Apple PodcastsSpotifyGoogle Podcasts

Hydropower Projects – Ecological Destruction (Conversations with Environmentalists from Across the country)

వనవాసి ధారావాహిక లో భాగంగా , ఇప్పుడు మీరు వినబోయే ఉపన్యాసం , హర్షణీయంలో ఇంతకు ముందు ప్రముఖ పర్యావరణవేత్త శ్రీ హిమాంశు థక్కర్ గారు ఆంగ్లంలో ఇదే విషయంపై చేసిన ప్రసంగం ఆధారంగా వ్రాయబడింది.   

ఈ ప్రసంగంలో ప్రస్తావించిన  అంశాలు   – మన దేశంలో హైడ్రో పవర్,, జల విద్యుత్ ఉత్పాదన ఎలా జరుగుతోంది?  జల విద్యుచ్ఛక్తి వల్ల ఎలాంటి తీవ్రమైన నష్టాలు , పర్యావరణానికి కలుగుతున్నాయి, ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు  జల విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు కట్టడం మానివేసి, వేరే రకమైన విద్యుత్ ఉత్పాదన వైపు మరలుతున్నాయి   అని మీకు తెలియచెప్పడం. 

హైడ్రో పవర్ అంటే నీటి ప్రవాహం నుండి విద్యుచ్ఛక్తి ని   వుత్పత్తి చెయ్యడం.  హైడ్రోపవర్ ప్రాజెక్టులు ఇందుకు నదీజలాలను ఉపయోగించుకుంటాయి. హైడ్రో పవర్ ఉత్పాదన పరంగా చూస్తే, ప్రపంచంలో భారత దేశం ఐదో  స్థానంలో వుంది. నిర్మించిన ప్రాజెక్టుల  సంఖ్యా పరంగా  చూస్తే భారత దేశం మూడవ స్థానంలో వుంది. దాదాపుగా  భారత దేశం 45700 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పాదన చేస్తోంది. ఇది చిన్న పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టులనుండి మనకు లభిస్తుంది.  చిన్నవి అంటే 25 మెగావాట్ల ఉత్పాదన కంటే తక్కువ గలవి. భారత దేశంలో హైడ్రో పవర్ ఉత్పాదన 19వ  దశాబ్దం చివరన . డార్జిలింగ్, మసూరి లో చిన్న స్థాయిలో ప్రారంభం అయ్యింది. మన  దేశంలో నాలు రకాల హైడ్రో పవర్ ప్రాజెక్టులున్నాయి. స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, రన్ ఆఫ్ ది రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్,పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ప్రాజెక్ట్, చివరిది మినీ, మైక్రో ,పికో హైడ్రో పవర్ ప్రాజెక్టు, ఈ వర్గీకరణ  ఉత్పాదన సామర్ధ్యం ఆధారంగా చేసింది. 

స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు లో  నీటి నిల్వకు పెద్ద స్థాయిలో రిజర్వాయర్లు, డ్యాంల నిర్మాణం చేపట్టాలి.

నదీ జలాలను వీటిల్లో నిల్వ ఉంచాలి. అదీ అనేక మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ ఉంచాలి. ఈ నీటిని టర్బైన్ పై ప్రవహింపచేయడం ద్వారా, టర్బైన్ తిరిగినప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది. 

రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టులో , నదీజలాలను మళ్లించి ఒక  పొడవాటి టన్నెల్ ద్వారా ప్రవహింపచేస్తారు. టన్నెలు మొదటి భాగానికి , చివరి భాగానికి బాగా ఎత్తులో తేడా ఉంటుంది. టన్నెల్ చివరిభాగంలో కిందివైపుకు టర్బైన్ ఉంటుంది. టర్బైన్ పై నీరు పడినప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది. పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు , మైక్రో, పైకో ప్రాజెక్టుల సంఖ్య మనదేశంలో తక్కువ. వాటి గురించి తర్వాత  తెలుసుకుందాం. 

హైడ్రో పవర్ ప్రాజెక్టుల వల్ల దుష్పరిణామాలు చర్చించే ముందు,  మన దేశంలో జల విద్యుచ్ఛక్తి ప్రాజెక్టు నిర్మాణాల పరిణామ క్రమం మనం తెలుసుకోవాల్సిన అవసరం వుంది. – 

మొట్టమొదట మన దేశంలో నిర్మించిన పెద్ద పవర్  ప్రాజెక్టు –  స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ 

భాక్రానంగల్ . దాని కంటే ముందు హీరాకుడ్ చేపట్టారు. అలానే  కావేరి పైన కృష్ణా సాగర్ డాం. 

ఆ డ్యామ్ల ఎత్తు ఎక్కువ ,వాటిలో నీరు ఆ ఎత్తు నుండి నుండి ప్రవహిస్తునప్పుడు దాని శక్తి ఎక్కువ. 

ప్రవాహ నీరు తాకే చోట టర్బైన్ వుండి ,  అది తిరిగి, మ్యాగ్నటిక్ ఫీల్డ్ వల్ల విద్యుచ్ఛక్తి ఉత్పాదన జరుగుతుంది. శ్రీశైలం, ఇప్పుడు కట్టబోయే పోలవరం, భాక్రానంగల్ లాంటి అనేక ప్రాజెక్టులు, ఈ రకంగా  జల విద్యుచ్ఛక్తి ని ఉత్పాదన చేస్తాయి. ఇవి భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు. 

మన  దేశంలో ఈ హైడ్రో ప్రాజెక్ట్ లకు పెద్ద లాబీ లున్నాయి. వాళ్ళు వీటిని  చాల అందంగా గొప్పగా వర్ణిస్తారు. ఈ ప్రాజెక్టుల ద్వారా, జల విద్యుచ్ఛక్తి  ఉత్పత్తి,  అనేది పర్యావరణం మీద ఏ రకమైన దుష్పలితాలను చూపించదనీ, తక్కువ ధరకే లభిస్తుందనీ , సోలార్ ఎనర్జీ లాగానే  క్లీన్ ఎనర్జీ , రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పి.   

పైన వారు చెప్పే ఏ విషయానికీ శాస్త్రీయమైన నిబద్ధత లేదు. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. 

పెద్ద స్టోరేజ్ ప్రాజెక్ట్ వల్ల ముంపు ఏర్పడుతుంది. అది తీవ్ర స్థాయిలో వుంటుంది, వేల ఎకరాల్లో, వందల కొద్ది చదరపు కిలోమీటర్లు ముంపుకు గురవుతుంది. అది కేవలం అటవీ ప్రాంతమే కాక జనావాసాల ప్రాంతం కూడా, పెద్ద మొత్తంలో ప్రజలు నిర్వాసితులవుతారు.భారతదేశం పునారావాస అంశంలో చెప్పుకోదగ్గ నిర్వహణ చేయలేదు. డ్యామ్ల వల్ల నిర్వాసితులైన ప్రజలకి పునారావాసం కల్పించాలి, ఈ అంశాన్ని ప్రపంచ బ్యాంక్ కూడా ప్రస్తావిస్తుంది.డ్యాములు , హైడ్రో పవర్ ప్రాజెక్టు అభివృద్ధికి నమునాలైతే, నిర్వాసితులైన ప్రజలు డ్యామ్ల వల్ల సంతోషంగా జీవించాలి తప్ప దుర్భరంగా కాదు. వాళ్ళ జీవన ప్రమాణం ఎదగాలి. ఈ అంశంలో భారత దేశంలో ఒక్క డ్యాంలో కూడా దీనిని సాధించ లేదు. గత ఆంధ్ర ప్రదేశ్ విషయమే తీసుకుంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాం నిర్వాసితులకు పునరావాసం నేటికి కల్పించ లేదు. దేశంలోని తొలి డ్యాం అయిన హీరాకుడ్ నిర్వాసితులను నేటికి ఆ రాష్ట్రం పునరావాసం కల్పించ లేదు. హిమాచల్ ప్రదేశ్ లోని భాక్రా డ్యాం….  నెహ్రూ గారు  ప్రస్తావించిన,  ఈ అభివృద్ధి దేవాలయం నిర్వాసితులు నేటికీ పునరావాసితులు అవ్వలేదు.ఇక వివాదాస్పదమైన నర్మదా,  ఇతర ఈశ్యాన ప్రాంత డ్యామ్ల విషయం చెప్పనవసరం లేదు.భారత దేశం డ్యామ్ల వల్ల నిర్వాసితులైన ప్రజల్ని సరైన పునారావాసం పొందకపోవడం, వారి జీవన ప్రమాణం పెరగక పోవడం వల్ల డ్యాంల విషయంలో వ్యతిరేకత ఏర్పడింది. ఇవి గాక  పర్యావరణ విధ్వసం, వాతావరణ మార్పు లాంటి (climate change ) తీవ్ర దుష్ఫలితాలు. 

గత కొన్ని దశాబ్దాలుగా భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం  ఇలాంటి అనేక  కారణాల వల్లే, ప్రపంచ వ్యాప్తంగా  ఆగిపోయాయి .ఇలా ఎక్కడో కొన్ని చోట్ల తప్ప పెద్ద డాంల నిర్మాణాలు దేశవ్యాప్తంగా మందగించింది. 

ఈ వ్యతిరేకత ఇంకా ఇంకా పెరుగుతూ పోవడం వల్ల,  అభివృద్ధి చోదకులపైన , డాం లాబీల పైన ఒత్తిడి పెరిగింది. దీనితో వాళ్ళు రన్ ఆఫ్ ది  రివర్ ద్వారా నిర్మించే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టారు. వాట్ని పర్యావరణ సానుకూలంగా ప్రస్తావించారు.  ఇప్పుడు వీటి వల్ల ఇబ్బందులు  ఏవిటో చూద్దాం. 

ఇప్పుడు మన దేశంలో అనేక కొండ ప్రాంతాల్లో, వెస్టర్న్ ఘాట్స్, ఈశాన్య రాష్ట్రాలలో చాలా చోట్ల ఈ రన్ ఆప్ ది రివర్ ప్రాజెక్టు నిర్మాణాలు కొన్ని  వందల సంఖ్యలో జరుగుతున్నాయి.  వీటికి కూడా రిజర్వాయర్లు అవసరం కాని,  వీటి స్టోరేజ్ సామర్ధ్యం తక్కువ. వీటి నీటి నిల్వ సామర్థ్యం కొన్ని మిలియన్ల వరకే, పెద్ద స్టోరేజ్ డ్యాంల అంత కాదు. మరి అది పవర్ని ఎలా ఉత్పత్తి చేస్తుంది? 

రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టులో  – నది జలాలను దారి మళ్లించి, మొదటిగా డీసిల్టింగ్  చ్యాంబర్ ద్వారా ప్రవహింప చేస్తారు. తర్వాత నీళ్లు  ఒక టన్నెల్ ద్వారా వెళతాయి.ఇవి భూగర్భ టనల్ లు , పొడవైనవి, సుమారు 60 కిలోమీటర్లవి.ఆ టనల్ చివరిలో టర్బైన్ వుంటుంది.,డ్యాం నుండి నీళ్ళు హేడ్రెజ్ టన్నెల్ లోకి ప్రవేశిస్తాయి, ఈ టన్నెల్స్  కొన్ని వందల మీటర్లు వుంటుంది నుంచి కొన్ని కిలోమీటర్లు ఉండొచ్చు. 

టన్నెల్ లో నీటి ఎంట్రీ పాయింట్ ఎత్తు ఎక్కువ ఉండి , ఎగ్జిట్ పాయింట్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల , పవర్ ఉత్పత్తి అవుతుంది. 

ఈ టన్నెల్ మార్గంలో పెద్ద మొత్తం లో నీరు వుంటుంది. మొత్తం నది ఈ దిశగా దారి మళ్ళుతుంది. 

జనాబ్, బియాస్, రాబి, సట్లెజ్  ఇట్లాంటి పెద్ద నదులు ఈ టన్నెల్ ద్వారా వీటి  మార్గం మారిపోతుంది ఈ టర్బైన్ల వల్ల.  పవర్ ఉత్పత్తి అయిన తర్వాత , ఇంకో  టనల్ ద్వారా నది దిగువ ప్రాంతంలోకి చేరుతుంది. 

రన్ ఆఫ్ ది రివర్ డ్యాం లోకి నది నీళ్ళు చేరే ప్రాంతం, తిరిగి ఆ నీరు దిగువ ప్రాంతంలోని నది లోకి చేరే ప్రాంతం మధ్యలో దూరం  అది రెండు నుండి ముప్పై, నలభై కిలోమీటర్ల వరకు ఉండచ్చు.

ప్రాజెక్టు  సామర్ధ్యం , ఎత్తు పల్లాల తేడాల వల్ల టనల్ పొడవు మారుతుంది.  నది దారి మళ్లించిన ప్రాంతం అంతా నీళ్లు లేక నది ఎండిపోతుంది. 

నది కి ఆ ప్రాంతంలో ఉప నదులు లేకపోతే పూర్తిగా ఎండగట్టిపోతుంది. నది ఉపరితల ప్రాంతానికి, దిగువ ప్రాంతానికి జల అనుసంధానం వుండదు. జీవ వైవిధ్యం కనుమరుగవుతుంది, నది అన్ని విధాలా వినాశానికి గురవుతుంది. 

భూమి పైన గొప్ప జీవ వైవిధ్యం వున్న వనరు నది. ఈ వినాశనం వల్ల జీవనోపాధులు  అన్నీ కనుమరుగవుతాయి.

 టనల్ నిర్మాణం గురించి చూస్తే , ఈ టన్నెళ్లు  సుమారు పది మీటర్ల డయామీటర్ల వైశాల్యం వుంటుంది, అంటే ఒక దాని పైన మూడు రైళ్ళు, పక్కనే  ఇంకో మూడు రైళ్ళు వెళ్ళేంత వైశాల్యం.సాధారణంగా ఈ టనళ్ళను కొండ ప్రాంతంలో నిర్మిస్తారు, పల్లపు ప్రాంతాలు అనువైనవి కావు. 

ఈ కారణంగా రన్ ఆఫ్ ది రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కొండ ప్రాంతంలో నిర్మిస్తారు.వీట్ని హిమాలయ, పశ్చిమ కనుమల ప్రాంతంలో నిర్మిస్తారు. 

ఇదిగాక వీటికి జరిపే బ్లాస్టింగ్ ని ఊహించుకుంటే దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దాని ప్రభావం స్థానిక నదీ ప్రవాహ తీరు, జీవ వైవిధ్యం , స్థానిక ఆవాసాల పైన తీవ్ర ప్రభావం పడుతుంది.మున్ముందు ఆ ప్రాంతం విపత్తు ప్రభావ ప్రాంతంగా మారుతుంది.

స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తీరుకి,రన్ ఆఫ్ ది రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లకు ప్రభావంలో తేడాలుంటాయి. అలాగే నది ఎండిపోవడం, జీవవైవిధ్యం వంటి అంశాల్లోనూ కనిపిస్తాయి.

ఇదిగాక  టన్నుల  కొద్దీ పూడిక, రాళ్ళు బ్లాస్టింగ్ చేసే క్రమంలో నిర్మాణం జరిగే క్రమంలో పోగవ్వడం జరుగుతుంది. 

ఇదంతా  సురక్షితంగా డిస్పోజ్ చెయ్యాలంటే  పెద్ద స్థాయిలో భూసేకరణ చెయ్యడం  అవసరం. 

డిస్పోజ్ చేసిన తర్వాత  సురక్షితంగా స్థిరీకరించాలి. ఈ స్థలం నిర్మాణ స్థలానికి చేరువలో కూడా  వుండాలి, లేకపోతే, రవాణా ఖర్చులు పెరిగి పోతాయి.

నిర్మించే ప్రదేశాలన్నీ కొండ ప్రాంతాలు దీనికి అనువైన స్థలం దగ్గర్లో  దొరకదు. ఖర్చులు తగ్గించుకోడానికి ప్రాజెక్టు నిర్మించే కంపెనీ లు ఇదంతా నది దిగువ ప్రాంతంలో వెయ్యడం జరుగుతుంది.  

దీనికి తోడు నదీ ప్రవాహాన్ని మళ్ళిస్తునప్పుడు టన్నెల్ తో పాటు డీ సిల్టింగ్  చ్యాంబర్ అవసరం,ఎందుకంటే ఇటు వంటి డ్యామ్ నుండి టనల్ లోకి వెళ్ళే ప్రవాహంలో చాలా వ్యర్థ పదార్థాలు ఉంటాయి. దీని వల్ల టర్బైన్ పాడువకాకుండా వుండడానికి డిసిల్డింగ్ చ్యాంబర్ అవసరం. ఇక్కడ ఏర్పడే పూడిక ఇది కూడా  నదీ గర్భంలోకి చేరుతుంది,వర్షాకాలంలో అది నది దిగువ ప్రాంతంలోకి చేరుతుంది. 

ఇటు వంటివి చాల అంశాలుంటాయి.ఇక టనల్నుండి ప్రవహించి తిరిగి నదిలో కలిసే నీరు, దీనిని భూగర్భ శాస్త్రం ప్రకారం ‘ఆకలిగొన్న నీరు’ (హంగ్రీ వాటర్ )  అంటారు.ఆ నీరు మళ్ళీ నదిలో కలిసినప్పుడు దానికి కోత గురిచేసే శక్తి ఎక్కువగా వుంటుంది. ఆ నదిలో జీవవైవిధ్యం కూడా తక్కువ గలిగి వుంటుంది. 

ఈ హైడ్రో ప్రాజెక్ట్స్ వల్ల ముంపు, నిర్వాసితం, అటవీ ప్రాంత క్షీణత లాంటివి  తక్కువైనప్పటికీ ఇలాంటి  ఇతరత్రా ప్రభావాలున్నాయి. ఎవరైనా ఈ ప్రాజెక్ట్ లు పర్యావరణ సహేతుకంగా వున్నాయి అంటే దానిని ప్రశించాల్సిన అవసరం వుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. 

ఇలాంటి ప్రాజెక్టులు సమర్థించే వాళ్ళు చాటి చెప్పుకునే మరో అంశం హైడ్రో పవర్, గ్రీన్ హవుస్ గ్యాసుల్ని ఉత్పత్తి చెయ్యదు అని.  

వాహనాల వల్ల   కానీ, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ద్వారా కానీ, గ్రీన్ హౌస్ గ్యాస్ లైన కార్బన్ డయాక్సైడ్ , మీథేన్ లు వాతావరణం లోకి రిలీజ్ కావడం,  తద్వారా వాతావరణం వేడెక్కడం అనేది, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మానవాళిని పీడిస్తున్న ఒక పెద్ద సమస్య. 

మామూలుగా చూస్తే , కార్బన్ డై ఆక్సైడ్,మితేన్, గ్యాస్లు అన్నీ బొగ్గు,శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల ఉత్పత్తి అవుతాయి అని. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లలో శిలాజ ఇంధనాల  ( ఫాసిల్ ఫ్యూయల్స్ ) ఉపయోగం లేనందు వల్ల గ్రీన్ హవుస్ గ్యాసేస్ ఏర్పడవు అన్నది వీరి  వాదన, ఇది కూడా వాస్తవం కాదు. 

డ్యాంలు  ,రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టు నిర్మించే రిజర్వాయర్లు, ఇవన్నీ మితేన్ గ్యాస్ కు మూలాలు. మితేన్, కార్బన్ డై ఆక్సైడ్ ఇతర గ్లోబల్ వార్మింగ్ వాయువుల కంటే ప్రమాద మైనది. దీని ప్రతి అణువు గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ కనే, 24 శాతం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. 

రిజర్వాయర్ లలో మితేన్ గ్యాస్ ఉత్పత్తి అవడానికి కారణం, నీటి అడుగున  ముంపుకు గురైన నేల .  రెసర్వాయర్ నిర్మాణం ద్వారా అడవులు, చెట్లు, మొక్కలు  ముంపుకు గురైనప్పుడు. నేలలో  వుండే  సేంద్రియ పదార్ధాలన్నీ  రెసర్వాయిర్ నీళ్ల క్రింద  నిల్వ ఉండిపోతాయి.  అక్కడి పరిస్థితి  బయోగ్యాస్ ప్లాంట్ లోని పరిస్థితి ని తలపిస్తుంది.  ఆ నిలవపదార్థాలు గాలికి చొరబాటు లేని ప్రదేశంలో నిలవ  ఉండిపోతాయి.  ఎనరోబిక్ స్టేట్ లో . 

ఈ నీటి  గర్భంలో నిల్వ వున్న సేంద్రియ పద్ధార్ధాలన్నీ కుళ్ళిపోవడం వల్ల మితేన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీనికి తోడూ ప్రతి ఏడాది నదీ పరివాహక ప్రాంతం నుండి  నది మరి కొంత ఈ పదార్ధాలని చేరుస్తుంది, దీని వల్ల చాలా పెద్ద మోతాదులో మితేన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. 

పవర్ ఉత్పత్తి కోసం టర్బైన్ లోకి లోపలి భాగంలోని నీటిని తోడుతారు, అందులో మితేన్ సాంద్రత ఎక్కువ వుంటుంది, దీన్ని తిరిగి మళ్ళీ నదిలోకి కలిపేటప్పుడు అది గాల్లో కలుస్తుంది. ఇది ఎలా అంటే మనం ఒక కోకా కోలా బాటిల్ మూత తీసేప్పుడు వచ్చే గ్యాస్ లాగా.

ఇది కాక అడవులు ఏవైతే వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రతను తగ్గిస్తాయి , డాం నిర్మాణం ద్వారా , అవి ముంపుకు గురైనప్పుడు, అడవుల వల్ల పర్యావరణం ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలను మనం కోల్పోతాము. 

ఇదంతా కూడా గ్లోబల్ వార్మింగ్ , వాతావరణం  వేడెక్కడానికి  దారి తీస్తుంది. 

నదీ గర్భంలో ఉత్పత్తి అయ్యే మితేన్ గ్యాస్ చర్య జీవిత కాలం కొనసాగుతుంది, అది కొంతకాలానికి పరిణామం తగ్గచ్చు కానీ అది మటుకు డాం ఉన్నన్నాళ్లూ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. 

థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అంటే, బొగ్గు ఇతర ఇంధనాలతో విద్యుత్ ప్రాజెక్టులు  , హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లు వీటివల్ల వాతావరణం  ప్రభావం ఎంత వుంటుంది అని రెండింటినీ పోలుస్తూ,  బ్రెజిల్ శాస్త్రజ్ఞులు ఒక  అంచనా వేశారు , 

ఆ  అంచనాల ప్రకారం రెండింటి  వల్ల వాతావరణంలో వచ్చే దుష్ప్రభావాల్లో  పెద్ద తేడా లేదు అని నిర్ధారణ అయ్యింది. 

బంపర్ టు బంపర్ అన్నట్టుగా  రన్ ఆప్ ది రివర్   డ్యాం ల నిర్మాణం హిమాలయ ప్రాంతాల్లో  జరిగింది. 

అలకనందా, సట్లజ్,రావీ ,చీనాబ్ , తీస్తా  లాంటి నదులపై , ఈ నిర్మాణాలు జరిగాయి.  కొన్ని నిర్మాణంలో ఉన్నాయి , కొన్ని ప్రణాళికల్లో వున్నాయి. మున్ముందు ఇంకా ఎక్కువగా  ఇటువంటివాటిని ఏర్పర్చాలన్న ఉద్దేశ్యం వుంది.ఇది కేవలం నదులకు మాత్రమే పరిమితం కాలేదు,ఉపనదులకు కూ డా వర్తిస్తోంది. పశ్చిమ కనుమల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 

చట్ట ప్రకారం , మన దేశంలో 25 లేదా అంత కంటే ఎక్కువ  మెగావాట్ల ప్రాజెక్ట్ లకు  పర్యావరణ ప్రభావ నిర్ధారణ అవసరం. పర్యావరణ ప్రభావ నిర్ధారణ (ఎకలాజికల్ ఇంపాక్ట్ స్టడీ ) అంటే ప్రాజెక్ట్ ల వల్ల ఏర్పడే పర్వావరణ విధ్వంసాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం. దాన్ని బట్టి , ప్రాజెక్టుల వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని లాభ నష్టాల బేరీజు వేసి తద్వారా ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతినివ్వటమో , నిరాకరించడమో  జరగాలి. 

ఈ ప్రాజెక్టు రిపోర్ట్ తీసుకుని స్టడీ చేసినా , ఇది శాస్త్రీయ పరంగా జరుగుతోంది అనే దాఖలాలు ఎక్కడా మనకు కనపడవు. 

ఉదాహరణకి, హిమాలయ ప్రాంతంలో ఈ డాం నిర్మాణాలు జరిగే ప్రాంతాలు  భూకంపం తరచుగా రావడానికి అవకాశం వున్న  ప్రాంతాలు.  

ఇటు వంటి ప్రాంతాల్లో డ్యాం ల నిర్మాణం కోసం లోతైన పునాదులు కట్టడం, బ్లాస్టింగ్ చేయడం , నిర్మాణ వనరుల కోసం మైనింగ్,అటవీ ప్రాంతాన్ని ముంపుకు గురిచేయడం,టనల్ నిర్మాణం, ఈ కృత్యాలన్నీ కొండ ప్రాంతంలో విపత్తును ప్రేరేపిస్తాయి. 

ఈ  కట్టడాల వల్ల  అనుకోని  వరదలు,నేల కోత,కొండ చరియలు విరిగి పడడం లాంటివి సర్వసాధారణంగా మారుతున్నాయి. 

ఈ మధ్య మన హిమాలయ ప్రాంతాల్లో వచ్చిన అనేక విపత్తులకు మూల కారణాలు ఇవే అనీ శాస్త్రవేత్తలు పర్యావరణ వేత్తలూ ఘోషించారు. 

ప్రాజెక్టుల వల్ల లబ్ది పొందే పార్టీలు నాయకులూ ఈ విషయాలు పట్టించుకునే అవకాశం లేదు. 

ఎప్పుడో ప్రమాదం జరిగినప్పుడు తప్ప,  మన పత్రికలు టీవీ ఛానళ్ళు  ఈ విషయాలను పట్టించుకునే అవకాశం లేదు. ఈ అంశాలని ఎవ్వరూ  పరిగణలోకి తీసుకోవడం  గుర్తించడం కానీ చేయరు.

ఇంకో లాభం హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుకూలంగా వుండే వారు ప్రస్తావించేది –  పీకింగ్ పవర్ డిమాండ్. . 

విద్యుత్ అవసరం ఒకేలా  వుండదు, ఉదాహరణకు ఉదయం, సాయంత్రం ఎక్కువగా ఉండచ్చు విధ్యుత్ ను నిల్వ ఉంచుకోలేము, కాబట్టి అవసరమైనప్పుడు ఉత్పత్తి చేయడం లేనప్పుడు ఆపడం , అనేది అవసరం. థర్మల్ పవర్, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులలో ఈ అవకాశం ఉండదు. ఇది జల విద్యుత్ వుత్పాదనలో సాధ్యం అవుతుంది.  ఇక్కడ ఉత్పాదన కొన్ని నిమిషాల్లో చేయచ్చు అలానే ఆపేయవ చ్చు. డిమాండ్ కు అనుగుణంగా ఉత్పాదన చేయొచ్చు. పికింగ్ అవసరాల్ని బట్టి ఉత్పాదన చేయొ చ్చు. దీన్ని వాస్తవికంగా గమనిస్తే డిమాండ్కు అనుగుణంగా,ఇలా ఉత్పాదన చేస్తూ పోతే   చాల ఎక్కువగా వుంటుంది. 

ఇది కాకుండా వుండాలంటే, పీకింగ్ పవర్  డిమాండ్ను నియంత్రించాలి, కాని మన దేశంలో అది జరగడం లేదు. అందుకు మనం ముందుగా మనకున్న 50,000 మెగావాట్ల ఉత్పాదనలో  పీకింగ్ పవర్ ఎంత అనేది  అంచనా వేసి పరిగణలోకి తీసుకోవాలి. ఇదేకాక మన దేశంలో పీకింగ్  పవర్ కు ఎంత ఉత్పాదన జలవిద్యుత్ రంగం నుండి వస్తోంది అన్న ప్రశ్నకు జవాబు లేదు. కారణం దీనికంటూ ప్రత్యేక మైన సంస్థ అంటూ ఏదీ లేదు.మనం జల విద్యుత్ ఉత్పాదన గురించి పర్యవేక్షించడం కానీ ,  మెరుగు పర్చుకునే చర్యలు కానీ  ఏదీ శాస్త్రీయ పద్ధతుల్లో  చేయడం  లేదు. 

ఇవన్నీ ఏమి చేయకుండా, పీకింగ్ పవర్  అవసరార్థం జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలి అనేది  సరైన దృక్పధం కాదు.  

ఇక పికింగ్ పవర్ కు ఉత్పాదన వల్ల ఇతరత్రా ప్రభావాలున్నాయి. విద్యుత్ ఉత్పాదన కేవలం రోజులో కొంతమటుకే అవసరార్థం  ఉత్పాదన చేస్తే , మిగితా సమయాల్లో  నీళ్ల వాడకం ప్రాజెక్టులో లేదు కాబట్టి,  నది దిగువ ప్రాంతంలో ఆ సమయంలో ఎక్కువ నీరు విడుదల అవుతుంది, అప్పుడు ఆ ప్రాంతం ప్రమాద కరంగా మారుతుంది, చాలా సార్లు దీనివల్ల అకస్మాత్తు గా నదిలోకి నీరు విడుదలై ప్రాణ నష్టము సంభవించిన ఘటనలు అనేకం వున్నాయి. 

పీకింగ్  పవర్ కోసం పెద్ద రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టకుండా చేసేది పంప్ స్టోరేజ్ విధ్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్. ఇది మూడో రకమైన ప్రాజెక్ట్. దీనికి రెండు డ్యాం లుంటాయి ,ఒకటి ఎగువన, రెండవది దిగువన. పికింగ్ పవర్ కోసం ఉత్పాదనప్పుడు ఎగువ డ్యాం ఖాళీగా వుంటుంది, దిగువది నిండుగా. పీకింగ్ పవర్ అవసరం లేనప్పుడు , దిగువ డ్యాం లోని నీరుని టర్బైన్స్ ద్వారా తిరిగి , ఎగువకి  తోడుతారు, అంటే ఇతర టర్బైన్స్ రివర్స్ పంపింగ్ చేస్తాయి.వాస్తవంగా ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు,  విద్యుత్ ఉత్పాదన చేయవు, అవి వినియోగిస్తాయి. ఎందుకంటే, ఉత్పాదన చేసిన దాని కంటే మళ్ళీ నీళ్లను ఎగువకు తోడినప్పుడు ఎక్కువ శక్తి వినియోగం అవుతుంది.  ఇక్కడ ఖర్చు కూడా అధికమే. నేడు ఇటువంటి నిర్మాణాలు అధిక సంఖ్యలో వున్నాయి, ఇటువంటి ప్రాజెక్టులు కట్టడానికి  కొత్త నిర్మాణాలు అవసరం లేదు. ఇప్పుడు వున్న ప్రాజెక్టులనే ఈ రకంగా వినియోగించవచ్చు.  అమెరికాలో ఇటువంటివి చేపడుతున్నారు. 

ఇంతకు ముందు చెప్పినట్టుగా, ప్రపంచ వ్యాప్తంగా  హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం  , ఆపేయడం జరుగుతోంది, ముఖ్యంగా నార్త్ అమెరికా , యూరోపియన్ దేశాలలో. పని చేస్తున్న డాం లను కూడా డీ కమిషన్ చేసి ఆపివేయడం జరుగుతోంది. గత ఇరవై సంవత్సరాలలో ఈ దేశాల్లో వెయ్యికి పైగా డాం లు ఉపసంహరింప బడ్డాయి.  

ఇదంతా తెలిసి కూడా మనదేశంలో ఇటువంటి ప్రాజెక్టు  నిర్మాణాలు, కొత్త ప్రాజెక్టుల కోసం ప్రణాళికలు వేయడం , ఆపడం లేదు. వున్న ప్రాజెక్టులు డీకమిషన్ చెయ్యడం అనేది కూడా జరగలేదు. 

ఈ పరిస్థితిని ఎలా మెరుగు పరచాలి అని ఆలోచిస్తే –  

మొట్టమొదటి ఇలాంటి భారీ  ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు  నిజాయితితో కూడిన నిబద్ధత అవసరం. హైడ్రో పవర్ ప్రజేక్ట్ నిర్మాణం ఖర్చులే కాక , పర్యావరణానికి జరిగే నష్టాన్ని కూడా ఖర్చు కింద, జమ కట్టాలి. లాభనష్టాల బేరీజు వేసి అప్పుడు మటుకే  ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతులివ్వాలి. 

 ఒక అంచనా ప్రకారం సరిగ్గా,  పర్యావరణానికి జరిగే నష్టాన్ని కూడా, పరిగణనలోకి తీసుకుంటే,    సస్తుతం వున్న, ఇప్పుడు తల పెట్టిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ల ఉత్పాదన ఒక యూనిట్ ఖర్చు ఏడు రూపాయలు అని అంచనా వేయడం జరిగింది. అది ఇంకా  ఎక్కువగా ఉండచ్చు. అంటే సోలార్, విండ్ కంటే ఎక్కువ. ఉదాహరణకి సౌర విద్యుచ్ఛక్తి సోలార్ ఎనర్జీ ఒక యూనిట్ ఖరీదు మూడు రూపాయలు. 

సౌర విద్యుత్ లో మూడు రూపాయలకే యూనిట్ విద్యుత్ ఉత్పాదన జరుగుతుంటే జల విద్యుత్ ఉత్పాదన పై మోజు ఎందుకో అర్ధం కావడం లేదు. 

జలవిద్యుత్ అవసరం ఉంటే, నదీ ప్రవాహం లో ఒక తేలే ప్లాట్ ఫారం తోటి , చిన్న సైజు  విద్యుత్ ఉత్పాదన చేసే టర్బైన్  ఏర్పరచవచ్చు ఆయా గ్రామాలకు అవసరమైనట్టుగా, అక్కడికక్కడే. దీని వల్ల కొద్ది పాటి ప్రభావం చేపలు, జీవవైవిధ్యం పైన వుంటుంది. నేడు మన నదుల్లో కాలుష్యం వల్ల , డాములవల్ల  ప్రకృతి సిద్ధమైన చేపలు అంతరించి పోయాయి ,దీనితోబాటు మత్స్య కారుల జీవనోపాధి కూడా. మచ్చుకు కూడా ఏ నదీ , డ్యాం విషయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్య కారులకు దేశం లో ఎక్కడా నష్ట  పరిహారం ఇవ్వడం జరగలేదు  అన్నది పచ్చి నిజం.దాన్ని అంచనాల పరిగణలోకి కూడా తీస్కోలేదు. ఇదిగాక దేశంలో వ్యసాయ భూముల ప్రాంతాలలోనికి అందే సాగునీరు డ్యాం ల నుండి, నదుల నుండి అందేది చాలా తక్కువ శాతం. ఎక్కువ శాతం పంటలు భూగర్భ జలాలు ఆధారంగా పండుతాయి మనదేశంలో .  

కనుక భూగర్భ జలాలతో వ్యవసాయం అన్నది ఆచరణీయం, దీనిని సమర్ధవంతంగా చేయాలంటే వర్షపు నీటి ని కూడబెట్టడం ద్వారా, వర్షపు నీటి, నదుల్లో నీటి   పారుదలను సక్రమమైన పద్ధతుల్లో రూపొందించి కావాల్సిన ఫలితాలను రాబట్టవచ్చు.  అటువంటప్పుడు డాముల మీద ఆధారపడటాన్ని బాగా తగ్గించవచ్చు. దేశంలో చోద్యమైన విషయం ఏమిటంటే 25మెగావాట్ల ఉత్పాదన గల ఏ ప్రాజెక్ట్ కు కైనా పర్యావరణ నిర్ధారణ అవసరం లేదు అనే నిబంధన వుంది. వాటిని  పర్యవారణ సహేతుకంగా ఊహించుకుంటాం. అది శుద్ధ తప్పు, ఒక మెగా వాట్ ప్రాజెక్ట్ వల్ల కూడా సమస్య అనేది అది ఎటువంటి ప్రాంతంలో మనం కడ్తున్నాము అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. మనం పర్యావరణానికి విలువనివ్వం.అది నది, జీవవైవిధ్యం, అడవి కావచ్చు. నేడు ఈ ప్రభావం అంతా వాతా వరణ మార్పుల (క్లైమేట్ చేంజ్ )  రూపంలో మన ముందుకు వస్తోంది. ఆ విషయాన్ని మనం మన దేశంలో  పట్టించుకోలేదు. ప్రతీదాన్నీ జి.డి.పి. పెరుగుదలతో తూచడం మనకు అలవాటు అయిపొయింది. పర్యావరణం గురించి పట్టించుకోము.మనం కూ డా అమెరికా, యూరోప్ లా ఎదిగిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాం. ఆ సమయం మనకు రానే  రాదు. 

విపత్తు మన కళ్ళ ముందు వుంది. ఈ మధ్య కేరళ , తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలలో ,  హిమాలయ ప్రాంతాల్లో జరుగుతున్న అల్లకల్లోలం గమనిస్తే మనకు అది అర్థం అవుతోంది. 

రాను రాను మిగతా  ప్రాంతాలు ప్రభావితమయ్యే రోజు ఎంతో దూరం లో లేదు.మనం మేలుకోకపోతే, .వాతా వరణ మార్పులు మన పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి,ఇది ఏ ఒక్కర్నీ వదలదు.

హర్షణీయం లోనే ఇదే విషయంపై పర్యావరణ ప్రముఖులు చేసిన ప్రసంగాలలో, హిమాచల్ ప్రదేశ్లో , సిక్కింలో , మణిపూర్లో , పడమటి కనుమల్లో నిర్మించిన నిర్మిస్తున్న, అనేక హైడ్రో పవర్   ప్రాజెక్టు లు వాటివల్ల అక్కడి, పర్యావరణానికి, ప్రజలకూ సంభవిస్తున్న తీవ్రమైన నష్టాలనూ మీరు తెలుసుకోవచ్చు.  

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading