొద్దుగూకింది గదర కొడుక – ఇగ నేను ఏ ఆశజూసుకొని బతుకాలె కొడుకా! నన్ను

కొంటబోకపోతివి కొడుకా!” ఆస్త్రీ ఆ శవాన్ని తడుముతూ, మధ్యమద్య దుమ్మునెత్తి మీద పోసుకుంటూ పిచ్చిదానిలా ఏడుస్తోంది.

అంతవరదాకా గడ్డ కట్టుకుపోయిన మనుషుల బండబారిన గుండెలు జాలు వారాయి. అక్కడ నిలుచున్న వాళ్ళందరిలో కళ్ళల్లో నీళ్లూరాయి.

“ఎంతైనా కన్న కడుపు కన్నకడుపే – పేగు చింపుకొని పుట్టిన కన్న కొడుకు తన కండ్ల ముంగట మన్నై  పోతే ఆడదాని మనసు అవిసిపోతది” ఒక ముసలమ్మ బొలబొల ఏడుస్తూ చెప్పింది.

ఏడుపు అక్కడ తెరలు తెరలుగా చలిలా, చీకటిలా అందరిని చుట్టేసింది. పంచనామా రాసిన రైల్వేపోలీసు ఆ సంగతే మరిచిపోయాడు.

స్టేషన్ మాస్టర్ కళ్ళద్దాలు తుడుచుకున్నాడు.

రాజారాంకు ఆ ఏడుపు ఎక్కడో విన్పిస్తోంది. ఆ ఏడుస్తున్న స్త్రీ తన భార్యేనా? తను, ఆ స్త్రీ బతుకులో ఒకప్పుడు సగం సగం పంచుకున్నారా? ఆమె తను కలిసి మిరప చెట్లల్లో మొక్కజొన్న పెరడి మంచెమీది సద్ది  మూట విప్పుకొని చెరిసగం తిన్నది వాస్తవమేనా? కాదు ఈ స్త్రీ ఆమె కానే కాదు. రాజారాం మనసులో పచ్చటి ముఖం, ఎర్రటి చెక్కిల్లు ఎప్పుడూ నవ్వే ముఖం గలిగిన స్త్రీ మాత్రమే వున్నది. ఈ స్త్రీ ఒక దయ్యం లాగున్నది.

మన కర్ర ఊతంగా నిలుచున్న ముసలయ్య కూలబడి ‘ఊకోయే ఎల్లవ్వా! ఏడ్చేడ్సి నీ కనుపాపలు కారిపోతయి. ఎవని కొర్త ఆడనుబగించాలె. అందరం బతుకచ్చినమ్మా?” అన్నాడు.

“ఓ నాయినా నీ మనుమనికి ధైర్యం జెప్పు నాయిన, లేపు నాయిన్న” తండ్రి మీద పడి ఏడ్చింది. 

ఆ ముసలయ్య తన నరాలు దేలిన చేతుల మధ్య బిడ్డను అదుముకున్నాడు. బలహీనమైన ఆ చేతులు వణుకుతున్నాయి.

ఎల్లమ్మ మరో పది నిమిషాలు పరిపరి విధాల వర్ణిస్తూ ఏడ్చి ఏడుపు ఆపింది. అప్పుడు చూసింది. కొడుకు కాళ్ళవేపున కూర్చున్న మనిషిని, దయ్యాన్ని చూసినట్టుగా జడుసుకున్నది.

“పో- నా కొడుకును ముట్టకు – నీ పాపకారి చెయ్యి తాకుతె నా కొడుకు ఇషమెక్కుతడు. నా బతుకు గంగల గల్పినవ్. నా కొడుకును నువ్వే చంపినవ్” అరిచింది. కొడుకు కాళ్ళను తనకేసి జరుపుకున్నది.

రాజారాంను ఎవరో లేపి అటెటో తీసుకపోయారు.

ఎల్లమ్మ మళ్ళీ కొడుకు మీద పడి “మీ నాయిన నీ కట్టం సుకం సూడరాలే కొడుకా! నీ సావు సూడచ్చిండు కొడుకా! మల్లయ్య నన్నడిగిన సంగతులన్ని మీ నాయిన నడుగుదువు రారా కొడుకా, నా కొడుకా!”

రైల్వే పోలీసు తేరుకున్నాడు. అతనేదో వేదాంతం చెప్పబోయాడు కాని నోరు పెకల లేదు.

రాజారాంకు ఈ ప్రశ్నలన్నీ సలుపుతున్నాయి. తన కొడుకును తన దగ్గరే ఉంచుకుంటే చావక పోయేటోడా? తనే ఎప్పుడో చచ్చిపోయినంక వాళ్లనెట్లా ఉంచుకుంటాడు? తన చావు ఎప్పుడు ఆరంభమయ్యింది. తను కలల ప్రపంచాన్ని ఎవరు విధ్వంసం చేశారు. ఎప్పుడు చేశారు? తన ఏడుపు ఎక్కడ ఎప్పుడు తెగిపోయింది. తను బండరాయా? తన నరాలు ఒక్కటొక్కటే పుటుక్కు పుటుక్కున తెంపిందెవరు? చనిపోయిన అన్నా? చదువు ఆపి పెద్ద కుటుంబాన్ని సాదుక వచ్చినప్పుడా? మిరప తోటకు కొరుకుడు రోగం తాకి మాడిపోయినప్పుడా? అప్పుకింద షావుకారి భూమి గుంజుకున్నప్పుడా? అంజుమన్ అప్పులు, తనఖా బ్యాంకు వాళ్ళు వేలం పాడినప్పుడా? సర్వం ఒక్కొక్కటే ఊడ్చుకపోయి రైతు, కూలిగా మారినప్పుడా? కాదు ఈ అన్నీ జాగల్ల తన జీవనాడులు ఒక్కొక్కటే తెగిపోయినయ్.

అన్న చనిపోయినప్పుడు చదువుతున్న ఎనిమిదో తరగతి ఆపి ముసలి తండ్రితో గుంటుకు కొట్టి ఎర్రటెండలో నెత్తురు పేరిన అరిచేతులు చూసుకొని, నాయిన్న చనిపోయి మొత్తం కుటుంబభారం మీద పడ్డప్పుడు చెరువు కట్టకింది మర్రిచెట్టు కింద కూలబడి వెక్కివెక్కి తను ఇట్లాగే ఏడ్చాడు. ఒక్కొక్క ఎకరం భూమి అమ్మి ఒక్కొక్క అంగం కోసుకు పోతున్నట్టుగా విలవిలలాడాడు. గిజగిజ తన్నుకున్నాడు.

మొత్తం భూమి అమ్మకంతో వేళ్ళు పూర్తిగా తెగి కూలిపోయిన చెట్టులా ఎండిపోయాడు. తన ఏడుపు ఆగిపోయింది. నరాలన్ని తెగిపోయినయ్.

ఈ విధ్వంసం ప్రతి పల్లెలో ప్రతి రైతు లోలోపల జరిగింది. రైతులంతా తమ గాయాలు దాచు కొని విధ్వంసాన్ని మింగుకొని తిరుగుతున్నారు. తుపాను గాలిలో ఎండుటాకుల్లా ఎగురుతున్నారు. అంతటా ఇలాంటి మనుషులే..

రైల్వేపోలీసు ‘పంచనామా కాయిదం’ తీసుకు వచ్చాడు. రాజారాం దాని మీద, ఇంగ్లీషులో సంతకం చేశాడు. 

శవాన్ని కదిలించారు. జనం కదిలారు. మాటలు, ఓదార్పులు శవాన్ని గుడ్డలో చుట్టుకొని రైల్వేస్టేషన్ బయటకు తీసుకుపోతున్నారు. ముసలి తండ్రి ఆసరగా ఎల్లమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ శవం వెనుకే వెళ్ళిపోయింది.

రాజారాం ఆ జనంతో పాటే స్టేషన్ బయటకు వచ్చాడు.

బండిలో వరిగడ్డి మెత్తగా పరిచి శవాన్ని పడుకోబెట్టారు. బండిలో కూర్చున్న ఎల్లమ్మ శవం తలను వొళ్ళో పెట్టుకొని పిచ్చిదానిలా ముద్దులాడుతోంది.

-స్టేషన్ ముందు గల కరెంటు బుగ్గ వెలుతురులో అక్కడ నిలుచున్న మనుషుల నీడలు దయ్యాల గుంపులాగా ఉన్నాయి.

“తను మనుషులను, భూమిని, పంటలను ప్రేమించలేదా? తన భార్యను, కొడుకును, తండ్రిని కుటుంబాన్ని…” రాజారాం లోలోపల ఏదో మత్తులా పాకుతోంది. ఎక్కడో సన్నగా వొణుకు ప్రారంభమైంది.

ఒక్కసారి ఒకే ఒక్కసారి, కడసారి తన కొడుకును ఒక్ళోకి తీసుకొని ముద్దాడితే! నాలుగేండ్ల పిల్లవాడు భుజం మీద కూర్చుండి ఏదో అడుగుతున్నాడు. కాని ఎడ్లబండి కదలింది. “బావా నువ్వు బండెక్కు” బండి నడిపే రాజారాం బావమరిది అడిగిండు. “అన్నీ కాలి కూలి బూడిదై పోయినంక బావెవ్వడే అన్న! మీబావెన్నడో సచ్చి పోయిండు నేను ముండబొడ్డని” అన్నది ఎల్లమ్మ.

బండి కదిలింది. స్టేషన్లో గంట మోగింది. ప్యాసెంజర్ రైలు గంట అది. జనమంతా తేరుకొని బిలబిలమంటూ ఎవరి జాగాలల్లోకి వాళ్లు సర్దుకున్నారు.

ఆ స్టేషన్ ముందు ఎటు పోవాలో తెలియక రాజారాం ఒంటరిగా నిలబడి పోయాడు. అతన్ని పిలిచేవాళ్ళెవరు లేరు.

రాజారాం అడుగులు బండి వెళ్ళిన దిశలోనే పడ్డాయి.

రాజారాం నడుస్తున్నాడు. స్టేషన్ దూరమయ్యింది. బండి గీరెల చప్పుడు చీకట్లో విన్పిస్తోంది. పలుగురాళ్ళు బండి కమ్ముల కింద నలుగుతున్న శబ్దం. చుట్టూ ఆవరించిన చీకటి – చిమ్మెట్ల రొద, పేరు తెలియని రొద ఏదో మోగుతోంది. ఈతచెట్ల కమ్మల మీద మిణుగురులు ఎగురుతున్నాయి. పైన చుక్కల ఆకాశం, దూరంగా చుట్టుప్రక్కల గల ఊళ్ళల్లో వీధి దీపాలు కొరివి దయ్యాల్లాగా… బండి వెళ్ళిపోతున్నది. ఇప్పుడు గీరెల శబ్దం కూడా విన్పించడం లేదు. రాజారాం వెనుకబడిపోయాడు.

రాజారాం కాళ్లు ఆగిపోయాయి. దారిలోనే కూలబడ్డాడు. “ఓ బావో వత్తన్నవా?” బావమరిది కేక.

రాజారాం జవాబుగా కేక వెయ్యలేదు. అతని కంతశక్తి లేదు.

తను తప్పకవస్తడని బావమరిది అనుకున్నాడా? కొడుకు అంత్య క్రియలకు తను పోతున్నట్టా? నిజంగా ఈ రోజు పొద్దున రైలు కింద తలబెట్టి చనిపోయిన ఆ పిల్లవాడికి తను తండ్రేనా? కాలి కూలి బూడిదైన పల్లెల్లో కొడుకెవరు? తండ్రెవరు?

చలి అంతకంతకూ ఎక్కువైంది. దానికితోడు కడుపులో ఆకలి మంట, చలికి దవడలు వణుకు తున్నాయి…. ఇప్పుడు అతనికి సారా ప్యాకెట్లు జ్ఞాపకం వచ్చాయి. మెదడు పొరల్లో ఈ తర్కానికి లొంగనిదేదో మెల్లి మెల్లిగా కరుగుతోంది. అది ఆకలికన్నా, చలికన్నా ఎక్కువ సలుపుతోంది. ఈ పగిలిపోతోంది.

తను ఈ భూమి పుట్టిన కాడికి విన్పించేలాగున ఏడిస్తే ఎంత బాగుండును! కానీ ఏడుపు రాదు. ఆ లెక్కన ఆ బండిమీద పోయిన తల్లే తనకన్నా అదృష్టవంతురాలు.

లేచి నిలుచున్నాడు. అడుగులు తడబడుతున్నాయి. తూలుతూ అటు వెనుకకు స్టేషన్ కేసి కాకుండా ఆ ముందు ఎడ్లబండి పోయిన దారిలో కాకుండా తూర్పుకేసి నడువ సాగిండు.. తొవ్వ దారి లేదు. కొంత సేపు చిక్కురు బొక్కురుగా నడిచిన తరువాత ఒక బండ్ల బాట కన్పించింది. మరి కొంతదూరం నడిచిన తరువాత ఒక పెద్ద మర్రిచెట్టు వచ్చింది. అది “పోశమ్మ దేవత” మర్రిచెట్టు. ఆ మర్రిచెట్టు నుండి ఒక దారి రాజారాం పల్లెకు పోతుంది. మరొకదారి పెద్దపల్లి టౌనుకు పోతుంది. మూడోది పంట పొలాల మీదుగా ‘రామగిరి’ అడవికి పోతుంది. నాలుగోది చెరువు కట్టమీదుగా పొరుగూరికి పోతుంది.

ఆలోచనలు ఇంకిపోయి మర్రిచెట్టు క్రింద కూలబడిపోయి రెండు చేతులతో ముఖం, తలరుద్దుకుంటూ లోలోపల పూర్తిగా ధ్వంసమైపోయిన రైతుబిడ్డడు రాజారాం ఏడుస్తున్నాడు. వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. పూర్తిగా బొట్టుబొట్టుగా కరిగిపోతూ భూమిలోకి ఇంకి పోతూ ఏడుస్తున్నాడు.

రాజారాం నాలుగు రోడ్ల కూడలిలో చిక్కటి చీకటిలో, గడ్డ కట్టిన చలిలో, ఆకలితో కొడుకును, సర్వస్వాన్ని పోగొట్టుకున్న దుఃఖంతో ఏడుస్తున్నాడు. –

రాజారాం లోలోపల జరిగిన విధ్వంసాన్ని పూర్తిగా అర్థం చేసుకుని అతన్ని లేపి, గుండెకదుముకో గలిగిన ‘బాటసారులు’ నాలుగు బాటల్లో ఏ బాట నుంచి వస్తారో మరి?……..

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading